నన్ను వెన్నాడే కథలు

అనిల్ బత్తుల పబ్లికేషన్స్ ప్రచురించిన ‘నన్ను వెన్నాడే కథలు’ (2026) పుస్తకం పైన పిన్నంసెట్టి కిషన్ గారు రాసిన సమగ్ర సమీక్ష ఇది. కిషన్ గారు అత్యంత సమర్థుడైన, నీతివంతుడైన ప్రభుత్వ అధికారి. పేదల పక్షపాతి. కాబట్టి ఆయన ఈ కథల్తో మమేకం కాగలిగారు. వేములవాడనుంచి వచ్చిన కిషన్ గారు ‘లేంబాళవాటిక కథలు’ పేరిట అమరవాతి కథల్ని తలపించే కథలు రాసారు. ‘నల్లపద్యం’ ఆయన కవితాసంపుటి.


చదువరిని వెంటాడే జీవన సత్యాలు

పిన్నంశెట్టి కిషన్

97002 30310

నన్ను వెన్నాడే కథలు పుస్తకంలో విదేశీ ప్రముఖ రచయితలు రాసిన ఇరవై కథలను పొందికపరిచారు. గత నలభై ఏళ్లుగా తనని వెంటాడుతున్న ఈకథలను, వాడ్రేవు చినవీరభద్రుడు గారు తన బ్లాగ్ ద్వారావారం వారం పరిచయం చేశారు. ప్రతి కథకు ఆయనరాసిన ‘ముందు మాట’ ఈ సంకలనానికి ఆయువుపట్టు.డిజిటల్ మాధ్యమంలో ఇవి అందుబాటులో ఉన్నా, పుస్తకం చేతపట్టి చదవడంలోని ఆనందం అద్వితీయం.

“ఆయన్ని వెన్నాడే కథల్ని మనం ఎందుకుచదవాలి?” అని, పాఠకుడి గా రచయితగా నాలోని”రెండు నేనులు” మేల్కొని ప్రశ్నించాయి. దానికిసమాధానం ఈ పుస్తకమే ఇచ్చింది. ఈ సంకలనంలో ని కథల ఎంపిక, కొత్తగా రాసేవారికి ‘ఏది రాయాలో.. ఏది రాయకూడదో’  దిశానిర్దేశంచేస్తుంది. మంచి సాహిత్యం మనల్ని మానవులుగా నిర్మించుకోవడానికి తోడ్పడుతుంది.

మున్షీ ప్రేమ్ చంద్ ‘సాల్ట్ ఇన్స్పెక్టర్’ కథ నేను ఉద్యోగ ప్రస్థానానికి ముందే చదివి ఉంటే, వృత్తిపరమైన సమస్యల ను మరింత దృఢ చిత్తంతో ఎదుర్కొనేవాడిని. 1907 నాటి ఈ కథ నేటికీ ప్రాసంగికత కలిగి ఉండటం మన సమాజపు దౌర్భాగ్యం.

వ్యంకటేశ మాడ్యూల్కర్ మరాఠీ కథ ‘ఆంజనేయస్వామివారు’ స్వార్థ మానవుల పోకడను ఎండగడుతుంది. గుళ్లోని దేవుడు గనక లోక సంహారానికి పూసుకుంటే, అతనిపై యుద్ధం ప్రకటించక ఊరుకుంటారా!. ఇక, దేవుని వాహనాలుగా ప్రతిరూపాలుగా పూజించే జంతువులు పక్షులు ఓ లెక్కా!!

శరత్ బాబు ‘మహేశం’ సాటి మనిషిపట్ల, మూగజీవుల పట్ల కనికరం లేకపోవడమే నిజమైన దరిద్రమనే ఎరుక చదువరికి కలిగిస్తుంది. ఉండడానికి పది పేజీలు లేవు గానీ, పూర్తి చేసేలోపు పదిసార్లైనా పూడుకుపోయి

ఉంటుంది గొంతు. గపూర్ లు ఏ మతంలో లేరని! పేర్లు మాత్రమే మారుతాయి, వారి జీవితం ఎక్కడైనా మార్పు లేనిదే! జమీందారు పాత్రకు పేరు పెట్టలేదు రచయిత, విశ్వవ్యాప్తమైన కఠినాత్మకతకు పేరుతో పనేంటని!

ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత గీ ద మోపాసా (Guy de Maupassant) రాసిన ‘బెడ్ నెంబర్ 29’ ఈ సంకలనం లో ఒకానొక శిఖరం వంటి కథ. యుద్ధం కేవలం సరిహ ద్దుల్లోనే కాదు, మనుషుల మనస్తత్వాల్లో, శరీరాల్లో కూడా ఎలా జరుగుతుందో ఈ కథ అద్దం పడుతుంది. ఒక వేశ్య పట్ల సమాజానికి ఉండే చిన్నచూపును, ఆమె చూపే దేశ భక్తిని ఎదురెదురుగా నిలబెట్టి మోపాసా పాఠకుడిని నిల దీస్తాడు. అందం, ఆకర్షణ ఉన్నప్పుడు ప్రేమించిన పురుషుడు, ఆమె అనారోగ్యం పాలైనప్పుడు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడో చూస్తే.. మానవ సంబంధాలలోని డొల్లతనం బయటపడుతుంది. యుద్ధ వీరుల మెడలోని పతకాల కంటే, ఆ వేశ్య శరీరంలోని గాయాలే గొప్పవని

మోపాసా చెప్పిన తీరు గుండెల్ని పిండేస్తుంది. స్త్రీ త్యాగానికి, పురుష అహంకారానికి మధ్య సాగే ఈ పోరాటం పాఠకుడిలో బలమైన ముద్ర వేస్తుంది.

గంగాధర్ గాద్గిల్ ‘మొహం లేని సాయంకాలం’ ఆదిమధ్యాంతాల శైలీ చట్రాన్ని ఛేదించిన కథ. నిజమే… ఆలూరి బైరాగి ‘ఒక గంట జీవితం’, త్రిపుర ‘భగవంతం’ కథలు గుర్తుకు వస్తాయి. ఒక్క కథైనా అలా రాయకపోతే రచయితగా అసంపూర్ణమే అనిపించక వదలదు.

మరో మరాఠీ కథ ‘మంజుల’ లోని ‘చెమట సంసారం’ అనే పదం ఇల్లాలి ఆవేదనను బిగ్ కాన్వాస్పై ఆవిష్కరిస్తుం ది. భార్యాభర్తల సంబంధంలోని సున్నిత పు పొరల్ని విడదీస్తూ మొగుళ్ల కళ్లు తెరిపి స్తాడు, కళ్ళనీళ్ళు తెప్పిస్తాడు కథకుడు అరవింద గోఖలే. స్త్రీ మనోభావాల్ని అర్థం చేసుకోవడానికి, స్త్రీగా మారి రాసిన కథ ఇది; లేకపోతే, మగగా సాధ్యం కాదు.

జయశంకర్ ప్రసాద్ ‘గుండా’ హిందీ కథ చారిత్రక అంశాలను కథలుగా మలిచే వర్ధమాన రచయితలకు ఒక పాఠం. ఆ కథ గనుక నేను ముందే చదివి ఉంటే, నిజాం యువరాణి నిలోఫర్ నేపథ్యంతో నేను రాసిన ‘ఖట్నా’ కథను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే వాడిని.

జర్మన్ రచయిత్రి మరీ లూయిస్ కాష్నిట్జ్ రాసిన ‘దుక్కపిల్ల’ (The Fat Girl) అద్భుతమైన మనస్తత్వ చిత్రణ. మనం అసహ్యించుకునే మన పాత రూపమే మనల్ని ఎలా వెంటాడుతుందో, శారీరక ఆకృతి పట్ల పెద్దలు చూపే వివక్ష ఎంతటి అభద్రతకు దారితీస్తుందో ఇందులో కనిపి స్తుంది.

అలాగే, నోరైర్ ఆల్యాన్ కథ ‘ఒంటెలు వెళ్లిపోతాయి, పర్వతాలు ఉండిపోతాయి’ ఒక తాత్విక రూపకం. మనుషులు ఒంటెల బిడారుల్లా కాలప్రవాహంలో కదిలి పోతారు, కానీ వారి వేదన, మూలాలు మాత్రం పర్వతాల్లా అచలంగా నిలిచిపోతాయనే సత్యాన్ని ఈ ఆర్మీనియన్ కథ కళ్లకు కడుతుంది.

ఈ సంకలనం కోసం ఎంచుకున్న కథలు భిన్న సంస్కృతుల మధ్య వారధులు. రష్యా మంచు మైదానాలైనా, పల్లెటూరి మట్టి అయినా.. మనిషి ఆవేదన ఒక్కటేనని ఈ పుస్తకం నిరూపిస్తుంది. చినవీరభద్రుడు గారు ఈ కథలను మనకు పరిచయం చేసిన విధానం, వాటి వెనుక ఉన్న సామాజిక కోణాలను విశ్లేషించిన తీరు అద్భుతం.

ప్రతి రచయితా తనను తాను సరిచూసుకోవడానికి, ప్రతి పాఠకుడూ తనను తాను నిర్మించుకోవడానికి చదవాల్సిన అద్భుత పుస్తకమిది.


మహా డెయిలీ సౌజన్యంతో, 30-3-2026

4 Replies to “నన్ను వెన్నాడే కథలు”

  1. పిన్నంశెట్టి కిషన్ గారి సమీక్ష చాలా బాగుంది. సమీక్షలో చివరి పేరా గొప్పగా ఉంది. వారికి ఇప్పుడే అభినందనలు తెలపడం జరిగింది. మీకు వేనవేల కృతజ్ఞతలు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%