IT’S JUST A LEAF AWAY

Reading Time: 2 minutes
రాజమండ్రిలో ఉన్న ఆ అయిదేళ్ళూ నా ప్రధాన వ్యాపకం ఉద్యోగం, సాహిత్యం కాదు, ఉత్తరాలు రాయడం. కొన్ని వందల ఉత్తరాలు రాసి ఉంటాను, కవులకీ, రచయితలకీ, మిత్రులకీ, ముఖ్యం మిత్రురాళ్ళకీ. ఆ ఉత్తరాలు ఏదో ఒక కవితతో మొదలుపెట్టేవాణ్ణి. తరచూ నా కవితలే. అలా ఉత్తరాల్లో రాసుకున్న కవితలకి నేనెప్పుడూ కాపీలు రాసి పెట్టుకోలేదు. తర్వాత రోజుల్లో నిర్వికల్ప సంగీతం పుస్తకం వేద్దామనుకున్నప్పుడు మళ్ళా ఆ మిత్రుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గర నా ఉత్తరాలేవన్నా భద్రంగా ఉంటే, ఆ కవితలు మళ్ళా రాసుకుని తెచ్చుకున్నాను. కానీ చాలా కవితలు ఆ ఉత్తరాలతో పాటే గాల్లో కలిసిపోయేయి.
 
ముఖ్యంగా ఒక మిత్రురాలికి ఏకపక్షంగా రాసిన ప్రేమలేఖలు. ఎన్ని కవితలు రాసి ఉంటానో. వాటిని ఆమె భద్రంగా దాచుకుంటుందని, ఎందుకనో, ఒక అమాయికమైన ఊహ. కాని ఆమె వాటిని చింపివేసిందని తెలిసాక, నేను చెయ్యగలిగిందల్లా మరో కవిత రాసుకోవడమే. మరొకామెని ఏకపక్షంగా ఆరాధిస్తో, ఉత్తరాలు కాదు, ఏకంగా ఒక పుస్తకం నిండా ఉత్తరాలు రాసి పంపించేను. ఆమె వాటన్నిటినీ చదివి, నన్ను పిలిచి, మందలించి, ఆ పుస్తకం మళ్ళా మర్యాదగా నాకు వెనక్కి తిరిగి ఇచ్చేసింది.
 
పద్మరాజుగారు రాసిన ‘ఎదురు చూస్తున్న ముహూర్తం ‘ కథలో లాగా, ఆ రోజుల్లో, ఏదో అద్భుతం సంభవిస్తుందని ఎదురుచూసేవాణ్ణి. ప్రతి రోజూ పోస్ట్ మాన్ కోసం ప్రతీక్షించేవాణ్ణి. దేనికోసం? చెప్పలేను. ఉత్తరాలకు జవాబు కోసమా? కాదనకుంటాను.
 
అది ఒక నిరీక్షణ. మధ్యయుగాల భక్తికవులు అది భగవంతుడి అనుగ్రహం కోసం నిరీక్షణ అని ఉండేవారు. రొమాంటిక్ కవులు దాన్ని ఒక పరితాపంగా గుర్తించి ఉండేవారు. అస్తిత్వవాదులు దాన్ని మన being తాలూకు dread నుంచి తప్పించుకోడం అని ఉండేవారు. తర్వాత రోజుల్లో పోస్ట్ మాడర్నిస్టుల రచనలు చదివాక, అది absence ద్వారా presence ని గుర్తించే చుట్టుతిరుగుడు ప్రయత్నమేమో అని కూడా అనుకున్నాను.
 
 

నిరీక్షణ గురించి గీతం

 
బాట మలుపులో నుంచి శైశిర సౌరభం
మత్తుగా జీడిమామిడి పువ్వుల గాలి.
 
సాయంకాలం ధూళి రేగుతోన్న పొలాలమీద
వలలు విసుర్తో చీకటి.
 
కొంగలు గూళ్ళకి మళ్ళుతున్నాయి
బంజర్లలో ఆవులు నెమరేస్తున్నాయి
ఇళ్ళ అరుగుల మీద వీధి దీపాలు వెలుగుతున్నాయి,
అలిసిన బాటసారుల కోసం ఆతిథ్య గీతాలు వినిపిస్తున్నాయి.
 
కాలం ఏటినీటిమల్లే జారిపోతూండగా
నేను మటుకు ఒంటరిగా
వికసిత శోణ పద్మం
రేకలు ముకుళితం కావడం చూస్తో-
 
హృదయాంబుజార్పణకై
ప్రతీ దినాంతం
నేను ఇలాగే నిరీక్షిస్తో-
 
4-2-1983
 

AWAITING: A POEM

 
Near the bend in the road,
The fragrance of late autumn fills the air.
 
Cashew-nut trees in bloom spray a scent.
Darkness casts her net wide open,
 
At dusk, on dusty fields.
In the marsh, cranes return.
In the meadows, cattle still graze.
Houses are lit with lamps,
Welcoming the tired travellers with a song.
 
Time flows by like a stream.
Full-blown lotus petals in pink
Shrink inward.
 
Every evening,
I wait here with my heart open.

 

అన్వేషణ గురించి గీతం

 
అభ్యర్థించుకోగలను
అంతే, అంతకు మించి ఏమివ్వగలను?
 
కదుల్తున్న శిబిరాల్లో
అనిశ్చిత సంబంధాల వలయాల్లో
తారసపడి తప్పుకుపోతున్న
అపరిచిత ముఖంలో
ఎక్కడో ఒక ఆధారం.
 
ఒక్కణ్ణీ నాకెదుట పడినప్పుడు
ప్రశ్నించుకుంటాను
నిన్ను నువ్వు గుర్తుంచుకోవడానికి
అంత ప్రయాస ఎందుకని.
 
ఒక చిగురు ఆధారంగా
ప్రతి ఒక్కసారీ వసంతాన్ని ఊహించలేం.
ఊహలు ప్రపంచ పరిభాషలో
దురూహలై తరిమివేయబడతాయి.
 
కాని యథార్తానికి
వసంతాన్ని గుర్తించడానికి
ఎప్పటికయినా చిగురే ఆధారం.
 
27-7-1984
 

IT’S JUST A LEAF AWAY

 
I could only ask,
What more could I give?
 
Among the ever-shifting circles,
Among uncertain relationships,
An unfamiliar face appears and disappears quickly.
Leaving a hint, perhaps.
 
Every time I see myself,
I wonder:
Why do I struggle so much
In search of myself?
 
We may not expect spring every time
From the sheen of a single sprout.
When you let your imagination run wild,
You’re hunted down by the outside world.
 
Yet, an offshoot tells us not to stray and
Spring is only a tender leaf away.
 
1-7-2022

Leave a Reply

%d bloggers like this: