సాహిత్యమంటే ఏమిటి?

సాహిత్య విమర్శ అనే పదం నాకు మొదటినుంచీ అంతగా నచ్చని పదం. నాకు తెలిసిందీ, చాతనయిందీ సాహిత్య ప్రశంస మాత్రమే. ఇంగ్లిషులో appreciation అనే పదానికి ప్రశంస దాదాపుగా సమానమైన బరువుతో తూగుతుంది. అటువంటి సాహిత్య ప్రశంసలో భాగంగా నేను వెలువరించిన రెండో సంపుటం ‘సాహిత్యమంటే ఏమిటి?’.

ఈ పుస్తకం వెలువడ్డ ఇన్నేళ్ళ తరువాత కూడా ఒక కవి, ఒక భావుకుడు ఈ పుస్తకం మీద ఇంత సంతోషంతో నాలుగు మాటలు రాయడం నన్ను ఆశ్చర్యపరిచింది. అందుకని పలమనేరు బాలాజి రాసిన ఈ సమీక్ష మీతో పంచుకోవాలనిపించింది. దాంతో పాటే, ఆ పుస్తకం పిడిఎఫ్ కూడా మరోసారి.


సాహిత్యం అంటే ఏమిటి?

పలమనేరు బాలాజి

విద్యార్థులను అడగవలసిన ప్రశ్న మాత్రమే కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం కూడా.

కొన్ని పుస్తకాలని నిరంతరం చదువుకోవాలి.కొన్ని పుస్తకాలను మనం చదవకుండానే ఉండిపోతాం. కొన్ని పుస్తకాలు చదవాలి అనుకున్నా ముందుకు వెళ్లలేము. కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత అందులో ఏముందో మరచిపోతాం. ఒక వాక్యం కూడా గుర్తుండదు. కానీ చాలా కొన్ని పుస్తకాలు మాత్రం మళ్లీ మళ్లీ చదవాలని అనిపిస్తుంది. కొన్ని వాక్యాలను మళ్లీ ఆ పుస్తకాల్లో వెతికి తడిమి చదువుకోవాలని అనిపిస్తుంది. ఏదో ఒక విషయమో విశేషమో ఆ పుస్తకాలను గుర్తుకు తెస్తాయి.

ఓకే అంశానికి సంబంధించి ఒకే కవి వివిధ సందర్భాల్లో ఎన్నో కవితలు రాసి ఉండవచ్చు. ఓకే అంశానికి సంబంధించి చాలా మంది కవులు చాలా కవితలు రాసి ఉండవచ్చు. అయినా గుర్తుంచుకోతగిన ప్రతి కవితా మనకు తప్పకుండా గుర్తుండే ఉంటుంది. ఒకే అంశమే కావచ్చు….వాళ్ళు చెప్పిన పద్ధతి

చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ భావనని ఆ వాక్యాలను మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకునేలా చేస్తుంది. ఆ బలం ఆ శక్తి వాళ్ళ శైలి నుండి వస్తుంది.

సౌదా,  కె. శ్రీనివాస్, ఎన్. వేణుగోపాల్ , కె.శివారెడ్డి, వాడ్రేవు చిన వీరభద్రుడు లాంటి వాళ్ళ వచనం అందుకే ఎప్పుడూ గుర్తుండిపోతుంది. చెబుతున్న విషయం అద్భుతంగా ఉంటుంది, దాంతో పాటు చెప్పే పద్ధతి కూడా అద్భుతంగా ఉంటుంది.

*

వాడ్రేవు చిన వీరభద్రుడు గారి సాహిత్యమంటే ఏమిటి పుస్తకం  2009లో వచ్చింది. 2000 నుండి 2009 మధ్యకాలంలో పది సంవత్సరాలలో వచ్చిన సాహిత్య వ్యాసాలు, సమీక్షలు ముందుమాటలు, కొన్ని ప్రసంగపాఠాలను సంపుటంగా తీసుకురావడం జరిగింది. ప్రసిద్ధ కవి సివి కృష్ణారావు గారికి అంకితం ఇచ్చిన వ్యాస సంపుటి ఇది.

నివాళికి సంబంధించిన నాలుగు వ్యాసాలు, ఆస్వాదన శీర్షిక కింద 28 వ్యాసాలు, విశ్లేషణ శీర్షిక కింద 14 వ్యాసాలు, వివేచన నాలుగు వ్యాసాలు, నివేదన పది వ్యాసాలు

మొత్తం 60 వ్యాసాల విలువైన పుస్తకం ఇది.

*

ఏవేవో కాలాలలోకి ఏవేవో ప్రదేశాలలోకి ఈ పుస్తకం మనల్ని తీసుకు వెళుతుంది. మానవతను, ప్రేమను, మనుషుల్ని చూపిస్తుంది. గొప్ప కలాలను పరిచయం చేస్తుంది.

ఇవన్నీ చదివాక ఈ పుస్తకానికి ఈ శీర్షికే ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది. సాహిత్యం అంటే ఏమిటో సాహిత్య విద్యార్థులకు అర్థం అవుతుంది. విద్యార్థి దశలో ఈ పుస్తకాన్ని, ఇలాంటి పుస్తకాలను చదవగలిగితే తప్పకుండా విద్యార్థులకు సాహిత్యం పట్ల ఆసక్తి,అవగాహన ,గౌరవం పెరుగుతుంది.

ప్రపంచం పట్ల జీవితం పట్ల మనిషి పట్ల వారికి విలువైన సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలను తీర్చే సాహిత్యాన్ని వాళ్లే వెతికి చదువుకుంటారు. ప్రశ్న ,ప్రశ్న తో పాటు ఒక అన్వేషణ మొదలవుతుంది, కొనసాగుతుంది

సాహిత్యం పట్ల విద్యార్థులకు మక్కువ కలగాలంటే మంచి పుస్తకాలను ఉపాధ్యాయులు వారికి పరిచయం చేయాలి. అంతకుముందు ఉపాధ్యాయులు మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి.

అనేక విషయాలను, పుస్తకాలను, స్థల కాలాలను ప్రస్తావించిన పుస్తకం సాహిత్యమంటే ఏమిటి.

*

*

*

*

*

*

*

గ్లోబల్ ఖడ్గం కవిత సంకలనం గురించిన ఆదివారం వార్తలోని సమీక్ష,  అందుకు సంబంధించి ఎన్. వేణుగోపాల్ , డాక్టర్ ఏకే ప్రభాకర్ గార్ల ప్రతిస్పందనకు చినవీరభద్రుడు గారి సమాధానం‌ ఈ పుస్తకంలో ఉన్నాయి.

*

ఎందరో వ్యక్తులు, ఎన్నో అద్భుతమైన పుస్తకాలను, ఎన్నో తావులను, సాహిత్య సందర్భాలను పరిచయం చేసిన పుస్తకం ఇది.

మరాఠీ కవి ‘విందా కరందీకర్’ కు  జ్ఞానపీఠ పురస్కారం  వచ్చిన సందర్భంగా వారి వ్యాసం చూడండి.

*

*

ఈ పుస్తకంలో ఉటంకించిన కవితలను మళ్లీ మళ్లీ చదువుకోవాల్సి ఉంటుంది. వెంటాడే కవితలు, మాటలు ఈ పుస్తకం నిండా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

*

సాహిత్యం అంటే ఏమిటి అనే వ్యాసం   2001లో కావలి జవహర్ భారతి ఆవరణలో చేసిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి స్మారక ప్రసంగం పాఠం.ఇందులోని అన్ని అంశాల గురించి అందరూ అంగీకరించలేకపోవచ్చు కానీ,… సాహిత్యం అంటే ఏం చెబుతున్నారో విందాం.

*

*

ఏ పుస్తకంలో అయినా చర్చించే అంశాలు చాలా ఉంటాయి. నేర్చుకునే అంశాలు ఎన్నో ఉంటాయి. తెలుసుకోవలసిన తెలియని అంశాలు ఎన్నో ఉంటాయి.

వెనక్కి వెళ్లి చదివిన పుస్తకాలని మళ్ళీ మళ్ళీ చదువుతుంటే ఎన్నో కొత్త విషయాలు కొత్తగా స్పురిస్తాయి, అర్థం అవుతాయి.

Featured image: The Table of the Writer, image generated through AI

23-5-2024

12 Replies to “సాహిత్యమంటే ఏమిటి?”

    1. సాహిత్యమంటే మతంకన్నా, కళకన్నా, సైన్సుకన్నా, తత్త్వశాస్త్రం కన్నా కూడా విస్తృతమైన మహాన్వేషణ. 🙏

  1. ఈ ఉదయం సాహిత్యసమీరం సాంత్వన చేకూర్చింది. అటు రాళ్లబండి శశిశ్రీ పంపిన అనుమంద్రం చదువుతూ కవిత్వకాంతులను దర్శిస్తూ, విరామంలో సాహిత్యం అంటే ఏమిటి పుస్తకం పై పలమనేరు బాలాజీ గారి సమీక్ష చదువుతుంటే పెడదారి పట్టే మనిషిని మనిషిగా తీర్చి దిద్దగలిగేది సాహిత్యమొక్కటే అన్న భావన బలపడింది. సాహిత్యబృందావనం లో విహరించిన రాధాత్మక పాఠకుడు కవిత్వ కృష్ణ తృష్ణ అనుభూతిని అందుకోగలడు. అదొక రసైక లోకం . పసిడి నిగ్గు తేల్చే తేజాబు సాహిత్యం. సమీక్షతో పాటు పుస్తకం పి డి ఎఫ్ . ఉంచటంతో చదవని వారికి చదివే అవకాశం కలిగించారు. సంతృప్త హృదయాంతరంగాన్ని అభినందనగా
    అందిస్తున్నాను.

    1. ధన్యవాదాలు సార్ మీ రసహృదయ స్పందనకు!

  2. “కొన్ని కలలు, మెలకువలు” తరువాత నాకెంతో ఇష్టమైన పుస్తకం ఈ “సాహిత్యమంటే ఏమిటి?” పలమనేరులో ఉన్నప్పుడు ఒకసారి ” మీకు నచ్చిన పుస్తకం” అనే శీర్షిక కింద దీనిపై మాట్లాడాను. మళ్ళీ శ్రీశైల్ రెడ్డి గారు అడ్మిన్ గా ఉన్న బుక్ రీడర్స్ క్లబ్ లో కూడా మాట్లాడాను. చక్కని, అందరూ చదవదగ్గ పుస్తకం. పలమనేరు బాలాజీ గారికి అభిందనలు.

    1. ధన్యవాదాలు బాలాజీ! నేనే చెప్పాలి!

  3. మీ సాహిత్య రచనల్ని చదువుతుంటే, మీ స్పీచ్ లు వింటుంటే నాకు చెప్పలేని ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు చదివిన రచనల్లోని సారాన్ని మీ కవిత్వంతో, మీ మాటల సొబగు తో తీర్చిదిద్ది అందరికి పంచుతారు.అదెంత అసాధారణ విషయం?
    సాహిత్యం జీవితాన్ని జీవించమంటుంది. ఆలోచింపజేస్తుంది. కర్తవ్యాన్ని బోధిస్తుంది. మీ రచనలలోని ఒక్కో మాటా అతి విలువని సంతరించుకుని… ఉత్తుత్తినే మాటలతో … కాలాన్ని వృధాగా గడిపే మనుషులకి ఒక గుణపాఠం. బుర్రకి పదును.
    మీరు చెప్పినట్టు అక్షరాలా మహాన్వేషణ.
    మీతో పాటు సాహిత్య ప్రపంచం లో కి మమ్మల్ని కూడా పయనింపజేస్తున్న తమకు శ్రద్ధా భక్తులతో నమస్కరిస్తున్నాను.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%