ప్రియమైన శాఫో-2

ప్రియమైన శాఫో,

నిన్న సాయంకాలం షాద్ నగర్ లో ఒక పిల్లల గ్రంథాలయానికి వెళ్ళి వచ్చేటప్పటికి అర్థరాత్రయింది. అందుకని నిన్న రాయాల్సిన ఉత్తరం ఇవాళ రాస్తున్నాను. ఆ  గ్రంథాలయం, దాన్నివాళ్ళు, Children Learning Centre  అని పిలుచుకుంటున్నారు. ‘అస్వ’ అని ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది దాన్ని. అక్కడ అయిదారేళ్ళ పిల్లలనుంచి టీనేజి పిల్లలదాకా, వాళ్ళంతా దిగువ మధ్యతరగతికీ, చాలామంది పేదకుటుంబాలకీ  చెందిన పిల్లలు. వారిలో చాలామందికి  మాతృభాష ఒక ఒడియా మాండలికం. కాని వాళ్ళ పిల్లలు రోజూ సాయంకాలం రెండు గంటల పాటు ఈ లైబ్రరీలో గడుపుతారు. టాల్ స్టాయి, ప్రేమ్  చంద్ లాంటి వాళ్ళు పిల్లలకోసం రాసిన పుస్తకాలు చదువుతూ చదువుతూ ఆ పిల్లలు ఇప్పుడు తెలుగు, ఇంగ్లిషు, హింది ధారాళంగా చదవగలిగే స్థాయికి చేరుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆ పిల్లలు తెలుగులో పాటలు కూడా రాసారు. ఆ పిల్లలు రాసిన పాటల పుస్తకం నిన్న ఆవిష్కరించారు. ఆ పుస్తకానికి నేను ముందుమాట రాసాను. నిన్న ఆ పిల్లలు తాము రాసిన పాటలకి తామే  ట్యూన్లు కట్టుకుని  డాన్సు  కూడా చేసారు.

నిన్న నీకు ఉత్తరం రాయలేదుగాని, అక్కడికి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ కూడా నీ గురించే ఆలోచిస్తున్నాను. నీలాగే వాళ్ళూ గీతరచయితలు. నీ పాటలు వినడం కోసం నేను శతాబ్దాల వెనక్కి తొంగిచూస్తున్నాను. వాళ్ళ పాటలు వినడమంటే, ఆగామి కాలంలోకి తొంగిచూడటం కదా.

నిజానికి ఈ ఉత్తరం మొదలుపెడుతూ ‘అందమైన శాఫో’ అని పిలుద్దామనుకున్నాను, సోక్రటీసు లాగా. నీలో ఆ అందం దేనిది- నీ రూపానిదా, నీ పాటలదా, నీ సంగీతానిదా, నీ మనసుదా అని కదా అనుకున్నాను మొన్నంతా. ఆ ఉత్తరం రాసి పోస్టు చేసినప్పణ్ణుంచీ నా ఆలోచనలు నువ్వు రాసిన మరో కవిత చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కవితలో నువ్వు ఇదే ప్రశ్న అడిగావు: ఈ ప్రపంచంలోకెల్లా చాలా అందమైంది ఏదని. Fragment 16 గా చెప్పుకునే ఆ కవితనిలా తెలుగుచేసాను చూడు:

ఈ కవిత మొదటిసారి చదివినప్పుడు నేను మొదటి స్టాంజా దగ్గరే ఆగిపోయాను. అసలు ఆ ఎత్తుగడ ఏమిటి! అలా చెప్పటాన్ని priamel అనే అర్థాలంకారం అంటారని తరువాత తెలిసింది. మూడు విశేషాల్ని తీసుకుని వాటిని కాదని వాటికన్నా భిన్నమైన మరో విశేషాన్ని పైకెత్తి చూపించడం. నాకు తెలిసిన సంస్కృతాలంకారాలు- అర్థాంతరన్యాసం, అపహ్నుతి, విశేషోక్తి- ఉహుఁ ఏ ఒక్కటీ ఈ అలంకారానికి సాటిరావడం లేదు.

సరే, అలంకారం సంగతి అలా ఉంచు, నువ్వు వేటిని పోలుస్తున్నావు! ఒక మహాప్రపంచం, చతురంగబలాల్తో కూడిన ఒక మహాసైనికసమూహం మొత్తం కూడా, మనిషి దేన్ని ప్రేమిస్తాడో దానిముందు నిలబడదని అంటున్నావు. ఆ మాట వినటానికే ఎంత గగుర్పొడిచేదిగా ఉంది!

రెండున్నర సహస్రాబ్దాల కిందట ఒక మనిషి ఇటువంటి మాట చెప్పగలిగిందంటేనే నమ్మశక్యం కాకుండా ఉంది. ఒక్క వాక్యంతో, ఒక్క lyrical utterance తో నువ్వొక epic world ని పక్కకు నెట్టేసావు. చిన్నారి సీత ఆడుకుంటూ, ఆడుకుంటూ జారిపోయిన బంతికోసం శివధనుస్సుని అవలీలగా పక్కకు నెట్టేసినట్టు నెట్టేసావు.

మూడు పోలికలు- ఆశ్వికదళం, కాల్బలం, నౌకాదళం- సరిగ్గా ఇప్పుడు కూడా ప్రపంచం వీటినే ఆరాధిస్తోంది. వీటిల్లో అశ్వాలబదులు విమానాలని అనుకుంటే, ప్రపంచదేశాలన్నీ వాటినే ఆరాధిస్తున్నాయి. కాని ఆ వైభవోపేత సౌందర్యం కన్నా, ఆ మారణాయుధసంపత్తిలోని సౌందర్యం కన్నా, ఒక మనిషి దేన్ని ప్రేమిస్తాడో అదే అత్యంత సుందరమంటున్నావు నువ్వు. అలా చెప్పడానికి ఉదాహరణగా నీకెవరు కనిపిస్తున్నారు?

హెలెన్!

ఏ హెలెన్ కోసం పదివేల నౌకలు దగ్ధమైపోయాయో, ఏ హెలెన్ కోసం రెండు దేశాలు ఒకదాన్నొకటి ఊచకోత కోసుకున్నాయో, ఆ హెలెన్! ప్రపంచమంతా ఎవరిని అసాధారణ సౌందర్య రాశిగా భావించి నీరాజనాలెత్తిందో, ఆ హెలెన్!

కాని నువ్వు చెప్తున్నది ఆ హెలెన్ సౌందర్యం గురించి కాదు. పారిస్ పట్ల ఏ ఇష్టం వల్ల తనంతతనుగా పడవ ఎక్కి పయనమయ్యిందో, అలా అడుగు ముందుకేస్తున్నప్పుడు, తన తల్లిదండ్రుల్నీ, తన బిడ్డనీ కూడా ఆ పక్కనపెట్టేసిందే, ఆ ఇష్టం, ఆ అనుతాపం, ఆమెని నిలవనివ్వని ఆ హృదయోద్వేగమే  అత్యంత సుందరమని చెప్తున్నావు. అలా, హెలెన్ ని తలుచుకున్నాక, అప్పుడు నువ్వు అనక్టోరియాని తలుచుకున్నావు. హెలెన్ ని నిలవనియ్యని ప్రేమలాంటిదే అనక్టోరియాని తలుచుకున్నప్పుడు నీలో కలుగుతున్నదని చెప్తున్నావు. అప్పుడు మళ్ళా మేమెక్కడ మర్చిపోతామో అని మొదట చెప్పిన పోలికల్లాంటివే మళ్ళా చెప్తున్నావు. లిడియాదేశపు రథాలకన్నా, ఆగణిత చమూసమూహాలకన్నా, అనక్టోరియా మృదుపదగతిలో, ఆమె వదనమ్మీద మిలమిల్లాడే సూరరశ్మిలో మరింత సౌందర్యం సాక్షాత్కరిస్తుందని చెప్తున్నావు.

అనక్టోరియా!

ఎవరామె? నీ మొత్తం కవిత్వంలో రెండు సార్లు మాత్రమే వినబడే పేరు. కాని హెలెన్ ని కూడా పక్కకు నెట్టేసిన ఆ పేరు! ఆమె ఎలా ఉండిఉంటుందో మాకు తెలియదు. కాని ఆమెని తలుచుకుంటే నీలో ఎలాంటి ఇష్టం పొంగిపొర్లుతుందో ఎంత స్పష్టంగా చెప్తున్నావు. అది ఆశ్వికదళాల్లో, కాల్బలంలో, నౌకాబలంలో ప్రపంచం చూసే అందాన్ని మించిన అందం, పారిస్ కోసం తన తల్లిదండ్రుల్నీ, బిడ్డనీ పక్కనపెట్టి మరీ హెలెన్ ని ముందడుగు వేయించిన ఇష్టం లాంటి ఇష్టం- అటువంటి అనక్టోరియాని చూడాలని ఎవరికి ఉండదు!

నేను ఈ కవిత ఎప్పుడు చదివినా మొదటి చరణం దగ్గరే ఆగిపోతుంటానని చెప్పాను కదా. కాని ఈ కవితలో నువ్వు ఒక హోమర్ నీ, ఒక ప్లేటో నీ కూడా దాటి మరీ ముందుకు వెళ్ళావని Page duBois రాసిన Sappho is Burning (1988) చదివాకనే  నాకు అర్థమయింది. తన  పుస్తకంలో ఒక అధ్యాయం మొత్తం ఈ ఒక్క కవితని అర్థం చేసుకోడానికే ఆమె కేటాయించింది.

నువ్వు ఈ కవిత ద్వారా మానవచరిత్రలో ఒక మహత్తర అధ్యాయాన్ని రాసేవని అంటోందామె. ముఖ్యంగా రెండు విషయాలు.

మొదటిది, నీకన్నా ముందు యుగాల్లో, ఆ పౌరాణిక, ఐతిహాసిక యుగాల్లో, స్త్రీలు కేవలం వస్తువులు, ఒకరికొకరు పంచుకునే బహుమతులు, విజేతలు పరస్పరం మార్చుకునే కానుకలు. అక్కడ స్త్రీలకి  సొంత ఇష్టాయిష్టాల్లేవు. అసలు తమకంటూ ఒక మనసుంటుందని వారికే  తెలియదు. హోమర్ చిత్రించిన హెలెన్ ఎవరు? ఒక object. ఒకప్పుడు దేవతల మధ్య ఎవరు అందమైనవారని పోటీ జరిగితే, వారిలో తననే ఎంపికచేస్తే పారిస్ కి ప్రపంచంలోనే అందమైన అమ్మాయిని కానుకగా ఇస్తానని ఆఫ్రొడైటు వాగ్దానం చేసిందట. అలా అతడు ఆమెని ఎంపిక చేశాడట. అందుగ్గాను, ఆఫ్రొడైటు, నిన్ను నీవాళ్ళనుంచి లాక్కుపోయి అతడికి బహుమానంగా అందించిందట! ఆ కథనే కదా హోమర్ ఇతిహాసంగా మలిచింది. కాని నువ్వేం చెప్తున్నావు ఈ కవితలో! హెలెన్ తనంతట తానే, ‘ట్రాయికి  నగరానికి తరలిపోయింది’ అని అంటున్నావు. హోమరీయ ప్రపంచంలో హెలెన్ ఒక వస్తువు. నీ ఈ కవితలో హెలెన్ ఒక మనిషి, ఒక మనస్సు, ఒక స్పందన, ఒక సాహసం, ప్రేమలోకంలోకి కంపిస్తున్న హృదయంతో వేస్తున్న ఒక ముందడుగు.

అంటే, గ్రీకు చరిత్రలో, ఆ మాటకొస్తే మానవచరిత్రలోనే, మొదటిసారిగా ఒక స్త్రీ ఇష్టాన్ని యింత  నిర్భయంగా, ఇంత నిస్సంకోచంగా నువ్వు ప్రకటించావు. అందుకనే నీ తదనంతర గ్రీకు సమాజం నిన్ను మర్చిపోడానికే శాయశక్తులా ప్రయత్నించిందంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు, ఇన్ని యుగాల తరువాత కూడా, ఒక అనువాదకుడు, ఈ కవితని అనువదిస్తూ  ఇక్కడ నువ్వు గ్రీకులో eratai అనే పదం వాడావనీ, దాన్ని అనువాదకులు whomever one loves అని అనువదించడం తప్పనీ, సరిగ్గా అనువదించాలంటే,  whomever one lusts అని అనాలనీ వాదించాడు.

నాకు అతడి వాదన వినగానే చలంగారి రాజేశ్వరి గుర్తొచ్చింది. తన కథ చెప్పడం మొదలుపెడుతూనే రాజేశ్వరి ‘లేచిపోయినానంటే ఎవరన్నా నన్ను, నాకెంతో కష్టంగా వుంటుంది’ అని అంటుంది. బహుశా ఈ అనువాదకుడి వాదన వింటే హెలెన్ కూడా తన మనసు కష్టపెట్టుకుంటుంది అనిపిస్తుంది. రాజేశ్వరి ఇంకా ఇలా అంటుంది: ‘ఆ జీవితమంతా సుందరమైన స్వప్నం వలె, ఆ ఎడారి పుణ్యభూమి వలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతి వలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం, ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. ..’ బహుశా రాజేశ్వరి నీ ఈ కవిత చదివి ఉంటే గొప్ప ఆత్మీయురాల్ని కనుగొన్నట్టుగా మురిసిపోయి ఉండేది .

నిజానికి ఆ క్షణం, మొత్తం రాజ్యం, ప్రభుత్వం, సంస్థలు, చట్టాలు, పత్రికలు, వ్యాపారవాణిజ్యాలూ, మనుషుల్ని ముందుకు లాగే ధనాశా, దురాశా లాంటివన్నీ అలవోకగా పక్కకు నెట్టి, మనిషి తన ఆత్మని ప్రకాశింపచేసే తన యిష్టాన్ని వెతుక్కుంటూ ముందడుగు వేసే ఆ క్షణంలో హృదయాన్ని తల్లకిందులు చేసే ఆ ప్రచండభావోద్వేగాన్ని ప్రేమ, మోహం, కామం అని విడదీసి చెప్పలేం. అది అత్యంత sublime moment. ఎంత భీకరమో, అంత సున్నితం. ఎంత వికలమో అంత సకలం.

ఇక ప్లేటోని దాటి ఎక్కడ ముందుకెళ్ళావో, అదంతా డు బోయిస్ మరింత వివరంగా రాసింది. ముఖ్యంగా నువ్వీ కవితలో  కొన్ని సాదృశ్యాలు లెక్కవేస్తూ, వాటన్నిటికన్నా, మనిషి దేన్ని ప్రేమిస్తాడో, అదే అత్యంత సుందరమైంది అని చెప్పడం, వట్టి కావ్యాలంకారం కాదు, ఒక తాత్త్విక ప్రతిపాదన అని అంటున్నదామె. అంటే కొన్ని concrete examples తీసుకుని వాటిని దాటి ఈ కవిత  ఒక abstract truth ని ప్రతిపాదిస్తోంది అని చెప్తోంది.  అందుకని దీన్నొక proto-philosophical argument ని చూడొచ్చు అంటుంది. ప్లేటో Symposium అంతా ఇదే కదా చర్చ.

ప్లేటో సంభాషణలన్నిటిలోనూ, కావ్యత్వం సంతరించుకున్న సంభాషణ అని సింపోజియాన్ని నేను ‘ప్రేమగోష్ఠి’ పేరిట తెలుగులోకి తీసుకొచ్చాను.  కానీ ఇప్పుడు డు బోయిస్  రాసింది చదువుతుంటే, ప్లేటో నీకన్నా యుగాలు వెనకబడ్డాడని అనిపిస్తోంది. ఉదాహరణకి, సోక్రటీసుకి డయోటిమా ఉపదేశించిన ప్రేమవిద్యలో ఈ మాటలు చూడు:

అంటే డయొటిమా చెప్పినట్టుగా  సోక్రటీసుతో ప్లేటో చెప్పిస్తున్నదేమిటంటే, అంతిమంగా, ఒక అమేయ, అమూర్త, నిరపేక్ష సౌందర్యాన్ని అందుకునే క్రమంలో, మనుషులు కేవలం నిచ్చెన మెట్లు మాత్రమేనని.  ఆ నిరాకార సౌందర్యాన్ని దర్శించడానికి సమస్తరూపాలూ సాధనాలు మాత్రమేనని. కాని ప్లేటో  ఆ సంభాషణ రాయడం కన్నా కనీసం మూడు శతాబ్దాల ముందు నువ్వు ఈ కవితలో ఏం చేస్తున్నావు? అన్నిటికన్నా అందమైంది ఏదని ప్రశ్నించి, whomever one loves అని ఒక సూత్రీకరణ చేసి ఆగిపోకుండా, చివరికి  ఒక స్త్రీమూర్తిని మాకు చూపిస్తున్నావు.. అంటే ఒక మనిషిని, రక్తమాంసాలున్న ఒక మనిషిని, ఒక మనసుని, ఆమె హంసగతి నడకని, తొలిసూర్యకాంతి ప్రసరించినప్పుడు ఆమె వదనమ్మీద తళతళ్ళాడే మిలమిల చూపిస్తున్నావు. ఇదే, ఈ పార్థివ, పాంచభౌతిక, సజీవమానవసాక్షాత్కారమే నిన్ను ప్లేటో  కన్నా ఎంతో ఎత్తున నిలబెడుతున్నది అంటున్నది డుబోయిస్.

ఈ క్షణాన నాకు మరో ఆలోచన కూడా కలుగుతోంది. ఇంతకీ ఈ కవిత ఎక్కడ దొరికిందో తెలుసునా! వందేళ్ళ కిందట, ఉత్తర ఈజిప్టులో, ఆక్సిరింకస్ పట్టణ శివార్లలో, యుగాలుగా పోగుపడ్డ చెత్తదిబ్బల్లో కప్పడిపోయిన పేపైరీలోంచి బయటపడ్డ కవిత ఇది. శతాబ్దాలుగా నలిగి ముడతలు పడి, కీటకాలు తినేసింది తినేయగా,  మిగిలిన ఆ కాగితపు తునకల్ని, జాగ్రత్తగా వెలుతురులోకి తెచ్చి చదివినప్పుడు, ‘అనక్టోరియా’ అనే పేరు మొదటిసారి కనబడగానే ఆ ఈజిప్టాలజిస్టులు ఎంత సంభ్రమానికి లోనై ఉంటారు! ఫారోల పరంపర, ప్రభుత్వోద్యోగులు, రోమను గవర్నర్లు, మధ్యధరాసముద్రతీరంలో వాణిజ్యం చేసిన వర్తకులు- వారెవ్వరి పేర్లూ చరిత్ర దాచుకోలేదు. కానీ, ఇదుగో, ఈ అనక్టోరియా పేరుని మాత్రం, ఇలా ఎవరూ చూడరాని తావుల్లో, ఎవరూ చేరరాని చోట, భద్రంగా దాచిపెట్టింది. ఎందుకంటే, అశ్వాలకన్నా, సైన్యాలకన్నా, నౌకాబలాలకన్నా నువ్వు ప్రేమించిన ఆ పడతి వదనమే అత్యంత సుందరం కాబట్టి.

ఇంకా చాలా రాయాలని ఉంది. ఈ కవితలో దక్కిన భాగాలు కాకుండా, కాలం కబళించిన ఆ ఖాళీల గురించి కూడా మాట్లాడుకోవాలని ఉంది. కాని ఇక్కడికి ఆగుతాను.

20-4-2025

10 Replies to “ప్రియమైన శాఫో-2”

  1. నమస్సుల్రు

    తమరు ఆగిన చోటే ఆగుతూ… రేపటి కోసం ఎదురు చూస్తాను.

  2. గొప్పపరిచయం..
    శాఫో.. రాజేశ్వరి.. హెలెన్. అనక్టోరియా..
    ఎట్లాంటి వ్యక్తులు!
    ఎంతటి సారూప్యత..
    కాలం గదులక్రీనీడల్లో నుంచి వెలుగులోకి తెచ్చారు..
    నిజానికి చీకట్లో ఉన్నది వాళ్ళు కాదేమో!

    కవిత్వం ఎవరైనా అనువాదం చేస్తారు.. కానీ మీలా
    ఖాళీల గురించి కూడా శోధించే వారు అరుదు..
    🙏

  3. ఎంత అందమైన ప్రేమసౌందర్య లేఖ . పురావస్తుశాఖ తవ్వకాల నిపుణులు అతి జాగ్రత్తగా తవ్వి బయటికి తీసిన ప్రాచీన చారిత్రక కట్టడాల వలె రెండున్నర సహస్రాబ్దాల కిందటి సాహిత్య చరిత్రను సుకుమారంగా తవ్వి మెరుగులు దిద్ది ఆధునిక పాఠక ప్రదర్శనశాలలో మీ అందమైన భావ తన్మయత్వపు గాజు బీరువాలో పెట్టి చూపుతున్నారు. మీకు సాహిత్యంలోకం ఎంత ఋణపడి ఉందో . మనఃపూర్వక నమస్సులకంటే ఏమివ్వగలం మీకు

  4. భద్రుడు గారు, శాఫో కి రాసిన ఈ రెండో ఉత్తరం ఉపోద్ఘాతం స్వచ్ఛంద సంస్థ అస్వ వివరాలతో ప్రారంభించి ఆ పిల్లలు తెలుగు నేర్చుకుని మరీ రాసుకున్న గీతాల గురించి ప్రస్తావిస్తూ మొదలు పెట్టడం భలే అనిపించింది. పెరేడ్ చేసే ఆర్మీలు, నేవీలు, అశ్వ దళాలు కాదు ఒక మనిషి దేన్ని ప్రేమిస్తాడో అదే అత్యంత సుందరమంటున్నావు. ఈ వాక్యం చాలు ఈ Fragment 16 ను శాఫో సౌందర్య లహరి గా పరిగణించడానికి.

    అంతేకాదు “అనక్టోరియా! ఎవరామె? నీ మొత్తం కవిత్వంలో రెండు సార్లు మాత్రమే వినబడే పేరు. కాని హెలెన్ ని కూడా పక్కకు నెట్టేసిన ఆ పేరు!” అని మీరు శాఫో కవితలో పేర్కొన్న పేరు చెప్పగానే.. ఎప్పుడో మా కాలేజీ క్విజ్జింగ్ రోజుల్లో ఏ కవి గురించి శ్రీశ్రీ తన కవితలో ” విషం క్రక్కే భుజంగాల్, కదం త్రొక్కే తురంగాల్, మదం పట్టిన మాతంగాల్
    కవీ, నీ పాటల్‌ ?” అని అన్నాడో ఆ కవి Algernon Charles Swinburne రాసిన ఒక కవిత పేరు అనక్టోరియా అని గుర్తొచ్చింది. ఇప్పుడు మీ ఈ ఉత్తరాల పుణ్యమా అని శాఫో –
    అనక్టోరియా ల కనెక్షన్ గురించి తెలిసి భలే ఆశ్చర్యమేసింది. ఆ కవిత గురించి, అలాగే అనక్టోరియా గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి రేకెత్తించింది.
    మా సమయాన్ని , పఠనాన్ని ఎంతో ఉపయోగకరంగా మలచి మాకు మరింత ఆనంద పరవశాన్ని కలిగిస్తున్నందుకు మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్! స్విన్ బర్ను అనక్టోరియా మీద ఒక కవిత రాశాడని నాకు ఇప్పుడే తెలియటం.

  5. Wow!! You included the relic of Sappho’s poem!! Looking at the torn worn piece of paper, I now understand why you said only fragments of her work survived.

    Got a full view and sense of her fragment -16 from this fantastic post, Sir.
    You translation, the construction mechanism she used in her poem. What Sappho believed in “ నేనంటాను నువ్వు
    దేన్ని ప్రేమిస్తే అదే అత్యంత సుందరమని”
    and how she brings Helen to help us understand what ultimately matters!!

    Contrast between how Homer saw Helen as an object of beauty and how Sappho saw the same Helen as a person with a heart and what she could forego for love.
    How you compared the same passion in Chalam’s Rajeswari who said “ ఆ జీవితమంతా సుందరమైన స్వప్నం వలె, ఆ ఎడారి పుణ్యభూమి వలె, నా జీవితంలో ఈశ్వరుడికి నేనెత్తే మంగళహారతి వలె తోచింది. ఇంటినే, బంధువుల్నే, భర్తనే మరిపించగల అనుభవం, ఎంత ఉన్నతమో, అద్భుతమో నువ్వే ఆలోచించు. ..’ ”

    Across times and geographies people ultimately declared the most beautiful thing is what you love the most.
    Thank you for these beautiful letters, Sir. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading