సాహసం, కానీ ఎంతో అవసరం

కల్లూరి భాస్కరం ప్రసిద్ధ పాత్రికేయులని అందరికీ తెలుసు. కాని  1980 తర్వాత తెలుగు కవిత్వంలో వచ్చిన మార్పుని ముందే పసిగట్టిన కవి అని చాలామందికి తెలియకపోవచ్చు. ‘మౌనం నా సందేశం’ (1980) పేరిట ఆయన వెలువరించిన కవితాసంపుటి సమకాలిక తెలుగు కవిత్వంలో ఒక వేకువ పాట.

ఆయన చేయి తిరిగిన అనువాదకుడని కూడా కొందరికి తెలియకపోవచ్చు. పి.వి.నరసింహారావుగారి ‘ఇన్‌ సైడర్‌’ కు ‘లోపల మనిషి’ (2002) ఆయన చేసిన తెలుగు అనువాదం ప్రశస్తమైన కృషి. అలాగే రాజ్‌ మోహన్‌ గాంధి రచన  ‘మోహన్‌ దాస్‌’ కు చేసిన అనువాదం (2011) కూడా ప్రశంసనీయమైన పుస్తకం. ఆయన రాసిన ‘కౌంటర్‌ వ్యూ’ చదివినవాళ్ళకి ఆయన సిద్ధహస్తుడైన కాలమిస్టు అనీ, ‘వేయిపడగలు నేడు చదివితే’ చదివినవాళ్ళకి ఎంతో ప్రతిభ కలిగిన సాహిత్య విమర్శకుడనీ తెలుస్తుంది. తెలుగు కవిత్వంలో కాలిక స్పృహ పేరిట ఆయన చేసిన ప్రతిపాదన ఎంతో మౌలికమైనదని చేరాలాంటి వాడే ప్రస్తుతించాడు. ఇక ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ (2019) పేరిట ఆయన వెలువరించిన ఉద్గ్రంథం ఆయన్ని సమకాలిక తెలుగు జిజ్ఞాసువుల్లో, పరిశోధకుల్లో అగ్రశ్రేణిలో నిలబెట్టింది.

ఈ బృహద్గ్రంథాలన్నీ ఒక ఎత్తూ, ఇప్పుడు ఈ ‘నానాజన్యువు లనేకవర్ణాలనంత వలసలు’ పేరిట మీ చేతుల్లో ఉన్న పుస్తకం ఒక ఎత్తూ. ఇది ఒక మల్టి-డిసిప్లినరి అధ్యయనం. ఇటువంటి కృషి ఒక్క మనిషి ఒంటి చేత్తో చెయ్యగలిగేది కాదు. ఏదైనా ఒక విశ్వవిద్యాలయమో లేదా ఒక శాస్త్రవేత్తల బృందమో మాత్రమే చెయ్యగల పని. అది కూడా రోజుకి పదహారుగంటల పాటు నిర్విరామంగా పనిచేస్తే తప్ప క్రోడీకరించలేని విజ్ఞానం ఇది.

2

ఎంతో ఆసక్తికరంగానూ, మానవుడి చరిత్రకు సంబంధించిన ఒక సుదీర్ఘమైన జనకథని ఎంతో ఉత్కంఠభరితంగానూ చెప్తున్న ఈ రచనలోకి మీరు అడుగుబెట్టబోయేముందు నేను మీకు అడ్డంగా నిలబడాలనుకోవడం లేదు. కాని ఒకటి రెండు మాటలు నా మాటగా చెప్పాలనుకుంటున్నాను.

ఇంతకు పూర్వం వలసవాదం వల్లా, పారిశ్రామిక విప్లవం వల్లా మన దేశంతో సహా, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఎన్నో దేశాల్లో జాతీయతావాదం తలెత్తిందనీ, అది చివరికి ఆ దేశాలు రాజకీయంగా స్వాతంత్య్రం పొందడానికి దారి తీసిందనీ మనకి తెలుసు. అయితే  ముప్ఫై నలభయేళ్ళ కింద మొదలై, భారతదేశంలో 1990 తర్వాత ప్రధానంగానూ, గత ఇరవయ్యేళ్ళుగా అత్యంత వేగవంతంగానూ సంభవిస్తున్న గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో, దేశంలోనూ, ప్రపంచంలోనూ కూడా రెండు ముఖ్యపరిణామాలు సంభవిస్తున్నాయి. ఒకటి జాతీయ రాజ్యాలు బలపడటం, మరొకటి వలసల ఉధృతి.

గ్లోబలైజేషన్‌ స్వరూప స్వభావాలు తెలుస్తున్న రోజుల్లో చాలామంది దానివల్ల ఆధునిక జాతీయ రాజ్యాలు బలహీనపడతాయనీ, సరిహద్దులు కనుమరుగవుతాయనీ అనుకున్నారు. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి జాతీయరాజ్యాలు మరింత బలపడటమే కాక, గోడలు కూడా కట్టుకోవడం మొదలుపెట్టాయి. ఇందుకు రెండు కారణాలు. ఒకటి, ప్రపంచం నలుమూలలనుంచీ పెట్టుబడులు దేశంలోకి ప్రవహించడం, ఆ పెట్టుబడుల మీచి జరిగే ఉత్పాదన, పాలన, నిర్వహణ ఆయా జాతీయ రాజ్యాల నియమ నిబంధనల ప్రకారం జరగవలసి ఉండటం. మరొకటి, విదేశాలనుంచి వస్తున్న ఆ పెట్టుబడులతో స్వదేశీ పెట్టుబడిదారులు లబ్ధి పొందడం మొదలుపెట్టారు కాబట్టి, తోటి పెట్టుబడిదారులుగా తాము ఆ పెట్టుబడి ప్రవర్తనని శాసించలేరు కాబట్టి రాజకీయ అధికారంలోకి తాము ప్రత్యక్షంగా ప్రవేశించడం. కాని తమ పెట్టుబడి అవసరాలు జాతి అవసరాలని జాతిని నమ్మించకపోతే తమకి రాజకీయ అధికారం సాధ్యం కాదు. కాని ఒక దేశం దానికదే ఒక జాతిగా రూపొందదు. ఒక ప్రదేశం జాతిగా మారాలంటే ఆ ప్రదేశంలో ఉన్న మనుషులకి ఒక ఉమ్మడి ధ్యేయం, స్ఫూర్తి, భావావేశం ఉండి తీరాలి. జాతీయోద్యమ కాలంలో స్వాతంత్య్రాన్ని సంపాదించడం అటువంటి ఉమ్మది ధ్యేయంగా ఉండేది. ఇప్పుడు అటువంటి భావావేశాన్ని దేని ద్వారా తేగలుగుతాం? ఇందుకు నిజంగా ఉన్న దారి ఒకటే. అదేమంటే, అందివచ్చిన ఈ కొత్త అవకాశంలో దేశం మొత్తాన్ని భాగస్వామ్యం చెయ్యడం. తద్వారా దేశాభివృద్ధి అనే ఒక ధ్యేయంతో జాతిని సమాయత్త పరచడం.

కాని ఇప్పుడు కొత్తగా జతకలుస్తున్న విదేశీ పెట్టుబడిదారులకి అటువంటి అవసరం లేదు, స్వదేశీ పెట్టుబడిదారులకి అది ఊహకి కూడా అందదు. కాబట్టి ఈ కొత్త పెట్టుబడిదారులు మొదట్లో దేశభద్రతని ఒక ఉమ్మడి ధేయంగా చూపించడానికి ప్రయత్నిస్తారు. కాని అది శాంతిసమయాల్లో పనికొచ్చే భావావేశం కాదు. కాబట్టి వాళ్లకి చేతనయిందల్లా, ఆ దేశంలో అప్పటికే ప్రాబల్యంగా ఉండే ప్రాంతాల్నో, వర్గాల్నో, సమూహాల్నో తక్కిన దేశం నుంచి విడదీసి వారికి తమ చుట్టూ ఉన్న తోటి సమూహాలనుంచి ఒక అభద్రత ఉందని చెప్పడం. కాని ఏ రాజ్యమూ, ప్రభుత్వమూ తన ప్రజలకి అభద్రత ఉందని నేరుగా చెప్పలేదుకాబట్టి, అలా చెప్పడం ఆ ప్రభుత్వ అసమర్థతగానే పరిగణనకి వస్తుంది కాబట్టి, వాళ్ళు ఒక సాంస్కృతిక అభద్రతని సృష్టిస్తారు. అంటే దేశంలో ప్రబలంగా ఉన్న కొన్ని శక్తులకి తక్కిన సమూహాలనుంచి సాంస్కృతికంగా ఒక ప్రమాదం పొంచి  ఉందని నమ్మిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే పాత తరం జాతీయవాదం వలసపాలకుణ్ణి శత్రువుగా చూపితే ఈ కొత్త జాతీయవాదం తన దేశవాసులకి తన దేశవాసుల్నే శత్రువులుగా చూపిస్తుంది.

ఒకప్పుడు జాతీయోద్యమంలో దేశంలోని అన్ని ప్రాంతాలవారు, మతాల వారు, భాషల వారూ, సంస్కృతుల వారూ అన్ని పద్ధతుల్లోనూ పాల్గొన్నారు. అందులో ఎవరి పోరాటమూ మరొకటి పోరాటం కన్నా ఎక్కువ విలువైనదీ కాదు, ఎవరి త్యాగమూ మరొకరి త్యాగం కన్నా తక్కువ విలువైందీ కాదు. కాని స్వాతంత్య్రం సిద్ధించిన ఏడున్నర దశాబ్దాల తర్వాత పరిస్థితి చూస్తే జాతినిర్మాణంలో అన్ని ప్రాంతాలకీ, అన్ని వర్గాలకీ, అన్ని సమూహాలకీ సమానమైన వాటా దక్కలేదు. రాజకీయ అధికారం అందరికీ సమానంగా దక్కలేదు. దేశంలోని ఉత్తరాది ప్రాంతాలు, హిందీ మాట్లాడే ప్రాంతాలు, ప్రధానంగా హిందువులు, వాళ్ళల్లో మళ్ళా అగ్రవర్ణాలు, అగ్రకులాలు, వాళ్ళల్లో మళ్ళా పురుషులూ రాజకీయ అధికారానికి ఎక్కువ నోచుకుంటూ  ఉండగా, వెనకబడిన ప్రాంతాలూ, కులాలూ, తెగలూ, దళితులూ, స్త్రీలూ రాజకీయంగా ఇంకా పూర్తిగా సంఘటితపడనే లేదు. దానివల్ల ఆయా వర్గాలకు చెందిన సమూహాలు కొన్ని ప్రాంతాల, కొన్ని వర్గాల, వర్ణాల ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టగానే ఆ గొంతుల్ని సాంస్కృతికంగా అణచిపెట్టే ధోరణి ఒకటి మొదలయ్యింది. ఇది చాలా సూక్ష్మ స్థాయిలో జరుగుతున్న ప్రక్రియ.

సహజంగానే ఈ ప్రయత్నాలకి ప్రతిఘటన వస్తున్నది. ఆయా జాతీయ రాజ్యాల పరిథిలో ఇంతదాకా ఒక జాతిగా మనుగడ కొనసాగిస్తున్నప్పటికీ, ఆ జాతిచట్రంలోనూ, ఆ జాతీయవాద కథనాల్లోనూ నిరాదరణకీ, అప్రధానీకరణకీ గురైన ప్రాంతాలూ, సమూహాలూ తమ అస్తిత్వాల్ని గుర్తుపట్టడం, తద్వారా ఇంతదాకా చెప్పుకుంటూ వస్తున్న జాతీయవాద కథనాల్ని ప్రశ్నించడం మొదలుపెడుతున్నారు.

ప్రజలనుంచి తలెత్తే ఇటువంటి ప్రతిఘటనని వలసవాదపు రోజుల్లో  రాజద్రోహంగా చిత్రిస్తే, ఈ రోజుల్లో జాతీయవాద ప్రభుత్వాలు దాన్ని రాజద్రోహంగా మాత్రమే కాక, మరికొంత ముందుకి పోయి జాతిద్రోహంగానూ, సాంస్కృతిక ద్రోహంగానూ చిత్రించడం మొదలుపెట్టాయి.

ఇది ఒక్క ఆసియా, ఆఫ్రికా ఖండాలకే కాదు, యూరోప్‌ కీ, చైనాకీ, రష్యాకీ కూడా అనుభవంలోకి వస్తున్న యథార్థం. ఈ కొత్త అస్తిత్వాల్ని ఎలా నిభాయించాలో తెలీక జాతీయ రాజ్యాలు దేశభద్రత, అంతర్గత భద్రతల పేరిట మరింత నియంతృత్వ పోకడల్ని సంతరించుకుంటూ, ఈ సరికొత్త అస్తిత్వగళాల్ని అణచివెయ్యడానికి ప్రయత్నిస్తుండటం ప్రపంచమంతటా కనిపిస్తున్నది.

గ్లోబలైజేషన్‌ వల్ల సంభవించిన రెండవ పరిణామం మొత్తం ప్రపంచమే ఒక సరికొత్త వలసప్రపంచంగా మారిపోవడం. అలాగని వలసలు ఉధృతమయ్యాయని కాదు. గత యాభయ్యేళ్ళుగా ప్రపంచ జనాభాలో వలసల జనాభా శాతంలో పెద్ద మార్పు లేదు. అది ఎప్పట్లానే మూడు శాతానికి దగ్గరగానే ఉంటున్నది. కాని ఈ ఇరవై, ముప్ఫై ఏళ్ళల్లో జరిగిన వలసల్లో గుణాత్మకంగా చాలా మార్పు ఉంది. మొదటిది, నిష్పత్తిలో మార్పు లేకపోయినప్పటికీ వలసలు చేపడుతున్న మనుషుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రపంచం మొత్తం మీద నేడు దాదాపు 27 కోట్లమంది ఏడాది కన్నా ఎక్కువ కాలం తమ స్వదేశానికి దూరంగా గడుపుతున్నారని ఒక అంచనా. వీళ్ళల్లో సంఖ్యరీత్యా అత్యధికులు భారతీయులు కావడం గమనార్హం. వీళ్ళు అమెరికా, యూరోప్‌, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు వలసలకు పోతున్నారు. వయసురీత్యా వీళ్ళల్లో ఎక్కువమంది యువతీయువకులు. వీళ్ళు ఆయాదేశాల్లో ఉపాధి సంపాదించుకుని తద్వారా స్వదేశాలకు పంపిస్తున్న ఆదాయం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి, ఇప్పుడు వలసలు జాతీయ అవసరంగా కూడా మారాయి.

ఇలా స్వచ్ఛందంగా జరుగుతున్న వలసలతో పాటు రకరకాల రాజకీయ కారణాల వల్ల, అంతర్యుద్ధాల వల్ల ఒక దేశం నుంచి పక్కనున్న పొరుగుదేశంలోకి పెద్ద ఎత్తున శరణార్థులుగా వలసలు పోతున్నవారి సంఖ్యకూడా విస్తారంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఇలా ఒక దేశంలోకి శరణార్థులుగా వచ్చినవారిని ఆయాదేశాలు మానవతాపుర్వకంగా ఆదరించేవి. కాని ఇప్పుడు కొత్త జాతీయవాదాలు అటువంటి శరణార్థుల్ని జాతీయవిపత్తుగా పరిగణిస్తున్నాయి.

ఇక మూడవ తరహా వలసలు, ఒక దేశం నుంచి మరొక దేశానికి జరుగుతున్నవి కావు, ఆ దేశంలోనే వెనకబడిన ప్రాంతాలనుంచి అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఉపాధికోసం జరుగుతున్నవి. ఇటువంటి వలసల్లో చైనా ముందుస్థానంలో ఉంది. ఆ దేశంలో పడమటి ప్రాంతాలనుంచి దాదాపు ఇరవై ముప్ఫై కోట్లమంది ప్రజలు తూర్పు ప్రాంతాలకి పని కోసం వలసపోతున్నారు. భారతదేశంలో ఒరిస్సా, బీహార్‌ లాంటి రాష్ట్రాలనుంచి వింధ్యకు దక్షిణానికి వలస వస్తున్నట్టే. ఇటువంటి అంతర్గత వలసలు ఆయా దేశాల్లో సాంస్కృతికంగా కొత్త సమస్యల్ని సృష్టిస్తున్నాయి.

ఇలా  చదువులకోసమో, జీవనోపాధికోసమో భారతీయులు గతంలో కూడా విదేశాలకు వలసవెళ్లారు. అలా వెళ్ళినప్పుడు, వాళ్ళు ఆయా దేశాల్లో కనబడుతున్న అభివృద్ధితో మన దేశపరిస్థితుల్ని పోల్చుకుని చూసి, మన దేశాన్ని స్వతంత్రం చేస్తే తప్ప మనకి అభివృద్ధి సాధ్యం కాదని భావించారు. మన జాతీయోద్యమ నాయకులు చాలామంది అలా విదేశాలకు చదువుకోడానికి వెళ్ళినందువల్ల జాగృతి పొందినవారే. మరొకవైపు విదేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు బతుకు తెరువుకు వెళ్ళిన భారతీయులు చాల నిరుపేదలు కాబట్టి వాళ్లకి తమ దేశం గురించీ, తమ సంస్కృతి గురించీ ఆలోచించగలిగే అవకాశం ఉండేది కాదు. వారు నెమ్మదిగా ఆయా దేశాల జీవనవిధానంలో ఏ చోటు లభిస్తే అక్కడే సర్దుకుపోయారు.

కాని ఇప్పుడు చదువుకోసమో, ఉపాధికోసమో విదేశాలకు వెళ్తున్న భారతీయులకి ఆ దేశాల్లో తమ ఉనికిని ప్రత్యేకంగా నిలబెట్టుకోడానికి తమ జాతి గురించీ, సంస్కృతి గురించీ చెప్పుకోవలసిన అవసరం కనబడుతున్నది.  కాని వాళ్లల్లో చాలామంది ఇక్కడ ఉండగా ఈ దేశ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాల గురించి పెద్దగా చదువుకున్నదీ, తెలుసుకున్నదీ ఏమీ లేదు. వాళ్ళల్లో అత్యధికసంఖ్యాకులు యువకులు. ఇటీవలి దశాబ్దాల్లో పుట్టినవారు కాబట్టి వీళ్ళకి భారత జాతీయోద్యమం గురించీ, ఆ ఉద్యమంలో ప్రజల్ని సంఘటితం చేసిన మహత్తర ఆదర్శాల గురించీ పెద్దగా తెలియదు. మన పాఠశాలలు కూడా పిల్లలకి ఒక సమగ్ర చారిత్రిక దృష్టినీ, వైజ్ఞానిక దృష్టినీ అలవర్చడంలో వెనకబడిపోయాయి. సినిమాలూ, రాజకీయనాయకులూ, ప్రవచనకర్తలూ, వాట్సప్‌ సందేశాలూ చెప్పేదానికి మించి వీళ్ళల్లో చాలామందికి భారతదేశమంటే ఏమిటో తెలియదు. భిన్నత్వంలో ఏకత్వమంటే ఏమిటో తెలియదు. రాజ్యాంగ ఆదర్శాల గురించిన కనీస పరిజ్ఞానం కూడా లేదు వీళ్లకి.

కానీ, ఇప్పుడు విద్య, ఉద్యోగ అవకాశాల వల్ల బయటికి వెళ్ళినప్పుడు అక్కడ తమ దేశం గురించీ, జాతి గురించీ చెప్పుకోడానికి రకరకాల నెరేటివ్స్‌ని ఆశ్రయించవలసి వస్తోంది. ఈ కథనాల వల్ల ఒక కృత్రిమ జాతీయత రూపొందుతూ ఉంది. అంటే భారతదేశం ప్రాచీన కాలంలో చాలా గొప్పదేశమనీ, అన్ని శాస్త్రాలూ ఇక్కడే పుట్టాయనీ, ఈ రహస్యాలన్నీ విదేశీయులు పట్టుకుపోయి తామే కనిపెట్టామని చెప్పుకుంటున్నారనీ, ఇలాంటివే రకరకాల కథనాలు.

మరొకవైపు ఇంతదాకా నిద్రాణంగా ఉన్న ప్రజాసమూహాలు, నిరాదరణకు గురైన సమూహాలు అక్షరాస్యత వల్లా, కొత్త విద్యావకాశాల వల్లా ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. అంతిమంగా ఇదంతా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమస్య. దీన్ని మనం ఎంతో విజ్ఞ్తతతో, దూరదృష్టితో, ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకోవచ్చు. కానీ ఆధునిక జాతీయ రాజ్యాలకి అటువంటి పాలనాపరమైన సమర్థత లేదు. అందుకని అవి ప్రతి వలసనీ రాజకీయ దృష్టితో చూడటం, రాజకీయంగా ఎదుర్కోడమే సులభమని అనుకుంటున్నాయి.

ఈ సమస్యల్ని పరిష్కరించడానికీ, అభివృద్ధి వ్యూహాలు రచించి అమలు పర్చడానికీ జాతిమొత్తాన్ని భాగస్వామ్యం చేయడానికి బదులు, మతాన్నో, కులాన్నో, ప్రాంతాన్నో అడ్డంకిగా చూపిస్తున్నాయి. ఒకప్పుడు ఈ భేదాలన్నీ మరిచి జాతిమొత్తం ఒకటిగా విదేశీపాలన మీద పోరాటం చేసింది. కాని  ఇప్పుడు ఆ జాతీయనాయకుల్ని సంకుచితదృష్టి కలిగినవాళ్ళుగానూ, స్వార్థపరులుగానూ, బలహీనులుగానూ, జాతి ప్రయోజనాల్ని తాకట్టుపెట్టిన వాళ్ళుగానూ చిత్రించే కొత్త జాతీయవాదం ఒకటి మనకళ్ళముందే బలపడుతున్నది.

అంటే ఏమిటి? ఒకప్పుడు పారిశ్రామికీకరణవల్ల వలసదేశాల్లో జాతీయవాదం మొదలైనట్టే, ఇప్పుడు గ్లోబలైజేషన్‌ వల్ల కొత్త జాతీయవాదం ఒకటి మొదలయ్యిందన్నమాట. దీనికి రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి ఇది స్వదేశంలో తలెత్తుతున్న వివిధ రకాల micro-identities ని సాంస్కృతికంగా అణచివెయ్యాలని చూడటం. మరొక వైపు విదేశాల్లో ఒక కృత్రిమ జాతీయతాస్ఫూర్తిని ప్రచారం చేయడం. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితమైన ధోరణి కాదు, దాదాపుగా ఆసియా దేశాలన్నిటిలోనూ ఈ కొత్త ధోరణి కనిపిస్తూ, చాలా దేశాల్లో ఇది మతపరమైన ఛాందసవాదంగా రూపుదిద్దుకుంటూ ఉంది. మరొకవైపు పశ్చిమ దేశాల్లో కూడా ఇటువంటి పరిణామమే మొదలయ్యింది. ఆసియా, ఆఫ్రికా దేశాలనుండి తమ దేశాలకు వలసలు వస్తున్నవారివల్ల తమ ఉపాధి అవకాశాలు పోతున్నాయనే ఉద్దేశ్యంతో ఆ దేశాల్లో కూడా ఒక మూర్ఖజాతీయతా వాదం మొదలయ్యింది.

మొత్తం మీద ఇరవయ్యవశతాబ్దంలో ప్రపంచమంతటా దేశాలు సామాజిక విముక్తికోసం, ఆర్థికాభివృద్ధికోసం వామపక్ష భావజాలం వైపు చూడగా, ఇరవై ఒకటవ శతాబ్దంలో దాదాపుగా ప్రపంచమంతా కూడా కుడివైపు చూడటం మొదలుపెట్టింది. ప్రపంచ కార్మికులు ఏకం కావడానికి బదులు, ప్రపంచ పెట్టుబడిదారులూ, ఫండమెంటలిస్టులూ ఏకమవుతున్నారు.

గ్లోబలైజేషన్‌ మానవచరిత్రలో కొత్తది కాదు. కాని ఈ పాత గ్లోబలైజేషన్లతో పోలిస్తే ఈ కొత్త గ్లోబలైజేషన్‌ ప్రత్యేకత ఎక్కడ ఉందంటే, సమాచార వ్యాప్తిలో సాధించిన అనూహ్యవేగం. ప్రపంచంలో ఒక మూలనుంచి మరొక మూలకి సమాచారం తక్షణమే  ప్రసారం కాగల అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ఈ రోజు అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు జాతీయోద్యమకాలంలో జాతీయవాదనాయకులు అప్పటి ప్రింటిగ్‌ ప్రెస్‌, పోస్టు, టెలిగ్రాఫ్‌, రైల్వే లాంటి సాధనాల్ని వాడుకుని జాతీయతాభావాల్ని వ్యాప్తి చెయ్యగలిగారు. ఇప్పుడు ఈ సరికొత్త సాంకేతిక సాధనాల్ని వాడుకుని ఈ తీవ్ర జాతీయతవాదులు కృత్రిమ కథనాల్నీ, ఛాందససంస్కృతినీ అత్యంత వేగంగా వ్యాప్తిలోకి తెస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఒకవైపు గ్లోబలైజేషన్‌ మొత్తం ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మారుస్తుండగా, ఎక్కడికక్కడ ఈ ఛాందస జాతీయవాదులు దేశాలకీ, సమూహాలకీ, చివరికి మనుషులకీ, మనుషులకీ మధ్య గోడలు కడుతున్నారు, మామూలుగా కాదు, మెరుపు వేగంతో.

ఇలా గోడలు కట్టడానికి భారతదేశ పాలకశక్తులు అనుసరిస్తున్న విధానం మన దేశం గతంలో చాలా గొప్పదని పదే పదే చెప్తూ ఉండటం. అలా చెప్పటానికి చరిత్రనీ, సైన్సునీ కాక పురాణాల్ని ఆధారం చేసుకోవడం. సాహిత్యం, సంగీతం, కళలు, విజ్ఞానం నిర్వహించ వలసిన పాత్రను మతానికి అప్పగించడం. చిత్రమేమిటంటే యూరోపులో ఫ్యూడల్‌ సంస్కృతిని ధిక్కరించిన బూర్జువాజీ మతానికి వచ్చేటప్పటికి ప్రొటెస్టంటు వైఖరి తీసుకుంది. కాని ఇక్కడ భారతదేశంలో బలపడుతున్న పెట్టుబడిదారీ శక్తులు మాత్రం ఛాందసవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కారణం సుస్పష్టమే. మతం పట్ల ఎంత ఛాందసవైఖరిని ప్రోత్సహిస్తే ప్రజల్ని అంతగా విడదీసి పాలించగలుగుతారు.

కానీ మానవచరిత్ర దశాబ్దాల లెక్కకో, చివరికి శతాబ్దాల లెక్కకో కుదించగలిగేది కాదు. అది సహస్రాబ్దాల లెక్కలో అర్థం చేసుకోవలసింది. మనం ఈ రోజు అట్లాసులో చూస్తున్న ఈ ఖండాలు ఎల్లప్పుడూ ఇలానే లేవనీ, ఈ దేశాలూ, ఈ సరిహద్దులూ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయనీ, ఈ రోజు భారతదేశంతో సహా ఎన్నో జాతీయ రాజ్యాలు భావిస్తున్నట్టుగా వాటి జాతి చరిత్ర అవి గీసుకున్న సరిహద్దులకే పరిమితంగా లేదనీ, నిజానికి మనం కట్టుకుంటున్న గోడలేవీ ఒకప్పుడిలా లేవనీ, ఇప్పుడు కూడా ఈ గోడలిలానే శాశ్వతంగా నిలబడిపోయేవి కావనీ మనం గ్రహించవలసి ఉంటుంది.

మన్వంతరాల చరిత్రలో మానవుడు ఈ వసుధ మొత్తాన్ని ఏకకుటుంబంగా భావించాడనీ, ఎక్కడో సుదూరప్రాంతానికి చెందిన మానవసమూహాలు మరెక్కడో సుదూరప్రాంతానికి పోయి అక్కడ నాగరికతలు నిర్మించిందనీ ఈ రోజు ఎన్నో ఆనవాళ్ళు లభిస్తున్నాయి, సాక్ష్యాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా తన సంస్కృతి, తన సాహిత్యం, తన సాంకేతికత పూర్తిగా తన ఘనత మాత్రమే అనుకోడానికి లేదనీ, మానవుడు ఏ దేశంలో ఉన్నా అతడు సాధించిన ప్రతి విజయంలోనూ ప్రపంచ మానవులందరి పాత్రా ఉందని మనం ఒప్పుకోవలసి ఉంటుంది.

ఇదే మాట మన జన్యు వారసత్వం గురించి కూడా చెప్పుకోకతప్పదు. ఇప్పుడు ఈ నేలమీద నడయాడుతున్న ప్రతి ఒక్క మానవుడూ, ఇంతదాకా ఈ పృథ్వి మీద సంచరించిన ప్రతి ఒక్క మానవుడికీ జన్యుపరంగా వారసుడేననన్నది ఒక వైజ్ఞానిక సత్యం. ఇంత కొట్టొచ్చినట్టుగా మన ముందు బయటపడుతున్న మానవుడి గతాన్ని చూడటానికి ఇష్టపడకుండా, ఇంకా శుద్ధ జాతులూ, శుద్ధరక్తమూ, శుద్ధ సంస్కృతీ ఉంటాయనుకోవడం సాంస్కృతిక అంధత్వం మాత్రమే.

 ఇటువంటి గుడ్డితనం ఎవరో ఒకరిద్దరు వ్యక్తులకి ఉండటం వేరు, ఒక జాతి అత్యధికభాగం ఇటువంటి కథనాల్ని చెప్పుకుంటూ తనని తాను నమ్మించుకోడం వేరు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. తాను బలపడుతున్నానుకుంటూ నిజానికి ఒక జాతి దుర్బలమైపోతున్న ప్రక్రియ ఇది. ఈ నేపథ్యంలో భాస్కరంగారి పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది.

ఆయనిలా కూడా అంటున్నారు:

‘అలాగని నేను సరిహద్దుల వాస్తవికతను నిరాకరించడం లేదు. సరిహద్దుల స్పృహలేని, భిన్నమైన సరిహద్దులు కలిగిన ఒకనాటి ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి, కాసేపు నేటి సరిహద్దుల స్పృహని పక్కన పెట్టాలని చెప్పడమే నా ఉద్దేశ్యం… ఇలాంటి ప్రపంచానుభవాలను స్మరించుకునేటప్పుడు దేశాల సరిహద్దుల్ని కాసేపు మర్చిపోవాలి. అప్పుడు మాత్రమే పాక్షిక జ్ఞానం, లేదా తప్పుడు జ్ఞానం మన కంటికి కప్పిన పొరలను తప్పించుకుని చూడగలుగుతాం.’

ఆ పాక్షిక జ్ఞానం అంటే ఏమిటో కూడా ఆయనొకచోట ఇలా స్పష్టంగా చెప్తుననారు:

‘వీటితో పాటు వాజ్ఞ్మయాన్ని కూడా కలుపుకున్నప్పుడు మనం ప్రాచీన వారసత్వమని దేనినంటున్నామో అదంతా కేవలం ఈ పదకొండువేల సంవత్సరాల కాలంలో ఇమిడిపోతుందని పురాచరిత్రకారులు, మానవశాస్త్రవేత్తలు, అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మానవగతాన్ని కల్పాలు, మన్వంతరాలు, యుగాలు వగైరా పేర్లతో లక్షలాది సంవత్సరాల పరిణామంలో ఊహించుకోడాన్ని మతమూ, దానికి సంబంధించిన వాజ్ఞ్మయమూ మనకు అలవాటు చేసాయి. ఇప్పుడాలోచిస్తే, నేత్రభ్రాంతిలానే అది కూడా మెదడు చేసే మాయగా తోస్తుంది.’

3

మనం ఒక విషయాన్ని స్పష్టంగా గమనించాలి. మన జాతీయోద్యమ కాలంలో కూడా పాశ్చాత్యప్రభావానికి ప్రతిక్రియగా మతఛాందసవాదాలు పుట్టుకొచ్చాయి. అవి హిందూ, ముస్లిం మత ఛాందసవాదాలుగా బలం పుంజుకున్నాయి. కాని అత్యధిక సంఖ్యాకులైన భారతీయ ప్రజానీకం, అప్పటికి బ్రిటిష్‌ ఇండియా పాలనలోలేనివారితో సహా, ఛాందసవాదాలకన్నా భిన్నమైన విశాల దృక్పథాన్ని కనపరిచారు. వలసపాలనమీద తమ పోరాటం నలుగురినీ కలుపుకుపోయేదిగా ఉండాలని కోరుకున్నారు. తాము రాసుకున్న రాజ్యాంగం కూడా అలానే సమానత్వ, సౌభ్రాతృత్వ ప్రాతిపదికల మీద రాసుకున్నారు. కాని మతఛాందసవాదాలు కలిగించిన నష్టం కూడా ఏమీ తక్కువకాదు. దేశవిభజనవల్ల జరిగిన అంతఃకలహాలతో పాటు మహాత్ముణ్ణి బలితీసుకున్నాయవి.

ఈ గతాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఇప్పుడు బలం పుంజుకుంటున్న కొత్త జాతీయవాదం జాతీయోద్యం కాలంలాగా inclusive కాదనీ, స్వభావరీత్యానే అది exclusive అని గ్రహించడానికి మనకి పెద్ద పరిజ్ఞానమేమీ అక్కర్లేదు.

జాతీయోద్యమ నాయకులు భారతదేశ చరిత్రలో ప్రతి ఒక్కరి పాత్రనీ గుర్తించారు. వారికివ్వవలసిన స్థానాన్ని ఇవ్వడానికే నిజాయితీగా ప్రయత్నించారు. కానీ కొత్త జాతీయవాదులు అటువంటి విశాలదృక్పథాన్ని స్వాగతించరు సరికదా, అటువంటి విస్తృతదృక్పథాన్ని సహించలేరు కూడా. తమ అసహనాన్ని ప్రకటించడానికి వారికున్న అనేక సాధనాల్లో కృత్రిమ కథనాల్ని ప్రచారం చేయడం కూడా ఒకటి. ముఖ్యంగా భారతదేశ చరిత్ర గురించి వాళ్ళు శాస్త్రీయ దృక్పథానికి బదులు పౌరాణిక దృక్పథాన్ని ప్రచారం చేస్తారు. ఎందుకంటే, ప్రజల్ని ఉద్రిక్తుల్ని చేయడానికి fact కన్నాfiction ది దగ్గరి దారి అని వాళ్ళ నమ్మకం.

సరిగ్గా ఈ వరదకు ఎదురీదుతూ భాస్కరం గారు ఈ పుస్తకం రాసారని చెప్పవచ్చు. ఇది సాహసమే కాని ఎంతో అవసరం. ఆయనిలా అంటున్నారు:

‘ఒక్కోసారి రాజకీయం తన హద్దును, తూకాన్ని దాటిపోయి సంస్కృతి, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం తదితర జ్ఞాన రంగాలను కూడా తన పరిధిలోకి తెచ్చేసుకుని, రాజకీయాన్నీ వాటినీ కలగాపులగం చేసి సర్వం తానే అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది… ప్రతి సాహిత్యకారుడూ, ఇతర మేధారంగాలకు చెందిన ప్రతి రచయితా తన ఆలోచనాసరళి వైపు జనాన్ని ఆకర్షించుకునే వ్యూహంతోనే రచన చేస్తాడు. రాజకీయ జీవి అధికారం కోసం మరికొన్ని కూడా చేస్తాడు. అవి జనం సెంటిమెంట్లను వాడుకోవడం, అందుకోసం అబద్ధాలను ఆశ్రయించడం, లేదా సత్యాన్ని కప్పి పుచ్చడం మొదలైన రూపాల్లో ఉంటాయి. రాజకీయానికి సమాంతరంగా జ్ఞాన రంగానికి ఉన్న ప్రాముఖ్యాన్ని, దాని స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని గుర్తించి దాని ఉనికిని ఎప్పటికప్పుడు పటిష్టం చేసుకోవడమే రాజకీయ స్వైరవిహారానికి విరుగుడు.’

కాబట్టి ఈ రచన  సత్యాన్వేషణ దృష్టితో చేసిన కృషి అని గుర్తుపెట్టుకోవాలి. ఇందుకు గాను భాస్కరంగారు ఆధునిక, సమకాలిక జన్యుశాస్త్ర పరిశోధనల్ని తన ముడిసరుకుగా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనే ఒక చోట రాసినట్టుగా ‘జనశాస్త్రమంటే జన్యుశాస్త్రమే.’

4

ఒక ప్రాంతం నుంచి వలసపోయినవాళ్ళో లేదా అక్కడికి వలస వచ్చినవాళ్ళో మాత్రమే అక్కడి చరిత్రని నిర్మించారని భాస్కరం గారు ఈ రచనలో ఎక్కడా రాయలేదు. ఆయన చెప్తున్నదల్లా ఏమిటంటే, ఏ దేశ చరిత్రనైనా కేవలం ఆ దేశీయులు మాత్రమే నిర్మించారనుకోకండి, అది బహుళ జాతుల సంస్కృతుల ఆదానప్రదానాలతో నిరంతరం సంభవిస్తూండే ఒక ప్రక్రియ అని మాత్రమే. అలాగే, శుద్ధమైన జాతి అంటూ ఏదీ లేదనీ, అలా ఉంటుందనుకుని తమ దేశం చుట్టూ సాంస్కృతికంగా గోడలు కట్టుకోవడం మూర్ఖత్వం మాత్రమే కాదు, ప్రమాదకరమని కూడా ఆయన చెప్తున్నారు.

మన జాతీయోద్యమ నాయకులకి ఈ వివేకం ఉంది. కాబట్టే వారు భారతదేశ చరిత్ర రాసినప్పుడు, ఈ దేశం మీద దండయాత్ర చేసిన ప్రతి జాతీ, ప్రతి ఒక్క మతం, ప్రతి ఒక్క తెగ ఈ దేశానికి సాంస్కృతికంగా ఎంతో ఉపాదానం అందించారనే గుర్తుపట్టారు, ఆ సత్యాన్నే రాసిపెట్టారు కూడా.

ఇటువంటి వివేకం అప్పటిరోజుల కన్నా ఇప్పుడు ఎక్కువ అవసరం. లేకపోతే నీలాగా మాట్లాడనివాడు, నీలాగా గుడ్డలు తొడుక్కోనివాడు, నువ్వు తినే తిండితినని వాడు, నువ్వు పూజించే దేవుణ్ణి పూజించనివాడు ప్రతి ఒక్కడూ శత్రువేనని కొత్త జాతీయవాదులు చెప్పే మాటలే నిజమని కొత్తభారతదేశం నమ్మే ప్రమాదం చాలా ఉంది.

5

మరో విషయం కూడా స్పష్టంగా చెప్పాలి. ఈ రచన జెనెటిక్స్‌ ని ఆధారం చేసుకుని మొదలుపెట్టినా కేవలం జెనెటిక్స్‌ సమాచారానికి మాత్రమే పరిమితం కాలేదు. ముందే చెప్పినట్టుగా ఇదొక మల్టి డిసిప్లినరీ అధ్యయనం. ఇందులో జన్యుశాస్త్ర పరిశీలనలతో పాటు, పురావస్తు, మానవశాస్త్ర పరిశీలనలతో పాటు, తులనాత్మక భాషాశాస్త్రం, మైథాలజీ, వేద, పురాణ, ఇతిహాసాల పరిశీలనలతో పాటు, సంస్కృత, తెలుగు సాహిత్యాలనుంచి కూడా ప్రస్తావనలు ఉన్నాయి. ఈ ఒక్క గ్రంథం చదివితే ఎన్నో గ్రంథాలు చదివినట్టు.

సాధారణంగా ఏదైనా ఒక రంగంలో కొన్నేళ్ళ పాటు, అంటే ఉదాహరణకి, ఏ పదేళ్ళ పాటో వచ్చిన అధ్యయనాల్ని చదివి వాటిని సమీక్షిస్తూ ఒక పుస్తకమో, పత్రమో వెలువరించే పని కొందరు చేస్తుంటారు. ప్రభుత్వాలో, అంతర్జాతీయ సంస్థలో, స్వచ్ఛంద సంస్థలో ఒకరిద్దరు నిపుణుల్ని ఎంచుకుని వారికి ఇలాంటి పని అప్పగిస్తారు. విద్యకి, అభివృద్ధికి సంబంధించిన అటువంటి అధ్యయనాలు నేను కొన్ని చూడకపోలేదు. కానీ అటువంటి పత్రాల్లో అప్పటిదాకా వచ్చిన అధ్యయనాల సారాంశాన్ని క్రోడీకరించడమే ఉంటుంది తప్ప, ఆ సమాచారం ఆధారంగా కొత్త ఊహాగానాలకు తెరతీయడం గానీ లేదా పూర్వపు పరిజ్ఞానాల్ని సవరించడం గాని ఉండదు. కానీ ఈ అధ్యయనంలో భాస్కరంగారు ఎన్నో హైపోథీసిసులు మనముందుంచడమే కాక, మన సంస్కృతి, చరిత్రలకు సంబంధించిన ఎన్నో చిక్కుముళ్ళు విడిపోవడానికి అవసరమైన తాళం చెవులు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

ఒకటి, ఆయన స్వయంగా పండితకుటుంబం నుంచి వచ్చిన వారు కావడంవల్లా, భారతీయ సంస్కృతికి మూలగ్రంథాలు అని చెప్పదగ్గవాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినందువల్లా ఇది సాధ్యపడిం దని చెప్పవచ్చు. రెండోది, ఏళ్ళ తరబడి ఆయన ఎంతో సమర్థవంతంగా నిర్వహించిన పాత్రికేయవృత్తి ఆయనకు సమకాలిక ప్రపంచం గురించీ, భారతీయ సామాజిక పరివర్తన గురించీ ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందించడం మరోకారణం.

వీటికి తోడు, సత్యం పట్ల ఆయన కున్న ప్రీతీ, గౌరవమూ నిరుపమానమైనవి. తనకి తోచింది సత్యమని తెలుస్తున్నప్పుడు ఆయన తాను ఇంతదాకా ఏ నమ్మకాల్ని ఆధారం చేసుకుని నిలబడ్డారో ఆ నమ్మకాల్ని పక్కకు నెట్టేయడానికి ఏ మాత్రం సంకోచించడు. మనిషిగా, సత్యాన్వేషిగా భాస్కరం సంస్కారం అత్యున్నతమైంది కాబట్టే ఈ రచన కూడా ఇంత అద్వితీయంగా రూపొందింది అని నమ్ముతున్నాను.

ఆయనకు తెలుగు జాతి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు? కాని తనముందర నడిచి వెళ్ళిన జిజ్ఞాసువుల్లానే తాను కూడా సత్యం తెలుసుకోవడం కోసమే ఈ యాత్ర చేపట్టాడు కాబట్టి మరింత మంది సత్యాన్వేషులు ఈ పరిశోధనను అందిపుచ్చుకుని ముందుకు వెళ్లడమే మనం ఆయనకివ్వగల బహుమానం.

20-11-2023

12 Replies to “సాహసం, కానీ ఎంతో అవసరం”

  1. ఒకే పదం.అద్భుతం. కానీ కొత్త గా ఆలోచించాలంటే భయపడాల్సిన రోజులు కదా

  2. గోడలు కట్టే వారికి కనువిప్పు. భాస్కరం గారి రచనా దానికి మీ వివరణా.

  3. మీ లోతైన సమీక్ష ఈ పుస్తకం యొక్క నాణ్యత ప్రాధాన్యం, సామాజిక పరిగణ్యత, ఆవశ్యకతలను చాలా చక్కగా వివరించేదిగా ఉంది.సారు పుస్తకాన్ని అధ్యయనం చేయాలని కుతూహలంగా ఉంది.

  4. Good evening sir
    ఎంత గొప్పగా విశ్లేషించారు ఇప్పటి సామాజిక స్థితిని..
    మీ విశ్లేషణకు నమస్సులు
    తప్పకుండా ఈ పుస్తకం చదువుతాను

  5. మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు, సర్.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading