రాముడు కట్టిన వంతెన

Featured photo and this photo: PC: Wikicommons

రాముడు కట్టిన వంతెన కథ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనప్పుడు ప్రసిద్ధ కథకురాలు గోవిందరాజు సీతాదేవి ఫోన్ చేసి ‘వీరభద్రుడు గారూ, మీరు కథలు కూడా రాస్తారా!’అనడిగారు. కథ చదివిన ఆనందం, ఆశ్చర్యం ఆ ఫోను తీగల్లోంచి నన్ను చేరిన ప్రకంపనలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆ కథ చదివి తన సంతోషాన్ని పంచుకున్న మొదటిపాఠకురాలు ఆమెనే.

ఇన్నేళ్ళ తరువాత, కస్తూరి మురళీకృష్ణ గారు తాను సంకలనం చేసిన ‘రామకథాసుధ’ (2023) లో ఆ కథ ని చేరుస్తూ, తాను రాసిన ముందుమాటలో కూడా ఆ కథ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

మళ్లా ఇవేళ జీడిగుంట విజయసారథి గారు తాను ఆ కథని ఒక జూమ్ సమావేశంలో చదివివినిపించామని చెప్తూ ఆ లింక్ పంపినప్పుడు ఆసక్తిగా విన్నాను. ఆయన కథ చదివి వినిపించగానే ‘కథాకళ’ నిర్వాహకులు, మిత్రులు తమ స్పందనలు తెలియచేసినప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చినంతపనైంది. విజయసారథిగారికి, ఆ మిత్రులకి వినయపూర్వకంగా నమస్సులు చెప్పుకోవడమొక్కటే నేను చెయ్యగలిగింది.

కథాపఠనం, మిత్రుల స్పందనలు-మొత్తం 14 నిమిషాలకు మించని వీడియో. మీక్కూడా నచ్చుతుందని ఇక్కడ పంచుకుంటున్నాను.

https://youtu.be/8cve47hc0XA

21-5-2023

14 Replies to “రాముడు కట్టిన వంతెన”

    1. ధన్యవాదాలు రామ్ భాస్కర్!

  1. జీడిగుంట విజయసారథి గారు మీ రామసంబంధి కథను ఎంపిక చేసుకోవడం లోనే ఆయన సాహితీ
    వైదుష్యం తెలుస్తున్నది.వారి సాహిత్య ప్రసంగం మొదటిసారి హ్యూస్టన్ లో నెలనెలా తెలుగు వెన్నెల
    కార్యక్రమంలో 2017 లో విన్నాను. అదే సభలో నా పుస్తకం ఆవిష్కరణం జరగటం దాని పరిచయాన్ని నిర్వాహకుల కోరిక మేరకు నేనే చేసుకోవడం జరిగింది. ఆ తరువాత వారు మిత్రులుగా స్పందిస్తున్నారు ఎఫ్బీలో.
    కథ ఆసాంతం విని వాళ్ల విశ్లేషణలు కూడా విన్నాను.ఒక వైపు కథ వింటూనే కథను దృశ్యమానంగా చూస్తూనే కొన్ని సన్నివేశాలప్పుడు నన్ను మా ఊరి చిరుతల రామాయణానికి తీసుకువెళ్లటం,రామకథా ప్రభావంతో చాలాకాలం రామా నీదయ అనే వాక్యాన్ని ఊతపదంగా వాడానని గుర్తురావటం,అనేక రామనవములు ( రామనవమి నా జన్మదినం కనుక ఆ రోజెందుకో నాకు ప్రత్యేకం) కళ్లముందుకు రావడం, కొన్ని పందిళ్లలో ఇటీవల రాముని గురించి వ్యాఖ్యానం
    చేసిన సందర్భాలు నేనేం చెప్పాను రాముని గురించి అని ప్రశ్న తలెత్తడం, మీరు వేసుకుంటున్న ప్రశ్నలన్నీ నేను వేసుకోవడం ,మధ్యలో జీడిగుంటగారి వెనుక విశ్వనాథ కనిపించి what is Rama to me అన్న పుస్తకం తెచ్చుకుని ఇన్నాళ్లయ్యింది దాన్ని తెరిచావా అని అడగటం, అప్పుడే సదాశివ గారి నారాముడు అలభ్యం అన్న విషయం గుర్తుకు రావడం జరిగినా మీకథను ఎక్కడా మిస్ కాలేదు. పిల్లలు రామకథను నాటకం వెయ్యాలనుకుని వెయ్యకపోవడమనేదే ఇందులో గొప్ప శిల్పమనిపించింది. అన్నింటినీ వదిలేసిన రాముడు త్యాగ ఏకో గుణ శ్లాఘ్యః అన్న చాణక్య వాక్యానికి స్ఫూర్తిగా కనిపించినా ఎందరినో చేరదీసి ఆప్తుడుగా మారినా ఆయన కథ వెనుక సన్నని వేదన ఏదో మంద్రంగా సాగుతుంది. అసలు రామకథనే వేదనారమ్యము. చివరగా చెప్పేదొక్కటే సార్,కథ లోపల ఎక్కడో ఆలోచనాగ్నిని రగిలించింది. అది సమాధానాలను వెతుక్కునే దాకా ఆరదనిపించింది. ఇప్పుడు నాలో రాముడు ఒక ప్రశ్నారూపుడు. నమస్సులు.

    1. ఈ స్పందన అమూల్యం. అపురూపం. మీకు నా హృదయపూర్వక నమస్సులు.

  2. మీదైన వ్యక్తిత్వం మిమ్ములను ముందుకు నడిపిస్తున్నది.
    మీ కథల సాంద్రత అనితర సాధ్యం.
    కథలు అందరూ వ్రాస్తారు.
    కథ యొక్క మర్మాన్ని తెలిసిన మీరు వ్రాసే కథలు వేరు.
    రొటీన్ జానర్లో ఉండవు.
    గుంపులో గోవింద గా ఉండవు.
    మీరు ఆ లైం లైట్ లోనే ఉండరు.
    మీదైన గాంభీర్యం – మీ కథలకు కూడా వన్నె తెస్తోంది.
    కథ లోని ఔచిత్యాన్ని పాఠకుడు పట్టుకునే లా చేయి పట్టుకొని తీసుకు వెళ్తారు.
    రాముడు కట్టిన వంతెన అద్భుతంగా వ్రాశారు.
    చర్వితచర్వణం గా అట్టే రాముడి గురించి చెప్పకుండా, కొత్త కోణంలో హేతుబద్దంగా రాముడిని పునర్నిర్మించారు. అందర్నీ a దిశగా ఆలోచింప చేశారు.
    సంప్రదాయ భావాలను అట్టే ఒప్పుకొని మీ స్వగతం హేతువాదులను కూడా ఆలోచింప చేస్తుంది.
    బాలన్స్ తప్పకుండా మీరు రాముడి ఔన్నత్యాన్ని
    ప్రజల గుండెల్లో పొదువు కున్న వైనాన్ని ఔచిత్యం చెడకుండా చెప్పారు.
    మీ గాంభీర్యంలోని లాలిత్యం, ఔచిత్యం ఎన్నదగినవి.
    నమస్కారం అండి.
    ఇంత మంచి కథ అందించినందుకు.

    1. ఎంతో అమూల్యమైన, విలువైన మీ స్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  3. చిన వీరభద్రుడు గారు, మీ కుటీరం లో నాకు ఈ విధమైన ఆతిథ్య సత్కారం ఇవ్వడం నిజంగా ఎంతో ఆనందంగా వుంది. I feel really Honored and find myself short of words to express my gratitude for this.

    1. అవి నేను చెప్పవలసిన మాటలు.

  4. శ్రీ రాముని శీల నిర్మాణం లో ఒక క్రొత్త కోణం.
    వారు స్వజనాన్ని వదులు కున్నాడా !!

    కలిసిన ప్రతి ఒక్కరినీ తన స్వజనం లో కలుపుకున్నారు. చివరికి రావణ కుంభకర్ణులకు మోక్షమివ్వడం ద్వారా!!
    రాముడు కట్టిన వంతేన సామాన్యమైనదేమి కాదు. ప్రతి ప్రాణికీ ప్రాణికి మధ్యన కట్టిన స్నేహపు
    వారధి.
    స్వజనాన్ని, స్వగ్రామాన్ని వదిలేసిరావడం ఎంత బాధాకరమో !!

    మా వూరిలో నేను కట్టుకున్న ఇంటిని ఖాళీ చేసి హైదరాబాద్ కు వచ్చినపుడు నా మనస్సు మౌనంగా ఎంత రోదించిందో మాటల్లో చెప్పలేను.
    కేవలం ఇల్లే కాదు,నా బాల్యాన్ని,నా చిన్న నాటి స్నేహితుల్ని వదలి ఇంత దూరంగా రావలసి వచ్చినందుకు నిజంగానే రోదించింది.

    మీరు మీ వూరు ను వదిలేశారు. నిజంగా వదిలేశారా!!నేనైతే నమ్మను! ఆ కొండ కింది పల్లె మీ హృదయం లో కొలువై ఉండగా వదిలేయడ మన్న ప్రసక్తి లేనే లేదు. కేవలం భౌతికంగా నే వదిలేశారు.
    అయితే కలిసిన ప్రతి మనిషి ని శ్రీరాముని లాగే
    మీ స్వజనం లాగా మార్చేసుకొనే మహేంద్రకాలాన్ని మీ అక్షరాలకు ఒంట పట్టించారు. ఇప్పుడు మీ రచనలను చదివే పాఠక జనం అంతా , మీ కార్యనిర్వహణ లో లబ్దిని పొందిన జనం అంతా మీ స్వ జనమే.

    వైవిధ్యం తో కూడుకున్న 5గురు సోదరుల జంటలను గురించి ప్రస్తావించారు. శ్రీరామ లక్ష్మణులు,మారీచ సుబాహులు,జటాయువు సంపాతి, వాలి సుగ్రీవులు ,రావణ కుంభకర్ణులు.
    అందరూ శ్రీరామ చంద్ర ప్రభువు వల్ల తరించిన వారే.

    మీ కథల పుస్తకానికి ఇంకా నేను నోచుకోలేదు. తప్పకుండా కొని చదువుతాను.

    సృజనాత్మకత కు అద్దం పట్టిన కథ “రాముడు కట్టిన వంతెన”.
    ధన్యవాదాలు sir.

    1. ప్రేమ పూర్వకమైన మీ స్పందనకు నా హృదయపూర్వక నమస్సులు!

  5. శుభోదయం sir.
    మళ్ళీ ఈ శుభోదయాన మీ “రాముడు కట్టిన వంతెన చదవాలనిపించింది.

    రాముడు భరతుడు ,మారీచ సుబాహులు, సంపాతి జటాయువు, వాలి సుగ్రీవులు,రావణ విభీషణులు.
    ఈ అన్నదమ్ముల మధ్యన గల పోలికలను ఇంకా కొద్దిగా వివరిస్తే
    మా బోటి మందబుద్దులకు అంతరార్థాన్ని పట్టుకొనే అవకాశం లభించి ఉండేది.
    రామాయణమంతా మరింత శ్రద్ధతో చదివితే కాని వీరి మధ్యన సామ్యభేదాల జ్ఞానం కలుగుతుందేమో,
    శ్రీ భాష్యం అప్పలాచార్య వారి శరణు కోరడమే తప్ప వేరొక మార్గం లేదు.మళ్ళీ ఒకసారి రామాయణం అంతా వింటాను వారి ముఖతః.
    ధన్యవాదాలు Sir.

    1. శుభోదయం. అప్పలాచార్యుల వారి శుశ్రూష తప్పకుండా మీకు సాంత్వన కలిగిస్తుంది.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%