ప్రియమైన శాఫో-18

ప్రియమైన శాఫో

నిన్న చూసాను, మా కాలనీని ఆనుకుని ఉన్న మార్కెట్ గోడ పక్కన తురాయిచెట్టుమీద మొదటి పూలకొమ్మని. వేసవీ, వైశాఖమూ అనగానే తురాయిపూలే నా మనసులో మెదుల్తాయి. నా చిన్నప్పుడు వేసవి సెలవుల్ని తురాయిపూల వికాసంతో లెక్కపెట్టుకునేవాణ్ణి. ఆ చెట్టుమీద పచ్చని కొమ్మ ఒక్కటి కూడా కనబడకుండా మొత్తం ఎర్రటి పూల గొడుగు పట్టినట్టుంటే అది నడివేసవి అన్నమాట. నెమ్మదిగా ఆ ఎర్రపూల మధ్య నల్లని కాయలూ, మళ్ళా ముదురాకుపచ్చ కొమ్మలూ కనబడుతుంటే వేసవి ముగుస్తున్నట్టు. మళ్ళీ బడికి వెళ్ళాలన్న బెంగ.

తురాయిపూలకొమ్మ నా Midsummer Day Dream. నిన్ను ఎవరు పలకరించనీ, పలకరించకపోనీ, నువ్వేది సాధించనీ, సాధించకపోనీ, క్రమం తప్పకుండా సంభవించే ఋతుపరిభ్రమణంలో నువ్వు కూడా ఉన్నావన్న మెలకువ ఒక్కటి చాలు..

అందుకని ఇదుగో, నీ యీ కవితా శకలం, Fragment 48 నాకు ఒక ప్రేమకవితాశకలంలాగా అనిపించదు. అది ఒక సాఫల్యతా సూచిక.

ఆ నువ్వు ఎవరన్న దాని పట్ల నాకేమీ అంత ఆసక్తి లేదు. అది నా వరకూ మా వీథిచివర పూసిన తొలితురాయి కొమ్మ కావచ్చు. లేదా కాళిదాసు అనుకున్నట్టు: ‘సంతప్తానాం త్వమహి శరణం'(దహించుకుపోతున్నవాళ్ళకి నువ్వే దిక్కు ) ఆషాఢమేఘం కావొచ్చు. లేదా ఒక కారుమబ్బు కనబడగానే ‘బాదల్ దేఖ్ ఝరీ’ అని మీరా పాడుకున్నట్టు.

ఇంతకుముందు Fragment47 కీ ఈ శకలానికీ మధ్య ఎంత తేడా! అక్కడ కొండమీద ఓక్ చెట్టుని గాలివాన గుంజేసినట్టు ప్రేమదేవత నిన్ను కుదిపేసాడన్నావు. ఇక్కడ దహించుకుపోతున్న మనసుని చల్లారుస్తున్నాడన్నావు. ఈ వాక్యంలో మంచిగంధపు సువాసన ఉంది. చల్లదనం ఉంది. ఈ వాక్యం దగ్గర ఒక జీవితకాలం నిలిచిపోవాలని ఉంది. ఎప్పటికీ ముగిసిపోని వేసవిసెలవులిక్కడే గడపాలని ఉంది.

ఇందులో నీ మనసుని చల్లబరిచిన ఆ ఉనికి ఎవరో తెలియకపోవడం ఎంత సుమధురంగా ఉందో చెప్పలేను. ఎంత సాలోచన రేకెత్తిస్తున్నదో కూడా చెప్పలేను. అందుకనే నేను దీన్ని వట్టి ప్రేమ కవితగా చదివి పక్కనపెట్టేయలేకపోతున్నాను. ఒక అర్థంలో, లేదా ఈ కవితను పూర్తిగా ఒక పార్శ్వానికి జరిపితే, ఇంతకన్నా ఆత్మసంబంధమైన ప్రకటన మరొకటి కనిపించదు. టాగోరు గీతాంజలిలో గానం చేసింది ఈ వార్తనే కద!

ఆ మాటకొస్తే మీరా కవిత్వం మొత్తం ఈ ఉన్మత్తత, ఈ ఎదురుచూపు, ఈ ఆగమనోత్సవమే కదా! ఎన్నిపాటలు! మొత్తం మీరా గీతాలన్నీ ఎత్తిరాయాలి. ఎన్ని రాసినా అన్నిట్లోనూ ఒకటే ఎదురుచూపు, ఒకటే కలయిక, ఒకటే ధన్యత. అయినా ఒక గీతాన్ని తలుచుకోమంటే ఈ గీతం గుర్తొస్తోంది:

ఇది ఒక పార్శ్వం. మరో పార్శ్వంలో ఈ వెతుకులాట ఆధ్యాత్మికం కాదు, అత్యంత లోకసంబంధం, ఇంకా చెప్పాలంటే రాజకీయం కూడా. మనం ప్రతి ఒక్కరం ఎదురుచూస్తూనే ఉన్నాం. ఒక మనిషి కోసం, ఒక ఉనికి కోసం. కల్లా కపటం లేని, మాయా మర్మంలేని మానవసంబంధాల కోసం. ప్రపంచం తాలూకు లెక్కల్ని పక్కన పెట్టి, కవి చెప్పినట్టుగా ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నించుటకు’ ఒక మనిషి కావాలని జీవితమంతా ఎదురుచూస్తూనే ఉన్నాం. ఆ కోరిక ఎంత అమాయికంగా కనిపిస్తుందో అంత భయకారకం కూడా. ఎందుకని? ఎందుకంటే, మానవుడి చరిత్ర మొదలైనప్పుణ్ణుంచీ కొద్దిమంది చేతుల్లో అత్యధిక సంఖ్యాకులు బందీలుగానే ఉన్నారు. చరిత్ర యుగం మొదలైనప్పుడు బానిసత్వం, ఆ తర్వాత కాలాల్లో ఫ్యూడలిజం, ఇప్పుడు పెట్టుబడిదారీ సమాజం- ఈ ఆకాంక్షకి అడ్డుపడుతూనే ఉన్నాయి. ఒక మనిషి మానవీయమైన మరో మనిషి సన్నిధిని కోరుకోవడం ఒక వ్యక్తిగత ఆకాంక్ష కాదు. అది తాను జీవిస్తున్న కాలం నాటి ఆర్థిక సంబంధాల మీద  విసిరిన సవాలు. ఆ ఆర్థిక వ్యవస్థను రక్షించే రాజకీయ వ్యవస్థ మీద తిరుగుబాటు. నువ్వెందుకని ప్రవాసానికి పోవలసి వచ్చింది? అత్యధిక సంఖ్యాకుల పేరు చెప్పి ఏ కొద్దిమందో బలంగా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోడాన్ని నువ్వు  ధిక్కరించినందుకే కదా! కాబట్టి మామూలుగా అనుకునేట్టు ప్రేమ వ్యక్తిగత సౌందర్యోపాసన కాదు. అది సమష్టి  జీవితం మరింత మానవీయంగా రూపొందాలన్న తపస్సు. అలా కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఎవరి కోసమో  ఎదురుచూస్తూనే ఉంటున్నట్టు. ఒక నిజమైన మనిషి కోసం, పూర్ణమానవసందర్శనం కోసం ఎదురుచూస్తున్నట్టు.

నాకు ఈ క్షణాన క్యూబన్ కవయిత్రి మేరియా ఎలేనా క్రుజ్ బరేలా గుర్తొస్తున్నది. ఆమె ఫిడల్ కాస్ట్రో ప్రతిపాదిస్తున్న ప్రణాళికల్ని తప్పుపట్టింది. నువ్వు పిట్టకోస్ ని తప్పుపట్టినట్టే. అన్నా అఖ్మతోవా స్టాలిన్ ని తప్పుపట్టినట్టే, లీ జింగ్ జావో ఉత్తర సోంగ్ పాలకుడి విధానాల్ని తప్పుపట్టినట్టే. కాస్ట్రో తన అసాధ్యమైన రాజకీయ-ఆర్థిక ప్రణాళికలకు ప్రజల్ని బలిపశువులుగా మారుస్తున్నాడనీ, వాటిని తానెంతమాత్రం అంగీకరించబోననీ ఆమె ప్రకటించింది. అటువంటి ఒక ప్రకటన విడుదల చేసిన మర్నాడే క్యూబా పోలీసు బలగాలు ఆమె ఇంటిమీద దాడిచేసాయి. ఆమె మీద దాడి చేసి ఆమె చేతులు వెనక్కి విరిచికట్టి, జుట్టు పట్టుకుని వీథిలోకి యీడ్చుకొచ్చారు. చితకబాదారు. ఆమె రాసిన మానిఫెస్టో కాగితాల్ని ఆమెతోనే నమిలిమింగించాలని చూసారు. నెత్తురోడుతున్న ఆమెని కోర్టుముందు హాజరు పరిచి రెండేళ్ళ కఠినకారాగార శిక్ష విధించారు.

ఆమె చేసింది సత్యాగ్రహం. క్రీయోను ఆజ్ఞని ధిక్కరించిన యాంటిగొని లాగా ఆమె పశుబలం రాజ్యబలంగా మారడాన్ని ప్రతిఘటించింది. అందుకు ఆమెకి లభించిన బహుమానం? అవమానం, కారాగారం మాత్రమే కాదు, తన కుటుంబం నుంచి ప్రవాసం కూడా. ఎందుకని? ఎందుకని ఆమె ఇదంతా పడవలసి వచ్చింది? ఎందుకంటే ఆమె మనుషుల్ని మనుషులుగా చూడమని రాజ్యానికి చెప్పినందువల్ల. నాకనిపిస్తుంది. ఆమెది కూడా ఎదురుచూపునే. అందుకనే ఆమె రాసిన ఈ కవిత చదివినప్పుడు, నేను చదివిన గొప్ప ప్రేమకవితల్లో ఇది కూడా ఒకటని లెక్కేసుకున్నాను:

ఈ కవితని రాజకీయ కవిత అనీ, మీరా రాసుకున్న పాటని ప్రేమగీతమనీ అనుకోవడం స్థూలదృష్టి. తనని తన గృహనిర్బంధం నుంచి ఎవరో ఒక  సహచరుడో, కామ్రేడో, లేక ప్రజావిముక్తిదళాలో విడిపిస్తాయనుకుంటే అది రాజకీయమనీ, అలాకాక, ఆ వెతుకులాట సాక్షాత్తూ భగవంతుడి గురించిన వెతుకులాటగా చెప్పుకుంటే దానిలో ప్రమాదముండదనీ అనుకోవడం పొరపాటు. చాలామంది భావించేటట్టు దేవుడి గురించిన నిరీక్షణ నిరపాయకరమైన దారేమీ కాదు. మీరా కోరుకున్న కోరికలో తప్పేముందని ఆమె విషం సేవించవలసి వచ్చింది? ఆమె కోరికలో ఏ నిషిద్ధఫలముందని ఆమె రాజప్రాసాదం నుంచి వీథిలోకి వచ్చిపడింది? అది కూడా కరకుదారినే. గాయపడ్డవాడికే కదా గాయమంటే ఏమిటో తెలిసేది, కాబట్టి నువ్వెందుకు రాజనగరు వదిలి ప్రవాసానికి పోవలసి వచ్చిందో ఒక మీరాకే బాగా అర్థమవుతుంది. ఒక మీరా ఎందుకు రాజప్రసాదం నుంచి వీథిలోకి వచ్చిపడిందో ఒక మారియా ఎలేనా క్రుజ్ బరేలాకే బాగా అర్థమవుతుంది.

అందుకనే, శాఫో, ఈ రెండు పంక్తుల నీ కవితాశకలంలోని ఆగమనోత్సవం నాకు మరోప్రపంచాన్ని చూసినంత సంతోషాన్నిస్తోంది.

14-5-2026

2 Replies to “ప్రియమైన శాఫో-18”

  1. “తురాయిపూలకొమ్మ నా Midsummer Day Dream. నిన్ను ఎవరు పలకరించనీ, పలకరించకపోనీ, నువ్వేది సాధించనీ, సాధించకపోనీ, క్రమం తప్పకుండా సంభవించే ఋతుపరిభ్రమణంలో నువ్వు కూడా ఉన్నావన్న మెలకువ ఒక్కటి చాలు..”
    — ఎంత బాగుందో ఈ expression.
    తురాయి పూలకొమ్మ నాకు వేసంగి మిట్ట మధ్యాహ్నపు కల..

    శాఫో కవితా శకలం 48 లో “నువ్వొచ్చావు, నేన్నీగురించి ఉన్మత్తనై ఉండగా దహించుకుపోతున్న నా మనసుని చల్లార్చావు” వాక్యాలకు కాళిదాసు శ్లోకం లో “సంతప్తానాం త్వమహి శరణం'(దహించుకుపోతున్నవాళ్ళకి నువ్వే దిక్కు ) పాదానికి సాపత్యం భలేగా అనిపించింది.

    క్యూబన్ కవయిత్రి మేరియా ఎలేనా క్రుజ్ బరేలా ను పరిచయం చేస్తూ ఆమె కవితకి మీ అనువాదం , మీరా భక్తి పాటతో పోలుస్తూ చేసిన విశ్లేషణకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేం చెయ్యగలం..

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading