మహాప్రస్థానం @75

మహాప్రస్థాన గీతాలు పుస్తక రూపంగా వచ్చి డెబ్భై అయిదేళ్ళు గడిచేయి. 1940 లో ఆ గీతాల్ని ‘అనుభవించి పలవరిస్తో ‘చెలంగారు ‘పదేళ్ళు ఆగండి, ఈ లోపల ఆస్తి సంపాయించడం, పిల్లల్ని కనడం, ధరలు హెచ్చడంకాక, జీవితంలో ఇంకా ఏవన్నా మిమ్మల్ని అమితంగా ఇన్‌ఫ్లుయన్స్‌ చేసినవి జరిగి వుంటే మళ్ళీ కొత్తకాపీ కొని శ్రీశ్రీ పద్యాల్ని చదవండి’ అన్నాడు. ఆయన ఆ మాటలు రాశి ఎనభై అయిదేళ్ళు గడిచాయి. ఇప్పుడు ఆ గీతాల్ని మళ్ళీ చదువుతోంటే అవి ఇంకా కొత్తగా కొత్త అర్థాల్నీ, కొత్త సంవేదనల్నీ రేకెత్తిస్తున్నాయి.

మహాప్రస్థాన గీతాల్లో ప్రయోగం వుంది, సాఫల్యం వుంది. దీన్ని ‘కవిత్వంలో నా ప్రయోగాలు’లో శ్రీశ్రీ ఇలా వివరించేడు.

1934 నుండి 40దాకా శ్రీశ్రీ ఇటువంటి పరిణామం గ్రాఫ్‌లో వై-యాక్సిస్‌ పైన సమాంతరంగా రెండుదారుల్లో సాగింది. ఒకటి, వ్యక్తిగా కవి తన అస్పష్ట వైయక్తిక వేదనలో గడిపిన బాధానుభవం. ‘నాకు నిశ్వాస తాళవృంతాలు గలవు’ అన్న భావకవికి కొనసాగింపు ఇది. ‘ఒక రాత్రి’ ‘ఆకాశదీపం’ ‘అవతలిగట్టు’ ‘సాహసి’ ‘పరాజితులు’ ‘ఆః’ ‘చేదుపాట’ ‘దేనికొరకు’ ‘కేక’ ‘నీడలు’ ఆ ధోరణి కవితలు. ఈ కవితలవెనుక హంగ్రీ థర్టీస్‌, బోదిలేర్‌, ఫ్రెంచి సింబలిస్టులు, ఎడ్గార్‌పో, ఎమిలీ వెర్‌హీరన్‌ వున్నారు. ఈ కవితలే లేకపోయుంటే మహాప్రస్థానం ఒక ప్రబోధ గీతాల సంకలనంగానే వుండిపోయేది. ఈ కవితల్లో లోకంపట్ల భయం, లోక యధార్థం నుంచి ఒకడుగు వెనక్కి వెయ్యడం, అస్పష్టవ్యాకులత ఉన్నాయి. వీటిని భీతావహ గీతాలు అనవచ్చు.

మరొక దారిలో వీటినుంచి తేరుకుని కవి ప్రపంచంవైపు ఒకడుగు ముందుకేసి జీవితయధార్థాన్ని ఎదుర్కొన్న కవితలున్నాయి . ‘బాటసారి’, ‘శైశవగీతి’, ‘భిక్షువర్షీయసి’ ‘ఉన్మాది’, ‘సంధ్యాసమస్యలు’, ‘వాడు’ అటువంటివి. ఒక బిచ్చగత్తె, పిచ్చివాడు, దారితప్పిన మనిషి-వీరి దగ్గర జీవితం వైఫల్యం చెందిన మాట నిజమే అయినప్పటికీ కవి తన కారుణ్యప్రకటన వల్ల జీవితాన్ని అక్కడ ఆశావహంగా నిలబెడుతున్నాడు. ఇదే లేకపోయుంటే మహాప్రస్థానంలో జీవస్పర్శ, మానవదేహాల వెచ్చదనం ఉండేవి కావు. వీటి వెనుక గురజాడ అప్పారావు, కవికొండల, బసవరాజు, చింతా దీక్షితులు ఉన్నారు.

ఈ రెండు ధోరణులూ కవి సాంకేతిక ప్రయోగాలతో మేళవించబడి ఉన్నత శిఖరాలకు చేరుకున్నప్పుడు ‘మహాప్రస్థానం’, ‘అవతారం’, ‘ప్రతిజ్ఞ’, ‘కవితా ఓ కవితా’, ‘నవకవిత’, ‘దేశచరిత్రలు’, ‘జ్వాలాతోరణం’, ‘మానవుడా’, ‘గర్జించు రష్యా’, ‘జగన్నాథుని రథచక్రాలు’ వంటి కవితలు ప్రభవించాయి.

ఈ ప్రస్థానమంతటికీ మకుటాయమానంగా ‘నిజంగానే’ కవితను చూడాలి. ఇందులో కవి ప్రకటిస్తున్నది సంశయం కాదు, తన స్వప్నం ఫలిస్తుందని నిశ్చయంగా బోధపడ్డప్పుడు కలిగే నమ్మలేని ఆశ్చర్యమే. ఇందులో కవి ప్రశ్నార్థకపు గుర్తుల్నే పెట్టినా నిజానికి వాటిని మనం ఆశ్చర్యార్థకపు గుర్తులుగానే భావించాలి.

ఛందస్సు పరంగా శ్రీ శ్రీ ప్రభవ సంపుటి తర్వాత పద్యాలనుంచి గేయాలవైపు పయనించడానికి గురజాడ అప్పారావు కారణమని చెప్పుకున్నాడు. ప్రతి భాషకీ తనదైన ఒక మౌలిక ఛందస్సు ఉంటుంది. తెలుగు పదజాలం ప్రధానంగా 3, 4, 5 మాత్రలకు మించనిది కాబట్టి, దేశిఛందస్సులో తెలుగువాడి గుండెచప్పుడు బాగా వినబడుతుంది. అయితే ద్విపద, తేటగీతిలాంటి దేశిఛందస్సుల్లో లేని ఒక గతిశక్తి రగడల్లో కనిపిస్తుంది. కాబట్టే యక్షగాన కర్తలు దరువుల్నీ, రగడల్నీ వాడుకున్నారు. రెండు పంక్తుల్లో ప్రతి ఒక్క పంక్తిలోనూ 3+4, 3+4, 3+4, 3+4 మాత్రల అమరికతో, ఆద్యంతప్రాసలు పాటించే వృషభగతి రగడలో రెండవ పంక్తిలో ద్వితీయార్ధభాగాన్ని విరవడం ద్వారా గురజాడ రగడని ముత్యాలసరంగా మార్చాడు. (గురజాడ సమకాలీకులైన ఆధునిక ఫ్రెంచి కవులు, ఇంగ్లీషు కవులు, రష్యన్‌ కవులు అప్పట్లో వారి వారి ఛందస్సుల్లో చేస్తున్నది ఇలాంటి ప్రయోగాలే.)

ఉదాహరణకి వసుచరిత్రలో సుప్రసిద్ధమైన రగడ

గురజాడ చేతుల్లో ఇలా మారింది.

పారశీక గజలు బహర్-ఎ-రమాల్ ముసమ్మన్ మహ్జూఫ్ లో కూడా ఇటువంటి చలనశీలత ఉందని గురజాడ గమనించి ఉండవచ్చు. అలాగే ‘గుమ్మడేడే గోపిదేవీ, గుమ్మడేడే ముద్దుగుమ్మా, గుమ్మడేడే కన్నతల్లీ, గుమ్మడేడమ్మా’ అన్న స్త్రీల పాటలో కూడా ఒక దారి కనిపించి ఉండవచ్చు. కాని గజల్ బహర్ లో గాని, స్త్రీలపాటలోగాని నాలుగవ పంక్తిలో విరుపు ఉన్నప్పటికీ, దాని నిడివి మార్చడానికి వీల్లేనిది. కాని గురజాడ నాలుగవ పాదంలో అన్నిసార్లూ ఒకే నిడివిని పాటించలేదు. కొన్నిసార్లు ‘కన్యక’ లోలాగా అది తోకముత్యాలసరంగా కూడా పరిణమించింది (ఉదా.కన్నె పరతెంచెన్ రాజ వీథిని). తద్వారా సాంప్రదాయిక తెలుగు దేశిఛందస్సుల్లోలేని  అపూర్వమైన గతిశీలతని గురజాడ సాధించాడు. ఒకసారి ఆ మెలకువని అర్ధం చేసుకున్నాక శ్రీశ్రీ ముత్యాలసరంతో మరిన్ని ప్రయోగాలు చేసి మరింత గతిశీలతను సాధించాడు.

రగడ, ముత్యాల సరం పోకడలో 3+4, 3+4 మాత్రల్తో త్రిశ్రగతిలో ‘కూటికోసం, కూలి కోసం’, ‘నేను సైతం ప్రపంచాగ్నికి’, ‘యముని మహిషపు లోహఘంటలు’, ‘అలకలన్నీ అట్టగట్టిన’ , ‘విషంకక్కే భుజంగాలో’, ‘కుక్కపిల్లా, అగ్గిపుల్లా’, ‘నిజంగానే నిఖిలలోకం’, – లాంటి గేయాలు,

కొన్నిసార్లు 3+3 గతిలో ‘దారి పక్క చెట్టు కింద’, ‘వేళకాని వేళలలో’, ‘ఔను నిజం, ఔను నిజం’- లాంటి గేయాలూ,

కొన్నిసార్లు 4+4, 4+4 మాత్రల్లో చతురశ్ర గతిలో, ‘మరో ప్రపంచం మరో ప్రపంచం’, ‘పాపం పుణ్యం ప్రపంచమార్గం’, ‘పొలాలనన్నీ హలాల దున్నీ’, ‘నిద్రకు వెలియై, నేనొంటరినై’, ‘స్వర్గనరకముల ఛాయాదేహళి’-లాంటి గీతాలూ రాశాడు.

ఎరికొన్నిసార్లు మాత్రాగతిలో ఊహాతీతమైన ప్రయోగాలు, 3+5 (‘పట్టణాలలో, పల్లెటూళ్ళలో’), 5+5 (‘స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించి’), 5+4+5 (‘ఏ దేశ చరిత్ర చూచినా’) 5+5+5 (‘భూతాన్ని, యజ్ఞోప వీతాన్ని’), 6+4+4 (‘అంతేలే పేదల గుండెలు’) 6+8 ( ‘సిందూరం రక్తచందనం’, ‘ఆనందం అర్ణవమైతే’) లాంటి విలక్షణ ఖండగతి గేయాలు రాసాడు.

కొన్నిసార్లు ఒకే గేయంలో రెండుమూడు నడకల్ని కలిపాడు. ఉదాహరణకి ‘నిద్రకు వెలియై నేనొంటరినై’ అన్నంతవరకూ 4+4 లో నడిపి మూడవపంక్తికి వచ్చేటప్పటికి ‘నా గదిలోపల చీకటిలో’ అని 4+4+6 గా మారుస్తాడు.

ఇటువంటి ప్రయోగాలన్నింటిలోనూ ఆయన ఉద్దేశించిన ప్రయోజనం తన గేయానికి ఒక వినూత్నగతిని తీసుకురావడమే. ఇలా గేయపాదాల్ని విరిచో, పొడిగించో దాన్ని monotony కి దూరం చెయ్యడంవల్ల ప్రతి ఒక్క గేయమూ కూడా అనూహ్యగతిశీలతను సంతరించుకుంది. ఇందుకు శ్రీశ్రీ గురజాడకు పూర్తిగా ఋణపడి ఉంటాడు. శ్రీశ్రీ సమకాలికులూ, ఆయన తరువాత వచ్చిన గేయరచయితలెవ్వరూ ఇన్ని ప్రయోగాలు చేసినట్టు మనకి కనిపించదు.

అయితే గేయరీతుల్లో ఇటువంటి ప్రయోగాలు చేస్తూనే ఒక ద్రష్టగా తాను చూస్తున్నదాన్ని చూస్తున్నట్టుగా మనకి అందించడంలో ఆయన ‘కవితా ఓ కవితా’, ‘వాడు’, ‘సంధ్యాసమస్యలు’ లాంటి కవితల్లో ఛందస్సుకి అతీతంగా పయనించేడు. తదనంతర తెలుగు కవిత్వం అత్యధికం వచనకవితగా మారడానికి ఇక్కణ్ణుంచే దారిపడిరది.

ఇక దర్శనం దృష్ట్యా చూసినట్లయితే, మన సాహిత్యవిమర్శకులు, భావకవుల్ని ఇంగ్లిషు రొమాంటిసిస్టులతోనూ, అభ్యుదయకవుల్ని యూరోపులోని సోషలిస్టు కవులతోనూ పోలుస్తుంటారు. ఇది సమగ్ర పరిశీలన కాదు. భావకవులు, ముఖ్యంగా కృష్ణశాస్త్రి షెల్లీ, కీట్సులకన్నా బైరనుకు ఎక్కువ ఋణపడి ఉంటాడు. కాని ఆయన కవిత్వం రాసేనాటికి పాశ్చాత్య కవిత్వంలో ఎడ్గార్‌ అలన్‌ పో డార్క్‌ రొమాంటిసిజం, ఫ్రెంచి, రష్యను కవుల సింబలిజం, ఇంగ్లిషుకవుల్లో మాడర్నిజంగా మారుతున్న డికడెన్సు ప్రచలితంగా ఉన్నాయి. కృష్ణశాస్త్రికి తెలియకుండానే ఆయన మీద ఈ నీడలన్నీ పడుతూ ఉన్నాయి. ‘ఏను మరణించుచున్నాను, ఇటు నశించు నాకొరకు చెమ్మగిలు నయనమ్ము లేదు’, ‘ఇది నిశాంత తమఃక్రాంత మిది దరిద్రమీ నిశాంతము శూన్యము…’ లాంటి పద్యాలు రొమాంటిసిజం వల్ల కాక డార్క్‌ రొమాంటిసిజం ప్రభావం వల్ల ప్రభవించినవి. శ్రీ శ్రీ ‘ప్రభవ’ పద్యాలు అక్కణ్ణుంచి మొదలయ్యాయి. వాటి నీడలోనే మహాప్రస్థానంలోని భీతావహగీతాలు ఒక పాయగా కనిపిస్తాయి.

మరొకవైపు ఇటలీలో మొదటి ప్రపంచయుద్ధ కాలంలో మారినెట్టి ప్రవచించిన ఫ్యూచరిజం ప్రభావం మొత్తం యూరోపు మీద, ముఖ్యంగా మయకోవస్కీ మీద పడిరది. ఫ్యూచరిజం అంటే ఉన్న వ్యవస్థ మొత్తం ధ్వంసమై కొత్త వ్యవస్థ ప్రభవించాలనడం. ప్రగతివాదం, అంటే ప్రొగ్రెసివిజం, ఉన్నవ్యవస్థ రూపురేఖల్ని విప్లవంద్వారా మార్చాలను కోవడం. ప్రగతివాదం పూర్తివిధ్వంసాన్ని కోరుకోదు. తిరోగమనశక్తులమీద పురోగమన శక్తుల విజయాన్ని మాత్రమే కోరుకుంటుంది. అలా చూసినప్పుడు ‘అభ్యుదయం’, ‘జగన్నాథుని రథ చక్రాలు’, ‘జ్వాలాతోరణం’ వంటి కవితలు ప్రొగ్రెసివిస్టు కవితలకన్నా ఫ్యూచరిస్టు కవితలుగానే ఎక్కువ కనిపిస్తాయి.

అయితే, ఈ రెండు అతిధోరణుల మధ్యా, అంటే ఒకవైపు ఆత్మహనన పూర్వకమైన వ్యక్తివేదన (డార్క్‌ రొమాంటిసిజం), మరొకవైపు సమస్తవ్యవస్థాహననశీలమైన విధ్వంసకాంక్ష (ఫ్యూచరిజం) ల మధ్య శ్రీ శ్రీ ఎంతో ప్రయత్నపూర్వకంగా ఒక సమతూకాన్ని సాధించుకున్నాడు. ఆ సమతౌల్యం, ఆ ఆరోగ్యప్రదమైన ఆకాంక్ష ‘మహాప్రస్థానం’, ‘జయభేరి’, ‘కవితా, ఓ కవితా’,’ ప్రతిజ్ఞ’, ‘దేశచరిత్రలు’ వంటి కవితల్లో అనితరపూర్వమైన స్పష్టతను సాధించుకుంది. నాకు తెలిసి శ్రీశ్రీ సమకాలికులైన ప్రపంచ మహాకవు లెవరిలోనూ ఇటువంటి సమతూకం కనిపించదు. (బహుశా ఈ విషయంలో పందొమ్మిదోశతాబ్ది వాల్ట్‌ విట్మను మాత్రమే శ్రీశ్రీ కన్నా ఒక అడుగు ముందున్నాడనుకుంటాను.)

ఎడ్గార్‌ అలన్‌ పో డార్క్‌ రొమాంటిసిజం నుంచి, మయకోవస్కీ ఫ్యూచరిజం మీదుగా శ్రీశ్రీ సోషలిస్టు కవిత్వానికి ప్రయాణించినప్పటికీ అందులో భాషలోనూ, శిల్పంలోనూ, సంవిధానంలోనూ ప్రాచీన సంస్కృత, తెలుగు పూర్వమహాకవుల ప్రభావాల్ని కూడా స్వీకరించడంతో అద్వితీయమైన సమన్వయాన్ని సాధించుకోగలిగాడు. ముఖ్యంగా భాషలో. ఆయన వెయ్యేళ్ళ తెలుగు కవిత్వానికి కొత్త భాషనిచ్చాడు. పదసంయోజనంలో ఆయనది అద్వితీయ మార్గం. బహుశా వేములవాడ భీమన, శ్రీనాథుడు వంటి ఎవరో ఒకరిద్దరు పూర్వతెలుగు కవులు మాత్రమే భాషలో ఇటువంటి ‘ఉద్దండలీల’ (‘వచియింతు వేములవాడ భీమన భంగి ఉద్దండలీలనొక్కొక్కమారు’ _  శ్రీనాథుడు)ను చూపించగలిగారు. (తిక్కన, వేమన, గురజాడ లాగా తాను కూడా తేటతెలుగు మాటల్లో కవిత రాయాలని అనుకున్నా, అది ఆయన జీవితపు చివరిరోజుల్లో, ‘మరోప్రస్థానం’ కవితలనాటికి గానీ ఆయనకు సాధ్యం కాలేదు.) మనిషి మనసులోని వ్యక్త, అవ్యక్త ప్రపంచాలను వీలైనన్ని ప్రకంపనలతో పట్టుకోగలగడం మహాప్రస్థాన భాషలో కనిపిస్తుంది. కాబట్టే చెలంగారిలా రాసారు:

కాని ఈ క్రమ పరిణామం ఒక సరళరేఖీయ మార్గంలో కాకుండా పునరావృత్తిలో సంభవించడాన్ని కూడా మనం గమనించాలి. ‘మా దృష్టిది వర్తుల మార్గం, ఆద్యంత రహితం’ అని కవి అననే అన్నాడు. కవి లోకంవైపుగా ఒకడుగు, లోకం నుంచి వెనక్కి మరొక అడుగు వేస్తూ సాగే ఈ బీభత్సరసప్రధాన కవిత్వంలో ప్రతి అడుగు తర్వాత అంతకు పూర్వపు మనఃస్థితి కన్నా ఉన్నత మనఃస్థితికి చేరడం వల్లనే శ్రీశ్రీని మానవవిజయ ప్రవక్త అంటూంటాను.

ఏకకాలంలో బాహ్యాంతః సంగ్రామాలు రెండింటినీ చిత్రించడం మహాకావ్యాల లక్షణం. ఇటువంటి మానవత్వం ఎవరి కంఠంలో సమగ్రచిత్రణకి నోచుకుంటుందో అతడే ఆ యుగానికి ప్రతినిధికవి అవుతాడు. మనిషి బాహ్యజీవిత అసంబద్ధతపైన సాధించిన విజయాన్ని గురజాడ చిత్రించగా, మనిషి తన ఆంతరంగిక సంక్షోభంలో తలపడటాన్ని బైరాగి వివరించేడు. ఒక్క మహాప్రస్థానగీతాల్లోనే, మనిషి తనతో తాను తలపడటం, మరొకవైపు జీవితపు చేదునిజాల్తో తలపడటం సమానంగా చిత్రణకు వచ్చినందువల్లే దీన్ని ‘కవిచేసే అంతర్‌ బహిర్‌ యుద్ధారావం’ అన్నాడు చెలం. మహాప్రస్థానం తర్వాత మరొక మహాకావ్యం తెలుగులో ఇంతదాకా రాకపోవడానికి ఇదే కారణమనుకుంటాను.


Featured image: Turner, Snow Storm: Steam-Boat off a Harbour’s Mouth (c. 1842). Oil on canvas. Tate Britain, London

27-7-2025

2 Replies to “మహాప్రస్థానం @75”

  1. sailajamitra – Hyderabad – I am a poet, writer and journalist residing at hyderabad. I was born in chinnagottigallu, chittoor dist on jan 15th. My qualifications are MA..PGDCJ ( In journalism).In all my 18 years of penchant writing, I launched 5 poetry books, one shortstory book and five english translated books on my own.
    Sailaja Mithra says:

    “ఈ వ్యాసం శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ను కేవలం ఒక కవితా సంపుటిగా కాక, తెలుగు సాహిత్య చరిత్రలో ఒక విప్లవాత్మక ఘట్టంగా చూపించడంలో అద్భుతంగా విజయవంతమైంది. రచయిత దృక్పథం అత్యంత లోతైనది, విశ్లేషణ పరంగా శాస్త్రీయమైనదీ, అనుభవపరంగా మానవీయమైనదీ. ఛందస్సు, భావతత్వం, సాంఘిక ప్రేరణ, ప్రపంచ సాహిత్య ప్రభావాలు — ఈ అన్నిటినీ పరస్పర సంబంధాల్లో నిష్ణాతంగా అన్వయించడంలో రచయితకు ఉన్న మేటితనం ప్రశంసనీయం.

    ప్రత్యేకంగా గురజాడ నుంచి శ్రీశ్రీ వరకు ఛందస్సులో జరిగిన రూపాంతరాల విశ్లేషణ అపూర్వంగా ఉంది. ‘భీతావహ గీతాలు’ నుండి ‘జ్వాలాతోరణం’ దాకా కవిత్వ స్వరూపం ఎలా మారింది అనే దానిపై చేసిన పరిశీలన, కవిత్వపు అంతర్బాహ్య సంగ్రామాలను మహాకావ్యాత్మకంగా గుర్తించిన కోణం, అద్భుతమైన విమర్శా మేధస్సును ప్రతిఫలిస్తోంది.

    ఇది కేవలం సాహిత్య విమర్శ కాదు, ఒక భావ ప్రకంపన, ఒక కవి-చేత అనుభవించిన కాలంలోని సమిష్టి స్పందన. చదువుతున్న ప్రతి ఒక్కరికీ — సాహిత్య ప్రియుడు, కవులు, విద్యార్థులు, అధ్యాపకులు — ఈ వ్యాసం కొత్త చూపునిస్తుంది. ‘మహాప్రస్థానం’ ఎందుకు తిరిగితిరిగి చదవదగిన గ్రంథమో, ఎందుకు అది ఇప్పటికీ ‘కొత్తగా’ అనిపిస్తోందో — ఈ వ్యాసం అందానికి అద్భుతమైన వ్యాఖ్యానం.”

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మేడం! మీ వ్యాఖ్య నాకు కొత్త ప్రోత్సాహాన్ని ఇస్తోంది.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%