జీవన శిల్పి-13

మిత్రులూ, స్థానికంగా ఉండే పరిచయస్థులూ రాగానే గురూజీ వెదురుపొదల దగ్గరనుంచి లేచి ప్రార్థనాస్థలం ఎదురుగా ఉండే వేపచెట్టుదగ్గరికి వెళ్ళారు. ఆ వచ్చినవాళ్ళంతా ఆ చెట్టునీడన కూచున్నారు. కుర్చీ, బల్ల, స్టూలు, మోడా, మంచం-ఏదుంటే దానిమీద కూచున్నారు. ఒకరిద్దరు దూరంగా ప్రార్థనామందిరం పంచన కూచున్నారు. ఆ వేపచెట్టునీడన వాలు చెక్క కుర్చీలో గురూజీ కూచున్నారు.

అప్పటికి బాగా చల్లబడింది. వేసవి సాయంకాలపు దక్షిణపు గాలి మెత్తగా వీచడం మొదలుపెట్టింది. ఈలోపు ఎవరో గురూజీ ఇంటికి వెళ్ళి అందరికీ టీ తీసుకొచ్చారు. సాధారణంగా సాయంకాలాలు అక్కడే ఒక గోష్ఠి నడుస్తూ ఉంటుంది. అవాళ కూడా ఎవరో ఏదో ఒక విషయం మీద ప్రస్తావన మొదలుపెట్టబోయారుగానీ, మరొకరెవరో, పొద్దుణ్ణుంచీ గురూజీ మాటల రికార్డింగు నడుస్తోందని చెప్పారు. గ్రామీణ చేతివృత్తుల వారి గురించీ, ఒకప్పుడు పల్లెల్లో ఉండే స్థానిక సాంకేతిక పరిజ్ఞానాల గురించీ, లోకల్ మార్కెట్ గురించీ  గురూజీ చెప్తున్నారని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అప్పటికి ఆ మాటలు చాలా సార్లు వినే ఉంటారు. అయినా కొత్తగా ఎవరో ఒకరు ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. మళ్ళా గురూజీ వాళ్ళకి కొన్ని కొత్త విషయాలు చెప్పడం మొదలుపెడతారు. అలానే అవాళ కూడా, వాళ్ళల్లో ఒకరు ‘గురూజీ, ఈ ఓఝాలున్నారు కదా, వీళ్ళ సామాన్లు బయట అమ్ముడుపోవా? బయటికి పట్టుకుపోయి అమ్మితే మస్తు పైసలొస్తయి కదా’అన్నారు.

నేను గురూజీ కేసి చూసాను. గురూజీ ఒక బీడీ ముట్టిస్తున్నారు. ఆయన ఏదో పెద్ద కథ చెప్పడానికి ఉపక్రమిస్తున్నారనిపించింది. నా చేతుల్లో ఉన్న రికార్డరులో కొత్త కాసెట్టు ఎక్కించాను.

గురూజీ చెప్పడం మొదలుపెట్టారు: ‘ ఓఝాలంటే ఇత్తడిపోత పోసే ఒక సమాజం. వీళ్ళు అందమైన వస్తువులు సృష్టిస్తారు. అంటే దానర్థం, వాళ్ళల్లో ఒక సౌందర్యదృష్టి ఉందని. శతాబ్దాలుగా వాళ్ళు దాన్నమ్ముకునే బతుకుతున్నారు. అది నష్టాలొచ్చే పనైతే అమ్ముకుంటూ ఉండరు కదా. అంటే దానర్థం, వాళ్ళల్లో  ఒక వ్యాపార దృక్పథం కూడా ఉందని. తాము  చేసిన దాన్ని నష్టానికి అమ్మకూడదంటే, ఏది ఎంతకు తయారైంది, దానికి ఎంత ధర పెట్టాలి లాంటి లెక్కలు వేసుకుంటున్నారనే కదా, ఆ లెక్కలు వాళ్ళకి తెలుసనే కదా.’

‘కానీ ఈ రెండు దృక్పథాలూ కూడా ఒక ఓఝా  సొంతజీవితానికి పనికిరావు. వాడి ఇల్లు చాలా మురిగ్గా ఉంటుంది. సాయంత్రానికి  రొట్టె, మిరపకాయ తప్ప తినడానికి ఇంకేమీ ఉండదు. ఇదెక్కడి గందరగోళం? సౌందర్య దృష్టి ఉంది, వ్యాపార దృక్పథం కూడా ఉంది. కాని అవి వాడి సొంతజీవితానికి ఎందుకు ఉపయోగపడటం లేదు? వాడు ఈ రోజు ఎంత సంపాదించినా, రేపటికి మళ్ళీ అంతా ఖాళీ.’

‘ఓఝాలు మొదట్లో గోండులకోసం, కొలాముల కోసమే పనిచేసేవారు. బయట మార్కెట్ ఏదీ ఉండేది కాదు. ఒక ఓఝా ఒక గోండు లేదా కొలాం గ్రామంలో ఉంటూ, ఇరవై గ్రామాల మార్కెట్ చూసుకునేవాడు. వెళ్ళేవాడు, తయారు చేసింది ఇచ్చి వచ్చేవాడు. మైనం తీసుకురావడం, ఇత్తడి తీసుకురావడం, తయారు చేసి తీసుకు వెళ్ళి ఇవ్వడం, ఇచ్చిన తరువాత వాళ్ళు ధర ఇవ్వడం-ఇలా ఇరవై గ్రామాల మార్కెట్ ఉండేది వాడికి.’

‘నేను వాళ్ళ దగ్గర ఈ పని నేర్చుకున్నప్పుడు వీళ్ళు ఎలానూ కారిగర్లు కదా, వీళ్ళని కళాకారులుగా మార్చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. వీళ్ళు స్వతహాగా పనితెలిసినవాళ్ళు. ఎలానూ సొంత లోకల్ మార్కెట్ ఉంది. అయితే వీళ్ళకి కూడా కొన్ని ఆధునిక సదుపాయాలు కావాలి కదా. వాళ్ళు వాటిని కొనుక్కోవాలంటే దానికి అదనంగా  డబ్బు కావాలి. అది బయటినుంచే రావలసి ఉంటుంది. తమకి ఏర్పాటై ఉన్న లోకల్ మార్కెట్ మీంచి వాళ్ళు ఆహరం తప్ప అదనంగా ఏమీ సంపాదించుకోలేరు. కాబట్టి వీళ్ళను కళాకారులుగా మార్చేద్దాం అనుకున్నాను.’

‘జహంగీర్ ఆర్ట్ గాలరీ ఉంది, అలాంటివే మరికొన్ని స్థలాలు కూడా ఉన్నాయి. అక్కడ వీళ్ళ పనుల్తో ఒక ఎగ్జిబిషన్ పెట్టించవచ్చు. ఆ ఉద్దేశ్యంతో పని నేర్పించాను. అంటే మాడ్రన్ ఆర్ట్ నేర్పించాననా? (నవ్వుతూ) ఆ అవసరంలేదు. ఎందుకంటే, వాళ్ళు ముందే కళాకారులు.వాళ్ళు కూడా చాలాసార్లు నన్నడిగేవారు  ‘గురూజీ, మాడ్రన్ ఆర్ట్  అని దేన్నంటారు?’అని.  నేను వాళ్ళకి ఒకసారి బాగా అర్థమయ్యేలా చెప్పాను: ‘చూడండి, మీరు ఈ సింహం బొమ్మ చేస్తున్నారు కదా, ఇది సింహమేనా?’ అంటే, ‘అవును, ఇది సింహమే’ అన్నారు. ‘ఇది గుర్రం.  కానీ, సింహం ఇలా ఉంటుందా? లేదు, సింహం అలా ఉండదు, దానికి ఇంత లావు కాళ్ళు ఉండవు. గుర్రం ఇలా ఉంటుందా? గుర్రం కూడా అలా ఉండదు. మరిది గుర్రం కాదా? గుర్రమే. ఇదే మాడ్రన్ ఆర్ట్. ఇంకేమీ లేదు. మీరు దానికున్న కొన్ని ప్రత్యేక లక్షణాల్ని పట్టుకుని ఆ ఆకారాన్ని తయారుచేస్తున్నారు. కాబట్టి దీన్ని గుర్రమనే అనాలి, అది గుర్రంలా లేకపోయినా గుర్రమే. ఇది సింహంలా లేకపోయినా ఇది సింహమే. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన ఫీచర్స్ పట్టుకుని చేసినప్పుడు దాన్ని అదే అనాల్సి వస్తుంది. దానికంటే భిన్నంగా దాన్ని పిలవలేం  కదా. కాబట్టి మీలో ఇలాంటి  పరిశీలన ఉందంటే  ఇదే కళ. ఇంతకుమించి మరేముంటుంది?’

‘అప్పుడు నా దగ్గర ఒక పదివేలున్నాయి.  ఈ ఓఝాలు చిట్టాల్ బోరి కి చెందినవాళ్ళు. నగరానికి దగ్గరగా ఉండటం  వల్ల వాళ్లపిల్లలందరూ కట్టెలమ్మడం మొదలుపెట్టారు. అందులో జ్ఞానేశ్వర్ అని ఒకడుండేవాడు. చాలా మంచి  పనివాడు. వాడు రోజూ కట్టెలమ్ముకున్న తరువాత నా దగ్గరకొచ్చి కూచోమనేవాణ్ణి. ఆ రోజుల్లో రోజుకూలి పది రూపాయలుండేది. ఆ రకంగా మేము చాలా పనులు చేసాం. చాలా అందమైన వస్తువులు తయారు చేసాం. కానీ పదివేలు ఎంతకాలముంటాయి? అయిపోయాయి. ఈలోపు  జహంగీరు ఆర్ట్ గాలరీకి ముందే చెప్పి ఏర్పాట్లు చేసి ఉంచాను. ముంబైలో ఎగ్జిబిషన్ పెడితే ఈ కళాకారులందరూ లైన్లోకి వచ్చేస్తారు. అక్కడ ధరలు వేరే ఉంటాయి. రెండేళ్ళకొకసారి ఒక ఎగ్జిబిషన్ పెడితే చాలు వీళ్ళకి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అవునా? గ్రామంలో ఎలాగూ మార్కెట్ ఉంది. అది వీళ్ళకి ఆహారం లాంటిది. బయట మార్కెట్ బంగారం లాంటిది. ఏదైనా సదుపాయం కోసం ఉపయోగపడుతుంది అనుకుని పదివేలతో వస్తువులు తయారుచేసాం. ఆ తర్వాత డబ్బు ఏర్పాటు కాలేదు. వీళ్ళంతా పనుల్లోనే ఉన్నారు.’

‘ఇంతలో హాండీ క్రాఫ్ట్స్ డైరక్టరు అదిలాబాద్ వచ్చారు. వచ్చి ఈ ఓఝాల కోసం ఒక సొసైటీ ఏర్పాటుచేసే విషయం మాట్లాడారు. ఓఝాల సొసైటీ. అలాంటి సొసైటీల ఏర్పాటుకి నేను చాలా వ్యతిరేకం. కానీ వీళ్ళందరూ నాతో ‘గురూజీ, కానివ్వండి, ఇప్పుడే కదా, అభివృద్ధి చెందే అవకాశం వచ్చింది, ఇలా ఎంతకాలం వెనకబడి ఉంటాం?’ అనడం మొదలుపెట్టారు. ‘అయ్యా, ఈ సొసైటీలు చాలా ప్రమాదకరమైన విషయాలు. మీరు అర్థం చేసుకోవడం లేదు ‘ అన్నాను. ‘లేదు గురూజీ, చేద్దాం’ అన్నారు. ‘సరే, మీకు నచ్చినట్టే చెయ్యండి’ అన్నాను.

‘అలా జంగుబాయి సొసైటీ ఏర్పాటయింది. ఎక్కడ? ఊషేగావ్ లో. దానివల్ల జరిగిందేమంటే ఇరవై గ్రామాల ఓఝాలూ  ప్రజలు వచ్చి రెండు గ్రామాల్లో చేరిపోయారు. ఒకప్పుడు వాళ్ళంతా  గిన్నెధరిలో, గాదిగూడలొ, ఇంకెక్కడో, మరెక్కడో ఉండేవారు. ఎవరి స్థలాల్లో వాళ్ళుంటూ తమ తమ ఇరవై గ్రామాల మార్కెటు చూసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు సొసైటీ పేరుచెప్పి మొత్తమంతా రెండు గ్రామాల్లోకి చేరిపోయారు.’

‘వీళ్ళు గోండుల గ్రామంలో ఉన్నప్పుడు గోండుల పటేల్ వీళ్ళ పటేల్. గోండుల దేవుడు వీళ్ళ దేవుడు. కొలాముల గ్రామంలో ఉంటే వాళ్ళ పటేల్ వీళ్ళ పటేల్. వీళ్ళు కూడా ఆ వ్యవస్థలో భాగంగా బతికేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళంతా ఒకదగ్గరికొచ్చి కలిసి బతకడం మొదలుపెట్టారో వీళ్ళకి పటేల్ అనే వాడు లేడు. మహాజన్ అనేవాడు లేడు. వీళ్ళంతా తమకు తామే రాజులైపోయారు. ఎటువంటి సంచాలనం లేదు. తాగడం, దెబ్బలాడుకోడం, గొడవలు పడటం మొదలయ్యింది.’

‘కానీ వీళ్ళ కోసం బయట మార్కెట్ తలుపులు తెరుచుకున్నాయి. అందులో జ్ఞానేశ్వర్ అందరికన్నా మంచి పనివాడు. అటువంటి పనివాడితో పనివాడి పనే కదా చెయ్యనివ్వాలి. వీళ్ళేమో వాణ్ణి బయట తిప్పడం మొదలుపెట్టారు. వాడు సామాన్లు తీసుకుని చండీగఢ్ వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు, బెంగుళూరు వెళ్తున్నాడు, ఎగ్జిబిషన్లకు వెళ్తున్నాడు. ఇక వాడు కూడా తాగడం మొదలుపెట్టాడు.’

‘సొసైటీ ఏర్పడకముందు వీళ్ళు ఎవరికి వారు ఏదో ఒక గ్రామంలో ఉంటూ ఇరవై గ్రామాల మార్కెట్ చూసుకునేవాళ్ళు- ఘుంఘ్రూలు తయారు చేయడం, దేవుడి పూజాసామగ్రి తయారు చేయడం లాంటివి చేస్తూండేవారు. వీళ్ళు సొసైటీగా ఏర్పడ్డాక వారి ప్రాథమికమైన మార్కెట్ ముగిసిపోయింది. అదున్నప్పుడు వీళ్ళు గ్రామాలకు వెళ్ళేవాళ్ళు, ప్రజల దగ్గరనుండి అది చేయించి తెచ్చేవాళ్ళు, ఇది చేయించి తెచ్చేవాళ్ళు. సొసైటీ వచ్చాక ఇత్తడి గిత్తడి తీసుకువెళ్ళడం, మళ్ళీ ఈ మెటీరియల్ తీసుకువచ్చి పని చేసి సొసైటీకి ఇచ్చేయడం. గ్రామాలకు వెళ్ళడం మానేసారు. గ్రామాలకు వెళ్తే గ్రామాల ప్రజలు కొట్టడం దాకా పరిస్థితి వచ్చింది. గ్రామాల్తో ఉన్న సంబంధం మొత్తం తెగిపోయింది వీళ్ళకి.’

‘నేను వీళ్ళకి ‘ అన్ని సమాజాల్లోనూ మన సొంత వస్తువు, మన సంప్రదాయం ఒకసారి దూరమైతే దాని గురించి ఎవరూ బాధపడరు. అటువంటి రోజులివి. దాన్ని కాపాడుకోవాలని కూడా అనుకోరు. ఒకసారి ఆ సంబంధం తెగిపోయిందా, వదిలేస్తారు, మళ్ళీ దగ్గరవరు’ అని పదే పదే చెప్తూ ఉండేవాణ్ణి.

ఇప్పుడు  కాలమంతా ఇలాగే నడుస్తోంది. ప్రతి ఒక్క సమాజం తన సంప్రదాయాలను ఇలానే వదిలేసుకుంటోంది. ఇప్పుడు మట్టి ప్రమిద కావాలి, మట్టిప్రమిద కోసం వెతుకుతారు. ఒక వేళ అది దొరకకపొతే ఈ గిన్నెలోనో మరెందులోనో దీపం పెట్టేసుకుంటారు. ఇంక మట్టి ప్రమిద జోలికి వెళ్ళరు. అవునా? ఇప్పుడు సంప్రదాయాలు విరిగిపోయే సమయం నడుస్తోంది. ‘కాబట్టి మీరు మీ మార్కెట్ ని పాడుచేసుకోకండి. ఎందుకంటే ముందుముందు గోండుల తరం మిమ్మల్ని గుర్తించదు. మీతో వాళ్ళకి ఎలాంటి సంబంధమూ ఉండదు. మీరు వాళ్ళ సాంప్రదాయిక సామగ్రిని దేన్నైతే తయారు చేసేవారో, అది ముగిసిపోతుంది. వాళ్ళింక దాన్ని కోరుకోరు’ అని చెప్పేవాణ్ణి.

సొసైటీ పెట్టి వీళ్ళేం చేసారంటే బస్తర్ నుంచి ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. వీళ్ళకి పని నేర్పించడానికి. గణేష్ రాం వాడి పేరు. నేను చాలా వారించాను. ‘అయ్యా, వీళ్ళకంటూ ఒక డిజైన్ ఉంది. దాని గురించి ఆ కొత్తపనివాడికేం తెలుసు? వీళ్ళకి టెక్నిక్ కూడా తెలుసు. వాడు వీళ్ళకేం నేర్పిస్తాడు?’ అని. ‘లేదు, లేదు, కొత్త డిజైన్లు. ..’ అన్నారు. ఇకేముంది? వాడు వీళ్ళ శైలిని పాడు చేసాడు. ఇప్పుడు వీళ్ళకంటూ సొంతశైలి ఏదీ మిగల్లేదు పనిలో. బస్తరు శైలి, ఇక్కడి శైలీ అన్నీ కలిసి కిచిడీ అయిపోయాయి.’

‘ఆ తర్వాత వీళ్ళు హైదరాబాద్ వెళ్ళడం, లేపాక్షి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం- ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళు. వాళ్ళు మూడు నెలల తర్వాత డబ్బులిచ్చేవాళ్ళు. అది కూడా చెక్కులిచ్చేవాళ్ళు. మూడునెలల తర్వాత డబ్బులొచ్చేవి. దాంతో వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది.’

‘ఈలోపు ఈ ఓఝాలు ఒకరితో ఒకరు గొడవపడి ఒక గ్రూపు కేస్లాగూడ వెళ్ళిపోయింది. కేస్లాగూడలో పనిచేస్తుండగా కొన్నాళ్ళకి అక్కడి గ్రామస్థులతో గొడవయ్యింది. మళ్ళీ వీళ్ళందరూ రోడ్డుమీద పడి, చీరలు గీరలు కట్టుకుని అడుక్కునేవాళ్ళుంటారు చూడు, అలా బతకడం మొదలుపెట్టారు. అదీ చలికాలంలో. ఘోరమైన చలి. వీళ్ళకి ఇల్లు లేదు, బట్టలు, దుప్పట్లు కట్టుకుని అందులో కూర్చుని వండుకుంటూ, తింటూ ఉండేవాళ్ళు.

‘నేనూ గోపీకృష్ణ కొంతమంది  మిత్రులం ఒకసారి  అసిఫాబాదు వెళ్ళి వస్తున్నప్పుడు ‘పదండి ఓఝాల్ని చూసి వద్దాం’ అని వెళ్ళి చూస్తే ఇలా పడి ఉన్నారంతా. ‘మీకిలాంటి గతి పట్టిందేమిరా దౌర్భాగ్యులారా’ అన్నాను. దుర్గతి. గోపీకీ,  హుజూరమ్మకీ  చెప్పాను. ‘ఎవరైనా వీళ్ళమధ్య ఉండి వీళ్ళకోసం పనిచేసే వాళ్ళుంటే పంపించండి’ అని చెప్పాను.’

‘వాళ్ళు పర్వేజ్ ని పంపించారు. పర్వేజ్ వాళ్ళతో, వీళ్ళతో మాట్లాడి హౌసింగ్ వాళ్ళ నెత్తిమీద కూచుని వీళ్ళకి ఇళ్ళు శాంక్షన్ చేయించాడు. ఇళ్ళు కట్టించాడు. ఆ సమయంలో దినేష్ కుమార్ గారు కలెక్టరుగా ఉండేవాడు. ఆయన ‘గురూజీ, వీళ్ళ కోసం ఒక గ్రామం డిజైన్ చేయండి ‘ అనడిగాడు. ‘ఎవరైనా ఆర్కిటెక్ట్ ని పంపించండి, వీళ్ళ గ్రామం ఎలా ఉండాలో డిజైన్ చేయిస్తాను’ అన్నాను.  ఒక పనివాడి గ్రామం ఎలా ఉండాలి? ఒక పనివాడికి ఇంకో పనివాడు పనిచేస్తూ దూరంగా కనిపించాలి. అప్పుడు వాడి పని కూడా సాగుతుంటుంది. ఆ రకంగా డిజైన్ చేసాను.’

‘ఆ ఊరు మధ్యలో వీళ్ళదొక మూజియం ఏర్పాటు చేయాలి. అది వీళ్ళకొక పుస్తకం లాంటిది. వీళ్ళ పెద్దవాళ్ళు ఏమేమి పనులు చేసారో అది వీళ్ళకి కనిపిస్తూ ఉండాలి. అవునా? కానీ ఈ అధికారులూ, ఇలా పనిచేసేవాళ్ళూ ఈ రోజు ఇక్కడుంటారు, రేపు వెళ్ళిపోతారు, అలాగే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అదంతా అలాగే నాశనమైపోయింది. పర్వేజ్ చాలా ప్రయత్నం చేసాడు. రెండున్నరేళ్ళున్నాడు వీళ్ళ మధ్య. చాలా పనిచేసాడు. ఇళ్ళు శాంక్షన్ చేయించాడు. అదీ ఇదీ  చాలా చేసాడు.’

గురూజీ ఒకటి రెండు క్షణాలు ఆగారు. మళ్ళీ మరొక తలపు ఆయన్ని ఆవహించింది. చెప్పడం మొదలుపెట్టారు: ‘ఒకసారి ఏమైందంటే, ఇక్కడ ఆశ్రమంలో ఓఝాలు, అయిదు కుటుంబాలుండేవారు. ఢిల్లీలో ట్రైఫెడ్ అని ఒక సంస్థ ఉంది. దాని డైరక్టరు గుల్షన్ నందా అదిలాబాదు వచ్చినప్పుడు ఇక్కడి పని చూసి చాలా పెద్ద ఆర్డరు ఇచ్చారు. ‘ఇంత సామాను తయారు చేయండి ‘ అని. ఆ రోజుల్లో నాకు రెండేళ్ళుగా స్కూల్లో జీతం రాలేదు(నవ్వుతూ) నేనొకసారి స్కూలుకి వెళ్తే, ఆ రెండేళ్ళ జీతం, మొత్తం ముప్ఫై వేలు ఒక్కసారే చేతికి వచ్చింది. దానికొక రెండువేలు జమచేసి మొత్తం ముప్ఫై రెండు వేలూ వీళ్ళకిచ్చేసాను. దాంతోపాటు మరొక ఏడు వేలు ఎవరి దగ్గరో అప్పుగా తీసుకుని మొత్తం ముప్ఫై తొమ్మిది వేలు ఆ పనిమీద పెట్టాను. మొత్తం అయిదారు కుటుంబాలూ అద్భుతంగా పనిచేసారు.’

‘ఢిల్లీ ఐఐటిలో ఒక ప్రోగ్రాం ఉంది, స్వదేశీదో, గిదేశీదో, అక్కడికి మనం వెళ్ళాలి. మెటీరియల్ అయితే తయారైపోయింది. అక్కడ కొనేవాళ్ళ అడ్రసులున్నాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ‘గుల్షన్ నందా ఎవరు? మీకు ఆమె ఆర్డరు ఇవ్వడం ఏమిటి? ఏమైనా కాగితం ఉందా?’ అనడిగారు. ‘మా దగ్గరైతే ఎటువంటి కాగితాలూ లేవు, మేమీ మెటీరియల్ తీసుకోం’ అనేసారు. అరే, దాదాపు నలభై వేలు ఖర్చుపెట్టి తయారు చేసిన పని. ఇప్పుడు కొనేవాడే లేడు. పెద్ద ఆపద వచ్చిపడింది అనుకున్నాను.’

‘అప్పుడు పూర్ణిమా రాయి అనే ఆమె హాండిక్రాఫ్ట్స్ డైరక్టరుగా ఉన్నారు. ఆమెతో ఫోనులో మాట్లాడాను. ఆమె ‘గురూజీ, మీ ప్రోగ్రాం ఎప్పుడు?’ అనడిగారు. ఐఐటి లో నా టాక్ ఫలానా సమయానికని చెప్పాను. ‘నేను కూడా మీ టాక్ కి వస్తాను’ అన్నారు. నేను ఆమెకి ఫోన్ చేసినప్పుడు ఆమె దగ్గర ఈ గుల్షన్ నందా కూడా దగ్గర కూచుని ఉన్నట్టున్నారు. ‘ఎవరు గురూజీ?’ అనడిగితే, ‘అదిలాబాద్ నుండి, ఇలా . ..’ అని అనగానే, ‘ఆ, నాకు తెలుసు, నేను కూడా వస్తాను’ అని అన్నారామె.’

‘ఈ పూర్ణిమా, ఆ గుల్షన్ నందా ఇద్దరూ వచ్చారు. నేనక్కడ స్టేజి మీద ఉన్నాను. గుల్షన్ నందా కనిపించారు. ‘అరే, ఈమె ఇక్కణ్ణుంచి జారిపోకముందే  పట్టుకోవాలి’ అనుకున్నాను (నవ్వుతూ) ఆమె సైగ చేసి ఒక చీటీ రాసి పంపించారు. ‘నేనిక్కడే ఉంటాను గురూజీ, మీరు మాట్లాడండి’ అని. ఆమె అక్కడే ఉన్నారు.  నా టాక్ అయిపోయిన తర్వాత కిందకి దిగి ‘అమ్మా, సామానంతా  తయారయ్యింది, కానీ మీరేమో ట్రైఫెడ్ వదిలేసారు’ అన్నాను. ‘అవును, నేను వదిలేశాను, కానీ మీ సామాను అమ్మించే ప్రయత్నం చేస్తాను. మీరు తెప్పించండి’ అని చెప్పా రు.

‘వెంటనే అక్కణ్ణుంచే సమాచారం పంపించి ఓఝాల్ని రప్పించాం. వాళ్ళంతా మూటలు కట్టుకుని వచ్చారు. వెళ్ళి సామానంతా అమ్మేసారు. కొన్ని లక్షల సామాను అది. ‘నా పేరు మీద ఎటువంటి చెక్కూ ఇవ్వొద్దు, వీళ్ళ పేరుమీదనే ఇవ్వండి’అని వాళ్ళకి చెప్పాను. వాళ్ళ పేరుమీదే చెక్కులు వచ్చాయి. చాలా డబ్బొచ్చింది. కొంత సొమ్ము ప్రయాణం ఖర్చులకోసం ఇచ్చి చెక్కులు వాళ్ళ చేతుల్లో పెట్టారు. లేపాక్షి వాళ్ళు చెక్కులిచ్చారు. ట్రైఫెడ్ వాళ్ళూ చెక్కులిచ్చారు.’

‘ఆ చెక్కులు తెచ్చుకుని  వీళ్ళు కెరమెరి బాంకులో వేసారు. ఒక నెల అయ్యింది, రెండునెలలయ్యాయి, మూడు నెలలయ్యాయి. డబ్బులు రావడం లేదు. మూణ్ణెళ్ళ తరువాత ఆందోళన మొదలయ్యింది. ఇక్కడ అయిదు కుటుంబాలున్నాయి. దుకాణం నుంచి తెచ్చుకుని మస్తుగా తింటున్నారు. ‘డబ్బు రాగానే ఇస్తాం ‘ అంటున్నారు (నవ్వుతూ). ఇలా నడుస్తోంది వ్యవహారం. మూడు నెలలు నాలుగు నెలలయ్యాయి. డబ్బులు రావడం లేదు. ఆందోళన మొదలయ్యింది. ఏం చేస్తారు? పదే పదే ఢిల్లీకి ఫోన్ చేస్తున్నారు. అక్కడ భావ్ సింగ్ అని ఒక మేనేజరు ఉండేవాడు. లంబాడా ఆయన. నిజామాబాద్ వాడు. ఆయన చాలా ప్రయత్నించాడు. ‘లేదు, లేదు గురూజీ, ఆ చెక్కులన్నీ క్లీయర్ అయిపోయాయి, ఇక్కడేమీ లేదు, బాంకుల్లో ఉన్నాయి’ అన్నాడు. ఇక్కడినుంచి రెండు సార్లు పిల్లల్ని పంపించాను. కానీ డబ్బులు రావడం లేదు. తొమ్మిదినెలలయ్యాయి.’

‘తొమ్మిదినెలలపాటు ఆ అయిదు కుటుంబాలూ ఇక్కడ కూచుని తిన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా లేదు, నా దగ్గర కూడా ఒక్క పైసా లేదు (నవ్వుతూ). ఇంట్లో తమ్ముడి కూతురి పెళ్ళి ఉంది. ఏదో ఒకటి ఇవ్వాలి. ఎవరి దగ్గరో ఇరవై రెండువేలు అప్పుతీసుకుని ఇంట్లో ఇచ్చాను.’

‘తొమ్మిదినెలల తర్వాత కొంచెం గొడవచేస్తే, ఆ బాంక్ కాగితం ఏమైందిరా అని చూస్తే, అది అసిఫాబాదు బాంకులో టేబులు సొరుగులో పడి ఉంది! (నవ్వుతూ). తొమ్మిది నెలల తర్వాత వచ్చిన ఆ కాగితాన్ని వీళ్ళు అక్కడినుంచి డీడీ చేయించి ఇక్కడికి తీసుకొచ్చి డబ్బులు తీసుకున్నారు. మొదట నా ముప్ఫై తొమ్మిదివేలూ నాకు ఇచ్చేసారు. ఆ తర్వాత మిగిలింది వాళ్ళు పంచుకున్నారు. కిరాణాదుకాణానికీ, కట్టెలకీ, దానికీ, దీనికీ అని పంచుకోగా, ఒకడి దగ్గర రెండువేలు మిగిలాయి, ఒకడి దగ్గర పదిహేను వందలు మిగిలాయి, మరొకడి దగ్గర మూడువేలు మిగిలాయి. నేను చెవులు పట్టుకున్నాను. ఇక మీదట బయటి మార్కెట్ జోలికి వెళ్ళకూడదని నాకు నేను చెప్పుకున్నాను. బయట మార్కెట్ చేయకూడదు. ‘మీరు చేయాలనుకుంటే చేసుకోండి, నేనైతే చేయను’ అని చెప్పేసాను.’

ఇదొక చిత్రమైన కథ అనుకున్నాను. ప్రభుత్వం నుంచి మొత్తానికి వీళ్ళు క్షేమంగానే బయటపడ్డారే అనుకున్నాను. నేనేదో చెప్పేలోపే గురూజీ మళ్ళీ అందుకున్నారు:

‘ఆ తర్వాత ఏమైంది? ఒకసారి నా దగ్గర ఏడువేలున్నాయి. ఎందుకో తెలీదు. దాంతో చెయ్యడానికి ఏ పనీ లేదు. నేను ఓఝాలతో’మీకు కావాలంటే తీసుకెళ్ళండి, మళ్ళీ తిరిగిచ్చేయండి’ అన్నాను. ఇద్దరు వ్యక్తులకి తలా మూడువేల అయిదువందలు చొప్పున ఇచ్చాను. వాళ్ళు ఒకసారి పనిచేసారు. నా డబ్బులు నాకు తెచ్చి ఇచ్చేసారు. రెండోసారి పనిచేసారు. నా డబ్బులు నాకు ఇచ్చేసారు. ‘మీరు ఎవరికైతే పర్సంటేజి ఇస్తున్నారో అది విడిగా దాచుకోండి’ అని ఒక పద్ధతి పెట్టాను. అలా నాలుగైదు సార్లు నా డబ్బులు తెచ్చి నాకిచ్చేసారు.’

‘ఒకసారి వీళ్ళు ఢిల్లీ వెళ్ళవలసి ఉంది. ఢిల్లీ వెళ్ళడానికి కాగజ్ నగర్  నుంచి రాత్రి రెండున్నరకి రైలు. వీళ్ళు కాగజ్ నగర్ వెళ్ళినప్పుడు ఎవరో వీళ్ళని దోచుకున్నారు. వీళ్ళ సామాన్లు లాగేసుకున్నారు. డబ్బులు మొత్తం గుంజుకున్నారు. వీళ్ళని కొట్టారు కూడా. వీళ్ళు ఏడ్చుకుంటూ ఉంటే, అక్కడినుండి కెరమెరి రావడానికి ప్రయాణ ఖర్చులెవరో ఇచ్చారు. దాంతో వాళ్ళు తిరిగి వచ్చేసారు. అలా ముగిసిపోయింది వ్యవహారం, ఆ ఏడువేలు కూడా!’

‘కాబట్టి నేను బయటి మార్కెట్ కి ఎప్పుడూ అనుకూలంగా లేను. ఇప్పుడు ఓఝాలు మళ్ళీ లోకల్ మార్కెట్ చాలా బాగా చేసుకుంటున్నారు. అప్పుడప్పుడు బయటికి కూడా వెళ్తుంటారు కానీ బయటికే వెళ్తారు అని కాదు. మళ్ళీ తమ లోకల్ మార్కెట్ నిలబెట్టుకున్నారు. సంతోషంగా ఉన్నారిప్పుడు.’

‘లోకల్ మార్కెట్ లో లాభమేమిటంటే, వాడు డబ్బులివ్వడు, మేకనిస్తాడు. ఒక మేక ఆరునెలల్లో నాలుగు మేకలవుతుంది. పెరుగుతుంది, ఆ రూపేణా ధనం పెరుగుతుంది. నోట్లు ఇస్తే ఖర్చయిపోతాయి. ఆవునిస్తాడు, మేకనిస్తాడు. అది ప్రతి అయిదారునెలల్లో రెట్టింపు, మూడు రెట్లవుతుంది కదా. అది వీళ్ళకి లాభదాయకం. వీళ్ళు ఆవుకి మేతపెడతారు. పోషించుకుంటారు. వీళ్ళు సరుకు అమ్మినప్పుడు కొనుక్కున్నవాళ్ళు ఆవులిస్తారు, మేకలిస్తారు, కొంత డబ్బిస్తారు. చాలు. అలా మళ్ళీ చాలా పెద్ద ఎత్తున లోకల్ మార్కెట్ పట్టుకున్నారు వీళ్ళు. అప్పుడప్పుడు బయటికి కూడా వెళ్తారు. తిరగాలనిపిస్తే ఎగ్జిబిషన్ కి వళ్తారు. కానీ టీఆఏ డీయేలు ఇస్తున్నారో లేదో  కనుక్కుని మరీ వెళ్తారు (నవ్వులు)

ఒకసారి నేను వీళ్ళతో ‘ఒక ఏడాది పాటు ఆశ్రమంలో మీ బజారు పెడతాను. మీరు ప్రతి నెలా రెండో శనివారం,ఆదివారం ఇక్కడికి రండి. మీ దుకాణాలు పెట్టండి. ఒక సంవత్సరం తరువాత నేను బయటినుంచి కొనుగోలుదారుల్నీ, వ్యాపారుల్నీ పిలుస్తాను’ అని చెప్పాను.’

‘ఇప్పుడు జైపూరునుంచి తమిళనాడుదాకా విమానంలో వెళ్ళి సామాన్లు కొనుక్కునేవాడున్నాడు, వాడు హైదరాబాదునుంచి జైపూరు వెళ్తాడు. వాడిక్కడికి రాడా? వస్తాడు కదా. ‘మనం బయటికొనుగోలు దారుల్ని ఇక్కడికి రప్పించే అలవాటు చేద్దాం. మీరు మీ సామాన్లు పట్టుకుని బయటికి వెళ్ళకండి’ అని చెప్పాను. కానీ దానికొక షరతు ఉంది. మీరొక ఏడాది పాటు నమ్మకంగా నడవాలి. ఎందుకంటే బయటివాళ్ళకి ఈ పనివాళ్ళమీద నమ్మకం ఉండదు. తీరా నేను మొత్తం వ్యవస్థ చేసాక, వీళ్ళు మాయమైపోయారనుకో, అప్పుడేం చేస్తాం?’

‘నేను ఇంకా చాలా అనుకున్నాను, బయట నుండి వచ్చేవాళ్ళు రోజంతా ఉండాలి కాబట్టి, వాళ్ళకి తినడానికీ, తాగడానికీ  ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకి ఈ ప్రాంతం గురించి తెలియజేయడానికి కొంతమందిని పెట్టాలి.  ఈ పని గురించి వివరించడానికి కొన్ని సెమినార్లు లాంటివి పెట్టాలి. వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ రోజంతా గడవాలి, ఆ రకంగా వీళ్ళకొక మార్కెట్ తయారు చేద్దాం అని నా ఆలోచన ఉండేది. కానీ వాటన్నింటికీ సమయం పడుతుంది, డబ్బు పడుతుంది.’

‘ఆ సమయంలో డిఆర్డిఎ శ్రీనివాస్ చాలాసార్లు తనున్నానని భరోసా ఇచ్చేవారు. కానీ, ‘మీరు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది’ అనేవాణ్ణి.  ఇలాంటి మార్కెట్ కనుక చేస్తే, బయట వాళ్ళు కొనడానికి ఇక్కడికే వస్తారు. కానీ దానికోసం ఒక అందమైన వ్యవస్థ చేయాలి, ఎందుకంటే వాళ్ళు వస్తే ఇక్కడ చాలా చూడాలి కదా, చాలా అర్థం చేసుకోవాలి కదా. కేవలం కొనుక్కుని వెళ్ళిపోవడం కాదు. నా ఆలోచన అలా ఉండేది. ఐదారు నెలలు అటువంటి ప్రయత్నం చేశాను. కానీ వీళ్ళ సామాన్లు ఇక్కడే అమ్ముడుపోయేవి, మూడు మూడున్నర వేల సామాను నెలకొకసారి అమ్ముడుపోయేది వీళ్ళకి. ఈ వెదురు పని చేసేవాళ్ళది, టర్నింగ్ పని చేసేవాళ్ళది వెయ్యి వెయ్యి రూపాయలది అమ్ముడుపోయేది. ఒక రోజుకే ఓఝాలది రెండు మూడు వేల సామాను ఇక్కడే అమ్ముడుపోయేది. ఇంకేం కావాలి?’

‘ఇక్కడొకసారి ఏటికొప్పాక, కొండపల్లి వాళ్ళ బొమ్మలు ఎగ్జిబిషన్లు ఇక్కడ పెట్టించాను. వాళ్ళతో ‘ఇక్కడొక పదివేల రూపాయల దాకా మార్కెట్ ఉంటుందనుకోండి, అది ఒకరోజులో అమ్ముడు కావచ్చు, రెండు రోజుల్లో అమ్ముడు కావచ్చు’ అని చెప్పాను. ఏటికొప్పాక వాళ్ళు ఎగ్జిబిషను పెట్టినప్పుడు ఒకటిన్నర రోజుల్లోనే పదివేల దాకా అమ్ముడైంది. కొండపల్లి వాళ్ళదీ అంతే. వాళ్ళని మళ్ళా రెండో ఏడాది పిలిచాను. ఈసారి రెండు రెండు రోజుల్లో తలా పదివేల చొప్పున అమ్ముడయ్యింది. ఇంక అక్కడికి ఆపేయమన్నాను. ‘ప్రతి ఏటా మీకిక్కడ పదివేల రూపాయల మార్కెట్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇలాంటి స్థలాలు మరికొన్ని చూసుకోండి’ అని చెప్పాను.

మూడో సంవత్సరం వచ్చినప్పుడు వాళ్ళు చాలా సామాను తీసుకొచ్చారు. ఇక్కడ ఎగ్జిబిషనులో చెరో పదివేలూ అమ్మకం కాగానే నేను ఆపేసాను. ఎందుకంటే జనం గరిష్ఠంగా ఎంతని కొంటారు? అదే పదివేల దగ్గర మార్కెట్ ఫ్రీజ్ చేస్తే రెండోసారి కొనడానికి జనం సిద్ధంగా ఉంటారు. కాని వాళ్ళేంచేసారంటే, చాలా సామాను తెచ్చారన్నానుకదా, ఇక్కడ ఎగ్జిబిషను అయిపోగానే పార్కులో దుకాణం తెరిచారు. బస్టాండులో కూడా పెట్టి అమ్మారు. ఇక్కడ అమ్మిన ధరలో సగం ధరకే అమ్మేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏడాది నేను మళ్ళీ ఎగ్జిబిషను పెట్టినా కూడా వాళ్ళని పిలవలేదు. కాని వాళ్ళొచ్చారు. నేనేం చెప్పానంటే ‘చూడండి, మీరిప్పుడు మీ సామాను ఇక్కడ ఎగ్జిబిషనులో పెట్టినా ఎవరూ కొనరు. మీ దుకాణం ఇక్కడ ముగిసిపోయింది. మీరు మీ చేతుల్తోనే మీ మార్కెట్ పాడు చేసుకున్నారు. ఇప్పుడు మీరిక్కడ పెట్టినా జనం కొనడానికి రారు, ఎందుకంటే రెండురోజులు గడిచాక మీరు వీటిని సగం ధరకే అమ్మేస్తారని వాళ్ళకి తెలుసు ‘ అని అన్నాను.

‘ఇలాంటి చాలా ప్రయత్నాలు చేసాం. మార్కెటింగులో ఎక్కడో అక్కడ వీళ్ళు పొరపాటు చేస్తారు. ఓపిక ఉండదు. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. లేకపోతే బయటి కొనుగోలుదారుల్ని ఇక్కడికే రప్పించేవాళ్ళం. పర్వేజ్ అలాంటి వాతావరణం తయారు చేసాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంటే వచ్చే నెల కోసం ఆర్డరు ఇచ్చి వెళ్తారు. వాళ్ళకి ఏది నచ్చిందో ఆ పని తీసుకుంటారు. అదేగనుక వీళ్ళు తమ సామాను తీసుకుని బయటకి వెళ్తే, అక్కడ వాళ్ళు వీళ్ళకి వచ్చే నెల ఆర్డరు ఇవ్వరు సరికదా, ఇది బాలేదు, అది బాలేదు అని వీళ్ళపనికి వంకలు పెడతారు. అదే వాళ్ళే గనుక ఇక్కడికి వచ్చి కొంటే తమకి ఏది నచ్చితే అదే తీసుకుంటారు. అలానే వీళ్ళకి కూడా తమ తయారీలో ఏ వస్తువుల్ని కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారో తెలుస్తుంది.’

ఈ అనుభవాలు గురూజీ నోటమ్మట వినడం ఇదే మొదటిసారి. చేతివృత్తుల వాళ్ళ స్వర్ణయుగం గురించి తలపోసే ఒక స్వాప్నికుడే ఉన్నాడనుకున్నానుగానీ, ఇంత minute detail ని కూడా చూసుకోగల మార్కెట్ పరిశీలకుడున్నాడని ఊహించలేకపోయాను. ఆ మాటలు వింటుండగా నాకో సంగతి గుర్తొచ్చింది.

అప్పటికి పదేళ్ళ కిందట నేనొక ఉన్నతాధికారిని కళాశ్రమానికి తీసుకువెళ్ళాను. ఆయన అక్కడున్న కళాసంపద చూసి మూర్ఛపోయినంత పనిచేసాడు. ఆయన హిందీవాడు కాబట్టి గురూజీ హిందీలో మాట్లాడుతున్నంతసేపూ తన చెవుల్లో తేనెకురుస్తున్నట్టే మురిసిపోయాడు. కానీ మేం కళాశ్రమం నుంచి బయటకి రాగానే కారెక్కుతూనే ‘మీ మిత్రుడొక అవివేకి’ అన్నాడు నాతో. నాకు అర్థం కాలేదు. ఏమిటన్నట్టు చూసాను. ‘ఎంత అవివేకి కాకపోతే, అంత కళాసంపదని అలా ఇంట్లో పెట్టుకుని కూచుంటాడు! దానికే ప్రచారం లభిస్తే ఎంత డబ్బొస్తుందో తెలుసునా!’ అన్నాడు. నాకేమనాలో తోచలేదు.

ఆ సాయంకాలం మళ్ళా నేనొక్కణ్ణే గురూజీని కలిసినప్పుడు ‘ఏమి సార్! నీ మిత్రుడని చెప్పి ఒక షావుకార్ని తీసుకొచ్చావు నా దగ్గరికి’ అన్నాడు గురూజీ ! నేనాయనతో ఆ పొద్దున్న మా మధ్య జరిగిన సంభాషణ చెప్పాను. గురూజీ నవ్వేసి ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుస్తోంది, కళకీ, వ్యాపారానికీ; లోకల్ మార్కెట్ కీ, బయట మార్కెట్ కీ; డిమాండ్ కీ, సప్లయి కీ మధ్య ఉన్న సరిహద్దులు గురూజీకి చాలా క్షుణ్ణంగా తెలుసని!

(రెండవ రోజు సంభాషణలు సమాప్తం)

15-6-2026

2 Replies to “జీవన శిల్పి-13”

  1. భద్రుడు గారు, పన్నెండవ భాగంలో గురూజీ తన సంభాషణలో భారతీయ ప్రాచీన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రకృతితో మమేకమైన అద్వైత సిద్ధాంతం గురించి ఇచ్చిన వివరణ, విశ్లేషణ చదివినప్పుడు కలిగిన ఆశ్చర్యం ఒకెత్తయితే, ఈ 13వ భాగం ఆ ప్రాచీన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దాని వెనుక ఉన్న సామాజిక మనస్తత్వంపై ఒక అంతర్జాతీయ స్థాయి Case Study చదువుతున్నట్టు అనిపిస్తోంది. నిజంగా గురూజీ కేవలం ఒక ఆధ్యాత్మిక/కళాత్మక స్వాప్నికుడు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో డిమాండ్, సప్లై, మార్కెట్ సరిహద్దులను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న అత్యంత నిశితమైన ‘మార్కెట్ పరిశీలకుడు’.

    “ఓఝాలు మొదట్లో గోండులకోసం, కొలాముల కోసమే పనిచేసేవారు. బయట మార్కెట్ ఏదీ ఉండేది కాదు. ఒక ఓఝా ఒక గోండు లేదా కొలాం గ్రామంలో ఉంటూ, ఇరవై గ్రామాల మార్కెట్ చూసుకునేవాడు. వెళ్ళేవాడు, తయారు చేసింది ఇచ్చి వచ్చేవాడు…… గ్రామంలో ఎలాగూ మార్కెట్ ఉంది. అది వీళ్ళకి ఆహారం లాంటిది. బయట మార్కెట్ బంగారం లాంటిది. ఏదైనా సదుపాయం కోసం ఉపయోగపడుతుంది.” ఇది చాలా గొప్ప అబ్జర్వేషన్. మనం ఆధునికత, అభివృద్ధి అనే భ్రమల్లో పడి ఆ ‘ఆహారాన్ని’ వదిలేసి ‘బంగారం’ వైపు ఎలా పరుగెడుతున్నామో, చివరికి ఎటువంటి ఊబిలో కూరుకుపోతున్నామో కదా. ముఖ్యంగా కళాకారుల విషయంలో ఇది ఈనాటికీ సుస్పష్టం గానే కనిపిస్తోంది.. మన చుట్టూరా ఎన్నో ఉదాహరణలున్నాయి.

    కళను సమాజం నుండి, స్థానిక మార్కెట్ నుండి వేరు చేసినప్పుడు ఆ వ్యవస్థ ఎలా కుప్ప కూలుతుందో గురూజీ చెప్పిన విధానం భరతుడి నాట్యశాస్త్రంలో లలితకళల గురించి చెప్పిన ఈ శ్లోకం గుర్తు చేసింది.
    “న తజ్జ్ఞానం న తచ్ఛిల్పం న సా విద్యా న సా కలా |
    నాసౌ యోగో న తత్కర్మ నాట్యేఽస్మిన్ యన్న దృశ్యతే || ” ( జ్ఞానము, శిల్పము, విద్య, కళ, యోగము, కర్మ.. వీటిలో ఏదీ కూడా పరస్పర సంబంధం లేనిది కాదు, అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే)

    ఇంచుమించు ఇదే శ్లోకం లో వున్న భావాన్ని బ్రిటిష్ ఎకనామిస్ట్ E. F. Schumacher తన క్లాసిక్ బుక్ ‘Small Is Beautiful: A Study of Economics As If People Mattered’ లో ప్రస్తావిస్తూ మానవత్వాన్ని విస్మరించే భారీ ఆర్థిక వనరుల వ్యవస్థల కంటే స్థానిక వనరులే నయం అన్నాడు. ఈ స్టేట్మెంట్ చూడండి. “Production from local resources for local needs is the most rational way of economic life.” (స్థానిక అవసరాల కోసం స్థానిక వనరులతో ఉత్పత్తి చేయడమే ఆర్థిక జీవితానికి అత్యంత హేతుబద్ధమైన మార్గం)

    ఇక ఈ పోస్ట్‌లో నాకు బాగా నచ్చిన మరొక విషయం మోడర్న్ ఆర్ట్ గురించి గురూజీ ఇచ్చిన వివరణ – పెద్ద పెద్ద కళా విమర్శకులు కూడా పేజీల కొద్దీ గ్రంథాలు రాసి కన్ఫ్యూజ్ చేసే విషయాన్ని ఎంత సరళంగా, ఎంత అర్థవంతంగా చెప్పారో కదా.. ‘చూడండి, మీరు ఈ సింహం బొమ్మ చేస్తున్నారు కదా, ఇది సింహమేనా?’ అంటే, ‘అవును, ఇది సింహమే’ అన్నారు. ‘కానీ సింహం ఇలా ఉంటుందా? లేదు, సింహం అలా ఉండదు, దానికి ఇంత లావు కాళ్ళు ఉండవు. గుర్రం ఇలా ఉంటుందా? గుర్రం కూడా అలా ఉండదు. మరిది గుర్రం కాదా? గుర్రమే. ఇదే మాడ్రన్ ఆర్ట్. ఇంకేమీ లేదు. మీరు దానికున్న కొన్ని ప్రత్యేక లక్షణాల్ని పట్టుకుని ఆ ఆకారాన్ని తయారుచేస్తున్నారు. కాబట్టి దీన్ని గుర్రమనే అనాలి, అది గుర్రంలా లేకపోయినా గుర్రమే. ఇది సింహంలా లేకపోయినా ఇది సింహమే. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన ఫీచర్స్ పట్టుకుని చేసినప్పుడు దాన్ని అదే అనాల్సి వస్తుంది. దానికంటే భిన్నంగా దాన్ని పిలవలేం కదా. కాబట్టి మీలో ఇలాంటి పరిశీలన ఉందంటే ఇదే కళ. ఇంతకుమించి మరేముంటుంది?’

    కళాకారుడు వస్తువు యొక్క బాహ్య రూపం కంటే ఆ వస్తువు యొక్క అంతర్గత లక్షణాన్ని పట్టుకోవడమే మోడర్న్ ఆర్ట్ అన్న విషయాన్ని ఇంత సింపుల్ ఉదాహరణతో చెప్పడం నేనెప్పుడూ.. ఎక్కడా వినలేదు. పికాసో, హెన్రీ మూర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు జీవితాంతం సాధన చేసి పట్టుకున్న సూత్రాన్ని, ఆదిలాబాద్ ఓఝాలు తమ జీవన పరిశీలనతో శతాబ్దాలుగా సహజంగానే ప్రదర్శిస్తున్నారని గురూజీ పరిశీలించి నిర్వచించిన తీరు అమోఘం.

    చివర్లో ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల ఎగ్జిబిషన్ ఉదాహరణ అయితే బిజినెస్ స్కూళ్లలో పాఠం గా చెప్పచ్చు. మార్కెట్ డిమాండ్‌ను ఎక్కడ ‘ఫ్రీజ్’ చేయాలో తెలియక పోతే కంపెనీలకు జరిగే నష్టాల గురించి ఒక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ చెప్పినట్టు చెప్పారు గురూజీ.

    గురూజీని ‘అవివేకి’ అన్న ఆ ఉన్నతాధికారి మనస్తత్వమే ప్రస్తుత కార్పొరేట్ వరల్డ్ లో ప్రభవిల్లుతోంది. మీరన్నట్టు ప్రస్తుత ప్రపంచంలో కళను కేవలం ప్రచారం, డబ్బు సంపాదించే వస్తువుగా చూసే చాలామంది రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్స్ కు, వ్యాపారవేత్తలకు కళకీ, వ్యాపారానికీ; లోకల్ మార్కెట్ కీ, బయట మార్కెట్ కీ; డిమాండ్ కీ, సప్లయి కీ మధ్య ఉన్న సరిహద్దులు గురూజీకి తెలిసినంత క్షుణ్ణంగా తెలవ్వనిపిస్తోంది.

    మరొక అమూల్యమైన, ఆలోచింపచేసే సంభాషణను అక్షర బద్ధం చేసి మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    1. చాలా చాలా సంతోషం సార్! మీరు షూమేకర్ను ఉదాహరించడం నాకు చాలా సంతోషం కలిగించింది. తాత్వికంగా వీరంతా ఒకే దర్శనానికి చెందిన వాళ్లు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading