ప్రియమైన శాఫో-21

ప్రియమైన శాఫో

ఈ మండుటెండల్లో ఇలా కూచుని నీకు ఉత్తరాలు రాస్తుంటే, నేనే కాలంలో, ఏ దేశంలో జీవిస్తున్నానో తెలియకుండా ఉంది. బహుశా ప్రేమ ఋతువులు వేరే ఉంటాయనుకుంటాను. లేకపోతే, ఇంత ఎండల్లో కూడా కోకిల పొద్దున్నే లేచి నగరం మీద ఇలా పూలెందుకు జల్లుతూ ఉంటుంది? నేలకీ, నింగికీ మధ్య అగ్నిస్తంభాలు నిలబెట్టినట్టుండే ఈ పగటి పూట తురాయిమొగ్గలిప్పుడే నెమ్మదిగా నిద్రలోంచి లేచి కళ్ళు విప్పుకుంటూ ఉంటాయి? ప్రేమకాలం, ఎప్పుడో గతించిపోయినట్టుండే, ఎప్పటికీ ఇంకా పూర్తిగా చేతికందని కాలం. ఎప్పుడో దాటివచ్చేసినట్టుండే, ఇంకా మనం చేరలేని దేశం. అత్యంత దుఃఖపూరితం, కాని దుఃఖం లేని దేశం. ఎంత దగ్గరగా లాక్కుంటుందో అంతగానూ దూరంగా వెళ్ళిపోవాలనిపించే సన్నిధి.

అందుకే, Fragment 96V చదవగానే నాకు అన్నిటికన్నా ముందు కలిగింది బెంగ, సాయంసంధ్యాకాంతి ఇంకా చెరిగిపోకుండానే నింగిమీద కనిపించే నెలవంకని చూసినప్పుడు కలిగే ఉద్విగ్నత. ఆ కవితలోని ఖాళీజాగాల్ని పక్కనపెట్టేసి మాకు దొరికిన వాక్యాల్నే, ఆ పదాల్ని కూడగట్టుకుని చదివితే ఇలా వినిపించే కవిత:

ఎటువంటి లోకాన్ని ఆవిష్కరిస్తున్నావు నువ్వీ కవితలో. ఇది absence గురించిన కవిత ఎంతనో, అంతగా presence గురించిన కవిత కూడా.  ఇందులో ‘ఉన్నదీ’ మధురంగా ఉంది, ‘లేనిదీ’ మధురంగా ఉంది. ఇప్పుడు మీ మధ్య లేని మీ మిత్రురాలు, ఎక్కడో లిడియాదేశంలో సాదిస్ నగరంలో జేగీయమానంగా వెలుగుతున్న ఆ యువతి , ఇప్పుడు మీ మధ్య లేదని ఎలా చెప్పగలం? ఎంతకాలమైతే, గులాబి రంగు అంగుళుల్తో చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడో అంతకాలం ఆమె  మీ మధ్య ఉన్నట్టే. ఎంత కాలమైతే మరువం, దవనం, చామంతి, మాచిపత్రి సువాసనలీనుతూ ఉంటాయో అంతకాలం ఆమె తలపులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. అక్కడ ఆమెదీ అదే కథ. వెళ్ళడమైతే సాదిస్ నగరానికి వెళ్ళిపోయింది గాని, ఆమె తన మనసు తలుపులు ఓరగా మీ తీరం వైపు తెరిచిపెట్టే ఉంచింది. అలా ఆమె మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుందన్న తలపులే కదా ఇక్కడ మీ మనసుల్ని కూడా తినేస్తున్నవి!

ఈ కవితలో కూడా నువ్వు హోమరీయ ప్రపంచాన్ని తిరిగి తన కాళ్ళమీద నిలబెట్టావని విమర్శకులు రాసింది చదివాను. ఆయన rosy-fingered dawn అంటే, నువ్వు దాన్ని rosy-fingered moon గా మార్చావని రాసారు. ఇక్కడ ఉన్నది నిజానికి వియోగం. నిన్నటిదాకా మీతో కలిసి తిరిగిన మీ స్నేహితురాలిప్పుడు మీ మధ్య లేదు. మీ సంతోషకరదినాల పైన చీకటివాలింది. కాని అదే సమయంలో ఆమె తలపులు, ఒకప్పుడు మీరు కలిసి గడిపిన క్షణాలు కొత్త వెలుగుని మీ చుట్టూ పరిచిపెడుతున్నాయి. మనుషులు నీ ఎదట ఉన్నప్పటి సౌందర్యాన్ని నువ్వెంత గానం చేసావో, వాళ్ళు నీ ఎదట లేనప్పటి అందాన్ని కూడా మరింత ఆనం దంగా గానం చేసావని నిన్ను క్షుణ్ణంగా చదివినవాళ్ళు చెప్పగా విన్నాను. ఇక్కడ ఈ త్రికోణంలో, నువ్వు నీ ఎదట ఉన్న అత్తిస్ ని ఎంతగా దీపింపచేస్తున్నావో మీ దగ్గర లేని ఆ యువతిని కూడా అంతే ప్రకాశింపచేస్తున్నావు. వారిద్దరూ ఒకరి వల్ల ఒకరు మరింత శోభిల్లుతున్నారు. వారిద్దరికీ ఒకరి పట్ల ఒకరికున్న ఆ ప్రేమని ఇలా చిత్రిస్తున్నందువల్ల నువ్వు మరింత చెన్నొందుతున్నావు.

ఇదే, ఇలా స్పందించగలిగే హృదయాలు, మనుషులు తమ ఉనికినీ, లేకునికినీ కూడా ఇలా ఉత్సవసదృశంగా అనుభూతి చెందే హృదయాలు- ఇటువంటి సాంగత్యాలు, ఇటువంటి స్నేహాలు కావాలనిపిస్తుంది నాకు శాఫో! అటువంటి మనుషులు కనిపించకనే కదా నేను కోకిలతోనూ, తురాయిపూలతోనూ జట్టు కడుతున్నది. అటువంటి మనుషులు కనుమరుగవుతున్నారు కాబట్టే అటువంటి కవిత్వాలు కూడా కనుమరుగవుతున్న కాలం నాది. అందుకనే చూస్తాను, నీ వంటి కవులు ఎక్కడెక్కడ ఏ పూర్వకాలాల్లో ఏ దూరతీరాల్లో నివసించినా వాళ్ళని పేరుపేరునా వెతుక్కుంటూ వెళ్తాను. అలాంటి కవులు కనబడ్డ రోజు నాకు నిజంగా పండగ.

నిన్నంతా నేనట్లాంటి ఒక కవి ప్రపంచంలో విహరిస్తూ ఉన్న్నాను. Japan Sappho గా ప్రసిద్ధి చెందిన ఆధునిక జపాన్ కవయిత్రి Yosano Akiko. కవి, పండితురాలు, స్త్రీవిమోచనోద్యమ కారిణి, ప్రపంచయుద్ధంలో కూరుకుపోతున్న జపాన్ ని శాంతిమార్గం వైపు మళ్ళించడానికి శాయశక్తులా ప్రయత్నించిన శాంతిదూత, దేశాన్ని యుద్ధాల్లోకి నెట్టొద్దని చక్రవర్తినే హెచ్చరించగలిగిన సాహసికురాలు- కాని వీటన్నిటినీ మించి ప్రేమికురాలు. ఎంత ప్రేమలేకపోతే, వ్యక్తిగతజీవితంలోనూ, సాంఘిక-రాజకీయ జీవితంలోనూ కూడా అంత నిర్విరామకృషి చెయ్యగలుగుతుంది! పదకొండుమంది బిడ్డల తల్లిగా వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటూనే మరోవైపు యాభై వేల కవితలదాకా రాసిపెట్టి వెళ్ళిందంటే ఆ జీవశక్తి మామూలు ప్రాణశక్తికాదు. అందుకనే ఆమెని   జపాన్ లో Goddess of Poetry అని పిలుస్తారనీ, ఆమె జీవించిన కాలాన్ని జపాన్ సాహిత్య చరిత్రలో అకికొ యుగంగా పరిగణిస్తారనీ విన్నప్పుడు ఆశ్చర్యం  కలగలేదు.

399 తంకాలతో ఆమె వెలువరించిన మొదటి కవితాసంపుటి Midaregami (చిక్కుబడ్డ కేశరాశి) చదవగానే జపాన్ పాఠకులు మన్యోషూ, కొకింషూ  కాలం నాటి పూర్వకవయిత్రి ఒకామె తమ మధ్యకి తమ కాలం నాటి భాష మాట్లాడుతూ కనబడ్డట్టుగా పరవశించిపోయారు. నిన్నంతా ఆ పుస్తకంలో కొన్ని తంకాలకు ఇంగ్లిషు అనువాదం చదువుతూ ఉన్నాను. నాకైతే గాథాసప్తశతి కాలం నాటి ప్రాకృత కవయిత్రిని చదువుతున్నట్టుగా అనిపించింది. చూడు, కొన్ని తంకాలు నీతో పంచుకోవాలనిపిస్తోంది:

కాని ఆ కవిత్వం ఆమె జీవితంలో  ఎప్పటికీ వాడిపోని పువ్వుగా, ఎన్నటికీ ఎండిపోని సెలయేటి ఊటగా నిలబడింది. కాబట్టే, తన గురించి ఇలా రాసుకుంది:

కవిత్వం ఆమెలోని యవ్వనోధృతిని దాటి ఒక జీవితస్వభావంగా మారిపోయింది. ప్రేమించే స్వభావం వల్ల ఆ కవిత్వానికి ఎక్కడలేని బలం చేకూరుతూ ఉంది, కవితాశక్తి వల్ల ఆమెలో ప్రేమించగలిగే శక్తి కూడా దినదినాధికమవుతూనే ఉంది. ఈ తంకా చూడు:

మన్వంతరాల పాటు నిలిచే ప్రేమ దక్కినప్పుడు, మన్వంతరాల పాటు నిలబడగల కవిత్వం కూడా దక్కుతుంది.

నువ్వు ఏ bitter-sweet జీవితానుభూతిని కోరుకున్నావో ఆమె కవిత్వమంతా అది కనిపిస్తూనే ఉంది.ఈ కవిత చూడు:

మరో కవిత-

అంత ప్రేమోధృతి ఉన్నప్పుడు వాళ్ళకి ప్రతిఒక్క క్షణం ప్రాణశక్తితో ప్రకంపిస్తూనే ఉంటుంది. కనుకనే ఆ కవితలు చదువుతున్నప్పుడు, ఒక వెచ్చని ఊపిరి మనల్ని దగ్గరగా తాకుతున్నట్టనిపిస్తుంది. ఈ కవితలో పట్టుకున్నది అటువంటి క్షణాన్నే:

ప్రేమ ఆమెని పరిశుభ్రపరిచింది. ఆమె తన హృదయాన్ని ఒక ప్రేమికుడికి అర్పించుకుని ఉండవచ్చుగాని, వాక్కు వల్ల ఆ హృదయం ఆమెని ఎవరు చదివితే వారిదైపోతున్నది, అచ్చం నీ కవిత్వం లానే. ఇలాంటి కవిత ఎవరు రాయగలరు శాఫో. అయితే నువ్వూ, లేకపోతే ఆమే!

కాని ప్రపంచం ఏం చేస్తూ ఉంటుంది?

ఇటువంటి కవిత్వాలు చదివినప్పుడు జీవితంలోని ప్రతి ఒక్క క్షణాన్నీ ఎలా చేరదీసుకోవచ్చో బోధపడుతుంది. అది చర్చలవల్లా, వాదాలవల్లా, వివాదాలవల్లా  తెలిసేది కాదు. ఆ మాటే ఇలా చెప్తోంది:

మండుటెండల్ని మంచిగంధపు చర్చగా మార్చేది శాఫో, ఇదుగో నీలాంటి కవులూ, మీరు రాసే కవిత్వాలూనూ!

19-5-2026

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading