
మొన్న టాగోర్ మీద నా ప్రసంగంలో The Crescent Moon నుంచి రెండు కవితలు నా తెలుగులో వినిపించాను. వాటినిక్కడ మీతో పంచుకుంటున్నాను.
చిన్నారి దేవదూత
వాళ్ళు రంకెలు పెడుతుంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకరిపట్ల ఒకరిని చెప్పలేనంత అపనమ్మకం, నిస్పృహ, వాళ్ళ వాదవివాదాలకు అంతే లేదు.
వాళ్ళ మధ్య నీ జీవితం ఒక వెలుగురేఖలాగా సాగనివ్వు. నా తండ్రీ, ఆ వెలుగు నిర్మలంగా, నిశ్చలంగా, వాళ్ళని నిశ్శబ్దం వైపుగా నడిపించనివ్వు.
వాళ్ళ అసూయతో, వాళ్ళ దురాశతో వాళ్ళు చాలా క్రూరులు. వాళ్ళ మాటలు రక్తంకోసం దాహంగొన్న రహస్యఛురికలు.
వెళ్ళు నాన్నా, వెళ్ళి రుసరుసలాడుతున్న ఆ హృదయాల మధ్య నిలబడు. నీ చల్లని చూపులు వాళ్ళమీద పడగానే కల్లోలభరితమైన ఒక దినం గడిచేటప్పటి సాయంకాలంలాగా ఒక క్షమ, ఒక శాంతి దొరకాలి వాళ్ళకి.
నా తండ్రీ, వాళ్ళు నిన్ను చూడగానే సమస్త విషయాల సారాంశమూ వాళ్ళకి తేటతెల్లం కావాలి. వాళ్ళు నిన్ను ప్రేమించాలి, తమలో తాము ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
నా కన్నా, రా, వచ్చి అక్కున చేరు. సూర్యోదయవేళ నీ హృదయం ఒక పువ్వులాగా విప్పారాలి. సూర్యాస్తమయ వేళ మౌనంగా నీ శిరసు వాల్చి నీ పూజ ముగింపుకు చేరుకోవాలి.
(The Child-Angel, The Crescent Moon, 39)
దీవెన
ఈ చిన్నారి హృదయాన్ని ఆశీర్వదించండి. నింగి నుంచి నేలకు ముద్దులు మూటగట్టిన ఈ చిట్టి తండ్రిని దీవించండి.
వీడికి సూర్యుడి కాంతి అంటే ఇష్టం. వాళ్ళమ్మనే చూస్తూ ఉండటం ఇష్టం.
దుమ్ముని ఈసడించుకోడం చాతకాదు వీడికి, పసిడిమెరుగుల వెంట పడటం తెలీదు వీడికి.
వీణ్ణి మనసారా మీ గుండెకు హత్తుకుని దీవించండి.
నూటొక్కదారులు ఒకదానికొకటి అడ్డం పడే ఈ లోకంలోకి వచ్చాడు వీడు.
ఈ గుంపులో మిమ్మల్నెట్లా పోల్చుకున్నాడో తెలీదు. కాని మీ ఇంటిదగ్గరకొచ్చి నిలబడ్డాడు. మీ చేయి పట్టుకుని తనకి దారి చూపించమని అడుగుతున్నాడు.
నవ్వుతో, తుళ్ళుతో, కబుర్లు చెప్తో మీరెక్కడికి రమ్మంటే అక్కడికొస్తాడు. వాడి మనసులో మీ పట్ల రవ్వంతైనా సందేహం లేదు.
వాడి నమ్మకం నిలబెట్టుకోండి. తిన్నగా నడిపించండి. మనసారా దీవించండి.
వాడి చేతిలో మీ చేయి వేయండి. మీ దారికింద కెరటాలు ఘూర్ణిల్లుతున్నా, పైనుంచి గాలులు వీచాలని ప్రార్థించండి. ఎత్తిన వాడి తెరచాపల్ని ఆ గాలులు శాంతిస్వర్గం వైపు తీసుకుపోనివ్వండి.
మీ తొందరలో పడి వాణ్ణి మర్చిపోకండి. వాడికి మీ హృదయంలో చోటివ్వండి, మనసారా దీవించండి.
(Benediction, The Crescent Moon, 36)
13-4-2025
రెండు కవితలు గుండెలకు ఔషధ గుళికలు.
వాడి వినిర్మలనయనాలకు అనిర్మల వాతావరణం
కనిపించనీయకండి అని అన్యాపదేశంగా జనాలకు ఇస్తున్న విశ్వకవి సందేశం చిమ్మచీకట్లో నెలవంకలా దీపిస్తుంది. ఆ చిన్నారి కళ్లకాంతుల్లో
మీ మీ విద్వేషపు మరకల్ని తొలగించుకోండి అని ఎంత సున్నితంగా తెలుపుతున్నాడో. మనుషులకు సంబంధించి సూరియునికంటే గొప్ప వెలుగు లేదు . అమ్మ కంటే గొప్ప వ్యక్తి లేదు . ఆ రెంటిని ఇష్టపడే వాడిని చూసి మీరు మారండి శాంతిపర్వం రచించుకోండి అని విశదీకరిస్తున్నాడు . కనుకనే ఆయన విశ్నకవి. భారతీయ సాహిత్యాకాశంలో నెలవంక .మంచి సాహిత్య మార్గ దర్శనం చేస్తున్న మీకు మనఃపూర్వక కృతజ్ఞతా జ్యోత్స్నలు.
ఎంతో అర్థవంతమైన, సహృదయ స్పందన. మీకు నా హృదయపూర్వక నమస్కారాలు.
చాలా బాగున్నాయి మీ కవితలు సార్
ధన్యవాదాలు. అవి టాగోర్ కవితలకు నా అనువాదాలు.
కవితలు చాలా బాగున్నాయి అభినందనలు.
ధన్యవాదాలు. ఈ అభినందనలు టాగోర్ కి అందిస్తాను.