
సాహిత్య విమర్శ అనే పదం నాకు మొదటినుంచీ అంతగా నచ్చని పదం. నాకు తెలిసిందీ, చాతనయిందీ సాహిత్య ప్రశంస మాత్రమే. ఇంగ్లిషులో appreciation అనే పదానికి ప్రశంస దాదాపుగా సమానమైన బరువుతో తూగుతుంది. అటువంటి సాహిత్య ప్రశంసలో భాగంగా నేను వెలువరించిన రెండో సంపుటం ‘సాహిత్యమంటే ఏమిటి?’.
ఈ పుస్తకం వెలువడ్డ ఇన్నేళ్ళ తరువాత కూడా ఒక కవి, ఒక భావుకుడు ఈ పుస్తకం మీద ఇంత సంతోషంతో నాలుగు మాటలు రాయడం నన్ను ఆశ్చర్యపరిచింది. అందుకని పలమనేరు బాలాజి రాసిన ఈ సమీక్ష మీతో పంచుకోవాలనిపించింది. దాంతో పాటే, ఆ పుస్తకం పిడిఎఫ్ కూడా మరోసారి.
సాహిత్యం అంటే ఏమిటి?
పలమనేరు బాలాజి
విద్యార్థులను అడగవలసిన ప్రశ్న మాత్రమే కాదు, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం కూడా.
కొన్ని పుస్తకాలని నిరంతరం చదువుకోవాలి.కొన్ని పుస్తకాలను మనం చదవకుండానే ఉండిపోతాం. కొన్ని పుస్తకాలు చదవాలి అనుకున్నా ముందుకు వెళ్లలేము. కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత అందులో ఏముందో మరచిపోతాం. ఒక వాక్యం కూడా గుర్తుండదు. కానీ చాలా కొన్ని పుస్తకాలు మాత్రం మళ్లీ మళ్లీ చదవాలని అనిపిస్తుంది. కొన్ని వాక్యాలను మళ్లీ ఆ పుస్తకాల్లో వెతికి తడిమి చదువుకోవాలని అనిపిస్తుంది. ఏదో ఒక విషయమో విశేషమో ఆ పుస్తకాలను గుర్తుకు తెస్తాయి.
ఓకే అంశానికి సంబంధించి ఒకే కవి వివిధ సందర్భాల్లో ఎన్నో కవితలు రాసి ఉండవచ్చు. ఓకే అంశానికి సంబంధించి చాలా మంది కవులు చాలా కవితలు రాసి ఉండవచ్చు. అయినా గుర్తుంచుకోతగిన ప్రతి కవితా మనకు తప్పకుండా గుర్తుండే ఉంటుంది. ఒకే అంశమే కావచ్చు….వాళ్ళు చెప్పిన పద్ధతి
చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ భావనని ఆ వాక్యాలను మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకునేలా చేస్తుంది. ఆ బలం ఆ శక్తి వాళ్ళ శైలి నుండి వస్తుంది.
సౌదా, కె. శ్రీనివాస్, ఎన్. వేణుగోపాల్ , కె.శివారెడ్డి, వాడ్రేవు చిన వీరభద్రుడు లాంటి వాళ్ళ వచనం అందుకే ఎప్పుడూ గుర్తుండిపోతుంది. చెబుతున్న విషయం అద్భుతంగా ఉంటుంది, దాంతో పాటు చెప్పే పద్ధతి కూడా అద్భుతంగా ఉంటుంది.
*
వాడ్రేవు చిన వీరభద్రుడు గారి సాహిత్యమంటే ఏమిటి పుస్తకం 2009లో వచ్చింది. 2000 నుండి 2009 మధ్యకాలంలో పది సంవత్సరాలలో వచ్చిన సాహిత్య వ్యాసాలు, సమీక్షలు ముందుమాటలు, కొన్ని ప్రసంగపాఠాలను సంపుటంగా తీసుకురావడం జరిగింది. ప్రసిద్ధ కవి సివి కృష్ణారావు గారికి అంకితం ఇచ్చిన వ్యాస సంపుటి ఇది.
నివాళికి సంబంధించిన నాలుగు వ్యాసాలు, ఆస్వాదన శీర్షిక కింద 28 వ్యాసాలు, విశ్లేషణ శీర్షిక కింద 14 వ్యాసాలు, వివేచన నాలుగు వ్యాసాలు, నివేదన పది వ్యాసాలు
మొత్తం 60 వ్యాసాల విలువైన పుస్తకం ఇది.
*
ఏవేవో కాలాలలోకి ఏవేవో ప్రదేశాలలోకి ఈ పుస్తకం మనల్ని తీసుకు వెళుతుంది. మానవతను, ప్రేమను, మనుషుల్ని చూపిస్తుంది. గొప్ప కలాలను పరిచయం చేస్తుంది.
ఇవన్నీ చదివాక ఈ పుస్తకానికి ఈ శీర్షికే ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది. సాహిత్యం అంటే ఏమిటో సాహిత్య విద్యార్థులకు అర్థం అవుతుంది. విద్యార్థి దశలో ఈ పుస్తకాన్ని, ఇలాంటి పుస్తకాలను చదవగలిగితే తప్పకుండా విద్యార్థులకు సాహిత్యం పట్ల ఆసక్తి,అవగాహన ,గౌరవం పెరుగుతుంది.
ప్రపంచం పట్ల జీవితం పట్ల మనిషి పట్ల వారికి విలువైన సందేహాలు కలుగుతాయి. ఆ సందేహాలను తీర్చే సాహిత్యాన్ని వాళ్లే వెతికి చదువుకుంటారు. ప్రశ్న ,ప్రశ్న తో పాటు ఒక అన్వేషణ మొదలవుతుంది, కొనసాగుతుంది
సాహిత్యం పట్ల విద్యార్థులకు మక్కువ కలగాలంటే మంచి పుస్తకాలను ఉపాధ్యాయులు వారికి పరిచయం చేయాలి. అంతకుముందు ఉపాధ్యాయులు మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి.
అనేక విషయాలను, పుస్తకాలను, స్థల కాలాలను ప్రస్తావించిన పుస్తకం సాహిత్యమంటే ఏమిటి.
*
కేవలం దయని ప్రోత్సహించే సమస్త ప్రేరణల కన్నా ఉన్నతమైన ప్రేమలోకి ఎదగగల వినమ్రత కోసమే అన్వేషణే ‘రహస్తంత్రీ’ నాదం.( మో).
*
‘మో’ సంక్లిష్టకవికాదు. సరళాతి సరళమైన కవి. ఆకుపచ్చని బాల్యం, ఎడ్ల మెడగంటలు, కవ్వం చిందులు, తెల్లని పూలు- వీటి మధ్య పుట్టిన ఒక గ్రామీణ బాలుడు నాగరికుడుగా మారి, ఆ క్రమంలో తనలోని అనాగరిక ధోరణుల్ని గుర్తు పెట్టుకుని, తననితానుగా అంగీకరించుకోలేక, తను తను కాదని నమ్మించలేక, నలుగులాటపడి, చివరికి తనేదో అదే తనని వినయంగా విన్నవించుకోవడం మోకవిత్వం.
*
సైదాచారి ఇంద్రియాలు బలమయినవి. అతని రక్తమాంసాలు అక్షరాల్ని కూడా దేహభాగాలుగా వికసించాయి. తక్కిన కవులు రాజకీయ విముక్తి గురించి మాట్లాడతారు. అది దేహాన్ని ఒదిలి చీరె చెంగుని చేతికి మిగుల్చుకోవడం లాంటిది. దేహం అర్థమయినవాడే దేశాన్ని అర్థం చేసుకోగలగుతాడు. దేశాన్ని ప్రేమించినవాడే దేహం గురించి తపించగలుగుతాడు. అందుకే ‘మో’, ఎం.ఎస్.నాయుడు, సైదాచారి మన మానసిక విమోచనోద్యమ కవులంటాను. నేను. వారికి నా సమర్థన.(2000)
*
ఎం.యస్.నాయుడు మనలాంటి మనిషే మనతోటి మనిషే కాని మన భాషని అంగీకరించని మనిషి, మనం మన భాష అతనికి అలవాటు చెయ్యడానికి ప్రయత్నించి ఉపయోగం లేదు. అందుకు బదులు, మనమే అతని భాషకి అలవాటు పడటం నేర్చుకుంటే, ‘శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు’ వినగలుగుతాం.
*
గోపగాని రవీందర్ నాకు దేవుడిచ్చిన ఆత్మీయుడు. రక్త బంధాన్నిదాటి స్నేహబంధంలోకి మానవులు ఎదిగే క్రమంలో కొన్ని మైలుగుర్తులుంటాయి. మా ఇంటిలో రవీందర్ రాక అటువంటి కొండగుర్తు. అతని ఆగమనం వల్ల తెలంగాణా మా సోదర భామి అయింది. అతని మాటల వల్ల మోదుగులు పూచిన వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ అడవులు మా అడవుల్తో కలిసిపోయాయి, అతని ఇంటికీ మా ఇంటికిమధ్య, ఇచ్చిపుచ్చుకోవడాలతో, ఊరు దేశంగా విస్తరించింది. చూడగానే పువ్వు విచ్చుకున్నట్లుగా అతని హృదయభాష మొత్తం అవగతమవుతోంది. అతని నేలనీ, మా నేలనీ యుగాలుగా కలుపుతున్నది గోదావరి. ఇప్పుడు హృదయాన్నికలుపుకొని ప్రవహిస్తున్నది. ఈ కావ్య గౌతమి.
*
మనుషుల మధ్యా, ప్రకృతి మధ్యా, మారే ఋతువుల మధ్యా దినదినం అత్యంత మధురంగా విన్పించే జీవన సంగీతాన్ని అందుకోవడంలో, ఒకటి రెండు సూచనలతో విశాలమయిన స్ఫురణని అందివ్వడంలో హైకూ సున్నితమనస్సులూ, భావుకులూ అయిన కవులకు ఒక విశిష్ట ఉపకరణంగా అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా వక్తృత్వానికీ, కవిత్వానికీ మధ్య సున్నితమైన సరిహద్దు మరుగు పడుతున్నప్పుడల్లా హైకూ ఒక మెరుపులా, ఒక దీవెనలా, కవిత్వ వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. దీప్తిపరుస్తుంది.
‘బాల్కనీలో పిచుక’ అటువంటి ఒక మెరుపు. చీనీ, జపనీయలిపికి అనుకరణగా తెలుగును చిత్రించడం, మిల్లు తయారీ పేపర్ కాకుండా చేతి తయారీ పేపర్ వాడటం, కంపోజింగ్ ద్వారా కాక స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా ప్రచురించడం, ప్రతి కవితకీ ఒక చిత్రలేఖనాన్ని కూడా జతపరచడం ఈ పుస్తకంలో అదనపు విశేషాలు.
*
గ్లోబల్ ఖడ్గం కవిత సంకలనం గురించిన ఆదివారం వార్తలోని సమీక్ష, అందుకు సంబంధించి ఎన్. వేణుగోపాల్ , డాక్టర్ ఏకే ప్రభాకర్ గార్ల ప్రతిస్పందనకు చినవీరభద్రుడు గారి సమాధానం ఈ పుస్తకంలో ఉన్నాయి.
*
ఎందరో వ్యక్తులు, ఎన్నో అద్భుతమైన పుస్తకాలను, ఎన్నో తావులను, సాహిత్య సందర్భాలను పరిచయం చేసిన పుస్తకం ఇది.
మరాఠీ కవి ‘విందా కరందీకర్’ కు జ్ఞానపీఠ పురస్కారం వచ్చిన సందర్భంగా వారి వ్యాసం చూడండి.
*
ఈ సంవత్సరం జ్ఞానపీఠ పురస్కారం మరాఠీ కవిశ్రేష్ఠుడు విందా కరందీకర్ (గోవిందు వినాయక కరందీకర్)కు లభించింది. ‘బహుశా ఆధునిక మరాఠీ కవుల్లో అంత ప్రయోగశీలిని, అంతసమగ్రమైన కవిని మరొకరిని చూడలేమని’ జ్ఞానపీఠపురస్కార ఎంపిక సంఘం ఆయన్ని ప్రస్తుతించింది. ఆధునికమరాఠీకి పితామహుడని ప్రస్తుతించబడ్డ బాల సీతారాం మర్దేకర్ బాటలో కవిత్వప్రస్థానాన్ని కొనసాగించిన కరందీకర్ తన సాహిత్యంలో స్పృశించని జీవిత కోణం లేదు. ప్రయోగశీల, ప్రగతిశీల, అస్తిత్వ వాద, మనోవైజ్ఞానిక, సాహసిక ధోరణులన్నింటినీ విరివిగా ఉపయోగించుకుని ఆయన ఒక శతాబ్దంపాటుగా మరాఠీ ప్రజను మేల్కొలుపుతూ ఉన్నాడు. కాని, విషాదమెక్కడుందంటే, ఎనభై ఏడేళ్ల వయసులో ఇంత ఆలస్యంగా ఆయనకీ పురస్కారం లభించినప్పుడు. ఆయన్ని ఎవరో ఇంటర్వ్యూ చెయ్యబోతే, తననిప్పుడు ఆమ్నిషియా పట్టుకుందని, తనే కావ్యాలు రాసాడో తనకే గుర్తులేదనీ అన్నాడట!
*
ఈ పుస్తకంలో ఉటంకించిన కవితలను మళ్లీ మళ్లీ చదువుకోవాల్సి ఉంటుంది. వెంటాడే కవితలు, మాటలు ఈ పుస్తకం నిండా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
*
సాహిత్యం అంటే ఏమిటి అనే వ్యాసం 2001లో కావలి జవహర్ భారతి ఆవరణలో చేసిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి స్మారక ప్రసంగం పాఠం.ఇందులోని అన్ని అంశాల గురించి అందరూ అంగీకరించలేకపోవచ్చు కానీ,… సాహిత్యం అంటే ఏం చెబుతున్నారో విందాం.
*
మనమేదైనా ఒక కృతి సాహిత్యమవుతుందా లేదా అని చూడాలంటే ఈ నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి. మొదటిది, ఇది నా పరిపూర్ణ విధేయతను కోరుకుంటున్నదా, లేక నాకు కొంత స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నదా. రెండు, ఇది ఏదో ఒక నిర్దిష్ట అర్థాన్ని మాత్రమే ప్రతిపాదిస్తున్నదా లేక వీలైనన్ని అర్థాలు చెప్పుకోగల అవకాశాలు కలిగిస్తున్నదా. మూడు, ఇది పూర్తిగా వైయక్తికమైన అర్థాన్నే చెప్తున్నదా లేక ఉమ్మడిగా కలిసి ఒక అర్ధం వెతుక్కునే అవకాశం ఇస్తున్నదా. నాలుగు, ఇది కేవలం ప్రశ్నించుకుంటూ పోవడంమీదనే దృష్టిపెడుతున్నదా లేక ఒక నిర్దిష్ట కాలానికీ, సందర్భానికీ అవసరమైన ఒక అర్ధం చెప్పుకునే అవకాశాన్ని మిగులుస్తున్నదా అని.
కాబట్టి సాహిత్యమంటే మతంకన్నా, కళకన్నా, సైన్సుకన్నా, తత్త్వశాస్త్రం కన్నా కూడా విస్తృతమైన మహాన్వేషణ. ఆ నాలుగింటితో ఏకీభవిస్తూ, అదే సమయంలో, విభేదిస్తూ ఆ నాలుగు మహాన్వేషణలూ నెరవేర్చలేని మహాకర్తవ్యమేదో నెరవేరుస్తూన్న మహామహాన్వేషణ అని చెప్పవలసి ఉంటుంది.
*
ఏ పుస్తకంలో అయినా చర్చించే అంశాలు చాలా ఉంటాయి. నేర్చుకునే అంశాలు ఎన్నో ఉంటాయి. తెలుసుకోవలసిన తెలియని అంశాలు ఎన్నో ఉంటాయి.
వెనక్కి వెళ్లి చదివిన పుస్తకాలని మళ్ళీ మళ్ళీ చదువుతుంటే ఎన్నో కొత్త విషయాలు కొత్తగా స్పురిస్తాయి, అర్థం అవుతాయి.
Featured image: The Table of the Writer, image generated through AI
23-5-2024
ఓ అందమైన లోకంలోకి తీసికెళ్లింది ఈ అక్షర సౌరభం.
ధన్యవాదాలు మేడం!
సాహిత్యమంటే మతంకన్నా, కళకన్నా, సైన్సుకన్నా, తత్త్వశాస్త్రం కన్నా కూడా విస్తృతమైన మహాన్వేషణ. 🙏
ధన్యవాదాలు
ఈ ఉదయం సాహిత్యసమీరం సాంత్వన చేకూర్చింది. అటు రాళ్లబండి శశిశ్రీ పంపిన అనుమంద్రం చదువుతూ కవిత్వకాంతులను దర్శిస్తూ, విరామంలో సాహిత్యం అంటే ఏమిటి పుస్తకం పై పలమనేరు బాలాజీ గారి సమీక్ష చదువుతుంటే పెడదారి పట్టే మనిషిని మనిషిగా తీర్చి దిద్దగలిగేది సాహిత్యమొక్కటే అన్న భావన బలపడింది. సాహిత్యబృందావనం లో విహరించిన రాధాత్మక పాఠకుడు కవిత్వ కృష్ణ తృష్ణ అనుభూతిని అందుకోగలడు. అదొక రసైక లోకం . పసిడి నిగ్గు తేల్చే తేజాబు సాహిత్యం. సమీక్షతో పాటు పుస్తకం పి డి ఎఫ్ . ఉంచటంతో చదవని వారికి చదివే అవకాశం కలిగించారు. సంతృప్త హృదయాంతరంగాన్ని అభినందనగా
అందిస్తున్నాను.
ధన్యవాదాలు సార్ మీ రసహృదయ స్పందనకు!
“కొన్ని కలలు, మెలకువలు” తరువాత నాకెంతో ఇష్టమైన పుస్తకం ఈ “సాహిత్యమంటే ఏమిటి?” పలమనేరులో ఉన్నప్పుడు ఒకసారి ” మీకు నచ్చిన పుస్తకం” అనే శీర్షిక కింద దీనిపై మాట్లాడాను. మళ్ళీ శ్రీశైల్ రెడ్డి గారు అడ్మిన్ గా ఉన్న బుక్ రీడర్స్ క్లబ్ లో కూడా మాట్లాడాను. చక్కని, అందరూ చదవదగ్గ పుస్తకం. పలమనేరు బాలాజీ గారికి అభిందనలు.
ధన్యవాదాలు ప్రసూనా!
ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు బాలాజీ! నేనే చెప్పాలి!
మీ సాహిత్య రచనల్ని చదువుతుంటే, మీ స్పీచ్ లు వింటుంటే నాకు చెప్పలేని ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు చదివిన రచనల్లోని సారాన్ని మీ కవిత్వంతో, మీ మాటల సొబగు తో తీర్చిదిద్ది అందరికి పంచుతారు.అదెంత అసాధారణ విషయం?
సాహిత్యం జీవితాన్ని జీవించమంటుంది. ఆలోచింపజేస్తుంది. కర్తవ్యాన్ని బోధిస్తుంది. మీ రచనలలోని ఒక్కో మాటా అతి విలువని సంతరించుకుని… ఉత్తుత్తినే మాటలతో … కాలాన్ని వృధాగా గడిపే మనుషులకి ఒక గుణపాఠం. బుర్రకి పదును.
మీరు చెప్పినట్టు అక్షరాలా మహాన్వేషణ.
మీతో పాటు సాహిత్య ప్రపంచం లో కి మమ్మల్ని కూడా పయనింపజేస్తున్న తమకు శ్రద్ధా భక్తులతో నమస్కరిస్తున్నాను.
ధన్యవాదాలు మేడం