
ఒక రోజంతా ఎండలో రగిలిపోయేక
ఉన్నట్టుండి సాయంకాలానికి
గులాబీల గాలి వీచింది.
అప్పుడు ప్రతి ఒక్క మొక్క, చెట్టు, చిగురు
కొత్త ఉత్సాహం పీల్చుకున్నాయి
పెద్ద బాధ్యత ఒకటి నెరవేర్చాక
మనుషులు ఊపిరి పీల్చుకుంటారే, అట్లా.
ఎక్కడో ఎవరికో కలిగిన మంచితలపులాగా
గాలి ఇలా ఉదారంగా ఈ వీథిలోకీ ప్రవహించాక
ప్రతి ఒక్క గోడ, కిటికీ, కర్టెన్లు కూడా
కొత్తవిగా మారిపోయేయి.
చిరపరిచితమైన మనుషుల పట్ల
కొత్తగా కుతూహలం పుట్టే క్షణాలివి.
అప్పటిదాకా చదువుతున్న పుస్తకం పక్కనపెట్టేసినట్టు
ఇంతదాకా జీవించిన జీవితాన్ని
పక్కనపెట్టేవచ్చు.
ఇప్పటిదాకా రెండు ప్రపంచాలుగా ఉన్నవి
ఇకమీదట కూడా రెండుగా కొనసాగుతాయిగానీ
ఒక ప్రపంచాన్ని నేను సునాయాసంగా
మర్చిపోగలను.
అలాగని రెండో ప్రపంచం నా సొంతమైందనికాదు
కానీ నా చేతులకి ఇప్పుడొక
కొత్త వెలుగు దొరికింది
దాంతో నేనో గూడుకట్టుకోగలను.
5-4-2025
నమస్తే సర్. ఉదయాన్నే మీ అద్భుతమైన పోయమ్ పలుకరించింది హృద్యంగా
ధన్యవాదాలు సార్
“ ఇంతదాకా జీవించిన జీవితాన్ని
పక్కనపెట్టేవచ్చు.”
ఈ ఊహే చాలా ఊరట గా వుంది
కానీ
“ ఒక ప్రపంచాన్ని నేను సునాయాసంగా
మర్చిపోగలను“
ఈ మరచిపోగలగడం ఒక సాధన కదా sir!
“ కానీ నా చేతులకి ఇప్పుడొక
కొత్త వెలుగు దొరికింది”
కొత్త వెలుగును దొరికించుకోవడం ఎలా?
I guess you find what you seek!!
బావుంది సర్! 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
ఎండలో రగిలాక తాకిన గులాబీ గాలల్లే…హాయి పలకరింపు లాంటి కవిత.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు భద్రుడు గారూ…ఈ వసంత నవరాత్రుల్లో ఈ కుటీరపు శోభ ఇంకాస్త పెరిగింది. ❤️
హృదయపూర్వక ధన్యవాదాలు మానసా!