సద్గోష్ఠిసమానం

మధ్యాహ్నం మూడున్నర. దేవాలయాలముందు
పూలదుకాణాలు తెరిచే వేళ. ఇన్ని నీళ్ళు
చిలకరిస్తే చాలు మల్లెలు చందనమైపోతాయి.
ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టూ ఒక మధ్యాహ్నహారతి.

ఎక్కణ్ణుంచి ప్రవేశిస్తుంది మామిడిచెట్టులోకి
అంత పచ్చదనం? ఇప్పుడు ప్రతి ఒక్క పక్షీ,
పడవా అక్కడ కొంతసేపు ఆగుతాయి. ఫాల్గుణ
మాసపు ఏ చెట్టునీడైనా ఒక సద్గోష్ఠిసమానం.

ఏ పెళ్ళికో, పండక్కో చుట్టాలొచ్చినప్పటి ఇల్లు
లాగా గలగల్లాడే నీడ. మళ్ళా ఆ అతిథుల్లో
ఏ ఒక్కర్ని చూసినా ఎంత తీరిక! బహుశా
ఇలాంటప్పుడే వారు తమకి తాము దగ్గరయ్యేది.

16-3-2026

9 Replies to “సద్గోష్ఠిసమానం”

  1. మీరు నాలుగక్షరాలు చిలకరిస్తే చాలు, మా జ్ఞాపకాల పెట్టెలోని అనంతమైన సుందర దృశ్యాలు కళ్ళ ముందు మళ్ళీ కదలాడాలంటే.
    మీ కుంచె కొద్ది నిమిషాలు కాగితంపై కదిలితే చాలు, ప్రకృతికి పునఃసృష్టి జరగాలంటే.

    1. మీ దయామయ వాక్యాలకు హృదయపూర్వక నమస్సులు.

  2. “ఎఖ్ఖడనుండి ప్రవేశిస్తుంది మామిడి చెట్టు లోకి అంత పచ్చదనం?”
    “ఏ పెళ్ళికో, పండక్కో చట్టాలొచ్చినప్పటి ఇల్లు లాగా గలగల్లాడే నీడ .”
    ఎంత బాగున్నాయో ఈ పంక్తులు. ధన్యవాదాలు.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  3. ‘ఇప్పుడు ప్రతి ఒక్క చెట్టూ ఒక మధ్యాహ్నహారతి “❤️

    కాలాల మార్పులు గురించిన కవిత్వానికి మీకు మీరే సాటి..
    🙏

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%