
చాలా సంతోషంగా ఉంది. పదిహేనేళ్ళ కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టులో మొదటిభాగాన్ని ఇప్పటికి సంతృప్తిగా పూర్తిచేయగలిగాను. ‘కథలు ఎలా పుట్టాయి: ప్రాచీన కథారూపాల పరిచయం’ అనే ఈ పుస్తకాన్నిలా ఈ-బుక్కుగా మీ చేతుల్లో పెట్టగలుగుతున్నాను.
2010 నాటి మాట. మహమ్మదు ఖదీరుబాబు నాగార్జున సాగరులో రైటర్సు మీటు పెట్టి నన్ను కూడా ఆహ్వానించేడు. కథల గురించి నన్ను కూడా మాట్లాడమన్నాడు. ఆ రోజు నా చేతుల్లో టాల్ స్టాయి ‘విందు తర్వాత’ కథకు ఎవరో చేసిన సరికొత్త అనువాదం ఉంది. ఆ కథని ఎందుకని ప్రతి తరంలోనూ అనువదించకుండా ఉండలేకపోతున్నారని ప్రశ్నిస్తూ, నాకు తోచిన వివరణ చెప్పాను. ఆ ప్రసంగం మిత్రులకు నచ్చింది. మీరు మరికొన్ని కథల్నిట్లానే విశ్లేషించకూడదా అనడిగారు.
ఆ ప్రశ్న ఆ తరువాత అయిదేళ్ళ నా జీవితాన్ని తల్లకిందులు చేసేసింది. ఆ అయిదారేళ్ళకాలంలోనూ నేను వందలాది కథలు చదివాను. విడివిడిగా కథలమీద విశ్లేషణలు రాయడం కాదనీ, అసలు కథ పుట్టుక, పరిణామం, శిల్పాల గురించి నాలుగు సంపుటాలు తేవటానికి ఒక సమగ్రప్రణాళిక వేసుకున్నాను. అందుకోసం కథల్ని ఎంచుకుని వాటిని అనువదించి పెట్టుకున్నాను కూడా.
ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల ముందుకు సాగని ఆ ప్రాజెక్టులో ఒక కదలిక వచ్చింది. ఇప్పటికి మొదటిసంపుటంలో మొదటిభాగాన్నిలా వెలువరిస్తున్నాను. ఈ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.
ఆత్మీయులు, ప్రసిద్ధ కథకులు శ్రీ వి.రాజారామ్మోహన రావుకు ఈ పుస్తకాన్ని కానుక చేస్తున్నాను.
కవర్ పేజీ మీద ఫోటో జయతి లోహితాక్షన్ గారి సౌజన్యం.
ఇది నా 66 వ పుస్తకం.
22-7-2025
అభినందనలు సార్, డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుంటున్నా, తర్వాత చదువుతాను సార్
ఎట్లా సార్ ఇట్లా…పున్నమికీ అమావాస్య కీ కూడా ఇంత వెలుగు పంచితే…❤️❤️
థ్యాంక్ యూ .థాంక్యూ
ఏం చెప్పినా ఎంత బాగా చెప్తారు!
ఎంత సహృదయత మాస్టారూ. మీ గురుఋణం ఎలా తీర్చుకోవాలి. మీరు మా జీవితానికి ఒక లైట్ హౌస్ మాస్టారూ. ఈ జన్మకి ఇంక ఏమీ అక్కర్లేదు. మీరు రాసినవి అన్నీ చదివితే ఆ వెలుగు మళ్ళీ జన్మకి కూడా సరిపోతుందేమో.
హృదయపూర్వక నమస్కారాలు సార్!