అక్కా! నేనో కలగన్నాను!

మల్లికార్జున్ మాన్సుర్ సంగీతం నాకు చాలాకాలంగా ప్రీతిపాత్రమైందే. ఆయన భీం పలాస్ రాగాన్ని ఎన్నో అపరాహ్ణవేళల్లో విన్న జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. కాని, ఇదుగో, అక్కమహాదేవి రాసిన ఈ వచనాన్ని ఆయన ఆలపించిన తీరు ఉందే అది విన్నప్పణ్ణుంచీ నా హృదయంలో, పక్కన, నా వెనకన, నా మెలకువలో, నిద్రలో కూడా వినబడుతూనే ఉంది.

ఆ మహత్యం ఎవరిది? మహనీయురాలైన ఆ కవయిత్రి కన్నకలలో ఉందా? లేక ఆ కలని ఆమె పంచుకున్న పారవశ్యంలో ఉందా? లేక గాయకుడు ఆ వచనానికి తన ప్రాణాన్నిచ్చి ఊదిన ఊపిరిలో ఉందా?

వినండి. ఆ వచనాన్ని ఆలపిస్తున్నంతసేపూ ఆ గాయకుడి ముఖంలో కనిపిస్తున్న ఆ jubilation, ఆ celebration – అసలు ఆ పాట మొత్తం ఒక పెళ్ళి ఊరేగింపులాగా ఉంది. మనం ఆ కవి వెంట, ఆ గాయకుడి వెంట వెర్రిగా పడిపోకుండా ఉండలేమని అర్థమవుతుంది.

ఈ పాట ఒక కలగురించిన పాట. ఇలాంటి కలనే ఆండాళ్ కూడా పాటగా పాడుకుంది. వారణమాయురం అని పేరు ఆ గీతానికి. పెళ్ళికి సంబధించిన ఇటువంటి మంగళప్రదగీతాల్ని epithalamium అంటారు. అటువంటి గీతాలు ప్రాచీన గ్రీకు కవయిత్రి శాఫో రాసింది. పాతనిబంధనలో సొలోమోన్ రాసినట్టు చెప్పే పరమోన్నత గీతం కూడా ఒకరకంగా అటువంటి వివాహగీతమే.

కాని ఈ గీతం, ఆండాళ్ రాసుకున్న స్వప్నగీతంలాగా మనిషికీ, దేవుడికీ మధ్య వివాహగీతం. భూమ్యాకాశాలు కలుసుకున్న ప్రకాశం, సంతోషం ఈ గీతంలో కనిపిస్తుందంటే ఆశ్చర్యంలేదు. గొప్ప వాన కురిసినప్పటిలా ద్యావాపృథ్వులు ఏకమయ్యే ఆ గొప్ప వెలుగు ఈ గీతం పాడుతున్నంతసేపూ గాయకుడి స్వరంలోనూ, వదనంలోనూ కూడా వెల్లివిరుస్తూనే ఉంది.

అక్కా, వినవే నేనో కలగన్నాను
పోకలు, బియ్యం, పత్రం,కొబ్బరికాయలు
కలగన్నాను
చిన్న చిన్న జడలతో, చక్కని పలువరసతో
ఒక గొరవడు ఇంటికి భిక్షకు రావడం చూసాను.
మితిమీరిన మోహంతో అతడి వెంటబడి
చేయందుకున్నాను
చెన్నమల్లికార్జునుని చూసి కళ్ళు తెరిచాను.

ఇదే అర్థంతో మరో గీతం కూడా ఉంది.

అక్కా, వినవే నేనో కలగన్నాను
కొండమీద ఒక జోగిని చూసాను.
చిన్నచిన్న జడలతో మెరిసే పలువరసతో
ఒక గొరవడు నన్ను కూడటం కలగన్నాను
అతణ్ణి హత్తుకుని తల్లకిందులయ్యాను.
చెన్నమల్లికార్జునున్ని చూసి
ఆశ్చర్యం కళ్ళు తెరిచి మూసుకున్నాను.

చాలా పేలవమైన అనువాదాలు. కాని మన్నించండి. ఆ గీతాన్ని వింటూంటేనే అనువాదంతో పనిలేకుండా ఆ సంతోషం మన హృదయంలోకి సరసర ప్రసరిస్తుంది. ఇదిగో, వినండి:

1-1-2024

6 Replies to “అక్కా! నేనో కలగన్నాను!”

  1. Sir, I have been listening to this song on repeat and can’t get enough of it.
    మీరన్నట్లు
    “ ఆయన ఆలపించిన తీరు ఉందే అది విన్నప్పణ్ణుంచీ నా హృదయంలో, పక్కన, నా వెనకన, నా మెలకువలో, నిద్రలో కూడా వినబడుతూనే ఉంది.”

    ఈ particularly beautiful వచనంతో, మాన్సుర్ గారి అద్భుతమైన గాత్రంతో వీరిద్దరి పరిచయం చాలా గొప్పగా చేశారు.

    “ఆ వచనాన్ని ఆలపిస్తున్నంతసేపూ ఆ గాయకుడి ముఖంలో కనిపిస్తున్న ఆ jubilation, ఆ celebration “. — It is indeed hard to miss and fills the listener’s heart with the same.

    అక్క మహాదేవి వచనము (మరి కొన్ని వెతుక్కుని చదువుకున్నాను) , మాన్సుర్ గారి ఈ గీతము వింటూ నా మనసులో నిండిన సంతోషాన్ని పంచుకోవడానికి మీ మాటలే మళ్ళీ అప్పగిస్తున్నాను. Sorry sir.
    The way you have captured the feeling in words is matchless!! 🙏🏽

  2. కన్నడ లో అద్భుతమైన సాహిత్యం వస్తోంది, నేను చిన్నప్పుడు మా నానమ్మా తాతయ్య దగ్గర విన్న అనేక ప్రాచీన తెలుగు పదాలు కన్నడాలో ఇంకా సజీవం గా నిత్య వినియోగమ్ లో ఉండడం చూసి ఆశ్చర్య పోయాను

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%