నీరస తథ్యాల్ని తిరస్కరించడం

పరీక్షించి నిగ్గుతేల్చని జీవితం జీవితమే కాదు అని సోక్రటీస్ అన్న మాటలు సుప్రసిద్ధాలు. An unexamined life is not worth living అని ఇంగ్లిషు వాక్యం. కొందరు An unconsidered life అని కూడా అనువదించారు. ఎలా చూసినా స్థూలంగా ఒకటే అర్థం, లోతుగా వివేచించి, పరీక్షకు పెట్టుకుని, సారాంశమేమిటో తేల్చుకుని చూసుకుంటే తప్ప ఏ జీవితం కూడా నిజంగా జీవించినట్టు కాదు అని. దాన్నే philosophy అని కూడా అన్నాడు ప్లేటో.

మానవచరిత్రలో philosophy అనే పదం సోక్రటీసుతో, ప్లేటో తో పుట్టింది. దాని అర్థం సత్యాన్ని ప్రేమించడమని. వేరే దేశాల్లో, వేరే సంస్కృతుల్లో దర్శనాలూ, సత్యాన్వేషణలూ, జీవితదృక్పథాలూ ఉండి ఉండవచ్చు. కాని philosophy మాత్రం పూర్తిగా గ్రీకు పదం, గ్రీకు భావన, గ్రీకు అన్వేషణ.

పూర్వకాలపు గ్రీసులోనూ, రోమ్ లోనూ కూడా philosopher అంటే అర్థం ఒకటే. ఎవరేనా తానెందుకు పుట్టాడు, తన జీవితానికి అర్థం ఏమిటి, తాను జీవిస్తున్న జీవితం సార్థకమేనా అని ప్రశ్నించుకుంటూ, తన మాటకీ, నడవడికకీ మధ్య ఎటువంటి తేడా లేకుండా జీవించడానికి ప్రయత్నిస్తే వాళ్ళని మాత్రమే ఫిలాసపర్లు అనేవారు. సా.శ 4 వశతాబ్దం తర్వాత యూరోప్ లో క్రైస్తవం రాజమతంగా మారిన తరువాత కూడా క్రైస్తవ సాధువులు నిరంతరం తమ ఆత్మపరీక్ష చేసుకుంటూ, ఆత్మావలోకనంలో గడుపుతూ ఉన్నట్లయితేనే వాళ్ళని ఫిలాసపర్లుగా వ్యవహరించేవారు. కాని ఆధునిక యుగం మొదలయ్యాక, ఈ అర్థం నుంచి ఫిలాసఫీ పక్కకు తప్పుకుంది. ఒక మనిషి వ్యక్తిగత జీవితంతో సంబంధంలేకుండా, అతడు తాను నమ్ముతున్న విలువలకి కట్టుబడి ఉన్నాడో లేదో పట్టించుకోనక్కర్లేకుండానే, అతడు తార్కికంగా సత్యాన్ని పరిశీలిస్తున్నట్లయితే, వాళ్ళని కూడా ఫిలాసపర్లుగా భావించవచ్చు అనే ఆలోచన మొదలై, మన కాలానికి వచ్చేటప్పటికి ఫిలాసఫీ అంటే విశ్వవిద్యాలయాల్లో బోధించే ఒక కోర్సుగా మారిపోయింది.

ఆధునిక యుగంలో ఫ్రెంచి తాత్త్వికుడు దేకార్తే ఈ కొత్త తరహాదృక్పథానికి దారి తీసినవాడు. ఆ తర్వాత రోజుల్లో కాంట్, హెగెల్, మార్క్స్, రస్సెల్, మూర్ మొదలైనవాళ్ళు తమ వివేచనా బలం వల్ల సత్యమీమాంస ని సముద్రమంత విశాలం చేసేసారు. మనం వాళ్ళ భావాల్ని, లేదా వాళ్ళ ఆలోచనల్ని లేదా వాళ్ల తార్కిక విశ్లేషణల్ని చదువుతున్నప్పుడు వారి వారి వ్యక్తిగత జీవితాలకూ, ఆ దృక్పథాలకూ ఏమైనా పొంతన ఉందా లేదా అని చూసేపని పెట్టుకోం. వాళ్ళు చెప్తున్న విషయాలు తార్కికంగా నిశిత పరీక్షకు నిలబడతాయా లేదా అని మాత్రమే చూస్తాం. అంటే ఆధునిక తత్త్వశాస్త్రానికి వచ్చేటప్పటికి, పరీక్షకు నిలబడే జీవితాలకన్న, పరీక్షకు నిలబడి నిగ్గుతేలే సిద్ధాంతాలే తత్త్వశాస్త్రంగా చలామణీ అవుతూ వచ్చాయమన్నమాట.

కాని సోక్రటీస్ మొదలుకుని ఇరవైవ శతాబ్దపు తాత్త్వికులైన గ్రాంస్కి, ఫుకో, లెవినాస్ ల దాకా కూడా, మనిషి తాను ప్రతిపాదిస్తున్న ఆలోచనలకీ, తాను జీవిస్తున్న జీవితానికీ మధ్య తేడా లేకుండా చూసుకోవాలన్న ఒక తపన మాత్రం దాదాపుగా ప్రతి తత్త్వవేత్త జీవితంలోనూ కనిపిస్తుంది. బహుశా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆ సంఘర్షణ ఒక సోక్రటీస్ జీవితంలో కనిపించినంత నాటకీయంగా కనిపించకపోవచ్చుగాక, లేదా సోక్రటీస్ లాగా తాను నమ్మిన సత్యం కోసం స్థిరచిత్తంతో ప్రాణాలు త్యజించగల తత్త్వవేత్తలు ప్రతి యుగంలోనూ ఉండకపోయి ఉండవచ్చుగాక. కానీ, క్రైస్తవానికి సంబంధించినంతవరకూ క్రీస్తు ఎలా ఆదర్శమో, ఫిలాసఫీకి సంబంధించినంతవరకూ సోక్రటీస్ అటువంటి ఆదర్శంగా ఉంటూ వచ్చాడు.

ఐరోపా తత్త్వశాస్త్ర చరిత్రని తరచి చూసినప్పుడు దాదాపుగా ప్రతి ఒక్క తత్త్వవేత్తా సోక్రటీస్ లాగా జీవించాలని తపించినట్టే కనిపిస్తుంది. ప్లేటో తో సహా దాదాపుగా ప్రతి ఒక్కరూ ఆ ప్రయత్నంలో ఏ మేరకు నిలబడ్డారో తెలుసుకునే ఉద్దేశ్యంతో James Miller అనే ఆయన Examined Lives, From Socrates to Nietzsche (2012) అనే పుస్తకం రాసాడు. ఇందులో అతడు యూరోప్, అమెరికాలకు చెందిన తాత్త్విక తారాసమూహం నుంచి పన్నెండు మంది తత్త్వవేత్తల్ని ఎంపిక చేసుకుని వారి జీవితాల్నీ, వారి రచనలనీ కూలంకషంగా చర్చించాడు. వారిలో ప్రాచీన కాలానికి చెందిన సోక్రటీస్, ప్లేటో, డయోజినిస్, అరిస్టాటిల్, సెనెకాలు మధ్యయుగాలకు చెందిన అగస్టెయిన్, రినైజాన్సు యుగానికి చెందిన మాంటేన్ లతో పాటు ఆధునిక యుగానికి చెందిన దేకార్తే, రూసో, కాంట్, ఎమర్సన్, నీషేలు ఉన్నారు.

నేనెవరిని, నా జీవితానికి అర్థం ఏమిటి, ఈ జీవితం జీవించదగ్గదేనా, నా మాటకీ, నా ప్రవర్తనకీ మధ్య తేడా లేకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి? ఒకవేళ తేడా ఉంటే ఎందుకుంటోంది? పూర్తి త్రికరణ శుద్ధితో జీవించడం అసలు మనిషికి సాధ్యమేనా? తన జీవితాన్ని తన భావిస్తున్న ఆదర్శాల ప్రకారం జీంచడానికి మనిషి ఏ మేరకు స్వతంత్రుడు? అసలు స్వేచ్ఛా సంకల్పం అనేది సాధ్యమేనా?- సోక్రటీస్ తో మొదలై నీషే దాకా తాను ఎంచుకున్న పన్నెండు మంది తత్త్వవేత్తల్నీ ఈ ప్రశ్నలు ఎలా వేధించాయో, వారు వాటిని ఎలా ఎదుర్కొన్నారో, ఎలా ఎదుర్కోలేకపోయారో, ఆ ప్రయత్నంలో వాళ్ళ వాళ్ళ జీవితాల్లో సంభవించిన విషాదాలేమిటో మిల్లర్ ఎంతో ప్రతిభావంతంగా ఆవిష్కరించాడు.

ఉదాహరణకి, తాను కోరుకుంటున్న ఆదర్శ రాజ్యంలో తాత్త్విక-చక్రవర్తులే పాలకులుగా ఉంటారని ఆశించిన ప్లేటో నిజజీవితంలో సైరాక్యూస్ పాలకుణ్ణి సంస్కరించబోయి చావు తప్పి కన్నులొట్టబోయిన ఉదంతం మనల్ని నివ్వెరపరుస్తుంది. ఆధునిక యుగానికి స్వేచ్ఛా ప్రవక్తగా కొనియాడబడుతున్న రూసో, పిల్లలకి ఎటువంటి విద్య కావాలో ఏకంగా ఒక పుస్తకమే రాసిన రూసో, తనకి పుట్టిన పిల్లల పోషణ, పెంపకం బాధ్యతలు స్వీకరించకుండా వాళ్ళని ఒకరివెంట ఒకరిని అనాథశరణాలయానికి అప్పగిస్తో వచ్చేడని చదివినప్పుడు నిర్ఘాంతపోతాం. దేవుడు మరణించాడనీ, దేవుడి స్థానంలో ఉన్నతమానవుడు ప్రభవించబోతున్నాడనీ ప్రవక్తలాగా ఎలుగెత్తిన నీషే తన జీవితంలో చివర పదకొండేళ్ళపాటు మతిస్తిమితం కోల్పోయి జీవించాడని తెలుసుకోవడంలో చెప్పలేని నిర్వేదానికి లోనవకుండా ఉండలేం. ప్లేటో శిష్యుడిగా సమస్త మానవ విజ్ఞానాన్నీ ఔపోశన పట్టడానికి ప్రయత్నించిన అరిస్టాటిల్ తన జీవితకాలంలో మేసిడోనియన్ విజేతలకు ఆశ్రితుడిగా, వారి దురాక్రమణలకు మద్దతుదారుగా బతికాడని తెలియడం మనకొక విద్యుదాఘాతం లాంటిది. అందుకనే అరిస్టాటిల్ ని అతడి సమకాలికులే కాదు, అతడు మరణించిన తర్వాత మరొక రెండువందల ఏళ్ళ దాకా కూడా ఎవరూ ఒక మనిషిగా లెక్కెయ్యలేదని చరిత్ర చెప్తున్న సాక్ష్యాల్ని మిల్లర్ మనముందు ప్రవేశపెడుతున్నప్పుడు మనకెలా ప్రతిస్పందించాలో అర్థం కాదు.

పట్టపగలే ఒక లాంతరు చేతపట్టుకుని అంగడి వీథులన్నీ కలయతిరుగుతూ, ఎందుకిట్లా పగటిపూట దీపం పట్టుకు తిరుగుతున్నావని ప్రశ్నిస్తే, తాను అసలైన మనిషి కోసం వెతుక్కుంటున్నానని చెప్పిన ఒక తత్త్వవేత్త గురించి నీషే తన Thus Spake Jaratushtra లో రాస్తాడు. ఆ తత్త్వవేత్త క్రీ.పూ. అయిదవ శతాబ్దానికి చెందిన Diogenes the Cynic. సమస్త మానవ విజ్ఞాన శాస్త్రాలకీ పితామహుడిగా ఈనాడు గుర్తింపు పొందుతున్న అరిస్టాటిల్ ని అతడి సమకాలికులెవరూ గౌరవించలేదని తెలుసుకున్నాం. కాగా జీవితమంతా ఒక కుక్కలాగా కుక్కబతుకు బతికిన (Cynic అంటే అర్థం శునకసమానమైన అని) డయోజినిస్ ని అతడు ఏ పుస్తకాలూ రాయకపోయినా, ఏ తత్త్వశాస్త్రాన్నీ నిర్మించకపోయినా, ఏ సిద్ధాంతాన్నీ ప్రతిపాదించకపోయినా, అతడి సమకాలిక గ్రీకులు మాత్రమే కాక తర్వాత కాలంలో రోమన్లతో పాటు అరబ్బులు కూడా ఎంతో విలువైన వ్యక్తిగా, యోగిగా గౌరవించారని తెలుసుకోవడం మరొక ఆసక్తికరమైన సంగతి.

ఇలా ఈ పుస్తకంలోని పన్నెండు మంది తత్త్వవేత్తల గురించీ మనకు తెలియని ఎన్నో విషయాల్ని మిల్లర్ సాధికారికంగా పరిచయం చేస్తాడు. అందుకు గాను ఆయన ఆ తత్త్వవేత్తల జీవితం నుంచీ, రచనలనుంచీ మాత్రమే కాక, సమకాలికుల రచనలనుంచి కూడా ఎంతో సమాచారాన్ని సహాయంగా తెచ్చుకుంటాడు.

ఇందులో ప్రతి ఒక్క తత్త్వవేత్త గురించీ మిల్లర్ వివరిస్తున్నప్పుడు తిరిగి ఎత్తి రాసుకోదగ్గవీ, మీవంటి మిత్రుల్తో పంచుకోదగ్గవీ ఎన్నో వాక్యాలు అండర్ లైన్ చేసుకుంటో పోయేను.  వాటన్నిటినీ మళ్ళా ఇక్కడ రాయలేను. కాని కొన్ని ముఖ్యమైన వాక్యాలు మాత్రం పంచుకోవాలనుకుంటున్నాను.

తన పుస్తకం మొదలుపెడుతూ, ఉపోద్ఘాతంగా రాసిన అధ్యాయంలో, మిల్లర్ నీషే రాసిన ఒక వాక్యాన్ని ఉదాహరించాడు. ప్రాచీన ఐరోపీయ తత్త్వవేత్తల గురించి తెలుసుకోడానికి Diogenes Laertis అనే గ్రీకు చరిత్రకారుడు రాసిన Lives and Opinions of Eminent Philosophers అనే పుస్తకం ఒక ప్రామాణిక గ్రంథం. ఆ పుస్తకం గురించి రాస్తో, నీషే ఇలా అంటున్నాడు:

‘నావరకూ డయోజినిస్ లయర్టస్ రచన చదవడమంటే చాలా ఇష్టం. తత్త్వశాస్త్ర విమర్శ అంటో ఒకటి నిజంగా సాధ్యమనుకుంటే, దాని ద్వారా దేన్నైనా నిరూపించగలమనుకుంటే, అది చెయ్యవలసిన పని ఒక్కటే. ఏ తత్త్వవేత్త ఐనా తాను చెప్తున్నదానికి అనుగుణంగా జీవిస్తున్నాడా లేదా అన్నది చూడటమే. కాని మన విశ్వవిద్యాలయాల్లో మాత్రం ఆ విషయం ఎవరూ బోధించరు. అక్కడ నేర్పేదల్లా మాటల్ని  మాటల్తో నిగ్గుతేల్చే విద్యమాత్రమే.’

డయోజినిస్ లయర్టస్ తన పుస్తకంలో వివిధ ప్రాచీన గ్రీకు తత్త్వవేత్తల భావాల్ని వివరిస్తున్నప్పుడు వారి జీవితాలు ఏ మేరకు పరీక్షకు నిలబడ్డాయో చెప్తూ వచ్చాడు. అవన్నీ చాలావరకూ ఐతిహ్యాలూ, కల్పనలూ, పుక్కిటిపురాణాలే కావొచ్చుగాక. కాని, వాటి ఉద్దేశ్యం స్పష్టమే. తత్త్వవేత్తల భావాల నిగ్గుతేల్చవలసింది ఆ మాటల్లోని తార్కికత బట్టి కాదు, వాళ్ళు తమ తమ జీవితాల్లో ఏ మేరకు తమ నమ్మకాలకు నిలబడ్డారన్నదాన్ని బట్టి అన్నది.

ఇరవైవ శతాబ్దంలో ఫుకో లాంటి తత్త్వవేత్త డయోజినిస్ మాటల్ని పట్టించుకోకపోవచ్చుగాని, నీషేని పక్కనపెట్టలేకపోయాడు. ఆధునిక యుగంలో తత్త్వశాస్త్రానికి పట్టిన గ్రహణం ప్రధానంగా, philosophical life ని నిర్లక్ష్యం చేయడమేనని ఫుకో భావించాడు. అందుకు ఆయన రెండు కారణాలు చెప్పాడు. ఒకటి: మనిషి తన ఆదర్శాలకు అనుగుణంగా జీవించాలనే ఆదర్శాన్ని తత్త్వశాస్త్రం నుంచి మతం గుంజుకుపోవడం. రెండవది: సత్యాన్ని అన్వేషించడంలో తత్త్వశాస్త్రంకన్నా సైన్సు మరింత విశ్వసనీయమని ప్రజలు భావించడం.

కాని, మతమూ, సైన్సూ కూడా తత్త్వశాస్త్రానికి ప్రత్యామ్నాయాలు కాలేవని నమ్మినప్పుడు మాత్రమే తత్త్వవేత్తలు తమ జీవితాల్నీ, తమ చుట్టూ ఉన్న జీవితాల్నీ  ప్రభావితం చెయ్యగలరని తత్త్వశాస్త్ర చరిత్ర నిరూపిస్తూ ఉన్నది.

మతం మన కంటికి కనిపించే అస్తిత్వాన్ని నిరాకరిస్తుంది. సైన్సు ఈ అస్తిత్వానికి స్థిరత లేదని చెప్తుంది. కాని తత్త్వశాస్త్రం మాత్రమే నీషే చెప్పినట్టుగా to become what one is అనే అన్వేషణకు పూనుకుంటుందని మిల్లర్ రాస్తున్నాడు. ఈ వాక్యాన్ని కొంత వివరించాలి. మామూలుగా మతం being గురించి మాట్లాడుతుంది. అంటే ఎన్నటికీ మారని, మార్పు వల్ల ఏ మాత్రం ప్రభావితం కాని ఒక శాశ్వత అస్తిత్వం ఉందని చెప్తుంది. సైన్సు becomg గురించి మాట్లాడుతుంది. అంటే ఒక అంతిమ సత్యం అంటో ఏదీ లేదనీ, సృష్టిలో ప్రతి ఒక్కటి పరిణమిస్తూనే ఉన్నదనీ, ఏ పరిణామానికీ ఒక శాశ్వత పరమార్థాన్ని ఆపాదించలేమనీ చెప్తుంది. కానీ నీషే చెప్తున్నదేమిటంటే, తత్త్వశాస్త్రం మాత్రం మనిషి తానేదై ఉన్నాడో (what is) అది కావడానికే (to become) తపిస్తూంటుందని. పైకి విరోధాభాసగా కనిపించే ఈ వాక్యంలోనే తత్త్వశాస్త్ర సారాంశమంతా ఇమిడి ఉందని చెప్పవచ్చు.

ఒక మనిషి తాత్త్వికంగా సత్యాన్వేషణకు పూనుకోవడమంటే ‘నీరస తథ్యాల్ని’ తిరస్కరించడం. ‘నిశ్చల నిశ్చితాల’ ని పక్కకు నెట్టేయడం. కాబట్టే, సత్యాన్వేషణ అన్ని వేళలా సంతోషానికీ, మనశ్శాంతికీ దారితియ్యకపోగా, నిరంతర ఆత్మశోధనకీ, సంశయగ్రస్తతకీ, ఆత్మవేదనకీ దారితియ్యడం ఆశ్చర్యం కాదు. అలాగని మనం సత్యాన్వేషణని ఆపలేం. పక్కనపెట్టేయలేం. ‘నిత్య నిరుత్తరపు ప్రశ్న జ్ఞానం ఇచ్చిన దానం’ అని తెలిసికూడా మన వివేచనని కట్టిపెట్టలేం.

ఎందుకంటే తత్త్వవేత్తలే లేకపోతే, ఎప్పటికప్పుడు మతమో, సైన్సో తాము చెప్తున్నవే అంతిమ సత్యాలని ప్రజల్ని నమ్మించే ప్రమాదం ఉండనే ఉంటుంది. మరెందుకు కాకపోయినా, నిశ్చయసత్యాలుగా ప్రతిపాదిస్తున్నవాటిని నిగ్గుతేల్చమని అడగటానికేనా తత్త్వశాస్త్రం తప్పనిసరి.

అయితే అటువంటి ప్రశ్నలు విశ్వవిద్యాలయాల్లో తార్కికంగా చేసే చర్చల రూపంలోకన్నా ఒక మనిషి తన మాటలకీ, చేతలకీ మధ్య ఉన్న దూరాన్ని చూసి భయపడి, తట్టుకోలేక, బహిరంగంగానో, రహస్యంగానో విలపించడంలోంచో, తనని తాను నిలదీసుకోడంలోంచో లేదా చివరికి మతిస్తిమితం తప్పడంలోనో మానవాళికి కొత్త వెలుగు చూపిస్తాయి. అందుకనే ప్రాచీన కాలంలో ఒక సోక్రటీస్, ఒక మార్కస్ అరీలియస్ వంటివారు తమ జీవితాలే ఉదాహరణగా ప్రజలమీద చూపించిన ప్రభావం ఒక అరిస్టాటిల్ లాంటి వాడు చూపలేకపోయాడు. అధునిక కాలంలో ఒక టాల్ స్టాయి లాంటి రచయిత ప్రజల ఆలోచనావిధానాన్ని, జీవనశైలిని ప్రభావితం చెయ్యగలిగినట్టుగా, యూరోప్ లోనూ, ఇంగ్లాండులోనూ విశ్వవిద్యాలయాల్లో తత్త్వశాస్త్రం బోధించిన ప్రొఫెసర్లు చేయలేకపోయారు.

ఒక నీషే లాంటి వాడు ఒకరోజు బజారులో పోతున్నప్పుడు ఒక గుర్రబ్బండివాడు తన గుర్రాన్ని చితకబాదుతున్న దృశ్యం చూసి చలించిపోయి అమాంతం పోయి ఆ గుర్రాన్ని కావిలించుకున్నాడనీ, ఆ క్షణమే అతడికి మతితప్పిందనీ, ఆ తర్వాత మరణించేదాకా, పదకొండేళ్ళపాటు అతడికి మళ్ళా మతిస్తిమితం చిక్కలేదనీ తెలిసినప్పుడు అంతదాకా నీషే రాసిన ప్రతి ఒక్క వాక్యం సరికొత్త సార్థకతతో మనముందు ప్రత్యక్షం కావడం మొదలుపెడుతుంది. తత్వవేత్త అన్వేషణకు నిజమైన అర్ధాన్ని సంతరించేది అతడి నిజాయితీ, అతడి నైతికతా మాత్రమే అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ నాకు చలంగారే గుర్తొస్తూ ఉన్నారు. ఒకప్పుడు చలంగారి సాహిత్యదృక్పథాన్ని అంచనా వేస్తూ, సుదర్శనంగారు, చలం రొమాంటిక్ గా జీవితం ప్రారంభించి దార్శనికుడిగా పరిణతి చెందాడు అని రాసారు. ఆ మాటలు అక్షర సత్యం. ఆధునిక తెలుగు సాహిత్యంలోనూ, తత్త్వశాస్త్రంలోనూ (తెలుగు తత్త్వశాస్త్రమంటూ ఒకటి ఉంటే) కూడా సత్యాన్వేషణకి చలాన్ని మించిన జీవితం మరొకటి కనబడదు. తన ఆలోచనలకీ, తన జీవితానికీ మధ్య ఎడం తగ్గించుకోడానికి ఆయన చేసిన పోరాటం ఒక సోక్రటీస్, ఒక ఎమర్సన్, ఒక నీషే ల ప్రయాణానికి ఏ మాత్రం తీసిపోనిదే.

ఈనాడు మన జీవితాల్లోనూ, మన చుట్టూ ఉన్న జీవితాల్లోనూ కూడా conformity ఒక విలువగా మారిపోతున్నది. మత గురువులూ, మేధావులూ, రాజకీయ నాయకుల్తో పాటు చివరికి సినిమాతారలూ, అడ్వర్టైజ్ మెంట్లూ చెప్పేవే నిశ్చల నిశ్చితాలుగా, ప్రశ్నించవలసిన పనిలేని సత్యాలుగా చలామణి అయిపోతున్న కాలంలో ఉన్నాం మనమిప్పుడు. మనిషి వ్యక్తిగత జీవితానికీ, అతడు సమాజకేంద్రం మధ్యలో నిల్చొని మాట్లాడుతున్న విలువలకీ మధ్య పొంతన ఉండాలని ఆశించనవసరం లేదనే కాలం ఇది. ఏ బలమైన శక్తి ఎటు ఊగిస్తే అటు అత్యధికసంఖ్యాకులు తలూపడానికి సిద్ధంగా ఉన్న ఈ కాలంలో తన జీవితాన్ని బహిరంగంగా పరీక్షకు పెట్టుకోడానికి ఒక్క మనిషి ముందుకొచ్చినా కూడా అది చాలా పెద్ద విషయం నా దృష్టిలో. అప్పుడు మాత్రమే మనం నిజంగా చీకటియుగంలోంచి వెలుగులోకి అడుగుపెట్టినట్టు చెప్పుకోగలుగుతాం.

7-6-2024

14 Replies to “నీరస తథ్యాల్ని తిరస్కరించడం”

  1. నమస్తే అండి,

    మిల్లర్ ఒక్కో తత్వవేత్త గురించి రాసినది మీరు సంగ్రహంగా రాస్తే నాలాంటివాళ్ళదరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

    ఈ విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ…

  2. తాను ఏమై ఉన్నాడో ,దానిగా ఉండటానికి తపన.మరి కాకుండా అడ్డుపడేది ఏది.మాయ.ప్రశ్నించుకుంటూ,సాధన చేసుకుంటూ వెళ్లడమే.మన దీపాన్ని వెలిగించుకొని వెళ్లిపోతుండాలి. ఇతరుల ఆలోచన అనవసరం👌👌👌

  3. ఈనాడు మన జీవితాల్లోనూ, మన చుట్టూ ఉన్న జీవితాల్లోనూ కూడా conformity ఒక విలువగా మారిపోతున్నది. మత గురువులూ, మేధావులూ, రాజకీయ నాయకుల్తో పాటు చివరికి సినిమాతారలూ, అడ్వర్టైజ్ మెంట్లూ చెప్పేవే నిశ్చల నిశ్చితాలుగా, ప్రశ్నించవలసిన పనిలేని సత్యాలుగా చలామణి అయిపోతున్న కాలంలో ఉన్నాం మనమిప్పుడు. మనిషి వ్యక్తిగత జీవితానికీ, అతడు సమాజకేంద్రం మధ్యలో నిల్చొని మాట్లాడుతున్న విలువలకీ మధ్య పొంతన ఉండాలని ఆశించనవసరం లేదనే కాలం ఇది. ఏ బలమైన శక్తి ఎటు ఊగిస్తే అటు అత్యధికసంఖ్యాకులు తలూపడానికి సిద్ధంగా ఉన్న ఈ కాలంలో తన జీవితాన్ని బహిరంగంగా పరీక్షకు పెట్టుకోడానికి ఒక్క మనిషి ముందుకొచ్చినా కూడా అది చాలా పెద్ద విషయం నా దృష్టిలో. అప్పుడు మాత్రమే మనం నిజంగా చీకటియుగంలోంచి వెలుగులోకి అడుగుపెట్టినట్టు చెప్పుకోగలుగుతాం.

    మీరు చెప్తున్నది ఎంత సత్యం? నేను పదే పదే అనుకున్నది ఇటువంటి మీరు చెప్పిన భాష్యం కాకపోవొచ్చు. కానీ అర్థం మాత్రం ఇదే.
    మీరు రాసింది ఒకసారి చదివి పక్కన పెట్టేది కాదు.
    జీవితం ఎలాగైతే తమాషాగా, హాయిగా తిని బతికేద్దాం అనుకునే ఎంతో మంది లాంటిది కాదు.
    విలువకి విలువ ని ఇచ్చుకునేది.

    వెతికితే కూడా ఎక్కడో కానీ లభించని మీ వంటి వ్యక్తుల్ని అతి భద్రంగా చూచుకుంటూ కాపాడుకోవాల్సిన సంగతి.
    బాలకులైన రామలక్ష్మణులు అడవిలో గురువు వెంట ఎటువంటి ప్రశ్నలు ఉద్భవించని రీతిలో నడుస్తారట.
    ఆ సంఘటన చదువుతూ ఆశ్చర్యపోవటం తప్ప మాటకి తావుండదు.
    నేనెరిగిన అత్యుత్తమ మరో వ్యక్తి సత్యా పామర్తి.
    ఎన్ని తెలిసినా ఎప్పుడో తప్ప ఒక్క మాటా ఉండదు.
    మాట మాట్లాడితే ప్రభంజనం లా దివ్యమైన వెలుగు ప్రసరిం పబడుతుంది.
    కానీ మీరు నిరంతరం చెప్పే ప్రతి పలుకు ప్రతి మనిషి ఉన్నతికి చీకటి లో చిరుదివ్వె.
    అదృష్టం పరుగులెత్తి మనుషులు తమకేం కావాలో మీ మాటల్లో వెతుక్కుంటే వారికి తెలుస్తుందని నా నమ్మకం.
    మీ రచనల్ని చదివే భాగ్యం కల్పించిన దైవానికి నా అంజలి.

  4. ఉదయాన్నె ఇదంతా చదవడం నాదెంత అదృష్టం
    “జీవితాన్ని పరీక్షకు పెట్టడం” అనే మాటే నాలోని మనిషిని పరీక్షిస్తున్నట్టు ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది

  5. మేం చదివాం అనడానికే స్పందించడం. ఎన్నో కొత్త విషయాలను సరళంగా సుబోధంగా మాకు తెలియపరచడానికి మీరు పడే తపన మీ ప్రతి రచనలో స్పష్టంగా కనిపిస్తుంది. విషయాలను విశ్లేషించేంత జ్ఞానం లేకపోయినా మీ వల్ల అనేక విషయాలమీద మంచి అవగాహన ఏర్పడటం నిజం. సారాంశం మాత్రం మనిషి తాను ఎందుకు పుట్టాడో తనను తాను ప్రశ్నించుకుని , ఆలోచనకూ జీవితానికీ తేడా లేకుండా జీవించగలగటం అనేది మాత్రం ఒక గొప్ప మేలుకొలుపు. మీరెప్పుడూ వైతాళికులే. అదే కొనసాగిస్తున్న ధన్యజీవులు.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  6. ఏ బలమైన శక్తి ఎటు ఊగిస్తే అటు అత్యధికసంఖ్యాకులు తలూపడానికి సిద్ధంగా ఉన్న ఈ కాలంలో తన జీవితాన్ని బహిరంగంగా పరీక్షకు పెట్టుకోడానికి ఒక్క మనిషి ముందుకొచ్చినా కూడా అది చాలా పెద్ద విషయం

    ధన్యవాదాలు సర్

  7. Purva Phalghuni(పూర్వ ఫల్గుణి) – నమస్తే , నమస్కారం, పుట్టింది,కొంతవరకు పెరిగింది మద్రాస్ లో ఆ తరువాత హైస్కూల్,కాలేజీ జీవితం, తూర్పుగోదావరి జిల్లాలో, వివాహం అయినప్పటి నుంచి హైద్రాబాద్ లో నివాసం. బాల్యం నుంచి మా నాన్నగారు,అమ్మగారి ల ద్వారా, పుస్తకాలు చదవడం అలవాటు అయింది. నాన్నగారికి ఎందరో ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం ఉండేది. ఆవిధంగా ముఖ్యంగా కధా, నవలా సాహిత్యం పట్ల అబిలాష పెరిగింది. వివాహానంతరం శ్రీవారి వల్ల, అమ్మ లాంటి అత్తగారి తోడ్పాటుతో నా సాహిత్యాభిలాష నిర్విఘ్నంగా కొనసాగింది. 2010లో ఉద్యోగం నుండి, స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. చదవడమంటే ఇష్టం. అయినప్పటికీ కథలు రాయాలానే తపన తో రాసిన తొలి కథ కౌముది అంతర్జాల పత్రిక లో ప్రచురిచతమైంది. నవ్య,ఆంధ్రభూమి,స్వాతి,తెలుగు వెలుగు,విపుల,రచన,జాగృతి,ఉషాపత్రిక,సాహో వంటి వార,మాస పత్రికలలోనూ, ఆంధ్రప్రభ, సాక్షి, నమస్తే తెలంగాణ, మనతెలంగాణ వంటి దినపత్రికలలోనూ, విశాలాంధ్ర వారి దీపావళి సంచికలోనూ, అంతర్జాల పత్రిక లైన, కౌముది, మధురవాణి, సంచిక, రస్తా, సహరి, నిత్య, కథామంజరి, రవళి నెచ్చెలిలలో కూడా కథలు ప్రచురింపబడ్డాయి. అదే విధంగా మరికొన్ని కథలు ఇతర ప్రముఖ కథా సంకలనాల లో,ఆకాశవాణి లో కూడా (చదివినవి) ప్రచురించబడి పాఠకుల మన్ననలు పొందాయి చతుర మాసపత్రికలో తొలి నవల “జీవితం ఓ ప్రవాహం” ప్రచురణ అయింది. రెండవ నవల 'కాశీపట్నం చూడరబాబూ' జాగృతి వారపత్రికలో సీరియల్ గ వెలువడింది మూడవ నవల ‘ప్రయాణం’ ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం లో ప్రచురిచతమయింది. బహుమతుల వివరాలు: గో తెలుగు.కాం వారి హాస్య కథల పోటిలో ప్రథమ బహుమతి, ఫేస్బుక్ లోని కథ గ్రూప్ నిర్వహించిన కథల పోటిలో ప్రథమ బహుమతి, అమెరికా తెలంగాణా సంఘం (ATA) వారి సావనీర్ కు పెట్టిన కథల పోటిలో మొదటి బహుమతి, వంగూరి ఫౌండేషన్ వారి మధురవాణి.కాం వారు నిర్వహించిన పోటిలో మేనిక్విన్ కథకి ఉత్తమ కథ బహుమతి, హాస్యానందం వారి పోటి లో కన్సొలేషన్ బహుమతి వచ్చాయి. అంతర్జాల పత్రికలయిన సహరి, కథా మంజరి, తెలుగుతల్లి డే కెనడా వారి పోటీలలో కూడ బహుమతులు వచ్చాయి తురగా ఫౌండేషన్ వారు నిర్వహించిన కథల పోటీ లో ఉత్తమబహుమతి, విశాఖ సంస్కృతి వారు నిర్వహించిన కథల పోటీలో ఉత్తమ బహుమతి, విశాలాక్షి మాసపత్రిక నిర్వహించిన కథల పోటీ లో మొదటి బహుమతి, నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజా గ్రంధాలయం వారి పోటీ లో ప్రోత్సాహక బహుమతి, కౌముది అంతర్జాల పత్రికలో ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. ఇప్పటి దాకా రాసిన కథల సంఖ్య దాదాపుగా వంద కు పైన ఉన్నాయి మొదటి పుస్తకం వాత్సల్య గోదావరి (కథల సంపుటి) రెండవ పుస్తకం కాశీ పట్నం చూడర బాబు(నవల) నా మూడవ పుస్తకం 'మనం' ( కథల సంపుటి) నాలగవ పుస్తకం 'గెలుపు గాయాలు'(కథల సంపుటి) ఐదవ పుస్తకం పథికుడు(నవల)
    Mani Vadlamani says:

    ఈ వ్యాసం నా మనసును పట్టేసుకుంది.
    మొదటగా మన చలం గారి గురించిన మీ లోతయిన చూపు, తరువాత తత్వవేత్త నీషే గురించి మీ అధ్యయనం, సత్యాన్వేషణ చేసే వాళ్ళు కొంతమంది కొవ్వొత్తులు లా కాలిపోతూ ఏ విధంగా వెలుగు నిస్తారు.

    వీటి గురించి మీ వ్యాసం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది
    ధన్యవాదాలు🙏🙏

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%