
బసవన్న వ్యక్తిత్వం, ఆయన జీవితాన్ని నడిపించిన దృక్పథం, నిలబెట్టుకున్న ఆదర్శాలు వంటివాటి గురించి మనం మరే రచనల మీదా ఆధారపడకుండా నేరుగా ఆయన వచనాల్ని బట్టే అంచనా వెయ్యడానికి ప్రయత్నిస్తే ఆ కథనం ఎక్కువ వాస్తవికంగానూ, విశ్వసనీయంగానూ ఉండే అవకాశం ఉంది. నా మటుకు నాకు తన వచనాల్లో కనిపించే బసవన్న ఎక్కువ మానవీయంగానూ, ఆత్మీయుడుగానూ గోచరించాడు. ఆయన్ని చదువుతూ ఉంటే ఒక ఆజానుబాహువు అయిన మానవుణ్ణి, ఏకకాలంలో ఋషీ, కవీ అయిన భావుకుణ్ణి కలుసుకున్నట్టుగా ఉంటుంది. ఆ వచనాల్ని వింటున్నప్పుడు యాస్నయా పొల్యానా క్షేత్రంలో టాల్ స్టాయి తో తిరుగాడుతున్నట్టుగానో, శాంతినికేతన్ దగ్గర కొపాయి నది ఒడ్డున నడుస్తో టాగోర్ తో మాట్లాడుతున్నట్టుగా , లేదా సబర్మతి ఒడ్డున వేపచెట్టునీడన ఒక సాయంకాలం గాంధీగారితో ప్రార్థనాసమావేశంలో కూచున్నట్టుగానో అనిపిస్తుంది.
బసవన్న వచనాల్లో ఒక తాత్త్వికుడూ, ఒక కవీ ఇద్దరూ కనిపిస్తారన్నాను కదా. ముందు ఆ తాత్త్విక దృక్పథం గురించి కొన్ని ఆలోచనలు పంచుకున్నాక, అప్పుడు వాటిల్లోని కవిత్వం గురించి మాట్లాడుకుందాం.
అన్నిటికన్నా ముందు వచనాల్లో బసవన్న ఒక అద్వైతిగా కనిపిస్తాడు. శివాద్వైతి. సమస్త ప్రపంచం, పదార్థ, గుణ, అవస్థాభేదాల్ని దాటి శివమయంగానే ఆయనకు కనిపించింది. తాను ఈ దృష్టి వేదాలనుంచే నేరుగా గ్రహించినట్టుగా ఆయన పదే పదే ప్రమాణాలు చెప్తూ ఉంటాడు. కాని వేదాల్లోని బహుదేవతలందరినీ పక్కనపెట్టి ఆయన శివుణ్ణొక్కణ్ణే సత్యంగా భావించాడు. ఏకేశ్వరోపాసన ఆయన జీవితానికి చుక్కాని.
ఇందులో ఆశ్చర్యం లేదు. భారతదేశ చరిత్రలోనూ, దర్శనపరిణామంలోనూ కూడా మొదటినుంచీ ఏకేశ్వరోపాసన, బహుదేవతారాధన ఒకదాని వెనక ఒకటి అలలుగా తలెత్తుతూండటం మనకి కనిపిస్తుంది. వేదాల్లో బహుదేవతారాధన కనిపిస్తుంది. కాని ఆ దేవతలన్నిటిలోనూ అంతర్లీనంగా ఉన్న బ్రహ్మన్ ఒకటే అని ఉపనిషత్తులు నిశ్చయంగా చెప్పడానికి ప్రయత్నించాయి. తిరిగి మళ్ళా శ్రమణవాదాలు దేవుణ్ణి పక్కనపెట్టడానికి ప్రయత్నించినప్పుడు భగవద్గీత మళ్ళా ఏకేశ్వరుణ్ణి ప్రతిపాదించింది. ఆధునిక కాలంలో పందొమ్మిదో శతాబ్దంలో బ్రహ్మసమాజీకులు ఏకేశ్వరుణ్ణి ప్రతిపాదించారు. ఆ స్ఫూర్తితోనే భారత జాతీయోద్యమం భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని ముందుకు తెచ్చి ఎన్ని భేదాలున్నప్పటికీ భారతీయులు తామంతా ఒకే జాతి అని చెప్పుకున్నారు. తిరిగి ఇప్పుడు సామాజికంగా, రాజకీయంగా బహుళతావాదాలు ముందుకొస్తున్న కాలంలో ఉన్నాం. ఇలా చూసినప్పుడు బసవన్న కాలంలో, బహుదేవతారాధన స్థానంలో ఏకేశ్వరోపాసనని ప్రతిపాదించడం అప్పటి సామాజిక అవసరమనీ అర్థమవుతుంది .
ఈ పని శంకరుడు, రామానుజుడు కూడా చెయ్యకపోలేదు. కాని వాళ్ళకీ, బసవన్నకీ మధ్య ప్రధానమైన వ్యత్యాసం ఒకటి ఉంది. శంకరుడు ఉన్నదంతా ఒక్కటే అని ప్రతిపాదించినప్పటికీ, దాన్ని పారమార్థిక సత్యంగానే నొక్కి చెప్తూ, వ్యావహారిక జీవితానికి వచ్చేటప్పటికి భేదాల్ని అంగీకరించాడు. అంటే మనుషులందరిలోనూ ఉన్న సత్యం ఒకటే అయినప్పటికీ, సామాజికంగా ఉన్న అంతరాలూ, వర్ణాశ్రమ ధర్మాలూ వ్యావహారిక తలంలో కొనసాగడాన్ని ఆయన అంగీకరించాడు. ఆ దృక్పథాన్ని కొంత సవరిస్తూ రామానుజుడు మనుషులంతా ఒకటేగాని, వ్యావహారిక తలంలో ఆ భేదాల్ని దాటడానికి కొంత సమయం పడుతుందని భావించాడు. కాని బసవన్న దృష్టిలో అలా రెండు సత్యాలు లేవు. అందరిలోనూ ఉన్న శివుడొక్కడే అని అనుకున్నప్పుడు అది మానసికంగా ఒకలానూ, బయటమరొకలానూ ఉండటానికి వీల్లేదని ఆయన భావించాడు. ఇలా రెండు సత్యాల్ని అంగీకరించడం చివరికి రెండు ప్రమాణాలుగా మారిపోతుందనీ, దానివల్ల ధార్మిక-సామాజిక జీవితంలో ఆత్మవంచనా, కపటం, దోపిడీలతో పాటు సమస్త దురాచారాలూ వచ్చిచేరతాయని చెప్పడానికి ఆయన సంకోచించలేదు.
అందుకని ఆయన వచనాల్లో కనిపించే ఏకేశ్వరోపాసన వెన్నంటే సామాజిక అవినీతి మీద విరుచుకుపడటం కూడా విస్తారంగా కనిపిస్తుంది. కబీరు, వేమన, చలంగారి లాంటి కవిరచయితల్ని చదివిన మనకి ఈ రకమైన అభిశంసన కొత్తగా కనిపించదు. కాని భారతీయ సామాజిక చరిత్రలో ఇలా ఆత్మ వంచననీ, కాపట్యాన్నీ దుమ్మెత్తిపోసినవాళ్ళల్లో బసవన్ననే మొదటివాడని గమనిస్తే, పన్నెండో శతాబ్దంలోనే అటువంటి నిరసన ప్రకటించడంలోని నిజాయితీ, నిర్భీతీ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అటువంటి మానవుణ్ణి ఆరాధించకుండా ఉండలేమనిపిస్తుంది.
అందరిలోనూ శివుడున్నాడు అని నమ్మడంతో పాటు, దాన్ని వ్యావహారిక జీవితానికి కూడా అనువర్తించడం అనే రెండు లక్షణాలతో పాటు, కాయకష్టం చేసేవాళ్ళకి ఆ శివుడు మరింత సన్నిహితుడిగా ఉన్నాడని గుర్తుపట్టడం బసవన్న వచనాల్లో కనిపించే మూడవ ముఖ్య లక్షణం. ఆధునిక ప్రజాస్వామ్యంలోనూ, సామ్యవాద దృక్పథాల్లోనూ కనిపించే లక్షణం ఇది. ఇంకా చెప్పాలంటే, భారతరాజ్యాంగం దళితుల పట్లా, గిరిజనుల పట్లా కనపరిచిన positive discrimination ఇది. అంటే మనుషులందరూ సమానులేగాని, వాళ్ళల్లో నిరాదరణకు గురైనవారూ, సామాజికంగా అంచులకి నెట్టేయబడ్డవాళ్ళూ మరింత ఎక్కువ మానవతా గౌరవానికి, అత్యవసర ప్రోత్సాహానికీ అర్హులని నమ్మడం. బసవన్న వచనాలకీ, భారత రాజ్యాంగ స్ఫూర్తికీ మధ్య ఉన్న ఇటువంటి ఎన్నో పోలికలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి.
కాని బసవన్న మనకన్నా కూడా చాలాముందున్న వ్యక్తి. విద్య, ఉద్యోగ అవకాశాలు సమానంగా లభిస్తే మనుషుల మధ్య సమానత్వం సాధ్యమవుతుందని మనం నమ్ముతాం. లేదా ఉత్పత్తి సాధనాలు ప్రజాపరం అయితే సమానత్వం వస్తుందని నమ్ముతాం. కానీ ఈ రెండూ సాధించగల సమానత్వం చాలా పరిమితం, పాక్షికం. మరీ ముఖ్యంగా ఆధునిక విద్య మనుషుల్ని సమానుల్ని చెయ్యడానికి బదులు మరింత అంతరాలు పెంచేదిగానే మారడం మనం కళ్లారా చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ విధిగా కాయికాన్ని అనుష్టించడం వల్లనే మనుషులంతా సమానులనే సంస్కృతి అలవడుతుందని బసవన్న నమ్మాడు. ఇది టాల్ స్టాయి మాట్లాడిన bread labor. గాంధీగారు మాట్లాడిన కాయకష్టం. బసవన్న దృష్టిలో కాయికమంటే ప్రతిమనిషీ ఈ భూమ్మీద బతకడానికి అర్హుడు కావడానికి ప్రయత్నించడం. వేదాంతులు మాట్లాడిన అనాసక్తి కర్మపట్ల ఆయనకు నమ్మకం లేదు. ప్రతి మనిషీ కష్టపడాలి, సంపాదించుకోవాలి, దానిలో తన అవసరాలకు పోను, తక్కిందంతా సమాజానికి ఇచ్చెయ్యాలి. దాన్ని ఆయన ‘దాసోహం’ అన్నాడు. తనువు, మనసు, ధనం-మూడింటినీ శివసంఘానికి సమర్పించాలి. మన అవసరాలు కూడా పరిమితంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. మనుషులు కూడబెట్టుకోడానికి ఆయన తీవ్ర వ్యతిరేకి. ఆదిమ గిరిజనుల్లాగా ఆయన దృష్టిలో ఏరోజు ఆహారం ఆరోజే కాయికంగా సంపాదించుకోవాలి, ముందు తక్కినవారితో పంచుకోవాలి, మిగిలింది తను తినాలి. ‘కాయికమే కైలాసం’.
అందుకనే కల్బుర్గి బసవన్న గురించి రాస్తూ గాంధీ గారి ఈ వాక్యాలు ఉదాహరించాడు. గాంధీ గారిలా అన్నారట: ‘బుధుడొకవేళ కలుసుకుంటే ధ్యానాదుల కన్నా పని గురించిన సందేశాన్ని హెచ్చుగా ఇవ్వవలసిందని అడుగుతాను. ఒకవేళ జ్ఞానదేవుడు కలిసినా అదే అడుగుతాను’ అని.
బసవన్న దృష్టిలో పనికన్నా మించిన పాండిత్యం లేదు. కాయకష్టం చేసేవాడూ, నీతి నిజాయితీలతో పొట్ట పోసుకొనేవాడూ శివుడికి ఎక్కువ సన్నిహితుడని ఆయన నమ్మాడు. అందుకనే మాదార చెన్నయ్యని తనకు స్ఫూర్తిగా చెప్పుకున్నాడు. మాదార చెన్నయ్య చెప్పులు కుట్టుకునే వాడు. మొదటి వచన కారుడు. ఆయన అడుగుజాడల్లోనే బసవన్న వచన కారుడుగా మారాడని చెబుతారు. బసవన్న కవిత్వాన్ని మనం ఒక రాజ్యంగా భావిస్తే అది అది శివ భక్తుల రాజ్యం అన్నమాట ఎంత నిజమో, అది పూర్తిగా శూద్ర, దళిత, బహుజన రాజ్యం అన్నమాట కూడా అంతే నిజం.
31
చూడు, ఏతం కిందకి తలవాలుస్తుంది
అంతమాత్రాన గురువుకి భక్తుడు కాగలుతుందా?
చూడు, పట్టకారు రెండు చేతులూ జోడిస్తుంది
అంతమాత్రాన దాసుడనిపించుకుంటుందా?
చిలక ఎన్ని పలుకులు పలికితే మాత్రం
దైవమంటే ఏమిటో తెలుసుకోగలుతుందా?
కూడలసంగమదేవుడి శరణులు
నడిచే తీరు, నిలిచే తీరు
కామదేవమిత్రులెలా తెలుసుకోగలరు? (125)
32
వలపు లేని పూజ
బొమ్మలో కనిపించే సొగసు.
స్నేహం లేని మాట
చిత్రంలో కనిపించే చెరకు.
బొమ్మని హత్తుకుంటే సుఖమొస్తుందా
చిత్రం నమిలితింటే రసమొస్తుందా?
నిజంలేని వాడి భక్తి కూడా
అలాంటిదేనయ్యా
కూడల సంగమయ్యా (126)
33
స్నేహం తప్పిపోయాక
అక్కడింకా వెతుక్కుంటారా?
పువ్వు వాడిపోయాక
పరిమళాలు ఆఘ్రాణిస్తారా?
ఏట్లో నీళ్ళు తగ్గిపోయాక
జాలరి చేతికి
చిక్కేదేముంటుందయ్యా
కూడలసంగమయ్యా (127)
34
పాము కరిచిన వాడితో కూడా
మాట్లాడించగలం
గాలీధూళీసోకినవాళ్లని కూడా
పలకరించగలం.
సిరిగాలి పట్టినవాళ్లుంటారే
వాళ్ళని మాత్రం మాట్లాడించలేం.
భూతవైద్యుడిలాగా బీదరికం మీదపడి
ఉన్నదంతా ఊడ్చేసాక, అప్పుడయ్యా
కూడలసంగమ దేవా!
వాళ్ళకి గొంతుపెగిలేది! (132)
35
సగం సగం భక్తులుంటారు చూడు
వాళ్ళకి ఆ పక్కా ఉండకు
ఈ పక్కా ఉండకు.
కలిసి నడవకు
కలిసి మాటాడకు.
కూడల సంగముడి మనుషుల్తోనే
అచ్చంగా కలిసి బతికేవాడెవడుంటాడో
అతడికి నేను బానిసని. (133)
36
తప్పుపనులు చేసేవాడు
నీకో రాజ్యం రాసిస్తానన్నా
వాడిపక్కకి పోకు.
ఒక మాదిగ శివభక్తుడైతే
అతడికి పనిమనిషిగా బతకడం మేలు.
ఇంత ఆకూ ఆలమూ తెచ్చుకుని
ఉడకేసుకుని తిన్నా
కూడల సంగమశరణుల
బానిసగా బతకడం మరింత మేలు. (136)
37
తీరా పట్టం కట్టేసాక
అప్పుడు అర్హతులు వెతుక్కుంటారా?
శివశరణుణ్ణి గౌరవించుకున్నాక
అప్పుడు ఆయన కులమేమిటో ఆరాతీస్తారా?
నన్ను కొలిచినవాడి దేహమే నా దేహం
అన్నాడు కూడలసంగముడు
వినలేదా! (138)
38
దేవలోకం, మనుష్యలోకం అంటూ
వేరే వేరే ఉన్నాయా?
ఈ లోకంలోనే మరొక అనంతలోకం
శివాచారం, శివాచారమయ్యా
శివభక్తుడుండే చోటే శివలోకం
అతడి ఇంటిముంగిలి వారణాసి
అతడి కాయమే కైలాసం.
ఇదే కదా సత్యం
కూడలసంగమదేవా! (139)
39
చదివితే ఏమవుతుంది?
వింటే ఏమవుతుంది?
శివుడిగురించి తెలిసేదాకా
ఏం చదివినా చిలకచదువే.
నిజంగా చదివినవాడంటే
మాదార చెన్నయ్యనే కదా
కూడలసంగమదేవా! (143)
40
పాము వంకర పుట్టకు సరి
నది వంకర సముద్రానికి సరి
మన కూడలసంగముణ్ణి నమ్మినవాళ్ళ వంకర
లింగానికి సరి. (144)
26-11-2023
శుభోదయం sir,
అసలు సిసలు socialism బసవన్న వచనాల్లో నే
కనపడుతున్నది.
కాని మనం Das capital వెంట పడతాం.
అద్భుతం sir.
మీ అనువాదాలు ,మీ విశ్లేషణ అద్భుతం sir.
ధన్యవాదాలు మాష్టారూ!
నన్ను కొలిచిన వాడి దేహమే నా దేహం అన్నాడు కూడలి సంగముడు …వివరించడానికి ఎన్ని ఉదాహరణలు 🙏
ధన్యవాదాలు సార్