మా సోదరుడు

(సుప్రసిద్ధ కథకులు వి.రాజారామ్మోహనరావుగారి 80 వ పుట్టినరోజు సందర్భంగా రాసిన వ్యాసం)


కవులూ, రచయితలూ, ఎక్కడో ఆకాశంలో విహరిస్తుంటారని నమ్మే నా కౌమార, యవ్వన దినాల్లో పరిచయమయ్యారు రాజారామ్మోహనరావు. గొప్ప రచయితలు ముందు వారి రచనల ద్వారా మన జీవితాల్లోకి ప్రవేశించి, ఆ తర్వాత తాము వ్యక్తిగతంగా పరిచయమైనప్పుడు, ఆ తొలిరోజుల charm ఎంతో కొంత వాళ్లని అంటిపెట్టుకునే ఉంటుంది. దాన్ని దాటి, వాళ్ళు కూడా మనలాంటి మామూలు మనుషులే అనే, యథార్థంలోకి రావడం కష్టం. అందుకనే రామ్మోహనరావుగారి వ్యక్తిగతజీవితం గురించీ, ఆయన ఇష్టాయిష్టాల గురించీ, ఆయన జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించీ, చేసిన పోరాటాల గురించీ నాకేమంత తెలియదు.

నా ఇంటర్మీడియేటు రోజుల్లో ఆయన కథల పుస్తకం ‘వరద’ (1975) చదివాను. ఎమెస్కో పాకెట్‌ బుక్‌ సిరీసులో వచ్చిన పుస్తకం. ఆ కవరు పేజీ కూడా నాకింకా గుర్తుంది. ఆ పుస్తకం చదివిన కొన్ని రోజులకే ఆయన్ని మాకు భమిడిపాటి జగన్నథరావుగారు పరిచయం చేసారు. చాలా సౌమ్యంగా, మృదువుగా, ఎదుటి మనుషుల పట్ల అపారమైన concern తో కనిపించిన రామ్మోహనరావుగారు ఆ మా మొదటి సమావేశంలోనే నన్ను చాలా ఆకట్టుకున్నారు. ‘అఘము వలన మరల్చు, హితార్థకలితు చేయు, గోప్యమును దాచు’ అని పూర్వకవి ఎటువంటి స్నేహితుడి గురించి మాట్లాడేడో ఆయన అటువంటి వాడనీ మన సంతోషాలు, బాధలు ప్రతి ఒక్కటీ ఆయనకు చెప్పుకోవచ్చుననీ అనిపించింది. అందుకని నేను చదివిన పుస్తకాలూ, పొద్దుటిపూట వీచే ప్రత్యూషపవనాలూ, సాయంకాలాల గోదావరి సన్నిధీ వంటివాటినే పంచుకుంటూ ఆయనకో పెద్ద ఉత్తరం రాసాను. బహుశా పాతికపేజీల ఉత్తరం. ఉత్తరం డబ్బాలో వేసిన మరుసటిరోజునుంచే ఆయన జవాబు కోసం ఎదురుచూడటం మొదలుపెట్టేను.

1986 లో నేను గ్రూప్‌-1 పరీక్షల ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు వాళ్ళింట్లోనే దిగాం, అక్కా, నేనూ. మా అన్నయ్య సుందర్రావు అప్పుడు హైదరాబాదులోనే పనిచేస్తుండేవాడు. మూడు నాలుగురోజులున్నాం. ఆ ఇంట్లో ఉన్నందుకే ఆ ఇంటర్వ్యూలో సెలక్టయ్యానని నమ్మకం నాకు.

ఆ తర్వాత నేను గిరిజనసంక్షేమ శాఖలో చేరాక, ట్రైనింగు రోజుల్లోనూ, ఆ తర్వాత ఉద్యోగసంబంధం గానూ హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఏదో ఒక విధంగా రామ్మోహనరావుగారిని కలుసుకునే అవకాశం దొరుకుతూనే ఉండేది. ముఖ్యంగా భమిడిపాటి జగన్నాథరావుగారు నాంపల్లి దగ్గర యాత్రీనివాస్‌లో దిగినప్పుడు, ఆయన అక్కడ ఉన్నన్ని రోజులూ, ప్రతి రాత్రీ ఒక సద్గోష్ఠి నడిచేది. అలాంటి వేళల్లో సాధారణంగా జగన్నాథరావుగారే ఏదో ఒకటి మాట్లాడుతుండేవారు`కథల గురించి, రచయితల గురించి, పద్మరాజుగారి గురించి, కొత్తగా రాస్తున్న కథకుల గురించి. నేను ఒళ్ళంతా వీనులుగా ఆ మాటలు వింటూండేవాణ్ణి. కాని రాజా దృష్టి ఆయన మాటలమీద ఉండేది కాదు. ఆయన సౌకర్యంగా కూచున్నారా లేదా, ఆయనకి ఏమైనా అవసరమాలాంటి విషయాల మీదనే ఉండేది. బైబిల్లో యేసుని కనిపెట్టుకుని ఉండే మార్తాలాగా ఆయన జగన్నాథరావుగారిని కనిపెట్టుకుని ఉండేవారు. ఆ స్నేహశీలత అసాధారణం.

అయితే, గత పాతికేళ్ళుగా హైదరాబాదులోనే ఉన్నా రామ్మోహనరావుగారిని కలుసుకున్నది చాలా చాలా తక్కువ. మా రెండో అన్నయ్య కూడా ఈ ఊళ్ళోనే ఉన్నాడు. వాణ్ణి కలుసుకున్నది కూడా చాలా చాలా తక్కువ. సొంత అన్నదమ్ములు రోజూ కలుసుకోనక్కర్లేదనిపిస్తుంది. బాల్యంలో వాళ్ళ మధ్య స్థిరపడ్డ అనుబంధం జీవితాంతం చెక్కుచెదరకుండా ఉంటుందనే ఒక భరోసా అందుకు కారణం. రామ్మోహనరావుగారు కూడా అలాంటి సోదరుడు, నాకే కాదు, మాకందరికీ.

రామ్మోహనరావుగారు విస్తృతంగా రాసారు. ఆయన చూసిన విస్తృత జీవితమంతా ఆయన కథల్లోకి ఏదో ఒక విధంగా ప్రవహిస్తూనే ఉండింది. ఆయనకు సాహిత్యఅకాదెమీ పురస్కారం ఎప్పుడో వచ్చి ఉండవలసింది. కానీ, ‘సాంఘిక క్రౌర్యం’ (1981) లాంటి కథ రాసిన రచయితకి పురస్కారాలు వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి? నిజమైన రచయితకి చెప్పుకోదగ్గ రచనలు చేయడాన్ని మించిన పురస్కారం మరొకటుండదు. అలా చూసినట్లయితే, సమకాలిక రచయితల్లో, రామ్మోహనరావు గారికన్నా పురస్కృతులు మరొకరు లేరు.

17-11-2025

2 Replies to “మా సోదరుడు”

  1. పాఠకులు, మంచి పుస్తకం చదివేమన్న ఆనందం, ఆ కథా వస్తువులోని విషయాలను తరచూ జ్ఞప్తికి తెచ్చుకోవటం-ఇదే రచయిత విజయం. ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని ఎడిషన్లు వచ్చాయి అన్నది కాదు. మరువాడ రాజేశ్వరరావు అలాటి రచయితల్లో ఒకరు. ఒకే కథల పుస్తకం తెచ్చిన ఆయన (వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్)40 ఏళ్ళ క్రితమే అమెరికా వెళ్ళిపోయి, ఈమధ్యనే అక్కడ చనిపోవటం జరిగింది.

    1. మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%