కోమలనిషాదం

అడవుల్లో ఆకుల్ని ఇండియన్ యెల్లోలో
ముంచితేల్చడం మొదలయ్యాక
చెట్లకొమ్మలమీంచి నీడల్లోకి
పత్రహరితం దిగుతుంటుంది.
అప్పటిదాకా పచ్చికబయళ్ళమీద
విహరించిన సూర్యుడిగోవులు
నెమ్మదిగా నెమరుకి ఉపక్రమిస్తాయి.

స్వరసప్తకం పూర్వార్థమంతా
ఒక ఉత్సాహం, రక్తవేగోధృతి
నవ్యజీవనసంరంభం.

పొద్దున్నే కొట్టం తెరిచి
పశువుల్ని మేతకు తోలేటప్పటి
ఉరుకులు, పరుగులు.

స్వరసప్తకపు ఉత్తరార్థంలో
స్వరాలన్నీ సాయంకాలం వైపు
పయనించడం సహజం.

నదులు సముద్రంలో కలిసే తావుల్లో చూసావా
సంగమానికింకా చేరువకాకముందే
ఆ నేలంతా, ఆ గాలిలో
ఆ మడ అడవుల పొడుగునా
వాతావరణం మారిపోయి ఉంటుంది.
అప్పుడు నువ్వు నాలుగడుగులు నడిచినా
సముద్రపు నీలం నీ తలపుల్ని కమ్మేస్తుంది.

‘నేను కదా చేసాను.. ‘, ‘నేనెందుకలా చేసాను..’
‘నేను చేసింది కాదు.. ‘, ‘నేనలా చేసి ఉండవలసింది కాదు..’
ఈ తలపులు కట్టిపెట్టు.
ఆ సోఫాలో అట్లానే కొద్దిసేపు ఒరుగు.

చిన్న కునుకు తీసి లేచేలోపు
కట్టెయ్యడం మర్చిపోయిన కుళాయిలాగా
పసుపచ్చని సంగీతం
నీ డ్రాయింగురూములోంచి
వీథిలోకి ప్రవహిస్తూంటుంది.

ఇప్పటికో మరికొంతసేపటికో
సూర్యుడి గోవులు మేతముగిస్తాయి.
ఇళ్ళల్లో దీపాలు వెలిగిస్తారు.
దారి తప్పిపోయాను అనుకుంటున్నావా
కోమలనిషాదం రెక్కలమీద
నీకు తెలీకుండానే
నువ్విప్పటికే దిగంతం దాటేసావు.

28-11-2024

20 Replies to “కోమలనిషాదం”

  1. Wow, wow! Sir, you are a poet! ❤️
    ఇండియన్ ఎలో ను explore చెయ్యమని బొమ్మలేసే అందరికీ చెప్తాను! ❤️

  2. ఇరుసంధ్యలు సిరి గాదెలు! అందులోనుంచి కొంచెం నిశ్శబ్దాన్ని, కొంచెం సంగీతాన్ని కొంచెం మార్మికతను, కొన్ని వర్ణాలనీ ఒడిసి పట్టుకుని అలవోకగా ఓ చిన్ని పొట్లం లాంటి కవితలో అందిస్తారు! భద్రంగా దాచి పెట్టుకోదగినట్టు!
    ప్రతాప చంద్రశేఖర్

  3. Beautiful Sir… తెలియకుండా దిగే దిగంతంలోకి ప్రవహించిన లేలేత పత్రహరిత హరిద్ర ఛాయ..దినకరుని మాయ..

  4. ఆహా అద్భుతమైన కవిత. ప్రకృతిసోయగం,వర్ణచిత్రం, సంగీతం ముప్పేటలా కలిసి సాగింది.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%