యుద్ధకవి

ప్రపంచ మహాకవుల్లో హోమరూ, వర్జిలూ, డాంటే, షేక్ స్పియరూ, ఫిరదౌసి, రూమీలూ,  వ్యాసవాల్మీకులతో పాటు దు-ఫు ని కూడా తలుచుకోవాలి. కాని తక్కిన మహాకవులకీ, ఈయనకీ తేడా ఏమిటంటే, కెన్నెత్ రెక్స్ రోత్ అన్నట్లుగా, ఈయన తన జీవితకాలంలో ఒక్క ఇతిహాసం కూడా రాయలేదు. ఒక్క నాటకం కూడా రాయలేదు. కేవలం ఖండకావ్యాల్లాంటి చిన్న కవితలు మాత్రమే రాస్తూ వచ్చాడు. ఆయన జీవించిఉన్నప్పుడు దాదాపు అరవై చాపచుట్టల నిడివి కవితలవి. ఇప్పుడు వాటిల్లో మనకి లభ్యమవుతున్నవి దాదాపు ఇరవై కట్టలు మాత్రమే. అంటే సుమారు పదిహేనువందల కవితలు. కాని అవి చాలు, ఆయన్ని ఒక poet-historian గా గుర్తుపెట్టుకోడానికి.

ఈ మాట అరిస్టాటిలు వింటే ఈ పదప్రయోగాన్ని ఏమాత్రం అంగీకరించడు. ఆయన దృష్టిలో కవిత్వం వేరు, చరిత్ర వేరు. హెరొడటసు రచనల్ని పద్యాలుగా మార్చినంతమాత్రాన అవి కవిత్వం కాలేవనీ, అప్పుడు కూడా వాటిని చరిత్ర అనే అంటామనీ అన్నాడు అరిస్టాటిలు. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ ఇదిలా జరిగింది అనే చెప్తుంది తప్ప, ఇదెలా జరిగి ఉండవచ్చో ఊహాగానం చేసే అవకాశం దానికి లేదంటాడు ఆయన. కవిత్వం దానికదే చరిత్రగా మారిపోదు. అలా మారాలంటే, ముందు ఆ చరిత్రని నువ్వు తేదీలుగా, సంఘటనలుగా, చారిత్రిక విశ్లేషణలుగా కాక, ఒక క్షోభగా, ఒక సంఘర్షణగా, ఒక trauma గా అనుభవించి ఉండాలి. బైబిల్లో పాతనిబంధన ప్రవక్తల అధ్యాయాలు చూడండి. చరిత్ర, సాహిత్యం ఒక్కటైపోయిన తావులవి.

యుద్ధం అంటే అన్నిటికన్నా ముందు మన దైనందిన జీవితం మొత్తం విచ్ఛిన్నమైపోవడం. అదెలా ఉంటుందో ఒక గాజాలో, ఒక యుక్రెయినులో, ఒక జాఫ్నాలో ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. మన నిత్యజీవితంలోని ఏ చిన్ని సౌకర్యాన్నీ కూడా వదులుకోకుండా, సాయంకాలం బాంకు నుంచో, కాలేజీ నుంచో, ఆఫీసునుంచో, ఇంటికి రాగానే, సేదతీరి, ఒక రిమోటు చేతుల్లోకి తీసుకుని, యుద్ధాల గురించిన వార్తలో, సినిమాలో చూస్తూ, యుద్ధమంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ ఉంటే, అది యుద్ధానుభవం కానేరదని వేరే చెప్పాలా!

యుద్ధం గురించి ఊహించుకునేవాళ్ళకి యుద్ధం గురించి రాయడంలో ఒక రొమాంటిసిజం ఉంటుంది. కాని నిజంగా యుద్ధం చేసేవాళ్ళకి అందులో రొమాంటిసిజం ఏమీ ఉండదు. ఎంత తొందరగా యుద్ధం ముగుస్తుందా అన్న చింత ఒక్కటే వాళ్ళని అశాంతిపెడుతూ ఉంటుంది. యుద్ధమధ్యంలోకి దూకక తప్పని ప్రతి ఒక్క సైనికుడూ కూడా వీలైతే ఈ విషపాత్ర తన నుంచి తప్పించాలనే కోరుకుంటూ ఉంటాడు. యుద్ధమంటే ఎలా ఉంటుందో చూడని వాడు, యుద్ధం తన జీవితాన్నీ, తన వాళ్ళ జీవితాన్నీ అతలాకుతలం చెయ్యడమెలా ఉంటుందో తెలియనివాడు మాత్రమే తుపాకుల్నీ, బేయొనెట్లనీ, బుల్లెట్లనీ కీర్తిస్తూ కవిత్వం చెప్తాడు. కాని నిజంగా యుద్ధంలో మునిగిపోయినవాడు రాసే కవిత్వమలా ఉండదు. అదెలా ఉంటుందో చూడాలంటే దు-ఫు లాంటివాడి కవిత్వం చదవాలి.

ఎవరేనా అడగవచ్చు: దు-ఫు పాల్గొన్న యుద్ధం నిర్బంధయుద్ధమనీ, అతడు తనకేమీ సంబంధంలేని రాజు కోసం యుద్ధం చేయాల్సి వచ్చిందనీ, కాబట్టి, అతడి యుద్ధంలో ఆ నిస్పృహ తప్పనిసరిగానే ఉంటుందనీ, అలాకాక, తన దేశం గురించో, తన ప్రజల విముక్తి గురించో తనంతతనే యుద్ధంలో పాల్గొన్నవాడి కవిత్వంలో మనకి యుద్ధోత్సాహం తప్పనిసరిగా కనిపిస్తుందనీ అనవచ్చు. కావచ్చు. ఇరవయ్యేళ్ళ వయసులో, జీవితవాస్తవాలు తనకి తెలియనప్పుడు, తాను చేపట్టిన యుద్ధం గురించి తను స్వయంగా అంచనా వేసుకోగల పరిజ్ఞానం, వివేకం కొరవడినప్పుడు, కేవలం ఒక త్యాగశీలత తప్ప, మనుషుల కోసం తన ప్రాణాల్ని ఆహుతి చెయ్యాలన్న నిలవనియ్యని ఆరాటం తప్ప మరేమీ తెలియని వయసులో యుద్ధోత్సాహాన్ని కీర్తిస్తూ కవిత్వం చెప్పడం అరుదు కాకపోవచ్చు. కాని పదిహేనేళ్ళకో, ఇరవయ్యేళ్ళకో యుద్ధంలోకి దూకి, ముప్ఫై, నలభయ్యేళ్ళపాటు యుద్ధ రంగంలోనే జీవిస్తూ (జైళ్లలోనో, గృహ నిర్బంధంలోనో కాదు), తాము చేస్తున్న పోరాటం ఎటు దారితీస్తున్నదో, దాని ఫలితాలేమిటో, పర్యవసానాలేమిటో తెలియక, అంతుపట్టక, ఈలోపు తనవాళ్ళకి ఎలాగూ దూరమయ్యారు సరే, ఇప్పుడు తమ యుద్ధ సహచరులు కూడా ఒకరొకరే తమ కళ్ళముందు నేలకొరుగుతూ ఉండగా కూడా ఎవరేనా ఆ తొలిరోజుల యుద్ధోత్సాహంతో కవిత్వం చెప్పినవాళ్ళున్నారా? ఉంటే, ఆ కవిత్వం చదవాలని ఉంది నాకు. కాని అప్పటిదాకా, దీర్ఘకాలిక యుద్ధంలో పాల్గొన్న వాళ్ళ కవిత్వానికి దు-ఫు కవిత్వమే ఉదాహరణగా కనిపిస్తుంది నాకు.

ఎనిమిదవ శతాబ్ది చైనాలో రాజకీయ అస్థిరత, క్షామం, అగ్నిప్రమాదాలు, తుపాన్లు, ఆకలి, అకాలమరణాల మధ్య, ఎడతెగని యుద్ధాలమధ్య సంచరించిన దు-ఫు తన జీవితకాలమంతా తిరిగి తన స్వగ్రామానికి వెళ్ళిపోవాలనీ, అక్కడ తన భార్యాబిడ్డల్తో ఒక చిన్న ఇంట్లో, ఒక సాధారణ రైతు జీవితం జీవించాలనీ కలలుగంటూనే ఉన్నాడు. చివరికి తన స్వగ్రామానికి చేరుకోలేక ఆ దారిలోనే మరణించాడు కూడా! కాని ఆ గృహోన్ముఖ ఆకాంక్ష ఒక్క దు-ఫుది మాత్రమే కాదు. ఎనిమిదవ శతాబ్దిలో అతడి సమకాలికుడైన ప్రతి ఒక్క చీనీయుడిదీ కూడా. కాబట్టే ఆ కవిత్వాన్ని ప్రజలు రెండుచేతులా ఆహ్వానించేరు. అతణ్ణి తమ హృదయాల్లో సుప్రతిష్ఠితుణ్ణి చేసుకున్నారు. ఇప్పటికీ! ఇప్పుడు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో కూడా అతడే సర్వోన్నత చీనాకవి!

దు-ఫు కవిత్వం కావ్యమయ చరిత్రకావడానికి కారణం అతడు  తాను చరిత్రని నిర్మిస్తున్నాడనుకోకపోవడం. అరిస్టాటిలు చెప్పినట్టు చరిత్ర ఎంతసేపూ ఏదెలా జరిగిందో చెప్తే, కవిత్వం ఏదెలా జరిగి ఉండవచ్చో చెప్తుందని అనుకుంటే, దు-ఫు కవిత్వం చేసింది ఆ పనే. అతడు తన కళ్ళముందు సంభవిస్తున్న చరిత్రను చిత్రిస్తున్నప్పుడు, ఆ దృశ్యాల్ని దాటి, అతడు కోరుకుంటున్న, కలగంటున్న సాధారణ దైనందిన జీవితదృశ్యాల్ని మనతో పంచుకుంటూనే ఉంటాడు. నిజానికి ఒక మనిషి అంతిమంగా కలగనే దివ్యజీవితం, భవ్యజీవితం చాలా సాధారణమైన దైనందిన జీవితం మాత్రమే. నిజమైన మానవప్రేమికుడు కోరుకునే మరోప్రపంచంలో ఉండేదల్లా ప్రశాంతవాతావరణంలో రోజంతా పని, రాత్రికి విశ్రాంతి మాత్రమే. నేను మాట్లాడుతున్నది కవిత్వం గురించి. చరిత్రకారుల విశ్లేషణల గురించి కాదు. నాకు తెలిసి యుద్ధంలో స్వయంగా పాల్గొన్న చరిత్రకారులెవరూ లేరు. యుద్ధాలు ముగిసిపోయాక గ్రంథాలయాల్లో రూపొందే జాతి అది!

అందుకని, ఇదుగో, Sam Hamill అనువాదం చేసిన దు-ఫు కవిత్వం Facing the Snow, Visions of Tu Fu (1988) చదువుతున్నంతసేపూ నాకు ఒక ఎడతెగని యుద్ధంతో పాటు, ఒక శాంతికాముకుడైన మానవుడు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇందులో ఆయన అనువాదం   చేసిన తొంభై పైచిలుకు కవితల్లో ఒక సంక్షుభిత కాలాన్నీ, ఒక రక్తసిక్త దేశాన్నీ మాత్రమే కాదు, చిన్నిచిన్ని సంతోషాల కోసం కలలుగనడాన్ని కూడా చూసాను. ఎక్కడ చూసినా తెల్లని మనిషి ఎముకలు, నీలిరంగు యుద్ధధూమమూ ఆవరించిన ఆ కాలంలోకి ప్రయాణించాను, కాని, అదేసమయంలో ఒక కీచురాయి  పాట కూడా ఉన్నాను, రాలిపడుతున్న పూలరేకల్ని చూసాను. వసంతకాలపు వానల్తో పాటు, అడవి బాతుల క్రేంకారాలు కూడా విన్నాను. తాను రాసిన కవితల్లో  కవికి ఒకటి epic అనీ, మరొకటి lyric అనీ భేదం లేదు. ప్రతి ఒక్కటీ అతడి నిట్టూర్పునే. కాబట్టే, నేనెప్పుడూ చూసి ఉండని ఆ లాండ్ స్కేప్ లో, నా ఊహకి కూడా అందని ఆ ప్రాచీన కాలంలో, నేను అంచనాకూడా వెయ్యలేని ఆ సంఘర్షణలో సంచరిస్తున్న ఆ మానవుడు చెప్పిన కవిత్వం మాత్రం నాకెంతో సన్నిహితంగా, ఇదుగో, ఇక్కడ ఈ గుడిమల్కాపూరు కాలనీలో, నా రోజువారీ జీవితాన్ని చిత్రిస్తున్నదిగానే నాకు అనుభవానికొస్తూ ఉంది.

అటువంటి పది కవితలు మీకోసం:


యుద్ధశకటాల గీతం

ఖణేల్మంటున్న శకటాలు, అరుస్తున్న గుర్రాలు
విల్లమ్ముల్తో ముందుకు నడుస్తున్న సైనికులు.

వాళ్ళని చూస్తూ నిలబడ్డ కుటుంబాలు.
కంపిస్తున్న వంతెనని కప్పేసిన ధూళిమేఘం.

వాళ్ళ అంగీలు పట్టుకు వేలాడుతూ అడ్డుపడుతున్న
రోదనల ప్రతిధ్వనులు ఆకాశమంతా.

నువ్వు వాళ్ళని అడగాలేగాని చెప్పుకొస్తారు
‘పదిహేనేళ్ళప్పుడే నిర్బంధసైనికులమై ఉత్తరాన పోరాడేం

ఇప్పుడు నలభయ్యో ఏట పడమటివైపు ప్రయాణం
ఒకప్పుడు గ్రామాల్లో మమ్మల్ని కీర్తించేవారు

ఇప్పుడు తలనెరిసి సరిహద్దులకు పయనిస్తున్నాం.
సముద్రమంత రక్తం చిందించాం.
అయినా ఇంకా కావాలంటాడు చక్రవర్తి.

కొండలకు తూర్పుదిక్కున వెయ్యిన్నొక్క గ్రామాలు
పదివేల పైచిలుకు గ్రామాలు బీళ్ళయిపోయాయి.

ఎక్కడ చూడు పొలాల్లో కష్టిస్తున్న మహిళలు
అయినా కాలవల్లో నీళ్ళు లేవు, కంకుల్లో తాలు.

కుక్కల్లాగా, పశువుల్లాగా చీనా సైనికులు
పోరాడుతూనే ఉన్నారు నిర్విరామంగా.

నువ్వెంత అడిగినా మేం ఫిర్యాదు చెయ్యలేం
ఈ శీతాకాలం కొత్త దళాలు రావలసి ఉంది

అధికారులు కొత్త పన్నులు వసూలు చేస్తున్నారు.
కాని ఎక్కణ్ణుంచి తేవాలి సొమ్ము?

మగపిల్లలు పుట్టడంలో దుఃఖమేమిటో తెలుసుకున్నాం
అదే ఆడపిల్లలయ్యుంటే మా పొరుగింట్లోనే ఉండేవారు.

ఇప్పుడు మా మగపిల్లలు దుమ్ములో పడివున్నారు.
సరిహద్దుల్లో చెదిరిపడ్డ వాళ్ళ ఎముకల్ని
ఏరి తెచ్చుకోడానికి కూడా ఎవరూ లేరు.’

పాత ప్రేతాలు, కొత్త రోదనలు: ఎక్కడ విన్నా అవే
రాత్రంతా ఎడతెరిపిలేని మంచూ, వానా.

వెన్నెల రాత్రి

తీరపట్టణమ్మీద మళ్ళా అదే చంద్రుడు
ఆమె తన కిటికీలోంచి చూస్తూంటుంది.

మా పిల్లలు మరీ పసివాళ్ళు
రాజధానిరోజులు వాళ్ళకి గుర్తుండవు.

ఆమె సుగంధతైలకేశరాశిపైన మంచు
నిర్మలచంద్రకాంతి ఆమె బాహువులమీద.

ఎప్పటికేనా కలిసి కూచోగలమా ఆ కిటికీ పక్క,
కన్నీళ్ళు తొలగిపోతాయా మా వదనాల మీంచి?

నది ఒడ్డున చింతన

రాలిపడుతున్న ప్రతిపూలరేకా వసంతనిష్క్రమణనే
పదివేల పూలరేకలు నన్ను ఖిన్నుణ్ణి చేస్తాయి.

వెలిసిపోతున్న వసంతపుష్పాలు, దుఃఖమాగదు.
ఒకింత మధువుతో నన్ను సముదాయించుకుంటాను.

దైవమందిరాల చూరులో లకుముకిపిట్టల గూళ్ళు
రాజసమాధులదగ్గర ఒక రాతి విగ్రహం.

కనిపిస్తున్న వాటినుంచే సంతోషం స్వీకరిస్తూ
నా పానపాత్ర మళ్ళా నింపుకుంటాను.

ఆకాశ గంగ

ఏడాదిపొడుగునా ఆకాశగంగ మడ్డిపట్టి ఉంటుంది
ఒక్క నిర్మల శరద్రాత్రుల్లో తప్ప.

నాలుగైదు మేఘాలు కూడా నీడగా మారేచోట
రాత్రి పూట మాత్రం ప్రకాశవంతం.

ఆ నదిలో ఈదుతున్న తారలు నగరసౌధం మీద.
ఆ వడిలో కొట్టుకుపోతున్న చంద్రుడు.

ప్రతి శరత్తులోనూ ఆ నదిని దాటే పురాణపాత్రలు
ఏ గాలీ, ఏ కడలీ వాళ్ళని ఆపలేవు.

లి-బాయిని తలుచుకుంటూ

అడవులమీంచి వీస్తున్న శీతగాలి
నువ్విప్పుడేం తలుచుకుంటావు?

నదీసరోవరాల లోకం నుంచి
అడవిబాతులు ప్రేమలేఖలు తెచ్చేదెప్పుడు?

కవులు బతక్క తప్పదు, గుర్తింపు
లేకుండానే, తమ అంతరాత్మల్ని నమ్ముకుని.

మన ప్రాచీన కవిశ్రేష్ఠుడు గుర్తున్నాడా-
అతడికోసం ఈ నదిలో ఒక పద్యం వదిలిపెట్టు.

స్వగ్రామం

పడమటి మేఘాలు, కొండలమీద కొండలు
సూర్యాస్తమయం మీద కుమ్మరించిన సిందూరం.
సూర్యుడు భూమిలోకి నడిచివెళ్ళిపోతున్నాడు.

అలసిపోయి వృద్ధాప్యంలో నా ఇంటికి రాగానే
నా కుటీరం చుట్టూ పాటపాడుతూ పక్షులు.

నేనింకా బతికి ఉన్నానంటే ఆశ్చర్యం
నన్ను చూస్తూనే ఏడుస్తున్న భార్యాబిడ్డలు.

గాలులు నన్నెక్కడికో నెట్టుకుపోయాయి
కెరటాలు మళ్ళా వెనక్కి పట్టుకొచ్చాయి.

ఇంకా బతికి ఉండటం నా భాగ్యం.
ఇరుగుపొరుగూ కంచెచుట్టూ గుమికూడారు

నిట్టూర్పులు, ఏడుపులు, కుశలప్రశ్నలు.
కన్నీళ్ళతో ఎర్రబడ్డ కళ్ళతో-

సాయంకాలదీపం వెలిగించుకుని
కలిసి కట్టుగా ఒక కలలో అడుగుపెట్టాం.

కీచురాయి

కీచురాయి ఎంత అల్పప్రాణి! కాని
సున్నితంగానే మనల్ని వేధించగలదు.

పొదల్లో ఉన్నంతసేపూ అణిగిఉండి
ఇప్పుడు మా మంచం కింద చేరింది.

ఒక దిమ్మరితో అది కన్నీళ్ళు పెట్టించగలదు
ఒక ఒంటరి గృహిణికి నిద్రదూరంచెయ్యగలదు.

ఒక వీణగాని ఒక వేణువుగాని
పలికించలేవు సంగీతం దానికిమల్లే.

వాన వెలిసిన సాయంకాలం

దాహంతో గొంతుపిడచగట్టిన నా తోటకి
ఈ అపరాహ్ణపవనం వానతీసుకొచ్చింది.

అస్తమయసంధ్య ఆవిరిగక్కుతున్నట్టు పచ్చిక
మెత్తగా తళుకులీనుతూ ప్రవహిస్తున్నది నది.

ఇప్పుడు నా పుస్తకాలెవరు సర్దిపెడతారు?
ఈ రాత్రికి నేను గడిపేది పానపాత్రలమధ్యనే.

వాళ్ళకి నా గురించి మాట్లాడుకోడమొక సరదా
కాని నా ఒంటరిజీవితాన్నెవరూ తప్పుబట్టలేరు.

వానా, చంద్రుడూ, నదీతీరమూ

గర్జించినంతసేపు గర్జించి వానవెలిసిపోయాక
ఇప్పుడు నిర్మల శరద్రాత్రి.

నీళ్ళమీద పలచని బంగారుపొర
ప్రవాహంలో తేలుతున్న శరత్తార.

తేటగా, పరిశుద్ధంగా ప్రవహిస్తున్నది
ఆకాశ గంగ మునుపటిలానే.

అస్తమయసంధ్య కొండల్ని నీడతో కప్పేసింది
ఆకుపచ్చని శూన్యంలో తేలుతున్నదొక అద్దం

సార్ద్ర, శీతల సంధ్య దానిలో ప్రతిఫలిస్తున్నది
పూలమీద మెరుస్తున్నవి మంచుతునకలు.

వానని స్తుతిస్తూ

కరువు చవిచూసాం, దీర్ఘకాల వర్షాభావం తర్వాత
ఈ పొద్దున్నే నదిమీంచి దిగి వచ్చాయి మబ్బులు.

పొగమంచులాంటి వాన
ప్రతి దిక్కునా ఒక జల్లు.

గూళ్ళకి చేరుకున్నవి పక్షులు
అడవిపూల రంగులు తేటపడ్డవి.

ఇప్పుడు చీకటిపడ్డా ఆగని వానపాట
ఈ రాత్రంతా మేలుకుని మరీ వినబోతున్నాను.


Featured image: Tao Lengyue (Chinese, 1894–1985). Full Moon, 20th century, pc: The Metropolitan Museum of Art, Newyork.

1-6-2025

6 Replies to “యుద్ధకవి”

  1. ఎప్పటికేనా కలిసి కూచోగలమా ఆ కిటికీ పక్క,
    కన్నీళ్ళు తొలగిపోతాయా మా వదనాల మీంచి?

    మూలం చదవడం ఎలాగూ సాధ్యం కాదు, కానీ మీ అనువాదం కన్నీళ్లు పెట్టిస్తుంది
    దు-ఫు మీ అనువాదంలోకి ఎంత ప్రేమగా ఒదిగాడు

  2. Sir, it is chilling to read Tu Fu’s poetry in your translation. His life as a forced soldier, fighting war after war and his longing to be home with his family is heart wrenching.
    Unfortunately the world hasn’t changed much. Wars are still everywhere, and many who are dying might not even fully understand what they’re fighting for.
    In the end, it’s all a cruel game where always the innocents pay the price.

    1. దుఫు కవితను మీరు దాని యథార్ధమైన ఆవేదనతో మీలోకి తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

  3. ఎట్లాంటి కవిత్వం!! ఎంత వేదన, ఎట్లాంటి మనసు…ఇలా స్పందించిన ఒక హృదయాన్ని తలుచుకోవడమే ఈ రోజుకొక సార్థకత.

    వెన్నెల రాత్రి, కీచురాయి, ఆ శరత్తార….అద్భుతం!

    Beautiful write up sir, as always. Thank you very very much ❤️

    1. మీ ఈ స్పందన కోసమే దుఫు కూడా వేచి ఉన్నాడు .

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%