కథల కంఠస్వరం గంభీరంగా, ఒక నిష్ఠురమైన సత్యాన్ని చెప్పేవాడి గొంతులాగా, పంటి బిగువున దుఃఖాన్ని అదిమి పట్టుకున్న వాడి గొంతు లాగా నడుస్తుంది. ప్రతి కథలోనూ పరిసరాలనూ , రంగులనూ వర్ణించడం యీ కథలకు ఒక సిగ్నేచర్ ను యిచ్చింది.
మూడువందల వచనాలు
మీ యాభయ్యవ పుస్తకం ప్రత్యేకంగా ఉండబోతోంది కదా అనడిగారు ఒక మిత్రురాలు. అవునన్నాను. ఏమిటా పుస్తకం అనడిగారు. చెప్పలేదు. చెప్పకూడదని కాదు. చెప్పడానికి ధైర్యం చాల్లేదు. ఎందుకంటే నేననుకున్నట్టుగా ఆ పుస్తకం తేగలనా అన్న ఆందోళన నా మనసుని అంటిపెట్టుకునే ఉందిన్నాళ్ళూ. ఏమైతేనేం, భగవంతుడి దయ వల్ల, ఇదుగో, ఈ 'మూడువందల వచనాలు' నిన్ననే శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునుల చరణాల దగ్గర సమర్పించగలిగాను. ఈ పుస్తకం ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ మిత్రులతో షేర్ చేసుకోవచ్చు.
