
కవులు తమ కవితలకి స్ఫూర్తి ఎక్కణ్ణుంచి తెచ్చుకుంటారో చెప్పడం కష్టం. కొన్నిసార్లు ఒక్క మాట, ఒక్క పదబంధం, ఒక్క నుడికారం దొరికినా కూడా తమదైన ఊహాశాలిత్వంతో తమవైన గొప్ప కవితలు సృజిస్తూ ఉంటారు. ఆ కవితలు చదివినప్పుడు వాటి మూలాలెక్కడున్నాయో అని వెతకడంలో అర్థం లేదు. టాగోరు గీతాంజలిలో మొదటి గీతంలోని మొదటి పంక్తి ఒక్కటీ తీసుకుని వేదుల అపూర్వమైన ఖండకావ్యమొకటి రాసాడు. అలాగని ఆయన పద్యాల మీద గీతాంజలి ప్రభావం ఉందనవచ్చునా! అనకూడదు. చివరికి ఆ పద్యాలు స్ఫూర్తినిచ్చాయని కూడా అనకూడదు. ఆ రెండూ చదువుకోవాలి. మాటల్లో పెట్టలేని, పెట్టకూడని కించిత్ విస్మయంతో మరోసారి ఆ రెండు పద్యాలూ కలిపి చదువుకోవాలి. అంతే.
ఇదుగో, బైరన్ రాసిన ఈ సుప్రసిద్ధమైన గీతం She Walks in Beauty (1814) చూడండి.
She Walks in Beauty
She walks in beauty, like the night
Of cloudless climes and starry skies;
And all that’s best of dark and bright
Meet in her aspect and her eyes
Thus mellow’d to that tender light
Which heaven to gaudy day denies.
One shade the more, one ray the less,
Had half impair’d the nameless grace
Which waves in every raven tress,
Or softly lightens o’er her face;
Where thoughts serenely sweet express
How pure, how dear their dwelling-place.
And on that cheek, and o’er that brow,
So soft, so calm, yet eloquent,
The smiles that win, the tints that glow,
But tell of days in goodness spent,
A mind at peace with all below,
A heart whose love is innocent!
(ఆమె అడుగుతీసి అడుగు వేస్తే సౌందర్యం. చిరుమబ్బుకూడా లేకుండా సమస్త తారకలతో నిండిన ఆకాశాల రాత్రిలాంటిది ఆమె. చీకటిలోనూ, వెలుగులోనూ కూడా అత్యున్నతమైందంతా ఆమె కళ్ళల్లోనూ, ఆమె చూపుల్లోనూ ఒక్కటవుతాయి. పట్టపగటికి కూడా అందని సుకుమారమైన వెలుతురేదో అక్కడ కనిపిస్తుంది.
అంతకన్నా ఒక్క ఛాయ ఎక్కువైనా, అంతకన్నా ఒక్క కిరణం తక్కువైనా కూడా ఆ అనిర్వచనీయ విలాసాన్ని భంగపరుస్తాయేమో అనిపిస్తుంది. మాటల్లో పెట్టలేని ఆ అందం ఆ నల్లని కురుల్లో ఎగిసిపడుతుంటుంది, లేదా ఆమె వదనం పైన పరుచుకున్న మెత్తని వెలుగుల్లో ప్రసరిస్తుంటుంది. ఆ వదనంపైన కదలాడే భావాలు శాంతమాధుర్యంతో ఆమె ఎంత అపురూపమైందో, ఎంత నిర్మలమైందో వెల్లడిస్తుంటాయి.
ఆ కపోలాలమీద, ఆ కనుబొమల మీద వికసించే ఆ మందహాసాలు, మెరుస్తుండే ఆ ముఖలాస్యరేఖలు ఆమె సంతోషంగా గడిపిన రోజుల గురించి, నెమ్మదించిన ఆమె మనసు గురించి, అమాయికమైన ఆమె ప్రేమ గురించి, ఎంతో మృదువుగా, ఎంతో నెమ్మదిగా, కానీ ఎంతో ధారాళంగా ప్రసంగిస్తుంటాయి.)
వందేళ్ళ తరువాత కృష్ణశాస్త్రి ‘ఊర్వశి'(1925) పద్యాల్లో రాసిన ఈ సుప్రసిద్ధమైన పద్యాలు చూడండి.
ఊర్వశి
ఆమె కన్నులలో ననంతాంబరంపు
సీలినీడలు కలవు;
వినిర్మలాంబు
పూరగంభీరశాంతకాసారచిత్ర
హృదయములలోని గాటంపు నిదురచాయ
లందు నెడనెడఁ గ్రమ్ము;
సంధ్యావసాన
సమయమున నీపపాదపశాఖికాగ్ర
పత్ర కుటిలమార్గములలోవల వసించు
ఇరులగుసగుసల్ వానిలో నిపుడు నపుడు
వినఁబడుచునుండు;
మఱికొన్ని వేళలందు
వానకారుమబ్బులమెయివన్నె వెనుక
దాగుబాష్పమ్ము లామెనేత్రములలోనఁ
బొంచుచుండును;
ఎదియొ అపూర్వమధుర
రక్తి స్ఫురియించుఁగాని అర్హమ్ము కాని
భావగీతమ్ము లవి….
(ఆమె కళ్ళల్లో అంతులేని ఆకాశపు నీలినీడలున్నాయి. నిర్మలమైన జలాలతో కూడుకుని నిండుగా, గంభీరంగా ఉండే సరోవరాల చిత్రమైన హృదయాల్లోని దట్టమైన నిదురనీడలు ఉండీ ఉండీ అక్కడ కమ్ముకుంటూ ఉంటాయి.
సాయంకాలం సంధ్య వాలేటప్పుడు కడిమిచెట్ల గుబుర్లలోని ఇరుకిరుకు దారుల్లో కమ్ముకునే చీకట్ల గుసగుస అప్పుడూ అప్పుడూ ఆ కళ్ళల్లో వినబడుతూ ఉంటుంది.
మరికొన్ని సార్లు, వానకారు మబ్బుల వెలుగు వెనక దాగిన కన్నీటిచుక్కలు ఆ కళ్ళల్లో కనిపించీ కనిపించకుండా ఉంటాయి.
ఇంతకుముందు పరిచయంలేని ఏదో మాధుర్య సంతోషాన్ని స్ఫురింపచేస్తూనే, అర్థమయ్యీ కాకుండా వినబడే భావగీతాలు ఆ నేత్రాలు.)
ఈ పద్యాల మీద బైరన్ కవిత ప్రభావం ఉన్నట్టా? కనీసం స్ఫూర్తి అయినా ఉందనవచ్చునా? ఏమీ అనకూడదు. రెండూ ఒకసారి కలిపి చదువుకోవాలి. అంతే!
కాని బైరన్ ఆమె కళ్ళల్లో all that’s best of dark and bright ఉందంటే, ఆమె కళ్ళల్లో ‘అనంతాంబరపు నీలినీడలు కలవ’ని కృష్ణశాస్త్రి అంటే, ఆ ఊహని విశ్వనాథ మరింత విస్తరించి, ఆ నీడలు ఆమె స్వభావానివీ, ఆ వెలుగు ఆమె హృదయానిదీ అంటూ రాసిన ఈ పద్యాలు చూడండి:
ఓ చెలీ!
ఓ చెలీ! నీ స్వభావమందొక్కకపుడు
గాఢఝంఝామరుత్తరంగములు కలవు
నీ యెద చలించు మలయాద్రినిభృతవాయు
శీకరార్థము వాని నోర్చెదను నేను
ఓ చెలీ! నీ స్వభావందొక్కకపుడు
ఘనతరాంభశ్చలావర్తకములు కలవు
నీ ఎడద నూగు చిన్నరినీటికాల్వ
చిఱు తరగలెంచి వానినోర్చెదను నేను
ఓ చెలీ! నీ స్వభావమందొక్కకపుడు
ప్రళయమార్తాండతీక్ష్ణాతపములు కలవు
నీ యెడంద లేమావులనీడలొలయు
శీతలత్వార్ధి వాని నోర్చెదను నేను.
ఓ చెలీ! నీ స్వభావమందొక్కకపుడు
నాల్కతడియార్చు క్షారవార్నిధులు కలవు
నీ యెడద నాన్యతోదర్శనీయమాధు
సింధువుల నెంచి వానినోర్చెదను నేను.
( ఓ ప్రియురాలా! నీ స్వభావంలో ఒక్కొక్కప్పుడు చాలా తీవ్రమైన పెనుగాలులు వీస్తుంటాయి. కాని నీ హృదయంలో కదలాడే మలయానిలాల సన్నని నీటితుంపరల కోసం నేను వాటిని సహిస్తాను.
ఓ ప్రియురాలా! నీ స్వభావంలో ఒక్కొక్కప్పుడు గంభీరమైన తుపానుమేఘాల్లాంటివి కనిపిస్తుంటాయి. కాని నీ హృదయంలో కదలాడే చిన్ననీటికాల్వల చిరు తరగల్ని తలుచుకుని నేను వాటిని సహిస్తాను.
ఓ ప్రియురాలా! నీ స్వభావంలో ఒక్కొక్కప్పుడు ప్రళయకాలంలో సూర్యుడు కురిపించే భయంకరమైన ఎండలు కనిపిస్తాయి. కాని నీ హృదయంలో లేతమామిడి చెట్ల నీడల్లో పరుచుకునే చల్లదనం కోసం నేను వాటిని సహిస్తాను.
ఓ ప్రియురాలా! నీ స్వభావంలో ఒక్కొక్కప్పుడు నాలుక పిడచకట్టుకుపోయే క్షారసముద్రాలున్నాయి. కాని మరెక్కడా కనిపించని మాధుర్యసముద్రాల్ని నీ హృదయంలో గమనించి నేను వాటిని సహిస్తాను)
కావ్యానందంలో ఇది కూడా భాగమే. దేశకాలాల పరిమితుల్ని దాటి ప్రపంచమంతా కవుల హృదయాలు ఎక్కడెక్కడ ఒక్కలాగా స్పందించాయో ఆ తావుల్ని పట్టుకోవడం. ఏమీ తోచనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అక్కడికి పోయి కొంతసేపు గడిపి వస్తూండటం.
Featured image: Evening sky with trees, Ehrenbach, Gerda Arendt, PC: Wikimedia commons
7-7-2025
“దేశకాలాల పరిమితుల్ని దాటి ప్రపంచమంతా కవుల హృదయాలు ఎక్కడెక్కడ ఒక్కలాగా స్పందించాయో ఆ తావుల్ని పట్టుకోవడం. ఏమీ తోచనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అక్కడికి పోయి కొంతసేపు గడిపి వస్తూండటం.”
ఆ చక్కెర రుచి మాకూ పంచిపెట్టడం! 🙏🏽
“కావ్యానందంలో ఇది కూడా భాగమే”లా వుంది. 😊
All three poems and poets!! 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
ముగ్గురు మహాకవులు వాళ్ళ మూడు కవితలు. అందులోకి మీరు లాక్కెల్లిన తీరు అద్భుతం. ధన్యవాదాలు సర్
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
“దేశకాలాల పరిమితుల్ని దాటి ప్రపంచమంతా కవుల హృదయాలు ఎక్కడెక్కడ ఒక్కలాగా స్పందించాయో ఆ తావుల్ని పట్టుకోవడం. ఏమీ తోచనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అక్కడికి పోయి కొంతసేపు గడిపి వస్తూండటం.”
గడిపి వస్తూండటమే కాదు.. మీ కలం కదిపి ఇలా రాస్తూండటం.. మీలా కవులం కాని మాలాంటోళ్ల హృదయాలు కూడా స్పందింప చేయడం.. ఇదే మాకు కావాల్సింది.. ఎంత బాగుందో బైరన్ కవిత్వం మీ పదాల్లో…. ధన్యవాదాలు
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
శిఖామణి గారి కవితా సంపుటి “తెల్లవారుజాము కల”కు ముందుమాట వ్రాస్తూ —- నేననుకుంటూ ఉంటాను : “ఆమె కన్నులలోన అనంతాంబరపు నీలినీడలు కలవు”అనే వాక్యం కృష్ణశాస్త్రికి ఎక్కణ్నుంచి స్ఫురించిందా అని —- అని మీరు వ్రాసిన వాక్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాను సార్.
మీ పరిశీలనలు అద్భుతం సార్. నమస్సులు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఆహా ఎంత రమ్యమైన భావగీత మాధురులు
కవికృత పద్యములందున
అవిరళమగు భావధారలల్లన సాగన్
నవనవలాడెడు కవనపు
జవమది తరళించు తత్త్వ సరళినిగాంచన్
నమస్సులు
ఎంత బాగా స్పందించారు!
కవుల కవితా స్రవంతి తో మధురనుభూతినిచ్చారు 💐🙏
ధన్యవాదాలు సార్