
దక్షిణభాషా పుస్తక సంస్థ వారు గత శతాబ్దపు యాభైల్లో, అరవైల్లో నిరుపమానమైన సాహిత్య కృషి చేసారు. ప్లేటో నుంచి సొసెకి దాకా, జర్మనునుంచి బెంగాలీ దాకా ప్రపంచ సాహిత్యాలనుంచి ఎన్నో ఉద్గ్రంథాల్ని ఎంపికచేసి అనువదించి తెలుగులో ప్రచురించారు. ఆ రోజుల్లో వారు ప్లేటో సంభాషణలనుంచి ‘అపాలజీ’, ‘క్రీటో’ లను పిలకా గణపతిశాస్త్రి గారితో అనువాదం చేయించి తెలుగులో 5000 ప్రతులు ప్రచురించారు. ఇది అరవైలనాటి మాట. అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో అక్షరాస్యత 21 శాతం మాత్రమే. ఇప్పుడు, అంటే, 2011 లెక్కల ప్రకారం, అక్షరాస్యత 67 శాతానికి పెరిగింది. కానీ ఈ మధ్య నేను ప్లేటో సింపోజియాన్ని ‘ప్రేమగోష్ఠి’ పేరిట అనువదిస్తే ప్రచురణ కర్త 100 కాపీలు మాత్రమే ముద్రించడానికి సాహసించాడు!
‘జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం’ (1971) తెలుగులోకి తీసుకురావడం కన్నా ముందే ఆ సంస్థ ‘ప్రశస్త ఆధునిక జర్మన్ కథానికలు’ (1967) అనే పుస్తకం వెలువరించింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జర్మన్ కథకులు రాసిన కథలనుంచి ఎంచిన పదమూడు కథల అనువాదం అది. అందులో ఏడు కథలు పద్మరాజుగారూ, ఆరు కథలు కుటుంబరావుగారూ అనువాదం చేసారు.
నలభయ్యేళ్ళ కింద నేను కొనుక్కుని చదివి దాచుకున్న పుస్తకాల్లో అది కూడా ఒకటి. ఆ రోజుల్లోనే, అంటే అరవైల్లోనే,ఆ పుస్తకం 3500 ప్రతులు ప్రచురించారు, కాని ఇప్పుడు ఆ పుస్తకం ఆర్కైవులో కూడా లభ్యంగా లేదు. నన్ను వెన్నాడే కథల్లో ఆ పుస్తకంలో కథ కూడా ఒకటి ఉంది. అందుకని ఆ పుస్తకం కోసం తెలిసినవాళ్ళందరినీ అడిగాను. అనిల్ బత్తుల దగ్గర ఆ పుస్తకం ఉందిగానీ, ఆయన దాన్ని పునర్ముద్రించే పనిలో ఉన్నందువల్ల, ఆ పుస్తకం తన దగ్గర వెంటనే లభ్యంగా లేదని చెప్పడంతో ఇక ఆశ వదులుకున్నాను. కానీ ఈ లోపు బంగారు రామాచారికి ఎలా తెలిసిందో ఒక పిడిఎఫ్ నాకు పంపించారు. అట్ట సగం చిరిగిపోయిన ఆ పుస్తకం అలానే స్కాను చేసి ఉంది. కాని నా భాగ్యం, ఆ పుస్తకమే నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
‘దుక్కపిల్ల’ అదీ ఆ కథపేరు. Marie Luise Kaschnitz (1901-74). జర్మను రచయిత్రి. అదృష్టవశాత్తూ ఇప్పుడు ఆమె గురించి ఇంటర్నెట్టులో చాలా సమాచారం లభ్యమవుతూ ఉన్నది. ఆమె కథల సంపుటి Long Shadows (1995) కూడా దొరికింది. అందులో ఈ కథ The Fat Girl కూడా ఉంది. ఆ కథల్ని అనువదించిన Anni Whissen పుస్తకానికి రాసిన ముందుమాటలో ఈ కథ కాస్నిట్జ్ కి చాలా ఇష్టమయిన కథ అని చెప్పడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. అంతేకాదు, కాస్నిట్జ్ కథకురాలికన్నా కూడా కవిగా ఎక్కువ ప్రఖ్యాతి పొందిందనీ, రెండు సార్లు నోబెలు పురస్కారానికి నామినేటు అయ్యిందనీ కూడా తెలిసింది. ఇవేమీ తెలియని ఆ నా పసివయసులో నేనామె కథ చదివి విభ్రాంతికి గురయ్యానని నాకు కించిత్ గర్వంగా కూడా అనిపించింది.
ఏ కథ అందులో నన్ను వెంటాడింది? పేరు గుర్తులేదు, రచయిత పేరు ఎలానూ గుర్తుండదు. కాని ఒక సరస్సు, మంచు, ఎవరో స్కేటింగు చేస్తుంటారు, మంచుపొరల్లాగా ఏవో జ్ఞాపకాల పొరలుపొరలుగా ఉంటాయి, ఇలా ఏదో నీలమూ, ఆకుపచ్చా కలగలసిన ఒక మరకగా ఆ కథ నాకు గుర్తుండిపోయింది. ఆతృతగా పుస్తకం ముందుకీ వెనక్కీ స్క్రోలు చేస్తూ ఉన్నాను. కానీ మొత్తం కథలన్నీ మరోసారి చదవనక్కర్లేకుండానే ఆ కథ దొరికింది.
ఈ కథ గురించి ఏమి చెప్పినా మీరు పాఠకులుగా ఈ కథ చదివి మీకై మీరు చేరుకోవలసిన అనుభూతికి నేను అడ్డంపడినట్టు అవుతుంది. అందుకని ఈ కథకీ, మీకూ మధ్య అడ్డుతప్పుకుంటున్నాను.
దుక్కపిల్ల
జర్మన్ మూలం: మేరీ లూసీ కాషింట్జ్
తెలుగు అనువాదం: కొడవటిగంటి కుటుంబరావు
క్రిస్మస్ శలవులయిపోయిన కొద్దిరోజులకు, జనవరి ఆఖరున ఆ దుక్కపిల్ల నా దగ్గిరికి వచ్చింది. ఆ శీతాకాలం నేను ఇరుగుపొరుగుల ఉండే పిల్లలకు పుస్తకాలు అరువివ్వ నారంభించాను. వాళ్ళు పుస్తకాలు తీసుకుపోయి మళ్ళీ తిరిగి ఇవ్వడానికి వారంలో ఒకరోజు ఏర్పాటు చేశాను. పిల్లలందరూ నాకు తెలిసిన వాళ్ళే అనుకోండి, కాని ఒక్కొక్కప్పుడు మా వీధికి చెందని కొత్త కొత్త పిల్లలుకూడా వచ్చేవారు. చాలామంది పుస్తకాలిచ్చి కొత్తవి తీసుకుని వెంటనే వెళ్ళిపోయేవారు, మరికొందరు అక్కడే కూర్చుని చదవడం మొదలుపెట్టేవారు.
అప్పుడు నేను డెస్కుదగ్గిర కూచుని పని చూసుకునేదాన్ని. వాళ్ళు గోడబీరువాల పక్కన ఉండే చిన్న బల్లవద్ద కూర్చునేవాళ్ళు. వాళ్ళు నా పనికి ఏమీ భంగం కలిగించేవారు కారు, నాకు సరదాగా కూడా వుండేది.
ఈ దుక్కపిల్ల శుక్రవారంనాడో, శనివారంనాడో వచ్చింది. అది పుస్తకాలిచ్చే రోజుమటుకు కాదు. నేను బయటికి పోదామని నిర్ణయించుకుని, నేను సిద్ధం చేసుకున్న అల్పాహారం తీసుకుని గదిలోకి వచ్చాను. అంతకు ముందే ఎవరో వచ్చి వెళ్ళారు, వాళ్ళు బయటివాకిరి మూయడం మరిచి ఉండాలి. అందుచేతనే ఆ దుక్కపిల్ల నా ఎదట అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. నేను నా ఫలహారం పళ్ళెం డెస్కు మీద పెట్టి, వంటింటినుంచి ఇంకేదో తీసుకురావడానికి వెనక్కు తిరిగి ఆ పిల్లను చూశాను. ఆ పిల్లకు సుమారు వన్నెండేళ్ళుండవచ్చు. పాతకాలపు పూలు కోటూ, అల్లిన నల్లని కాలితొడుగులూ ధరించింది, తాడు కట్టిన స్కేట్లు రెండు పట్టుకుని ఉన్నది. ఆమె నాకు తెలిసినట్టుండి కూడా తెలియరాలేదు. ఆమె చడీ చప్పుడూ కాకుండా వచ్చి నన్ను భయపెట్టింది.
నేను నిన్నెరుగుదునా? అని ఆశ్చర్యంగా అడిగాను.
దుక్కపిల్ల జవాబు చెప్పలేదు. చేతులు కలిపి బొజ్జమీద పెట్టుకుని, నీటి బాగా స్వచ్ఛంగా ఉన్న కళ్ళతో చూస్తూ నిలబడింది.
పుస్తకమేమన్నా కావాలా? అని అడిగాను.
దుక్కపిల్ల ఈసారికూడా జవాబు చెప్పలేదు. నాకేమంత ఆశ్చర్యంకూడా కలగలేదు. పిల్లలు సిగ్గుపడడమూ, వాళ్ళకు నేను సహాయపడడమూ నాకు అలవాటే. కనక కొన్ని పుస్తకాలు తెచ్చి ఆ పిల్లముందు పెట్టి, పుస్తకాలిచ్చేటప్పుడు నించే కార్డుమీద రాయడానికి ఉపక్రమించాను.
నీ పేరేమిటి ? అని అడిగాను.
దుక్కగుంట అని పిలుస్తారు, అన్నదా పిల్ల.
నన్నుకూడా అలాగే పిలవమంటావా? అని అడిగాను.
ఆ పిల్ల నాతోబాటు చిరునవ్వు నవ్వక, తనకు ఎలాగైనా ఒకటేనన్నది. ఆ క్షణంలో ఆమె ముఖాన ఏదో వేదన కనబడినట్టు జ్ఞాపకం. కాని నేనప్పుడు పట్టించుకోలేదు.
ఎప్పుడు పుట్టావు? అని ఇంకా ప్రశ్నించాను.
కుంభరాశిలో, అన్నదా పిల్ల తొణకకుండా.
ఆ సమాధానం వింటే నాకు నవ్వొచ్చి, వేళాకోళానికామాట కార్డులో కెక్కించాను. ఆ తరవాత పుస్తకాలకు వచ్చాను.
నీకు ప్రత్యేకించి కావలసినదేమన్నా ఉందా ? అని అడిగాను.
కాని ఆ పిల్ల పుస్తకాలకేసి చూడడంలేదు. ఆమెకళ్ళు నా టీ, శాండ్విచ్ లూ ఉన్న పళ్ళెంమీద ఉండడం నా కంటపడింది.
తినడానికేమన్నా కావాలా ఏమిటి? అని చప్పున అడిగాను.
ఆమె తల ఆడించింది. ఈ సంగతి నాకు ముందే తట్టనందుకు బాధతో కూడిన ఆశ్చర్యంలాటి భావం ఒకటి ఆమె ముధాన కనబడింది. ఆమె శాండ్విచ్ లు ఒక్కొక్కటే తినసాగింది. ఆమె తినే వైనం నాకు తరవాతగాని అర్థం కాలేదు. ఆ తరవాత ఆమె అలాగే కూర్చుని, అలుపుతోనూ, నిర్లిప్తతతోనూ కూడిన చూపులతో గది చుట్టూ కలయజూసింది. ఆమెను చూస్తుంటే ఎందుకో నాకు చిరాకూ, విముఖత్వమూ కలిగింది. మొదటినుంచీ ఆ పిల్లపట్ల నాకు ద్వేషం ఏర్పడిన మాట నిజం ఆ పిల్లలో కనిపించే చురుకులేనిదనమూ, కొవ్విన, కుదురైన ముఖమూ, నిద్రమత్తుగానూ, ఒళ్లు బరువుగానూ మాట్లాడే తీరూ — ప్రతిదీ నాకు ఏవగింపుగానే ఉన్నది. ఆమె మూలాన బయటికి వెళ్ళే ఆలోచన మానుకున్నప్పటికీ, ఆమె అంటే నాలో కొంచెంకూడా స్నేహభావం కలగక క్రూరంగానూ, ఉత్సాహరహితంగానూ ఉండిపోయాను.
డెస్కు దగ్గిర కూర్చుని, పనికి ఉపక్రమించుతూ ఆ పిల్లకు చదవాలని ఎంతమాత్రమూ లేదని తెలిసికూడా, ఊఁ చదువు. అనడంలో స్నేహభావం ఏముంటుంది గనక ? నేనలా కూర్చుని రాసుకుందామనుకున్నాను, లేకపోతే ఇంకేదైనా చేద్దామనుకున్నాను. ఏమంటే, ఏదో ఊహించాలనీ ఊహించగలిగితేగాని ప్రాణం కుదటబడదనీ అనిపించేటప్పుడు ఆ ఊహ తట్టకపోతే కలిగే మానసికాందోళనలాటిది నన్నావహించింది. ఈ ఆందోళనను కొద్దిసేపు భరించాను.
ఆ తరవాత నావల్ల కాక వెనక్కు తిరిగి అతికీఅతకని ప్రశ్నలతో సంభాషణ సాగించాను,
నీ కెవరన్నా అన్నదమ్ములూ, అప్పచెల్లెళ్ళూ ఉన్నారా ? అని అడిగాను.
ఉన్నారు, అన్నదా పిల్ల.
నీకు బడంటే ఇష్టమేనా ? అని అడిగాను.
ఇష్టమే అన్నదా పిల్ల.
నీ కెక్కువ ఏమిటిష్టం ?
అంటే ? అని ఆ పిల్ల అడిగింది.
ఏ విషయం ? అన్నాను నిస్సహాయంగా,
నాకు తెలీదు అన్నదా పిల్ల.
జర్మను భాష ఇష్టమేమో? అని అడిగాను.
నాకు తెలీదు అన్నదా పిల్ల.
పెన్సిలు వేళ్ళసందున వుంచి తిప్పాను. నాకు భయంలాటి దేదో పుట్టుకు రాసాగింది. దానికీ ఆ పిల్ల ఆకారానికీ ఎలాటి సంబంధమూ లేదు.
నేను వణికిపోతూ, నీ కెవరైనా స్నేహితురాళ్ళున్నారా? అని అడిగాను.
లేకేం? ఉన్నారు, అన్నదా పిల్ల.
నీకు మరీ ఇష్టమైనవాళ్ళుండాలి కాదూ? అని అడిగాను.
ఏమో, అన్నదా పిల్ల. ఆమె ఆ ముతక పూలుకోటు వేసుకుని అలా కూచుని ఉంటే బలిసిన గొంగళిపురుగులాగా కనబడింది. తినడంకూడా గొంగళి పురుగులాగే తిన్నది, ఇప్పుడు దారి తడువుకుంటున్న గొంగళిపురుగులాగున్నది.
పగసాధించాలన్న వింతకోరిక లోపల ఉండి, నీ కింక తిండి పెట్టేది లేదు, అని లోపల అనుకున్నాను. అయినప్పటికీ లేచి వెళ్ళి రొట్టే సానేజి మాంసమూ తెచ్చి పెట్టాను. ఆ పిల్ల వాటికేసి నిర్వికారంగా తేరిపారజూని గొంగళిపురుగు తిన్నట్టుగా, నింపాదిగానూ, విడవకుండానూ లోపలినుంచి ఏదో తినమని ప్రేరేపిస్తున్నట్టుగా తినసాగింది. నే నా పిల్లను శత్రుభావంతో మౌనంగా గమనించాను.
నేనిప్పుడేస్థితికి వచ్చానంటే, ఆ పిల్లంటే నాకు అన్నివిధాలా ఆందోళనా, చిరాకూ పుట్టుకొస్తున్నది. ఆ తెల్లదుస్తులేమిటి ఆ ఎత్తుకాలరేమిటి అసహ్యంగా, అనుకున్నాను. ఆ పిల్ల తినడం ముగించి కోటు గుండీలు పెట్టుకుంటూంటే, నేను మళ్ళీ కూర్చుని పని చూడసాగాను, కాని అంతలో ఆ పిల్ల నా వెనకనుంచి పెదిమలతో చప్పుడు చేసింది. ఎక్కడో అడవిమధ్య ఉండే బురదనీటి గుంటలో బుడగ బద్దలైతే వచ్చే చప్పుడులాగుందా చప్పుడు. అందులో నాకు మానవస్వభావంలో గల నీరసమూ, మందకొడితనమూ, భారమూ, నైరాశ్యమూ స్ఫురించి నన్ను చాలా కుంగదీసింది. నాతో నీకేం పని? వెళ్ళిపో, వెళ్ళిపో, అనుకున్నాను. నా చేతులతోనే ఆ పిల్లను గదిలోనుంచి అవతలికి గెంటెయ్యాలనిపించింది, ఏదో స్తబ్ధుమృగాన్ని తోసేసినట్టు. కాని నే నామెను గదిలోనుంచి బయటికి గెంటటానికి మారుగా, ఆమెతో, వెనకటిలాగే దయారహితంగా సంభాషణ పెట్టుకున్నాను.
మంచుమీదికి పోతున్నావా ? అని అడిగాను.
అవును, అన్నది దుక్కపిల్ల,
నీకు స్కేటింగ్ బాగా వచ్చునా ? అని అడుగుతూ, ఆమె చేతినుంచి ఇంకా వేళ్ళాడుతున్న స్కేట్లకేసి చూపించాను.
మా అక్కకు బాగా వచ్చు, అన్నదా పిల్ల. మళ్ళీ ఆమె ముఖంలో బాధా, విచారమూ కనిపించాయి. ఈసారికూడా నేను పట్టించుకోలేదు.
మీ అక్క ఎలా ఉంటుంది? నీలాగే వుంటుందా ? అని అడిగాను.
లేదు, లేదు. మా అక్క చాలా సన్నగా వుంటుంది, అక్క జుట్టు నల్లగా, నొక్కులు నొక్కులుగా ఉంటుంది. వేసంకాలం మేము పల్లెపట్టుకు పోయినప్పుడు రాత్రివేళ గాలివానవస్తే అక్క లేచి వెళ్ళి, పైఅంతస్థు బాల్కనీలో కూర్చుని పాడుతుంది, అన్నదా పిల్ల.
మరి నువో ? అని అడిగాను.
నేను పక్క వదలను. నాకు భయం, అన్నదా పిల్ల.
మీ అక్కకు భయం లేదు, కాదూ? అని అడిగాను.
లేదు. అక్క ఎన్నడూ భయపడదు. అన్నిటి కన్నా ఎత్తుగా ఉండే స్ప్రింగ్ బోర్డు మీదినుంచి నీటిలోకి దూకేస్తుంది. తలకిందులుగా దూకి, చాలా దూరం ఈదుకుంటూ పోతుంది..
మీ అక్క ఏం పాడుతుంది? అని అడిగాను ఉబలాటంగా.
తన యిష్టం వచ్చినది పాడుతుంది. పాటలు కడుతుంది, అన్నదా పిల్ల విచారంగా.
మరి నువో ? అని అడిగాను.
నే నేమీ చెయ్యను, అన్నదా పిల్ల. తరువాత లేచి నిలబడి, నేనిక వెళ్లాలి, అన్నది. నేను చెయ్యి చాచాను. దుక్కల్లాంటి వేళ్ళు నా చేతిలో పెట్టింది. నాలో ఏం పుట్టిందో సరిగా చెప్పలేను ఆమెను వెంబడించాలనిపించింది. ఆ ప్రేరణ మౌనంగాచేసిన బలమైన పిలుపు. మళ్ళీ ఎప్పుడైనా రా, అన్నాను. మనస్ఫూర్తిగా అన్నమాట కాదు. ఆ పిల్ల ఏమీ అనక ప్రశాంతమైన కళ్ళతో నాకేసి చూసింది. తరవాత ఆమె వెళ్ళిపోయింది. నాకు న్యాయంగా బరువుదిగినట్టయి ఉండవలిసింది. కాని బయటి తలుపు మూసిన చప్పుడయిందో లేదో, నేను చప్పున నడవలోకి పరిగెత్తి, కోటు వేసుకున్నాను. గబగబా మెట్టు దిగి నేను వీధిలోకి వచ్చేసరికి ఆ పిల్ల మలుపు తిరగడం కనిపించింది.
‘ఈ గొంగళిపురుగు స్కేటింగు చేస్తుంటే చూడాలి. ఈ బలిసిన బొండాం మంచుమీద ఎలా కదులుతుందో గమనించాలి, అనుకుని, ఆ పిల్లను చూపు మేరలో ఉంచడానికని చురుకుగా నడవసాగాను.
ఆ పిల్ల నా గదిలోకి వచ్చినప్పుడు అపరాహ్ణమై ఎంతోసేపు కాలేదు, ఇప్పుడు చీకటి పడబోతున్నది. నేనా నగరంలో కొన్నిసంవత్సరాలున్నప్పటికీ, ఇప్పుడు నాకు దారి సరిగా తెలీదు. నేనా పిల్లను వెంబడించే దృష్టితో ఉండడంలో మేమే ప్రాంతంలో ఉన్నదీ కూడా తెలియకుండాపోయింది. నాకు అన్ని వీథులూ, చౌకులూ కొత్తగా కనపడసాగాయి. అకస్మాత్తుగా వాతావరణమంతా మారినట్టు నాకు అనిపించింది. ఎంతో చలి అనిపిస్తూ ఉండినది కాస్తా, మంచు కరిగే స్థితిగా మారినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉన్నదంటే, చెట్లమీదినుంచీ, ఇళ్ళకప్పుల మీదినుంచీ మంచు కరిగి కారనారంభించింది. ఆకాశాన వడమబ్బులు తిరుగుతున్నాయి. మేము నగరం శివార్లకు వచ్చేశాం: అక్కడ ప్రతి ఇంటిచుట్టూ పెద్ద పెద్ద తోటలున్నాయి. చివరకు ఇళ్ళు అయిపోయాక ఆ పిల్ల చప్పున పల్లంలోకి పరుగెత్తి కనబడకుండాపోయింది. అక్కడికి వెళ్ళిచూస్తే స్కేటింగు చేసే స్థలమూ దీపాలతో వెలిగి పోయే కొట్లూ, ఆర్క్ లైట్లూ, మిలమిలా మెరిసే స్కేటింగు రంగంలో సంగీతమూ, సందడీ ఉంటాయనుకున్నాను, కాని నేను చూసిన దృశ్యం అది కానేకాదు.ఆ పల్లంలో వున్నది సరస్సు. దాని చుట్టూ ఈసరికి ఇళ్ళు లేచి ఉంటాయనుకున్నాను: కాని అది నిర్జనంగా ఉన్నది. నా చిన్నతనంలోలాగే ఉన్నది, దాని చుట్టూ నల్లని చెట్ల గుంపులున్నాయి.
తలవని తలంపుగా ఇలాటి దృశ్యం కళ్ళబడడంతో నే నా పిల్లజాడ పోగొట్టుకున్నంత పని చేశాను. కాని నాకామె సరస్సు ప్రక్కన చతికిలబడి కూర్చుని కనబడింది; కాలిమీద కాలువేసుకోవడానికీ, ఒక చేత్తో స్కేటు పాదానికి ఆనించి పట్టుకుని, రెండోచేత్తో శీల బిగించడానికీ యత్నిస్తున్నది. ఒకటి రెండు సార్లు శీల పడిపోయింది. దానికోసం వెతుకుతూ ఆమె మంచుమీద పాకుతుంటే ఏదో వింతరకం గోదురుకప్పలాగా కనబడింది అంతకంతకూ చీకటి ముదురుతున్నది. సరస్సులోకి చొచ్చుకుపోయిన రేవుగట్టు ఆ పిల్లకు కొద్ది గజాల దూరంలోనే వున్నది. సరస్సు పైభాగం వెండిలాగా తెల్లగా మెరుస్తుంటే ఈ గట్టు చీకటి నలుపులో కనబడింది. సరస్సు పైభాగమైనా అంతటా ఒకేరకంగా మెరవక, అక్కడక్కడా నల్లనికరలు కనిపిస్తున్నాయి. మంచు కరగడం సాగుతున్నట్టు ఈ కరలే గుర్తు. వేగిరం, అని తొందరపడుతూ కేక పెట్టాను. ఆ పిల్లకూడా త్వరగా కదిలింది; అయితే నేను తొందర పెట్టడంవల్ల కాదు, దూరాన ఎవరో రావే, దుక్కగుంటా, అని కేక పెట్టడంచేత. అలా కేక పెట్టిన ఆకారం కాంతిమంతంగా ఉండి, మంచుమీద వలయాలుచుట్టుతూ తిరుగుతున్నది. నృత్యాలు చేసి, గాలివానల్లో పాటలుపాడే ‘అక్క’ ఈ మనిషే అయి వుంటుందని నాకు తట్టింది. ఈమె నాకు నచ్చిన పిల్ల. ఆ సమయంలో నే నక్కడికి వచ్చినది ఈ నాజూకైన పిల్లను చూడడానికేనని ఆ క్షణంలో నేను నమ్మాను కూడా. అయితే, ఆ ఇద్దరుపిల్లలూ ఎలాటి ప్రమాదస్థితిలోవున్నదీ నేను గుర్తించకపోలేదు. ఎందుకంటే, అదే సమయంలో ఆకస్మికంగా ఒక విధమైన మూలుగూ నిట్టూర్పూలాటి ధ్వనులు-సరస్సుమీద పేరుకున్న మంచు విచ్చేటప్పుడయే ధ్వనులు – ఆరంభమయాయి. నిట్టూర్పులు దయ్యపు దుఃఖంలాగున్నాయి. అవి నాకు వినిపిం చాయి గాని, ఆ పిల్లలకు వినిపించలేదు.
వాళ్ళా ధ్వనులు వినలేదనడానికి సందేహంలేదు. ఎందుచేతనంటే, అసలే పిరికిదైన ఆ దుక్కపిల్ల వాటిని వింటే మంచుమీదికి బయలుదేరకపోను, కదలలేకుండా కదులుతూ ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నించకపోను; ఆమె అక్కకూడా దూరంనుంచి నవ్వుతూ, చెయ్యి ఊపి, స్కేట్ల మొనలమీద నిలిచి బొంగరంలాగా చక్కర్లు కొట్టకపోను, తరవాత ఎనిమిది అంకె ఆకారంలో అందంగా చుట్టకపోను. దుక్క పిల్ల నల్లటి ప్రదేశాలమీదుగా న్కేట్ చేస్తూ వెళ్ళి, వాటిని చూసి దడుచుకున్నది. ఆమె అక్క చప్పున తిరగడం మానేసి, దూరంగా, మంచుమీద జారుతూ వెళ్ళిపోయింది.
నేను రేవుగట్టు వెంబడి ఒక్కొక్క అడుగే వేసుకుంటూ ముందుకు సాగడంచేత నాకు అంతా స్పష్టంగా కనిపించింది. కొయ్యపలకల మీద మంచు పేరుకుని ఉన్నప్పటికీ, దిగువన దుక్కపిల్ల కదిలినదానికన్న నేనే హెచ్చువేగంతో కదిలాను. నేను వెనక్కుతిరిగి చూసినప్పుడా పిల్లముఖం కనిపించింది; అది నిర్వికారంగా కనిపించినప్పటికీ అందులో గాఢమైన ఆకాంక్ష ఉండనేఉన్నది. అంతటా మంచు నెర్రెలు వచ్చి ఆ నెర్రెలకుండా నురుగు, వెర్రివాడి నోటినుంచి వెలువడి నట్టుగా, పైకిరావడం చూశాను. అప్పుడే ఆ దుక్కపిల్ల కాళ్ళకింది మంచు విరిగి పోవడంకూడా నాకు కనబడింది. ఇది జరిగినచోటు రేవుగట్టుకు కొద్దిబారల దూరంలోనే ఉన్నది, అక్కడే ఈ పిల్ల అక్క మంచునృత్యాలు చేస్తూవుండింది కూడానూ.
నిజానికి ఆ పిల్ల మంచుకుండా నీటిలో పడిపోవడంలో ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేదని చెప్పాలి.
సరస్సు కరుడుకట్టేటప్పుడు పొరలు పొరలుగా మంచు ఏర్పడుతుంది. పైపొరకు మూడడుగుల దిగువనున్న పొర దృఢంగానే ఉన్నది. అందుచేత ఆ దుక్కపిల్ల మూడడుగులలోతు నీటిలో దిగబడింది. ఆ పిల్ల ఉన్నది మంచునీటిలోనన్నమాటా, ఆమెకు అన్ని వేపులా మంచుగడ్డలు విచ్చుతున్న మాటా యథార్థమే, కాని ఆమె కొద్ది అడుగులు నీటిలో నడుస్తూ వస్తే రేవుగట్టు చేరుకుని, పైకి రావచ్చు, నేను సహాయం చెయ్యగలుగుతాను. కాని ఆమె ఆ మాత్రం ప్రయత్నంకూడా చెయ్యలేదని నాకు అకస్మాత్తుగా తోచింది. ఆమె భయంతో చచ్చిపోతూ, అలాగే నిలబడిపోయి, వ్యర్థంగా తడువులాడుకున్నది గాని, గట్టును సమీపించే ప్రయత్నం ఏమీ చెయ్యనుకూడా లేదు. ఆమెచుట్టూ నీరు సుడులు తిరుగుతున్నది, మంచు విరిగిపోతున్నది. కుంభరాశి అధిదేవత ఆమెను దిగువకు ఈడ్చేస్తున్నాడు. అయితే నాలో చలనం లేదు, పిసరంత జాలి కలగలేదు. నిశ్చలంగా వుండిపోయాను.
కాని అంతలోనే దుక్కపిల్ల చప్పున తల ఎత్తింది. ఇప్పటికి రాత్రి అయి, మబ్బులమాటునుండి చంద్రుడు పైకివచ్చి పుండడాన ఆ పిల్లముఖంలో ఏదో మార్పు వచ్చినట్టు నేను చూడగలిగాను. ముఖలక్షణాలు పూర్వంలాగే ఉన్నట్టుండికూడా మార్పుచెందాయి. మృత్యుముఖంలో ఉండి, జీవితసౌరభాన్నంతనూ ఆస్వాదించిన విధంగా, ఆమె ముఖం సత్త్వంతో కూడిన ఉద్రేకంతో విప్పారింది. అవే ఆఖరుక్షణాలనీ, మృత్యువు సమీపంలోనే ఉన్నదనీ నే ననుకున్నమాట నిజమే. నేను అలవ కమ్మీలమీదికి వంగి దిగువనవున్న పాలిపోయిన ముఖంలోకి చూశాను. అది నల్లని నీటిలోని ప్రతిబింబంలాగా కనబడింది. అయితే ఇప్పుడా పిల్ల రేపుగట్టును సమీపించింది. చేతులుచాచి, చెక్కకూర్పులో అమర్చిన శీలలనూ, కొక్కాలను పట్టుకుని పైకి లేవడానికి చురుకుగా ప్రయత్నించింది.
అయితే ఆమె శరీరం మరీ బరువైపోయింది. చేతులు కోసుకుపోయి రక్తం చిమ్మాయి. ఆమె వెనక్కు పడిపోయి, మళ్లొ ప్రయత్నం ప్రారంభించింది. నేనా దీర్ఘమైన పోరాటాన్ని కళ్ళారా చూశాను. గుడ్డును పగలదీసుకొనీ, పిసినికాయను చీలదీసుకునీ బయటికి రావడంలాగా, విముక్తికోసం చేసే భయంకర సంఘర్షణ లాటిదది. ఇప్పుడు నే నామెకు సహాయం చెయ్యగల స్థితిలో వున్నాను. కాని ఆమెకు నా సహాయం అవసరం లేదని నాకు తెలిసిపోయింది: నే నామెను పోల్చుకున్నాను.
ఆ సాయంకాలం నేనింటికి తిరిగి రావడం నాకు జ్ఞాపకంలేదు. నాకు జ్ఞాపకం ఉన్నదల్లా మెట్లమీద పక్కనుండే ఆవిడ ఎదురైతే, సరస్సుచుట్టూ ఇంకా కొన్ని పొలాలూ చీకటిచెట్లతోపులూ ఉన్నాయనడమూ, ఆమె, లేదు, ఏమీ లేవు అనడమునూ, ఆ తరవాత నేను నా డెస్కుమీది కాగితాలు చిందర వందరగా ఉండడం గమనించాను. వాటిమధ్య ఒక పాత ఫొటో, నాదే, ఉన్నది. అందులో నేను ఎత్తుకాలరుగల తెల్లని వూలుకోటు తొడుక్కున్నాను, చాలా లావుగా ఉన్నాను. నా కళ్లు స్వచ్ఛంగానూ, తడిగానూ ఉన్నాయి.
Featured image: Photography by Matt Barnard via pexels.com
30-11-2025
చాలా గొప్ప కథ సార్…
శ్రీ బంగారి రామాచారి గారు చేసే సాహిత్యసేవ కూడా గొప్పదే….
ఎక్కడా లభ్యం కానీ అరుదైన పుస్తకాలు కూడా తన దగ్గర ఉంటాయి.
మాకందించినందుకు మీకూ వారికీ కృతజ్ఞతలు 🙏🌹❤️
హృదయపూర్వక ధన్యవాదాలు సార్
ప్రతిపోస్ట్ ఓ మణిదీపం
జైగురుదత్త. ప్రతి పోస్టు ఒక ప్రత్యేక స్థాయిలో నిర్వహించాలని చేసి వారి సంఖ్యలో వో మణిదీపం