రెండు ముల్లై కవితలు

23

ఇరవయ్యేళ్ళకిందట చైనా కవిత్వాన్ని మొదటిసారి చదివినప్పుడు చాలా ఏళ్ళే నేనో విభ్రాంత లోకంలో గడిపాను. కాని పదిపదిహేనేళ్ళ కిందట మొదటిసారి ఎ.కె.రామానుజన్ ‘పొయెమ్స్ అఫ్ లవ్ అండ్ వార్’ చదివినతరువాత చీనా కవిత్వంకన్నా ప్రాచీన కవిత్వం మన పక్కనే వికసించిందని తెలిసినప్పటినుంచీ ప్రాచీన తమిళ సంగం కవిత్వానికి నేను గాఢాభిమానిగా మారాను.

ఒకప్పుడు మధురై కేంద్రంగా సాహిత్యసంఘమొకటి క్రీస్తుపూర్వం ఐదవశతాబ్దం నుంచి క్రీస్తు శకం రెండవశతాబ్దందాకా వికసించిన ఎంతో కవిత్వాన్ని విని, రత్నపరీక్ష చేసి సంకలనాలు గా కూడగట్టింది. ఎనిమిది కవితాసంపుటులు, పది దీర్ఘకవితలుగానూ సంకలనమైన 2381 కవితలు నేడు మనకి లభ్యమవుతున్నాయి.

తమిళతాతగా పిలవబడే యు.వి.స్వామినాథ అయ్యర్ వల్ల ఆ ప్రాచీన సాహిత్యం ఇరవయ్యవ శతాబ్దిలో తక్కిన ప్రపంచానికి పరిచయమయ్యింది.

సంగం కవిత్వాన్ని ప్రాజెక్టు మధురై పేరిట మొత్తం డిజిటైజ్ చేసారు. మొబైల్ ఫోన్లలో మెసేజిగాపంపుకునే ఏర్పాటు కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అనువాదాలు వచ్చాయి, వస్తున్నాయి.

వాటిలో ఇటీవల వచ్చిన చక్కని అనువాదాలు ‘ద రాపిడ్స్ ఆఫ్ ఎ గ్రేట్ రివర్ ‘ (పెంగ్విన్,2009), ‘లవ్ స్టాండ్స్ అలోన్’ (పెంగ్విన్,2010). కాదు, ఈ కవిత్వాన్ని వెంటనే రుచిచూడాలనుకున్నవాళ్ళు  www.sangampoemsinenglish.wordpress.com చూడవచ్చు.

ఆకాశమంతా మబ్బు కమ్మిన ఈ రోజుల్లో సంగం కవిత్వంలో అకం సంప్రదాయానికి చెందిన ముల్లై కవితలు గుర్తురావడంలో ఆశ్చర్యమేముంది?

ముల్లై అంటే అడవిమల్లె పువ్వు. ప్రణయంలో ఓపిగ్గా ఎదురుచూడటానికి అది సంకేతం. అకం కవిత్వం ఎంచుకున్న అయిదు ప్రణయస్థలాల్లోనూ ముల్లై అడవికీ, వానాకాలానికీ, సాయంకాలానికీ సంకేతం. ముల్లై కవితల్లో ప్రసిద్ధి చెందిన దీర్ఘకవిత ముల్లైప్పాట్టు గురించి నేనింతకు ముందే చినుకు పత్రికలో రాసాను.

అందుకనిప్పుడు వేరే రెండు కవితలు మీ కోసం:

1

ఆమె అన్నది:

సూర్యుడు అస్తమించినప్పుడు
ఆకాశం ఎర్రబడ్డప్పుడు
దిగులు ఆవరించినప్పుడు
ముల్లై మొగ్గ విప్పుకున్నప్పుడు
సాయంకాలమవుతుందంటారు,
వాళ్ళకు తెలీదు

ఈ రాచనగరులో కోడికూసినప్పుడు
ఈ దీర్ఘరాత్రి ఎట్లాగైతేనేం
తెల్లవారినప్పుడు కూడా
సాయంకాలమే.
అసలు మధ్యాహ్నం కూడా
సాయంకాలమే,

పక్కనెవరూ లేనివాళ్ళకి.

(మిలైప్పెరున్ కంఠన్, కురుంతొగై,234)

2.

ఒక భార్య తన మిత్రురాలితో అన్నది:

నేస్తమా, మల్లెమొగ్గల్లాంటి
పలువరుసదానా,
నాకో మాట చెప్పు:

నా భర్తవెళ్ళిన దూరదేశంలో
తొలకరివానలుండవా?

తోగాడే మేఘాలు,
ఉరుములు మెరుపుల్లాంటి
ప్రాణం తీసే ఆయుధాలక్కడి
ఆకాశంలో కదలాడవా?

(మారన్ పొరయనార్, అయింతిణై, అయింపాట్టు,3)

16-7-2013

 

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading