
కావూరి శారదగారు పుట్టింది గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో పెదపులివర్రు గ్రామంలో. వారి శ్రీవారి ఉద్యోగరీత్యా కరీంనగర్ జిల్లాలో గోదావరిఖనికి తరలివెళ్ళారు. కృష్ణాతీరం నుంచి బొగ్గుబావుల దాకా ఆమె చేసిన ప్రయాణం చిన్నది కాదు. ఆ తర్వాత తమ పిల్లలు అమెరికాలో స్థిరపడటంతో అమెరికాకూడా చూసారు. ఆ రకంగా ఆమె జీవితప్రయాణం ప్రపంచమంతా విస్తరించింది.
కాని చదువుకోసమో, ఉద్యోగంకోసమో లేక పిల్లలదగ్గర ఉండవలసిన అవసరం కోసమో తాము ఉన్న గ్రామాన్నీ, దేశాన్నీ వదిలిపెట్టి సుదూరప్రాంతాలకి ప్రయాణిస్తున్న వాళ్ళెంతమంది లేరు? కాని వారందరూ ‘జగమంత కుటుంబం’ నాది అని అనుకోగలరని చెప్పలేం. అలా అనుకోడానికీ, తాను ఎక్కడ ఉన్నా, అక్కడి మనుషుల్నీ, వారి కష్టసుఖాల్నీ తన హృదయంలోకి తీసుకోడానికీ మరేదో మూలద్రవ్యం ఉండాలి. అదేమిటో శారదగారు రాసుకున్న తనమాటలో ఇలా అంటున్నారు:
ఎవరైనా బాధలో ఉంటే నా మైండ్ వాళ్ళ పక్షాన నిలబడిపోతుంది. ఇప్పటికీ ఏ పనిలో ఉన్నా కూడా మైండ్ ఏదో ఒక లాంటివాళ్ళ గురించి ఆలోచించడమే అలవాటు చేసుకుంది.
కాని కేవలం సహానుభూతి ఒకటే, అది ఎంత దయాన్వితంగా ఉన్నప్పటికీ, ఇటువంటి కథలు రాయడానికి సరిపోదు. దయతో కరిగిపోయే అటువంటి మనస్సుకి చైతన్యం కూడా ఉండాలి, దానికి అధ్యయనం జతకూడాలి. అప్పుడు తాను ఎవరి గురించి ఆలోచిస్తున్నారో వారి జీవితచిత్రాల్ని మరిన్ని వివరాలతో, మరింత ప్రస్ఫుటంగా దర్శించి అర్ధం చేసుకోగలుగుతారు. తనలాంటి సహృదయులెవరేనా కనిపిస్తే వారితో పంచుకోగలుగుతారు.
శారదగారికి అటువంటి హృదయం ఉందనీ, ఆమెలో నిత్యం జ్వలించే చైతన్యం ఉన్నదనీ, తాను ఆలోచిస్తున్నదాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం, పుస్తకాల్ని మాత్రమే కాదు, వాస్తవాల్ని కూడా, చేసే పట్టుదల ఉన్నదనీ ఈ కథలు చదివితే మనకి బోధపడు తుంది. పట్టుమని నూటముప్ఫై పేజీలు కూడా లేని ఈ సంపుటిలోని పన్నెండు కథల్లో ఎంత విస్తారమైన, ఎంత లోతైన జీవితం దర్శనమిస్తున్నదని! అందుకే ఈ కథలు చదువుతున్నంతసేపూ నా మొదటి అనుభూతి ఆశ్చర్యమే.
శారదగారు ఉపాధ్యాయినిగా పనిచేసారు. ఆమె పనిచేసింది ప్రభుత్వపాఠశాలల్లో కాబట్టి తనదగ్గర చదువుకునే పిల్లల కష్టసుఖాల గురించి ఎంతో కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ గుంటూరు సముద్రతీరంలో లంకవానిదిబ్బలో పీతలు పట్టుకునే యానాదుల గురించీ, ఓపెన్ కాస్ట్ మైనింగు కబళిస్తున్న నిరపరాధుల జీవితాల గురించీ, సావుడప్పుమీద బతికే కుటుంబాల గురించీ ఇంత వివరంగా, ఇంత కళ్ళకు కట్టినట్టుగా, చదువుతున్న హృదయాల్ని మెలితిప్పినట్టుగా రాయాలంటే ఎన్ని అహోరాత్రాలు వారి గురించి ఆలోచించి ఉండాలి! ఈ కథల ద్వారా శారదగారు నన్ని నిశ్చేష్టుణ్ణి చేసారు. ఇప్పుడు మిమ్మల్ని నిశ్చేష్టుల్ని చేయబోతున్నారు.
సాధారణంగా కథలు రాసేవారు తమ పరిమిత జీవితానుభవాల మీంచే రాస్తారు కాబట్టి, వారు గొప్ప కథకులైతే, ఆ కథల్లో లోతు ఉండొచ్చుగానీ, విస్తృతి తక్కువగానే ఉంటుంది. ఈ కథల్లో నన్ను ఆశ్చర్యపరిచిన మరో అంశం: వైవిధ్యం. తీరప్రాంతాలు, గ్రామాలు, నగరం, బొగ్గుగనులు, విదేశాలు నేపథ్యాలుగా ఉన్న కథలు మాత్రమే కాదు, ఇవి, వ్యక్తుల కథలు, కుటుంబాల కథలు, సమూహాల కథలు కూడా.
సాధారణంగా మన కథకులు తమవో, తమచుట్టూ ఉన్నవారివో జీవితానుభవాల్ని కథలుగా మలుస్తున్నప్పుడు, ఆ నిష్ఠురవాస్తవాల్ని చిత్రించడం మీదనే దృష్టిపెడుతుంటారు. కాని అటువంటి వాస్తవాల్ని దాటిన ఆర్ద్రత ఈ కథలు చదివిన పాఠకుల్ని ద్రవీభూతుల్ని చేస్తుందనడానికి ఇందులో ప్రతి ఒక్క కథా నిరూపణ. ఈ సంగతి నాకు మొదటికథ ‘క్షమాఛాయ’ చదవగానే తెలిసిపోయింది.
ఇటువంటి సహృదయురాలు, ఇతరుల కష్టసుఖాల్ని తనవిగా భావించే ఇటువంటి మానవి ఇప్పటికైనా ఇలా ఒక సంపుటి తేవడం తెలుగు సాహిత్యం అదృష్టమని చెప్పకుండా ఎలా ఉండగలను!
30-11-2025
సర్. రోజుకొక కొత్త విషయం , అందులో హ్యూమనిటీ ని తమరు గుర్తించి …అందరికి పంచడం మీ గ్రేట్ నెస్. ఇది పొగడ్త కాదు సర్ . నా వినమ్రత ని తెలిపే రెండు మాటలు. నమస్సులు
హృదయపూర్వక ధన్యవాదాలు