
వెనక్కి తిరిగి చూసుకుంటే స్వేచ్ఛ నుంచి నాకు 2020 లో పుట్టినరోజు శుభాకాంక్షలు అందినట్టు ఉంది. అంటే మా స్నేహం మొదలై అయిదేళ్ళయిందన్నమాట. కాని నేను ఆమెని మొదటిసారి చూసింది మూడేళ్ళ కిందట. ‘దేశదేశాల కవిత్వం’ ఆవిష్కరణ సభలో. గాలినాసరరెడ్డి, అనిల్ బత్తుల సంకలనం చేసిన ఆ పుస్తకంలో స్వేచ్ఛతో కూడా ఒక కవిత అనువాదం చేయించారు. ఒ.ఎన్.వి.కురుప్ కవితకు ఆమె చేసిన అనువాదం గురించి నా ప్రసంగంలో ప్రస్తావించాను. ఆ మీటింగు అయిపోగానే ఆమె వచ్చి నన్ను పలకరించారు. తన కవిత్వసంపుటి పంపిస్తానని చెప్పారు. కాని ఆ విషయం ఆమె, నేను ఇద్దరం మర్చిపోయాం.
తిరిగి మళ్ళా ఏడాది పోయాక మేము మళ్ళా కలుసుకున్నాం. కుప్పిలి పద్మ ‘దేశదిమ్మరి తేనెచినుకులు’ ఆవిష్కరణ శర్మ, శాంత దంపతుల ఆతిథ్యంలో, వారి ఇంట్లో జరిగింది. ఆ రోజు భూమ్యాకాశాల్ని చుట్టబెట్టిన వాన. ఆ వర్షంలోనే ఆ చిన్నిగోష్ఠికి వచ్చిన మిత్రుల్లో స్వేచ్ఛ కూడా ఉన్నారు. ఆమె ఆ రోజు నాదగ్గరే ఎక్కువసేపు కూచున్నారు. మేము ఆ రోజు చాలానే మాట్లాడుకున్నాం. ఆమె కళ్ళల్లో, ఆ సౌమ్యసన్నిధిలో చిన్నపిల్లల్లో మాత్రమే కనవచ్చే ఒక ముగ్ధత్వం. ఒక immaculate innocence. ఆమెతో ఒకే ఒక్కసారి మాట్లాడినా కూడా ఆ పసిపాపల దరహాసం నీ వెంటవస్తూనే ఉంటుంది. ఇక సెలవు తీసుకుని వచ్చేసేముందు ఆమె ‘ఒక పున్నమిరాత్రి మా ఇంటిడాబా మీద కూచుని కబుర్లు చెప్పుకోవాలి మనం’ అని అన్నారు, అక్కడున్న తక్కిన మిత్రుల్ని కూడా కలుపుకుంటూ.
ఆ పున్నమి రాలేదుగానీ, మళ్ళీ ఏడాది గడిచేక, కిందటేడాది సెప్టెంబరులో ఒక రాత్రి ఆమె నుంచి ఒక మేసేజి. తెలంగాణాలో ఎక్కడో ఒక హాస్టల్లో పిల్లలకి సరిగ్గా అన్నం పెట్టడం లేదనీ, అదేమిటని అడిగితే ఆ హాస్టలు ఉద్యోగులు ఆ పిల్లల్ని తిడుతున్నారనీ. అది ఆమె ట్విట్టరులో పెట్టిన ఒక పోస్టు. పిల్లలు ధర్నా చేసినా కూడా అధికారులు స్పందించలేదని కూడా రాసారామె. అది ఒక సంక్షేమ శాఖకి చెందిన ఒక గురుకుల పాఠశాల. ఆ సొసైటీ సెక్రటరీ నంబరు పంపిస్తే నేను వారితో మాట్లాడతానని మెసేజి పెట్టాను. ఆమె నేరుగా ఆ శాఖకి చెందిన ప్రభుత్వకార్యదర్శి నంబరే నాకు పంపించారు. ఆ కార్యదర్శి నాకు తెలిసినాయనే. గతంలో మేము కలిసి పనిచేసాం. వెంటనే ఆ వార్త ఆయనకి పంపించాను. ఆయన తగిన చర్య తీసుకుంటానని వెంటనే జవాబిచ్చారు. ఆ జవాబు ఆ రాత్రే స్వేచ్ఛకి పంపించాను.
మళ్ళా ఏడాది గడిచింది. కానీ ఇప్పుడు విన్న వార్త ఇది. విన్నప్పటినుంచీ నా మనసు చాలా బ్లాంక్ గా ఉంది.
అన్నట్టు కిందటేడాది ఆగస్టులో ఆమె సారంగ పత్రికలో అచ్చయిన తన కవిత లింకు నాకు పంపించారు. ఆ కవిత చూడండి:
బిడ్డలందరినీ భద్రంగా బతకనిస్తారా..??
అప్పుడొకసారి నిర్భయ
ఇప్పుడు కోల్ కతా ట్రైనీ డాక్టర్
మధ్యలో
మనం పట్టించుకోని శోకాలెన్నో
వినిపించుకోని ఆక్రందనలెన్నో-
అయినా
శరీరాలు రక్తాలు కారేదాకా,
ప్రాణముండగానే మాంసపు ముద్దలయ్యే దాకా,
హింసకు ప్రాణం పోయేదాకా-
భద్రతనో..రక్షణనో.. బాధ్యతనో..
గొంతెత్తి అడగలేకే కదా
ఏం జరిగినా జరగనట్టే.
ఏదో అయిపోయిందిలే అన్నట్టే
ఏం చేయగలం అనుకున్నట్టే
ఇంకో ఇంటి ఆడబిడ్డ చచ్చినా
నా ఇంటిదాకా రాలేదనో..
చావింటికి..నీ ఇంటికి..
వందలు వేల అబద్ధపు గోడలు కట్టుకొనో..
నిన్నా ఇయాల రోడ్లమీదికొస్తున్న
నా దేశ ప్రజలారా..!
చదువు కోసమో..ఉద్యోగం కోసమో
బడి కోసమో..బడలిక కోసమో
బయటికొచ్చిన ఆడబిడ్డని
ఒక్క వంకర చూపు కూడా చూడొద్దని
మనస్సాక్షికి చెప్పుకొని..
మీ చుట్టూ ఉన్న బతుకులక్కూడా
భద్రత ఉన్నదని
ధైర్యంగా చెప్పలేకపోయినరా ?
పరాయి బిడ్డ పానం పోకముందే
ఈ భయాన్ని..ధైర్యంగా మార్చకపోయినరా ?
రక్షణ అంటే అడగటమో, అడుక్కోవడమో, పోరాడటమో కాదని..
ఆత్మ గౌరవమని ఎలుగెత్తి చాటలేకపోయినరా ?
ఇప్పటికైనా న్యాయం కోసం ఒక్కటైనందుకు
నీ ఇల్లే కాదు..ఏ ఇల్లూ.. చావిల్లు కానీయమని
మీ మనసుకైనా మాటిచ్చుకుంటారా..?
బిడ్డలందరినీ భద్రంగా బతకనిస్తారా..??
~
ఇప్పుడు ఈ కవిత మళ్ళా చూసేక నా మనసుకి మరీ అగమ్యంగా ఉంది. ఈ కవిత రాసినామే, ఇలా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినామే ఒక్కరేనా?
అప్పుడు రేవతీదేవి, మొన్న జగద్ధాత్రి, ఇప్పుడు స్వేచ్ఛ- నా మనసుకేమీ స్ఫురించడం లేదు. ఏమీ తోచడం లేదు కూడా. కానీ పదే పదే ఒక మాట మాత్రం అనిపిస్తోంది.
ఆత్మహత్య పిరికితనమో, లేదా అత్యంత సాహసమో చెప్పలేనుగానీ, జీవించడానికి మాత్రం కొంత పిరికితనం, కొంత సాహసం- రెండూ కావాలి. సాహసం మరీ ఎక్కువైనప్పుడో, మనం మరీ పిరిగ్గా మారుతున్నప్పుడో, ఆ imbalance సరిదిద్దడానికి నీకంటూ నువ్వు నమ్మిన ఒక దేవుడుండాలి. కాని ఇప్పుడు దేవుడి నుంచి దూరంగా వచ్చేసిన ఈ కాలంలో కనీసం ఒక ధ్యేయమేనా ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు, కనీసం మనుషులేనా ఉండాలి. ఉన్నారు కదా అనవచ్చు మీరూ, నేనూ కూడా. కానీ నిజంగా ఉన్నామా?
28-6-2025
నిజమేసర్, ఉండాలి
గొప్ప విషాదం సర్
చాలా సార్లు మనం అవతలివాళ్ల కోసం బతికి పెడుతున్నాం అనుకుంటూ ఉంటామోమో…అలాంటి జీవితం డొల్ల అని కాలాంతరంలో తెలిసిపోతుంది. ఎందుకంటే అలాంటి జీవితాలు అవతలి వాళ్ల కనుసన్నల్లో డ్రైవ్ చేయబడతాయి. మనకి తెలియకుండానే మనం మరెవరి వశంలోనో పని చేస్తుంటాం. ఆ స్పెల్ ఎప్పుడో అప్పుడు మాయమైపోతే, జీవితం శూన్యంగా అనిపిస్తుంది. స్వేచ్ఛ అంబులెన్స్ లాంటిది, ఎవరికైనా గాయాలైతే ట్రీట్ చేసి బ్రతికించే డాక్టర్ లాంటిది. అలాంటి అంబులెన్స్ కీ, డాక్టర్ కీ కూడా మెయింటెనెన్స్ అవసరం. స్పృహ కలిగి ఉన్నవారే నిస్పృహలో తల్లకిందులవుతున్న వాళ్లని బయటికి లాగి నిలకడగా నిలబెట్టగలరు. అసలైన ఆధ్యాత్మిక స్పృహ అక్కడే అవసరం. ఎవరైనా సరే…ఎవరి కోసం వాళ్లు బతకాలి. ఆ మాత్రం స్వార్థం తెలిసుండాలి. మన బతుకు మన చేతుల్లోనే ఉండాలి.
చాలా విచారకరం భద్రుడు గారు. భద్రుడు గారు స్వేచ్ఛ గారి మరణం గురించి నిన్న తెలిసినపుడు చాలా బాధ కలిగింది. ఇప్పుడు మీ ఈ చదువుతుంటే మరింత దుఃఖం తో అప్రయత్నంగా కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి. ఆమెను కుప్పిలి పద్మ గారింట్లో ఒకేసారి కలిసాను. అయినా ఎప్పటికీ మర్చిపోలేని ముద్ర వేసింది ఆ రోజు.
మీరు చెప్పినట్టు “సాహసం మరీ ఎక్కువైనప్పుడో, మనం మరీ పిరిగ్గా మారుతున్నప్పుడో, ఆ ఇంబాలెన్స్ సరిదిద్దడానికి నీకంటూ నువ్వు నమ్మిన ఒక దేవుడుండాలి. కాని ఇప్పుడు దేవుడి నుంచి దూరంగా వచ్చేసిన ఈ కాలంలో కనీసం ఒక ధ్యేయమేనా ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు, కనీసం మనుషులేనా ఉండాలి. ఉన్నారు కదా అనవచ్చు మీరూ, నేనూ కూడా. కానీ నిజంగా ఉన్నామా?”
ప్రతి ఒక్కరూ ఆలోచింపవలసిన విషయం, వేసుకోవాల్సిన ప్రశ్న ఇది.
స్వేచ్ఛ…
అందరూ కోరుకునేదే…
అంతేకాదు…స్వేచ్ఛకున్న ప్రత్యేకత అనన్యం..
అదే పేరుతో అందరితో ఆనందంగా కలిసి మెలిసి మెలుగుతూ , తన ప్రత్యేకతను నిలుపుకున్న స్వేచ్ఛ స్మృతికి నివాళి.
ఇది విషాదమే సార్. ఎప్పుడు High End
లో బతకడం కష్టం. ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్ళను ప్రతిసారీ తట్టుకోవడం సాధ్యంకాదు. నడిచి వచ్చిన దారి ” లావొక్కింతయు లేదు” అనడానికి ఒప్పుకోదు. ఇక దారి ఏది . . ఆమె గురించి ఎక్కువ తెలియదు.
ఇలా జరగాల్సింది కాదు.
ఆమె కు నివాళి
చివరి వాక్యాలు చాలా బలంగా చెప్పారు. ఏదో ఒక మనను మించిన శక్తి ఆలంబన ఒకప్పటి మానసిక చికిత్సలకు ఆధారం. అటు జ్ఞానమూ కాక ఇటు అనూచాన సంవిధానం ఆచరణా కాక
మానవత్వం మృగ్యమైన కాలం లో మనుషుల ప్రవర్తనలు విచిత్రంగా మారుతున్నాయి. ఆ విపరీత ధోరణి మాధ్యమాల నిండా వైతరణిలా ప్రవహిస్తున్నది. అన్నీ కొనితెచ్చుకున్న సౌఖ్యాల దుష్ఫలితాలే.
అరికట్టలేని ఆగడాలు
శ్రుతి మించిన ధూర్త రాగాలు
పదవికీ పట్టానికి తప్ప
పనికి రాని రాజకీయాలు
యథా రాజా తథా ప్రజా
తలకిందులై తలమునకలవుతున్నది
స్వేచ్ఛ స్వాతంత్రం రెండూ
యంత్రాంగ పంజరంలో మగ్గుతున్నవి
నియంత్రించే వాడి పై
గౌరవం క్షీణిస్తే
నిర్లజ్జ రాజ్యమేలుతుంది
అధికారి అవినీతుడైతే
అరాచకం విజృంభిస్తుంది
స్వాతంత్రపు పునాదులన్నీ
స్వార్థశిలా నిర్మితాలైనప్పుడు
వంటింట్లో వధ్య శిలలు మొలుస్తాయి
వాకిట్లో ఉరికంబాలు నిలుస్తాయి
స్వేచ్ఛకు అశ్రునయనాలతో నివాళి
Chivari vaakyaalu nijam
స్వేచ్ఛ..
ఈ అరాచకపు లోకంలో ఇమడలేక..
స్వేచ్ఛను..వెతుక్కుంటూ..
అర్ధాంతరంగా..
తన బ్రతుకును బలవంతంగా ముగించుకుని వెళ్లిపోవడమే బాధాకరం….
చాలా బాధాకరం సర్.😥
ఆత్మహత్యలన్నీ ఈ సమాజం చేసిన పరోక్షపు హత్యలే. బ్రతికున్నప్పుడు నమ్మకమైన భరోసా ఇస్తే వాళ్ళు ఎందుకలా నిరసన ప్రకటించి వెళ్ళిపోతారు. మిస్ యూ స్వేచ్ఛా … 😰
స్వేచ్ఛ మరణం బాధాకరం. అంత వ్యక్తిత్వం కల మనిషి పిరికితనంగా ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నాను. నాలాగే మరి కొందరూనూ. ఆమెను హత్య చేసి ఉరి వేశారని ఒక మాట వచ్చింది. ఏదైనా, ఆమె పేరుకు ఓటమి తెచ్చిందీ మరణం.