
బస్సు అరగంట ముందే చేరుకుంది అనంతపురం. రాధేయగారికి ఫోన్ చేస్తే ఆయన ఉన్నపళాన వాళ్ళ అన్నగారి అబ్బాయి కారు తీసుకుని బస్ స్టాండ్ కి వచ్చేసారు. మేం హోటల్ కి చేరుకునేటప్పటికల్లా అంకే శ్రీనివాస్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అతనితో పాటు వాళ్ళబ్బాయి కావ్యవిలాసి కూడా. అయిదో తరగతి పిల్లవాడు. మార్నింగ్ క్రికెట్ ప్రాక్టీసుకి బయల్దేరాడు. వీపు వెనక అమ్ములపొదిలాగా క్రికెట్ సరంజామా. చేతిలో యోగామాట్.
ఇంకా ఆరుగంటలు కూడా కాని ఆ చలికాలపు తెల్లవారుజామున మేడమెట్లు ఎక్కి రూము దగ్గర అడుగుపెట్టేటప్పటికే ఆ కారిడార్ లో పచార్లు చేస్తూ మానస! ‘మీరు వస్తారని ఎదురుచూస్తున్నాను’ అంది. నాకు అలాట్ చేసిన గది తలుపులు తెరుస్తూనే గలగల్లాడుతున్న కబుర్లతో అంకె శ్రీనివాస్ ఆ గదిలో నిశ్శబ్దాన్ని తరిమేసాడు.
‘ఒక కప్పు కాఫీ దొరుకుతుందా’ అనడిగాను.
‘కింద రోడ్డుకవతల ఒక రెస్టరెంటు ఉంది. నిన్న రాత్రి చూసాం’ అంది మానస. వెంటనే బయల్దేరాం. రూములో దిగీదిగకుండానే ఇద్దరు సాహిత్యమిత్రులతో తెల్లవారు జామున అలా ఒక టీ స్టాలు వెతుక్కుంటూ వెళ్ళి ఎన్నాళ్ళయిందని. ఎన్నాళ్ళు కాదు. ఎన్నేళ్ళయిందని!
మేము రెస్టరెంటులో అడుగుపెట్టేటప్పటికి ఇంకా తుడుస్తూ ఉన్నారు.
‘అగరవత్తులు వెలిగించినట్టు లేదు’ అంది మానస, కోకిల ప్రవేశించే కాలంలో నా కవిత గుర్తుచేసుకుంటూ.
ప్రొప్రయిటరు తడితువాలొకటి నడుముకు చుట్టుకుని
హాల్లో దేవుడి పటానికి పూలమాల మారుస్తుంటాడు
ఒకటి రెండు అగరవత్తులు వెలిగించి ఉంటాడు
దేవాలయంలో ప్రాతఃకాల నిశ్శబ్దం కోసం
తెరవేసినట్టుగా, కొంత ప్రతీక్ష, కొంత నిశ్శబ్దం..
ఇంతలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు నందకిశోర్, నవీన్ కుమార్ లు. ఆ ఇద్దరూ కూడా చేరడంతో బృందం సంపూర్ణమయ్యింది. నవీన్ ని ఇదే మొదటిసారి చూడటం. అతణ్ణి చూడగానే ఒక చైనా నవల గుర్తొచ్చింది. మావో-డున్ అనే ఒక రియలిస్టు రచయిత రాసిన చిన్న నవల. ‘వసంత కాలపు పట్టుపురుగులు’. నేను దాన్ని తెలుగు చేశాను కూడా. ఆ కథ మొత్తం పట్టు పరిశ్రమ చుట్టూతానే తిరుగుతుంటుంది.
శ్రీనివాస్ కొడుకు కావ్యవిలాసి కి పద్యాలు కంఠతా వచ్చని అడిగితే ఏవీ వినిపించమన్నాం. ఒకటి రెండు పోతన పద్యాల తర్వాత
భూతాన్ని
యజ్ఞోపవీతాన్ని
వైప్లవ్యగీతాన్ని
అంటో మొదలుపెట్టాడు.
ఇప్పుడు ఏ యువతీ యువకుల నోటంటా మహాప్రస్థాన గీతాలు వినబడని కాలంలో మళ్ళా ఈ చిన్నబిడ్డ ఆ కవిత్వాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకొస్తున్నాడనిపించింది.
‘ఇప్పుడు చెప్పండి, మీరు రాజమండ్రి రోజుల తర్వాత అన్నేళ్ళ పాటు కవిత్వం రాయకుండా ఎలా ఉండగలిగారు?’ అనడిగింది మానస.
ఆ ఒక్క ప్రశ్న ఒక తేనెతుట్టెని కదిపినట్టయింది. ఎక్కడెక్కడి జ్ఞాపకాలూ, ఎక్కడెక్కడి మిత్రులూ, ఎప్పటెప్పటి కవిత్వాలూ గుర్తొచ్చాయి. ‘మహాసంకల్పం’ నుండి ట్రాన్స్ ట్రోమర్ దాకా. బైరాగి నుంచి కవితాప్రసాద్ దాకా.
సాహిత్యం గురించీ, కవిత్వం గురించీ రాస్తూ ఎన్సైక్లొపీడియా బ్రిటానికా ఇలాంటి టీషాపుల్లోనూ, రెస్టరెంట్లలోనే ఆధునిక కవిత్వం పుట్టిపెరిగిందని రాసినట్టు గుర్తు. ఎన్నేళ్ళ తరువాత మళ్ళా ఒక సుప్రభాతవేళ సాహిత్యమిత్రులమధ్య ఒక రెస్టరెంటులో గడిపాను! ఒకప్పుడు సమాచారం సుబ్రహ్మణ్యం పెళ్ళికి మండపేట వెళ్ళినప్పుడు చేసిన అల్లరంతా గుర్తొచ్చింది. రాత్రంతా కబుర్లు చెప్పుకున్నాక, తెల్లవారి అలసిపోయాక, ఆ అలసట తీర్చుకోడానికి మళ్ళా కబుర్లు చెప్పుకున్న ఆ రోజులు గోదావరినుంచి అనంతపురానికి తరలివచ్చాయనిపించింది.
ఏడున్నర.
మళ్ళీ ఎనిమిదిన్నరకి కలుద్దాం అనుకున్నాం.
తీరా తొమ్మిదింటికి బ్రేక్ ఫాస్ట్ కి మళ్ళా హోటల్లో అడుగుపెట్టేటప్పటికి మానసకి బదులు ఆమె సహచరుడు అనిల్, వాళ్ల ప్రహ్లాదుడూ నాకు తోడుగా ఉన్నారు. మాకు తోడుగా శ్రీనివాస్. మేం దోసెలు తింటూ ఉండగా సోమశేఖర్ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే రైలు దిగి నేరుగా హోటల్ కి వచ్చాడు. ప్రహ్లాద్ దోసె అంచుల్నించీ తింటుంటే నాకు ఆర్ట్ ఆఫ్ వార్ గుర్తొచ్చింది. ఆ ప్రాచీన చీనా యుద్ధ తంత్ర గ్రంథం అంచుల్నుంచి కేంద్రం మీదకు దండెత్తాలని చెప్తుందని గుర్తొచ్చింది. మళ్ళా కొంత సేపు ఆర్ట్ ఆఫ్ వార్ చుట్టూ కబుర్లు నడిచాయి.
తొమ్మిదిన్నరకల్లా మమ్మల్ని మీటింగ్ హాలు దగ్గర ఉండాలని రాధేయగారు ఆదేశించారుగాని, మేము అక్కడికి చేరుకునేటప్పటికి పది దాటింది. కాని అప్పటికే అనంతపురం దాదాపుగా అక్కడికి చేరుకుంది. ప్రగతిగారు, రాజారాం గారు, శాంతినారాయణగారు లాంటి అనంతపురం మిత్రుల్తో పాటు కర్నూలు నుంచి లక్ష్మి కందిమళ్ళ కూడా అక్కడికి చేరుకున్నారు.
ప్రతి ఏటా ఉత్తమ వచన కవిత్వానికి ఇచ్చే ఉమ్మడిశెట్టి పురస్కారానికి ఈ ఏడాది మరో రెండు పురస్కారాలు అదనంగా చేరాయి. ఒకటి ఉమ్మడిశెట్టి సతీష్ కుమార్ పేరుమీద ఈ ఏడాది నుంచీ ఒక జాతీయ యువ పురస్కారం. మరొకటి ఉమ్మడిశెట్టి ప్రత్యేక పురస్కారం. ఈ ఏడాది కవిత్వ పురస్కారం విశాఖపట్టణంలో ఆకాశవాణిలో పనిచేస్తున్న బండి సత్యనారాయణగారి ‘ఒంటికాలి పరుగు’ సంపుటానికి లభించింది. యువపురస్కారం మానస చామర్తి కవిత్వం ‘పరవశ’ కి లభించింది. ప్రత్యేకపురస్కారం కందిమళ్ళ లక్ష్మిగారు అందుకున్నారు.
సతీశ్ కుమార్ రాధేయగారి కొడుకు. బుద్ధిమంతుడైన పిల్లవాడు. తన తల్లి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తండ్రిని అతడు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సాకేతరాముడిలాంటి ఆ పిల్లవాడి వియోగాన్ని తట్టుకోలేక ఆ తండ్రి రాసిన ఒక కన్నీటిపాట ‘అజేయుడు’ సంపుటాన్ని ఆవిష్కరించడం కోసం నన్ను అనంతపురం పిలిచారు. నేను ఆ పుస్తకానికి ఒక ముందుమాట కూడా రాసాను.
కాబట్టి ఆ రోజు ఆ సమావేశం ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరుగా నడిచింది. సత్యనారాయణగారి కవిత్వం మీద పెళ్ళూరి సునీల్, మానస కవిత్వం మీద డా.సుంకర గోపాల్, రాధేయగారి కావ్యం పైన అంకె శ్రీనివాస్ మాట్లాడారు. ముగ్గురూ అద్భుతమైన వక్తలు. సతీష్ కుమార్ ముఖ శిల్పాన్ని ఆమ్రపాలి గారు ఫైబర్ తో రూపొందించారు. ఆ శిల్పాన్ని ఆరోజు రాధేయ గారే కన్నీటితో ఆవిష్కరించారు.
సభని డా.ఎం.ప్రగతిగారు సమర్థవంతంగా నిర్వహించారు. ఆమె హిందూపురం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాలు. కవి, కథకురాలు. కాని ఆమె బోధిస్తున్నది రసాయనశాస్త్రమనీ, అందులో చాలా లోతైన విషయం మీద డాక్టరల్ పరిశోధన చేసారనీ తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది. Investigations on DNA Binding and Cleavage Activity of Mono and Di nuclear Transition Metal Complexes ఇదీ ఆమె ఎంచుకున్న విషయం! ఆశ్చర్యం కలిగింది. ఇలాంటి విషయం ఏదైనా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసె విషయం కదా, మీరెట్లా ఎంచుకున్నారని అడిగితే, వాళ్ళ ప్రొ. కె.హుసేన్ రెడ్డిగారు కారణమని చెప్పారు. అంతేకాదు, తన పి.హెచ్.డి అనుభవాన్ని ‘ప్రతి ఫెయిల్యూర్ లో ఓ గెలిచే దారి!’ (2014) పేరిట గ్రంథస్థం చేసారు కూడా.
ఆ పుస్తకం చదివేక అర్థమయింది, ఒక స్కూలు అసిస్టెంటుగా కెరీర్ మొదలుపెట్టిన వ్యక్తి ఒక అంతర్జాతీయ స్థాయి పరిశోధకురాలు ఎలా కాగలిగిందో. ఆ చిన్న పుస్తకం నిజంగానే ఒక జయగాథ. ఉపాధ్యాయులకీ, సైంటిస్టులకే కాదు, పెళ్ళై పిల్లలు పుట్టాక, జీవితంలో ఇంక చేయవలసిందేమీ లేదని ప్రయాణం ఆపేసే ఎందరో గృహిణులకు కూడా!
సాధారణంగా సాహిత్యప్రపంచంలో ప్రింట్ మీడియా ద్వారా లబ్ధప్రతిష్ఠులు మాత్రమే పరిచయమవుతారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎక్కడెక్కడి ప్రతిభావంతులూ పరిచయమవుతున్నారు. కాని ఇదుగో ఇలా చిన్నపట్టణాలకూ, సెమీ అర్బన్ ప్రాంతాలకూ వెళ్ళినప్పుడు మరెందరో ఉత్సాహవంతులైన యువతీయువకులు పరిచయమవుతుంటారు. వారి శక్తిసామర్థ్యాలు ఎటువంటివో వారికే తెలియనట్టుగా కనిపిస్తారు. ఈ సారి మీటింగులో కూడా కొందరు అలాంటివారు కనిపించారు. లక్ష్మీ కందిమళ్ళ ఫేస్ బుక్ ద్వారా పరిచయం. ఆమె కవిత్వం ఇంతకుముందు రెండు సంపుటాలిచ్చారు. ఇప్పుడు మళ్ళా మరో రెండు సంపుటాలు ‘మిళితం’, ‘ఒక వాక్యం రాలింది’ ఇచ్చారు. ఈ పుస్తకాలన్నిటిమీదా నేనొక వ్యాసం ఆమెకి బాకీ. ఆదోని నుంచి వచ్చిన స్వయంప్రభ ‘వెన్నెల కురవని రాత్రి’ (2024) నా చేతుల్లో పెట్టారు. రాధేయగారి శిష్యురాలు, సభకి స్వాగత వచనాలు పలికిన వీణాబాయి విమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో పనిచేస్తున్నారు. కాని ఆమె కంప్యూటర్ సైన్సులో గ్రాడ్యుయేటు. మాథమెటిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ‘మీ భవిష్యత్తు హిందూపురం గ్రామసచివాలయాల్లో లేదని ఖచ్చితంగా చెప్పగలను’ అని అన్నాను ఆమెతో. ‘సాఫ్ట్ వేర్ లో ప్రయాణం మొదలుపెట్టండి. మీ భవిషత్తు నా కళ్ళకి కనిపిస్తోంది’ అని కూడా అన్నాను.
మోడల్ స్కూల్లో ఇంగ్లిషు ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న అరుణ రాధేయగారి కవిత్వం మీద మాట్లాడేరు. భోజన విరామంలో నా దగ్గరికొచ్చి ‘మీరు అన్ని పుస్తకాలు ఎలా చదివేరు’ అనడిగారు. నేనన్నాను కదా ‘మీ కన్నా వయసులో పెద్దవాణ్ణి. నేను చదివి ఉండడంలో ఆశ్చర్యం లేదు. కాని ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళో పనిచేస్తూ మీరు బెన్ జాన్సన్ కవిత్వం గురించి మాట్లాడారే, నేనింకా ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోనేలేదు’ అని.
ప్రగతి గారు ‘ముంగారు మొలకలు’ అని అనంతపురం జిల్లా మహిళా కథకుల సంకలనం ఒక కాపీ ఇచ్చారు. పాతికమంది కథకులున్నారందులో. ఇలా అనంతపురం వస్తే తప్ప ఇలాంటి పుస్తకాలు వెలువడ్డాయని తెలీదు కదా అని అనుకున్నాను.
పొద్దున్న అంకే శ్రీనివాస్ కొడుకున పరిచయమైతే, ఇప్పుడాయన కూతురు పరిచయమైంది. ఏడో తరగతి చదువుతున్న చిన్నారి. ‘మీ తమ్ముడు పొద్దున్న శ్రీశ్రీని వినిపించాడు’ అని చెప్తే, తాను
పగళ్ళన్నీ పగిలిపోయీ
నిశీథాలూ విశీర్ణిల్లీ
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది
అని మరో గేయం ఆలపించింది.
శ్రీనివాస్ కొడుకు కవితావిలాసి అయితే, ఈమె వాక్యవిన్యాస. తల్లిదండ్రులిద్దరూ తెలుగు ఉపాధ్యాయులు. ఎవరన్నారు తెలుగు ప్రమాదంలో పడిందని? ఇటువంటి కుటుంబాలున్నంతకాలం తెలుగుకి ప్రమోదమే!
నా తిరుగుప్రయాణం రాత్రి బస్సుకి కాబట్టి, ఎలానూ ఇంత దూరం వచ్చాను ఎక్కడికేనా వెళ్దామా అనుకున్నాను. పెన్నా అహోబిలం నేనింతకుముందే చూసాను. కటారుపల్లె, కదిరి, పుట్టపర్తి, లేపాక్షి కూడా చూసేసిన జాబితాలో ఉన్న పేర్లే. ఇక రెండు స్థలాలు మిగిలేయి. ఒకటి పెనుగొండ, మరొకటి తాడిపత్రి.
చనిన నాళుల తెనుగు కత్తులు
సానబెట్టిన బండ ఈ పెనుగొండ కొండ!
ఆంధ్ర కన్నడ రాజ్యలక్ష్ముల
అరితినీలపు దండ ఈ పెనుగొండ కొండ!
రాళ్ళపల్లి గీతం మనసులో మెదుల్తూనే ఉందిగాని, ఈసారికి తాడిపత్రి చూడాలనుకున్నాను. అనుకోవడమే తరవాయి, అంకె శ్రీనివాస్ ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేసేసాడు. మేము తాడిపత్రి వెళ్తున్నామని తెలిసి పెళ్ళూరి సునీల్, దోర్నాదుల సిద్ధార్థ తాము కూడా మాతో బయల్దేరారు.
దారి పొడుగునా శ్రీనివాస్ అనంతపురం చరిత్ర చెప్తూనే ఉన్నాడు. ప్రతి ఊరూ, ప్రతి కొండా, ప్రతి చెరువూ, ప్రతి పల్లె- అతడికి అనంతపురం అరచేతిలో ఉసిరికాయ.
మేమొక కారులో, మానస కుటుంబం, నందూ, నవీన్ మరో కారులో. మేము తాడిపత్రి చేరుకునేటప్పటికి సాయంసంధ్య ఒక పసిడిపిట్టలాగా అక్కడ వాలి ఉంది. ఎప్పుడో దాదాపు నలభై ఏళ్ళ కిందట విన్నాను తాడిపత్రి చింతల వెంకటరమణ దేవాలయం గురించి. ఇన్నాళ్ళకు ఆ ప్రాంగణంలో అడుగుపెట్టగలిగాను. దేవాలయం ఒక వైపు మరమ్మత్తుల్లో ఉందిగాని, ఆ ప్రాచీనత, ఆ శిల్పసౌష్టవం, ఆ గాంభీర్యం తొలిచూపులోనే కళ్ళకుకట్టాయి. ఇంకా గుడితలుపులు తియ్యలేదుగాని, ఒక పక్కన మంటపంలో విష్ణుసహస్రనామ పారాయణ జరుగుతున్నది. ఈలోపు ఒక ప్రదక్షిణ చేసి వచ్చాం. ప్రధాన దేవాలయం గోడలమీద మూడు వరసల్లో భారత, భాగవత, రామాయణాలు శిల్పాల్లో చెక్కి ఉన్నాయి. విజయనగర శైలి శిల్పం. దానికి లేపాక్షి తరహా అలంకరణ తోడయ్యింది. తలుపులు తెరిచాక, అమ్మవారినీ, స్వామినీ దర్శించుకున్నాక, తులసిమాలల సురభిళంతో ధనుర్మాసం మమ్మల్ని పలకరించాక, అప్పుడు కూచున్నాం, నందూ, నవీన్ ల గానం వినడానికి.
ఆ సమయాన ఆ పిల్లలిద్దరూ ఏ పాటలు పాడినా వినడానికి సిద్ధంగానే ఉన్నాం గాని, వారు మేమప్పటిదాకా విని ఉండని అన్నమయ్య కీర్తనల్తో మా గుండెని గుడిగా మార్చేసారు.
ఎత్తుకోవడమే, మొదటి కీర్తన, ‘కొమ్మలాలా, ఎంతవాడే గోవిందరాజూ..’. ఆ కీర్తన కోసం మళ్ళా వెతుక్కునే పనిలేకుండా అన్నమయ్య జీవితకాల భక్తుడు నూకా రామప్రసాద రెడ్డి ఆ పాట మాతో పంచుకున్నారు. చూడండి:
కొమ్మలాలా ఎంతవాడే గోవిందరాజు
కుమ్మరించీ రాజసమే గోవిందరాజు
ఉలిపచ్చి నవ్వులతో ఒత్తిగిలి పవళించి
కొలువు సేయించుకొనీ గోవిందరాజు
జలజాక్షులిద్దరును సరిపాదాలొత్తగాను
కొలదిమీర మెచ్చేనీ గోవిందరాజు
అదె నాభికమలాన అజుని పుట్టించి తాను
కొదలేక వున్నవాడు గోవిందరాజు
చెదరక తనవద్ద సేవసేసే సతులకు
గుదిగుచ్చీ వలపులు గోవిందరాజు
ఒప్పుగా వామకరము ఒగిచాచి వలకేల
కొప్పు కడునెత్తినాడు గోవిందరాజు
ఇప్పుడు శ్రీవేంకటాద్రి నిరవై శంఖుచక్రాల
కుప్పె కటారము పట్టె గోవిందరాజు.
అక్కడితో ఆగారా ఆ సంకీర్తకులు! మరో కీర్తన ఎత్తుకున్నారు. ఇది కూడా నేనింతదాకా విని ఉండనిదే. ఈ పాట మిత్రులు మడిపల్లి రాజకుమార్ వెతికి పట్టి పంచుకున్నారు. చూడండి:
మొల్లలేలె నాకు తన్నే ముడచు కొమ్మనవే నే
జెల్ల పూవు కొప్పుతావి చెంచుదాననే
పట్టుచీరేటికే నాకు పారుటాకులే చాలు
దట్టిగట్టుకొమ్మనవే తన మొలనూ
పట్టెమంచమేలే నాకు పవ్వళించు మనవే
చెట్టు కింద పొరలాడే చెంచుదాననే
సంది దండలేలే నాకు సంకుకడియమే చాలు
యిందవే యెవ్వతికైన ఇమ్మనవే
గందమేలె నాకూ చక్కని తనకే కాకా నే
చిందు వందు చెమటమై చెంచుదాననే
కుచ్చుముత్యాలేలే నాకూ గురువిందలే చాలు
కుచ్చి తనమెడ గట్టికొమ్మనవే
కచ్చుపెట్టి కూడె వేంకటగిరీంద్రుడూ ననూ
ఛీఛీ నే నడవిలో చెంచుదాననే
‘కుచ్చుముత్యాలేలే నాకూ గురువిందలే చాలు అట!’ అన్నమయ్య ఒక చెంచులక్ష్మిగా మారిపోయి మరీ పలికిన పలుకులవి! వింటున్నంతసేపూ ఆ పాట మనసుని కరిగించి వేస్తూనే ఉన్నది.
ఆ పిల్లలిద్దరూ పాట పాడుతుండగా పక్కన మరో బాలిక మానస, ఆమె ప్రహ్లాదుడు మరో బాలుడు. ఆ కొన్ని క్షణాలూ ఆ ప్రాంగణం ఆబాలగోపాలతరంగంగా మారిపోయింది.
అక్కణ్ణుంచి బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళాం. పెన్నా నది ఒడ్డున ఉంది ఆ గుడి అని చెప్పవచ్చుగానీ, ‘చూడండి, ఈ గుడి పెన్నానదిలోనే ఉంది, ఇదుగో, ఈ కట్టడాలు సాక్ష్యం’ అని చూపిస్తున్నాడు శ్రీనివాస్. అతడు తెలుగు ఉపాధ్యాయుడా, అర్కియాలజిస్టా, చరిత్రకారుడా- తేల్చుకోలేకపోయాను. ఒకప్పుడు మా హీరాలాల్ మాష్టారిలో చూసాను, ఇటువంటి సర్వతోముఖ ప్రతిభని.
ఆ ప్రదోషవేళ శివపార్వతుల సందర్శనం తర్వాత, నదీదర్శనం తర్వాత మళ్ళా ఆ మంటపంలో ఆ సంకీర్తకులు ఇప్పుడు శివసంకీర్తన మొదలుపెట్టారు. ఒకప్పుడు సంబంధర్, అప్పర్ గురించి చెప్పేవారు, వారు ఎటువైపు నిలబడి కీర్తనలు పాడుతుంటే, మొత్తం దేవాలయం అటువైపు తిరిగేది అని. ఆ మాటలో అతిశయోక్తిలేదని ఆ సాయంకాలం నాకు అర్థమయింది.
అనుకున్నదానికన్నా మేము ఆ రెండు దేవాలయాల్లోనూ ఎక్కువసేపే గడపడంతో, ముందు అనుకున్నట్లుగా అనంతపురం పొలిమేరల్లో ఉన్న ముసలమ్మ చెరువు దగ్గర ఆగలేకపోయాం. కట్టమంచి ‘ముసలమ్మ మరణం’ కావ్యానికి ఇతివృత్తం సమకూర్చిన ఆ చెరువుని చూడటానికి అనంతపురం మరోసారి రావాలని అనుకున్నాను.
మేము తిరిగి రాధేయగారి ఇంట్లో అల్పాహారం చేసి వారి దగ్గర సెలవు తీసుకుని హోటల్ కి వచ్చేటప్పటికి బాషా గారు, డా. నారాయణ రెడ్డిగారు అనే ఇద్దరు మిత్రులు నా కోసం ఎదురుచూస్తున్నారు. డా. నారాయణ రెడ్డి జిల్లా వైద్యాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారట. మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ మీద నేను రాసిన పుస్తకం ‘నీ శిల్పివి నువ్వే’ (2022) చదివి ఆయన నన్ను చూడాలని వచ్చారు. గోపీకృష్ణ అనే ఒక కాశ్మీరు యోగి రాసిన The Way to Self-Knowledge అనే ఒక కావ్యం తీసుకొచ్చారు. దాన్ని నేను అనువాదం చేస్తే చూడాలని ఉందన్నారు. ఏమి ఆశ్చర్యం! మొన్ననే అవధూత గీత పూర్తి చెసాను. ఇప్పుడు మరొక యోగీశ్వరుడు నన్ను అనుగ్రహిస్తూ ఉన్నాడన్నమాట!
బస్సు టైమయింది. బయల్దేరబోతూ ఉండగా కొత్తపల్లి సురేష్, చేగువేరా హరి వచ్చారు కలుసుకోడానికి. రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి సెలవుతీసుకోబోయానుగాని వాళ్ళు తాము కూడా నాతో పాటు బస్టాండుకి వస్తామన్నారు. నాతో పాటు శ్రీనివాస్ ఉన్నాడు, బాగా పొద్దుపోయింది, వాళ్ళని ఇంటికి వెళ్ళిపొమ్మన్నానుగాని, వాళ్ళు నా మాట వినలేదు. తీరా బస్టాండుకి వెళ్ళాక అర్థమయింది, ఆ ఇద్దరినీ దేవుడే నా కోసం పంపించాడని! నేను ఎక్కవలసిన బస్సు మదనపల్లి నుంచి బయల్దేరి మధ్యలో యాక్సిడెంటుకి గురయ్యింది. ఆ టిక్కెట్టుమీద నన్ను మరో బస్సు ఎక్కించమని అడిగితే ఆ బస్ స్టేషన్ లో ఎవరూ స్పందించరే! కాని చేగువేరా హరి నిజంగా చేగువేరా! అతడు ఆ రాత్రి మొత్తం ఆర్టీసి యాజమాన్యాన్ని లైన్లోకి తీసుకొచ్చాడు. ఆఘమేఘాలమీద నాకు మరో బస్సులో సౌకర్యవంతంగా సీటు కుదిర్చాకగానీ అక్కణ్ణుంచి సెలవుతీసుకోలేదు!
బస్సు బయల్దేరాక అలసటగా కళ్ళు మూసుకున్నాను. పొద్దుణ్ణుంచీ క్షణమేనా విరామం లేదు. ఇంతలో ఎక్కణ్ణుంచో తొలి మామిడిపూత గాలి మత్తుగా తాకింది. అలసట ఎగిరిపోయింది. పొద్దుణ్ణుంచీ ఎందరు మిత్రులు, ఎన్ని కరచాలనాలు, ఎన్ని హృదయస్పందనాలు! ఎన్ని పాటలు, ఎన్ని పద్యాలు! పిల్లలనుంచి పెద్దలదాకా సమావేశమందిరాలనుండి దేవాలయ ప్రాంగణాలదాకా, ఆబాల గోపాలం-
సర్వమును జేర నొక్క అపూర్వభావ
ముదయమయ్యె కుమార, నా హృదయమందు
మొగముగంటి, కనులగంటి, మొగిలుగంటి
పాట వినుచుంటి..
31-12-2024
ఎంత బాగుందో చదువుతుంటే.. నిజం చెప్పొద్దూ.. మీ బృందంతో తచ్చాడుతూ ఆ సాహిత్య సాగరపు ఘోష వినలేక పోయినందుకు.. ఆ కవితా పరిమళాన్ని ఆఘ్రాణించలేక పోయినందుకు.. నేను చాలా జెలసీ గా ఫీలయ్యాను కూడా..
మనం కలిసి చేయవలసిన ప్రయాణాలు ముందు ముందు ఉన్నాయి.
భద్రుడు గారూ…❤️❤️❤️
నిన్నటి నుండీ దీనిని మళ్ళీ ఇక్కడ ఇలా చదివే క్షణం కోసం చూస్తున్నాను 😊😊. ఎస్, మిస్ కాను…😊
మీ మాటల్లో ఆ రోజు ఇంకా బోలెడు అందంగా మళ్ళీ నా కళ్ళ ముందుకొచ్చింది. One of the most beautiful days of my 2024!
ధన్యవాదాలు మానసా!
ఇలాంటి రచనలు చదువుతుంటే దృశ్యాలు ఒకదాని వెంబడి ఒకటి వర్ణ చిత్రాలుగా కదలుతుంటాయి. జీవద్వంతమైన రచన. సన్నివేశాలను విశ్లేషించటంలో ఆ శక్తి జనిస్తుందని అర్థమౌతుంది. చదివింపజేసేరచన ఎలా ఉండాలంటే ఇది మచ్చుగా చెప్పవచ్చు. మేము మీతో పాటు బస్సు దిగి మీతో పాటే బస్సుదిగాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్!
సర్ కుదిరితే ఆ అఖండ గోదావరి గల గలగల తో పాటు మీ మాటలు వింటూ ఉండే సందర్భం దొరికితే అదో మహద్భాగ్యం అనిపిస్తోంది
ఎంత బాగా రాసారో
అవును. ఒక గోదావరి ప్రయాణం మనం కలిసి చేయవలసి ఉంది.
సర్,భద్రుడు గారూ
మా ఆహ్వానాన్ని మన్నించి మా అవార్డు సభకు అనంతపురం వచ్చారు.
అనేక అనుభూతులు,అనుభవాలు
మాకూ పంచి, మీరూ మోసుకెళ్ళారు.అంతే కాదు అక్షరబద్దం
శాశ్వతత్వం కల్గించారు.
కృతజ్ఞతలు అనే మాట చాలా చిన్నదే
ధన్యవాదాలు సార్!
మీరు అక్కడికి వస్తున్నారు అని తెలియగానే నాకు మళ్ళీ 2018 కర్నూలు లో కథా సమయంలో ఆ రెండు రోజులు మీ చుట్టూ చేరి మీ మాటలు విన్న ఆ సమయం గుర్తుకు వచ్చింది.
ఉత్సాహాన్ని ఇచ్చే మీ ప్రోత్సాహం మీ సహృదయతని తెలుపుతుంది సర్. ఇలా చదువుతుంటే చాలా సంతోషంగా అనిపించింది.
వీలైనంతవరకూ కుటీరం లో మీ మాటలను రోజూ వాకింగ్ కు వచ్చినప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా చదువుతుంటాను. ఇప్పుడు కూడా ఒక చెట్టు కింద కూర్చొని చాలా సంబరంగా చదువుకున్నాను. చాలా ధన్యవాదాలు మీకు.
ధన్యవాదాలు మేడం!
సర్, నమస్తే. ఇంతకుముందు మీ రచనలు చదివినప్పుడల్లా గతంలో ఒకసారి కిర్తిశేషులు, సహజకవి ఎమ్మెస్ రెడ్డి గారితో మిమ్మల్ని కలిసే అవకాశాన్ని ఎందుకు నేను మిస్ అయ్యానా అని ఫీలయ్యే వాణ్ని. ఇప్పుడు మీ ఆబాలగోపాల తరంగం చదువుతుంటే ఒక్కసారైనా మిమ్మల్ని కలిసి మీతో ‘సుధాకర’చాలనం చేసే భాగ్యం ప్రసాదించమని తిరుమల మలయప్ప స్వామిని ప్రార్ధిస్తున్నాను. చివరగా హరికథలో పిట్టకత లాగా ఒక విషయం మీతో చెప్పాలి. 1988లో నేను రాసి, నన్ను తెలుగు నాటకరంగంలో రచయితగా నిలబెట్టిన నాటిక పేరు “ఒంటికాలి పరుగు”. నాటక మిత్రులు వాడ్రేవు సుందరరావు గారికి ఇది విధితమే. ఉంటాను సర్ – జలదంకి సుధాకర్ 🙏
ధన్యవాదాలు సార్! తప్పకుండా కలుద్దాం.
మీ ప్రయాణం లో మీతో కాసేపు గడిపిన క్షణాలు
కొన్ని ముచ్చట్లు మళ్ళీ ఇలా మాకు
గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు గోపాల్! మిమ్మల్ని ఆరోజు వినడం మరింత సంతోషంగా అనిపించింది.
నిన్నల్లా దేవాలయాల సందర్శన!
ఈరోజు పొద్దున ‘ ఫలశృతి!’
ధన్యవాదాలు!
అనంతపురం రాలేని వెలితి పూరించారు. మీ సమక్షాన్ని మిస్ అయ్యాను. రాధేయ గారి సభ బాగా జరిగినందుకు మీకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు సార్!
ధన్యవాదాలు సార్
ఆ సమయంలో అన్నీ అలా కలిసొచ్చాయి సార్. మీతో ఆ కాసేపుండటం నాకు చాలా మంచి క్షణాలు సార్. ఈసారి పెనుకొండకి తప్పకుండా మిమ్మల్ని మేము తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తాను సార్. చాలా మంచి వ్యాసం రాశారు సార్. అభినందనలు..!
ధన్యవాదాలు చే!
ధన్యవాదాలు సర్
స్వాగతం
అబ్బ, ఒక్కసారిగా రెండు వారాలు వెనక్కి తీసుకెళ్లారు. నా అనారోగ్యం కారణంగా మీ అందరితో ఎక్కువసేపు గడపలేకపోయాననే కొరత అలాగేవుండిపోయింది నాకు. నా గురించి మీరు రాసిన వాక్యాలకు ధన్యురాలిని.
ధన్యవాదాలు మేడం