వారికి నా కైమోడ్పు

LV Subrahmanyam with tribals of Parvatipuram, 1990


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్.వి.సుబ్రహ్మణ్యంగారు తన ఉద్యోగ జీవితపు అనుభవాల్ని For the People, With the People పేరిట వారం వారం హన్స్ ఇండియా పత్రిక ద్వారా పంచుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల ఆయన గిరిజన ప్రాంతాల్లో విద్యాకార్యక్రమాల గురించి రాసారు. 1987-90 మధ్యకాలంలో ఆయన పార్వతీపురం ఐటిడిఎ కు ప్రాజెక్టు అధికారిగా పనిచేసారు. అది ఆ ఐటిడిఎ చరిత్రలోనే కాక, గిరిజన సంక్షేమ శాఖ చరిత్రలో కూడా ఎంతోవిలువైన కాలం. ఎన్ టి రామారావుగారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఎస్.ఆర్.శంకరన్ గారు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, ఎం.పి.వి.సి శాస్త్రిగారు గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులుగా గిరిజన ప్రాంతాలకూ, గిరిజనులకూ మేలు చేసే ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసారు. ఆ రోజుల్లో 1983 ఐఏఎస్ బాచ్ కి చెందిన ఎందరో యువ అధికారులు ఐటిడిఎలకు ప్రాజెక్టు అధికారులుగా పనిచేసారు. వారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని సమర్థవంతంగా అమలు చేయడమేకాక, గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ఇంకా ఏం చేయాలో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సలహాలూ, సూచనలూ ఇచ్చేవారు. వారందరి సమష్టి కృషి వల్లా, ఒకప్పుడు, భారతదేశంలో గిరిజనాభివృద్ధి అంటే మొత్తం దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేది. ఆ అధికారుల్లో సుబ్రహ్మణ్యంగారిది చాలా ప్రత్యేకమైన స్థానం. కాకపోతే, తన ఉద్యోగ జీవితపు తొలిరోజుల్లో పనిచేసిన ఒక సంస్థలోని ఉపాధ్యాయుల పేర్లు గుర్తుపెట్టుకుని ఇన్నేళ్ళ తరువాత ఇలా వారి గురించి ఎవరు రాయగలుగుతారు? ఆ ఉపాధ్యాయులు కూడా అత్యున్నత వ్యక్తులు. వారి త్యాగాలు నిరుపమానం. అందుకని సుబ్రహ్మణ్యంగారు రాసిన ఈ జ్ఞాపకాలను మీతో ఇలా పంచుకుంటున్నాను. ఆయనకీ, ఆ రోజు మాతో కలిసి పనిచేసిన ఆ ఉపాధ్యాయులకీ, ఆ సిబ్బందికీ అందరికీ పేరుపేరునా నా కైమోడ్పు.


ఎల్.వి.సుబ్రహ్మణ్యం

గిరిజన ప్రాంతాల్లో విద్యారంగం సాధించిన విజయాలు

సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ లో 1988 ఆర్థిక సంవత్సరం నుంచీ నిధుల కేటాయింపులో మా ప్రాధాన్యతని పంచుకున్న కీలకరంగాల్లో విద్య కూడా ఉంది. గిరిజన ప్రాంతాల్లోని సాంఘిక-ఆర్థిక అభివృద్ధికి విద్య, అక్షరాస్యత శక్తివంతమైన సూచికలు మాత్రమే కాక గిరిజన సమాజాల అంతస్సత్వాన్ని బలంగా ప్రభావితం చెయ్యగలవి కూడా. గిరిజన ప్రాంతాల్లాంటి వెనకబడ్డ ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యాల సాధన శీఘ్రతరం చెయ్యాలన్నది అందరూ అంగీకరించిన విషయమే. అప్పుడే ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఎటువంటి అవరోధాలకూ జంకకుండా సమాజ నిర్మాణంలో సమానపౌరులుగా భాగస్వాములు కాగలుగుతారు. సామాజిక చట్రంలో పైపైకి పురోగమించడానికీ, ఆర్థికంగా అభ్యున్నతి సాధించడానికీ సమాజంలోని వ్యక్తులందరికీ  అవసరమైన జవసత్త్వాల్ని విద్య ప్రోది చెయ్యగలుగుతుంది.

పూర్వపు విజయనగరం జిల్లాలోని పార్వతీపురం ఐటిడిఎలో ఈ పరివర్తన రెక్కలు విప్పుకుంది. చూస్తూండగానే మా పాఠశాలలనుంచి తారల్లాగా విద్యార్థులు పైకి రావడమే కాక ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందగలిగారు. సామాజికంగా వెనకబడ్డ సమూహాలకు రిజర్వేషన్లు కల్పించడం పట్ల ఎవరికేనా ఇంకా అభ్యంతరాలు ఉంటే అవి తప్పని రుజువు చేసారు వాళ్ళు. నేను ఐటిడిఎ లో చేరిన మొదటిరోజుల్లోనే ధర్మలక్ష్మీపురం ఆశ్రమపాఠశాలలో అడుగుపెట్టిన ఆ రోజుని నేనెట్లా మర్చిపోగలను? అప్పటికి గత సంవత్సరాల్లో ఆ పాఠశాల చూపించిన పరీక్షాఫలితాల్ని సమీక్షించినప్పుడు నేను చెప్పలేనంత నిస్పృహలో కూరుకుపోయాను. కాని భవిష్యత్తు అలా ఉండబోదని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.సి.హెచ్. సత్యనారాయణ నన్ను ఒప్పించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ రోజు కరెంటు లేకపోవడంతో అంతా చిమ్మచీకటి అలముకుని ఉంది. ఆ పరిస్థితుల్లో నేను నా ఆవేదనని దాచుకోలేకపోయాను. ఐటి డి ఏ లో ఉపాధ్యాయుల పనితీరు గురించి నా ఆగ్రహం వెళ్ళగక్కకుండా ఉండలేకపోయాను. కాని అటువంటి సంఘటన అదే మొదటిసారీ, చివరిసారీ కూడా. అప్పటికే ఆ పాఠశాలలు చినవీరభద్రుడనే ఒక యువ గిరిజనసంక్షేమాధికారి నేతృత్వంలో అద్భుతాలు చెయ్యడానికి సంసిద్ధమవుతున్నాయని నాకెలా తెలుస్తుంది? వారంతా తమ చుట్టూ ఉన్న సవాళ్ళను తమ వదనాలపైన చెరగని చిరునవ్వుతో అధిగమించడానికి సిద్ధపడుతున్నారు.

అందుకోసం వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా ఎటువంటి త్యాగాలకు సంసిద్ధులయ్యారో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నమ్మశక్యంగా లేదు.

ఆ విద్యాసంవత్సరంలో పదవ తరగతి పరీక్షల్లో గిరిజన ప్రాంతాల పాఠశాలలు మైదాన ప్రాంతాల పాఠశాలలకన్నా ఎంతో ముందు నిలిచాయి. ఆ ఫలితాల్ని అప్పటి జిల్లాకలెక్టరు ఎం.ఎస్.ప్రసాద్ గారికి నేను వివరిస్తున్నప్పుడు అక్కడే ఉన్న జిల్లా విద్యాశాఖాధికారి టి.వి.ఎస్. శాస్త్రి మేం చెప్తున్న మాటలు విని తన చెవుల్ని తానే నమ్మలేకపోయాడు. ఆ ఫలితాలకి అబ్బురపడ్డ జిల్లా కలెక్టరు వెంటనే ఆ విద్యార్థుల్నీ, ఉపాధ్యాయుల్నీ సన్మానించడానికి వేగిరపడ్డారు. ఆ రోజు ఐటిడిఎ కి ఎంత చిరస్మరణీయమైన రోజు! ఆ విద్యాసంవత్సరంలో మా పాఠశాలలు అనుసరించిన  పద్ధతులు అత్యుత్తమ పద్ధతులని కొనియాడడమే కాక, వాటిని మొత్తం గిరిజన సంక్షేమ శాఖ అమలు చేసేలా చూడమని ఆయన ప్రభుత్వాన్ని ఒత్తిడిచేసారు కూడా.

మానవవనరుల శాఖామాత్యులుగా విద్యకోసం ఒక సమగ్ర విధానానికి రూపకల్పన చేసిన ఘనత పి.వి.నరసింహారావుగారికి దక్కుతుంది. ఆ విధానాన్ని అనుసరించి విద్యారంగంలో అందరికీ విద్యని అందుబాటులోకి తీసుకురావడం, విద్యాప్రమాణాల్ని మెరుగుపర్చడం అనే రెండు లక్ష్యాలకు మా ఐటిడిఎ అంకితమైంది. మేము అమలు చేసిన పద్ధతుల్ని పరిశీలించిన గిరిజన సంక్షేమ శాఖ, తర్వాత రోజుల్లో అంటే 1996-98 మధ్యకాలంలో, మా వ్యూహాల్ని ఉత్తరాంధ్రప్రాంతంలోని మూడు ఐటిడిఎలతో పాటు, గోదావరిజిల్లాల్లోని రెండు ఐటిడిఎల్లో కూడా మొత్తం అయిదు ఐటిడిఎ ప్రాంతాల్లో అమలు చేసింది. పాఠశాలలు లేని గిరిజన ప్రాంతాల్లో చదువు అందుబాటులోకి తీసుకురావడం కోసం 384 ఏకోపాధ్యాయ పాఠశాలల్ని పార్వతీపురం ఐటిడిఏకు ప్రభుత్వం మంజూరు చేసింది. భారతరాజ్యాంగంలోని అయిదవ షెడ్యూలు గిరిజన ప్రాంతాలకు అందిస్తున్న ప్రత్యేకప్రతిపత్తి వల్ల ఆ రకమైన విధాననిర్ణయం తీసుకోవడం సాధ్యమయింది. అక్కడ ఉపాధ్యాయులుగా గిరిజన యువతనే నియమించడంతో పాటు వారు స్థానిక గిరిజనులై ఉండాలని కూడా నిర్దేశిస్తో, ‘స్థానికత’ అంటే ఏమిటో కూడా ప్రభుత్వం స్పష్టంగా నిర్వచించింది. కొత్తగా తెరిచిన పాఠశాలల్లో పదవతరగతి పాసయిన లేదా ఫెయిలైన గిరిజన యువతను ఉపాధ్యాయులుగా నియమిస్తో వారు ఆ పాఠశాలల్లో పిల్లల్ని పెద్ద ఎత్తున చేర్పించేలా చూసింది. ఆ ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వమే ఉపాధ్యాయ శిక్షణ కూడా ఏర్పాటు చేసింది.

‘నానూ సదూకుంతాను’ పేరిట ఒక వీడియో ఫిల్మ్  మా ఐటిడిఎ నిర్మించింది. విశాఖపట్టణానికి చెందిన ప్రసిద్ధ కళాకారుడు బి.ఎచ్. రామూర్తి నేతృత్వంలో నిపుణులైన కళాకారులు ఆ సినిమా రూపొందించారు. ప్రసిద్ధ రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆ సినిమాకు కథ, సంభాషణలు సమకూర్చారు. సుప్రసిద్ధ కథకులు కాళీపట్నం రామారావు మాష్టారి చేతుల మీదుగా విడుదలైన ఆ సినిమాను అన్ని పాఠశాలల్లోనూ ప్రదర్శించాం. గిరిజన ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితుల్ని ఆ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపించడమే కాక, పల్లపు ప్రాంతాలనుంచి గిరిజన ప్రాంతాలకు వచ్చిన వారు గిరిజనుల్ని ఏ విధంగా మోసగిస్తున్నారో, దోచుకుంటున్నారో కూడా ఆ సినిమా వివరించింది. ఆ సినిమా వట్టి వీడియో ఫిల్మ్ కాదు, ఒక కళాకారుల బృందం ఎంతో ప్రేమతో గిరిజన ప్రాంతాలకు అందించిన కానుక. గిరిజన ప్రాంతాల్లో ఆ నాడు నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఒక ఏకోపాధ్యాయుడు ఎటువంటి అభ్యుదయ పాత్ర పోషించవచ్చునో ఆ సినిమా స్పష్టంగానూ, మనసుకు హత్తుకునేలానూ చూపించింది.

ఏకోపాధ్యాయులుగా కొత్తగా పాఠశాలల్లో నియామకం పొందిన గిరిజన యువతకు ఆ సినిమానే ఒక శిక్షణాసామగ్రిగా పనికొచ్చింది. తమను ఉపాధ్యాయులుగా నియమించడం ద్వారా ప్రభుత్వం తమకు అందించిన అవకాశానికీ, తమ భుజాలమీద మోపిన బాధ్యతకీ ఆ యువత ప్రభుత్వానికి ఎంతో ఋణపడి ఉన్నారు. తమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులకు గిరిజన భాషల్లోనే ఆ ఉపాధ్యాయులు బోధన మొదలుపెట్టారు. ఎందుకంటే మరీ అంత ప్రాథమిక స్థాయిలో పిల్లలకి తెలుగు రాయడమే కాదు, మాట్లాడటం కూడా కష్టమే. గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులు ఎదుర్కునే సమస్యల్లో భాషకి సంబంధించిన అవరోధాల గురించి మనల్ని జాగృతపరిచినందుకు మహోన్నత భాషావేత్త గిడుగు రామూర్తిగారికి మనం సదా ఋణపడి ఉంటాం. ఆయన 1894 లోనే ఈ సమస్య గురించి ప్రస్తావించాడు. పాఠశాలలు గిరిజనుల ఆదరాన్ని పొందాలంటే గిరిజన భాషల్లోనే చదువుసంధ్యలు కొనసాగక తప్పదని ఆయన ఘోషించాడు. శ్రీకాకుళం జిల్లాలోని సవర గిరిజనుల సవరభాషకు గిడుగు ఒక నిఘంటువునీ, పాఠ్యపుస్తకాల్నీ రూపొందించాడని ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. ఆయన ప్రయత్నాల స్ఫూర్తితో నేడు ఒడిస్సా ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలల్లో సవర భాషతో పాటు ఆ భాషకు ప్రత్యేకమైన లిపిని కూడా ఉపయోగిస్తున్నారు.

పాఠశాలల్లో సంస్థాగతమైన పరివర్తన ఎలా సంభవించిందో ఇక్కడ నేనొక ఉదాహరణ పంచుకోవాలనుకుంటున్నాను. రేగిడిలోని ఆశ్రమపాఠశాల బాలికలు చదువులోనూ, ఆటపాటల్లోనూ కూడా అద్భుతమైన పనితీరు చూపించారు. అయితే ఆ పాఠశాలకు వెళ్ళడానికి సరైన దారి ఉండేది కాదు. వానాకాలంలో ఆ పాఠశాలకు వెళ్ళేదారిలో ఒక వాగు ఎప్పుడూ పొంగిప్రవహిస్తుండేది. దూరప్రాంతాలనుంచి అక్కడకి బస్సుల్లో వచ్చే పిల్లలు కూడా ఆ గెడ్డదగ్గర దిగి ఆ వాగు దాటవలసి ఉండేది. భవనసదుపాయాల దృష్ట్యా చూసినప్పుడు ఆ పాఠశాల అరకొర సౌకర్యాలతో కునారిల్లుతూ ఉండేది. కాని అటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉపాధ్యాయులు తమ కుటుంబాల్తో నివసిస్తో తమ సేవలని ఆ పిల్లలకు అంకితం చేసిన తీరు చూసి నేను నిర్ఘాంతపోయాను. తమకూ తమ కుటుంబాలకూ అవసరమైన వ్యక్తిగత సమయాన్నీ, జీవితాన్నీ కూడా వదులుకుని వారు ఆ పాఠశాల కార్యక్రమాల్లో తదేకంగా నిమగ్నులై ఉండేవారు.

రస్తాకుంటుబాయిలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంవారి పర్యవేక్షణలో ఆ పిల్లలకు పంజాబీ డ్రెస్సులు కుట్టించి ఇచ్చాం. ఆ కేంద్రానికి చెందిన గీత గారు ఆశ్రమ పాఠశాల బాలికలు కొందరికి కుట్టుపనిలో కూడా శిక్షణనిచ్చారు. ఆ రోజుల్లో ఒక గిరిజన ఆశ్రమపాఠశాలలో చదువుకునే బాలికలకి పంజాబీ డ్రెస్సులు ఇవ్వడం ఊహకి కూడా అందని విషయం. ఆ కొత్త దుస్తులు పిల్లల్లో ఉత్సాహాన్ని నింపాయి. దీపావళి, వినాయకచవితిలాంటి పండగలు వచ్చినప్పుడు మేమంతా కూడా ఆ పాఠశాలలకే వెళ్ళేవాళ్ళం. ముఖ్యంగా ప్రాజెక్టు అధికారి, గిరిజన సంక్షేమాధికారి, ఇతర అధికారులు తమ తమ కుటుంబాల్తో పాటు ఆ పండగలు కూడా ఆ పాఠశాలల్లోనే జరుపుకుని అక్కడే భోంచేసేవారు.

అలాగే ఆశ్రమపాఠశాలలు వెలువరించిన మరొక అద్భుతం గురించి కూడా నేను చెప్పాలి. ఐటిడిఎలోని విద్యావిభాగం వారు వెలువరించిన ‘మా సంతోష చంద్రశాల’ అనే స్కూలు మేగజైన్ లో 25 మంది విద్యార్థులూ, దాదాపు అంతేమంది ఉపాధ్యాయులూ కూడా కథలు, వ్యాసాలు మొదలైనవి రాసారు. ఆ మేగ జైన్ ని గొప్ప పండితుల సమక్షంలో మేము ఆవిష్కరించుకున్నాం. ఆచార్య బి.సర్వేశ్వరరావు, ఆచార్య జి.హరగోపాల్ లతో పాటు మా నాన్నగారు లంక వెంకట కృష్ణశాస్త్రిగారు కూడా మేము నిర్వహిస్తూ ఉండిన వివిధ శిక్షణాకార్యక్రమాల్లో పాల్గోడమే కాక, ఉపాధ్యాయుల్లోనూ, విద్యార్థుల్లోనూ ఎంతో స్ఫూర్తినీ, చైతన్యాన్నీ నింపేరు.

వావిలాల గోపాలకృష్ణయ్యగారు కూడా మా ఐటిడిఎని సందర్శించారు. మా పాఠశాలల పనితీరుని కళ్ళారా చూసినప్పుడు ఆయన నేత్రాలు ఆనందబాష్పాలు వర్షించేయి. ఆర్.సి.ఎచ్.సత్యనారాయణ, ఎం.సీతారామ్ముర్తి, డి.సత్యానందరావు, గంటేడ గౌరునాయుడు, ఎం.లీలావతి, డి.వెంకటరావు, పి.ఎ.వి.జగన్నాథరావు, డి.జేసుదాసు, సి.ఎచ్.సుగుణ వంటి ఉపాధ్యాయుల కృషిని స్వయంగా చూసినప్పుడు ఆయన నోటమాటలేదు. గొరడ గ్రామంలో మరొక పాఠశాలలో పారినాయుడు చేస్తున్న కృషిలోని త్యాగశీలత్వాన్ని చూసి ఆయన చలించిపోయారు. బాపూజీ  మా గిరిజనపాఠశాలల్ని చూసి ఉంటే ఎంతో సంతోషించి ఉండేవారని  అనడమే కాక, ఆ సందర్శనతో తన జీవితం కూడా సార్థకమైనట్టుగా తాను భావిస్తున్నట్టు కూడా వావిలాల అన్నారు. స్వతంత్ర భారతదేశానికి చెందిన మహోన్నత నాయకుల్లో ఒకరైన వావిలాల వంటి వారినుండి లభించిన ఆ ప్రశంసాపూర్వకవాక్యాలను పదిలపర్చుకోవడం కన్నా అదనంగా మనం కోరుకోవలసింది మరేముంటుంది!

(హన్స్ ఇండియా పత్రిక సౌజన్యంతో)


Featured image: Group photo with High School teachers of TW Ashram High School, Dharmalakshmipuram along with PO and DTWO, 1990

29-7-2024

21 Replies to “వారికి నా కైమోడ్పు”

  1. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    స్ఫూర్తి దాయకమైన వ్యాసం. ఇలాంటి సాధువర్తనుల వల్లనే ఈ భూమి ఇంకా సవ్యంగా ఉండకలుగుతోంది . వేమన ఇలాంటి వారినే కదా పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నది.
    వారికీ మీకూ నమస్సులు.

  2. ఉహలు- ఊసులు - సంధ్య – ... జీవితం ఏమిటి అన్న ప్రశ్న కు.... సమాధానం వెతుకుతూ... సాగుతున్న జీవితం...
    Sandhya Yellapragada says:

    ఎంత వివరంగా వివరించారో. చాలా సంతోషమయ్యింది ఇది చదివి.

  3. Purva Phalghuni(పూర్వ ఫల్గుణి) – నమస్తే , నమస్కారం, పుట్టింది,కొంతవరకు పెరిగింది మద్రాస్ లో ఆ తరువాత హైస్కూల్,కాలేజీ జీవితం, తూర్పుగోదావరి జిల్లాలో, వివాహం అయినప్పటి నుంచి హైద్రాబాద్ లో నివాసం. బాల్యం నుంచి మా నాన్నగారు,అమ్మగారి ల ద్వారా, పుస్తకాలు చదవడం అలవాటు అయింది. నాన్నగారికి ఎందరో ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం ఉండేది. ఆవిధంగా ముఖ్యంగా కధా, నవలా సాహిత్యం పట్ల అబిలాష పెరిగింది. వివాహానంతరం శ్రీవారి వల్ల, అమ్మ లాంటి అత్తగారి తోడ్పాటుతో నా సాహిత్యాభిలాష నిర్విఘ్నంగా కొనసాగింది. 2010లో ఉద్యోగం నుండి, స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. చదవడమంటే ఇష్టం. అయినప్పటికీ కథలు రాయాలానే తపన తో రాసిన తొలి కథ కౌముది అంతర్జాల పత్రిక లో ప్రచురిచతమైంది. నవ్య,ఆంధ్రభూమి,స్వాతి,తెలుగు వెలుగు,విపుల,రచన,జాగృతి,ఉషాపత్రిక,సాహో వంటి వార,మాస పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మనతెలంగాణ వంటి దినపత్రికలలోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ, అంతర్జాల పత్రిక లైన, కౌముది, మధురవాణి, సంచిక, రస్తా, సహరి, నిత్య, కథామంజరి, రవళి నెచ్చెలిలలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి. అదే విధంగా మరికొన్ని కథలు ఇతర ప్రముఖ కథా సంకలనాల లో,ఆకాశవాణి లో కూడా (చదివినవి) ప్రచురించబడి పాఠకుల మన్ననలు పొందాయి చతుర మాసపత్రికలో తొలి నవల “జీవితం ఓ ప్రవాహం” ప్రచురణ అయింది. రెండవ నవల 'కాశీపట్నం చూడరబాబూ' జాగృతి వారపత్రికలో సీరియల్ గ వెలువడింది మూడవ నవల ‘ప్రయాణం’ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం లో ప్రచురిచతమయింది. బహుమతుల వివరాలు: గో తెలుగు.కాం వారి హాస్య కథల పోటిలో ప్రథమ బహుమతి, ఫేస్బుక్ లోని కథ గ్రూప్ నిర్వహించిన కథల పోటిలో ప్రథమ బహుమతి, అమెరికా తెలంగాణా సంఘం (ATA) వారి సావనీర్ కు పెట్టిన కథల పోటిలో మొదటి బహుమతి, వంగూరి ఫౌండేషన్ వారి మధురవాణి.కాం వారు నిర్వహించిన పోటిలో మేనిక్విన్ కథకి ఉత్తమ కథ బహుమతి, హాస్యానందం వారి పోటి లో కన్సొలేషన్ బహుమతి వచ్చాయి. అంతర్జాల పత్రికలయిన సహరి, కథా మంజరి, తెలుగుతల్లి డే కెనడా వారి పోటీలలో కూడ బహుమతులు వచ్చాయి తురగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీ లో ఉత్తమబహుమతి, విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి, విశాలాక్షి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీ లో మొదటి బహుమతి, నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజా గ్రంధాలయం వారి పోటీ లో ప్రోత్సాహక బహుమతి, కౌముది అంతర్జాల పత్రికలో ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా వంద కు పైన ఉన్నాయి మొదటి పుస్తకం వాత్సల్య గోదావరి (కథల సంపుటి) రెండవ పుస్తకం కాశీ పట్నం చూడర బాబు(నవల) నా మూడవ పుస్తకం 'మనం' ( కథల సంపుటి) నాలగవ పుస్తకం 'గెలుపు గాయాలు'(కథల సంపుటి) ఐదవ పుస్తకం పథికుడు(నవల)
    Mani Vadlamani says:

    ఇలా వారిగురించి మీ ద్వారా తెలుసు కోవడం చాలా సంతోషంగా అనిపించింది.🙏🙏

  4. ఓ గొప్ప మార్పుకి నాంది, పునాది అయిన అధికారులకు, ఉపాధ్యాయులకు నమస్సులు 💐🙏
    గిరిజన బాల బాలికలకు అభినందనలు💐

  5. Sir, నమస్తే. ఆ కాలపు విద్యార్థిని నేను. అది నేను హై స్కూల్ చదువుతున్న కాలమది. ఆ పీవో గారి లాంటి, మీ లాంటి అధికారుల మరియు ఉపాధ్యాయుల కలలకు సజీవ సాక్ష్యం నేను.

  6. ఇటువంటి వ్యాసాలు ఎంతో విజ్ఞానవంతంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. రాసిన సుబ్రహ్మణ్యంగారికీ, మాకు అందించిన మీకూ కృతజ్ఞాభివందనాలు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%