
నడక
ఆకుపచ్చమీదా, కొండకోనమీదా
బొమ్మ గీసినట్టుగా కనిపిస్తున్న
అడవి అంచుల్లో నేను నడిచినప్పుడల్లా
నా గుండెలో బాధిస్తున్న ప్రతి ముల్లుకీ
గొప్ప ప్రశాంతి ప్రతిఫలంగా దొరుకుతుంది.
మొదటినుంచీ కలలూ, కవితలూ
నన్ను వ్యాకులపరుస్తూనే ఉన్నాయి.
ఈ కొండదారిలోయలో అలరిస్తున్న దృశ్యాలు
ఉదాహరణకి ఆ తోటలు, ఆ చెట్లు
ఆ సన్నని కాలివంతెన, కనిపించీ కనిపించని కొండవాగు
చూడగలిగినంతమేరా ప్రకృతి మొత్తం ఒక వెలుగు.
వాతావరణం ఒకింత తేలికపడ్డాక
ఆ దారిన నడవాలనిపిస్తుంది.
ఎంతో దయతో ఒక దేవత నన్నా దారిన నడిపిస్తుంది
మొదటంతా ఒక అకళంక నీలిమ
అప్పుడు బూడిదరంగు మేఘాల్ని
గుమ్మటాలుగా పేర్చిపెట్టి
విరుచుకుపడే ఉరుములూ, మెరుపులూ.
అది కూడా దాటాక సమ్మోహనీయ సస్యక్షేత్రాలు
ఆ ప్రాక్తన దృశ్యచిత్రంలోంచి
సౌందర్యం ఊటలాగా పైకి చిమ్ముతుంది.
Out for a Walk
The margins of the forest are beautiful,
As if painted onto the green slopes.
I walk around, and sweet peace
Rewards me for every thorn
In my heart, when my mood has grown
Dark, for right from the very beginning
Art and thinking have cost me pain.
There are lovely pictures in the valley,
For example the gardens and trees,
And the narrow footbridge, and the brook,
Barely visible. How beautifully
The landscape shines, cheerfully distant,
Like a splendid picture, where I come
To visit when the weather is mild.
A kindly divinity leads us on at first
With blue, then it prepares clouds
Shaped like gray domes, with
Searing lightning and rolling thunder,
Then comes the loveliness of the fields,
And beauty wells forth from
The source of the primal image.
హోల్డర్లిన్ చివరి దశలో (1807-1843) రాసిన కవితల్లో ఇదొకటి. ఆ కాలమంతా ఆయన మానసికంగా అస్వస్థతలోనే ఉన్నా, అప్పుడప్పుడు, తనని తాను కూడదీసుకుని తన అనుభవానికొక అక్షర రూపం ఇవ్వడానికి ప్రయత్నించేవాడు. ఆ రోజుల్లో ఆయన్ని ఎవరో ఒకరు దగ్గరుండి సాయంకాలం పూట ఆ చుట్టుపక్కల కొండదారుల్లో నడిపించేవారు. నెకార్ నది ఒడ్డున తుబింజెన్ పట్టణ సరిహద్దుల్లో కొండల్లోనూ, పచ్చికబయళ్ళలోనూ నడిచేటప్పుడు హోల్డర్లిన్ కి ఆ దృశ్యాలు నేరుగా దృశ్యాలుగా కాక, ఒక చిత్తరవులో చిత్రించిన బొమ్మల్లాగా కనిపించేవి. తనని అలరించే ప్రతి ఒక్క దృశ్యమూ కూడా ఒక ప్రాచీన చిత్తరువుతాలూకు ప్రతిబింబంగా గోచరించేది. అటువంటి కొన్ని నిర్మల క్షణాల్లోంచి రూపుదిద్దుకున్న కవిత ఇది. ఒకప్పుడు తాను కవిత పలికితే అది ఒక దేవత తనతో రాయిస్తున్నట్టుగా భావించిన కవినే, ఇప్పుడు సాయంకాలం నడక కూడా ఒక దేవత ఎంతో దయగా తనను నడిపిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు.
2-4-2025
అడవి ని ప్రేమించే మీరు వ్రాసిన కవితల్లే వుంది, అనువాదం లా లేదు, సర్!
“చూడగలిగినంతమేరా ప్రకృతి మొత్తం ఒక వెలుగు”
ఆ దారిన నడవాలనిపిస్తుంది.
“ఎంతో దయతో ఒక దేవత నన్నా దారిన నడిపిస్తుంది”
“సౌందర్యం ఊటలాగా పైకి చిమ్ముతుంది”
చాలా గొప్పగా చెప్పారు!!🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!