నన్ను వెన్నాడే కథలు-5

నలభై ఏళ్ళ కిందట నాకు దొరికిన చెహోవ్ కథల పుస్తకం ప్రగతి ప్రచురణాలయం వారు ప్రచురించిన ‘ఎ.చెహోవ్ కథలు’ (1973) మాత్రమే. అందులో ఒక ముందుమాటతో పాటు ఎనిమిది కథలున్నాయి. ఆ కథలు ఎన్నిసార్లు చదివానో చెప్పలేను.

చెహోవ్ మొత్తం కథలన్నీ నాలుగు సంపుటాలూ (1988) రాదుగ ప్రచురణలు వారు వెలువరించినవి 1991 దాకా నా చేతికి రాలేదు. ఆ కథలు చదివాక, చెహోవ్ కథల్లో మహిమాన్వితమైన కథలు చాలావరకూ తెలుగులోకి రాకుండానే ఉండిపోయాయని గ్రహించేను. (ఆ లోటు తీర్చడానికా అన్నట్టు కుమార్ కూనపరాజు గారు అరుణాప్రసాద్ తో చెహోవ్ కథలు అనువాదం చేయించి ఇప్పటికి రెండు సంపుటాలుగా వెలువరించారు.)

The Steppe, The Lights, A Dreary Tale, Ward No.6, A Story Told by an Anonymous Man, The Black Monk, The House with the Mansard, My Life, Gooseberries, A Story about Love లాంటి కథలు ప్రగతి వారి అనువాదసంపుటంలో లేవు. కాని చెహోవ్ కథల్లో సుప్రసిద్ధమైన ‘సీతాకోక చిలుక’, ‘ఇయోనిచ్’, ‘గుల్లలో జీవించిన మనిషి’, ‘పెండ్లి కూతురు’లతో పాటు ‘కుక్కను వెంటబెట్టుకున్న మహిళ’ కూడా ప్రగతి ప్రచురణాలయం అనువాదంలో చోటు చేసుకున్నాయి.

అందులో ‘పెండ్లి కూతురు’ కథని టాల్ స్టాయి ఎంతో ప్రస్తుతించాడు. కాని ప్రపంచమంతా చెహోవ్ ని మొదటిసారి చదివిన పాఠకులందరిలానే నేను కూడా ‘కుక్కను వెంటబెట్టుకున్న మహిళ’తో ప్రేమలో పడిపోయాను.

ఆ కథ చెహోవ్ కథాశిల్పానికి పరిపూర్ణమైన నమూనా. అందుకనే రష్యను సాహిత్యం మీద తాను చేస్తున్న ప్రసంగాల్లో భాగంగా చెహోవ్ గురించి చెప్పేటప్పుడు వ్లదిమీరు నబకొవు ఈ కథ గురించే చాలా వివరంగా విశ్లేషించాడు. ఈ కథ ఆధునిక కథాశిల్పానికి ఒక టెక్స్టుబుక్కు ఉదాహరణ. కథకి ఆద్యంతాలు లేకపోవడం, పాత్రలు ఎవరి పట్లా రచయిత తీర్పులివ్వకపోవడం, వివరాలు ఏ మేరకు ఇవ్వాలో ఆ మేరకే ఇవ్వడం, ప్రతి ఒక్క వివరమూ కథాగమనానికి తోడ్పడేదిగా ఉండాలనే పట్టుపట్టకపోవడం, కాని కథలో రెండుమూడు మెటఫర్లని ఆ కథలో భాగంగా పొదగడం- ఏ విధంగా చూసినా ఆధునిక కథ ఎలా ఉండాలో ఈ కథని చూసే ప్రపంచవ్యాప్తంగా రచయితలు తమ శిల్పాన్ని సానబెట్టుకున్నారని చెప్పవచ్చు.

ఆ కథ చదివిన చాలాకాలం పాటు నాక్కూడా అటువంటి ఒక కథ రాయాలని బలంగా ఉండేది. చివరికి ‘అమృతం'(1990) కథ రాయడం ద్వారా చెహోవ్ దగ్గర నా శిక్షణ పూర్తయిందని నాకు నేను చెప్పుకున్నాను.

ఈ కథ పట్ల నాకేదైనా అసంతృప్తి ఉంటే, అది ఇంత లలితమైన, సున్నితమైన, కవితాత్మకమైన రచన, రా.రా లాంటి ఒక అనార్ద్ర అనువాదకుడి చేతుల్లో పడటమే. అనువాద సమస్యల గురించి ఏకంగా ఒక పుస్తకమే రాసిన రా.రా ఈ కథ ఆత్మని పట్టుకోవడంలో విఫలం కావడమే కాక, అసలు ఆయనకు తెలుగు వాక్యనిర్మాణం చాతనవునా అని కూడా నాకు అనుమానమొచ్చింది, ఇన్నేళ్ళ తరువాత చదివితే.

అలాగని ఈ కథని నేను అనువదించాలనుకోలేదు. నన్ను వెన్నాడినది ఈ అనువాదమే కాబట్టి దీన్నే మీతో పంచుకుంటున్నాను.


కుక్కను వెంటబెట్టు కున్న మహిళ


ష్యను మూలం: ఆంటోన్ చెహోవ్

తెలుగు అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి


యెవరో కొత్త మనిషి – కుక్కను వెంటబెట్టుకున్న మహిళ – విహారపథంలో కనిపించిందని జనం అనుకుంటున్నారు. ద్మీత్రి ద్మీత్రిచ్ గూరొవ్ యాల్టాకు వచ్చి పదైదు రోజులైంది; ఆ వూరి పద్ధతులకు అలవాటుపడి అతను కూడా కొత్త ఆగంతుకులలో ఆసక్తి కలిగించుకోసాగినాడు. ఆతను వెర్నె ఆరుబయలు హోటల్‌లో కూర్చొని వుండగా, విహారపథంలో టోపీ పెట్టుకొని నడుస్తూ వుండిన యువతి కనిపించింది. ఆమెవెంట తెల్ల పొమెరేనియా కుక్క వుండింది.

తరువాత ఆమె మునిసిపల్‌ పార్కులోనూ, చౌకులోనూ అతనికి రోజూ పలుసార్లు యెదురైంది. ఆమె యెప్పుడూ ఒంటిగా వుండేది, అదే టోపీ పెట్టుకొని; ఆ కుక్క యెప్పుడూ వెంట వుండేది. ఆమె యెవరైందీ మెవరికీ తెలియదు; కేవలం ‘కుక్కను వెంటబెట్టుకున్న మహిళ’ గా జనం ఆమెను గురించి ప్రస్తావించేంచే వాళ్ళు.

“ఆమె యిక్కడ భర్త లేకుండా మిత్రులెవరూ లేకుండా వుంటే ఆమె పరిచయం చేసుకుంటే బాగనేవుంటుంది,” అనుకున్నాడు గూరోవ్‌.

అతనికింకా నలభై నిండలేదు. కానీ అతనికి పండ్రెండేండ్ల కూతురూ, యిద్దరు బడికి పోయే కొడుకులూ వుండినారు. కాలేజిలో రెండవ యేడులో వుండగా అతను మాటలకు లోబడి పెండ్లి చేసుకున్నాడు; అతని భార్య యిప్పుడు దాదాపు తనంత రెండంతలు వయసు వున్నట్లు కనపడుతుంది. ఆమె నల్లని కనుబొమలతో, యెత్తుగా, నిటారుగా గంభీరంగా వుండేది, ‘ఆలోచనాశీలి ‘నని తన్ను గురించి తాను చెప్పుకునేది. ఆమె యెక్కువగా పుస్తకాలు చదివేది, ఉత్తరాలలో వ్యావహారిక రూపాలు వాడేది, భర్జను ద్మీత్రీ అనకుండా దిమిత్రీ ఆనేది. ఆమె అజ్ఞురాలు ఆనీ సంకులిత మనస్క అనీ, అస్తవ్యస్తపు దుస్తుల మనిషి అనీ అతను మనసులో అనుకున్నా, ఆమెకు భయపడేవాడు, యింటివద్ద వుండడానికి అయిష్టపడేవాడు. ఆతను ఆమెను మోసగించడం ప్రారంభించి చాలా కాలమైంది. యిప్పుడతను పరస్త్రీలతో తిరిగేవాడు, అందువల్లనే స్త్రీలను గురించి నిరసనగా మాట్లాడేవాడు, వాళ్ళను అధమజాతి అనేవాడు.

బాధాకరమైన అనుభవంద్వారా నేర్చుకున్న గుణపాఠాల మూలంగా, వాళ్ళను తన యిష్టం వచ్చినట్టు అనే హక్కు తనకు వుందని అతను అనుకునేవాడు; కానీ యీ ‘అధమ జాతి ‘లేకుండా అతను ఒక్క రోజు కూడా బతకగలిగేవాడు కాదు. పురుషుల మధ్య వున్నప్పుడు అతను యేమీ తోచక, యిబ్బందిపడేవాడు, వాళ్ళతో యెప్పుడూ ముభావంగా, నిర్లిప్తంగా వుండేవాడు. కానీ స్త్రీల మధ్య అతను చాలా సాఫీగా వుండేవాడు; వాళ్ళతో యేమి మాట్లాడవలసిందీ, యెలా ప్రవర్తించవలసిందీ అతనికి కచ్చితంగా తెలుసు; వాళ్ళ సాహచర్యంలో ఆవగింజంత యిబ్బందిపడకుండా అతను మౌనంగా కూడా వుండగలిగేవాడు. ఆతని వాలకంలోనూ, వైఖరిలోనూ యేదో అనిర్వచనీయమైన సమ్మోహనత్వం వుండేది. ఆది స్త్రీలను ఆకర్షించి, వాళ్ళ సానుభూతిని చూరగొనేది. యిది అతనికి తెలుసు. అతనే యేదో అదృశ్యశక్తిచేత వాళ్ళవైపు ఆకర్షితుడయ్యేవాడు.

ప్రతి కొత్త పరిచయమూ మొదట నిత్యజీవితంలోకి అంత ఆహ్లాదకరమైన వైవిధ్యం ప్రవేశపెట్ట్టి, మనోహరమైన తేలిక ప్రణయకలాపంగా కనపడి, తరువాత, మర్యాదస్తుల మధ్య (ముఖ్యంగా, మనుషులు ఆంత అస్థిర మనస్కులుగా, అంత మందగమనులుగా వుండే మాస్కోలో) మహా జటిలమైన సమస్యగా అభివృద్ధి అయి, సహించరానంత సంకటకరమైన సన్నివేశానికి దారితీస్తుందని పదేపదే కలిగిన బాధాకరమైన ఆనుభవం అతనికి నేర్పింది. కానీ ఆకర్షణీయమైన స్త్రీ కనిపించిన ప్రతిసారీ అతను యీ అనుభవమంతా మరిచిపోయేవాడు, అతనిలో జీవితకాంక్ష ఉప్పాంగేది, హఠాత్తుగా ఆంతా సరళంగా, వినోదకరంగా కనిపించేది.

ఒక రోజు రాత్రి అతను పార్కులోని హోటల్‌లో భోజనం చేస్తూవుండగా ఆ టోపీ స్త్రీ మెల్లగా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చి, పక్క టేబుల్‌వద్ద కూర్చుంది. ఆమె వాలకమూ, నడకా, దుస్తులూ, కేశాలంకరణా, అన్నిటినీబట్టి ఆతనికి అర్ధమైంది, ఆమె ఉన్నత వర్గాలకు చెందినదనీ, వివాహిత అనీ, యాల్టాకు మొదటిసారి వచ్చిందనీ, అక్కడ ఒంటిగా వుందనీ, పొద్దుబోక అవస్థపడుతున్నదనీ . .. యాల్టాకు వచ్చేవాళ్ళ అవినీతిని గురించిన కథలలో అతిశయోక్తులు చాలా వుంటాయి. వాటిలో ఆధికభాగం, చేతనైతే సంతోషంగా నీతిని ఉల్లంఘించేవాళ్ళ కల్పితాలు అని అతనికి తెలిసినందున, అతను వాటిని లక్ష్యపెట్టలేదు. కానీ, ఆ స్త్రీ తనకు కొద్ది గజాల దూరంలో పక్క టేబుల్‌ వద్ద కూర్చున్నప్పుడు, యీ సులభవిజయాల కథలూ, కొండలలో షికార్ల కథలూ అతని మనసులో మెదలినాయి. సత్వర తాత్కాలిక ప్రణయం, తనకు పేరైనా తెలియని స్త్రీతో ప్రేమకలాపం, కలగవచ్చుననే భావం ఆతని మసస్సుమ హఠాత్తుగా లోబరచుకుంది.

కుక్కవైపు చూస్తూ ఆతను చిటిక వేసినాడు, ఆది తనదరికి వచ్చినప్పుడు చూపుడు వేలు ఆడించినాడు. పొమెరేనియా కుక్క మొరిగింది. గూరోవ్‌ మళ్ళీ వ్రేలు ఆడించినాడు.

ఆమె ఆతనివైపు చూసి, వెంటనే కండ్లు దించుకుంది.

‘అది కరవదు,’ అని ఆమె సిగ్గుపడింది.

‘యెముక ముక్క యివ్వనా?’ అని అడిగినాడు అతను. ఆమె ఆంగీకారంతో తల ఆడించగా, అతను హార్దిక స్వరంతో అన్నాడు: ‘మీరు యాల్టాకు వచ్చి చాలా రోజులైందా?’

‘అయిదు రోజులైంది.’

‘నేనిక్కడ రెండవ వారం యీడుస్తున్నాను.’

కొద్ది నిముషాల సేపు యెవరూ మాటాడలేదు.

‘రోజులు త్వరగా గడుస్తాయి, కానీ యిక్కడ బొత్తిగా పొద్దుబోదు,’ అన్నది ఆమె, అతనివైపు చూడకుండా.

‘పొద్దుబోదనడం యిక్కడ మామూలు. బెలేవ్‌, జీజ్ద్ర లాంటి పాపిష్ఠివూర్లలో పొద్దుబోదని యెవరూ ఫిర్యాదు చేయరు. కానీ వాళ్ళు యిక్కడికి వచ్చి ‘ఓ ఎంత నిర్జీవం! ఓ ఎంత దుమ్ము ‘ అంటారు. వాళ్ళు యే గ్రెనడానుండో వచ్చినట్టు మాట్లాడుతారు.’

ఆమె నవ్వింది, తరువాత పూర్తిగా కొత్తవాళ్ళైనట్లు యిద్దరూ మౌనంగా భోంచేయసాగినారు. కానీ భోజనం తర్వాత హోటల్‌నుండి యిద్దరూ కలిసి బయటికిపోయి స్వేచ్ఛా, సంతృప్తీ గలవాళ్ళు, ఫలానా చోటికి పోవాలని గానీ, ఫలానా విషయం మాట్లాడాలనిగానీ లేనివాళ్ళు మాట్లాడే తేలిక, హాస్యపూరిత సంభాషణ ప్రారంభించినారు. వాళ్ళు తీరికగా అడుగులు వేస్తూ, సముద్రం మీద కనపడే వింతకాంతిని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళినారు. నీళ్ళు ఆహ్లాదకరమైన వూదారంగులో వుండినాయి, నీళ్ళమీద వెన్నెల బంగారు చారగా పడింది. పగలంతా వేడిగా వుండి, యిప్పుడు చాలా ఉక్కగా వుందని వాళ్ళు మాట్లాడుకున్నారు. గూరోవ్ తన్ను గురించి చెప్పినాడు, తాను మాస్కో వాసిననీ, నిజానికి తాను భాషాశాస్త్రవేత్త అయినా బాంకిలో పనిచేస్తున్నాననీ. ఒకప్పుడు తను సంగీతనాటకాల కంపెనీలో పాడడానికి సాధవచేసి, తరువాత ఆ అభిప్రాయం వదలిపెట్టినాననీ, తనకు మాస్కోలో రెండు యిండ్లు వున్నాయనీ…. తరువాత ఆమెనుండి అతను తెలుసుకున్నాడు, ఆమె పీటర్స్‌బుర్గ్ లో పెరిగిందనీ, యన్- పట్టణంలో పెండ్లి చేసుకుందనీ, రెండేండ్లుగా అక్కడ వుంటున్నదనీ, యాల్టాలో యింకా ఒక నెల వుంటుందనీ, తవ భర్తకు కూడా విశ్రాంతి అవసరం గనుక అతను త్వరలో అక్కడికి రావచ్చుననీ. తన భర్త గుబెర్నియా కౌన్సిలు సభ్యుడైందీ, జెమ్‌స్త్వా బోర్డు సభ్యుడైందీ ఆమె బొత్తిగా చెప్పలేక, చెప్పలేనందుకు చాలా వినోదపడింది. ఆమె పేరు ఆన్నా సెర్గేయెవ్నా అని కూడా గూరోవ్‌ తెలుసుకున్నాడు.

తన గదికి తిరిగివచ్చిన తర్వాత అతను ఆమెను గురించి ఆలోచించినాడు, మరు దినం మళ్లీ ఆమెను కలుసుకుంటానని అతనికి నమ్మకంగా తోచింది. అది అనివార్యం. మంచం మీద పండుకుంటూఅతను అనుకున్నాడు, మొన్నమొన్నటిదాకా ఆమె తన కూతురులాగే బడికి పోతూ, పాఠాలు నేర్చుకుంటూ వుండిందని; ఆమె నవ్వులోనూ, కొత్తవానితో మాట్లాడే పద్ధతిలోనూ యెంత సిగ్గూ బిడియమూ వున్నదీ అతనికి జ్ఞాపకం వచ్చింది – ఆమె ఒంటరిగా వుండడమూ, ఆమె పసిగట్టకుండా వుండజాలని ఒక నిత్య, రహస్యలక్ష్యంతో పురుషులు ఆమెను అనుసరించి, గమనించి, ఆమెతో మాట్లాడే సన్నివేశంలో ఆమె వుండడమూ బహుశా యిది మొదటిసారి కావచ్చు. ఆమె సన్నని, సుకుమారమైన మెడనూ, అందమైన ధూనరవర్ణపు కన్నులనూ అతను జ్ఞ్ఞావకం చేసుకున్నాడు.

‘అయినా ఆమెలో యేదో విషాదకరమైంది వుంది,’ అనుకున్నాడు అతను నిద్రలో మునుగుతూ.

2

వాళ్ళకు పరిచయమై వారం గడిచింది. ఆ రోజు సెలవు దినం. యిండ్లలో ఉక్కగా వుండింది, కానీ బయట గాలికి దుమ్ము మేఘాలలాగా లేస్తూ వుండింది, తలలమీద టోపీలు కొట్టుకపోతూ వుండినాయి. ఆ రోజు దగగొలిపే దినం; అన్నా సెర్గేయెవ్నా కోసం పండ్ల రసాలూ, ఐస్‌క్రీమూ తేవడానికి గూరోవ్ ఆరుబయలు హోటల్‌కు పదేపదే పోతూవుండినాడు. వేడి దుర్భరంగా వుండింది.

సాయంత్రం, గాలి తగ్గినాక వాళ్ళు వచ్చే స్టీమర్‌ను చూడడానికి రేవుకు వెళ్ళినారు. ప్రయాణికులు దిగేచోట చాలామంది జనం వుండినారు. కొంతమంది, చేతులలో పూలతో, మిత్రులను కలుసుకుంటూ వుండినారు. నవనాగరికపు యాల్టాగుంపులో రెండు విశేషాలు స్పష్టంగా కనిపిస్తూ వుండినాయి – వయసుమళ్ళిన స్త్రీలు అందరూ వయసుకత్తెలలాగ దుస్తులు వేసుకోడానికి ప్రయత్నించినారు, మిలిటరీ జనరల్‌లు చాలామంది వున్నట్లుండింది.

సముద్రంలో అలలులేన్తూ వుండినందున స్టీమరు ఆలస్యంగా వచ్చింది, పొద్దు గుంకిన తర్వాత; రేవు పక్కన వచ్చి నిలవడానికి అది కొంతసేపు అటూయిటూ మళ్ళవలసివచ్చింది. అన్నా సెర్గేయెవ్నా తనకు తెలిసిన యెవరికోసమో వెతుకుతున్నట్లు బైనాకులర్ల గుండా స్టీమరునూ, ప్రయాణికులనూ కలయజాసింది; ఆమె గూరోవ్ వైపు మళ్లినప్పుడు, అమె కన్నులు తడితో తళతళలాడినాయి. ఆమె చాలా యెక్కువగా మాట్లాడింది, పోలూ పొందూ లేని ప్రశ్నల వర్షం కురిపించింది, తాను తెలుసుకోగోరిందేమిటో వెంటనే మరిచిపోతూ వుండింది. తరువాత జనం రద్దీలో ఆమె తన బైనాకులర్లు పోగొట్టుకుంది.

నవనాగరికవు గుంపు విడిపోసాగింది, రూపురేఖలు గమనించడం ఆసాధ్యమైంది, గాలి బాగా తగ్గింది, స్టీమరులోనుండి యింకా యెవరి రాకకొరకో కాచుకున్నట్ను గూరొవూ, అన్నా సెర్గేయెవ్నా అక్కడ నిలుచుకున్నారు. అన్నా సెర్గేయెవ్నా మౌనంగా వుండిపోయింది, సారిసారికీ తన చేతిలోని పూలు మూచూస్తూ, కానీ గూరొవ్‌ వైపు చూడకుండా.

‘మంచి సాయంత్రంగా మారింది,’ అన్నాడు అతను. ‘యేం చేద్దాం?బండిలో షికారు వెళ్ళవచ్చు.’

ఆమె జవాబు చెప్పలేదు.

అతను ఆమెవైపు నిశ్చలంగా చూసినాడు, హఠాత్తుగా ఆమెను కౌగలించుకొని, పెదవులు ముద్దు పెట్టుకున్నాడు, పూల పరిమళమూ, తడీ ఆతన్ని చుట్టుముట్టినాయి, కానీ మరుక్షణం అతను భయంతో వెనక్కి తిరిగిచూసినాడు – తమనెవరైనా చూసినారా?

‘మీ గదికి వెళ్ళాం పద’ అతను మెల్లగా అన్నాడు.

వడివడిగా యిద్దరూ కలిసి నడిచిపోయినారు.

ఆమె గది ఉక్కగా వుండింది, జపాన్‌ దుకాణంలో కొన్న యేదో సెంటువాసన వేస్తూవుండింది. గూరొవ్ ఆమెవైపు చూసి అనుకున్నాడు: ‘జీవితంనిండా యెన్ని చిత్రమైన కలయికలు!’ దిగులూ భయమూ లేని సహృదయలైన స్రీలు కామక్రీడచేత ప్రహర్షచిత్తలై, యెంత స్వల్పకాలికమైనదైనా తానిచ్చిన ఆనందానికి తనకు కృతజ్ఞత చూపిన స్త్రీలు అతనికి జ్ఞాపకమున్నారు. యిక మరికొందరు వుండినారు – వాళ్ళలో తన భార్య ఒకతె – వాళ్ళ అలింగనాలు కపటంగా,కృతిమంగా, ఉన్మాదంగా, బోలెడు అనవసరపు మాటలతో కలిసి వుండేవి; యిదంతావట్టి కామక్రీడ కానట్టూ, మోహావేశం కానట్టూ, అంతకంటే ముఖ్యమైనదేదో అయినట్టూ వుండేది వాళ్ళ వాలకం. తరువాత, యిద్దరు ముగ్గురు నిర్లిప్తలైన సుందరాంగులు వుండినారు; వాళ్ళ ముఖలక్షణాలలో యేదో ఘాతుకభావం తారాడుతూ వుండేది, జీవితం నుండి ఆది యివ్వగలిగినదానికంటే యెక్కువ పిండుకోవాలనే దీక్షను వ్యక్తంచేస్తూ; వాళ్ళు ప్రథమయవ్వనం దాటినవాళ్ళు, చపలచిత్తలు, పెత్తందారీ బుద్ధులు, బొత్తిగా మెదడు లేనివాళ్ళు, వాళ్ళపట్ల గూరొవ్‌ వ్యామోహం చల్లబడిన తర్వాత వాళ్ళ సౌందర్యం అతనికి యేవగింపు మాత్రమే కలిగించేది, వాళ్ళ లోపలి దుస్తుల లేసులు అతనికి చేపల పాలునులను గుర్తుకు తెచ్చేవి.

కానీ యిక్కడ యవ్వనంలోనూ, అనుభవరాహిత్యంలోనూ వుండే పిరికితనమూ,అస్తవ్యస్తతా యింకా స్పష్టంగా వున్నాయి. ఆమె మనసులో ఆందోళన భావంవుంది, అకాలంలో యెవరో తలుపు తట్టినట్టు. అన్నా సెర్గేయెవ్నా ‘కుక్కనువెంటబెట్టుకున్న మహిళ,’ యీ వ్యవహారాన్ని యేదో మహా ప్రత్యేకమైనదిగా, మహాగురుతరమైనదిగా వరిగణిస్తున్నది, తాను పతిత ఆయినట్లు పరిగణిస్తున్నది; ఆ భావం అతనికి విడ్డూరంగా, మనశ్శాంతిహారిగా వుండింది. ఆమె ముఖలక్షణాలు విచారపూరితంగా వున్నాయి, ముఖానికి యిరువైపులా వెండ్రుకలు దుఃఖమయంగా వ్రేలాడుతున్నాయి. ఆమె విచారకర ధ్యానముద్ర ధరించింది, పాతకాలపు వర్ణచిత్రం లోని పశ్చాత్తప్త పాపిలాగ.

‘యిది మంచిది కాదు,’ అన్నది అమె, ‘మీకు యిక నామీద గౌరవంవుండదు.’

టేబుల్‌మీద కర్బూజపండు వుండింది. గూరొవ్‌ ఒక ముక్క కోసుకొని నిదానంగా తినసాగినాడు. కనీసం ఒక అరగంట మౌనంగా గడిచింది.

అన్నా సెర్గేయెవ్నా అనుతాపజనకంగా వుండింది, జీవితాన్ని చాలా కొద్దిగా చూసిన నిష్కల్మష అమాయక స్త్రీ యొక్క స్వచ్ఛతను వ్యక్తం చేస్తూ వుండింది. టేబుల్‌మీద వున్న ఒకే ఒక కొవ్వొత్తి వెలుగులో ఆమె ముఖం స్పష్టంగా కనపడలేదు, కానీ ఆమె హృదయం భారంగా వున్నట్టు స్పష్టంగా తెలుస్తూ వుండింది.

‘నాకు నీమీద గౌరవం యెందుకు ఆగిపోతుంది?’ అని అడిగినాడు. అతను. ‘నీవేమి మాట్లాడేదీ నీకే తెలియదు.’

‘భగవంతుడు నన్ను క్షమించుగాక! యిది దారుణం! అన్నది ఆమె. ఆమె కండ్లలో నీళ్ళు నిండినాయి.
‘అత్మసమర్ధన చేసుకోవలసిన ఆవసరం లేదు నీకు.’

ఆత్మసమర్థన యెలా చేసుకోగలను? నేను దుష్టురాలిని, పతితను; నామీద నాకే అనహ్యం కలుగుతున్నది, ఆత్మసమర్ధన చేసుకునే ఉద్దేశం నాకేమాత్రమూ లేదు. నేను మోసగించింది. నా భర్తను కాదు, నన్నే, యిప్పుడే కాదు చాలా కాలంగా నన్ను నేమ మోసగించుకుంటున్నాను. నా భర్త నిజాయితీపరుడు, యోగ్యుడు, సందేహం లేదు, కానీ జోహుకుంగాడు. అతను అఫీసులో యేమిచేస్తాడో నాకు తెలియదు, కానీ అతను జోహుకుంగాడని నాకు తెలుసు. నేనతన్ని పెండ్లాడినప్పుడు నాకు యిరవై యేండ్లు మాత్రమే, జీవితం యేమిటో తెలుసుకోవాలనే ఉత్సుకతతో నేను చచ్చిపోయినాను, నాకు మరింత ఉన్నతమైనదానిమీదకోరిక కలిగింది. యింతకంటె భిన్నమైన జీవితం మరొకటి వుండాలని మనసులో అనుకున్నాను, ఆ జీవితం నేను జీవించాలి… నేను ఉత్సుకతతో దహించుకపోయినాను…. మీకెప్పటికీ అర్ధం కాదది; ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నేను నిగ్రహించుకోలేకపోయినాను, నన్నేదీ అరికట్టలేకపోయింది, నాకు ఒళ్ళు బాగలేదని నా భర్తతో చెప్పి, యిక్కడికి వచ్చినాను. .. పిచ్చి పట్టినట్లు, దయ్యం పట్టినట్లు తిరగసాగినాను. .. యిక యిప్పుడు సాదా మనిషినైనాను, పనికిమాలిన మనిషినైనాను, ప్రతి వాళ్ళకూ యిప్పుడు నన్ను అసహ్యించుకొనే హక్కు వుంది.”

గూరొవ్ విన్నాడు, భరించరాని విసుగుతో. ఆ పసితనపు ఉచ్చారణా, పశ్చాత్తాపమూ, అంతా అంత అసందర్భంగా, అంత యెదురుచూడనిదిగా వుండింది. ఆమె కన్నులలో ఆ నీరు లేకపోతే ఆమె హాస్యమాడుతున్నదనో, నటన చేస్తున్నదనో అనుకోవచ్చు.

అతను మృదువుగా అన్నాడు: ‘నాకు అర్ధం కావడంలేదు. యేమిటి నీకు కావలసింది?’
ఆమె అతని రొమ్మున ముఖం దాచుకొని గట్టిగా అతనికి ఆనుకుంది.

‘నన్ను నమ్మండి. నమ్మమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను,’ ఆన్నది ఆమె, ‘జీవితంలో నిష్కపటమూ, పరిశుద్ధమూ అయినదంతా నేను ప్రేమిస్తాను, చెడ్డపని నాకు అసహ్యం, నేనేమి చేస్తున్నానో నాకు తెలియదు. మామూలు జనం అంటుంటారు, తాము సైతాను వలలో చిక్కినామని, యిప్పుడు నేను కూడా సైతాను వలలో చిక్కినానని అనగలను.’

‘ఛీఛీ యేమిటిది!’ అని మెల్లగా అన్నాడు అతను.

నిశ్చలమైన, భయవిహ్వలమైన అమె కన్నులలోకి అతను నిలజూసినాడు, ఆమెను ముద్దు పెట్టుకున్నాడు, మెత్తని, ప్రేమార్ద్రమైన మాటలతో అమెను అనునయించినాడు. క్రమక్రమంగా ఆమె శాంతించి, తిరిగి ఉత్సాహం పొందింది. కాసేపట్లో మళ్లీ యిద్దరూ నవ్వుకుంటూ వుండినారు.

కొంతసేపు తర్వాత వాళ్ళు బయటికి వెళ్లినారు. విహారపథంలో మనుషులు ఒక్క పిట్ట లేరు, పట్టుణమూ, పట్టణంలోని సైప్రస్ చెట్లూ మరణించినట్లుండినాయి, కానీ సముద్రం బీచిమీద యెగిరిపడుతూ యింకా గర్జిస్తూ వుండింది. ఏకాకి చేపల పడవ ఒకటి అలలమీద పడుతూ లేస్తూ వుండింది, పడవలోని దీపం నిద్రమత్తుతో మినుకుమినుకు మంటూ వుండింది.

వాళ్ళ కొక గుర్రపుబండి దొరకగా ఒరియాందకు పోయినారు.

‘హాలులో యిప్పుడే నీ పేరు కనుక్కున్నాను,’ అన్నాడు గూరొవ్‌ ఆమెతో, ‘బోర్డు మీద రాసిపెట్టినారు. ఫన్‌ డీడెరిత్స్‌. నీ భర్త జర్మనా?’

‘కాడు. వాళ్ళ తాత జర్మన్‌ అనుకుంటాను. కానీ నా భర్త ఆర్ధడాక్స్‌ మతస్థుడు.’

ఒరియాందలో బండి దిగి వాళ్ళు చర్చికి కాస్త దూరంలో బెంచీమీద కూర్చున్నారు. వాళ్ళు మాటలు లేకుండా సముద్రం వైపు చూస్తూ వుండినారు. తెల్లవారు జాము పొగమంచులో యాల్టా లీలగా కనిపిస్తూ వుండింది, పర్వతశిఖరాలమీద తెల్లని మేఘాలు నిశ్చలంగా విశ్రమించినాయి. ఆకు అల్లాడలేదు, అకుతేళ్ళు కీచుకీచుమంటూ వుండినాయి, రోకటిపాట లాంటి సముద్రపు మందగర్జ వాళ్ళకు వినిపిస్తూ వుండింది, శాంతిని గురించి, మనందరి కోసమూ పొంచుకొనివున్న శాశ్వతశాంతిని గురించి, మాట్లాడుతూ, యాల్టాలూ, ఒరియాందలూ లేకముందు సముద్రం యిలాగే గర్జించింది, యిప్పుడూ గర్జిస్తున్నది, యిక ముందు మనంగతించిన తర్వాత కూడా యిలాగే నిర్లక్ష్యంగా మందంగా గర్జిస్తూ వుంటుంది. యీ అనుస్యూతిలో, జీవమరణాలపట్ల గల యీ పరమ నిర్లక్ష్యంలో, మన అంతిమమోక్షంయొక్కా, మన గ్రహంమీది జీవస్రవంతియొక్కా, పరిపూర్ణతవైపు దాని నిరంతరగమనంయొక్కా రహస్యం వుండవచ్చు. ప్రాతఃకాంతిలో అంత అతిలోకంగాకనపడే ఒక యువతి పక్కన కూర్చొన్న, సముద్రమూ, పర్వతాలూ, మేఘాలూ, అనంతమైన ఆకాశమూ, యీ అన్నింటి దివ్య సౌందర్యదర్శనంచేత ప్రశాంతుడై, సమ్మోహితుడై గూరొవ్‌ తనలో అనుకున్నాడు: లోతుగా ఆలోచిస్తే, ప్రపంచంలో ప్రతిదీ నిజంగా సుందరమైనదే – ఉన్నత జీవితలక్ష్యాలూ, మానవులంగా మనగౌరవమూ మనకు కనుమరుగైనప్పుడు మన ఆలోచనలూ, చేతలూ తప్ప ప్రతిదీ.

యెవరో వాళ్ళను సమీపించినారు – వాచ్‌మన్‌ కావచ్చు. వాళ్ళను చూసి అతను వెళ్ళిపోయినాడు. యిందులో కూడా నిగూఢమైనదీ, మనోహరమైనదీ యేదోవుండింది. ఫియొదోసియానుండి వచ్చిన స్టీమరు, దీపాలు ఆరిపోయి, ఉషఃకాంతిలో రేవువద్దకు రావడం కనిపించింది.

‘గడ్డిమీద మంచు వుంది,’ అన్నది ఆన్నా సెర్గేయెవ్నా, మౌనం వదలిపెట్టి.

‘అవును. యింటికి పోయే వేళ అయింది.’

వాళ్ళు పట్టణానికి తిరిగి పోయినారు.

ఆ తర్వాత వాళ్ళ ప్రతిరోజూ మధ్యాహ్నం విహారపథంలో కలుసుకునేవాళ్ళు. మధ్యాహ్నమూ, రాత్రీ కలిసి భోంచేసేవాళ్ళు, షికారు పోయేవాళ్ళు, సముద్రసౌందర్యాన్ని ఆస్వాదించేవాళ్ళు. ఆమె నిద్రపట్టడం లేదనీ, గుండెదడ వస్తున్నదనీ ఫిర్యాదులు చేసేది, మళ్ళీమళ్ళీ అవే ప్రశ్నలు అడిగేది, ఒకసారి అసూయకూ, మరొకసారి అతను తన్ను నిజంగా గౌరవించడం లేదనే భయానికీ మార్చి మార్చిలోనయ్యేది. తరుచుగా, చౌకులోనో, పార్కులోనో యెవరూ కనిపించనప్పుడు, అతను ఆమెను దగ్గరకు తీనుకొని, ఆవేశంతో ముద్దు పెట్టుకునేవాడు. బొత్తిగా యేమీపని లేకపోవడమూ, పట్టపగలు పెట్టుకునే యీ ముద్దులూ, వాటివెంట వుండే దొంగచూపులూ, యెవరికైనా తెలుస్తుందనే భయమూ, వేడీ, సముద్రపు వాసనా, పని లేని, కడుపు నిండిన, నవవాగరికపు మనుషులు నిత్యం వాళ్ళ దృష్టిపథంలోకి వస్తూపోతూ వుండడమూ యివన్నీ అతనికి కొత్త ఆయుస్సును యిచ్చినట్టుంది. ఆమె అందంగా వుందనీ, మహా ప్రలోభకరంగా వుందనీ ఆతను ఆమెతో చెప్పేవాడు, మహా ఆవేశంతో కామక్రీడకు పురికొనేవాడు, ఒక క్షణం వదలకుండా యెప్పుడూ ఆమె పక్కన వుండేవాడు. ఆమె యెప్పుడూ విచారంగా వుండేది, అతను ఆమెను గౌరవించడంలేదనీ, అణుమాత్రమూ ప్రేమించడంలేదనీ, ఆమెను సాదాస్త్రీగా పరిగణిస్తున్నాడనీ అతనినుండి ఒవ్పుదలను రాబట్టడానికి యెప్పుడూ ప్రయత్నించేది. దాదాపు ప్రతిరాత్రీ వాళ్ళు పట్టణంనుండి బయటికి బండిలో షికారు వెళ్ళేవాళ్ళు, ఒరియాందకో, జలపాతంవద్దకో, మరొక సౌందర్యస్థానం వద్దకో. ఈ యాత్రలు తప్పనిసరిగా కృతార్ధంగా వుండేవి, ప్రతీదీ రాజనసౌందర్యపు కొత్త అనుభూతులుసమకూర్చేది.

యీ కాలమంతా వాళ్ళు ఆమె భర్త రాకను నిరీక్షిస్తూ వుండినారు. కానీ అతని కేదో కండ్లజబ్బు వచ్చిందని తెలుపుతూ ఆమెను సాధ్యమైనంత త్వరలో యింటికి రమ్మని అభ్యర్ధిస్తూ భర్త వద్దనుండి ఆమెకు ఉత్తరం వచ్చింది. ఆన్నాసెర్గేయెవ్నా బయలుదేరడానికి తొందర తొందరగా సన్నాహాలు చేసుకుంది.

‘నే పోవడం మంచిది,’ అన్నది ఆమె గూరొవ్ తో. ‘విధి జోక్యం యిది.’

ఆమె యాల్టా నుండి బండిలో బయలుదేరింది, రైలు స్టేషనుదాకా ఆతను వెంటపోయినాడు. బండి ప్రయాణం దాదాపు ఒకరోజంతా పట్టింది. ఆమె యెక్స్ ప్రెస్ రైలు యెక్కి, రెండవ గంట మ్రోగిన తర్వాత యిలా అన్నది:

‘యేదీ, మిమ్మల్ని మరొకసారి చూడనివ్వండి…. చివరి చూపు. ఆఁ అదీ.’

ఆమె యేడ్వలేదు, కానీ దుఃఖపూరితంగా వుండింది, జబ్బు పడినట్టు కనపడింది, చెక్కిళ్ళమీది కండరాలు టకటకలాడుతూ వుండినాయి.

‘మిమ్మల్ని అనుకుంటుంటాను . .. నిరంతరం అనుకుంటుంటాను,’ అన్నది ఆమె. ‘దేవుని దయవల్ల మీకు శుభం కలుగుగాక! నన్ను గురించి దయగా అనుకోండి.మనం శాశ్వతంగా విడిపోతున్నాము. అదే మంచిది. యెందుకంటే, మనమసలు కలుసుకొని వుండకూడదు. సెలవు – దేవుని దయవల్ల మీకు శుభం కలుగుగాక!’

రైలు వేగంగా స్టేషన్‌ దాటిపోయింది, రైలు దీపాలు త్వరలో అదృశ్యమైనాయి,-ఒక నిముషం తర్వాత దాని శబ్దం కూడా అంతరించింది యీ మధురమైన మైమరపును, యీ ఉన్మాదస్థితిని, వీలైనంత త్వరగా ముగించడానికి ప్రతిదీ కుట్రపన్నుతున్నట్టు. గూరొవ్ ప్లాట్‌ఫారంమీద ఒంటరిగా నిలబడి, అంధకారమయమైన దూరంలోకి చూపులు నిగుడించి, ఆకుతేళ్ళ కీచునాదమూ, టెలిగ్రాఫ్‌ తంతెల ఓంకారనాదమూ విన్నాడు – అప్పుడే మెలకువ వచ్చిన అనుభూతి పొందుతూ. అతను మనసులో అనుకున్నాడు, తన జీవితంలో కలిగిన అనేక ప్రణయకలాపాలలాంటిదే యిది మరొకటి అనీ, యిది కూడా ముగిసిందనీ, స్మృతి తప్ప యేమీ మిగలలేదనీ. .. అతనికి మనస్సు సంచలించింది, దుఃఖం కలిగింది, కించిత్తు పశ్చాత్తాపం కలిగింది. యెంతైనా మళ్లీ జీవితంలో తానెన్నడూ చూడబోని యీ యువతి తనతో నిజమైన సంతోషం పాందలేదు. ఆమెపట్ల తాను హార్దికంగా, అపేక్షగా వుండినాడు, కానీ తన మొత్తం ప్రవర్తనలో, తన కంఠస్వరాలలో, తన ఆలింగనాలలోనే ఒక వ్యంగ్యరేఖ వుండింది, అదృష్టవంతుడైన మగమహారాజుయొక్క అవజ్ఞాపూర్వకమైన ఆదరణ వుండింది; పైగా తాను వయసులో ఆమెకంటె రెండింతలు పెద్దవాడు. తాను మంచివాడనీ, అసాధారణుడనీ, ఉదాత్తుడనీ ఆమెపట్టుబట్టి అనేది. అనగా తాను తన నిజమైన వ్యక్తిత్వంకంటే భిన్నంగా ఆమెకు కనపడినాడన్నమాట; ఒక్క మాటలో చెప్పాలంటే, తాను అనుకోకుండానే ఆమెను మోసగించినాడు. ..

గాలిలో హేమంతస్ఫూర్తి వుండింది, సాయంత్రం చలిగా వుండింది.

‘నేను కూడా ఉత్తరాదికి వెళ్ళే సమయం వచ్చింది,’ అనుకున్నాడు గూరొవ్‌, ప్లాట్‌ఫారంమీదనుండి బయటికి నడుస్తూ. ‘సమయం పూర్తిగా వచ్చింది!’


3

ఆతను మాస్కో చేరేటప్పటికి చలికాలం ప్రారంభమౌతున్నట్లుండింది; స్టౌలు రోజూ వేడిచేస్తూ వుండినారు, పిల్లలు బడికి పోడానికి నిద్రలేచేటవ్పటికి యింకా చీకటిగా వుండేది, అందువలన నర్సు కాసేపు దీపం వెలిగించేది. చలి ప్రవేశించింది. మొదటి మంచు పడితే, మొదటిసారి మంచుబండిమీద షికారు పోయినప్పుడు, తెల్లని నేలా తెల్లని మిద్దె కప్పులూ చూడడం హాయిగా వుంటుంది; స్వేచ్ఛగా, తేలికగా వూపిరి పీల్చుకుంటుంటే, యవ్వనపు రోజులు జ్ఞాపకం వస్తాయి. మంచుతో తెల్లగా వున్న పురాతనపు లైమ్‌చెట్లూ, బర్చ్‌చెట్లూ ప్రసన్నంగా కనపడతాయి, సైప్రస్‌ చెట్లకంటె, పామ్‌చెట్ల కంటె హృదయానికి సన్నిహితంగా వుంటాయి;వాటి కొమ్మలకింద పర్వతాల సముద్రాల స్మృతి మనిషిని వెంటాడదు.

గూరొవ్‌ యెప్పుడూ మాస్కోలో జీవించినవాడు. ఆతమ ఒక మంచి చలిరోజున మాస్కోకు తిరిగివచ్చి, ఫర్‌ లైనింగుగల చలికోటూ, మందం గ్లౌలూ ధరించి, పెత్రోవ్క వీథిలో తీరికగా అడుగులు వేస్తూ నడిచినప్పుడూ, శనివారం సాయంత్రం చర్చి గంటల గణగణ విన్నప్పుడూ, ఆతని యిటీవలి ప్రయాణమూ, ఆతను చూసిన స్థలాలూ వాటి ఆకర్షణ కోల్పోయినాయి. క్రమక్రమంగా అతను మాస్కో జీవితంలో మునిగిపోయినాడు, ఆబగా రోజూ మూడు వార్తాపత్రికలు చదివేవాడు, ఒకవైపున మాస్కో వార్తాపత్రికలు చదవక పోవడం తన నియమం ఆని చెప్పుకుంటూ. మళ్ళీ అతను రెస్టరెంటుల, క్లబ్బుల, విందుల, వినోదాల సుడిగుండంలో చిక్కుకున్నాడు. మళ్ళీ అతను సుప్రసిద్ధ న్యాయవాదులూ, నటులూ తన యింటికి వస్తారనీ, మెడికల్‌ క్లబ్బులో తాను ఒక ప్రొఫెసర్‌తో పేకాటఆడుతాననీ అనే గర్వకారకమైన స్పృహతో ఉబ్బిపోయినాడు.

ఒక నెలలో అన్నా సెర్గేయెవ్నా వట్టి అస్పష్టస్మృతిగా వుంటుందనీ, ఆ కాంక్షాభారపు దరహాసంతో, ఆమెలాంటి యితర స్త్రీలలాగే, తనకు అప్పుడప్పుడు కలలో మాత్రం వస్తుందనీ అతను నమ్మినాడు. కానీ, యిప్పుడు నెల బాగా గడిచిపోయి చలి కాలం నడికొనింది; అయినా, నిన్ననే ఆన్నా సెర్గేయెవ్నా విడిపోయినంత స్పష్టంగా వుంది అతని మనసులో అంతా. అతని స్మృతులు అంతకంతకూ గాఢమైనాయి. అతను తన పఠనాగారంలో వుండగా సాయంత్రపు నిశ్చలత్వంలో, పాఠాలు చదువుకునే తన పిల్లల గొంతులు చెవులబడినప్పుడూ, రెస్టరెంటులో ఒక పాటో, జంత్రనాదమో వినపడినప్పుడూ పొగగూట్లో గాలి గీపెట్టినప్పుడూ, అతనికి వెనకటివన్నీ తలపుకు వచ్చేవి: రేవువద్ద ప్రత్యుషఃకాలమూ, పొగమంచు చాటున పర్వతాలూ, ఫియొదోసియానుండి వచ్చే స్టీమరూ, ముద్దులూ. చాలాసేపు అతను తన గదిలో అటూయిటూ పచార్లు చేస్తూ, తన స్మృతులను చూసి చిరునవ్వు నవ్వుకునేవాడు, తరువాత స్మృతి పగటికలగా మారేది, అతని ఊహలో జరిగిందీ జరగబోయేదీ కలగలిసి పోయేవి. ఆన్నా సెర్గేయెవ్నా అతనికి కలలో రాలేదు, ఆమెయెప్పుడూ అతని వెంట వుండింది, నీడలాగా, అతను యెక్కడికి పోయినా అనుసరిస్తూ. అతను కండ్లు మూసుకుంటే, ఆమె సాక్షాత్తుగా యెదుట నిలబడినట్లుండేది, వాస్తవంగా ఆమె వుండినంతకంటె మనోహరంగా, పడుచుదిగా, కోమలంగా; వెనక్కిచూసుకుంటే, అతనికి అతనే యాల్టాలో వున్నంతకంటె బాగా కనిపించేవాడు. సాయంత్రంపూట ఆమె బుక్‌ షెల్ఫులలోనుండీ, పొయ్యివద్దనుండీ, గది మూలల నుండీ అతనివైపు చూసేది; ఆమె వూపిరి తీసుకోవడమూ, ఆమె దుస్తుల శ్రావ్యమైన సవసవా అతనికి వినిపించేవి. వీథుల్లో అతను స్త్రీలను కలయజూసేవాడు. ఆమెలాంటి వాళ్ళెవరైనా కనిపిస్తారేమో అని . ..

తన స్మృతులు యెవరితోనైనా చెప్పుకోవాలని అతనికొక దుర్వారమైనకోరిక కలగసాగింది. తన ప్రేమను గురించి అతను యింట్లో మాట్లాడలేడు, యిక బయట తన మనసు విప్పడానికి యెవరున్నారు? తన యింట్లో అద్దె కున్నవాళ్ళా, కాదు; బాంకిలో తన సహోద్యోగులా, కానేకాదు. యింతకూ చెప్పడానికి యేముందని? తనకు కలిగింది ప్రేమేనా? ఆన్నా సెర్గేయెవ్నాతో తనకు గల సంబంధాలలో అతిలోకసుందరమైనదేమైనా వుందా? కవితామయమైనదేమైనా వుందా? జ్ఞానదాయకమైనది గానీ, చివరకు వినోదకరమైనదిగానీ యేమైనా వుందా? ప్రేమనుగురించీ స్త్రీలను గురించీ అతను అస్పష్టమైన సూత్రాలు మాత్రం మాట్లాడగలిగినాడు; అతని ఉద్దేశమేమిటో యెవరికీ అర్ధం కాలేదు. కానీ అతని భార్య, తన నల్లని కనుబొమలు చిటచిటలాడిస్తూ; యిలా అన్నది:

‘షోకిల్లా పాత్ర నీకు బొత్తిగా సరిపడదు దిమీత్రీ.’

ఒక సాయంత్రం, ప్రభుత్యోద్యోగి అయిన ఒక పేకాట మిత్రునితో కలిసి మెడికల్‌క్లబ్బులోనుండి బయటికి వస్తూ, అతను వుండబట్టలేక యిలా అన్నాడు:

‘యాల్టాలో నేను యెంత మనోహరమైన స్త్రీని కలుసుకున్నానో తెలుసా!’

ఉద్యోగి మంచుబండిలో యెక్కి, సరిగ్గా బయలుదేరేటప్పుడు కేకవేసినాడు:

‘ద్మీత్రీ ద్మీత్రిచ్‌!’

‘ఆఁ?’

‘మీరన్నది నిజమే – చేప కాస్త కాటుబోయింది.’

యీ మాటలు అంత మామూలువైనా యెందువల్లనో గూరొవ్‌కు మంట పుట్టించినాయి, అవమానకరంగా అసహ్యంగా కనిపించినాయి. యెంత ఆటవికమర్యాదలు, యేం మనుషులు! యెంత వృథా అయిన సాయంత్రాలు, యెంత విసుగుకలిగించే నిస్సారపు దినాలు! ప్రాణంమీదికి వచ్చినట్టు పేకాడడమూ, చెడ తినడమూ, చెడ తాగడమూ, ఒకే విషయం గురించి యెడతెగకుండా మాట్లాడడమూ. యెవరికీ అక్కరకురాని విషయాలలోనూ, చర్చించిన విషయాన్నే మళ్ళీమళ్ళీ చర్చించడంలోనూ మనిషికున్న కాలంలోనూ, శక్తిలోనూ అధికభాగం వ్యయమైపోతున్నాయి; వీటికన్నిటికీ ఫలితంగా దక్కింది యేమిటంటే, యిలకరుచుకున్న అవిటి బతుకూ, కొరగాని చిల్లరవిషయాల పరంపరా; వీటినుండి తప్పించుకొనిపోడానికి మరొకచోటులేదు; యిదంతా పిచ్చాసుపత్రిలోనో, జైలులోనో వున్నట్టుంది!

గూరొవ్‌కు ఆ వేడితో ఆ రాత్రంతా నిద్రపట్ట్టలేదు, మరుదినం పగలంతా అతను తలనొప్పితో తిరిగినాడు. తరువాతి రాత్రిళ్లు కూడా అతనికి సరిగా నిద్రపట్టక, మంచంలో లేచి కూర్చొనేవాడు ఆలోచిస్తూ, లేదా గదిలో పచారు చేసేవాడు.అతనికి పిల్లలన్నా, బాంకన్నా వెగటు కలిగింది, యెక్కడికి పోవడానికీ, యేమి మాట్లాడడానికీ యిష్టం లేకపోయింది.

క్రిస్మస్ సెలవులు వచ్చినప్పుడు అతను సామాన్లు సర్దుకొని, ఒక యువకుని పనిమీద పీటర్స్‌బుర్గ్ కు పోతున్నానని భార్యతో చెప్పి, యన్‌- పట్టణానికి బయలుదేరినాడు. యేం చెయ్యాలని? ఆతనికే సరిగా తెలియదు. అతనికి తెలిసిందల్లా తాను అన్నా సెర్గేయెవ్నాను చూడాలి, ఆమెతో మాట్లాడాలి, వీలైతే సమావేశం కుదిరించుకోవాలి.

ప్రొద్దున్నే అతను యన్- చేరినాడు, హోటల్లోకెల్ల మంచి గది అద్దెకు తీసుకున్నాడు. దానిలో నేలమీద బూడిదరంగు రత్నకంబళి వుంది, టేబుల్‌మీద ధూళి నిండిన కలందాను వుంది, దానిమీద తల లేని ఆశ్వికుని బొమ్మ వుంది, చేతితో టోపీ యెత్తిపట్టుకొని ఆతనికి కావలసిన సమాచారం హోటల్‌ నౌకరు చెప్పినాడు: ఫన్‌ డీడెరిత్స్‌కు ‘స్తారొ గొంచార్నయ’ వీథిలో సొంత యిల్లు వుంది. అది హోటల్‌కు దూరం కాదు. అతను దర్జాగా, వైభవంగా జీవిస్తున్నాడు,అతనికి గుర్రపుబండ్లు వున్నాయి, పట్టణమందరికీ ఆతను తెలుసు. అతని పేరును నౌకరు ‘ద్రిదిరిత్స్‌’ అని ఉచ్చరించినాడు.

స్తారొ గొంచార్నయ వీథిలో గూరొవ్‌ మెల్సగా నడుచుకుంటూ వెళ్ళి ఆ యిల్లు కనుక్కున్నాడు. యింటికి యెదురుగా పొడవైన, బూడిద రంగు కంచె, కొయ్య పలకలది వుంది; పలకలమీద పదునుపాటు పైకి వుండేటట్లు మేకులు దిగగొట్టబడినాయి.

ఆ యింటి కిటికీలవైపూ, కంచెవైపూ చూస్తూ గూరొవ్‌ అనుకున్నాడు:’యిలాంటి కంచె చాలు, యెవరికైనా పారిపోవాలనిపిస్తుంది.’

ఆరోజు సెలవు గనుక, ఆమె భర్త యింట్లో వుండవచ్చునని అతను తర్కించుకున్నాడు. యేమైనా తాను ఆ యింట్లోకి పోయి ఆమెను యిబ్బంది పెట్టడం అనుచితంగా వుంటుంది. చీటీ పంపిస్తే, ఆమె భర్త చేతుల్లో పడి, సర్వనాశనం కలిగించవచ్చు. అన్నిటికంటె ఉత్తమమైన పని ఆమె కనిపించే అనకాశం కొరకు ఆ ప్రాంతంలో కాచుకోవడం. అతను అవకాశం కొరకు వీథిలో అటూయిటూ తిరుగుతూ, కంచెకు సమీపంలో తచ్చాడుతూ వుండినాడు. ఒక బిచ్చగాడు గేటులో ప్రవేశించినాడు, అతనిమీద కుక్కలు దాడిచేసినాయి. ఒక గంట తర్వాత మెల్లని అస్పష్టమైన పియానొధ్వనులు అతని చెవులబడినాయి. ఆన్నా సెర్గేయెవ్నా వాయిస్తూ వుండవచ్చు. హఠాత్తుగా తలవాకిలి తెరచుకొని, ఒక ముసలామె బయటికి నచ్చింది, పరిచితమైన తెల్లపొమెరేనియా కుక్క ఆమెవెంట వుండింది. గూరొవ్‌ కుక్కను పిలవడానికి ప్రయత్నించినాడు, కానీ అతని గుండె తీవ్రంగా కొట్టుకొంది, ఆ ఆందోళనలో అతనికి దాని పేరు జ్ఞాపకం రాలేదు.

అతను నడుస్తూ ముందుకు సాగినాడు, బూడిద రంగు కంచెను ఆంతకంతకూ యెక్కువగా ద్వేషిస్తూ. కోపంగా అతను ఆన్నా సెర్గేయెవ్నా తన్ను మరచిపోయిందనీ, బహుశా యిప్పటికి మరొకణ్ని చూసుకొని వుంటుందనీ, పొద్దస్తమానం యీ పాపిష్ఠి కంచెను చూడవలసి వున్న యువతికి అంతకంటె సహజమైనది యేముంటుందనీ తనలో తాను అనుకోడానికి సిద్ధంగా వుండినాడు. ఆతను హోటల్‌కు తిరిగిపోయి తన గదిలో సోఫా మీద కొంతసేపు పండుకున్నాడు, యేమి చేయడానికీ తోచక; తరువాత అతను భోజనం చేసినాడు, భోజనం తరువాత చాలా సేపు నిద్రపోయినాడు.

నిద్ర లేచి చీకటిగా వున్న కిటీకీలవైపు చూస్తూ అతను ‘యెంత తెలివిలేని, శాంతి లేని వ్యవహారం,’ అనుకున్నాడు. అప్పటికి సాయంత్రమైంది. ‘నిద్రంతాతీరింది. యేం చెయ్యాలి రాత్రికి?’

అతను మంచంమీద లేచి కూర్చున్నాడు. ఆ మంచంమీద కప్పిన చౌక, బూడిదరంగు రగ్గు ఆస్పత్రి దుప్పట్లను గుర్తుకు తెచ్చింది. ఆ కలతలో అతను తన్నుతాను భంగించుకోసాగినాడు:

‘నీవూ, నీ కుక్కను వెంటబెట్టుకున్న మహిళా. .. మంచి ప్రణయ వ్యవహారమే!నీ కష్టాలకు ప్రతిఫల మేమిటో చూడు.’

ఆ ఉదయం అతను స్టేషన్‌లో దిగినప్పుడు, స్థానిక నాటకశాలలో ‘గెయ్‌షా ‘ప్రథమప్రదర్శన అని బ్రహ్మాండమైన అక్షరాలలో ప్రకటించే పోస్టర్‌ చూసినాడు. అది జ్ఞాపకం వచ్చి అతను లేచి, నాటకశాలకు దారితీసినాడు.

‘ఆమె ప్రథమ ప్రదర్శనలకు పోవడం యెంతైనా ప్రాయికం,’ అనుకున్నాడు అతను.

నాటకశాల నిండివుండింది. అది అచ్చం చిన్న పట్టణాల నాటకశాల, దీపాలచుట్టూ పొగమంచు చేరుతూ వుండింది, గాలరీలోని జనం అస్థిమితంగా గోలచేస్తూ వుండినారు.. ఫస్టుక్లాసులోని మొదటి వరుసలో స్థానిక షోకిల్లాలు తెర లేవడం కొరకు కాళ్ళమీద కాచుకొని వుండినారు.. గవర్నర్‌ బాక్సు ముందు సీటులో గవర్నర్‌కూతురు కూర్చొని వుంది, మెడలో బోవా ధరించి; బాక్సు తెరల చాటున గవర్నరు వినయంగా దాక్కున్నాడు, చేతులు మ్యూతం బయటికి కనిపించేటట్లు. తెర కదిలింది, ఆర్కెస్ట్రా తమ వాద్యాలు శ్రుతి పెట్టుకోడానికి చాలాసేపు పట్టింది, లోపలికి వచ్చి, తమతమ ఆసనాలలో కూర్చునే ప్రేక్షకులను గూరొవ్‌ కన్నులు ఉత్సుకతతో కలయజూస్తూ వుండినాయి. అన్నా సెర్గేయెవ్నా కూడా లోపలికివచ్చింది. ఆమె ఫస్టుక్లాసులోని మూడవ వరుసలో కూర్చుంది. గూరొవ్ చూపు ఆమెమీద పడినప్పుడు, అతని గుండె ఆగినట్లైంది, మెరుపులాగ అతనికి మనసుకు వచ్చింది, యావత్ప్రపంచంలోనూ తనకు యింతకంటె ఆత్మీయమైనవాళ్ళూ, ప్రియతమమైనవాళ్ళూ లేరని, తన ఆనందానికి యింతకంటె ముఖ్యమైనవాళ్ళు లేరని. యీ చిన్న స్రీ చిన్నపట్టణం జనంలో కలిసిపోయినది, యేవిధంగానూ అసాధారణమైనది కానిది, చేతిలో వెధవ బైనాకులర్స్‌ పట్టుకున్నది, యిప్పుడు తన జీవితమంతా ఆక్రమించింది, తన దుఖమూ, తన ఆనందమూ, తన సమస్తవాంఛా అయింది. దుర్బల, అపరిణత వయొలినిస్టులు గల దౌర్భాగ్యపు ఆర్కెస్ట్రా నుండి వచ్చే ధ్వనులచేత జోకొట్టబడి ఆమె యెంత అందంగా వుందా అని అతను అనుకున్నాడు. .. అనుకుంటూ, కలలలో మునిగిపోయినాడు. ..

ఆన్నా సెర్గేయెవ్నా వెంట గుండ్రని భుజాలూ, చిన్న పుస్తీలూ గల పొడవాటి యువకుడు వుండినాడు; ఆమె పక్కన కూర్చున్నాడు. అతను ఆడుగడుగునా తల ఆడిస్తూ, నిత్యం యెవరికో ఒకరికి నమస్కరిస్తున్నట్లు కనిపించినాడు. యితను ఆమె భర్త, అయివుండాలి – యాల్టాలో ఆమె, మంట పుట్టినప్పుడు, ‘జోహుకుంగాడు’ అన్న మనిషి. అతని జండాకర్ర లాంటి ఆకారంలోనూ, పుస్తీలలోనూ, నడినెత్తినవున్న కాస్త బట్టతలలోనూ నిజంగా సేవకుని దాస్యభావం కొంత వుండింది. అతను తియ్యని చిరునవ్వులు నవ్వుతూ వుండినాడు; కోటు కాజాలోవున్న యేదో విజ్ఞానశాస్త్ర సంఘపు బాడ్డి నౌకర్ల దుస్తులమీది నంబరు లాగ వుండింది.

మొదటి ఇంటర్వల్‌లో భర్త సిగరెట్టు కాల్చుకోడానికి బయటికి వెళ్ళినాడు. ఫస్టుక్లాసు సీటులో కూర్చొని వుండిన గూరొవ్‌ ఆమె వద్దకు వెళ్లి, కంపిస్తున్న కంఠంతో, బలవంతపు చిరునవ్వుతో ‘నమస్తే’, అన్నాడు.

ఆమె అతనివైపు కన్నులెత్తి, పాలిపోయింది, భయంతో మళ్లీ అతని వైపుచూసింది, తన కన్నులనే నమ్మలేకపోయింది, చేతిలోని విసనకర్రనూ, బైనాకులర్లనూ అణగబట్టుకుంది, స్మృతితప్పి పడిపోకుండా వుండడానికి ప్రయత్నిస్తున్నదని అర్ధమౌతున్నది. యెవరూ ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆమె అక్కడే కూర్చొనివుంది; అతను ఆమె పక్కనే నిలబడి వున్నాడు, ఆమె యిబ్బంది వలన అస్థిమితుడై, కూర్చొనే సాహసం లేక. ఫిడేళ్ళూ, వేణువులూ వాటికి పెట్టిన శ్రుతులలో పాడేస్తున్నాయి. వాతావరణంలో యేదో వ్యగ్రత వుండింది, అందరి కన్నులూ వాళ్ళమీదనే వున్నట్టు. చివరకు ఆమె లేచి వడివడిగా ఒక వాకిలి వైపు నడిచింది. అతను ఆమెను అనుసరించినాడు, యిద్దరూ లక్ష్యరహితంగా కారిడర్లలోనూ, నిచ్చెనలలో పైకీ, కిందికీ తిరిగినారు; న్యాయశాఖ ఉద్యోగుల, హైస్కూలు టీచర్ల సివిల్‌ఉద్యోగుల దుస్తులలో వున్న రూపాలు, అన్నీ బాడ్జీలు ధరించినవి, మెరుపుల్లా కనిపించి పోతున్నాయి; స్త్రీలూ, గుంజలకు వ్రేలాడే కోట్లూ మెరుపుల్లా కనిపించిపోతున్నాయి; బస్సున గాలి వచ్చింది, సిగరెట్టు పీకల వాసనతో. గూరొవ్, గుండె ఉత్పాతంగా కొట్టుకుంటుండగా, ఆనుకున్నాదు:

‘యీ మనుషులందరూ యీ ఆర్కెస్ట్రా దేనికోసం?. ..’

మరునిముషంలో అతనికి హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది – ఆరోజు సాయంత్రం స్టేషన్‌లో అన్నాసెర్గేయెవ్నాను సాగనంపిన తర్వాత అతను అనుకున్నాడు, అంతా ముగిసిపోయిందనీ, తాము మళ్ళీ యెప్పటికీ కలుసుకోమనీ. ముగింపు యిప్పుడు యెంతదూరాన వున్నట్టు కనపడుతున్నది!

చీకటిగా వున్న ఒక యిరుకు నిచ్చెన మీద ఆమె నిలబడింది; ఆ నిచ్చెనమీద ‘అప్పర్‌ సర్కిల్‌కు దారి’ అనే బోర్డు వుంది.

‘యెంతగా జడిపించినారు నన్ను!’ అన్నది ఆమె, బరువుగా వూపిరి తీసుకుంటూ, యింకా పాలిపోయి, సగం కొయ్యబారి. ‘ఓ, యెంతగా జడిపించినారు!నేను దాదాపు చచ్చిపోయినాను! యెందుకు వచ్చినారు. మీరు? యెందుకువచ్చినారు చెప్పండి?’

‘మరి, ఆన్నా’ అన్నాడు. అతను మెత్తగా, వడివడిగా మాట్లాడుతూ. ‘మరి, ఆన్నా. .. నీవు అర్ధం చేసుకోవాలి …. అర్ధం చేసుకోడానికి ప్రయత్నించు. ..’

ఆమె అతనివైపు భయమూ, అభ్యర్థనా, ప్రేమా కలిసిన చూపు చూసింది, తరువాత నిశ్చలంగా అతనిమీద చూపు నిలిపింది, అతని రూపురేఖలు తన స్మృతిఫలకంమీద స్థిరంగా ముద్రించుకోడానికా అన్నట్లు.

‘నేను చాలా బాధపడినాను’ అంటూ ఆమె కొనసాగించింది, అతని మాటలు పట్టించుకోకుండా. ‘ప్రతి నిముషమూ మనసులో మీరే మెదిలేవాళ్ళు, మరే ఆలోచనకూ తావు లేకుండా; మీ ఆలోచనలమీదనే. బతికినాను. మరిచిపోడానికి ప్రయత్నించినాను – ఓ, యెందుకు వచ్చినారు మీరు, యెందుకు చెప్పండి?’

నిచ్చెన వద్ద పై అంతస్తు మీద యిద్దరు స్కూలుపిల్లలు సిగరెట్లు తాగుతూ, కిందికి చూస్తూ వుండినారు; గూరొవ్‌ వాళ్ళను లక్ష్యపెట్టకుండా ఆన్నా సెర్గేయెవ్నాను దగ్గరకు లాక్కొని, ఆమె ముఖమూ, పెదవులూ, చేతులూ ముద్దు పెట్టుకోసాగినాడు.

‘ఓ, యేమిటి మీరు చేసేది యేమిటి మీరు చేసేది?’ అంటూ భయసంభ్రమంతో ఆమె వెనక్కి తగ్గింది, ‘మనిద్దరికీ మతులు పోయినాయి. యీ రాత్రే వెళ్ళి పాండి, యీ క్షణమే వెళ్ళిపొండి. .. భగవంతుని తోడుగా చెప్తున్నాను,మిమ్మల్ని ప్రాథేయపడుతున్నాను. .. ఓ, యెవరో వస్తున్నారు!’

యెవరో మెట్లెక్కుతుండినారు.

‘మీరు వెళ్ళిపోవాలి’ అంటూ అన్నా సెర్గేయెవ్నా గుసగుస చెప్పసాగింది. ‘వినండి ద్మీత్రీ ద్మీత్రిచ్‌. నేను మాస్కోకు మీవద్దకు వస్తాను. నేనెప్పుడూ సుఖపడలేదు, యిప్పుడు బాధపడుతున్నాను, నా కెప్పుడూ సుఖం వుండదు, యెప్పుడూ వుండదు! నా కింకా బాధ కలిగించకండి! నేను మాస్కోకు వస్తాను, మీవద్దకు, ప్రమాణంగా వస్త్తాను! యిప్పుడిక మనం విడిపోవాలి! నా ప్రేమ పెన్నిధివి కదూ, నా కరుణామూర్తివి కదూ, మనం విడిపోక తప్పదు.’

ఆమె అతని చేయి నొక్కి, బిరబిర మెట్లు దిగిపోయింది, అడుగడుగునా వెనక్కితిరిగిచూస్తూ; ఆమె నిజంగా బాధపడుతున్నదని ఆమె కన్నుల్లో కనపడింది. గూరొవ్‌ కొంచెం సేపు ఆక్కడే నిలబడినాడు, వింటూ. అంతా నిశ్శబ్దమైన తర్వాత, ఆతను తన చలికోటు కోసం పోయి, నాటకశాల నుండి వెళ్ళిపోయినాడు.

4

ఆన్నా సెర్గేయెవ్నా అతన్ని చూడడానికి మాస్కోకు పోవడం ప్రారంభించింది. రెండుమూడు నెలల కొకసారి ఆమె యన్- పట్టణంనుండి వెళ్ళిపోయేది; స్త్రీ వ్యాధుల నివుణుని సంప్రదించడానికి పోతున్నానని భర్తతో చెప్పేది, భర్త నమ్మేవాడు, నమ్మకపోయేవాడు. ఆమె మాస్కోలో యెప్పుడూ’స్లవ్యాన్‌స్కీ బజార్‌’ హోటల్లో దిగి దిగిన మరుక్షణమే ఒక యెర్రటోపీ మనిషిని గూరొవ్‌ వద్దకు పంపేది. గూరొవ్ అమె వద్దకు వెళ్ళేవాడు. మాస్కోలో యెవరికీ యీ విషయం తెలియదు.

ఒక చలికాలం ఉదయం యథాప్రకారం అతను ఆమెను చూడడానికి పోయినాడు(వార్తాహరుడు ముందు రోజు సాయంత్రం అతని కోసం వచ్చినాడు, కానీ అతను యింట్లో లేడు). అతని కూతురు అతని వెంట వుండింది; ఆమె బడి ఆ దారిలోనేగనుక, అతను పనిలో పనిగా అమెను బడిదగ్గర వదలిపెట్టవచ్చుననుకున్నాడు. సగం మంచూ సగం చినుకులూ బాగా పడినాయి.

గూరొవ్‌ కూతురుతో అన్నాడు: ‘సున్నకు పైన మూడు డిగ్రీలు వుంది, కానీ మంచు పడుతున్నది. యెండుకో తెలుసా? భూమికి ఆనుకొని మాత్రమే సున్నకు పైన వుంది, వాతావరణంలోని పై పొరలలో ఉష్నోగ్రత భిన్నంగా వుంది.’

‘చలికాలంలో ఉరుములైనా వుండవేం నాన్నా?’

యిది కూడా ఆతను వివరించినాడు. అతను ఒక వైపున మాట్లాడుతూ, మరొక వైపున జ్ఞాపకం చేసుకుంటూ వుండినాడు, ఒక్క ప్రాణికి కూడా తెలియని, బహుశా యెన్నటికీ తెలియబోని సమావేశానికి తాను పోతున్నానని. తాను ద్వంద్వజీవితం జీవిస్తున్నాడు – ఒకటి బహిరంగంగా, యెవరికి సంబంధించిందో వాళ్ళందరియెదుటా జీవించేది, సాంప్రదాయిక సత్యంతో, సాంప్రదాయిక వంచనతో నిండినది, సరిగ్గా తన మిత్రుల, పరిచితుల జీవితాలలాంటిది; మరొకటి రహస్యంగా ప్రవహించేది. యేదో వింత, బహుశా కేవలం యాదృచ్ఛికమైన పరిస్థితుల పరంపరచేత, ముఖ్యమైనదీ, ఆసక్తికరమైనదీ, సారభూతమైనదీ ప్రతీదీ, దేన్ని గురించి తాను చిత్తశుద్ధిగా వున్నాడో, దేన్ని గురించి తాను ఆత్మవంచన చేసుకోడో ఆ ప్రతీదీ, తన జీవితపు గుజ్జు అయిన ప్రతీదీ, రహస్యంగా జరుగుతున్నది. కానీ తనలో బూటకమైనది ప్రతీదీ, తానూ, తనలోని సత్యమూ దేనిలో దాక్కున్నారో ఆ పొట్టు అయిన ప్రతీదీ – బాంకిలో తన పనీ, క్లబ్బులో చర్చలూ, తన ‘అధమజాతి ‘ భార్యతో కలిసి వార్షికోత్సవాలకు హాజరు కావడమూ – ఉపరితలంలోజరుగుతున్నది. తనను బట్టి అతను యితర్లను అంచనావేయనారంభించినాడు, కనపడేదాన్ని యిక యెంతమాత్రమూ నమ్మకుండా, ప్రతి వ్యక్తియొక్కా నిజమైన, ఒకే ఒక ఆసక్తికరమైన జీవితం రాత్రి ముసుగులో, రహస్యంగా సాగుతుందని నిత్యం నమ్ముతూ. ప్రతి వ్యక్తి మనుగడా నిగూఢత చుట్టూ పరిభ్రమిస్తుంది; వ్యక్తిగతరహస్యాలకు ఉచితమైన గౌరవం గురించి సంస్కారవంతులందరూ అంత గట్టిగావట్టుబట్టడానికి ప్రధానకారణం బహుశా అదే కావచ్చు.

బడి వాకిలివద్ద కూతురును వదలి, గూరొవ్‌ ‘స్లవ్యాన్‌స్కీ బజార్‌’ కు పోయినాడు. హాలులో అతను చలికోటు విప్పి, పై అంతస్తుకు పోయి, మెల్లగా తలుపు తట్టినాడు. ఆన్నా సెర్గేయెవ్నా ఆతనికి అత్యంతప్రీతికరమైన బూడిదరంగు దుస్తు ధరించి, ప్రయాణం చేతా, సందిగ్ధ మనస్కత చేతా నీరసించి, గత సాయంత్రంనుండి అతని కోసం నిరీక్షిస్తూ వుండింది. ఆమె పాలిపోయి వుండింది, చిరునవ్వు లేకుండా అతనివైపు చూపింది, కానీ అతను గదిలో అడుగు పెట్టీ పెట్టకముందే అతని కౌగిట్లో వాలింది. వాళ్ళ ముద్దు దీర్ఘంగా, చాలా సేపు సాగింది, చాలా యేండ్లుగా వాళ్ళు కలుసుకోనట్లు.

‘బాగున్నావా?’ అని అతను అడిగినాడు. ‘యేమైనా కొత్త సంగతులా?’

‘ఆగు, ఒక నిముషంలో చెప్తాను. .. ఉహూఁ,చెప్పలేను. ..’

ఆమె మాట్లాడలేకపోయింది, యేడుస్తూ. పక్కకు తిరిగి చేతిగుడ్డ కండ్లకు అద్దుకుంది.

‘యేడుపంతా యేడ్చేసిందాకా అగుతాను,’ అనుకుంటూ అతను కుర్చీలో కూలబడినాడు.

అతను గంట నొక్కి టీ తెప్పించుకున్నాడు. అతను టీ తాగుతుండగా ఆమె యింకా అక్కడ నిలబడే వుంది, కిటికీవైపు ముఖం తిప్పి. ఆమె హృదయభారంచేత యేడ్చింది, తమ జీవితం యెంత దుఃఖభాజనమైందా అన్న బాధాకరస్పృహ చేత యేడ్చింది; తాము ఒకరినొకరు చూసుకునేది రహస్యంగా మాత్రమే, లోకానికి చాటుగా మాత్రమే, దొంగలైనట్లు. తమది భగ్నజీవితం కాదా?

‘యేడవాకు’ అన్నాడు అతను.

తమ యీ ప్రేమ త్వరలో అంతం కాదనీ, యెప్పుడంతమయ్యేదీ యెవరికీ తెలియదనీ అతనికి స్పష్టంగా వుంది. అన్నాసెర్గేయెవ్నా తనను అంతకంతకూ అపేక్షగా ప్రేమిస్తున్నది, తనను ఆరాధిస్తున్నది, యెప్పుడో ఒకనాడు యీ ప్రేమ అంతం కాకతప్పదని ఆమెతో చెప్పడంలో అర్ధం లేదు. నిజానికి ఆమె తన మాట నమ్మదు.

అతను దగ్గరికి పోయి ఆమె భుజాలు పట్టుకున్నాడు, తేలిక మాటలతో ఆమెను లాలించే ఉద్దేశంతో; కానీ అప్పుడే అతనికి అద్దంలో తన రూపం కనపడింది.

అతని తల అప్పుడే తెల్లబడడం ప్రారంభమైంది. గత కొద్ది యేండ్లలో అంతగా తాను వయసెక్కడం అతనికి చిత్రమనిపించింది. తన చేతులకింద వున్న భుజాలు వెచ్చగా, జీవశక్తితో ప్రకంపిస్తూ వున్నాయి. యీ జీవం పట్ల, అంత వెచ్చగా, ఆంత అతిలోకంగా వున్న, కానీ తన జీవంలాగే బహుశా త్వరలో వాడి, వాలిపోనున్న యీ జీవంపట్ల, అతనికి అనుతాపం కలిగింది. యెందుకామె తన్నుఅంతగా ప్రేమించింది? స్త్రీలు యెప్పుడూ తనను తన నిజమైన వ్యక్తిత్వంకంటె భిన్నమైనవానిగా నమ్మినారు; వాళ్ళు తనను గాక, తన్ను గురించి తమ మనసులో ఊహించుకున్న వ్యక్తిని ప్రేమించినారు, తమ యావజ్జీవితాలూ తాము అన్వేషించిన మనిషిని. తరువాత వాళ్ళు తమ పొరపాటును కనుక్కున్నప్పుడు, యథాపకారం ప్రేమిస్తూనే వుండినారు. వాళ్లలో ఒక్కరూ తనతో సుఖపడలేదు. కాలంగడిచేకొద్దీ తాను ఒక స్త్రీ తరువాత మరొకరిని కలుసుకున్నాడు, ప్రతివొకరితోనూ సన్నిహితుడైనాడు, ప్రతివొకరితోనూ విడిపోయినాడు, కానీ యెప్పుడూ ప్రేమించలేదు. వాళ్ళతో ఆతనికి నానా రకాల సంబంధాలు వుండినాయి, కానీ ప్రేమ యెప్పుడూలేదు.

యిప్పుడు మాత్రమే, తల వెండ్రుకలు తెల్లబడినప్పుడు, అతనికి చక్కగా, పూర్తిగా, జీవితంలో మొదటిసారి ప్రేమ కలిగింది.

అతనూ, అన్నా సెర్గేయెవ్నా గాఢసన్నిహితులలాగ, భార్యా భర్తలలాగ, ఆప్తమిత్రులలాగ పరస్పరం ప్రేమించుకున్నారు. విధి వాళ్ళను ఒకరికోసమొకరిని ఉద్దేశించినట్టుంది, మరి ఆమె కొక భర్తా, ఆతని కొక భార్యా యెందుకుండవలసివచ్చిందో వాళ్ళ కర్ధం కాలేదు. చలికాలంలో దేశాంతరాలకు వలసపోయే పక్షులు, పుంజూ, పెట్టా, పట్టుకొని వేరువేరు పంజరాలలో బంధింపబడినట్లుండినారు వాళ్ళు. గతంలోనూ, తమ వర్తమానంలోనూ వాళ్ళు ఒకరి మూలంగా ఒకరు సిగ్గువడిన ప్రతిదానికీ ఒకరి నొకరు క్షమించుకున్నారు; యీ ప్రేమ తమను యిద్దరినీ మార్చినట్లువాళ్ళకు అనిపించింది.

యింతకు మునుపు, విచార సమయాలలో, తనకు యే వాదం మొదట తోస్తే ఆ వాదంతో తన్ను తాను ఓదార్చుకునేవాడు, కానీ యిప్పుడతనికి వాదాలు నిరుపయోగం, అతనికి ప్రగాఢమైన అనుతాపం కలిగింది, నిష్కపటంగా,ఆర్ద్రంగా వుండాలని కాంక్ష కలిగింది.

‘యేడవాకు అన్నా,’ అన్నాడు అతను. ‘యేడుపంతా యేడ్చేసినావుగా, యిక ఆపు. .. యిక కాస్త మాట్లాడుకుందాం, యేం చెయ్యాల్నో ఆలోచిద్దాం.’

తరువాత వాళ్ళు చాలాసేపు తమ పరిస్థితిని చర్చించినారు; దాక్కోవడాలకూ,వంచనకూ, వేరువేరు వూర్లలో వుండడానికీ, ఆంత దీర్ఘకాలం కలుసుకోకుండా వుండడానికీ అవసరం లేకుండా చేసుకోవడం యెలాగని ఆలోచించినారు. తాము యీ దుర్భరమైన శృంఖలాలు విదలించుకోవడం యెలాగ?

‘యెలాగ? యెలాగ?’ మళీ మళ్లీ అన్నాడు అతను చేతులతో తల పట్టుకొని.

నిర్ణయం వ్రేలెడు దూరంలో వున్నట్లూ, ఆ తరువాత అందమైన కొత్తజీవితం ప్రారంభం కానున్నట్లూ వాళ్ళకు అనిపించింది. అంతం యింకా చాలా చాలా దూరంలో వుందనీ, ఆత్యంత కష్టమైన, క్లిష్టమైన భాగం యిప్పుడే ప్రారంభమౌతున్నదనీ వాళ్ళిద్దరూ గుర్తించినారు.

1899


Featured image courtesy: William Smith. (1870-1941) Scottish school impressionist beach walk. C1906

2-9-2025

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%