
ప్రియమైన శాఫో
సముద్రాలు వేడెక్కుతున్నాయనీ, ఋతుపవనాలు బలహీనంగా ఉంటాయనీ, రాబోయే కాలం గడ్డుకాలం కాబోతున్నదనీ నిత్యం వినిపించే హెచ్చరికల మధ్య, నిన్న ఒక శుభవార్త విన్నాను. ప్రతి ఏటా ఋతుపవనాల రాకని ముందే ప్రకటించే వానకోయిల తెలంగాణాలో ఇప్పుడే కనబడిందట. మిటీరియొలాజికల్ డిపార్ట్ మెంట్ వారి లెక్కల్తో సంబంధం లేకుండా చాతకపక్షి ఋతుపవనాల ఆగమనాన్ని ప్రకటిస్తున్నదనే వార్త వినగానే నాకు ప్రాణం లేచొచ్చింది. నీ కవిత, Fragment 44 లో ట్రోజన్ వార్తాహరుడు మంగళ వార్త కొనితెచ్చినట్టుగా.
నీ తక్కిన కవిత్వమంతా ఒక తరహా, ఈ కవిత ఒక్కటీ మరొక తరహా. మామూలుగా హోమర్ లాంటి ఇతిహాస కవులు సామాజిక ఇతివృత్తాల మీద కవితలు రాస్తే, నువ్వూ, ఆల్కేయసూ లాంటి లెస్బోస్ కవులు, వ్యక్తిగత సుఖదుఃఖాల గురించి గీతాలు రాసేరనేది అందరూ చెప్పేమాట. కానీ ఈ కవితలో నువ్వు హోమర్ లాగా ఐతిహాసిక ఛందస్సులో, ఒక ఐతిహాసిక సందర్భాన్ని గానం చేస్తూ కవిత చెప్పావు. ట్రోజన్ రాకుమారుడు హెక్టర్ వివాహం గురించిన కవిత. కాని గమనించవలసిందేమంటే, ఇలియడులో ఎక్కడా, హోమర్ చూడని, చూపించని దృశ్యం. ఆయన కేవలం యుద్ధాన్ని చూసాడు, చూపించాడు. కాని నువ్విక్కడ వివాహవేడుకని చూపిస్తున్నావు. ఎటువంటి కవిత ఇది!
. ..
. ..
. ..
సైప్రస్. ..
వార్తాహరుడు అరుదెంచాడు. ..
ఇడేయస్, మెరుపువేగంతో పయనించే వార్తాహరుడు
‘. ..
ఇక తక్కిన మొత్తం ఆసియా . .. అనశ్వర యశస్సుతో
హెక్టరూ అతడి మిత్రులూ పవిత్ర థీబ్సుపట్టణం నుంచి
నిత్యస్రోతస్విని ప్లేకియా నదీతీరం నుంచి
మెరిసే కళ్ళ చిన్నారిని, సుందరాంగి ఆండ్రొమెకిని
తీసుకొస్తున్నారు- లవణవారాశిమీంచి ఓడల్లో
అగణిత స్వర్ణాభరణాలతో, సుగంధాలీనే రాజవస్త్రాలతో
తళతళ్ళాడే వజ్రాలహారాల్తో, అసంఖ్యాక రజతపాత్రల్తో
దంతపు సామగ్రితో.’
అని చెప్పాడతడు. హెక్టర్ కన్నతండ్రి ఆ వార్త వింటూనే
ఒక్క ఉదుటున లేచాడు. శుభవార్త ఇంతలోనే నగరం నలుమూలలా
పాకిపోయింది. వెనువెంటనే ట్రోజన్ పౌరులు
కంచరగాడిదలు పూన్చిన రథాలతో తరలి వచ్చారు. స్త్రీలు
హంసయానలైన కన్యకాగణంతో అడుగుపెట్టారు.
వారు కాక, చక్రవర్తి కుమార్తెలు కూడా. ..
అవివాహితులైన యువకులు రథాలకి గుర్రాల్ని పూన్చారు. .. నలుదిక్కులా. ..
… రథసారథులు. ..
. ..
. .. దేవతల్లాగా
. .. పవిత్రసమారోహం
సత్వరమే అరుదెంచారు. .. ట్రాయి పట్టణానికి
మధుర వేణుగానానికి, తంత్రీవాద్యాలకు శ్రుతికలుపుతూ
తాళాలు, తప్పెట్లు. కన్యకలు మంగళగీతం ఆలపించారు
వెండి వెలుగులు విరజిమ్మే దివ్యాలాపన
ఆకాశాన్ని తాకింది, నవ్వులు. ..
వీథుల్లో ఎక్కడ చూసినా . ..
పానపాత్రలు, పానీయకలశాలు. ..
సాంబ్రాణి, పునుగు, జవ్వాజి సువాసనలు
ముత్తైదువులు గొంతు కలిపారు
మగవాళ్ళంతా దిక్కులు పిక్కటిల్లేలాగా దేవతల్ని
స్తోత్రం చేశారు, తంత్రీవాద్యకారులు
మొత్తమంతా హెక్టర్నీ, ఆండ్రొమెకినీ స్తుతించారు
వారిద్దరూ దేవతల్లాగా శోభిస్తున్నారని కీర్తించారు.
ఇందులోని ఖాళీలతో సహా ఇదొక ఉత్సవ గీతం. కాలం కబళించిన ఆ అక్షరాలూ, ఆ పదాలూ ఏవైనా గానీ, ఆ ఖాళీజాగాలతో సహా, మొత్తం గీతమంతా ఒక ఉత్సవ సంరంభం. ఇది స్పష్టంగా ఒక epithalamium. నీ కవిత్వంలో చాలాభాగం వివాహసందర్భంగా ఆలపించే గీతాలే అని విన్నాను. పెళ్ళి, దాంపత్యం, పిల్లలు, వివాహం వల్ల ముడిపడబోయే రెండు కుటుంబాలు, పట్టణాలు, సమాజాలు- వీటిని నువ్వు నీ జీవితమంతా ఉచ్చైస్వరంతో ఉగ్గడిస్తూనే ఉన్నావు. ఈ గీతంలో చివరికి వచ్చేటప్పటికి నవవధూవరులు దేవతల్లారా ఉన్నారని దీవించేటప్పటికి, ఇక్కడ మనుషులకీ, దేవతలకీ మధ్య ఉన్న సరిహద్దుల్ని కూడా చెరిపేసావు.
నువ్వు ప్రేమని వర్ణించేటప్పుడు, అది ఇద్దరు స్త్రీలమధ్యనైనా, లేక స్త్రీపురుషులమధ్యనైనా, దాదాపుగా హోమరీయ యుద్ధాలంకారాల్నే వాడేవని గతంలో చూసాము. ఇప్పుడు ఒక వివాహాన్ని కూడా, ఒక నగరాన్నో, యుద్ధాన్నో, సముద్రాన్నో వర్ణించినట్టుగా ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించడం చూస్తున్నాం. హోమర్ రాసిన రెండు ఇతిహాసాల్లోనూ ఎక్కడా కూడా వివాహసందర్భం లేదు. కానీ కనీసం ఒక పెళ్ళి గురించి కూడా చిత్రించకుండా దాన్ని ఇతిహాసం అని ఎలా అనగలం? అందుకనే అకిలిస్ కవచం మీద దేవలోకపు కమ్మరి చిత్రించిన వర్ణనల్లో పెళ్ళి గురించిన వర్ణన చేర్చకుండా హోమర్ ఉండలేకపోయాడు.
కాని ఈ పెళ్ళివేడుక ట్రాయిపట్టణంలోనో లేదా హోమర్ పుట్టాడని వాదించుకునే ఏడు పట్టణాల్లో ఏ ఒక్క పట్టణంలోనో జరిగినట్టుకాక, నువ్వు పుట్టిపెరిగిన లెస్బోస్ నేలమీదనే జరిగిందా అనిపిస్తుంది. ఎందుకంటే హోమర్ కి తెలియని సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాలు, మంగళనాదాలు ఈ కవితలో కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయంలో మాత్రం హోమర్ కావ్యప్రపంచానికీ, నీ గీతప్రపంచానికీ పోలిక ఉందని చెప్తారు. అది యశం, గ్రీకులో Kleos. అంటే ఒక మనిషి గురించిన సద్వార్త. శుభవార్త. పూలతావిలాగా త్వరత్వరగా వ్యాపించే గుణసంకీర్తన.
నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో, అడ్మినిస్ట్రేటివ్ ట్రయినింగులో ఉన్నప్పుడు ఒక ఫాకల్టీ ప్రభుత్వోద్యోగి నడత ఎలా ఉండాలో చెప్తూ, reputation travels fast అని అన్నాడు. ఆ మాట నాకు అప్పుడు అర్థం కాలేదు. కాని ఆ తర్వాత నా ఉద్యోగజీవితం పొడుగునా, నేను ఒక చోటనుంచి మరోచోటకి బదిలీ అయి వెళ్తున్నప్పుడల్లా పదే పదే గుర్తొచ్చేది. సంగీతం, సౌందర్యం, సుగంధం- వీటికన్నా కూడా నువ్వు మనిషి యశోవైభవాన్ని ఈ గీతంలో ఒక మెట్టు పైనే నిలబెట్టావు.
కొందరు ఈ కవితలో నువ్వు హెక్టర్ నీ, ఆండ్రొమెకినీ తీసుకురావడం ద్వారా వివాహజీవితపు అశాశ్వతాన్ని చిత్రిస్తున్నావేమో అని అనుమానించారు. ఎందుకంటే, ట్రోజన్ యుద్ధంలో, అకిలిస్ హెక్టర్ ని వధించడమే కాక, అతడి కళేబరాన్ని యుద్ధభూమిలో అత్యంత అవమానకరంగా నేలమీద ఈడుస్తాడు. యుద్ధం ముగిసిపోగానే, ఆండ్రొమెకిని అకిలిస్ తన కొడుక్కి బానిసగా అప్పగిస్తాడు. ఇక ఆ దంపతుల ఏకైక సంతానం అస్ట్యానక్స్ రేప్పొద్దున్న పెరిగి పెద్దయ్యాక మళ్ళా ట్రాయి నగరాన్ని తిరిగి నిర్మిస్తాడేమో అనే అనుమానంతో గ్రీకులు ఆ పిల్లవాణ్ణి నగరకుడ్యాల మీంచి లోయలోకి విసిరేస్తారు. హెక్టర్, ఆండ్రొమెకిల వివాహం గురించిన ఈ గీతం పాడుతున్నప్పుడు, వింటున్న శ్రోతలకి ఆ కథ తెలుసు కాబట్టి, వాళ్ళ మనసుల్లో దాంపత్య జీవితపు పరమార్థం ఇలానే ఉంటుందా అనే నిర్వేదం కలగడం నీ ఉద్దేశ్యమా అని కొందరు అనుమానించారు. కాని నా అనుభవం మరోలా ఉంది. నేను ఇలియడు కావ్యం చదివి ముప్ఫై ఏళ్ళు దాటింది. ఈ గీతంలో హెక్టర్, ఆండ్రొమెకి ల పేర్లు వినగానే నాకు గుర్తొచ్చిన దృశ్యం, యుద్ధభూమినుంచి ఒకసారి హెక్టర్ ఇంటికొచ్చి, తన భార్యనూ, బిడ్డనూ ఒకసారి కళ్ళారా చూసి, మనసారా పలకరించి వెళ్ళిపోయే దృశ్యం. ఆరవ సర్గలోని ఆ దృశ్యం, ముఖ్యంగా ఈ పంక్తులు:
అలా అన్నాక, హెక్టర్ ఆ చిన్నారిబిడ్డ కోసం
రెండు చేతులూ చాచాడు. కాని బిడ్డ భయపడ్డాడు
తండ్రి యుద్ధవేషం చూసి, కాంస్యశిరస్త్రాణం చూసి
దానిమీద ఊగాడుతున్న గుర్రపుజుత్తు తురాయి చూసి.
బిడ్డని చూసి తండ్రి నవ్వాడు, తల్లి కూడా నవ్వింది.
హెక్టర్ తన శిరసుమీంచి శిరస్త్రాణం తీసి కిందపెట్టాడు,
సూర్యరశ్మిలో అది మెరుగులీనుతున్నది. అతడు
తన బిడ్డని ముద్దాడి, తన చేతుల్తో పైకీ కిందికీ
ఆడిస్తూ దేవతల్నిట్లా ప్రార్థించాడు:’సర్వేశ్వరా! సమస్త
దేవతలారా! ఈ బిడ్డ, నా కొడుకు, నాకులానే ట్రోజన్ల
యువరాజు కావాలి. ఈ బిడ్డడు బలంగా, దృఢంగా
ధైర్యస్థుడిగా ఎదగాలి, ఇలియంధరణీతలాన్ని ఏలాలి
ఒకరోజు వీడు యుద్ధక్షేత్రం నుంచి ఏ శౌర్యవంతుల
రక్తంతోనో తడిసిన చేతుల్తో, తల్లి గర్వపడేలాగా
తిరిగివస్తున్నప్పుడు చూసేవాళ్ళంటారు కదా:
‘వీడు నిజంగా వీళ్ళ నాన్నని మించిపోయాడు’. ..
అంతిమంగా ఏదీ శాశ్వతం కాదు. మనిషంటూ పుట్టాక ఏదో ఒక రూపంలో మరణం తప్పదు. కాబట్టి నువ్వు వివాహపర్యవసానంగా విషాదమే మిగుల్తుందని చెప్తున్నావని అనుకోను. అంతకన్నా కూడా- మనుషులు బతికిన క్షణాలు, వాళ్ళ చుట్టూ అల్లుకున్న అనుబంధాలు, సంతోషాలు- ఆ రోజు పూచిన పువ్వులు, పరిమళించిన సుగంధాలు, ఒకరికొకరు చెప్పుకున్న శుభాకాంక్షలు- నిజంగా శాశ్వతమైనవంటూ ఉంటే ఇవే అనే నువ్వు నమ్ముతున్నావని నాకనిపిస్తున్నది.
ట్రోజన్ యుద్ధపరిసమాప్తిలో హెక్టర్ కొడుక్కి ఎటువంటి దుర్మరణం సంభవించిందో హోమర్ చెప్తేనే కదా మనకు తెలిసింది. మరి ఆ పిల్లవాడిమీద ఆ తండ్రి కురిపించిన ఆ ఆశీసుల గురించి కూడా ఆ హోమరే కదా చెప్పాడు. కావ్యం చివరకు వచ్చేటప్పటికి హెక్టర్ బిడ్డకి దుర్మరణం సంభవిస్తున్నప్పుడు ఈ ఘట్టం మన మదిలో మెదలకుండా ఎలా ఉంటుంది? కానీ హోమర్ ఉద్దేశ్యం మన కంటితడిపెట్టించడం కాదు. యుద్ధ మధ్యంలో ఒక తండ్రి ఇంటికొచ్చి తన బిడ్డను పలకరించివెళ్తున్నప్పుడే ఆ కుటుంబానికి అది చివరి కలయిక అని ఆయన సూచిస్తున్నాడు. మరణాల్నీ, దుర్మరణాల్నీ కూడా దాటింది యశం. Kleos అంటే నిజమైన అర్థం ‘నీ గురించి మనుషులు వినేది’ అని. హోమర్ దృష్టిలోనూ, నీ దృష్టిలోనూ కూడా అంతిమంగా లెక్కకు వచ్చేది ఒక మనిషి గురించి తక్కిన మనుషులు ఏం వింటారనేది మాత్రమే. అలాగే హోమర్ దృష్టిలోనూ, నీ దృష్టిలోనూ కూడా, ఆ యశం ఆ వీరులది మాత్రమే కాదు, ఆ వీరగాథది కూడా.
కాని హోమర్ దృష్టిలో ప్రధానంగా ఒక మనిషి యుద్ధంలో మరణిస్తేనే ఆ యశస్సుకి నోచుకుంటాడు. కానీ నీ దృష్టిలో మనుషులు పంచుకునే ప్రేమ, వాళ్ళు జరుపుకునే వేడుకలు, ఒకరికొకరు చెప్పుకునే శుభాకాంక్షలు కూడా ఆ Kleos ను సాధించగలవు. హోమర్ దృష్టిలో యశస్సు అనేది రక్తం చిందించి, ప్రాణాలు కోల్పోతే వచ్చే ఒక ‘నిశ్చల స్మారకం’. కానీ నువ్వు దాని పరిథి మార్చేసావు- మనుషులు పంచుకునే ఒక చిన్న పలకరింపులో, ఒకరినొకరు కలుసుకున్నప్పుడు విరబూసే నవ్వులలో, ఒకరికొకరు చెప్పుకునే శుభాకాంక్షల్లో కూడా ఆ అమరత్వాన్ని సాధించవచ్చని నువ్వీ కవితలో నిరూపిస్తున్నావు. వీరగాథా సంప్రదాయం పైన ఇదొక ‘సున్నితమైన తిరుగుబాటు’. ఒక స్త్రీ కవయిత్రి అయినప్పుడు ఆమె ఒక ఇతిహాసం రాస్తే ఇలా ఉంటుంది.
18-5-2026

