
సికిందరాబాదులోని పురాతనమైన, చారిత్రాత్మక ‘సెయిలింగ్ అనెక్సి’ ప్రాంగణంలో అడుగుపెట్టాను. ముందురోజు రాత్రిదాకా మూడు రోజులపాటు నగరాన్ని కప్పేసిన ముసురు జాడలేదు. వాన వెలిసిన మర్నాటి నిస్తబ్ధత గాల్లో పరుచుకుని ఉంది. హుస్సేన్ సాగర్ ని కూడా ఆ సోమరితనం ఆవహించి ఉంది. సికిందరాబాదు క్లబ్బు ఆవరణలో సరసుపక్కనే విస్తరించి ఉన్న పురాతన వటవృక్షం ఇంకా నిద్రలేవనే లేదు.
ఇటువంటి ప్రాంగణంలో కదా ఒక ప్రభాతరాగాన్ని వినవలసింది అని అనుకున్నాను. సెయిలింగ్ అనెక్సి మొదటి అంతస్తులో సుర్ మండల్ సంస్థవారు, సికిందరాబాదు క్లబ్బు సంయుక్తంగా ఏర్పాటు చేసిన morning Raga concert వినడానికి మనసు అప్పటికే సంసిద్ధమైపోయింది.
సుప్రసిద్ధ హిందుస్తానీ గాయకులు గుండేచా సోదరుల ద్రుపద్ కచేరీ ఉందని ప్రసిద్ధ చిత్రకారులు, మిత్రులు హేమనళిని చెప్పగానే తప్పకుండా వెళ్ళాలనుకున్నాను. అలాగని నాకు హిందుస్తానీ సంగీతం గురించి ఏమీ తెలుసని కాదు. ఆ రాగాల్నీ, ఆ రాగలక్షణాల్నీ, ఆ స్వరప్రస్తారాన్నీ గుర్తుపట్టగలననికాదు. కానీ, గొప్ప సంగీతం విన్నప్పుడు మనిషి మనసులో ఏమి జరుగుతుందో అది నాలో సంభవిస్తూ ఉండటం నాకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అందులోనూ హిందూస్తానీ సంగీతానికీ, కాలగమనానికీ మధ్య ఉన్న అనుసంధానం నాకు పదేపదే అనుభవంలోకి వస్తూ ఉంటుంది. హిందుస్తానీ సంగీతానికి ఋతువులున్నాయి, వేళలున్నాయి, జామునుంచి జాముకి రోజు తిరిగేటప్పటి సంధికాలాల వెలుగునీడల్ని హిందుస్తానీ రాగాలూ, స్వరాలూ అద్భుతంగా పట్టుకుంటాయి. కాబట్టి గొప్ప హిందుస్తానీ గాయకుల్నీ, వాద్యకారుల్నీ వింటున్నప్పుడు నాకు పరిభ్రమిస్తున్న ఋతువుల మధ్య నిలుచున్నట్టు ఉంటుంది. ప్రభాతం నుంచి విభాతందాకా, తిరిగి మళ్ళా రాత్రి తెల్లవారేదాకా, జాముజాముకీ వంపు తిరిగే కాలరేఖ నా చెవులకి వినబడుతూ ఉంటుంది.
అందుకనే ప్రభాతకచేరీ అనగానే తప్పనిసరిగా వెళ్ళాలనుకున్నాను. సాధారణంగా సంగీత కచేరీలు పొద్దుటిపూట ఏర్పాటు చెయ్యరు. సాధారణంగా సాయంకాలాల్లోనో లేదా రాత్రుళ్ళో నడిచే ఆ కచేరీల్లో ఆ వేళలకు చెందని రాగాల్ని ఆలపించడం ఎంతవరకూ సమంజసం అని ఇప్పటికీ కొందరు ప్రశ్నిస్తూనే ఉంటారు. మారుతున్న జీవనగమనంలో, పూర్తినగరీకరణ చెందిన మానవసమాజంలో పూర్వకాలపు రాగలక్షణాల్ని కొనసాగించడం కష్టమని వాదించేవాళ్ళూ ఉన్నారు. కాని, హిందుస్తానీ సంగీత స్వరాలకు ఈ సంగతి తెలియదు. అవి ముంబైలోనైనా, కొత్తఢిల్లీలోనైనా, లేదా ఏదేనా ఒక గ్రామంలోని వేడుకలోనైనా, ఒక బారోమీటరులాగా, థర్మామీటరులాగా, ఆ వేళల వాతావరణస్వరూపాన్ని తమలోకి ఇంకించుకోకుండా ఉండలేవు. బహుశా ఒకమాట చెప్పవచ్చు: మారినకాలంలో కూడా రాగాలు ప్రభాతరాగాలుగా, రాత్రి రాగాలుగా, అపరాహ్ణరాగాలుగా కొనసాగుతూనే ఉంటాయి, కాని సాయంకాలం పూట ఒక ప్రభాతరాగం ఆలపిస్తున్నప్పుడు ఆ గాయకుడు ఆ రాత్రిపూటనే సూర్యోదయాన్ని పునఃసృష్టిస్తున్నాడనుకోవాలి అని.
అందుకని హుసేన్ సాగర్ ఒడ్డున, ఆ మర్రిచెట్టు పక్కన గుండేచా సోదరుల ప్రభాతసంగీత సమారోహం నాబోటి శ్రోతకు అరుదైన అవకాశం అనే చెప్పాలి. పండిత్ ఉమాకాంత్ గుండేచా, అనంత్ గుండేచా కలిపి ఆలపించిన ద్రుపద్ గానం. వారు నిన్నటి ప్రభాతానికి తగ్గట్టుగా భైరవ్ రాగంలో తమ ఆలాపన మొదలుపెట్టారు. నిజానికి భైరవ్ ప్రథమ ప్రహార రాగం. అంటే తొమ్మిదిన్నరకి కచేరీ మొదలుపెట్టేటప్పటికే ఆ జాము దాటిపోయింది. కాని నగరమూ, సరసూ, చెట్టూ, పిట్టలూ కూడా ఇంక నిద్రపోతూనే ఉన్నాయికాబట్టి, ఆ రాగానికి వేళమించిపోలేదనే చెప్పాలి.
నేను ఆ హాల్లో కొద్దిగా వెనక్కీ కూచున్నాను. అంటే తలుపు దగ్గర. ఆ తలుపు గాజు అద్దాల్లోంచీ, పక్కన కిటికీలోంచీ, తెల్లని లేసుతెరల మధ్యనుంచి చెట్టూ, చెరువూ కనిపించేట్టుగా కూచున్నాను. ఆ గాయకులది ధీరగంభీర స్వరం. దేవాలయాల్లో పాడవలసిన కంఠాలవి. వారు తమ ఆలాపన మొదలుపెట్టగానే నా ఎదట ఉన్న ప్రకృతిలో నెమ్మదిగా ఒక కదలిక మొదలైనట్టు తోచింది. ఆలాపన మధ్యకు చేరుకునేటప్పటికి ఒక పువ్వులాగా ఎండ విరిసింది. లోకమంతటిమీదా వెలుగు కురవడం మొదలుపెట్టింది.
గుండేచా బ్రదర్స్ గానం వింటున్నంతసేపూ నా మనసులో ఒక ఊహ నడుస్తూనే ఉంది. సాధారణంగా మనం జరుపుకునే పండగలన్నీ ఋతుపరివర్తనానికి చెందిన పండగలే. అలాంటి పండగలు ఒక్కొక్కటీ వచ్చినప్పుడు మనమేం చేస్తాం? వినాయక చవితినే తీసుకోండి. మనం ఇంత మట్టితీసి బొమ్మగా మలిచి ఒక తామరాకుమీద కూచోబెడతాం. ఇంత గరికా, ఇన్ని పూలూ చేతుల్లోకి తీసుకుని ఆ బొమ్మని మనసారా అలంకరిస్తాం. పాటలు పాడతాం. పద్యాలు చదువుతాం. కథలు చెప్పుకుంటాం. తొమ్మిది రోజులుకాగానే ఆ మట్టిబొమ్మని నలుగురం కలిసి ఊరేగింపుగా తీసుకుపోయి నదిలో నిమజ్జనం చేసేస్తాం. మళ్ళా మన రోజువారీ జీవితంలోకి పడిపోతాం. నిస్సారమైన దైనందిన రథాన్ని లాగుతూ మరో పండగ కోసం ఎదురుచూస్తాం. ఇది భారతీయ సంస్కృతి. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. ఏ దేవుణ్ణీ, ఏ ప్రతీకనీ, ఏ సంప్రదాయాన్నీ శాశ్వతంగా ప్రతిష్ఠించాలనుకోం. ఎప్పటికప్పుడు మారుతున్న ఋతువుల మధ్యనుంచే ఒక దేవతని సృష్టించుకుంటాం. అలంకరించుకుంటాం. ఆరాధిస్తాం. మన వేడుక ముగిసిపోగానే ఉద్వాసన చెప్పేస్తాం.
ఆ గాయకులు తాము గానం చేసిన రెండున్నర గంటల పాటూ అక్కడ అటువంటి ఒక వేడుకనే నడిపారనిపించింది. మనం పండగల్లో మట్టితో దేవతను రూపొందిస్తే వారు మన చుట్టూ ఉన్న గాల్లోంచి సంగీతదేవతను ఆవాహన చేసారు. ఆలాపన మొదట్లో ఆ దేవతకు నెమ్మదిగా ప్రాణం పోసారు. ఆ తర్వాత ఆమెను అలంకరించారు. తమ భుజాలమీద ఊరేగించారు. ద్రుపద్ ఆలాపన ముగిసేక బైరాగి భైరవ్ లో ఒక బందిష్ గా శివస్తోత్రం ఆలపించారు. అది ఒక డమరుక వాద్యంలాగా వినబడింది. హాల్లో ప్రకాశిస్తూ ఉన్న షాండ్లియర్లే దేదీప్యమానంగా హారతి పట్టాయి. ద్రుపద్ ముగిసేటప్పటికి దేవత అదృశ్యమైపోయింది. కానీ ఒక దివ్యవిభూతి ఆ గాలంతా నిండిపోయింది.
చివరలో చారుకేశి రాగంలో కబీరు పదం ‘చీనీ చీనీ చదరియాఁ’ ఆలపించారు. ఆ గీతాన్ని కూడా నేనొకప్పుడు అనువదించుకున్నానని గుర్తొచ్చింది. అంతదాకా నా మనసులో నడుస్తున్న వేడుకకి ఆ గీతం సరైన ముగింపుగా తోచింది. చూడండి:
సన్నసన్నని పోగుల్తో నేసారీ చద్దరు. దాని పడుగు ఏది? పేక ఏది? ఏ దారంతో నేసారు దీన్ని?
సున్నితమైన తలపులు దీని పడుగు. దృఢమైన చిత్తం దీని పేక. సున్నితమూ, దృఢమూ కాని స్వభావం దీని దారం.
ఎనిమిది రేకలుండే తామరపువ్వు దీని రాట్నం. ఐదుగుణాల్లో ఏకిన దారంతో నేసారు దీన్ని.
పది నెలలు పట్టింది నేయడానికి. ఎంతో నేర్పుతో, ఓపిగ్గా నేసారు దీన్ని.
దేవతలూ, మానవులూ, మునులూ కూడా ధరించిన చద్దరు. ప్రతి ఒక్కరూ ధరించి మురికి పట్టిన చద్దరు.
కబీరుదాసుడు ఎంతో జాగ్రత్తగా ధరించాడీ చద్దరు. అతడికి తెలుసు. దీన్నెట్లా కప్పుకున్నాడో అట్లానే విదిలించకపోక తప్పదని.
సెయిలింగ్ అనెక్సీలో అడుగుపెట్టినందుకు బోటు ఎక్కకుండానే పడవప్రయాణం పూర్తయింది.
15-9-2025
ప్రభాత సంగీత సమారోహ్ లో పాల్గొని వినడం వేరు . ఆస్వాదించడం వేరు. ఆస్వాదించడాన్ని ఆప్యాయంగా అక్షరాల్లోకి అనూదితం చేయడం
అంత సామాన్యమైనది కాదు. దాన్ని ప్రస్తుతానికి అనువర్తించడం అతిసామాన్యం అంతకంటే కాదు. సంగీత కచేరీని అందంగా ఉపోద్ఘాతిస్తూ
పక్కనే ఉన్న మఱ్ఱిచెట్టునూ ఇంకా సోమరిగా నిద్రిస్తున్న తటాకాన్ని , పలుకరించి మొన్న జరుపుకున్న పండుగను పలవరించి పరమానందం చెందటం వేరు . దాన్ని పాల్గొనని పాఠకులకు కమనీయంగా అందించడం అంత సులువుకాదు. అలాంటి ప్రక్రియను సులభసాధ్యం గావించుకున్న మీరు మాకు పరిచయం కావడం ఒక అదృష్టం అంత కంటే ఏం చెప్పగలం .
హృదయపూర్వక ధన్యవాదాలు సార్! మీ స్పందనకు నమోవాకాలు.
నేను ఆ హాలులో కూర్చుని ఆ కమ్మని స్వరాలను ఆస్వాదించిన అనుభూతిని పొందేను. అంత గొప్పగా వ్రాశారు మీరు. ధన్యవాదాలు. 🙏
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఈ వ్యాసం ఒక సంగీతకచేరీ అనుభూతిని సజీవంగా పాఠకుడి ముందుంచుతుంది. హుస్సేన్ సాగర్ ప్రశాంతత, వటవృక్షం నిశ్చలత్వం, సెయిలింగ్ అనెక్సి వాతావరణం ఇవన్నీ కలిసి కచేరీకి ఒక ఆధ్యాత్మిక రంగాన్ని అద్దాయి. హిందుస్తానీ సంగీతం ఋతువులు, సమయాలతో ఉన్న అనుబంధాన్ని రచయిత స్పష్టంగా చూపించారు. ద్రుపద్ గానాన్ని ఒక పండుగతో పోల్చి, గుండేచా సోదరుల స్వరాలను “దేవత ఆవాహన”గా వర్ణించడం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. సంగీతాన్ని పండుగలా ఆరాధించి, చివర్లో తిరిగి విడిచిపెట్టే భావన భారతీయ సంస్కృతిలోని తాత్కాలికతను ప్రతిబింబించింది. భైరవ్ నుంచి చారుకేశి వరకు సాగిన సంగీతప్రవాహం కాలప్రవాహాన్ని వినిపించినట్టుగా అనిపించింది. కబీర్ పదానికి తెలుగు అనువాదం ఆ అనుభవానికి ఆధ్యాత్మిక ముగింపుగా నిలిచింది. రచయిత వ్యక్తిగత భావోద్వేగం, శ్రోతగా ఉన్న ఆత్మీయత పాఠకుడిని కూడా అదే వాతావరణంలోకి తీసుకెళ్ళింది. మొత్తంగా, ఇది కేవలం ఒక సంగీతసమీక్ష కాదు, సంగీతం, ప్రకృతి, తాత్త్వికతల సమ్మేళనం అయిన ఒక అందమైన సాహిత్యరచన.
హృదయపూర్వక ధన్యవాదాలు శైలజ గారూ!🌹