
మరి దీనికి మందులేదా అక్కా?
ఎందుకుండదు? తప్పకుండా ఉంది. కాని చదువుకున్నవాళ్ళు స్త్రీలకి ఉన్న హక్కుల గురించి ఎందుకు మాటాడరు? ఎందుకంటే వాళ్ళ దృష్టి ఎంతసేపూ వాళ్ళని అణచిపెట్టి ఉంచడం మీదనే. తక్కిన ప్రపంచమంతా స్త్రీలకోసం, పిల్లలకోసం ఏదో ఒకటి చేయాలని మాట్లాడు తూ ఉంది. కాని ఇక్కడ వీళ్ళు మాత్రం ఖురానునీ, హడితునీ త మ చేతుల్లోకి తీసేసుకున్నారు. వాళ్ళు కనీసం ఆ గ్రంథాలప్రకారం నడుచుకున్నా బాగుండేది! ముందు వాళ్ళ బాలికలల్ని విద్యావంతుల్ని చెయ్యమనండి. కేవలం మదరసా చదువు కాదు, స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ కూడా చదివించమనండి. తాము కోరుకున్నవాళ్ళనే పెళ్ళి చేసుకోనివ్వమనండి. ముందు అదిమ్మనమండి వాళ్ళని. ఈ కొజ్జాలు, ముందు తమ పిల్లలకి పెళ్ళిచేయడంతో పాటు ఆ పిల్లలకి స్త్రీధనం కూడా అందేలా చూడమనండి. తమకి వచ్చే కట్నకానుకలకోసం అంగలార్చవద్దని చెప్పండి. ఆడపిల్ల పుట్టింటివాళ్ళని తమ బిడ్డలకి ఆస్తిలో వాటా కల్పించమని చెప్పండి. స్త్రీపురుషుల మధ్య సఖ్యత కుదరకపోతే ఒక స్త్రీ తన భర్తకు విడాకులివ్వగల ఆమె హక్కుని గౌరవించమని చెప్పండి. ఒకవేళ ఆమె అలా విడిపోతే ఎవరో ఒకరు ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకోడానికి ముందుకొచ్చేలా చూడమనండి. ఆమె భర్తలేని స్త్రీ అయితే ఆమెతో జీవితం పంచుకోడానికి ఆమెకొక సహచరుడు దొరికేలా చూడమనండి.
(బానూ ముష్తాక్, Black Cobras కథలో, పే.71)
ఈ ఏడాది బుకరు పురస్కారం పొందిన కన్నడ రచయిత్రి బానూ ముస్తాఖ్ కథలు Heart Lamp, Selected Stories (2025) స్త్రీల, శిశువుల దుఃఖం గురించిన కథలు. మరీ ముఖ్యంగా బాలికల దుఃఖం గురించిన కథలు. పురుష ప్రపంచం, పితృప్రపంచం, విద్యాధిక ప్రపంచం, బలవంతుల ప్రపంచం తమని ఎడతెగని దుఃఖసాగరంలో వదిలిపెట్టేస్తే నిస్సహాయంగా మిగిలిపోతున్న స్త్రీ ప్రపంచంలో ఒక స్త్రీకి మరొక స్త్రీ మాత్రమే ఆసరాగా నిలబడుతున్న వ్యథార్తదృశ్యాల యథార్థ కథలు.
నిజానికి ఈ పుస్తకం తెరిచాక, మొదట యాభై పేజీల దాకా నేను కొంత అనిశ్చయంతోటే చదివాను. ఎందుకంటే, ఒకప్పుడు విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ చేసిందల్లా బ్రాహ్మణసమాజంలో ఎందుకూ పనికిరానివార్ని చిత్రించడమే, అని విమర్శించాడు. బహుశా ఆయన కన్యాశుల్కం మొదటి కూర్పు చదివి ఉండడు. చదివి ఉంటే ఇంకా ఏమని ఉండేవాడో! కన్యాశుల్కం మొదటి కూర్పు చదివి చలంగారు ఆ రచనని ‘జీవం లేని ఘోరం ‘అన్నాడు. అక్కణ్ణుంచి రెండో కన్యాశుల్కానికి వచ్చేకగానీ, మనుషులు ఊపిరి పీల్చుకోదగ్గ తావులు గురజాడ చూపించలేకపోయాడు. మధురవాణి, సౌజన్యారావుపంతులు, కొంతమేరకు కరటకశాస్త్రీ లేకపోయుంటే, ఆ నాటకంలో చిత్రించిన జీవితం మనల్నెప్పటికీ ఊపిరాడనిచ్చేది కాదు.
ఇప్పుడు ఈ రచయిత్రి కూడా ముస్లిం సమాజంలో ఎందుకూ పనికిరాని మనుషుల్ని మాత్రమే చూసి, వాళ్ళని చూపించడం మీదనే దృష్టిపెడుతున్నదా అని భయం కలిగింది. ఆమె ముస్లిం మతానికి చెందిన రచయిత్రి అయినంత మాత్రాన నేను ఆమెకి ఎటువంటి మినహాయింపులూ ఇవ్వడానికి సిద్ధంగా లేనని నాకు తెలుసు. కానీ, ఇదుగో, సంకలనంలో, మూడో కథ Black Cobras లో, ముస్లిం న్యాయవాదీ , స్త్రీల హక్కుల ఉద్యమకారిణీ జులేఖా బేగం మాట్లాడిన పై మాటలు విన్నాక, నాకు గొప్ప రిలీఫ్ కలిగింది. రచయిత్రి పట్ల గౌరవం కలిగింది. ఎందుకంటే, మానవసమాజం మంచిచెడులు రెండింటితోనూ నిర్మాణమై ఉంది. అందులో చెడు పాలు తొంభైతొమ్మిది శాతమూ, మంచితనం ఒక్కపాలే ఉందనుకున్నా, ఆ ఒక్క పాలు మంచిదనాన్నీ చూడకపోతే, మనకి చూపకపోతే, ఏ రచయితనీ నేను గౌరవించలేను.
నిజానికి పై వాక్యాల కన్నా ముందే , ఇదుగో, ఈ సంభాషణ దగ్గరికి వచ్చేటప్పటికే, నా చేతుల్లో ఉన్నదొక విలువైన పుస్తకం అని నాకు అర్థమయింది. న్యాయవాది జులేఖా తన ముందు గోడువెళ్ళబోసుకుంటున్న అష్రాఫ్ తో ఇలా అంటున్నది:
నీకు తెలుసా అష్రాఫ్? ఒక ఆడపిల్ల పుట్టినట్టయితే, సాక్షాత్తూ ప్రవక్త మహమ్మద్ నే ఆ ఇంటి ముందు ప్రణామాలు చెల్లించినట్టు అని?
అదంతా పక్కన పెట్టు అక్కా. అలా అయితే ప్రవక్త మహమ్మద్ నాలాంటి బీదవాళ్ళ ఇంటిముందు ఎన్ని సార్లు సాష్టాంగ ప్రణామాలు చెయ్యవలసి ఉంటుందో.
పిచ్చిమాటలు మాట్లాడకు. ప్రవక్తకున్నది కేవలం ఆడబిడ్డలే. ఒక మగపిల్లవాడు పుట్టాడుగాని, శిశువుగా ఉండగానే మరణించాడు. ప్రవక్త తన బిడ్డల్ని ఎంతలా ప్రేమించేడో తెలుసునా? అసలా విషయం తెలుసా నీకు? బీబీ ఫాతిమా ఆయన జీవనసర్వస్వం. ఒక తండ్రికీ, అతడి కూతురికీ మధ్య వర్ధిల్లగల అనుబంధానికి వారిద్దరూ ఒక సజీవ తార్కాణ.
అని నాకైతే తెలియదు. మన చుట్టూ ఉన్న మీడియాలో, సోషలు మీడియాలో ఎంతసేపూ ముస్లిం మతాన్ని ఈసడించుకునే రాతలే టన్నుల కొద్దీ చదువుతుంటాం గాని, ఇటువంటి వాక్యం ఒక్కటేనా చదివి ఉండం. మా మెహిదీపట్నం సెంటరులో ఒక మసీదు దగ్గర పెద్ద బోర్డుమీద ఇలా రాసి ఉంటుంది. ‘స్వర్గం తల్లిపాదాల కింద ఉన్నది’ అని. అటువంటి వాక్యం ఏ మతం నుంచి వచ్చిందో ఆ మతానికి నేను సాష్టాంగ ప్రణామం చెయ్యకుండా ఎలా ఉండగలను? ఇప్పుడు ఇదుగో, ఈ వాక్యం if a daughter is born, it is as if the Prophet has saluted the house అనే వాక్యం చదవగానే ఇస్లాం పట్లా, ప్రవక్త పట్లా నా మనసులో చెప్పలేని గౌరవం ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది!
నిజానికి మతాల్ని కించపరుస్తూ రాయడం ఒక modern fashion, అది హిందూమతంకానీ, క్రైస్తవంగానీ, ఇస్లాంగానీ. తామొక సెక్యులరు సమాజాన్ని కోరుకుంటున్నామని చెప్పుకోవడం ఇప్పటి విద్యాధికులకి ఒక passion. కానీ మన సెక్యులరు సంస్థలు- స్కూళ్ళు, కాలేజీలు, యూనివెర్సిటీలు , లెజిస్లేచర్లు, కోర్టులు, సినిమాలు, వార్తాపత్రికలు, టెలివిజను సీరియళ్ళు, మన సంస్థలు, మన కార్యాలయాలు, మన చర్చలు, మన వాదవివాదాలు- వీటిని ఎంతో దగ్గరగా చూసిన నాకు, ఆచరణలో వీటికీ మధ్యయుగాల మతోన్మాదులకీ ఏమీ పెద్దగా తేడా లేదనే సత్యం పదేపదే అనుభవంలోకి వచ్చిన నాకు- ఆ ఫాషన్నీ, పాషన్నీ చూసి జాలేస్తుంది. అందులోనూ ముస్లిం మతాన్నీ, ముస్లిం మతాచారాల్నీ విమర్శించడంలో మొత్తం పాశ్చాత్య ప్రపంచానికీ, చీనాకీ ఇప్పుడు భారతదేశం కూడా తోడయ్యింది. అసలు ఆ గ్రంథాల్లో ఏముందో తెలుసుకోకుండానే, పవిత్ర కొరాన్ ఒక్కసారేనా చదవకుండానే, ముస్లిం మతాన్ని విమర్శించే హిందువులు హిందువులు కారు, క్రైస్తవులు క్రైస్తవులు కారు, సెక్యులరిస్టులు సెక్యులరిస్టులు కాలేరు.
బానూ ముష్తాక్ కథలు మొత్తం చదివేక నాకు అర్థమయిందేమంటే, ఆమెకి ఇస్లాం గురించి క్షుణ్ణంగా తెలుసు. ప్రవక్త ఆశయాల గురించి తెలుసు, జీవితకాలపు ఆచరణ గురించి తెలుసు, ఆ అచరణ గురించి ప్రజాస్మృతిలో నిలబడిపోయిన హడిత్ గురించి తెలుసు. ఆ ‘ఆశయోదయ సదయశోభల్ని’ ఆమె మన కాలపు పితృస్వామ్య, పురుషస్వామ్య, ముతావలీ స్వామ్య ఆచరణతో పోల్చి చూస్తూ ఉన్నది కాబట్టే, పట్టలేనంత ఆవేదనకు లోనవుతూ, ఆ ఆవేదనలోంచీ, ఆ ఆగ్రహంలోంచీ ఈ కథలు రాసారని మనకి తెలుస్తూంది.
ఈ కథలు చదివి కేవలం ముస్లిం సమాజాల్లో మాత్రమే స్త్రీలు ఇలా బాధపడుతున్నారని మనం నిర్ధారించుకుంటే అది అర్థసత్యం మాత్రమే. నిజానికి ఈ కథలు చదువుతున్నంతసేపూ నాకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్నకథలు గుర్తొస్తూనే ఉన్నాయి. శతాబ్దం కిందట గోదావరిప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబాల్లో స్త్రీల దుఃఖం ఎలా ఉన్నదో చిత్రించిన కథలవి. ఆ జీవితానికీ, ఇప్పుడు దక్షిణ మధ్య కర్ణాటకలోని హాసన్ ప్రాంతంలోని ముస్లిం స్త్రీల దుఃఖానికీ ప్రాయికంగా ఏమీ తేడా లేదు. ఆ బ్రాహ్మణ స్త్రీల దుఃఖానికి వేదాల్నీ, ఉపనిషత్తుల్నీ ఎలా తప్పుపట్టలేనో, ఈ ముస్లిం స్త్రీల దుఃఖానికి కొరానునీ, హడిత్ నీ కూడా అలానే తప్పుపట్టలేము. స్వార్థంలో, లోభంలో, వంచనలో, కలిసి పంచుకోవలసిన జీవితామృతం మొత్తం తానే నిస్సిగ్గుగా గుటకెయ్యడంలో పురుషుడు ప్రపంచమంతటా కూడా మతాతీతంగా ఉన్నాడని ఈ కథలు చదివితే మనకి అర్థమవుతుంది.
అందుకని, ఇవి, పురుష స్వామ్యాన్నీ , పితృస్వామ్యాన్నీ ధిక్కరించవలసిన అవసరం కలిగిన ముస్లిం స్త్రీల కథలు తప్ప కేవలం ముస్లిం స్త్రీల కథలు కావు. పాఠకుడికి అంతరాత్మ ఉంటే, ఇటువంటి మోసాలే, ఇటువంటి వంచననే తాను కూడా తన జీవితంలోనూ, తన సమాజంలోనూ స్త్రీలపట్లా, పిల్లలపట్లా కనపరుస్తూనే ఉన్నాడని తెలుస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా పిల్లల పట్ల. పిల్లలపట్ల మనుషులు కనపరిచే క్రూరత్వమే ప్రధాన ఇతివృత్తంగా డాస్టొవిస్కీ ‘బ్రదర్స్ కరమజోవ్’ నవల రాసాడు. అలాగని క్రైస్తవాన్ని విమర్శించడానికి ఆయన ఆ నవల రాసాడనగలమా? ఆ నవల ద్వారా ఆయన సూక్ష్మంగా చెప్తున్నదేమంటే, ఏ సమాజం తన పిల్లలపట్ల క్రూరంగా వ్యవహరిస్తుందో, ఆ పిల్లలు పెద్దయ్యాక పితృహంతకులుగా మారే ప్రమాదముంది, చూసుకోండనే.
బానూ ముష్తాక్ కథల్లో, అందుకనే నాకు అన్నిటికన్నా ముందు, హిందూ స్త్రీలు, హిందూ శిశువులు, క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ శిశువులూ, ప్రపంచమంతటా అపారమైన దుఃఖాన్ని అనుభవిస్తున్న నిరుపేద స్త్రీలూ, నిరుపేద శిశువులూ కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా నా చిన్నప్పణ్ణుంచీ చూస్తూ వస్తున్న ఎందరో గిరిజన స్త్రీలు కనిపిస్తున్నారు. ఈ కథాసంపుటం ఉద్దేశించిన యథార్థ సాహిత్యప్రయోజనం కూడా అదేననుకుంటాను.
ఈ వాక్యం చూడండి: ‘ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం బంగారమూ, పట్టువస్త్రాలూ పురుషులకి నిషిద్ధం.'(పే.76). ప్రపంచానికి తెలుసునా ఈ విషయం? బ్రాహ్మణుణ్ణి ఉంఛవృత్తిమీద జీవించమని చెప్పింది వేదం. ఉంఛ వృత్తి అంటే పొలాల్లో పంట కోసుకుపోయేక మిగిలే పరిగె. దాన్ని తెచ్చుకుని ఆ గింజల్తో ఇంత గంజి కాచుకుని దాంతో మాత్రమే బతకడం బ్రాహ్మణ జీవితాదర్శం వేదం దృష్టిలో. కాని ఉంఛవృత్తి అంటే ఏమిటో తెలియని బ్రాహ్మణులూ, పట్టువస్త్రాలు మాత్రమే ధరించే ముస్లిములూ ఎక్కణ్ణుంచి వచ్చారు? ఏ శక్తులు వాళ్ళనట్లా తీర్చిదిద్దేయి? మనుషులు బాగుపడాలని కోరుకునేవాళ్ళు మతాల్ని నిందించడం కాదు చెయ్యవలసింది, మతాలకు అతీతంగా, ప్రపంచమంతటా మనిషిలో కనిపిస్తున్న రాక్షసమూలాల్ని వెతికి పట్టుకోడం, లోకమంతా చూసేలా ఎత్తిచూపడం, ఖండించడం.
ఈ దృష్టి బానూ ముష్తాక్ సాహిత్యానికి ప్రాతిపదిక.
ఈ వాక్యాలు చూడండి (పే.157)
వస్తుసామగ్రి అమూల్యమైందిగానూ, మనుషులు విలువలేనివాళ్ళుగానూ కనిపిస్తున్నారు. ఆ వస్తుసంచయం వెనక మనుషుల భావోద్వేగాలు అమ్మకానికొస్తున్నాయి. పొట్టిమనుషులకి పెద్ద నీడల్తో సంబంధబాంధవ్యాల్ని వస్తువులు నిర్దేశిస్తున్నాయి. నేడు ఒక రిఫ్రిజేటరుకి ఒక నవవధువు జీవితాన్ని మార్చేయగల శక్తి ఉంది. ఆ రిఫ్రిజిరేటరు ఆమె మనసులో హోలీ రంగుల్ని వెదజల్లగలదు. అలాంటి వస్తువుల్ని సమకూర్చుకోవడం ఆ ఇంట్లోనే కాదు, ఆమె జీవితనిర్ణయాల్లో కూడా ముఖ్యమైన చోటు సంపాదించుకుంది. మనుషులు పరుగులు పెడుతున్నారు. వాళ్ళ స్వీయగౌరవాన్నీ, అనుబంధాల్నీ పాచికలాగా గాల్లోకి ఎగరేస్తున్నారు. అలసిపోతూ, వేసటలో కుప్పకూలిపోతూ, చెమటలు కక్కుతూ, అయినా పరుగెడుతూనే ఉన్నారు. ఆహా!వాళ్ళు పరుగెత్తే కొద్దీ ఆ బంగారు లేడి కూడా మరింత ముందుకి పరుగెడుతోంది. అది ప్రతి ఒక్కరినీ పిచ్చివాళ్ళని చేస్తోంది. ప్రతి ఒక్కరి మీదా మత్తుమందు చల్లుతోంది. అయినా అది ఏ ఒక్కరికీ చేజిక్కడమే లేదు. ఈ అయస్కాంత శక్తి తాలూకు మహాకథనం-ఇదే మన నాగరికతని మనం గుర్తుపట్టడానికి గొప్ప ఆనవాలు!
మొత్తం పన్నెండు కథలు. ప్రతి ఒక్క కథా మన సమకాలిక జీవితాన్ని, మన పరుగునీ, మన సభ్యతనీ, మన సంస్కృతినీ ముసుగు తీసి చూపించే ఆనవాలు. నిజానికి మూడువందల పేజీల ఈ పుస్తకం నాకైతే రెండుమూడు గంటల్లో పూర్తయ్యే పఠనం. కాని ఏ ఒక్క కథా చదివినవెంటనే మరొక కథ తెరిచే ధైర్యం చేయలేకపోయాను. కనీసం రెండు రోజులు పట్టింది ఈ పన్నెండు కథలూ చదవడానికి!
పుస్తకం చదవడం ముగించేక, ఆ స్త్రీలూ, ఆ పురుషులూ, ఆ మతాచార్యులూ, ఆ వివాహాలూ, ఆ విచ్ఛేదాలూ- ఇవన్నీ పక్కకు పోయి, ఆ స్త్రీలకు పుట్టిన కూతుళ్ళు నా కళ్ళముందు కనిపిస్తూ ఉన్నారు. తన తల్లి చనిపోయి రెండునెలలు కూడా ముగియకుండానే రెండో పెళ్ళి చేసుకున్న తన తండ్రి సంతోషాన్ని డిస్టర్బు చేయకుండా ఉండటానికి పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళి ఆడిస్తున్న అసిఫా (Stoneslabs for Shaista Mahal, పే.15) నా కళ్ళముందు కనిపిస్తున్నది. ప్రసవం తర్వాత కోలుకోకుండానే మరణించిన ఆమె తల్లి షైస్తా కథకురాలు జీనత్ తో చెప్పినమాటలు She is not my daughter, she is my mother.. నా చెవుల్లో గింగురుమంటున్నాయి. అలానే ఈ కథల్లో గృహతిరస్కృతులూ, సంఘతిరస్కృతులూ అయిన స్త్రీలకి తోడుగా నిలబడుతున్న వాళ్ళ పెద్దకూతుళ్ళు నా చుట్టు చేరి నిశ్శబ్ద వదనాలతో నన్ను ప్రశ్నిస్తున్నారు. ‘చెప్పు, పాఠకుడా! నువ్వు మా కోసం ఏం చెయ్యగలవు?’ అని నిలదీస్తున్నారు.
అందరికన్నా కూడా నన్ను మరింత కలవరపరిచింది High-Heeled Shoe కథలో అరిఫాకు తోడుగా నిలబడ్డ ఆమె గర్భస్థ శిశువు. ఈ సంపుటానికి Heart Lamp కథని శీర్షికగా పెట్టారుగాని, నిజానికి, High-Heeled Shoe కథని శీర్షికగా పెట్టి ఉండవలసింది. ఈ సంపుటంలోని కథలన్నిటిలో అది అత్యంత శక్తిమంతమైన కథ. కన్నీటి కావ్యం. ఏ కథకుడైనా తన జీవితకాలంలో ఇటువంటి ఒక్క కథ రాయగలిగితే చాలు. నేను ఇందాక పైన ఉల్లేఖించానే, బంగారు లేడి మనుషుల మీద చల్లుతున్న మత్తుమందు గురించిన మాటలు- అవి ఈ కథలోవే. అదే ఈ కథకి ఇతివృత్తం.
సాధారణంగా భారతీయులెవరికేనా అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తే విధిగా వాళ్ళని అభినందించే ప్రధానమంత్రి ఈమెని ఇప్పటిదాకా అభినందించలేదని విన్నాను. ఆయన కార్యాలయంలో ఈ పుస్తకం చదివినవాళ్ళెవరోగాని వాళ్ళు సరిగ్గా చదవలేదని చెప్పగలను. ఈమె చిత్రించిన జీవితం మతాల సరిహద్దులు చెరిగిపోయిన తావు. కాబట్టే, ఈ కథల్లో కూడా అన్నదమ్ముల అన్యోన్యత గురించి చెప్పడానికి రామలక్ష్మణులే ఉదాహరణగా నిలబడ్డారు. తన చుట్టూ ఉన్న మనుషుల్ని గుర్తుపట్టే క్రమంలో ఈ రచయిత్రికి కూడా ఒక మారీచుడు, ఒక మంథర, ఒక మాయలేడి, ఒక శకుని గుర్తొస్తూ ఉన్నారు.
మొత్తం మీద ఈ పుస్తకం గురించి నాకేదన్నా ఫిర్యాదు ఉందంటే ఇదొకటే. సాధారణ ప్రగతిశీల, ఉదారవాద సాహిత్యంలో కనవచ్చే బలహీనతనే ఈ కథనంలో కూడా కనబడుతున్నది. అదేమంటే, కథకురాలు లేదా కథకుడు తానొక్కరే పవిత్ర, పరిశుభ్రస్థలంలో ఉన్నట్టూ, అన్ని వైరుధ్యాల్నీ జయించినట్టూ, తన చుట్టూ ఉన్న మనుషులు మాత్రం సకల దౌర్బల్యాలకీ, దుర్మార్గాలకీ ఆలవాలమన్నట్టూ రాసే పద్ధతి. ఈ విషయంలో వీళ్ళకి సంప్రదాయవాడులకీ ఏమీ తేడా లేదు. అందుకని, కథకుడు ఒక్కసారేనా తనలోకి చూపు సారించి తన దైనందినజీవితంలో తాను కూడా ఎంతవరకూ తన తోటిమనుషుల్లానే జీవిస్తున్నాడో తనకై తాను పరిశీలించుకుంటే, ఆ స్వీయవిమర్శతో కథలు చెప్తే, అప్పుడు ఆ కథలు మరింత విలువైనవిగా కనిపిస్తాయి, కనీసం నా వరకూ. ఈ పన్నెండు కథల్లోనూ, ఒక్క The Arabic Teacher and Gobi Manchuri కథలో తప్ప మరే కథలోనూ ఈ లోచూపు కనిపించదు.
అలాగని ఈ ఆవేదనలోని నిజాయితీని శంకించలేను. తోటిమనిషి దుఃఖం తన దుఃఖంగా మారితే తప్ప ఇదుగో, ఇటువంటి వాక్యాలు రావు. చూడండి (పే.252):
ఎవరేనా నొప్పిని తినగలరా దాదీమా?
అమ్మమ్మ మాట్లాడటం క్షణం పాటు ఆపి నాకేసి తేరిపారచూసింది. అప్పుడు ఎవరికో చెప్తున్నట్టుగా ‘అవును కదా, నిజమే కదా! ఎవరేనా సరే తాము నొప్పి తినాలి, తక్కినవాళ్ళకి సంతోషాన్నివ్వాలి’ అంది.
మామూలు మాటలుకావు. ఒక టోనీ మారిసన్ మాత్రమే రాయగల మాటలు.
చివరగా ఒక మాట. కథాశిల్పంలోగాని, వస్తునైశిత్యంలోగాని ఈ రచయిత్రికి సమానంగా నిలబడగలవారూ, కొండొకచో ఆమెకన్నా శక్తిమంతంగా కథలు చెప్తున్నవాళ్ళూ మన సమకాలిక తెలుగు కథకులు చాలామందే ఉన్నారు. ముస్లిం జీవితాల చిత్రణనే తీసుకున్నా, ఒక స్కైబాబ వంటి కథకుడు చెప్పిన కథలు, ఈ కథలకన్నా ఎంతో ముందుకి చూడగలుగుతున్నాయి. కాని మనకి లేనిదల్లా ఒక దీపా భస్తి లాంటి అనువాదకురాలు. ఇటాలిక్సుని పక్కన పెట్టేగల సాహసికురాలైన అనువాదకురాలు. కుశలురాలైన అనువాదకురాలు. తెలుగు సాహిత్యం ముందు అటువైపు దృష్టి పెట్టడం చాలా అవసరం.
Featured image courtesy: Wikimedia commons
28-5-2025
Excellent write up sir. నాకు మీ మాటలతో, మీరు పంచిన భావాలతో పూర్తి ఏకీభావం ఉంది.
ధన్యవాదాలు మానసా!
మంచి పుస్తకం పరిచయం మంచి విశ్లేషణతో
ధన్యవాదాలు సార్!
కథనం సాంతం కనువిప్పు…
కఠిన వాస్తవాల కలకలం!
ఆద్యంతం ఆసక్తికరం!
అభినందనలు…సర్.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
ఒక దారి దీపం లాంటి వ్యాసం కథల పై. ఈ వ్యాసం చదివాకా ఆ కథల్ని చదవాలన్న ఆసక్తి ఎక్కువైంది. ధన్యవాదాలు సర్
ధన్యవాదాలు సార్!
తాను పరిశుభ్ర స్థలంలో లేనని, ఒక నరకాన్ని అనుభవించే, ఆత్మగతం చేసుకున్నాకే కదా అనివార్యంగా సృజన జరిగేది గురూజీ! తాను చూసిన, జీవిస్తున్న సామాజిక వర్గంలో తన్ను తాను ఉన్నతురాలిగా కథకురాలు ఎక్కడైనా project చేసుకుందా? ఈ సమాజం కంటే నేను కొంచెం ఎక్కువ అనుకున్నవాడే ఏ సాహిత్య ప్రక్రియలోనైనా సృజన చేయగలడనుకుంటా! చెప్పాలి ఈ సమాజానికి, ఈ సమాజం దృష్టిని ఈ ఘటనలవైపూ మళ్లించాలి అనే తపన సృజనకు స్ఫూర్తి అనుకుంటా! ఆ సహజ అహంకారం అక్షర సృజనకారులకు అలంకారం అనుకుంటాను. అది లేనపుడు సృజనాత్మక లేదు, ప్రవచనాలూ లేవు కదా సార్! అందరూ వరవరరావులు కాలేరు కదా! Just thought process triggered inspired with your wonderful intro of Heart Lamp. Thank you Sir.🙏
మీ ప్రతిస్పందనను స్వాగతిస్తున్నాను, గౌరవిస్తున్నాను. కానీ రచయిత్రి లేదా రచయిత తాను చాలా ఉన్నతంగా ఉన్నాను అని ప్రొజెక్ట్ చేసుకున్నాడా లేదా అన్నది కాదు విషయం. బయట సమాజంలో కనిపిస్తున్న దుర్గుణాలకు మూలాలు ఏదో ఒక మేరకు తనలో కూడా ఉన్నాయేమో అని ఆలోచన కలిగితే అప్పుడు రాసే సాహిత్యం మరింత విలువైనదిగా ఉంటుంది. తక్కిన వాళ్ళ కన్నా తాను ఏ కొంచెమో ఎక్కువ అనగానే, అనుకోగానే రచయిత నీతి శతకకర్తగానూ, ప్రబోధకారుడి గానూ మారిపోతాడు. బయట వాళ్లకు కర్తవ్యబోధ చేస్తూ తాను మాత్రం తద్విరుద్ధంగా జీవించే రచయితలే అత్యధిక శాతం నా చుట్టూ. నా చిన్నప్పటి నుంచి అటువంటి రచయితల్ని చూస్తూ ఉన్నాను. అందుకని సమాజాన్ని విమర్శించే రచయితల రచనల పట్ల నా నా మొదటి స్పందన అనుమానమే. ఒక రచనలో social criticism సగ పాలు మాత్రమే కావాలి, తక్కిన సగభాగమూ తప్పనిసరిగా self critical గా ఉండి తీరాలి.
ముస్లిం సమాజంలో మతాచార్యులను, వారి విధింపులను ధిక్కరించగలిగే ధైర్యం, ముఖ్యంగా స్త్రీలకు, ఎక్కడుంటుంది? ఆ తెగింపు కలిగిన ఈ రచయిత్రిని అభినందించకుండా వుండలేము. అభినందించటం ఇష్టంలేని, మతమౌఢ్యంలో కూరుకుపోయిన వాళ్ళ గురించి జాలిపడటమే మనం చేయగలిగింది. రచయిత్రి న్యాయవాది అని విన్నాను. తెలుగు అనువాదం త్వరలో వస్తుందని తెలిసింది. రచయిత్రి మనోభావాలను పట్టుకొని
యథాతథంగా ప్రజల భాషలో అనువదించగలవారైతే బాగుండును. ఎవరు అనువదిస్తున్నారో వెల్లడి కాలేదు.
మీ సమీక్ష చాలా నిబద్ధతగా ఉంది.
ధన్యవాదాలు సార్!
చాలా లోతైన విశ్లేషణ . చాలా వివరంగ రాశారు. ఒక్కసారిగా చదవాలనే కుతూహలాన్ని కలిగించింది.
ధన్యవాదాలు మేడం
కథా రచనలో రచయితకి ఉన్న వెసులుబాటు ఒక్కోసారి ప్రతిబంధకం అయ్యే అవకాశం గురించి అర్థమయ్యేలా రాశారు సర్.. పాత్రలు,సన్నివేశాల చిత్రణ లో మూడో మనిషిగా రచయిత తన ఆదర్శాలను వ్యాఖ్యానించడాన్ని అధికమించినపుడే కథ ప్రయోజనం సిద్ధిస్తుందని అనుకోవచ్చా.. పఠన కళా లోనారసి ఎరిగిన మీ నుండి మరో విలువైన అంశాల్ని తెలుసుకోగల సమీక్ష.. ధన్యవాదాలు సర్..అనువాదాల విషయంలో మీ అభిప్రాయం సమర్థిస్తున్నాను.
ధన్యవాదాలు మౌనిమా! చాలాకాలం తర్వాత మీ స్పందన!