నడుస్తున్న కాలం-6

తెలుగు రాష్ట్రాలలో పిల్లల సినిమాలేవి?

అనిల్ బత్తుల కవి, కథకుడు, అనువాదకుడు, ముఖ్యంగా పిల్లలప్రేమికుడు. ఆయన లామకాన్ నిర్వాహకులతో కలిసి, లా మకాన్ లో, ఈ నెలమొదలుకుని ఈ ఏడాది పొడుగునా, ప్రతి నెలా ఒక బాలల చలనచిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. అందులో భాగంగా మొన్న ఆదివారం ఆ చలనచిత్రోత్సవాన్ని ప్రారంభించే అవకాశం ఇద్దరు పిల్లలూ, ఒక లా మకాన్ ఉద్యోగితో పాటు నాక్కూడా లభించింది. ఆ రోజు  ఇరానియన్ చిత్రం Children of Heaven(1997) ప్రదర్శించారు. ఆ చిత్రం చాలా హృద్యంగానూ, ప్రేక్షకుల్ని కంటతడిపెట్టించేదిగానూ ఉంది.

ఒక రచయిత నిర్వహిస్తున్న చలనచిత్రోత్సవం

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లు 2017 తర్వాత బాలల చలనచిత్రోత్సవాలు నిర్వహించలేదు. ప్రభుత్వ సహాయంతో, రాయితీలతో స్టూడియోలు నిర్మించుకున్న నిర్మాతలు లేదా టెలివిజన్ ఛానెళ్ళ అధినేతలు కూడా ఎవరూ ఈ విషయంలో ఇప్పటిదాకా ముందుకు రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రచయిత తానే స్వయంగా ఇటువంటి ప్రయత్నానికి పూనుకోవడం అసాధారణం.

బాలల చలనచిత్రాల పరిస్థితి

2024 సంవత్సరంలో మొత్తం భారతీయ చలనచిత్ర పరిశ్రమ దాదాపు 12000 కోట్ల మేరకు వసూళ్ళు సంపాదించిందని ఒక అంచనా. 2024-25 లో మొత్తం 3455 సినిమాలకి అనుమతి లభించింది. ఒక ఏడాది కాలంలో ఇన్ని సినిమాలకు అనుమతి లభించడంలో ఇది రికార్డు. 1983 లో 741 సినిమాలకే అనుమతి లభించినదాన్ని బట్టి చూస్తే, నాలుగు దశాబ్దాల కాలంలో, చలనచిత్రాల సంఖ్య అయిదు రెట్లు పెరిగిందని తెలుస్తున్నది.  కాని వీటిల్లో ఎన్ని బాలలచిత్రాలు అన్న వర్గీకరణ వివరాలు లేనేలేవు. దాన్నిబట్టే, చలనచిత్రరంగంలో పిల్లల సినిమాల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం ఉందో మనం ఊహించవచ్చు. కాగా గత అయిదేళ్ళ కాలంలో తెలుగులో పిల్లలకోసం వచ్చిన చిత్రాలేమిటి అని ఆలోచిస్తే ఒక్క పేరు కూడా స్ఫురించడం లేదు. ఇప్పటికీ, తెలుగులో బాలల చిత్రాలంటే, ఎప్పుడో తీసిన ‘బాలరాజు కథ ‘(1970) లేదా ‘లిటిల్ సోల్జర్స్ ‘(1996) తప్ప మరో పేరు స్ఫురించడం లేదు.

ప్రపంచ వ్యాప్తంగా బాలలచిత్రాలపరిస్థితి

ప్రపంచవ్యాప్తంగా బాలల చిత్రాల పట్ల ఆయాదేశాల చలనచిత్రపరిశ్రమ చూపిస్తున్న ఆసక్తిని లెక్కగట్టడానికి 0-1 స్కేలు మీద లెక్కగట్టే ప్రయత్నం చేసి చూస్తే, అమెరికా,  0.78 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా, జపాన్ 0.72 పాయింట్లతో, స్కాండినేవియన్ దేశాలు 0.68 పాయింట్లతోనూ, చీనా 0.60 పాయింట్లతోనూ నిలబడుతుంటే, భారతదేశం 0.40 పాయింట్లతో నిలబడుతున్నది. చివరికి ఆగ్నేయాసియా దేశాలు కూడా 0.45 పాయింట్లతో భారతదేశం కన్నా ముందున్నాయి. ఒక్క సబ్-సహారా ఆఫ్రికన్ దేశాలు మాత్రమే భారతదేశం కన్నా తక్కువ సూచికను నమోదు చేస్తున్నాయిఇందులో అమెరికా అగ్రస్థా నంలో నిలబడానికి ప్రధాన కారణం యానిమేషన్, కార్టూన్ ఫిల్ముల నిర్మాణం. అలాకాక, ఫీచరు ఫిల్ముల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, స్కాండినేవియన్ దేశాలు, ముఖ్యంగా, స్వీడన్ అగ్రస్థానంలో కనిపిస్తున్నది. 2024-25 లో స్వీడను లో అనుమతి పొందిన చిత్రాల్లో 38 శాతం పిల్లలకు సబంధించిన చిత్రాలే ఉన్నాయి. ఇటువంటి సూచికలో ప్రపంచంలో మరే దేశమూ కూడా స్వీడన్ తో పోటీపడలేదని చెప్పవచ్చు.

బాలల చిత్రాలకూ, విస్తృత పౌరచైతన్యానికీ లంకె

బాలల కోసం తీసే చిత్రాల్లో స్వీడన్ అగ్రస్థానంలో నిలబడుతున్నది అనే వాస్తవం మనల్ని మరింత లోతుగా ఆలోచించేలా చేస్తున్నది. అంటే ఒక దేశం, ఒక జాతి, ఒక ఆర్థిక వ్యవస్థ పిల్లల చలనచిత్రాలమీద చూపించే శ్రద్ధకీ, ఆ జాతి పౌరచైతన్యానికి సంబంధించిన మరికొన్ని సూచికలకీ దగ్గరి సంబంధం ఉందా అనే ఆలోచన కలుగుతుంది. అటువంటి సూచికలు ఏమై ఉండవచ్చు? నా వరకూ అటువంటివి మూడు ప్రధాన సూచికలు కనిపించాయి. ఒకటి, ఆ దేశం విద్యమీద పెట్టే వ్యయం, అందులో మళ్ళా పాఠశాలల్లో, కళలు, సృజనాత్మక కార్యకలాపాలకు కేటాయించే సమయం, రెండోది, ఆ దేశాలు ఎంత అవినీతిరహితంగా ఉన్నాయి, ఆ దేశాల్లో పాలన ఎంత పారదర్శకంగా ఉంది, మూడోది, ఆ దేశాల్లో స్త్రీల సాధికారికత ఏ మేరకు సాధ్యమవుతూ ఉంది అన్నవి. ఈ సూచికల కింద మనకి లభ్యమవుతున్న సమాచారాన్ని దేశాలవారీగా పోల్చి చూస్తే, ఈ సూచికలకీ, ఆయా దేశాలు బాలల చలనచిత్రాల మీద చూపించే శ్రద్ధకీ చాలా దగ్గర సంబంధం ఉందని తెలుస్తోంది.

విద్యమీద పెట్టే వ్యయం, పాఠశాలలు చూపించే శ్రద్ధ.

ఉదాహరణకి, 2024-25 లో, భారతప్రభుత్వం విద్యమీద పెట్టిన వ్యయం, సినిమాల రాబడికన్నా పది రెట్లు మాత్రమే ఎక్కువ. మొత్తం స్థూల జాతీయోత్పత్తిలో, కనీసం 6 శాతం విద్యమీద వ్యయపరచడం అభిలషణీయంకాగా, కిందటేడాది, భారతప్రభుత్వం పెట్టిన ఖర్చు స్థూల జాతీయోత్పత్తిలో 2.9 శాతం మాత్రమే. అంటే అభిలషణీయ కేటాయింపుల్లో సగం కన్నా తక్కువ. ఇటువంటి అల్పవ్యయం దేన్ని సూచిస్తుంది? అంటే, దేశంలో, పాఠశాలల్లో యాంత్రికంగా, మొక్కుబడిగా నడిచే కార్యక్రమాలమీద తప్ప, అదనంగా, విద్యార్థుల మనోవికాసానికి దోహదపడగల కార్యక్రమాలమీద కేటాయింపులు జరగడంలేదని అర్థం. ఉదాహరణకి, తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే, ఇక్కడ పాఠ్యపుస్తకాల్ని సిలబసు ప్రకారం బోధించడం మీద ఉన్న శ్రద్ధ, ఆర్టు, క్రియేటివ్ యాక్టివిటీస్ నిర్వహించడం పట్ల లేదు. ఒకప్పుడు మన పాఠశాలల్లో వార్షికోత్సవాలు జరిగేవి. అప్పుడు పిల్లలు తప్పనిసరిగా నాటికలు, నాటకాలు ప్రదర్శించేవారు. ఇప్పుడు వార్షికోత్సవాలు కనుమరుగైపోయాయి. ఎక్కడేనా ఒకటీ అరా జరిగినా, ఆ వేడుకల్లో రికార్డింగు డాన్సులు మాత్రమే కనిపిస్తాయి. కాని మనం పాఠశాలల్లో  visual literacy లేదా screen literacy పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం మీద దృష్టిపెట్టాలి. ఉదాహరణకి, యు.కె లో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పదివేల ఫిల్మ్ క్లబ్బులు నడుస్తున్నాయి. మన దేశంలోనూ, మన రాష్ట్రాల్లోనూ కూడా పాఠశాలల్లో ఫిల్మ్ క్లబ్బులు ఒక ఉద్యమంగా చేపట్టవచ్చు.

అవినీతి రహిత పాలన

ఒక దేశంలో పాలన అవితీనిమయం అయ్యేకొద్దీ, ఆ దేశంలో social trust సన్నగిల్లుతుంది. బాలలకోసం తీసే చిత్రాలకు ఆదరణ దొరకదు, ఎందుకంటే, పెట్టుబడులు, అనుమతులు, థియేటర్ల కేటాయింపు, ప్రచారం- మొదలైన అన్ని పార్శ్వాల్లోనూ, బాలల చిత్రాల నిర్మాతలకు ప్రోత్సాహం కరువవుతుంది. అదే స్కాండినేవియను దేశాల్లో బాలల చిత్రాలకు ప్రోత్సాహం లభిస్తండటానికి కారణం ఆ దేశాల్లో పాలన దాదాపుగా అవినీతి రహితంగా ఉండటమే. అలాగే నార్వే, డెన్మార్కుల్లో, చిత్రపరిశ్రమకు ప్రభుత్వం అందచేసే సబ్సిడీల్లో 25 శాతం తప్పనిసరిగా బాల, కౌమార ప్రేక్షకులకోసం తీసే సినిమాలకోసం మంజూరుచెయ్యాలనే నిబంధనలు ఉన్నాయి.

స్త్రీ సాధికారికత

ఏ దేశంలోనైనా స్త్రీలకు నిర్ణయాధికారం ఉన్నప్పుడు, ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడు, వారు పెట్టే వ్యయం ప్రధానంగా పిల్లలకోసమే ఖర్చుపెడతారనేది పరిశోధనలు పదేపదే చెప్తున్న అంసం. మన రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగానూ కూడా చలనచిత్రరంగంలో స్త్రీల భాగస్వామ్యం, నిర్ణయాధికారం చాలా తక్కువ స్థాయిలో ఉండటమేకాక, స్త్రీల పట్ల తీవ్రమైన వివక్ష కూడా కనిపిస్తున్నది అనేది  బాహాటంగా కనిపిస్తున్న సత్యం. పౌర చైతన్యంలో మార్పు వస్తే తప్ప ఈ పరిస్థితి మెరుగుపడదు.

మొత్తం మీద పరిస్థితి

ఈ సూచికల్నీ, లభ్యంగా ఉన్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, మొత్తం మీద పరిస్థితి ఇలా ఉందని చెప్పవచ్చు. థియేటర్లలో ప్రదర్శించే బాలల చలనచిత్రాలు లేనేలేవు. పిల్లల స్క్రీన్  టైము పెరిగిందిగానీ, అది ప్రధానంగా డబ్బింగు చిత్రాలకీ, గ్లోబల్ కంటెంటుకీ పరిమితమైపోతున్నది. పాఠశాలల్లో సిలబసుమీద, మార్కుల మీదా ఉన్న ఒత్తిడి వల్ల, విజువల్ లిటరసీ ఒక లగ్జరీ అనిపిస్తున్నది. బాలల చిత్రాల్ని ప్రోత్సహించే స్కూలు స్క్రీనింగులు, చలన చిత్రోత్సవాలు, గ్రాంటులు, సబ్సీడిలు మొదలైన పబ్లిక్ సపోర్టు చాలా బలహీనంగా ఉంది. ఇక తల్లుల కి ఈ విషయంలో తగినంత సమాచారమూ లేదు, ఉన్నా, వారికి నిర్ణయాధికారమూ లేదు.కాబట్టి పిల్లలు సినిమాలైతే చూస్తున్నారుగాని, కానీ పిల్లల సినిమాల్లేవు. వాళ్ళు చూసే సినిమాల్లో తమకి గౌరవం కూడా లేదు. మొత్తం మీద మన సమాజమూ, ప్రభుత్వాలూ గుర్తించవలసిన సత్యం ఒక్కటే: అదేమంటే, పిల్లల సినిమా అనేది ఒక జానర్ కాదు, మన సమాజం పిల్లల ప్రపంచాన్ని ఎంత గౌరవిస్తున్నదో చూపించే ఒక సూచిక. ఈ నిష్ఠుర సత్యం పట్ల ఒక్క అనిల్ బత్తుల మాత్రమే కాదు, పిల్లల ప్రేమికులు ప్రతి ఒక్కరూ మేల్కొనవలసి ఉంది.

తెలుగు ప్రభ, 23-1-2026

2 Replies to “నడుస్తున్న కాలం-6”

  1. మొత్తం మీద మన సమాజమూ, ప్రభుత్వాలూ గుర్తించవలసిన సత్యం ఒక్కటే: అదేమంటే, పిల్లల సినిమా అనేది ఒక జానర్ కాదు, మన సమాజం పిల్లల ప్రపంచాన్ని ఎంత గౌరవిస్తున్నదో చూపించే ఒక సూచిక. ఈ నిష్ఠుర సత్యం పట్ల ఒక్క అనిల్ బత్తుల మాత్రమే కాదు, పిల్లల ప్రేమికులు ప్రతి ఒక్కరూ మేల్కొనవలసి ఉంది.

    ఎంత బాగా చెప్పారు. నమోనమః

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%