
మనం ఎప్పుడో ఒక కవినో, కవిత్వాన్నో రుచి చూసి ఉంటాం. ఆ తర్వాత వేరే పనుల్లోనో, ధ్యాసల్లోనో పడిపోతాం. కాని మనలోపల్లోపల హృదయంలో ఆ కవి కవిత్వం మరింత చదవాలనే వెతుకులాట ఒకటి కొనసాగుతూనే ఉంటుంది. అదొక చిత్రమైన దాహం. పైకి కనిపించని మంట. తీర్చే కొద్దీ పెరిగే వేదన. నా వరకూ తుకారాం కవిత్వం కూడా ఆ కోవలోకి వస్తుంది.
తుకారాం కవిత్వానికి దిలీప్ చిత్రే అనువాదం Says Tuka (1991) చదివిన తర్వాత ఎవరేనా తుకారాం కీ, చిత్రేకీ కూడా జీవితకాల అభిమానులు కాకుండా ఎలా ఉంటారు? చిత్రేని చదివినతర్వాత తుకారాం కవిత్వమంతా ఇంగ్లిషులో దొరికితే చదవాలని ఉవ్విళ్ళూరేను. మోతీలాల్ బనారసీదాస్ వారు ప్రచురించిన The Poems of Tukaram దొరికింది గాని, ఆ అనువాదం దిలీప్ చిత్రేలాగా అనుసృజన కాదు. ఆ అనువాదకులు నెల్సన్ ఫ్రేజర్, కె.బి.మరాఠే మూలవిధేయంగా ఆ కవిత్వాన్ని ఇంగ్లిషులో అందించడం మీదనే దృష్టిపెట్టారు. కాని దిలీప్ చిత్రే మూలవిధేయంగా ఉంటూనే తుకారాం ఆత్మనీ, ఆవేదననీ కూడా మనకి అనితరసాధ్యంగా అందించాడు. అరుణ్ కొలాట్కర్ కూడా తుకాని అనువదించాడని విన్నానుగాని, ఆ పుస్తకం నాకింకా దొరకలేదు. ఇటువంటి పరిస్థితిలో తుకారాం కవిత్వానికి కొత్త అనువాదం పుస్తకాల షాపులో కనబడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్టనిపించింది.
శాంతాగోఖలే, జెర్రీ పింటో వెలువరించిన Behold! The Word is God, Hymns of Tukaram (2023) నన్ను నిరాశపర్చలేదు సరికదా, తుకారాం పట్ల నా దాహాన్ని ద్విగుణీకృతం చేసింది.
శాంతాగోఖలే Playwright at the Centre: Marathi Drama from 1843 to the Present రచయితగా నాకు తెలుసు. చాలాకాలం కిందట ఆ పుస్తకం గురించి రాసాను కూడా. కాని ఆమె అనువాదకురాలనీ, కవిత్వాన్ని ఇంత బాగా అనువదించగలదనీ ఈ పుస్తకం చూసాకనే అర్థమయింది. జెర్రీ పింటో కవీ, రచయితా, అనువాదకుడూ కూడా.
వాళ్ళిద్దరూ తుకారాం ని అనువదించాలనుకున్నారు. దిలీప్ చిత్రే అనువదించిన తర్వాత కూడా మరొక అనువాదం కావాలనుకున్నారు. అసలు అటువంటి అనువాదం అవసరమా అనుకున్నారు. అంతకన్నా బాగా చెయ్యాలి అనుకున్నారు, చెయ్యగలమా అని సందేహంలో పడ్డారు. ఏమైతేనేం, చివరికి తుకారాం అభంగాల్లోంచి 51 గీతాల్ని ఇంగ్లిషులోకి అనువదించారు. కాని ఆ కీర్తనల్ని ఇద్దరూ కలిసి అనువదించలేదు. వేరువేరుగా అనువదించారు. అంటే ప్రతి కీర్తనకీ రెండేసి అనువాదాలన్నమాట. ఒక కవిత్వ జుగల్ బందీ. ఇది కూడా ఆసక్తికరమైన ప్రయోగమే. వాళ్ళు అనువదించిన ప్రతి కవితనీ రెండు అనువాదాల్లో చదవడం ఒకే కీర్తనని రెండు రాగాల్లో విన్నట్టుంది. ఒక గళంలో వినిపించని సౌకుమార్యం మరో గళంలో సుస్పష్టంగా వినిపిస్తూ, ఒక వ్యాఖ్యానంలో కనిపించని లోతు, మరో వ్యాఖ్యానంలో కొత్త అర్థాల మీద మన దృష్టిని పరుస్తో ఉంది. ఒక కవి, ఇద్దరు అనువాదకులు కలిసి చదుతున్నంతసేపూ నన్ను విభ్రాంతికి గురిచేస్తూనే ఉన్నారు.
భారతీయ భక్తికవుల్లో ఎవరి జీవితకథ వారిది, ఎవరి జీవితవిషాదం వారిది, ఎవరు చూసిన భగవత్ సౌందర్యం వారు మాత్రమే చూడగలిగింది. కాని తన జీవితంలో సంతోషం, నిర్భాగ్యం సమంగా చూసిన వ్యక్తి అంటూ ఉంటే అది తుకారాముడు మాత్రమే.
భారతదేశంలో భక్తికవులకీ, సాధు, సంత్ లకీ మనం నమ్మదగ్గ జీవితకథ అంటూ ఉండదు. ఈ సంగతులు నమ్మలేమని పక్కన పెట్టడానికీ కుదరదు. వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏవి ఎంచుకోవాలో, ఏవి వదిలిపెట్టాలో తేల్చడం ఎవరికీ సాధ్యం కాదు.
కానీ కనీస జీవితరేఖల్ని ఏరి కూర్చుకుని ఆ జీవితాల్ని ఒక చారిత్రిక క్రమంలో పెట్టి చూడాలని ప్రయత్నించకుండా ఉండం. అలాచూసినప్పుడు తుకారాము మహారాష్ట్రలో ఇంద్రాయణి నది ఒడ్డున ఉన్న దేహూ అనే చిన్న గ్రామంలో 1608 లో పుట్టాడు. అతడి తండ్రి ఆ గ్రామానికి మహాజన్. దాంతోపాటు చిన్నపాటి వర్తకుడు కూడా. గ్రామంలో స్థితిమంతుడు కాబట్టి వడ్డీవ్యాపారం కూడా చేసేవాడు. తుకారాము అతడికి రెండో కొడుకు. విఠలుడు వాళ్ళ ఇలవేలుపు. తుకారాముది అల్లారుముద్దుగా గడిచిన బాల్యం. పెరిగి పెద్దవుతున్నప్పుడు భాగవతం, భగవద్భక్తుల కథలు కూడా చదువుకున్నాడు. ఇంకా కౌమారం వీడకుండానే ఇద్దరు భార్యలు కూడా అతడి జీవితంలోకి ప్రవేశించారు. మొదటి భార్యకు ఒకరు, రెండో భార్యకు ఆరుగురు సంతానం. కాని సంతోషంతో గడుస్తున్న జీవితంలో వరసగా మూడు విషాదాలు సంభవించేయి. ముందు తన తల్లిదండ్రులు ఇద్దరూ, ఆ తర్వాత తన వదినా మరణించారు. అన్న విరక్తుడు. దాంతో పదిహేడేళ్ళు నిండకుండానే తుకారాం నెత్తిన ఇంటి యజమాని బాధ్యతలు పడ్డాయి. గ్రామపెద్దగానూ, రైతుగానూ బాధ్యతలు ఎలానో నెరవేర్చగలిగాడుగాని, వర్తకం, వడ్డీ వ్యాపారం అతడికి చాతకాలేదు. నెమ్మదిగా అతడు నిర్భాగ్యుడు కావడం మొదలుపెట్టాడు.
1629 భయంకరమైన సంవత్సరం. వరసగా మూడో ఏడాది కరువు ఆ గ్రామాల్ని చుట్టబెట్టింది. మనిషిని మనిషి పీక్కుతిన్న కరువు అది అని కళ్లారా చూసినవాళ్లు రాశారు. ఇరవై ఒక్కేళ్ళ తుకారాము అప్పులవెనక అప్పులు చేసాడు. అయినా నిభాయించుకోలేకపోయాడు. దివాలా తీసాడు. చుట్టూ కనిపిస్తున్న దుఃఖం చూసి తట్టుకోలేక ఆయన దగ్గరలో ఉన్న భండారా పర్వతం దగ్గరకి పోయేవాడు. రోజుల తరబడి ఆ కొండమీదనే ఏకాంతంలో గడిపేవాడు. ప్రాపంచిక జీవితంలో అతణ్ణి పూర్తిగా దివాలా తీయించాక, విఠలుడు, అప్పుడాయన ఆత్మిక జీవితాన్ని సుసంపన్నం చేయడం మొదలుపెట్టాడు. ఆ కొండకి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ, ఆ కొండమీద కూచున్నప్పుడూ తుకారాం పాటలు కట్టడం మొదలుపెట్టాడు. ఆయనకు ముందు జ్ఞానదేవుడు, నామదేవుడు, ఏకనాథుడు వంటి కవుల్ని ఎలా అనుగ్రహించాడో పాండురంగడు తుకారాముని కూడా అలానే అనుగ్రహించడం మొదలుపెట్టాడు. ఇంకా చెప్పాలంటే వారందరి కవిత్వాన్నీ మరిపించేలాంటి కవిత్వం తుకారాముడితో పాడించుకుని విన్నాడాయన.
తన గ్రామంలో పాడుపడ్డ విఠలుడి గుడిని తుకారాం నెమ్మదిగా బాగుచేయించాడు. ప్రతి ఏకాదశికి అక్కడ సంకీర్తనలు నిర్వహించడం మొదలుపెట్టాడు. అనతికాలంలోనే మొత్తం మహారాష్ట్ర అంతా అక్కడికి చేరుకోడం మొదలుపెట్టింది. అప్పటికి చాలాకాలంగా సన్నగిల్లిన వార్కరి యాత్రని ఆయన మళ్లా పునరుద్ధరించాడు. వార్కరి అంటే ప్రతి ఆషాడమాసంలోనూ మహారాష్ట్ర గ్రామాల నుంచి కీర్తనలు పాడుకుంటూ దేవుడి పల్లకీలు మోసుకుంటూ ప్రజలు పండరిపురం చేసే యాత్ర.
కులం రీత్యా శూద్రుడైన తుకారాం విఠలుడి అర్చకుడిగా, ఆరాధకుడిగా మారడం సనాతన సమాజానికి కంటగింపైంది. వారు ఆయన్ని ఒకరోజు పరీక్షకు పిలిచారు. తాను రాసిన అభంగాల తాళపత్రాల్ని ఇంద్రాయణి నదిలో విడిచిపెట్టమన్నారు. అవి మునిగిపోకపోతే పాండురంగడు తుకారాము వైపున్నట్టుగా తాము నమ్ముతామన్నారు. 1645 లో ఆయన ముప్ఫై ఏడవ ఏట ఈ జలపరీక్ష జరిగింది. తుకారాము తాను రాసిన కీర్తనలన్నీ తీసుకొచ్చి ఊరంతా చూస్తూండగా నదిలో వదిలిపెట్టాడు. ఆ కీర్తనలు తేలాయా? మునిగిపోయాయా? తుకారాం తన కవితలో ఏమీ చెప్పలేదు. జీవితచరిత్రకారులు ఆ కవితలు నదిలో మునిగిపోకుండా తేలాయన్నారు. అది కట్టుకథ అని మనం కొట్టిపారెయ్యవచ్చు. కాని ఆ కవితలు మునిగిపోలేదనీ వాటికి పాదాలొచ్చి లేచి మొత్తం మహారాష్ట్ర గ్రామగ్రామానా సంచరిస్తున్నాయన్న సత్యం కాదనగలమా? అంతదాకా ఎందుకు? ఆ గీతాలు ఇంద్రాయణి నదిలోంచి తేలిబయటికి వచ్చి ఉండకపోతే, ఇక్కడ నా ఇంట్లో ఈ పొద్దుటివేళ నేను వాటి గురించి మీతో మాట్లాడి ఉండేవాణ్ణా?
1650 నాటికి తుకారాముడికి నలభై రెండేళ్ళు. అదే ఆయన తన గ్రామంలో కనబడ్డ చివరి సంవత్సరం. ఆ తరువాత ఆయన ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. అతడెందుకు అదృశ్యమయ్యాడో ఎలా అదృశ్యమయ్యాడో ఒక రహస్యంగానే ఉండిపోయింది. ఇన్ని వివరాల్ని నమోదు చేసిన సమకాలిక సమాజం ఆ వివరాల్ని మాత్రం ఎందుకు వదిలిపెట్టింది? తెలియదు. ఆ రహస్యం రహస్యంగానే ఉండిపోవాలనుకున్నదేమో. కాని మాహాత్మ్యకారులు మాత్రం స్వర్గం నుంచి ఒక రథం వచ్చి తుకారాము జీవించిఉండగానే స్వర్గానికి తీసుకుపోయిందని రాసారు. నిజమే, తుకారాము జీవితకాలంలోనే ఆకాశమంత ఎత్తు ఎదిగాడని మనం నమ్మవచ్చు.
తుకారాము జీవితం మహారాష్ట్ర గ్రామాల్లోని అసంఖ్యాకులైన గ్రామీణుల జీవితం. కరువు పీల్చిపిప్పిచేసినప్పుడు మొత్తం కుటుంబాలకు కుటుంబాలే గ్రామాలకు గ్రామాలే తల్లకిందులైన అనేక వేల కథల్లో తుకారాము కథ కూడా ఒకటి. కాని అసంఖ్యాకులైన ఆ రైతులకీ, కూలీలకీ, చిల్లరవర్తకులకీ తమ బాధల్ని చెప్పుకోగల గొంతులేదు. వాళ్లకి మాటలు చాతకావు. వాళ్ళంతా తుకారాముడి గొంతుతో తమ దుఃఖాన్నీ, తమ నమ్మకాన్నీ పాటలు పాడుకున్నారు. కాబట్టే ఆ అభంగాల్లో ఒక దేవుడూ, ఒక భక్తుడూ కాడు, మొత్తం మహారాష్ట్ర సమాజమంతా కనిపిస్తుంది. ఆ సమాజమంతా చివరికి ఒక భక్తుడిగా మారి ఒక దేవుడి దగ్గర మోకరిల్లింది.
ఏ ఒక్క అభంగమూ అయిదారు ద్విపదల్ని మించని కీర్తన. కాని ఒక్క వాక్యం కూడా తీసెయ్యలేని, ఒక్క పొల్లు కూడా మార్చలేనంత బిగువుగా కూర్చిన కవిత్వం అది. అది గ్రామీణ రైతుల, స్త్రీల గుండెచప్పుడు లాంటి ఛందస్సు. ఆ గీతాల్ని అనువదించినప్పుడు దిలీప్ చిత్రే ఆ హృదయావేదనని మనకి అందివ్వడం మీద దృష్టిపెట్టాడు. కాని ఈ ఇద్దరు కొత్త అనువాదకులూ ఆ బిగువునీ, ఆ బరువునీ, ఆ తేలికదనాన్నీ కూడా మనకి అందివ్వడానికి ప్రయత్నించారు. వారి అనువాదాలు ఎలా ఉన్నాయో చూపడానికి మూడు కవితలు ఇక్కడ పంచుకుంటున్నాను.
1
నా పాటలు సాధుసంతులు వదిలిపెట్టిన ఎంగిలి
నా పాటలు సాధుసంతులు వదిలిపెట్టిన ఎంగిలి
లేకపోతే నేను పాడగలిగే పాటలే నా ఇవి!
ఆయన పేరు కూడా సరిగ్గా పలకలేను.
నాకేమి చాతనవుతుంది?
నా పాటలు చిన్నపిల్లల తొక్కుపలుకులు.
నీకు మొత్తం తెలుసు, నా పుట్టుక, నా సత్తువ.
ఇంక చెప్పడానికేమీ లేదు.
తుకా అంటున్నాడు:
అతడే భావం, అతడే అర్థం.
(జెర్రీ పింటో)
2
సరైన తీరున సరిగ్గా కూర్చిన మాటలా?
సరైన తీరున సరిగ్గా కూర్చిన మాటలా?
అవొక్కటే చాలదు కవిత్వానికి.
కవిత్వానిది భాషకు అవతలి సీమ
సత్యం కోసం వెతుకులాట.
కేవలం అనుభవం, నిజమైన అనుభవం
కవిత్వానికి పరిమళం, పరిపుష్టి
నకలు మిగలదు, నిప్పు కాల్చేస్తుంది.
నిజమైన బంగారం బయటపడుతుంది.
తుకా అంటున్నాడు:
నీకేదికావాలో అదే నువ్వు.
తక్కువ వద్దు, ఎక్కువ మాటాడకు.
(జెర్రీ పింటో)
3
ఈ దుఃఖితులు, తాడితులు
ఈ దుఃఖితులు, తాడితులు
వీళ్ళంతా నావాళ్ళేనని ఎవరంటారో
గుర్తుపట్టు, అతడే నిజమైన సాధువు.
భగవంతుడు ఉండేదక్కడే, పోల్చుకో.
సజ్జనుడు నిలువెల్లా వెన్న,
అంగాంగం మెత్తని మనిషి.
తిరస్కృతుల్ని, బహిష్కృతుల్ని
హృదయానికి పొదువుకుంటాడు
ప్రేమించేటప్పుడు అతడికి తన కొడుక్కి
తన దాసుడికీ మధ్య తేడా తెలియదు.
తుకా అంటున్నాడు:
ఇంకా ఏం చెప్పాలి?
అతడు సాక్షాత్తూ భగవన్మూర్తి.
(శాంతాగోఖలే)
10-2-2024
విలక్షణంగా సంత్ తుకారాం నిగ్గుదేల్చిన జీవిత విశేషాలతోపాటు ఇరువురు అనువాదకుల అనువాద శకలాలు రుచి చూపి అంతిమంగా ఆహం వీడి ఆర్తజనుల బాధలను ఆత్మీయం చేసుకున్నభగవద్భక్తి కలకాలం కొనసాగుతుందని చెప్పక చెప్పటం బాగుంది సర్.
ధన్యవాదాలు సార్
మీలాంటి 🐝తుమ్మెదలు పుాలలోని( 📚సాధసంతులలోని) మకరందాన్ని సేకరించి.. జీర్ణంచుకొని.. ఉమ్మి వేసిన అది 🍯తేనె అవుతుంది 🙏
Brilliant, as always, sir. You also wrote about a similar experiment with another Bhakti poet. Priya Sarukkai Chabria and Ravi Shankar did two versions of the same song in Andal: The Autobiography of a Goddess (Zubaan, 2015). There too we see one translator staying close to the original and the other attempting to bring a verse-like quality with the occasional end rhyme. Such experiments, whether wholly successful or not, shake us out of stupor of habit and excessive familiarity.
Thank you for reminding me Andal’s work. Thank you for your insights.
Btw, “మాహాత్మ్యకారులు” is a brilliant Telugu equivalent for hagiographers!
Thank you once again.
మీ అనువాదం అద్భుతం. అనుభవించవలసిందే కాని అభివర్ణనకు మాటలు చాలవు. సాహిత్యం మీకు నిత్యవసంతం. ధన్యులు. కథలకు, చరిత్రకు మీరు ఇచ్చిన అన్వయం కూడా ఎంతో అర్థవంతం.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్