మోహనరాగం: తిరుప్పావై

నెలకు నాలుగు వానలు కురవాలనీ, ఆ నీళ్ళల్లో మీనాలు నిలువెత్తున ఎగిరి పడాలనీ, పాడిపంటలు పొంగిపొర్లే దేశంలో తాము భగవంతుడితో కలిసి విందు ఆరగించాలనీ కోరుకున్న ఒక అద్వితీయ శుభాకాంక్ష తిరుప్పావై. ఆండాళ్ కవిత్వ విశిష్ఠతను వివరిస్తున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.

పాడిపంటలు పొంగిపొర్లే దారిలో

పన్నెండుమంది ఆళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ (క్రీ.శ.9 వశతాబ్ది) రచించిన తిరుప్పావై భారతీయసాహిత్యంలోని అత్యంతవిలువైన కృతుల్లో ఒకటి. తదనంతరసాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసిన రచన. అక్కమహాదేవి, మీరా, లల్ల, మొల్ల వంటి ప్రాచీనకవయిత్రులతో పాటు సరోజినీనాయుడు, తోరూదత్, మహాదేవీవర్మవంటి ఆధునిక కవయిత్రులదాకా ఎందరో భావుకులకూ, రసపిపాసులకూ, జీవితప్రేమికులకూ ఆండాళ్ దే ఒరవడి.