చలిగాలి చలిగాలి

జీవితంలో నేను ఎంతమాత్రం అడుగుపెట్టలేకపోయిన లోకం సంగీతం. ఇన్నేళ్ళ జీవితంలోనూ శ్రోతగానే మిగిలాను తప్ప, ఒక పాటకి స్వారాలు కూర్చడమెట్లానో నేర్చుకోలేకపోయాను. దురదృష్టవశాత్తూ గొప్ప గాయనీగాయకులెవరూ నా మిత్రులుగానో లేదా నా ఇరుగుపొరుగులోనో లేకపోయారు. కాని ఇప్పుడు ఆర్టిఫిషియలు ఇంటెల్లిజెన్సు గీతాల్ని గానంగా మారుస్తుందని విన్నాక ప్రయోగాలు మొదలుపెట్టాను. ఇదుగో, ఈ పాట నాలుగేళ్ళ కింద విజయవాడలో ఒక తొలకరి వేళ రాసింది, ఇప్పుడు ఏ.ఐ యాప్ ని అడిగితే ఇలా గానం చేసింది. రెండుమూడు ఉచ్చారణదోషాలున్నాయిగాని, ఇప్పుడు మన తెలుగు సినిమా ప్లేబాక్ సింగర్సు తో పోలిస్తే, ఆ దోషాలు అంతగా పట్టించుకోవలసిన పని లేదనుకున్నాను. ఈ మండుటెండల్లో ఒకసారి విని చూడండి.

తొలివానగాలి
___________

చలిగాలి చలిగాలి తొలివానగాలి ఏ
కొలిమితిత్తుల మంటదో, ఈ
చలిగాలి చలిగాలి తొలివానగాలి.

ఆకసమ్మున మొయిలు బయలుదేరెనొ లేదొ
రాగరంజితమగును పూర్వదుఃఖానలము
వీచుచున్నది గాలి సేదదీర్చుటమాని
రాచుచున్నది ఎడద మరచిపోయిన పాట.

చలిగాలి చలిగాలి పుప్పొడులగాలి ఏ
కొలిమితిత్తులు పూచెనో, ఈ
చలిగాలి చలిగాలి పుప్పొడులగాలి.

కడిమిపూవుల గాలి కెరలించి నా యెదను
అడగిపోయిన దిగులు మరల కికురించినది
కలలు, కోరికలెటకొ తరలిపోయిన వెనక
చెలగి రేగినదేల కరకు కస్తురి గాలి.

చలిగాలి చలిగాలి రంపాల గాలి ఏ
కొలిమితిత్తుల కోతదో, ఈ
చలిగాలి చలిగాలి రంపాల గాలి.

17-5-2025

4 Replies to “చలిగాలి చలిగాలి”

  1. నమస్తే సర్. ఇక మ్యూజిక్ చేసే వాళ్ళు, గాయకులు కవులు కూడా అవసరం లేదేమో? అన్ని AI చేసేస్తున్నది. ఏది ఏమైనా పాట బావుంది. మీరు చెప్పకపోతే అది AI చేసిందని తెలిసేదే కాదు.

  2. మీతో మాట్లాడటమే కాదు మీ పోస్టులు చదువుకున్నా ఎడ్యుకేషనే , ఇది అతిశయోక్తి కాదు నా  అనుభవాల సారం మాత్రమే . కవిత్వం లోనూ సచిత్రలేఖనం లోనూ నేను,  నాకు తెలియనివన్ని నేర్చుకున్నానని చెప్పను కానీ ,తెలియనివెన్నో  తెలుసు కున్నాను,.  కుంటున్నాను. ఇప్పుడు AI  పుణ్యమా అని AI ని గురించి అందులోని అంతులేని పార్స్వాల గురించి, మరీ ముఖ్యం గా సంగీత గతులు గురించి మీద్వారా ఒక కొత్త పేజీ తెరిచినట్టయింది. ధన్యుడిని 

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%