ప్రియమైన శాఫో-1

ప్రియమైన శాఫో,

పొద్దుణ్ణుంచీ నీచుట్టూతానే నా తలపులు. కాని ఎక్కడ మొదలుపెట్టాలో, ఏమని సంబోధించాలో, ఏమి రాయాలో తెలియడం లేదు. నా పాతికేళ్ళప్పుడు ఎన్ని ఉత్తరాలు రాసేవాణ్ణి. జవాబులు రావని తెలిసినా కూడా రాస్తూనే ఉండేవాణ్ణి. అప్పుడు నువ్వెక్కడున్నావు? అప్పుడప్పుడే నీ కౌమారంలో అడుగుపెడుతూ ఉండేదానివేమో. ఒడెస్యూస్ ఎలైటిస్ రాసుకున్నట్టుగా ఆ ఏజియన్ సముద్రపు గాలుల మధ్య ఆ ఈవొలిన్ గ్రీకులో తొలికవితలు అల్లుకుంటూ ఉండేదానివనుకుంటాను. ఆయన రాసుకున్నట్టే నువ్వు బహుశా నీ కవితల పుస్తకం ఎవరికీ చూపించేదానివి కాదేమో.

పాతికేళ్ళకింద నిజంగానే నేను నీ వంటి స్నేహితురాలి కోసం వెతుక్కుంటూ ఉన్నాను. బహుశా నీకప్పుడు పాతికేళ్ళ వయసుండవచ్చు. మైటిలేని పట్టణం శివార్లలో ఆలివు తోటల్లో నీ చెలికత్తెలకు పెళ్ళిపాటలు నేర్పుతూ ఉండేదానివనుకుంటాను. నా ఊహల్లో కదలాడే ఆ మిత్రురాలు అచ్చం నీలానే ఉండేదనిపిస్తుంది. చేతిలో ఒక తంత్రీవాద్యం, పెదాలమీద ఒక ప్రేమగీతం, చుట్టూ నిన్ను ఆరాధించేవాళ్ళు, నువ్వు ఆరాధించేవాళ్ళు, పట్టలేనంత ప్రేమలు, అలకలు, అసూయలు- నీకు తెలుసునా? అప్పట్లో నాక్కూడా ఒక ప్రేమజ్వరం, నీ మాటల్లో చెప్పాలంటే limb-loosening love, దేహాంగాల్ని ఉక్కిరిబిక్కిరి చేసే మోహోన్మాదంలో ఉండేవాణ్ణి.

ఏమైతేనేం, ఇన్నాళ్ళకు సాహసం చేసి ఈ ఉత్తరం రాస్తున్నాను. నాకు తెలుసు, ఇప్పటికి నువ్వు సిరక్యూజ్ నగరం నుంచి నీ ప్రవాసం నుంచి వెనక్కి వచ్చి ఉంటావు. మైటిలేని నగరంలో మళ్ళా ఆ దానిమ్మతోటల మధ్య, ఆ ఆలివ్ చెట్ల నీడల్లో, ఆ పైన్ చెట్ల సంగీతం వింటూ గతించిన జీవితాన్ని విషాదమధుర వేదనతో పునఃస్మరిస్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వు నడివయసుకి వచ్చి ఉంటావు. యాభై ఏళ్ళు వచ్చి ఉంటాయా? అయినా, టాగోరు అన్నాడే ఊర్వశి గురించి తలుచుకుంటూ- అలాగ నువ్వు అంతరహిత జవ్వనివి. కాని ఇప్పుడు నిన్ను తలుచుకుంటే నాలో దేహాంగాల్ని తల్లకిందులు చేసే భావోద్వేగాలు కలగడం లేదు. నీకులానే నేను కూడా యుద్ధాలు చూసాను, రాజకీయాల మధ్య నడిచాను, ప్రవాసక్లేశం అనుభవించాను. మనుషుల మధ్య ఉంటూనే ఒంటరితనమెలా ఉంటుందో చవిచూసాను. అందుకని ఇప్పుడు నీకు ఉత్తరం రాద్దామని కూచోగానే టాగోరు ఊర్వశిని  దర్శించినప్పుడు చెప్పుకున్నమాటలు గుర్తొస్తున్నాయి.

ఓడెస్యూస్ ఎలైటిస్ నీ గ్రీకు భాషకి వారసుడు. ఆయన నిజంగానే నీతో ప్రేమలో పడ్డాడు. నువ్వు తన దూరపుబంధువువి అని చెప్పుకున్నాడు. అవును. బంధువులుగా మీరిద్దరూ ఒకే సముద్రతీరాన్ని పంచుకున్నారు. గ్రీకులో కూడా ప్రజాజీవితానికి దగ్గరగా ఉండే ఈవొలిన్ గ్రీకు భాషని పంచుకున్నారు. నీ గ్రీకులో ఎంత మాధుర్యముందో ఏథెన్సువాసుల కన్నా ఆయనకే ఎక్కువ తెలుస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టే ఆయన నీ పద్యశకలాల్ని మళ్ళా కవితలుగా మార్చడానికి సాహసించాడు. మరి ఆయనతో పోలిస్తే నేనెక్కడ? అయినా కూడా నాకెందుకనో ఆయనకన్నా కూడా నేనే నీకెక్కువ దగ్గరనిపిస్తుంది. ఎందుకంటే నీలో నేను బంధువుని కాదు, ఒక స్నేహితురాల్ని చూస్తున్నాను.

స్నేహితురాలివి. జీవితం సగం గడిచిపోయాక, ఇప్పుడు నీకైనా, నాకైనా కావలసింది ముందుకు నెట్టే ఉద్వేగం కాదు. వెనక్కిలాగే సంకోచాలూ కాదు. అలాగని కొత్తగా ఏదో చెప్పుకోవాలని కాదు. మనం ఉన్నచోటనే ఒకింతసేపు నిశ్శబ్దంగా ఒకరి సన్నిధిని మరొకరం అనుభూతి చెందడం. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నమాటలు మరోసారి తలుచుకోడం. అందుకనే నాకు నీ పద్యశకలాలతో కొత్త కవితలు కూర్చాలని లేదు. ఆ శకలాలే, ఇన్నాళ్ళూ జీవితం పెట్టిన హోరులో నువ్వు అవతలి వైపు నుంచి చెప్తుండగా, గాల్లో కలిసిపోయిన మాటలు గాల్లో కలిసిపోగా, నా చెవుల్ని పడ్డ ఆ ఒకటో రెండో వాక్యాలు, వాటినే చేతుల్లోకి తీసుకోవడం, లాలనగా తాకడం, మరొక్కసారి నా హృదయం దగ్గర చేర్చి, సగం విరిగిన శంఖాల్లాంటి ఆ మాటల్లోంచి ఏ సముద్రఘోష వినవస్తున్నదో శ్రద్ధగా ఆలకించడం. అందుకనే ఇదుగో ఇలా ఉత్తరాలు రాద్దామని కూచున్నాను. రోజూ ఒక్కొక్క శకలాన్ని తీసుకుంటాను. భగ్నప్రతిమల్లాంటి ఆ పదబంధాల్లోంచి మన హృదయబంధాన్ని గట్టిపరుచుకోడానికి కొత్తగా ఏ బలం చిక్కుతుందా అని పరికిస్తాను, పరిశీలిస్తాను.

నిజానికి పాతికేళ్ళ కిందట మొదటిసారి నీ మొత్తం గీతశకల సర్వస్వాన్నీ ఆలోకించినప్పుడు, అన్నిటికన్నా మొదట, అన్నిటికన్నా చివర, ఇదుగో, ఈ వాక్యం దగ్గరే ఆగిపోయాను:

ఆ మాట వినగానే,  ఇరవై ఆరుశతాబ్దాలుగా కాల ప్రవాహంలో, ఆ వాక్యం ఒక గాలంలాగా నా కోసమే ఎదురుచూస్తున్నదని అర్థమయింది. ఆ గాలానికి నేను చిక్కుకున్నాను. నీకెలా తెలుసు? ఇన్ని యుగాల తరువాత, ఈ వసంత ఋతువేళ ఇక్కడ ఒక మానవుడు నిన్నే తలుచుకుంటూ ఉంటాడని!

ఇది మామూలుగా కవులు ఒక పాఠకుడికోసం ఎదురుచూడటమా? నీకు తెలుసా? భవభూతి అని ఒక సంస్కృత కవి కూడా ఇలాంటి మాటలే తనకి తాను చెప్పుకున్నాడు:

నిజమే, ప్రతి కవికీ తన సమకాలికుల పట్ల తీవ్ర అసంతృప్తి ఉంటుంది. తన జీవనసర్వస్వాన్ని కుదువపెట్టి మరీ గొంతుపెగుల్చుకుని చెప్తున్నమాటల్ని తన తోటిసమాజం పట్టించుకోవట్లేదనే ఒక ఆవేదన ఉంటుంది. కాబట్టి, భవభూతి ఇలా చెప్పుకుంటున్నాడు: ‘ఇక్కడ కూచుని నన్ను తక్కువగా పరిగణిస్తున్నవారికోసం కాదు నేను ఈ సృజనకి పూనుకుంటున్నది. వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళని ఒప్పించవలసిన అవసరమూ నాకు లేదు.  నాలాగా ఆలోచించేవాడూ, అనుభూతి చెందేవాడూ రేపెన్నడో తప్పకుండా కనిపిస్తాడు. కాలం అనంతం, ప్రపంచం విస్తారం’ అని.

కాని నీ మాటల్లో ఉన్నది ఒక కవికి ధైర్యాన్నిచ్చే నమ్మకం మాత్రమే కాదు, అంతకన్నా మించిందేదో ఉంది. నిజానికి ఇన్ని యుగాలుగానూ ఎందరో కవులు నువ్వు ఆ మాటలు తమని ఉద్దేశించే అన్నావని  నమ్ముతూ వచ్చారు. నీ కవిత్వాన్ని ఆరాధించారు, తమ తమ భాషల్లోకి అనువదించుకున్నారు. కాని నీ వాక్కుని  బతికించడానికి ఆ ఆరాధన చాలదని నీకు తెలుసు. చూడు, నిజంగా ఈ రోజు నీ కవిత్వం దాదాపుగా లుప్తమైపోయిన కాలంలో, ఇలా మిగిలిన ఈ కొన్ని శకలాల్నీ భద్రపరిచిందెవరు? కవులు కారు. వైయ్యాకరణులూ , అలంకారికులూ , నీతిసూత్రాలూ, ధర్మశాస్త్రాలూ రాసినవాళ్ళు. విజ్ఞాన సర్వస్వాలు నిర్మించినవాళ్ళు. వాళ్ళతో పాటు ఒకరిద్దరు అలంకారికులు, లాంగినస్ లాంటివాళ్ళు. నీ కవిత్వాన్ని తొమ్మిది పుస్తకాలుగా సంకలనం చేసిందెవరు? కవులు కాదు, అలెగ్జాండ్రియా లైబ్రరీ ఉద్యోగులు.

కవులేం చేస్తున్నారు? నిన్ను పైకి ప్రశంసిస్తూ లోలోపల అసూయ పడుతూ ఉన్నారు. నీ కవిత్వాన్ని బహిరంగంగా చదవడానికి సంకోచిస్తూ నెమ్మదిగా ఆ  సుగంధాన్ని ప్రజల స్మృతిలోంచి చెరిపేస్తూ ఉన్నారు. లేదా ఎక్కడేనా ఓవిడ్ లాంటివాడు , చూడు, నువ్వో పడవవాణ్ణి ప్రేమించావనీ, ఆ ప్రేమ విఫలమైతే తట్టుకోలేక కొండకొమ్ముమీంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నావనీ నువ్వు చెప్పుకుంటున్నట్టే తానో కవిత రాసాడు. చివరికి నీ కవిత్వమంతా పక్కకుపోయి ఆ పుక్కిటిపురాణమే నిజమన్నట్టుగా చరిత్ర గుర్తుపెట్టుకుంది. ఇదే, ఇదే నన్ను బాధించేది. కానీ నీకు తెలుసనుకుంటాను, ఎవరు ఒకరు ఏదో ఒక కాలంలో నిన్ను తలుచుకుంటారని. నిన్నే  తలుచుకుంటారని. నీ గురించి చెప్పుకున్న కథల్ని కాదు. నిన్నే. నీ అసలైన నిన్ను. ఎందుకంటే నీది ప్రేమ కోసం మరణించే స్వభావం కాదు. జీవించే స్వభావం. ప్రేమానుభవం దాదాపుగా మరణానుభవం లాంటిదేనని నీకు తెలుసుగానీ, ఆ అనుభవాన్ని పదేపదే అనుభూతి చెందటానికేనా జీవించాలనుకుంటావు నువ్వు. కాబట్టే నీకు నమ్మకం, ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో నీ అసలైన నిన్నే తలుచుకుంటారని.

ఎంత ఆశ్చర్యం! ఈ వాక్యమే తీసుకో. someone will remember us, I say, even in another time.. ఈ వాక్యం ఎక్కడ దొరికిందో తెలుసునా! నువ్వు ఈ మాటలు చెప్పిన ఆరేడు వందల ఏళ్ళ తరువాత కోరింత్ నగరంలో ఒక వక్త ప్రజల్ని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో ఈ మాటలు తలుచుకున్నాడు. ఏ సందర్భంలో? ఆ నగరం ఒకప్పుడు తన విగ్రహాన్ని నిర్మించి ఆ తరువాత తనమీద అపవాదు రాగానే తన విగ్రహాన్ని కూల్చిపారేసిందట. అందుకని అతడు విగ్రహాలు పెట్టడం, విగ్రహాలు కూల్చడం గురించి పెద్ద ప్రసంగం చేసాడు. అందులో ఆసక్తి కల్గించే ఒక సంగతి చెప్పాడు. ఒకప్పుడు సిరక్యూజ్ నగరానికి కంచు లోహం తక్కువపడిందట. అందుకని వాళ్ళు నగరంలో ఉన్న కొన్ని కాంస్య విగ్రహాల్ని కరిగించేద్దామనుకున్నారట. కాని ఏ విగ్రహాలు కరిగించాలి? అందుకని ఆ విగ్రహాల మీద విచారణ మొదలుపెట్టారట. వాటిల్లో ఎవరి కీర్తి ఇంకా మసకబారలేదో వారి విగ్రహాలు అట్టేపెట్టి తక్కినవాళ్ళవి కరిగించేద్దామనుకున్నారట. అలా తన విగ్రహాన్ని కూడా ఎక్కడ కరిగించేస్తారో అని ఆ వక్త ఆందోళనతో చేసిన ప్రసంగం అది. అందులో చివరికి అన్నాడు కదా, విగ్రహాలు శాశ్వతం కాదు. కీర్తి శాశ్వతం అని. అందుకని ‘అందమైన శాఫో అనలేదా’ అని ఇదుగో, ఈ వాక్యం గుర్తుచేసుకున్నాడు.

అందమైన శాఫో!

సోక్రటీసు కూడా నిన్ను అందమైన శాఫో అని అన్నాడట. కానీ ‘ఆయన నీ శారీరిక సౌందర్యాన్ని కాదు ప్రశంసిస్తున్నది, నీ కవిత్వ సౌందర్యాన్ని మాత్రమేనని’ మరొకడు మరో రెండువందల ఏళ్ళ తరువాత సన్నాయి నొక్కులు నొక్కాడు. పైగా నువ్వు ‘పొట్టిగా, నల్లగా, అనాకారిగా’ ఉంటావని కూడా రాసాడు, అక్కడికేదో అతగాడు నిన్ను స్వయంగా చూసినట్టు!

కాని శాఫో, నువ్వు నిజంగా అందమైనదానివి. ఆ అందం నీ రూపానిదా, నీ కవిత్వానిదా, నీ మనసుదా? చెప్పలేను. నువ్వు ఎంత అందమైన దానివి కాకపోతే, మనుషులు మర్చిపోయినా కూడా భూమి నీ మాటలు గుర్తుపెట్టుకుంటుంది! నీకు తెలుసునా, ప్రాచీన వక్తలు, అలంకారికులు, ఛందశ్శాస్త్రవేత్తలు, వ్యాకరణవేత్తలు  నీ మాటలు ఎన్ని గుర్తుపెట్టుకున్నారో అన్ని మాటలు భూమి కూడా తన కడుపులో పెట్టుకు దాచుకుంది. యుద్ధాలు, అగ్నిప్రమాదాలు, వరదలు గ్రంథాలయాల మీద విరుచుకుపడుతున్నప్పుడు ఒక్క కవికూడా నీ కవిత్వాన్ని కంఠస్థం చేసి తర్వాతి తరాలకు అందివ్వాలనుకోలేదు. అలాంటిది ఇప్పుడు నీ కవిత్వ శకలాలు ఎక్కడ దొరికాయో తెలుసునా?  ఈజిప్టు ఎడారుల్లో ఇసుకమేటలకింద కప్పడిపోయిన పురాతన పెపైరీలనుంచి, పిరమిడ్లలో మమ్మీల్ని భద్రపరచడానికి పరిచిపెట్టిన కాగితాలనుంచి, బంగారు మొసళ్ళ నోళ్ళల్లో కుక్కిన కాగితాల చుట్టల్లోంచి- ఎక్కణ్ణుంచి, ఏ అనూహ్య భూగర్భం నుంచి నువ్వు మమ్మల్ని పలకరిస్తున్నావు శాఫో! ఊహించ శక్యంకాని తావుల్లోంచి నీ కంఠస్వరం మమ్మల్ని పలకరిస్తూ ఉంది. మళ్ళా టాగోరు మాటలే గుర్తొస్తున్నాయి. ఊర్వశితో అంటున్నాడు ఆయన:

నేనీరోజు నీకు ఉత్తరం రాద్దామని కూచోగానే ఒక్కసారిగా ఎండ చల్లబడింది. వాన జల్లు పడింది. ఈ ఋతువుకి ఇదే మొదటి వసంతవాన. నాకెంత సంతోషం కలిగిందని! నిన్నటితో చైత్రం ముగిసిపోయింది. ఇవాల్టినుంచీ మలివసంతం. నిన్నటిదాకా రోజంతా  పూల వాన. ఈ సిమెంటు కాంక్రీటు నగరంలో మనుషులు పగలూ, రాత్రీ కూడా చెమటవాసన కొడతారు. కాని చైత్రం రాగానే, పగటిపూట కూడా వీథులు పరిమళిస్తుంటాయి. అలాంటి పూలవానకి ఈరోజు వసంతవాన తోడయ్యింది. ‘ఈవేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావని’ అనుకున్నాను. మైటిలేని నగరంలో మీ కొత్త ఇంట్లో కూచుని పాతగీతాల్ని మరొకసారి తంత్రులమీద పలికిస్తూ ఉంటావు కదూ. నువ్వు ప్రవాసివి కాకముందు మీది పెద్ద మేడ కదూ. ఆ మేడమీద నీ గదిలో తంత్రీవాద్యాలు, నీ గీతాలు రాసుకున్న పెపైరీ చుట్టలు, గాజుగిన్నెల్లో సుగంధాలీనే గులాబీలు. కాని ఇప్పుడు నువ్వు ఆ వైభవోపేత జీవితం నుంచి చాలా దూరం వచ్చేసావు. ఇప్పుడు నువ్వుండే దాన్ని ఇల్లనలేను. అదొక ఏకాంత కుటీరం. ఒక దేవతామందిరం. అక్కడ నీతో కూచునేది కన్యలూ, వివాహితులూ, నీ స్నేహితులూ కాదు, సాక్షాత్తూ సంగీత, సాహిత్య దేవతలు. అందుకనే ఈ ఉత్తరం ఆ విలాసానికే  రాస్తున్నాను.

నువ్విప్పుడు ఆ ఇంట్లోనే ఉంటావని ఎందుకనిపించిందో చెప్పనా? చూడు:

ఈ మాటలు నువ్వు నీ పదహారేళ్ళ వయసులో చెప్పగలిగేవి కావు. అసలప్పుడు నీకు మరొక కాలం ఉంటుందనీ, మరొకచోట ఎవ్వరో నిన్ను తలుచుకునేవాళ్ళుంటారనీ ధ్యాస ఉండేదనుకోను. లేదా పాతికేళ్ళ కింద నువ్వు ప్రవాసిగా సిరక్యూజ్ నగరానికి పయనమవుతున్నప్పుడు కూడా ఈ మాటలు చెప్పి ఉంటావనుకోను. అప్పుడు నీ మాటల్లో ఒక ఆగ్రహం, ఒక ఉక్రోషం, ఒక ఆవేదన తప్పనిసరిగా పలికి ఉండేవి. కాని ఇప్పుడు, ఇప్పుడు మాత్రమే, జీవితంలో చెయ్యవలసిన యుద్ధాలన్నీ చేసిన తరువాత, సమకాలిక ప్రపంచపు ఆమోదతిరస్కారాల పట్ల పూర్తి ఉదాసీనత చిక్కాక, ఇప్పుడు మాత్రమే, నువ్వు సుదూరభవిష్యత్తులోకీ చూపు సారించి ఈ మాటలు చెప్పి ఉంటావు. నీ తలపుల్లో నాలాంటి వాడెవడో కదలాడి ఉంటాడు. అందుకని ఈ ఉత్తరం మైటిలేనిలో నీ కొత్త ఇంటికే పోస్టు చేస్తున్నాను.

2600 ఏళ్ళుగా నువ్వు ఎదురు చూస్తున్న

నీ స్నేహితుడు

18-4-2026

12 Replies to “ప్రియమైన శాఫో-1”

  1. ఎంత చక్కటి అనుభూతి యెదను తాకె !
    ఘనత శాఫోద తమద వికసిత మాయె ?
    భువిని గ్రీకులు కూడ శాఫోను వొగిడి
    ఇంత యెత్తుకు కొనిపోయి యెరుగ రేమొ .

  2. 2500 ఏళ్లు.వాహ్.ఎన్ని జన్మలు గడించి ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఈ నాలుగు ముక్కలు తన హృదయానికి చేర్చుకొని మురిసిపోవడానికి.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading