
కొండగాలీ కొత్త జీవితం. ఆర్మీనియన్ కథలు. ప్రగతి ప్రచురణాలయం వారు 1979 లో విడుదల చేసిన పుస్తకం. ఆ వెనువెంటనే, నాలుగైదేళ్ళు తిరక్కుండానే, నా చేతుల్లోకి కూడా వచ్చింది. ఇరవయ్యేళ్ళ వయసులో నా చేతుల్లోకి వచ్చిన చింగిజ్ అయిత్ మాతొవ్ నవలల్లానూ, రసూల్ గాంజతొవ్, కైసన్ కులియెవ్ కవిత్వంలానూ, ఈ పుస్తకం కూడా ఒక మనోహరమైన లోకాన్ని, సతతహరితంగా ఉండే కొండచరియల్నీ, ఆకుపచ్చని లోయల్నీ నా ముందు ఆవిష్కరించింది.
చాలా కాలం పాటు ఆ పుస్తకం నాతో పాటే ఉండేది. కాని ఎక్కడో ఏ బదిలీల్లోనో ఇళ్ళు మారినప్పుడు చాలా తెలుగు పుస్తకాల్తో పాటు దీన్ని కూడా పోగొట్టుకున్నాను. కాని ఈ మధ్య ‘నన్ను వెన్నాడే కథలు’ పరిచయం చేస్తున్నప్పుడు, మళ్ళా ఈ పుస్తకం కోసం గాలిస్తే ఆర్కైవులో దొరికింది. అప్పుడు ఇందులోంచి ‘ఒంటెలు వెళ్ళిపోతాయి, పర్వతాలు ఉండిపోతాయి’ కథ కోసం మళ్ళా తిరగేసాను. కాని అప్పటికే నలభయ్యేళ్ళ కిందటి జ్ఞాపకాలు నన్ను ముంచెత్తడంతో ఆ ఒక్క కథా తప్ప తక్కినవి తెరవలేకపోయాను. కానీ ఇప్పుడు అనిల్ బత్తుల పబ్లికేషన్స్ తరఫున అనిల్ ఆ పుస్తకాన్ని ముద్రించి దాన్ని ఆవిష్కరించి పరిచయం చెయ్యవలసిందిగా అడగడంతో మళ్ళా ఆ కథలన్నీ చదివాను. గురువారం సాయంకాలం లామకాన్ లో అనిల్ ఆ పుస్తకంతో పాటు బోరిస్ లావరెన్యోవ్ రాసిన ’41’ నవలకి పురిపండా అప్పలస్వామిగారి అనువాదాన్ని కూడా వెలువరించాడు. ఆ సందర్భంగా కొండగాలీ కొత్త జీవితం పుస్తకం ఆవిష్కరించి ఆ పుస్తకం గురించి మాట్లాడే భాగ్యం నాకు లభించింది.
నలభయ్యేళ్ళ కింద ఆ పుస్తకం చదివినప్పుడు, సాధారణంగా ఆ వయసులో ఉండేట్టే, కథమీదనే దృష్టి వుంటుంది తప్ప ఆ కథ వెనక ఉన్న నేపథ్యం గురించి ఆలోచించలేదు. కాని ఇన్నేళ్ళ ప్రయాణం తరువాత, రష్యన్, సోవియెటు సాహిత్యాలతో మరింత దగ్గరగా ప్రయాణించాక, ఇప్పుడు, ఈ 128 పేజీల చిన్న పుస్తకం ఎంత విలువైన పుస్తకమో నాకు అర్థమయింది. ఆ సంగతే చెప్పాను నిన్న నా ప్రసంగంలో.
2
ఆర్మీనియా చరిత్ర
ఆర్మీనియా మధ్య ఆసియాలోని ఒక పర్వతప్రాంత దేశం. సుదీర్ఘమైన చరిత్ర, సంస్కృతి ఉన్న దేశం. కాంస్యయుగం నాటికే అక్కడొక విశిష్ట సంస్కృతి రూపుదిద్దుకుంది. సముద్రతీరప్రాంతమంటూ లేకుండా చుట్టూ దేశాల మధ్య ఒక landlocked country గా ఉన్న కారణంగా, మొదటినుంచీ ఎప్పుడూ రెండు మూడు మహాసామ్రాజ్యాలకి మధ్యలో ఇరుక్కుని ఉండవలసి వస్తున్నందువల్లా, ఆర్మీనియా చరిత్ర మొత్తం రాజకీయ అస్థిరత్వానికి సంబంధించిన చరిత్ర. వరస ఆక్రమణల, అణచివేతల చరిత్ర. అంతులేని నరమేధాల చరిత్ర. సా.శ. మూడో శతాబ్దం నాటికే ఆర్మీనియా క్రైస్తవాన్ని ఆధికారిక మతంగా స్వీకరించింది. ఆ తర్వాత మరో వందేళ్ళకుగాని రోము క్రైస్తవాన్ని స్వీకరించలేదు. అంటే అర్మీనియా తక్కిన యూరోపుకన్నా కాలానికి ఎంతముందున్నదో మనం ఊహించవచ్చు. బైబిల్లో పాతనిబంధనలో నోవా జలప్రళయం నుంచి తప్పించిన తన నౌకకు ఏ పర్వతాగ్రంలో లంగరు వేసాడో ఆ అరారత్ పర్వతాన్ని ఆనుకునే ఆర్మీనియా ఉంది. అందుకని ఆర్మీనియన్లు తొలినుంచీ ఆ పర్వతాన్ని తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ వచ్చారు.
ఇరవయ్యవశతాబ్దం మొదలుకాడానికి ముందే ఆర్మీనియా రెండు భాగాలుగా విడిపోయింది. తూర్పు ఆర్మీనియా రష్యన్ ఆధిపత్యం కిందకీ, పడమటి ఆర్మీనియా ఓట్టోమాన్ టర్కీ పాలన కిందకీ చేరాయి. 1890 ల్లో పడమటి ఆర్మీనియాలో సుల్తాన్ హమీద్ అనేవాడు దాదాపు రెండు లక్ష్లమంది ఆర్మీనియ్ల జనవధకి కారణమయ్యాడు. అతడి మీద తిరుగుబాటుగా దాష్నక్లు అనబడే ఆర్మీనియన్ రివల్యూషనరీ ఫెడెరేషన్ చెల్లాచెదరుగా ఉన్న ఆర్మీనియన్ సమూహాల్ని ఏకతాటికి తీసుకురాడానికి ప్రయత్నించింది. అప్పటిదాకా ఆ ప్రాంతంలో ఆధిపత్యం చలాయిస్తున్న ఓట్టోమాన్ సామ్రాజ్యం బలహీనపడటం మొదలుకాగానే, 1908 లో యంగ టర్క్ రివల్యూషన్ సుల్తాన్ హమీద్ ని పదవీచ్యుతుణ్ణి చేసాక, మళ్ళా మరొకసారి ఆర్మీయన్ జనమేధం సంభవించింది. ఈలోగా మొదటిప్రపంచ యుద్ధం తలెత్తగానే, రష్యన్ సామ్రాజ్యానికీ, ఓట్టోమాన్ సామ్రాజ్యానికీ మధ్య సంభవించిన యుద్ధాల్లో ఆర్మీనియన్లను ఓట్టోమాన్ పాలకులు నమ్మలేదు. అందువల్ల మళ్ళా మరోసారి జనమేధానికి పాల్పడ్డారు. ఆ నరవధ రెండు రకాలుగా జరిగింది. మొదటిది, ఆర్మీనియన్లలో దృఢకాయులైనవారందరినీ వెట్టిచాకిరీ కోసం దూరప్రాంతాలకు పంపించేయడం. రెండోది, స్త్రీలనీ,పిల్లల్నీ, వృద్ధుల్నీ వారినుంచి విడదీసి మరో దూరప్రాంతానికి తరలించడం. దాన్ని ప్రతిఘటిస్తూ 1915-17 లో మళ్ళా ఆర్మీనియాలో తిరుగుబాట్లు తలెత్తాయి. ఈ కాలంలో ఆర్మీనియాలో ఓట్టోమాన్ టర్కులు చేపట్టిన నరమేధమే ఆ తర్వాత ఇరవయ్యవ శతాబ్దం పొడుగునా ప్రపంచమంతా సంభవించిన ఎన్నో నరమేధాలకు మొదటి అధ్యాయంగా చెప్పవచ్చు.
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో రష్యన్ పాలనలో ఉన్న జార్జియా, అజర్ బైజాన, తూర్పు ఆర్మీనియాలు కలిసి ఒక ట్రాన్స్ కకేషియన్ ఫెడెరేటివ్ రిపబ్లిక్ గా రూపొందాయిగాని, ఆ రిపబ్లిక్ 1918 లో కేవలం మూడు నెలలు మాత్రమే మనగలిగింది. ఆ తర్వాత మూడు పక్షాలూ విడిపోడానికే మొగ్గుచూపాయి. ఆ వెంటనే తూర్పు ఆర్మీనియాలోని దష్నక్ లు ఆ ఏడాది మే నెలలో మొదటి ఆర్మీనియన్ రిపబ్లిక్ ను ప్రకటించుకున్నారు. కానీ, నిరంతర యుద్ధాలు, కరువుకాటకాలు, బోల్షివిక్కుల దాడులు, పడమటి ఆర్మీయానుంచి వచ్చిపడుతున్న శరణార్థులు- వీటన్నిటివల్లా ఆ రిపబ్లిక్ ఎక్కువకాలం మనలేకపోయింది.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత విజేతలు ఓట్టోమాన్ సామ్రాజ్యాన్ని ముక్కలుగా పంచుకోవాలనుకున్నప్పుడు ఆర్మీనియాని కూడా రెండు మూడు భూభాగాలుగా విడదీసి టర్కీ, అమెరికా, ఫ్రాన్సు, రష్యాలు పంచుకోవాలని ఆలోచించాయి. ఈలోగా 1920 లో టర్కీ జాతీయవాద శక్తులు తూర్పు ఆర్మీనియామీద దండెత్తి, 1878 లో రష్యా ఆక్రమించిన ఆర్మీనియాను కైవసం చేసుకోవాలని చూసాయి. మరోవైపు రష్యన్ రెడ్ ఆర్మీ ఆర్మీనియామీద దండెత్తి ఆ భూభాగాన్ని సోవియెట్ రష్యా ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో మొదటి ఆర్మీనియన్ రిపబ్లిక్ కూలిపోయింది. అనతికాలంలోనే యుద్ధకాల సోవియెట్ విధానాలకు ప్రతిఘటనగా 1921 లో మళ్ళా తిరుగుబాటు సంభవించింది.
ఇక 1922 లో ఆర్మీనియా సోవియెట్ రష్యాలో పూర్తిగా భాగమై ఆర్మీనియన్ సోవియెట్ సోషలిస్టు రిపబ్లిక్కుగా రూపొందింది. అక్కణ్ణుంచి 1991 లో ఆర్మీనియా ఒక ప్రత్యేక సార్వభౌమిక దేశంగా అవతరించేదాకా, ఆ డెబ్భై ఏళ్ళ చరిత్ర ఒకవైపు ఆర్థిక పురోగతితోనూ, మరొకవైపు అమానుషమైన అణచివేతల్తోనూ, పునః పునః నరమేధాల్తోనూ కలగలిసిపోయింది, ముఖ్యంగా 1942-43 మధ్యకాలంలో నాజీసైన్యాల్ని నిలవరించడానికి సోవియెట్ రష్యా చేసిన స్టాలిన్ గ్రాడ్ యుద్ధంలో దాదాపు లక్షా డెబ్భై అయిదు వేలమంది ఆర్మీనియన్ సైనికులు మరణించారు. అప్పటికి ఆ సంఖ్య మొత్తం ఆర్మీనియన్ జనాభాలో ఆరోవంతు. అంత అసమాన ప్రాణత్యాగం చేసి సోవియెట్ రష్యాను కాపాడినప్పటికీ, యుద్ధానంతరం ఆర్మీనియన్ల పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. స్టాలిన్ అనుసరించిన క్రూర, నిర్బంధ విధానాల వల్ల ఆర్మీనియన్లు నిర్బంధ శ్రమనిమిత్తం సోవియెట్ రష్యాలో సుదూరప్రాంతాలకి తరలివెళ్లవలసి వస్తూనే ఉండింది.
1991 లో స్వతంత్రం పొందిన తర్వాత ఆర్మీనియా ఈసారి పొరుగునున్న అజర్ బైజాన్ తో యుద్ధాల్లో కూరుకుపోయింది. 1994 లో ఇరుదేశాల మధ్యా కాల్పుల ఒప్పందం కుదిరేటప్పటికే ముప్ఫై వేలమంది ఆర్మీనియన్లు మరణించారు, లక్షలాదిమంది నిర్వాసితులయ్యారు. ఇరవై ఒకటవ శతాబ్దం మొదలయ్యాక కూడా ఆర్మీనియా అంతర్గత రాజకీయ సంక్షోభాల్ని ఎదుర్కొంటూనే ఉంది. 2018 లో మొదలైన ఈ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది.
3
ఈ నిరంతర నరమేధాలు, తిరుగుబాట్లు, సంఘర్షణలు, వాటిమధ్యనే నవజీవితం గురించిన ఆకాంక్షల సుదీర్ఘ ఇతిహాసంలో, ఈ ఆర్మీనియన్ కథలు 1918-20 నరమేధం మొదలుకుని 1942-43 స్టాలిన్ గ్రాడ్ పోరాటం దాకా నడిచిన ఆర్మీనియన్ సంఘర్షణని చిత్రించే కథలు. సహజంగానే ఆ సంఘటనల్ని సోవియెట్ దృక్పథం నుంచి, సోవియేట్ అనుకూల వైఖరితో చిత్రించిన కథలు కూడా.
కొండగాలీ కొత్త జీవితం
నా చిన్నప్పుడు ఈ పుస్తకం చదివినప్పుడు నాకిదంతా తెలియదు. అప్పుడు నన్ను ఆకట్టుకున్నవి ఆ అందమైన ప్రకృతి వర్ణనలూ, సాధారణంగా సోవియెట్ పుస్తకాల్ని తెలుగులోకి అనువదించినప్పుడు అనువాదకులు అనుసరించే ఒక విచిత్రమైన శైలీ, నిర్మలమైన ఆ మానవసంబంధాలూ మాత్రమే. ఈ పుస్తకంలోని తొమ్మిది కథకుల్లోనూ అగ్రశ్రేణి కథకుడుగా లెక్కేసే గ్రాంత్ మాతెవోస్యాన్ రాసిన ‘ఆకుపచ్చలోయ’ ఎందుకు విశేషమైన కథనో అప్పుడు నాకు తెలియలేదు. ఆ కథ ఒక ప్రతీకాత్మక కథ. ఒక తల్లిగుర్రం ఒక తోడేలు దాడినుంచి తన పిల్లను కాపాడుకోడానికి దాంతో తలపడి ప్రాణాలు పోగొట్టుకోవడం ఆ కథ ఇతివృత్తం. ఇంతదాకా నేను వివరించిన ఆర్మీనియా చరిత్ర గురించి కనీసం స్థూలంగానైనా తెలియకుండా ఆ కథ మనకి అర్థం కాదు. ఉదాహరణకి ఆ కథలో ఈ వాక్యాలు చూడండి:
సూర్యాస్తమయానికి లోయలోయంతా హరితకాంతుల్తో నిండిపోయింది. ముసలి ఎర్ర గుర్రం చుట్టూ నల్లగా, కారునల్లగా వుంది. దాని ఎర్రటి దేహం ఈ నల్లటివలయంలో పడి వుంది. గుర్రమూ, తోడేలూ హోరాహోరీ పోరు సలిపిన స్థలమే ఈ నల్లటి వలయం. గుర్రం సుగ్గుసుగ్గుగా తొక్కిన నేల. గుర్రం తొక్కిడికి దుమ్ము రేగిన ఈ నల్లనేలను చూస్తే ముసలి గుర్రం తోడేలుతో ఎంతసేపు గిరగిరా ప్రదక్షిణాలు చేసిందో తెలుస్తుంది. ఈ నల్లవలయం మూడేళ్ళు అలాగే నల్లగా వుండిపోయింది. మూడేళ్ళపాటు అక్కడ గడ్డిపరక మొలవలేదు. ఈ నల్లవలయంలో మూడేళ్ళు గుర్రం తెల్లని కంకాళం అలాగే పడివుండింది. ఆ తర్వాత పసరిక గెలిచింది, మొలిచింది, చివుళ్ళేసింది, పూలు పూసింది. దాంతో లోయ మళ్ళీ పచ్చబారింది.
ఇప్పుడు మనం సులువుగా అర్థం చేసుకోగలం, రచయిత కవితాత్మకంగా చిత్రిస్తున్నది ఆర్మీనియా చరిత్రనీ, నిరంతర మృత్యువు ముందు వీగిపోని దాని జీవితేచ్ఛనీ అని.
అన్నట్టు ఈ కథల్లో ఒక కథ పేరు ‘జీవితేచ్ఛ’ కూడా. ఆ కథతో పాటు ‘కడవభుజాన పెట్టి నీటికెళ్ళెను పడతి’, ‘గరుడ పర్వతం పైన’ కథలు ఏ యుద్ధకాలానికైనా వర్తించే కథలు. అలాగే ‘గుడ్ మార్నింగ్ జాక్’ అనే కథ మనుషుల్లో పని మానవత్వాన్ని ఎలా మేల్కొల్పుతుందో, పని సమక్షంలో మనిషి తన మానవమర్యాదను ఏ విధంగా పొందగలడో చెప్పే కథ. ‘వంతెన’ ఒక తరం నుంచి మరొక తరానికి జీవితం మలుపు తిరిగే క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం కూడా ఎలా ముందుకు నడుస్తుందో, తాను నడుస్తూ మనుషుల్నెలా నడిపిస్తుందో చెప్పే కథ. వీటిల్లో ‘తెల్ల గొర్రె పిల్ల’ కుటుంబసంబంధాల్ని మరో కోణంలో చూపే కథ. నవ సోవియెట్ రిపబ్లిక్కు నిర్మాణం మొదలయ్యాక, ఒక ఆర్మీనియనుకి ఆ సోవియెట్ సంఘసభ్యులే కుటుంబసభ్యులుగా మారిపోతారనీ, తల్లిదండ్రులు కూడా ఆ తర్వాతనేననీ చెప్పే కథ. ఇక ‘ఒంటెలు వెళ్ళిపోతాయి, పర్వతాలు ఉండిపోతాయి’ ఈ సంపుటిలోని అత్యంత కవితాత్మకమైన కథ. ‘పురాతన ప్రాచ్య దీర్ఘగేయం లాగా’ సాగే ఒంటెల బారు ఆర్మీనియాలో నిర్విరామంగా సంభవిస్తుండే చారిత్రిక సంఘటనల పరంపర. ఆ చారిత్రిక సంఘటనలు ఒకదాని వెనుక ఒకటి సాగిపోతూనే ఉంటాయి. కాని నిలబడిపోయేవి మాత్రం ఆ పర్వతాలూ, ఆ ప్రకృతీ, ఆ ఆర్మీనియన్ జీవితేచ్ఛా మాత్రమే. కానీ ఈ సారి ఈ కథల సంపుటిలో నన్ను అన్నింటికన్నా అమితంగా ఆకట్టుకున్నది ‘చరమదశ’ అనే కథ. పట్టుమని ఇరవై పేజీలు కూడా లేని ఈ కథ చదవగానే మనకొక ఇతిహాసాన్ని చదివినంత స్ఫూర్తి కలుగుతుంది.
యుద్ధాలమధ్యా, నిరంతర సంఘర్షణ మధ్యా, రాజకీయ అనిశ్చితి మధ్యా జీవిస్తున్న సమూహం నుంచి వచ్చిన కథలు కావడంతో అన్నిటికన్నా ముందు ఈ కథల్లో అపారమైన నిర్మాణ సారళ్యం కనిపిస్తుంది. చిన్నచిన్నవాక్యాల్లోనే గొప్ప సత్యాల్ని చాలా అలవోకగా ప్రస్తావించడం కనిపిస్తుంది. మచ్చుకి ‘కడవభుజాన పెట్టి నీటికెళ్ళెను పడతి’ అనే కథలో ఈ వాక్యాలు చూడండి:
‘బిడ్డని కోల్పోయిన తల్లి మాత్రమే అనాథ ఆక్రందనకి మారు పలుకుతుంది.’
‘ఆలస్యంగా వెళ్తున్న బాటసారి, తన బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతున్న తల్లి, లేక ప్రేమికురాలు, ఎవరో ఒకరు ఏ క్షణాన అయినా పాట మొదలుపెట్టవచ్చు.’
‘ప్రతి చోటా స్త్రీలు కడవలు భుజానపెట్టుకొని పర్వతాల్లోకి నీటికోసం వెళ్తూనే ఉన్నారు, ప్రతి చోటా స్త్రీ తన ప్రియుని కోసం వెతుకుతూనే ఉంది, కొందరికి సంతోషం లభ్యమైంది, మరి కొందరికి కాలేదు.’
4
చరమసౌందర్యసీమ
ఈ కథల్ని ఆర్మీనియన్ చరిత్రలో భాగంగా చూడటం ఒకటైతే, రష్యన్, సోవియెట్ సాహిత్యచరిత్రలో భాగంగా చూడటం మరొకటి. ఆధునిక రష్యన్ సాహిత్యం మొదలైనప్పణ్ణుంచీ కూడా, రష్యన్ రచయితల్ని కాకసస్ ఊరిస్తూనే ఉంది. మాస్కోనుంచి రెండువేల కిలోమీటర్లదూరంలోనూ, పీటర్స్ బర్గ్ నుంచి రెండువేల అయిదువందల కిలోమీటర్లదూరంలోనూ, దక్షిణ రష్యాలో, ఉత్తర మధ్యాసియాలో భాగంగా ఉన్న కాకసస్ పర్వతశ్రేణి, అక్కడి అడవులు, ఆకాశం, ఆ గిరిజనులు రష్యన్ రచయితలకు ఒక romantic landscape గా మారిపోయేయి.
కాకసస్ లో రెండు భాగాలున్నాయి. ఉత్తర కాకసస్ దక్షిణ రష్యాలో భాగం. దాగెస్తాన్, చెచెన్యా లాంటి అటానమస్ రిపబ్లిక్కులు అందులో ఉన్నాయి. దక్షిణ కాకసస్ లో జార్జియా, అజర్ బైజాన్, ఆర్మీనియాలున్నాయి. రష్యన్ రచయితలకి మొదట్లో కాకసస్, కజక్, కోసక్కు, కిర్గిజ్ లాంటి పదాలన్నీ ఒక్కలానే వినిపించేవి, కాని అవన్నీ ప్రత్యేక భూభాగాలు, స్వతంత్ర సాంస్కృతిక అస్తిత్వాలని వారు నెమ్మదిగా తెలుసుకున్నారు. పందొమ్మిదో శతాబ్ది పూర్వభాగంలో పుష్కిన్ (1799-1837) రాసిన The Prisoner of the Caucasus (1872)తో కాకసస్ రష్యన్ కాల్పనిక సీమలో భాగమైంది. ఆ రచనలో పుష్కిన్ తొలి రొమాంటిక్ కవుల దారిలోనే, కాకసస్ పర్వతప్రాంతాన్ని ఒక చరమసౌందర్యసీమగా, బైరానిక్ కథానాయకుడికి తగిన నేపథ్యంగా భావించాడు. ఆ తర్వాత మిహాయిల్ లెర్మంటోవ్ (1814-1841) రాసిన A Hero of Our Time (1840) లో heroకి బదులు anti-hero కనిపిస్తాడు. అటువంటి అపూర్వప్రాకృతిక సౌందర్యం ఎదట మనుషులు చాలా క్షుద్రంగా ప్రవర్తించడం చూసాడతను. పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో టాల్ స్టాయి (1828-1910) రచనలు మొదలుచెయ్యడం మొదలుపెట్టాక, ఆయన తొలిరచనల్లో ఒకటైన The Cossacks (1863) లో రొమాంటిక్ ఊహలనుంచి కాకసస్ ను నేలమీదకి దింపడానికి ప్రయత్నించాడు. ఆ నవలని రొమేరోలా టాల్ స్టాయి రచనల్లో అత్యంత కవితాత్మకమైన రచనగా అభివర్ణించాడు. నిజానికి ఆ సౌందర్యం అందులోని నైతిక సౌందర్యం. దాన్ని కూడా మనం ఒక విధంగా moral romanticism గా భావించవచ్చు. కాని అప్పణ్ణుంచీ టాల్ స్టాయి ని కాకసస్ వెన్నాడుతూనే ఉంది. ఆయన తన చిట్టచివరి సంవత్సరాల్లో రాసిన Hadji Murad (1912) లో తన రష్యన్ వారసత్వం నుంచి బయట పడి ఒక చెచెన్ గా, ఒక సరిహద్దుమానవుడిగా తనను తాను ఆవిష్కరించుకోడానికి ప్రయత్నించేడు. చెహోవ్ (1860-1904) రాసిన The Steppe (1888) కాకసస్ గురించి కాకపోయినా, మాస్కో, పీటర్స్ బర్గ్ లకన్నా ఎంతో ఆవల ఉండే ఒక ప్రాకృతిక సీమపొడుగునా నడిచే కథ. తనముందు పుష్కిన్, లెర్మంటోవ్ లు కాకసస్ గురించి రాసి ఉండకపోతే అతడు ఆ కథ రాయగలిగి ఉండేవాడు కాదు.
ఇక ఇరవయ్యవ శతాబ్దం మొదలయ్యాక, సెర్జీ యెసెనిన్ (1895-1925), ఓసిప్ మెండెల్ స్టాం (1891-1938) వంటి రచయితలు కాకసస్ ను మరింత కొత్తగా చూసారు. అయితే రష్యా సోషలిస్టు సోవియెట్ రిపబ్లిక్కుల యూనియన్ గా మారాక కాకసస్ రచయితలు అంతర్జాతీయ రచయితలుగా మారారు. వారిలో ఉత్తర కాకసస్ కి చెందిన రసూల్ గాంజతోవ్ (దాగెస్తాన్), చింగిజ్ అయిత్ మాతొవ్ (కిర్గిజ్ స్తాన్) లతో పాటు ఆర్మీనియాకి చెందిన కైసెన్ కులియెవ్ కూడా ఉన్నారు. కైసన్ కులియెవ్ ఒక బల్కార్ కవి. కరచాయే-బల్కార్ భాషలో కవిత్వం చెప్పాడు. 1944 లో స్టాలిన్ క్రూర విధానాలకు గురయ్యాడు. తన మాతృభూమినుంచి మధ్యాసియాకు నిర్బంధప్రవాసితుడయ్యాడు. కాని ప్రవాసంలో కూడా అతడు తన కవిత్వానికి పదునుపెడుతూనే ఉన్నాడు. ఆ కాలమంతటా బోరిస్ పాస్టర్నాక్ అతడికి నైతికమైన మద్దతుదారుడిగా నిలబడ్డాడు. 1956 లో ప్రవాసం నుంచి తిరిగి తన సొంతగడ్డకు చేరుకునేటప్పటికి,అతడు ఇరవయ్యవ శతాబ్దపు కకేషియన్ రచయితల్లో అగ్రగణ్యుడైపోయాడు.
దాదాపు రెండు వందల ఏళ్ళ ఈ సుదీర్ఘ సాహిత్య చరిత్రలో ఈ ఆర్మీనియన్ కథల్ని చూసినప్పుడు, ఇవి ఆర్మీనియన్లు తమ గురించి తాము ఎంతో నిర్మలంగా, నిజాయితీగా చెప్పుకున్న కథలుగా కనిపిస్తాయి. వాటివెనక సోవియెట్ శకం తాలూకు రొమాంటిసిజం కూడా ఎంతో కొంత ఉండక పోలేదు. కానీ ఇంతవరకూ కాకసస్ గురించి రష్యన్లు రాయడం వేరు, స్వయంగా ఆర్మీనియన్లే రాసుకోవడం వేరు అని మనకు తెలుస్తూనే ఉంటుంది.
5
ఇలా ఒక అత్యంత చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ఒక రచనను నా చేతుల్తో ఆవిష్కరించగలనని నేనెన్నడూ ఊహించలేదు. ఈ అవకాశాన్ని నాకు అయాచితంగా అందిచినందుకు అనిల్ కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే.
Featured image and other two images of Mount Ararat, Pc. pexels.com
29-3-2026
నమస్కారం వీరభద్రుడు గారూ.
ఈ వ్యాసం చదువుతుంటే ఆర్మేనియా పర్వతాల్లోకి వెళ్లొచ్చిన అనుభూతి కలిగింది. ఆర్మేనియా గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు ఇందులో తెలిశాయి. వెంటనే “కొండగాలీ కొత్త జీవితం” పుస్తకం ఆర్డర్ చేసుకుని చదవాలనిపిస్తోంది.
మీ రాతల ద్వారా ప్రపంచాన్ని చూడటం ఒక అందమైన అనుభూతి. అదే క్రమంలో కజకిస్తాన్, తజికిస్తాన్ లాంటి మధ్య ఆసియా దేశాల గురించి కూడా మీరు రాయాలని నా కోరిక. ప్రకృతి పరంగా ఎంతో అందమైన ఆ దేశాల చరిత్ర, సిల్క్ రూట్ కథలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. వాటి మీద మీరు వ్యాసాలు గానీ, ఒక ఉపన్యాస సిరీస్ గానీ మొదలుపెడితే మాలాంటి వాళ్లకు ఎంతో కొత్త చరిత్రను నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. దయచేసి దీని గురించి ఆలోచించగలరు.
చాలా సంతోషం సార్ మీకు ఈ వ్యాసం నచ్చినందుకు. ఆ దేశాల కవుల గురించి రాయాలి.
నమస్తే సర్. ఇన్నాళ్ళకి ఈ పుస్తక నేపథ్యాన్ని మీ విపుల వివరణ సమగ్రంగా ఆవిష్కరించిందని భావిస్తున్నాను. ఈ పుస్తకం నేను మొట్ట మొదటి సారి చదివిన రష్యన్ సాహిత్యం.ఇన్నాళ్లకు ఈ పుస్తకం లోతు పాతుల్ని తెలుసుకొనే అవకాశం కలిగింది. మీ వ్యాసం చదివాక ఈ కథలను మళ్ళీ చదవడం వాటి అంతరంగాన్ని స్వరూపంగా కనుగొనడం అవుతుంది. కృతజ్ఞతలు సర్.
ధన్యవాదాలు మేడం!