ప్రియమైన శాఫో-23

ప్రియమైన శాఫో

పూర్వకాలాల  లాక్షణికులూ, వ్యాకరణ పండితులూ, వక్తలూ నీ కవితల్లోంచి ఒక వాక్యమో, లేదా ఒక పద్యపాదమో లేదా ఒకే ఒక్క పదమో ఏదో ఒకటి ఎత్తిచూపారనీ, దానివల్లనే నీ కవిత్వం గురించి మాకు ఎంతో కొంత తెలుస్తూ ఉందనీ ముందే చెప్పాను. ఆ పండితులు ఒక కారణం వల్ల గుర్తుపెట్టుకున్న పద్యపాదాలు  మాకు మరో కారణం వల్ల మరింత స్మరణీయాలుగా మారిపోయాయి. వాళ్ళు నీ కవితల్ని పూర్తిగా ఎత్తి  రాయకపోయినా, వాళ్ళు ఉల్లేఖించిన శకలాల్ని బట్టి, ఆ కవితలో మరేముందో ఊహించడం, అందుకు అదనంగా ఒక్క అక్షరం దొరికినా ఒక పెన్నిధి దొరికినట్టు మురిసిపోవడం ఇప్పుడు ప్రపంచమంతా నీ  అభిమానుల వ్యాపకంగా మారిపోయింది. ఉదాహరణకి, ఇదుగో, Fragment 104 A గా ప్రసిద్ధి చెందిన ఈ చరణమే తీసుకుందాం:

ఈ చరణం మొదటిసారి చదివినప్పుడు నాకు ఋగ్వేదంలోని ‘రాత్రీ సూక్తం’ గుర్తొచ్చింది.  జీవితపు పొద్దు వాలుతున్నప్పటి చరమశాంతిని నువ్వీ కవితలో చెప్తున్నావనుకున్నాను. కాని పండితులు ఈ కవితమీద రాసింది చదివాక నాకిది శాంతిగీతం కాదు, అశాంతిగీతమని అర్థమయింది.

వాళ్ళు చెప్పేదాన్నిబట్టి, ఇది కూడా ఒక epithalamium నే. ఒక పెళ్ళిపాట. బహుశా శోభనగీతం. పెళ్ళికూతురిని తన భర్త దగ్గరకి చేర్చేటప్పుడు చెలికత్తెలు  పాడే పాటల్లో ఒక చరణం. దీన్ని గుర్తుపెట్టుకున్న ఆలంకారికుడు, ఇందులో ‘చేరుస్తావు’ అనే క్రియాపదాన్ని నువ్వు మూడు సార్లు ఎంతో సుశ్రావ్యంగా వినియోగించడం చూసి మురిసిపోయాడు. అతడి దృష్టి కావ్యశిల్పం మీదనే ఉంది కాబట్టి. కాని ఒకటో శతాబ్ది  రోమన్ కవి కేటల్లస్ కి ఇందులో సంతోషం కాదు, ఆందోళన కనిపించింది. ఒక కన్య తన భర్తని చేరేవేళలో ఎంత సంతోషముందో, అంత దుఃఖం కూడా ఉంది. ఎందుకంటే, ఆ క్షణం నుంచీ ఆమె తన పుట్టింటికీ దూరమైపోతుంది కాబట్టి. ఒకప్పుడు వధువుని ఆమె అత్తవారింటికి తీసుకొచ్చిన రథాల చక్రాల్ని వెను వెంటనే తగలబెట్టేసేవారట. అంటే ఇక ఆమె జీవితంలో తిరిగి తన పుట్టింటికి వెళ్ళడమంటూ ఉండదని ఆమెకి సంకేతప్రాయంగా చెప్పడమన్నమాట. ఈ దుర్భరమైన విషయాన్ని తానెక్కడో చదివానని Anne Carson తన పుస్తకంలో రాసుకుంది.

మా తెలుగులో అమ్మాయిని ఆడపిల్ల అంటారు. ‘ఆడ’ అంటే, there అనే అర్థంలో. ఆమె పుడుతూనే, ఆ కుటుంబానికి నిశ్చయమే, ఆమె ఏదో ఒకనాటికి ‘ఆడ’ ఉండవలసిన పిల్లనే గాని, ‘ఈడ’ ఉండేది కాదని. అందుకని, అనాదికాలంగా, నిజమైన ప్రవాసులంటూ ఉంటే అది స్త్రీలుమాత్రమేనని చెప్పవలసి ఉంటుంది. రాజకీయ ప్రవాసులూ, internally displaced కుటుంబాలూ, యుద్ధాల వల్ల శరణార్థులుగా పోవలసినవాళ్ళూ జీవితంలో మొదటిసారి అనుభవంలోకి తెచ్చుకునే ప్రవాసదుఃఖం ప్రతి స్త్రీకీ పుట్టుకతోనే పరిచయమవుతుంది.

అటువంటి స్త్రీలు రాజకీయకారణాలవల్లనో, యుద్ధాలవల్లనో మరే కారణం వల్లనో ప్రవాసులైతే అది వాళ్ళకి double exile అవుతుంది. ఆ ప్రవాసదుఃఖం రెండింతలు కాదు, అగణితమవుతుంది. అప్పుడు ఇక ఆ స్త్రీ నీకులాగా కవయిత్రి కూడా అయితే ఆమె తన తంత్రీవాద్యం మీద సంతోషపు తీగమీటినా విషాదమే ధ్వనిస్తూంటుంది. అందుకనే నీ కవిత్వం తెరవగానే, ఏ శకలాన్ని తాకి చూసినా, ప్రపంచమంతటా నీలానే ప్రవాసితులైన కవయిత్రులు గుర్తొస్తారు. వాళ్ళేది పాడినా, అందులో ఏకకాలంలో హేమంతవసంతాలు రెండూ, నీ మాటల్లో చెప్పాలంటే bitter-sweet గొంతుతో వినిపిస్తాయి. ఇదుగో, ఈ కవితలోలానే.

లేకపోతే ఏమిటి చెప్పు! పశువుల్ని ఇంటికి, పక్షుల్ని గూటికి, బిడ్డల్ని తల్లి ఒడికి చేర్చే సాయంకాల శుక్రతారని చూడగానే నిశ్చింతకి బదులు దిగులు పుట్టే ఈ కవిత చదవగానే నాకు గాబ్రియేలా మిస్ట్రాల్ గుర్తొస్తోంది. ఆమెని Sappho of Chile అనవచ్చునేమో. అన్నారేమో కూడా! ఒక జీవితకాల ప్రవాసి. తాను పుట్టిన ఆండీస్ పర్వతప్రాంతపు లోయలనుంచి చిన్నప్పుడే దూరమైంది. ఆ తర్వాత కొన్నాళ్ళు శాంటియాగోలో ఉద్యోగం  చేసినప్పటికీ, అది తాను పుట్టిపెరిగిన ఊళ్ళల్లాగా కొండప్రాంతం కాదు. ఇక ఆమె తన ముప్ఫై ఆరో ఏట చిలీ వదిలిపెట్టినప్పటినుంచీ ఒక ‘సంచార ప్రవాసి’ గానే గడిపింది. అమెరికాలో, యూరోపులో, లాటిన్ అమెరికాలోనే బ్రెజిల్ లో, మెక్సికోలో దౌత్యశాఖ ఉద్యోగిగా తన పుట్టిపెరిగిన  ప్రాంతం నుంచి శాశ్వత ప్రవాసిగా మారిపోయింది. తన కవిత్వానికి నోబెల్ పురస్కారం లభించాక చిలీలో అడుగుపెట్టినప్పటికీ అది తాత్కాలికంగా మాత్రమే. చివరికి అమెరికాలో కన్నుమూయడంతో ఆమెని జీవితకాల ప్రవాసిగా అభివర్ణించినా అతిశయోక్తి కాదు.

ప్రేమించడం తప్ప మరొకటి తెలియని మనిషి. కాబట్టే ఆమెకి దగ్గరగా వచ్చినవాళ్ళు ముందు ఆ ప్రేమని చూసి భయపడ్డారు. తట్టుకోలేకపోయారు. తన నవయవ్వనంలో ఒకరిని ప్రేమించింది. అతడు ఏ కారణంవల్లగానీ ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకర్ని ప్రేమిస్తే, అతడు మరొకామెని పెళ్ళి చేసుకున్నాడు. అంతే, ఆమె తిరిగి పెళ్ళి మాట ఎత్తలేదు. తర్వాత రోజుల్లో తన సోదరుడి బిడ్డను తానే పెంచి పెద్దచేసింది. కన్నకొడుకులాగా భావించింది. కానీ ఆ పిల్లవాడు కూడా పదిహేడేళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో ఆమె గుండె ముక్కలై పోయింది. కానీ ఈ విషాదాలు ఆమెని కూల్చెయ్యలేదు. అందుకు బదులుగా మొత్తం ప్రపంచాన్ని తన కుటుంబంగా భావించే హృదయవైశాల్యాన్ని తన రచనల్లో కనపరిచింది. తనకంటూ పిల్లలు లేకపోయినా, జీవితమంతా పిల్లలకోసం నిర్విరామంగా పనిచేసిన విద్యావేత్తగా ప్రఖ్యాతిచెందింది. కాబట్టే, ఆమె కవిత్వంలోనూ, జీవితంలోనూ కూడా మధురవిషాద పార్శ్వాలు రెండూ కలగలిసి కనిపిస్తాయి. మామూలు ప్రజలు మాట్లాడుకునే మామూలు భాషలో కవితలు రాసినందువల్లా, అవి గానయోగ్యంగా ఉండే పాటలు కావడం వల్లా, ఆమె సంచార జీవితం వల్లా ఆమెని ఒక ట్రుబడోర్ గా  పిలిచేరు. ట్రుబడోర్లు మధ్యయుగాల్లో  యూరోపులో పాటలు పాడిన సంచారగాయకులు. మిస్ట్రాల్ కవిత్వంలో ఆ మధ్యయుగాల సరళగ్రామీణ భాష కనిపిస్తుందంటారు. మా మధ్యయుగాల భక్తి కవుల్లో కనిపించే rough rhetoric లాగా. అటువంటి ఒక కవిత, Fear, ఈ సందర్భంగా నాకు గుర్తొస్తోంది:

నీ కవితలో పైకి కనిపించని వేదనని పూర్తిగా మాటల్లో పెడితే మిస్ట్రాల్ రాసిన కవిత అవుతుంది కదూ. ఇందులో, పైకి అమాయికంగా వినిపిస్తున్న ఈ తల్లిమాటల్లో, చెప్పలేనంత ఆందోళన ఉంది. ఇటువంటి కవిత ఏ  తల్లీ కూడా  ఒక కొడుకు గురించి రాస్తుందనుకోను. కాని ప్రతి తల్లికీ, తన కూతురి గురించి తన మనసులో ఎప్పటికీ ఇటువంటి వేదననే కదలాడుతుంటుందని చెప్పవచ్చు. ఇదుగో, ఆమె రాసిన మరో గీతం The Sad Mother (La Madre Triste) లో కనిపించే ప్రాణాధికమైన వేదన లాంటిది.

ఆడపిల్లలకి ఈ ప్రపంచంలో పురుషుల వల్ల ఎంత ప్రేమ లభించిందో నాకు తెలియదుగానీ వాళ్ళ తల్లులు మాత్రం వాళ్ళని సర్వకాల సర్వావస్థల్లోనూ వదిలిపెట్టకుండా అంటిపెట్టుకునే ఉంటారన్నది మాత్రం నిజం శాఫో!

21-5-2026

3 Replies to “ప్రియమైన శాఫో-23”

  1. Sappho తో బాటుగా, మరెందరో Sapphos of the world ని ఈ విధంగా పరిచయం చెయ్యడం ఎంతో బాగుంది సర్.
    ఏ కాలాల్లో అయినా ఏ భూభాగంలో అయినా నిరంతర ప్రవాసితులై, తమ అగణితమైన ప్రవాసదుఃఖాన్ని స్త్రీలు, శాఫో నుండి గాబ్రియేలా మిస్ట్రాల్ దాకా ఏ విధంగా తమ కవిత్వంలో, పాటల్లో వినిపించారో అద్భుతంగా చెప్పారు.
    స్త్రీ జీవితంలో exile (of any kind) ఎంత సహజమైనదిగా కన్పించినా ఎంత విషాదభరితమైన అనుభవమో ఈ కవులు beautiful గా రాసుకున్నారు.
    మీ అనువాదంలో వారి కవిత్వం (ముఖ్యంగా ఆ bitter-sweet voice) చాలా touching గా ఉంది.

    “ ఆడపిల్లలకి ఈ ప్రపంచంలో పురుషుల వల్ల ఎంత ప్రేమ లభించిందో నాకు తెలియదుగానీ వాళ్ళ తల్లులు మాత్రం వాళ్ళని సర్వకాల సర్వావస్థల్లోనూ వదిలిపెట్టకుండా అంటిపెట్టుకునే ఉంటారన్నది మాత్రం నిజం”
    How true!! 🙏🏽

  2. అమ్మ అంటేనే అమృతం కదా మరి. నమస్సులు సర్

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading