
కోకిల ప్రవేశించే కాలం (2009) నుంచి మరో కవిత, నా ఇంగ్లిషు అనువాదంతో.
మెలకువ వచ్చినప్పుడు
మెలకువ వచ్చినప్పుడు ఒక్కసారిగా మెలకువ వచ్చినట్టుంటుంది,
అప్పుడు గుండె నిలకడగా కొట్టుకుంటుంది.
స్వప్నాల గురుతులేవీ ఉండవు, జ్ఞాపకాల గాట్లలో రక్తం స్రవించడం
ఆగిపోయి ఉంటుంది, కొత్త ఊహలేవీ ఇంకా మొగ్గ తొడగవు.
మెలకువ వచ్చిన క్షణం తటాలున లేవడం మంచిది,
నిద్ర ఎక్కడికో పోయినట్టే ఉంటుందిగాని, మళ్ళా వలపన్నడానికి
ఏ పొంతనో పొంచి ఉంటుంది. కలలు చెదిరినట్టే ఉంటాయిగాని
అవి ఇంకా పాలుకారుతూ నీ తలగడ తడుస్తూనే ఉంటుంది.
మెలకువ రాగానే నిన్ను నువ్వు కూడదీసుకుంటున్నట్టుంటుంది
ఉండలుండలుగా చెదిరిపోయిన సమస్తాంగాలూ
ఒక స్ఫురణలోకి ఒదిగినట్టే ఉంటుందిగానీ, మళ్ళా మరుక్షణమే
కరిగినీరై పోయే ప్రమాదమూ పొంచి ఉంటుంది.
ఆ ఒక్క క్షణాన్ని రెండు చేతుల్తో జాగ్రత్తగా పట్టుకో, పేపర్ వాడు
వార్తాపత్రిక ఇంట్లో గిరవాటు పెట్టి వెళ్ళిపోయినట్టుగా
కుళాయి నీళ్ళు చిమ్మినట్టుగా, పొయ్యి మీద పాలు పొంగినట్టుగా,
కాలం కబళించకముందే తటాలున లేవడం మంచిది.
2009
When You Wake Up
When you wake, you feel fully awakened,
Your heartbeat steadies,
No trace of dreams remains,
The blood stops flowing in memory’s wounds,
New thoughts have not yet taken wing.
The moment you wake,
You’d better get up at once.
Sleep appears to have disappeared,
But who knows, it may seize you again.
The dreams look scattered,
But your pillow is still drenched with their milk.
When you wake, you feel you’ve gathered yourself,
All your limbs that tumbled helter-skelter
Seem joined together again,
But they may melt down again at any moment.
Grasp that moment tightly with both hands,
Like the newspaper boy throwing the paper
onto the balcony and rushing on,
Like the municipal tap gushing,
Like the milk on the stove boiling over,
You’d better get up the moment you wake,
Before time devours you.
2025
Featured image: Photography by Johannes Plenio via pexels.com
6-12-2025
ఏమని చెప్పను? ప్రతి అక్షరం, ప్రతి పాదం విలువల్ని సంతరించుకుని ఉంటే. మీ మెదడు లో ఎన్నెన్ని ఆలోచనలు? నాలాంటి వాళ్ళు పడ్డప్పుడు ఏడుస్తూ లేస్తారు. తమరి వంటి వారు పడక ముందే అప్రమత్తత తో మేల్కొని మాకు ఒక దీప్తివంతమైన కాంతిని చూపిస్తారు. అప్పుడు మేల్కొంటాం. కానీ మీ హెచ్చెరిక తో…
కాలం కబళించకముందే తటాలున లేవడం మంచిది గనుక లేస్తున్నా. శక్తి కూడగట్టుకొని సవ్యమైన దారిని చూపిస్తూ ముందుకి అడుగు వేస్తాను.
నమస్సులు మిత్రమా
2009
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం.
“మెలకువ వచ్చిన క్షణం తటాలున లేవడం మంచిది,”
ఎంత సున్నితంగా హెచ్చరిస్తున్నారు కవి?
మెరుపు మెరిసి మాయమయ్యే క్షణాన్ని వీక్షించిన క్షణం లో మరిచిపోయి సాధారణ వొరవడి లో పడి పోతుంటాం. మెరిసిన మెరుపుగాని, సౌందర్యాన్ని వికసింపచేసే ఆ క్షణాన్ని ఒడిసిపట్టుకోవాలని గాని అనిపించకపోవడం మనకెంత సాధారణమో, ఆక్షణాన్ని సొంతం చేసుకుని చేతులు కాళ్ళు కట్టేసి, తనదైన శిల్పం తో మనముందు నిలబెట్టడం “కవి” కి అంతే సా’ధారణం’.
“నిద్ర ఎక్కడికో పోయినట్టే ఉంటుందిగాని, మళ్ళా వలపన్నడానికి
ఏ పొంతనో పొంచి ఉంటుంది”
నిజమే! ఎన్నిసార్లు “స్వామి” పాదాల ముందు భక్తితో మోకరిల్లినా, క్షణం ఆదమరిచినా చాలు మళ్ళీ ‘నిద్ర’ (సహజ ప్రకృతి) మనలో ఒళ్ళు విరుచుకుంటుంది. సాధన అంతా భగ్నమయ్యి కూర్చుకుంటుంది.
“కవి” ద్వారా నా మనస్సుకు ఒక సమాధానం దొరికింది.
సమాధానమిదే! “కాలం కబళించకముందే తటాలున లేవడం మంచిది.”
హృదయపూర్వక ధన్యవాదాలు జీవన్!