ప్రియమైన శాఫో-24

ప్రియమైన శాఫో

నీకు రాస్తున్న ఈ చివరి ఉత్తరాన్ని నేను Fragment136 V తో మొదలుపెడుతున్నాను. నీ కవిత్వంలోనే కాదు, ప్రపంచ కవిత్వంలోనే అత్యంత సుమధుర పంక్తుల్లో దీన్ని కూడా ఒకటిగా లెక్కేసుకుంటాను:

ఎవరో పండితుడు సోఫోక్లీసు నాటకాల గురించి రాస్తూ, నీ ఈ వాక్యాన్ని తలుచుకున్నాడు. అలా అతడి ద్వారా ఈ  కోకిల, ఎప్పుడో ఇరవై ఆరు శతాబ్దాల కింద, నీ హృదయాన్ని తీపివగరు వేదనతో రగిలించిన కోకిల ఇప్పుడు మళ్ళా నా హృదయద్వారాన్ని తడుతున్నది. మా ఆదికవి వాల్మీకి కోకిలని హృదయగ్రాహి అని అభివర్ణించడం గుర్తొస్తున్నది. హృదయగ్రాహి అంటే రెండు అర్థాలు, ఒకటి హృదయం తెలుసుకున్నది అనీ, రెండోది హృదయాన్ని పట్టుకున్నదీ అనీ. ఏమో, ఈ రెండర్థాలూ ఒకటే కావొచ్చు, ఎందుకంటే, మన హృదయం తెలుసుకున్నవారే కదా మన హృదయాన్ని చేజిక్కించుకోగలుగుతారు.

కోకిలను నువ్వు imerophonos   అని అన్నావు. రెండు పదాల కలయిక, imeros అంటే కాంక్ష, phone అంటే స్వరం, అంటే ఆమె స్వరం కోరికను తట్టిలేపుతుంది అని. ఎంత ప్రయత్నించినా నీ పదప్రయోగంలోని ధ్వనిని నేను తెలుగులోకి తేలేకపోతున్నాను. అంటే ఏమి చేసినా వాచ్యార్థాన్నే తేగలను తప్ప, అది మనసులో కలిగించే మధుర-తిక్త వేదనని మాటల్లో పెట్టలేకపోతున్నాను. కాని జపనీయ హైకూ కవీంద్రుడు బషో రాసుకున్న ఈ హైకూ, నేను నా గుండెమీద అచ్చొత్తించిపెట్టుకున్న ఈ హైకూనే, నీ పదప్రయోగానికి నిజమైన తాత్పర్యం అనిపిస్తుంది. బషో అంటాడు కదా!

బషో కాలంలో క్యోటో జపాన్ రాజధాని. కళలకీ, కవిత్వానికీ, రసజ్ఞతకీ తరగని గని. బషో ఏమంటున్నాడంటే తాను చిన్నప్పుడు క్యోటోలో కోకిలని విన్నాడు. ఆ తర్వాత అతడు కాలినడకన దాదాపుగా మొత్తం జపాన్ పర్యటించాడు. తిరిగి క్యోటో వచ్చాక, కోకిల పాట వింటే, క్యోటోనే గుర్తొస్తోంది. అంటే, ఆ క్యోటో, తన బాల్యయవ్వన కాలాలనాటి క్యోటో గుర్తొస్తోంది. కాలం మారింది. పట్టణం కూడా మారిఉంటుంది నిస్సందేహంగా, తను కూడా మారాడు. కాని కోకిలపాట మారలేదు, ఆ కోకిల పాట గుర్తుచేసే ఆ గడచిన కాలపు తీపితలపులు కలిగించే తిక్తవేదన మారలేదు.

నిజానికి నేను యీ నీ కవితావాక్యంతోటే నా ఉత్తరం మొదలుపెట్టవలసింది. కానీ, ఈ వాక్యాన్ని ఈ  చివరి ఉత్తరానికి అట్టేపెట్టుకున్నాను. ఈ వసంత ఋతువంతా నీ కవిత్వం చదవడంలో, నీకు ఉత్తరాలు రాయడంలో గడిచిపోయింది. ఈ మండుటెండల కాలమంతటా ఆకాశంలో కోకిలా, నా హృదయంలో నువ్వూ- మీరిద్దరే నాకు స్నేహితులూ, నా హృదయాన్ని పట్టుకున్నవాళ్ళూనూ. ప్రపంచం యుద్ధంలో కూరుకుపోయి ఉంది. యుద్ధమేఘం కాదు, అగ్నివర్షమే. దాన్నెట్లా ఆపాలో నాకు తెలియదు. ఈ ప్రపంచంలో మనిషి ఒకచోట దుఃఖతప్తుడై  ఉండగా మరొకచోట ఎలా సంతోషాన్ని స్వాగతించగలడో నాకు అర్థం కాకుండా ఉంది. ఈ చుట్టూ పోటెత్తుతున్న విద్వేషం, వైరం, హింస నా మానసిక ప్రపంచాన్ని తీవ్రంగా అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. భగవంతుడి పట్ల నా విశ్వాసం మాత్రమే నన్ను బతికిస్తూ ఉంది. ఆ విశ్వాసం కూడా భగవంతుడేనని నమ్ముతున్నాను. ఆయన నాకు సాంత్వన కలిగించడానికీ , ఈ ప్రపంచంలో నాకు నమ్మకం పోకుండా ఉండటానికీ,  నేనీ ప్రపంచాన్ని ద్వేషరహితం చెయ్యలేకపోతున్నానన్న అపరాధ భావంతో నాకు నేను బరువుగా మారకుండా ఉండటానికీ ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో నన్ను నిలబెడుతూనే ఉన్నాడు. ఆ విధంగా నా ప్రాణం నిలబెడుతున్న భగవత్కృపను నేను గుర్తుపట్టుకోగలగడం కూడా భగవత్కృపనే.

చివరికి నాకు నేను చెప్పుకున్న సమాధానమేమిటంటే, ఈ ప్రపంచంలో విద్వేషాగ్నిని నేను చల్లార్చలేకపోవచ్చు, అకారణ శత్రుత్వాల్ని ఆపలేకపోవచ్చు. కానీ, నా మనసుని ద్వేషరహితం చేసుకోగలిగితే, కనీసం, ఆ మేరకన్నా ప్రపంచం కుదుటపడ్డట్టే కదా. కోకిలని వింటుంటాను, నా ఇంటిముంగిటా, వీథిలోనూ , నేను నడుస్తున్న దారుల్లోనూ ఎప్పటికప్పుడు కొత్తగా పూస్తున్న పూలు చూస్తుంటాను. తెల్లవారి లేవగానే చెట్లకొమ్మల్లో కదలాడే  ప్రత్యూషపవనాల్ని చూస్తుంటాను. నా ఉనికిని కూడా వాటిలాగా నవనవోన్మేషంగా, పరిమళభరితంగా  చేసుకోవడమెట్లా అని సాధనచేస్తుంటాను. నా అంతరంగం పొగలు చిమ్మకుండా, ఒక శిరీష కుసుమంలాగా, మండుటెండల్లో కూడా మధురసుగంధం విరజిమ్మాలని కోరుకుంటాను. ఇటువంటి నా సాధనలో ఈ వేసవి అంతా నీ కవిత్వం నాకు తోడుగా నిలబడ్డది. శకలాలే కావొచ్చుగాక, అయితేనేం, వాటి చుట్టూ, యుగాలుగా రసజ్ఞులు సాగిస్తూ వచ్చిన చర్చలో, ఆ నిరంతర సంభాషణలో, ఆ గోష్ఠిలో నేను కూడా పాలుపంచుకున్నాను. నీ కవిత్వాన్ని అర్థం చేసుకునే క్రమంలో, ఆ అనుభూతిని గుర్తుపట్టే క్రమంలో, ఎక్కడెక్కడి కవుల్నీ, కవయిత్రుల్నీ తలుచుకున్నాను. కొందరి కవిత్వాలు మొదటిసారి చదివాను, కొందర్ని మరోసారి తలుచుకున్నాను. ఆ కవిత్వాల వెలుగులో నీ కవిత్వాన్నీ, ఆరని దీపంలాంటి నీ కవిత్వపు వెలుగులో వారి కవిత్వాన్నీ చదువుకున్నాను. చదువుకుంటూ ఉండగా నా మదిలో కదలాడిన తలపులు ఎప్పటికప్పుడు నీతో పంచుకుంటూ వచ్చాను.

నీకు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టినప్పుడు నీ గురించి నాకు తెలిసింది చాలా స్వల్పం, పాక్షికం అని ఇప్పుడు గ్రహించాను. ఉదాహరణకి, తక్కిన కవులు, ముఖ్యంగా హోమర్ లాంటి ఇతిహాస కవులు, సమాజం, రాజ్యం, యుద్ధం లాంటి ఐతిహాసిక ఇతివృత్తాల్ని గానం చేస్తే, నువ్వు ప్రేమ, వివాహం, కలయిక, విడిపోవడం లాంటి వ్యక్తిగత సుఖదుఃఖాల్ని మాత్రమే గానం చేసావనే నేనిన్నాళ్ళూ అనుకున్నాను. చారిత్రికంగా ఆరవశతాబ్దపు గ్రీసులో మీ వంటి కవులు epic స్థానంలో ఒక personal lyric ని తీసుకొచ్చినట్టు చరిత్రకారులు చెప్పేది చాలా స్థూలమైన అవగాహన అని ఇప్పుడు అర్థమవుతోంది. నిజానికి, మహాకవుల్ని ఇలా సామాజిక జీవిత కవులూ, వ్యక్తిగత జీవిత కవులూ అని విడదీసి చూపలేం. ఇలియడులో దేవలోకపు కమ్మరి అకిలిస్ కవచం పైన చిత్రించినట్టుగానే, ఈ ప్రపంచంలో ఎప్పుడూ రెండునగరాలు పక్కపక్కనే ఉంటున్నాయి. ఒకటి యుద్ధదగ్ధ నగరం, రెండోది శాంతిమయనగరం. హోమర్ యుద్ధాన్నే చూపించాడు అని అనడం గానీ, నువ్వెంత సేపూ సుఖసంతోషాల్నే గానం చేసావని గాని అనడం మీ రెండు కవిత్వాల్నీ సరిగ్గా అర్థం చేసుకోనట్టే. యుద్ధక్షేత్రంలో ఉన్న హెక్టర్ ని చిత్రిస్తున్నప్పుడు హోమర్ అతడి గృహజీవితాన్ని కూడా మనసులో పెట్టుకున్నట్టే, హెక్టర్ పెళ్ళివేడుకని చిత్రిస్తున్నప్పుడు, నువ్వు అతడు అడుగుపెట్టిన యుద్ధక్షేత్రాన్ని కూడా మనసులో పెట్టుకున్నావు. మనుషులు సుఖంగా, సంతోషంగా గడుపుతున్నప్పుడు, యుద్ధం చాపకింద నిప్పులాగా రాజుకుంటూ ఉంటుందనీ, మనుషులు యుద్ధాలు చేస్తున్నప్పుడు కూడా, ఈ ప్రపంచం శాంతిమయం కావాలనే ఒక తీవ్ర పరితాపం వారిమనసుల్లో ఇంకిపోని సుధలాగా స్రవిస్తూనే ఉంటుందనీ హోమర్ కి తెలుసు, నీకు తెలుసు. వ్యాసుడికి తెలుసు, వాల్మీకికి  తెలుసు. అసలు ఈ ప్రపచంలో కవిత్వం పుట్టిందే ఈ సత్యం గుర్తుచేస్తూ కాబట్టి నువ్వు ఎంత శాంతిసమయకవివో, అంత యుద్ధకాల కవివి కూడా.

ఈ మూడు నాలుగురోజులుగా ఫద్వా తుకాన్ ని చదువుతూ ఉన్నాను. సుప్రసిద్ధ పాలస్తీనా కవయిత్రి. ఆమెని మహ్మద్ దర్వేష్ లాంటి మరో పాలస్తీనా కవి the Mother of Palestinian Poetry అని అన్నాడట. పాలస్తీనా ప్రజలు ఎవరినేనా The Poetess of Palestine అని అన్నారంటే, అది ఫద్వా తుకాన్ నే అని విన్నాను. ఆమెకీ నీకూ చాలా పోలికలు ఉన్నాయి. నీకులానే ఆమె కూడా సంపన్న కులీన కుటుంబంలో పుట్టింది. ఆరబిక్ కవిత్వంలో స్వానుభవం మీంచి ప్రేమపారవశ్యం గురించి కవిత్వం రాసిన మొదటి కవయిత్రి కూడా ఆమెనే. స్త్రీల మీద పురుషప్రపంచం విధిస్తున్న నిర్బంధాల్ని కూడా ఎదుర్కొంది, దాటింది. అయితే, 1948 లో, తిరిగి మళ్ళా 1967 లో ఆమె దేశానికీ, ఆమె జాతికీ సంభవించిన అనుభవాలు ఆమెని ఒక్కసారిగా తన వ్యక్తిగత ప్రపంచంలోంచి రాజకీయ రణరంగం మధ్యకు తీసుకొచ్చేసాయి. అవే అనుభవాలు నీ జీవితంలో సంభవించినప్పుడు నువ్వు మరో దేశానికి ప్రవాసిగా పోవలసి వచ్చింది. కాని ఆమె తన స్వంతదేశంలో, తన స్వజనం మధ్య, తన నగరంలోనే తాను ప్రవాసిగా జీవించవలసి వచ్చింది.

1948 లో పాలస్తీనా నుంచి బ్రిటిష్ వలసవాద శక్తులు నిష్క్రమించినవెంటనే, అరబ్బులకీ-ఇస్రాయేలీలకీ మధ్య మొదటి యుద్ధం (the Nakba, Catastrophe) సంభవించింది. రెండు జాతుల మధ్యా 1949 లో యుద్ధవిరమణ ఒప్పందం కుదిరేటప్పటికి, 77 శాతం పాలస్తీనాని ఇజ్రాయిల్ కబళించేసింది. ఏడు లక్షలమంది పాలస్తీనియన్లు నిర్వాసితులైపోయారు. మిగిలిన కొద్దిపాటి భూభాగాన్నీ ఒకవైపు జోర్డానూ, మరొక వైపు ఈజిప్టూ ఆక్రమించేసాయి. ఆ సంఘటనల్ని  కళ్ళారా చూసినప్పుడు తుకాన్ చలించిపోయింది. అంతదాకా శృంగారాన్ని పలికిన ఆమె గళం అంగారం కక్కడం మొదలుపెట్టింది. తమ దేశానికీ, తమ కుటుంబాలకూ సంభవించిందేమిటో అర్థం చేసుకునేలోపలే, మళ్ళా 1967 లో ఇజ్రాయిల్ ఈజిప్టు, సిరియా, జోర్డాన్ ల మీద మెరుపుదాడి చేసింది. ఆ యుద్ధంలో సహజంగానే ఇజ్రాయిల్ ది పైచేయి అయ్యింది. ఇంతకుముందు తాను వదిలిపెట్టగా మిగిలిన పాలస్తీనా భూభాగాలు జోర్డాన్, ఈజిప్టుల ఆధిపత్యంలో ఉన్నవాటిని, ఇప్పుడు ఇజ్రాయెల్ పూర్తిగా కైవసం చేసుకుంది. వాటితో పాటు సిరియానుండి కూడా కొంత భూభాగం లాక్కుంది. గాజా, వెస్ట్ బాంక్, తూర్పు జెరుసలేం, సినాయి ద్వీపకల్పం, గోలన్ హైట్స్- మొత్తం పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయేలు ఆక్రమించింది. ఇది పాలస్తీనయన్ల చరిత్రలో కోలుకోలేని ఎదురుదెబ్బ (the Naksa, setback). ఈసారి యుద్ధంలో మరొక మూడులక్షలమంది పాలస్తీనియన్లు నిర్వాసితులయ్యారు. దాదాపు పదిలక్షలమంది ప్రజలు ఇజ్రాయేలు సైనిక పాలనకు లోబడ్డారు. ఈ యుద్ధంలో తుకాన్ జీవిస్తున్న పట్టణం నాబ్లస్ ని కూడా, ఇజ్రాయేల్ ఆక్రమించింది. అంటే, తుకాన్ లాంటి కవి జీవితం కూడా విదేశీ ఆక్రమణకిందకి వచ్చినట్టే కదా. అప్పణ్ణుంచి 2003 లో ఆమె మరణించేదాకా, అంటే, ముప్ఫై ఆరేళ్ళ పాటు ఆమె ఆ ఆక్రమణని ప్రతిఘటిస్తూనే ఉంది. తన యావచ్ఛక్తితోటీ poetry of resistance పలుకుతూనే ఉంది.  ఆమె స్వాతంత్య్ర గానం ఎంత శక్తిమంతంగా ఉండిందంటే, స్వయంగా ఇజ్రాయేలు సైన్యం జనరల్ కమాండరే, ఆమె ఒక్కో కవితా పదిమంది పాలస్తీనా స్వాతంత్ర్యవీరుల్ని తయారుచేస్తుందన్నాడు.

ఈ విషాదం అక్కడితో ఆగిపోలేదు. ఈ రెండుమూడేళ్ళ కాలంలోనే గాజాలో దాదాపు ఎనభై వేలమంది మరణించారు. ఎనభై శాతం ఇళ్ళు ధ్వంసమైపోయాయి. ఇరవైలక్షల మంది ప్రజలు గుడారాల్లో తలదాచుకోవలసి వచ్చింది. వాళ్ళల్లో కూడా ప్రతి అయిదు కుటుంబాల్లో  ఒక్క కుటుంబం మాత్రమే,  అది కూడా రోజుకి ఒక్క పూట మాత్రమే భోజనానికి నోచుకుంటున్నది. తక్కిన ఎనభై శాతం కుటుంబాలూ అయితే పస్తులుంటున్నారు లేదా చాలీచాలని రేషన్లతో బతుకు నెట్టుకొస్తున్నారు. తుకాన్ సొంత ప్రాంతమైన వెస్ట్ బాంకులో పాలస్తీనియన్లు పూర్తిగా సైన్యం ఆధీనంలోనే జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. పాలస్తీనియన్ల ఈ దుర్భర జీవితం పైన అంతర్జాతీయ సమాజం మౌనం వహిస్తూ ఉండటం చూసి తట్టుకోలేక  తెలిసి గ్రేటా థున్ బర్గూ,  మరికొందరు మానవతావాదులూ కొంత ఆహారం తీసుకుని గాజా చేరాలని ప్రయత్నిస్తే వారిని ఇజ్రాయేలు అడ్డగించి, నిర్బంధించింది.

ఇటువంటి పరిస్థిల్లో తుకాన్ జీవించి ఉంటే ఏమి రాసి ఉండేది? కవిత్వాన్ని పక్కనపెట్టి పూర్తి క్రియాశీల రాజకీయయోధురాలిగా మారి ఉండేదా?

ఈ రోజు నా సమస్య కూడా అదే. ఈ విద్వేషాగ్నితో రగులుతున్న ఈ ప్రపంచంలో నా కర్తవ్యం ఏమిటి? కవిత్వం రాసుకుంటూ ఉండటమా లేక నా యావచ్ఛక్తితోనూ వ్యవస్థతో తలపడటమా?  1966-67 మధ్యకాలంలో తుకాన్ ఒక డైరీ రాసుకుంది. అందులో ఆమె ఇలా అంటున్నది:

ఇదే నేను నేర్చుకోవలసింది శాఫో! నీ నుంచైనా,  తుకాన్ నుంచైనా, ఎందుకంటే మీరూ, మీలాంటి కవులూ వసంతఋతుదూతలు, కాంక్షాతప్తగాయికలు, కోకిలలు.

11 Replies to “ప్రియమైన శాఫో-24”

  1. మన హృదయం తెలుసుకున్నవారే కదా మన హృదయాన్ని చేజిక్కించుకోగలుగుతారు.
    ఆహా… సర్. నమస్సులు

  2. శుభోదయం సర్,
    కవిత్వం, యుద్ధం ,మానవత్వం మధ్య సాగిన ఒక గాఢమైన ఆత్మసంభాషణలా అనిపించింది.

    శాఫో యొక్క ప్రేమగీతాల నుంచి ఫద్వా తుకాన్ యొక్క ప్రతిఘటన స్వరం వరకూ ప్రయాణిస్తూ, కవిత్వం మనసును మురిపించడమే కాదు, మనిషిని నిలబెట్టే శక్తి కూడా అని చెప్పడం బాగుంది

    “నా మనసుని ద్వేషరహితం చేసుకోగలిగితే అదే శాంతి” అనే భావం ఎంతో లోతుగా తాకింది.

    కోకిలకూతను జ్ఞాపకం, వేదన, ఆశలకు ప్రతీకగా ఉపయోగించిన తీరు అద్భుతం.

    ఈ రచన చదివాక కవిత్వం అంటే జీవితం మీద ప్రేమను కాపాడుకోవడమే అనిపిస్తుంది.

  3. Sappho కవిత్వంలోని fragmentariness నుండీ ఆమె జీవితాన్ని, కవిత్వాన్ని అన్ని కోణాలలో నుండి ఆవిష్కరించడమే కాకుండా ప్రపంచంలోని నలుమూలల నుండి కవులను వారి “తిక్త-మధుర వేదనాభరిత” స్వరాలను వినిపిస్తూ ‘ఒక నిరంతర మానవీయ సుజల స్రవంతి’ లో మాకూ భాగస్వామ్యం కల్పించారు.

    This has been a rich and profound journey through times, countries, history, personal and political struggles, wars and their impact on people, bitter-sweet emotions, love and more.

    అందమైన మీ paintings, మీరు పరిచయం చేసిన ఆయా కవులకు మీ అనువాదాలు, ఆ కవుల కవిత్వం, మీ ఆలోచనలు, మీరు చర్చించిన ఎన్నో అంశాలు అన్నీ కలగలిపిన ఈ ఉత్తరాలు ఇచ్చిన experience ఎంతో విలువైనది.

    “మీరూ, మీలాంటి కవులూ వసంతఋతుదూతలు, కాంక్షాతప్తగాయికలు, కోకిలలు.“

    Thank you for these letters, Sir!
    🙏🏽🙇🏻‍♀️

  4. గత కొద్ది రోజులుగా మీతో పాటు ప్రపంచపు కవితా లోకంలో వివిధ కాలాలలో ప్రయాణించటం ఒక కొత్త అనుభవం. ఎందరెందరు కవులు కవయిత్రులు పరిచయమయారో!   .. ఎన్ని అమూల్య కవితలు  వినిపించారో !.  మీ నీటిరంగుల చిత్రాలు కోకిల పాటకు కొత్త సొబగులు అద్దాయి.
    ధన్యవాదాలు. 

  5. పురాసాహిత్యతత్త్వ నిపుణులు , నిత్యనూతన వసంతగాన సాహిత్యజ్ఞలు, యుగయుగాలుగా ఆలపిస్తున్న కోకిలస్వరాన్ని పట్టుకుని సాహిత్యాంతర సంగీత సాహిత్య రాగాలాపన అభ్యసిస్తున్న స్వరసాధకులు. అనన్యసామాన్యం మీ ప్రయాస. అది ఎందరికో కలిగిస్తున్నది జిజ్ఞాస. మిమ్మల్ని లలితకళా వైతాళికులనడం సమంజసం. 🙏.నిజంగా శాఫో జన్మ ధన్యమైంది . 26 శతాబ్దాల తరువాత కూడా జీవించగలుగుతున్నది. దీవించగలుగుతున్నది.

  6. “మీ వ్యాసాలు, పోస్టులు, ప్రసంగాలు, అందులో మీరు ప్రస్తావించే విషయాలు మరికొంచెం ఆలోచించి తెలుసుకుంటే చాలు నాలాంటి వాళ్ళు కూడా పండితులై పోవచ్చు” అని మీరు “ప్రియమైన శాఫో” శీర్షికతో ఏప్రిల్ 18వ తేదీ నాడు మీ కుటీరంలో మొదలుపెట్టిన ఈ సిరీస్ మొదటి పోస్టుకు కామెంటు పెట్టాను. మే 23న మీ ఇరవై నాలుగు ఉత్తరాలూ చదివాక నేనన్న ఆ మాటను ఇప్పుడు మరింత దృఢంగా నమ్ముతున్నాను.

    ఒక అజ్ఞాత కవయిత్రి రాసిన కొన్ని శకలాలు, రెండున్నర వేల సంవత్సరాల కాలప్రవాహంలో తేలి వస్తూ, ఈ వసంతఋతువు వేళల్లో, మండుటెండల్లో హైదరాబాదులో తన ఇంట్లో ఓ గదిలో కూచున్న తెలుగు కవి చేత ఇలా చల్లని శీకరాలు చల్లించే ఉత్తరాలు రాయించగలిగాయంటే — ఆ గ్రీకు కవయిత్రి శాఫో నమ్మకం “Someone Will Remember Us” అన్న వాక్యం సార్థక మైందనిపిస్తోంది.

    మీ ఉత్తరాలు శాఫో గురించిన వ్యాఖ్యానాలు మాత్రమే కాదు — ప్రతి ఉత్తరమూ ఒక ప్రత్యేక తాత్త్విక సందేశం. భవభూతి, టాగోర్, చలం, ప్లేటో, ఒడెస్యూస్ ఎలైటిస్, పేజ్ డు బాయిస్, సోక్రటీస్, హోమర్, రేవతీ దేవి, కమలాదాస్, వాన్ గోగ్ , ఇలా ఒకరేమిటి గత 2600 వందల సంవత్సరాలలో ఘనచరిత గల వ్యక్తులందర్నీ శాఫో పక్కన నిలబెట్టి మీరు నిర్మించిన ఒక సాహిత్యపు జెయింట్ వీల్ లో పాఠకులను తీసుకెళ్ళిన రైడ్ కలిగించిన ఒక అపురూపమైన అనుభవాన్ని వర్ణించడం చాలా కష్టం.

    ‘ప్రియమైన శాఫో’ శీర్షిక కింద మొదటి ఉత్తరంలో 2600 సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్న స్నేహితుడిగా శాఫోకి మిమ్మల్ని పరిచయం చేసుకుని చివరి ఉత్తరం లో ఇరవై ఆరు శతాబ్దాల తరువాత నీ అభిమాని అని ముగించడం మీకే చెల్లింది. ఈ ఇరవై నాలుగు ఉత్తరాలూ చదువుతూ నాకు మళ్ళీ మళ్ళీ అనిపించింది ఒక్కటే — ఇవి కేవలం రెండున్నర వేల ఏళ్ళ కితం లెస్బాస్ ద్వీపంలో జీవించి గీతాలు అల్లిన ఒక స్త్రీకి మీరు ప్రేమాభిమానాలతో రాసిన ఉత్తరాలు కాదు, ఒక కవి నీ శకలాలకు తనకు తాను ఒక దీర్ఘ ఆత్మశోధన చేసుకుని సార్వ జనీనంగా, సార్వప్రాంతీనంగా, సార్వకాలీనంగా ఎప్పటికీ నిలిచిపోయేలా రాసుకున్న తాత్విక చింతనలు.

    ఈ ఇరవై నాలుగు ఉత్తరాలూ చదివాక నాకేమనిపించిందో ఒక్క మాటలో చెప్పాలంటే — శాఫో కవిత్వ శకలాలు ఈజిప్టు ఎడారిలో ఎలా మిగిలాయో, మీ ఈ ఉత్తరాలు కూడా తెలుగు సాహిత్య చరిత్రలో అలా మిగిలిపోతాయి. ఈ ఇరవై నాలుగు ఉత్తరాలతో ఇరవై నాలుగు కొత్త లోకాలను ఆవిష్కరించి పాఠకులకు దర్శనభాగ్యం కలిగించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు భద్రుడు గారు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading