
నేను ఉద్యోగంలో చేరినప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషనులో ఫౌండేషను ట్రైనింగుకి హాజరయ్యాను. అందులో భాగంగా, ఎవరో ఒక ఫాకల్టీ ఏదో విషయం మీద ప్రసంగిస్తూ, ఒక కథ చెప్పాడు.
ఆ కథలో ఒకాయన సత్యం తెలుసుకోవడం కోసం ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పణ్ణుంచీ తాను అంతదాకా ఎవరెవరు గురువుల్ని కలిసిందీ, ఏమి నేర్చుకున్నదీ, ఏమి నేర్చుకోకుండా ఉండిపోయిందీ అన్నీ ఏకరువు పెడుతుంటాడు. ఆ గురువు ఇతడి మాటల్ని పట్టించుకోకుండా టీ కాచుకుని, ఆ తర్వాత ఆ టీ తీసుకొచ్చి, తన ఎదురుగా బల్లమీద ఉన్న కప్పులో పోయడం మొదలుపెడతాడు. ఆ వచ్చినాయన ఆ గురువునే చూస్తూ తాను చదివిన పుస్తకాలూ, తనకి తెలిసినవీ చెప్తూనే ఉన్నాడు. ఆ గురువు కప్పులో టీ పోస్తూనే ఉన్నాడు. కప్పు నిండిపోయింది. అయినా ఆ గురువు ఇంకా ఆ కప్పులో టీ పోస్తూనే ఉన్నాడు.
‘అయ్యా, గురువు గారూ, మీరు చూసుకోటం లేదు, కప్పు నిండిపోయింది ఇంక అందులో మీరేమీ పొయ్యలేరు’ అని అన్నాడు వచ్చినాయన.
‘అలాగా’ అన్నాడు గురువు, స్థిమితంగా. ‘మరి నీ మనసు కూడా చాలావాటితో పూర్తిగా నిండిపోయి ఉంది కదా! ఇప్పుడు నీకేమి చెప్పినా అది కూడా పొంగిపోయి కిందకి ఒలికిపోతుంది కదా!’ అని అన్నాడు గురువు.
ఆ రోజు ఆయన చెప్పింది ఒక జెన్ కథ అనీ, అటువంటి మరొక వంద జెన్ కథల్ని సేకరించి పాల్ రెప్స్ అనే ఆయన Zen Bones Zen Flesh (1957) అని ఇంగ్లిషులో ఒక పుస్తకంగా తీసుకొచ్చేడనీ, ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకుగానీ తెలియలేదు.
పాల్ రెప్స్ ఒక అమెరికన్. జెన్ స్ఫూర్తినీ, హైకూని అమెరికాకి పరిచయం చేసిన తొలితరం రచయితల్లో, కళాకారుల్లో ఒకడు. రింజాయి బౌద్ధ శాఖకి చెందిన న్యోజెన్ సెంజకి అనే ఆయన సేకరించిన జెన్ కథల్ని ఆయనతో కలిసి పాల్ రెప్స్ తొలిసారిగా అమెరికాకి పరిచయం చేసాడు. వాటితో పాటు, పదమూడో శతాబ్దానికి చెందిన జెన్ సూక్తుల సంకలనం నుంచి కూడా కొన్ని సుభాషితాల్ని ఎంపికచేసి ఆ పుస్తకంలో Pre-Zen Writings పేరిట అనువదించాడు.
ఇప్పుడు ఆ 101 కథల్లోంచి 52 కథల్ని ఎంపిక చేసి దీవి సుబ్బారావు గారు ‘మసిబారిన బుద్ధుడు’ (2025) పేరిట తెలుగులోకి తీసుకొచ్చారు. రెండు వారాల కిందట నాకు ఫోను చేసి తానిట్లా పుస్తకం తీసుకొచ్చానని చెప్పి నాకు పంపించారు. అది ఆయన కరుణ, నా పట్ల వాత్సల్యం.
సుబ్బారావుగారు భారతీయ సాహిత్యం నుండీ, ప్రపంచ సాహిత్యం నుండీ తనకు నచ్చిన మణిపూసల్నీ అప్పుడూ అప్పుడూ ఇలా తెలుగు పాఠకలోకానికి కానుక చేస్తూనే ఉన్నారు. వీరశైవ వచన కవుల కవిత్వానికి ‘మాటన్నది జ్యోతిర్లింగం’ పేరిట ఆయన చేసిన అనువాదానికి సాహిత్య అకాదెమీ పురస్కారం కూడా లభించింది. ఈ మధ్య కాలంలో ఆయన చైనా కవిత్వాన్నీ, ఆఫ్రికన్ కవిత్వాన్నీ కూడా తెలుగు చేసారు. ఇప్పుడు సరికొత్తగా జెన్ కథలు.
సుబ్బారావుగారి వాక్యంలో ఒక వింత సొగసు ఉంటుంది. అది అచ్చు ఆయన మాట్లాడినట్టే ఉంటుంది. సూటిగా, తేటగా, నిరలంకారంగా, కానీ ఎంతో సానునయంగా, ప్రేమగా. మనకు తెలిసిన కథలే, కాని ఆయన వాక్యాల్లో చదివినప్పుడు, మళ్ళా కొత్తగా కనిపిస్తాయి. ఈ జెన్ కథలు చదువుతున్నప్పుడు కూడా అదే అనుభూతి నాకు. ఆ రుచి ఎలా ఉంటుందో చూపించకుండా ఉండలేను కదా! అందుకని ఒక ఉదాహరణ:
సూత్ర ప్రచురణ
జెన్ బౌద్ధంలో విశ్వాసం ఉన్న టెట్సుజెన్ అనే ఆయన చీనీ భాషలో ఉన్న బౌద్ధ సూత్రాల్ని జపాన్ భాషలోకి అనువాదం చేసి ప్రచురించేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఆ కాలంలో చెక్కపలకలతో గ్రంథప్రచురణ చేయవలసి వచ్చేది. అలా ఏడువేల ప్రతులు ముద్రించడం అంటే మాటలు కాదు. అదొక బృహత్కార్యం.
ఇందు కొరకు టెట్సుజెన్ వూళ్ళూ వూళ్ళూ తిరిగి, చందాలు వసూలు చేయడం మొదలుపెట్టాడు. అర్థం చేసుకున్న కొందరు సానుభూతిపరులు నూరుబంగారు నాణేల వరకు ఇచ్చేవారుగానీ ఎక్కువ మంది నుడంఇ చిల్లరకాసులు మాత్రమే జమ అయ్యేవి. ఎవరు ఎంత ఇచ్చినా అందరికీ సమానంగా కృతజ్ఞతలు చెప్పేవాడు. తను అనుకున్న పని మొదలుపెట్టడానికి పదేళ్ళు పట్టింది.
అలాంటప్పుడు ఉజి నదికి వరదలు వచ్చాయి. కరువు తాండవించింది. గ్రంథ ముద్రణ కొరకు వసూలు చేసిన డబ్బు యావత్తు ప్రజల్ని కరువు కోరల్నుండి రక్షించడానికి ఖర్చుచేశాడు. అప్పుడు మళ్ళీ నిధులు సేకరించండం మొదలుపెట్టాడు.
చాలా ఏళ్ళు గడిచాక వింత అంటువ్యాధి ఒకటి దేశంలో ప్రబలి ప్రజల్ని కలిచివేసింది. తన ప్రజల్ని కాపాడేటందుకు టెట్సుజెన్ తను కూడబెట్టిన డబ్బు వినియోగించాడు.
మూడోసారి మళ్ళీ తన పని మొదలుపెట్టాడు. 20 ఏళ్ళ తర్వాత అతని కోరిక నెరవేరింది. సూత్రగ్రంథాల ముద్రణకు వాడిన చెక్క పలకలను ఇవాల్టికి కూడా క్యోటోలో ఉన్న ఒబకు బౌద్ధ విహారంలో చూడవచ్చు.
జపాన్ దేశస్థులు తమ పిల్లలకు చెప్తుంటారు.. టెట్సుజెన్ సూత్ర గ్రంథాలను మూడు విడతలుగా ముద్రించాడనీ, అదృశ్యంగా ఉన్న మొదటి రెండు ముద్రణ ప్రతులు, చివరిదైన మూడవ ముద్రణ ప్రతుల కన్నా ఎన్నో రెట్లు విలువైనవనీ.
మసిబారిన బుద్ధుడు, ఎన్నెలపిట్ట ప్రచురణలు, రు.125/- పుస్తకం కావాలంటే, pustakam.in నిగానీ లేదా 7989546568 ని గానీ సంప్రదించవచ్చు.
Featured image: PC: Buddha statue near green-leafed tree, Alejandro Barba
16-7-2025
దీవి సుబ్బారావు గారు మా ఇంటర్మీడియట్ విద్యా సంచాలకులుగా పనిచేశారు. గొప్ప రచయిత, మంచి అనువాదకులు .వారి మాటన్నది జ్యోతిర్లింగం చదివాను. వీరి మసిబారిన బుద్ధుడు చదవాలనే ఆసక్తి మీ వ్యాసం కలిగించింది. ధన్యవాదాలు సర్
ధన్యవాదాలు సార్!
ఈ వ్యాసం చదువుతుంటే నాకు ఎప్పుడో ఫౌండేషన్ ట్రైనింగ్‌లో విన్న ఒక జెన్ కథ గుర్తొచ్చింది. ‘‘కప్పు నిండిపోయింది’’ కథ – మనం ఎంత నేర్చుకున్నామన్న గర్వంతో నిండిపోయి ఉంటే కొత్త జ్ఞానం మన లోపలికి ప్రవేశించలేదన్న గురువు బోధ. ఇదీ పాల్ రెప్స్ అనే రచయిత సేకరించిన 101 జెన్ కథలలో ఒకటి. అదే పుస్తకం నుంచి ఇప్పుడు దీవి సుబ్బారావు గారు 52 కథల్ని తెలుగులో ‘మసిబారిన బుద్ధుడు’ పేరిట అనువదించటం ఎంతో హర్షణీయం. ఆయన వాక్యంలో ఉండే ఆ సూటితనం, ఆ తేటతనమే ఈ జెన్ కథల్ని మళ్లీ కొత్తలా అనిపించేస్తుంది. ముఖ్యంగా ‘సూత్ర ప్రచురణ’ కథలో టెట్సుజెన్ చేసిన త్యాగం – ముద్రించని సూత్రాలే అసలైన బోధ అని చెప్పే విధానం – లోతైన తత్వాన్ని మనసులో నిలిపేస్తుంది. ఈ వ్యాసం చదివిన తర్వాత ఆ పుస్తకం చదవాలనిపించడం సహజం. సుబ్బారావుగారి కృషికి, మీరు పంచుకున్న ఈ పరిచయానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
హృదయపూర్వక ధన్యవాదాలు శైలజ గారూ!