
నాకు సంస్కృతం రాదు. కాని నాలాంటి సాహిత్య విద్యార్థి సంస్కృత నాటకాలు చదువుకోకుండా సాహిత్యం చదువుకున్నానని ఎలా అనుకోగలుగుతాడు? అందుకని సంస్కృత నాటకాలు, అయితే ఇంగ్లిషులోనో, లేదా తెలుగులోనో చదువుకుంటూ వచ్చేను.
సంస్కృత నాటక కర్తలందరిలోనూ పాఠకుడికి చాలా సరళసులభంగా దగ్గరకాగలిగినవాడు భాసుడు. ఆయన సంస్కృతాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టం కాదు. కాళిదాసు, భవభూతి రాసిన నాటకాలు వారి కావ్యకళకి పతాకస్థాయి రచనలు కాబట్టి వాటిని సంస్కృతంలో చదివి అర్థం చేసుకోగలడం ఒక వరం. అలాగని అవి అనువాదాలకి లొంగనివీ కావు. శాకుంతలాన్ని నేను మొదటిసారి మోనియర్ విలియమ్స్ ఇంగ్లిషు అనువాదం Sakoontala; or, The Lost Ring: An Indian Drama(1855) లోనే చదివాను. అది ఆ నాటకాన్ని సంస్కృతంలో చదివినట్టే అనిపించింది. ఒక్క ఆ కాళిదాస సంస్కృతం తాలూకు సునాదమాధుర్యం తప్ప. ఆ ‘సులభ సలిలావగాహాలూ’, ఆ’పాటల సంసర్గ సురభివనవాతాలూ’, ఆ ‘ప్రచ్ఛాయ సులభనిద్రలూ’ ఇంగ్లిషులో దొరికేవి కావు. ఉత్తర రామచరితా, మృచ్ఛకటికమూ తెలుగులో చదివాను. అంటే పక్కన సంస్కృతమూల తెలుగులిపిలో ఉండగా చదివాను కాబట్టి వాటిని సంస్కృతంలో చదువుకున్నట్టే చెప్పుకోవచ్చు. ఎటు తిరిగీ నాకు కొరుకుపడు పడకుండా ఉండిపోయింది ముద్రారాక్షసమొక్కటే.
చాలా ఏళ్ళ కిందట మా అక్కదగ్గర ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు ప్రచురించిన ముద్రారాక్షసనాటకం (1977) ఉండేది. అది నేలటూరు రామదాసయ్యంగారు తన వ్యాఖ్యానంతో వెలువరించిన పుస్తకమని ఇప్పుడు గుర్తుపట్టగలుగుతున్నాను. ఆ పుస్తకం ఎన్నోసార్లు తిరగేసానుగాని, అందులోకి ప్రవేశించలేకపోయాను. అలానే ఇంగ్లిషు అనువాదాలు కూడా చదవడానికి ప్రయత్నించానుగాని, ఆ నాటకంలోకి చొరబడటం దుర్భేద్యంగా ఉండింది. డా. ధూళిపాళ అన్నపూర్ణ గారు ఇటీవల ఆ నాటకానికి చేసిన తెలుగు అనువాదం ‘విశాఖదత్త ముద్రారాక్షస నాటకం'(2025) నా చేతికందాక, ఇన్నాళ్ళకు, నేను మొదటిసారిగా ముద్రారాక్షసాన్ని చదవగలిగాను. అది నా భాగ్యం.
ఇప్పుడు నాకు అర్థమయింది: ఈ నాటకం ఇన్నాళ్ళూ నాకు ఎందుకు కొరుకుడుపడలేదంటే, అది ఒక lyrical drama కాక ఒక action drama కావడం. నిజానికి ఒక నాటకం కావ్యంలాగా కాక, సంఘటనాత్మకంగా ఉంటేనే ఎక్కువ ఆకట్టుకునేదిగానూ, తొందరగా చదివించేదిగానూ ఉండాలి కదా! అయినా ఎందుకు చదవలేకపోయాను? ఎందుకని ఆలోచిస్తే రెండు విషయాలు బోధపడ్డాయి. మొదటిది, ఒక కావ్యంగా అది శాకుంతలానికీ, స్వప్నవాసవదత్తకీ, ఉత్తరరామచరితకీ సాటి రాకపోవచ్చుగానీ, ఆ నాటకశిల్పం మాత్రం అత్యంత ప్రౌఢమైందీ, సంక్లిష్టమైందీ మాత్రమే కాక, అత్యంత ఆధునికమైంది కూడా.
ఒకసారి మా మాష్టారితో మృచ్ఛకటికం గురించి ప్రస్తావిస్తే, ఆయన ఆ నాటకానికి , modern sensibilities ఉన్నవారిని తొందరగా ఆకర్షించే లక్షణాలు ఉన్నాయని అన్నారు. వస్తువుని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ మాట చెప్పి ఉండవచ్చు. అందులో, personal కీ political కీ మధ్య హద్దులు చెరిగిపోవడం కూడా ఒక కారణం కావచ్చు. అయినప్పటికీ, అందులో వసంతసేన వల్ల, ఆమెకీ, చారుదత్తుడికీ మధ్య నడిచిన ప్రణయం వల్ల, అద్వీతీయమైన వర్షర్తు వర్ణన వల్ల, ఆ నాటకాన్ని కూడా కావ్యంగా భావించినవాళ్ళకి తక్కువేమీ లేదు. అందుకు మొదటి ఉదాహరణ మా మాష్టారే. కాని ఆయనతో నడిచిన సంభాషణల్లో ఒక్కసారి కూడా ముద్రారాక్షసం ప్రసక్తి ఎందుకు రాలేదో ఇప్పుడు ఊహించగలను. ఈ నాటకం కేవలం modern మాత్రమే కాదు, ultra-modern అని చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా ఆ నాటక శిల్పం.
ఉదాహరణకి ఆ నాటకంలో దాదాపు మూడొంతులు అయితే స్వగతం లేదా ఆకాశభాషితం. ప్రతి పాత్రా లోపల అనుకునేదొకటీ, బయటకు మాట్లాడేదొకటీ. ఇక నాలుగో అంకంలో రాక్షసుడు, అతడి వేగు కరభకుడు మాట్లాడుకుంటూ ఉంటే, ఆ గది బయట మలయకేతు, భాగురాయణుడూ ఆ మాటలు వింటూ తాము కూడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి సన్నివేశాలు మరికొన్ని నాటకాల్లో కూడా మనం చూడవచ్చు. కాని ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, లోపలి సంభాషణలూ, బయటి సంభాషణలూ వేరువేరుగా కాక, ఒకదానితో ఒకటి, ఇప్పటిభాషలో చెప్పాలంటే real time లో నడుస్తుంటాయి. ఇటువంటి సన్నివేశ కల్పన చేయడం అత్యాధునికం కాక మరేమిటి!
అయినప్పటికీ, తెలుగులో నాటకశిల్పం గురించిన చర్చల్లో ఈ నాటకం గురించి విస్తృతంగా నేనెక్కడా చదివినట్టు గుర్తులేదు. దానికి కారణం ఈ నాటకానికి ఒక పూర్తిస్థాయి తెలుగు అనువాదం ఇప్పటిదాకా వెలువడకపోవడమే కారణమనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తెలుగు అనువాదం చదివాక, మళ్ళా రామదాసయ్యంగారి వ్యాఖ్యానంతో పాటు, ఆచార్య కె.ఎచ్.ధ్రువ ఇంగ్లిషు అనువాదం Mudrarakshasa or The Signet Ring (1923), రంజిత్ సీతారాం పండిట్ అనువాదం (1944), డుంఢిరాజ వ్యాఖ్యానంతో సహా ఎం.ఆర్. కాలే చేసిన అనువాదం (1927) తీసి చూసాను. ఇప్పుడు ఆ పుస్తకాలన్నీ సుబోధకంగా కనిపిస్తున్నాయి. ఈ నాటకం గురించి వారేమి చెప్తున్నారో నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. కాబట్టి అన్నపూర్ణ గారి అనువాదం నా వరకూ వట్టి అనువాదం మాత్రమే కాదు, నాకు ఆమె తన దగ్గర కూచోబెట్టుకుని చెప్పిన పాఠం కూడా.
రెండవది, ఈ నాటకాన్ని ముప్ఫై నలభయ్యేళ్ళ కిందట ఎవరిదగ్గరేనా పాఠం చెప్పించుకుని ఉన్నా కూడా, ఈ రోజు గ్రహించినట్టుగా ఈ స్వారస్యాన్ని అప్పుడు గ్రహించగలిగి ఉండేవాణ్ణి కాదు. దాదాపు మూడున్నర దశాబ్దాల ఒక ప్రభుత్వసేవకుడిగా నేను జీవించిన జీవితం వల్ల, ఇదుగో, ఈ వాక్యాలు ఇప్పుడు చాలా అర్థవంతంగా వినిపిస్తున్నాయి. రెండవ అంకంలో ఈ సంభాషణ చూడండి:
పాములవాడు: అయ్యా! ఏమంటున్నారు? మీకు కూడా పాములతో ఆడుకోవాలని ఉందంటారా? అయితే మీరు ఏ వృత్తిలో జీవిస్తున్నారో చెప్పండి.
ఏమిటంటున్నారు? రాజసేవకుణ్ణంటున్నారా?
అయితే మీరు పాములతో ఆడుకుంటూనే ఉన్నారు.
మూడవ అంకంలో రాజు కంచుకితో చెప్తున్న ఈ మాటలు చూడండి:
రాజు: ప్రజాపరిపాలన సాగించే రాజుకు ఈ రాజ్యం ఏమంత సంతోషాన్నిచ్చేది కాదు. .. ఎందుకంటే రాజు మోటుగా ఉంటే రాజ్యలక్ష్మి కోప్పడుతుంది. మెత్తనివాడయితే తనకు అవమానం జరుగుతుందన్న భయంతో అతని వద్ద నిలవదు. రాజు మూర్ఖుడయితే అతణ్ణి ద్వేషిస్తుంది. అలాగే అపరిమితమైన పాండిత్యం కలవారినీ ఇష్టపడదు. పరాక్రమవంతులంటే భయపడుతుంది.అన్ని విషయాలకూ అన్ని వేళలా భయపడేవారిని హేళన చేస్తుంది. బాగా చనువు సంపాదించుకున్న వేశ్యలాగా రాజ్యలక్ష్మిని సేవించడం కూడా చాలా దుఃఖంతో కూడుకున్న పని.
అదే అంకంలో కంచుకి తనకు తాను చెప్పుకుంటున్న ఈ మాటలు చూడండి:
కంచుకి: అబ్బ! ఈ రాజసేవ చాలా కష్టం! ముందు రాజుకి భయపడాలి. ఆ తరువాత మంత్రికి భయపడాలి. అలాగే రాజానుగ్రహాన్ని సంపాదించి రాజభవనంలో నివసించే విటులకి కూడా భయపడాలి. ఇలా దీనంగా ముఖమెత్తి మనసులోని భావాలు బయటకు కనబడకుండా దాచుకుంటూ ముద్దకోసం కష్టపడాలి. మనిషి విలువను తగ్గించే ఇటువంటి సేవను కుక్కవృత్తిగా పండితులు చెప్పడం చాలా సరిగ్గా ఉంది.
ఐదవ అంకంలో రాక్షసమంత్రి తనలో తాను చెప్పుకుంటున్న మాటలు వినండి:
రాక్షసుడు: రాజు దగ్గర ఉన్నతాధికారంలో ఉండడమంటే ఏ తప్పూ చెయ్యకపోయినా భయపడుతూ ఉండటమే! ఎందుకంటే- రాజు దగ్గర పనిచేసే ఉద్యోగస్థులందరికీ మొదటగా రాజంటేనే భయం నాటుకుంటుంది. ఆ తరువాత రాజుకి దగ్గరగా ఉన్న వారందరివల్ల కలిగిన భయం హృదయమంతా నిండిపోతుంది. అంతేకాదు, రాజు దగ్గర లభించిన ఈ ఉన్నతమైన పదవి వల్ల దుర్మార్గులైనవారికి ద్వేషాన్ని పుట్టిస్తుంది. ఇన్ని భయాలతో ఉన్న స్థానం నుంచి పతనమయిపోతానేమో అన్న భయం నిత్యం కలుగుతూనే ఉంటుంది.
ఇలా సూటిగా వినిపిస్తున్న కొన్ని వాక్యాల్ని పేర్కొన్నానుగాని, నిజానికి నాటకమంతా కూడా ఒక రాజనీతి శాస్త్రం. అంటే ఇది చదివితే రాజనీతి అర్థమవుతుందని కాదు. రాజనీతి ఎలా ఉంటుందో తెలిస్తే ఈ నాటకం మరింత గాఢంగా హృదయంలో నాటుకుపోతుందని నా భావం.
2
నాట్యశాస్త్రకారులు వివరించిన పదిరకాల రూపకాల్లో నాటకం కూడా ఒకటి. నాట్యశాస్త్రం (20:10-47) చెప్పిన లక్షణాల ప్రకారం ముద్రారాక్షసం నాటకం. అయితే కాళిదాసాదుల్లాగా శైలిలో, రసస్ఫూర్తిలో, భావోద్వేగాల నిర్వహణలో తన రచనని ఒక కావ్యంలాగా నిర్మించడం కన్నా కూడా ఒక పూర్తిస్థాయి నాటకంగా, సంఘటనాత్మకమైన నాటకంగా తీర్చిదిద్దడం మీదనే విశాఖదత్తుడు దృష్టి పెట్టాడని మనం గ్రహిస్తాం.
సంస్కృత కవులు కావ్యంలో నవ్యతకి కథమీద ఆధారపడలేదు. ఎందుకంటే బాగా తెలిసిన ఇతివృత్తాన్నే నాటకంగా రాయాలనే ఒక నియమం ఎలానూ ఉంది కనుక, ఆ కథనే నవ్యంగా చెప్పడానికి రసనిర్వహణమీద ఆధారపడ్డారు. కాని ఈ నాటకంలో రచయిత నవ్యతకి కథాశిల్పం మీద ఆధారపడ్డాడు. కథ తెలిసి ఉండవచ్చుగాని, ఆ కథ ఎలా చెప్తాడో కూడా ముందే తెలిసి ఉంటే అక్కడ నవ్యత ఉండదు. కాబట్టి మనకు తెలిసిన కథనే కాని మనం ఊహించినట్టుగా ఆ కథ నడవదు. నాటకంలో మన కళ్ళముందు జరుగుతున్న సన్నివేశాలు కూడా మనం గ్రహించుకుని అర్థం చేసుకునేలోపలే కొత్త సన్నివేశాలు మొదలవుతుంటాయి. ఇలా అత్యంత ఉత్కంఠభరితంగా కథ చెప్పడానికి అతడి ముందు నమూనా ఏదీ లేదు. కాబట్టి తాను రాయబోతున్న నాటకం తన ప్రణాళికను పూర్తిగా ఫలప్రదం చెయ్యగలదా అన్న అనుమానం అతడికి లేకపోలేదు. అయిదో అంకానికీ, ఆరో అంకానికీ మధ్య ప్రవేశకంలో సమిద్ధార్థకుడు అనేవాడు ఇలా అంటున్నాడు:
మిత్రమా! భద్రభటుడూ మొదలైన రాజులందరూ ప్రభువు చంద్రగుప్తునిపై ద్వేషంతో మలయకేతువుని చేరారని బయట చెప్పుకుంటున్నారే! ఏ ప్రావీణ్యమూ లేని కవి వ్రాసిన నాటకంలా మొదలుపెట్టింది ఒకటీ, పూర్తి అయింది ఒకటీ అన్నట్టుంటుంది.
ఇది కేవలం పాత్రకి కలిగిన సందేహం మాత్రమే కాదనుకుంటాను. ఎందుకంటే సాధారణంగా నాటకాలు అయిదు అంకాల్ని దాటి ఉండవు. ఈ నాటకంలో ఏడంకాలే కాక, మధ్యలో రెండు ప్రవేశకాలు కూడా ఉన్నాయి. ఈ సంభాషణకు వచ్చేటప్పటికి, నాటకకర్తకి తాను నాటకాన్ని మరికొంతసేపట్లో ముగించక తప్పదనే స్ఫురణ ఉంది. నాట్యశాస్త్రం చెప్పినదాని ప్రకారం (20:45) నాటక కథలో ఆవుతోకలాగా ఉదాత్త భావాలన్నీ చివరలోనే ఉండాలి. అద్భుత రసం నిర్వహణ సంధిలోనే (20:46) అంటే దాదాపుగా చివరి అంకంలోనే వ్యక్తం కావాలి. అంటే తాను ఈ మొదటి అయిదంకాల పాటూ చిక్కుముళ్ళు వేసుకుంటూపోయిన నాటక కథని తొందరలోనే అద్భుతంగా ముగించితీరాలి.
నిజానికి ఈ లోచూపు నాలుగో అంకంలోనే కనిపిస్తుంది. అక్కడ రాక్షసుడు తనకు తాను చెప్పుకుంటున్న ఈ మాటలు చూడండి:
ఒక నాటకాన్ని వ్రాస్తూన్న రచయిత నాటకంలోని కథకు మూలమైన బీజాన్ని మొదట సూక్ష్మంగా మొదలుపెడతాడు. తరువాత ఆ బీజాన్ని విస్తరించుకుంటూ మొలకెత్తిన ఆ బీజాన్ని స్పష్టం చేస్తూ ఇంతలోనే చెల్లాచెదురైనట్టున్న విషయాలన్నిటినీ ఒక్కచోట చేర్చి ఫలితాన్ని సాధించడంలో ఎంతటి కష్టాన్ని అనుభవిస్తాడో అలా నేనూ మొదట రహస్యంగా కార్యాన్ని ప్రారంభించి నెమ్మదిగా దాన్ని విస్తరింపచేస్తూ మళ్ళీ మళ్ళీ దాన్ని స్పష్టం కావించుకుంటూ, మళ్ళీ మళ్ళీ పరామర్శించుకుంటూ, ఇటూ అటూ అయిన ప్రయత్నాలన్నిటినీ ఫలితాన్నిచ్చేలా పోగుచేసుకుంటూ అంతటి కష్టాన్నీ అనుభవిస్తున్నాను. ..
అది ఎంత కష్టమంటే చివరకి రాక్షసుడికి తలనొప్పి వచ్చేస్తుంది కూడా. కానీ నాటకంలో రాక్షసుడు ఇంత శ్రమపడినట్టు చూపించే సన్నివేశాలేవీ కనిపించవు. కాబట్టి ఈ సమస్య నాటకకర్తదే అని మనం అనుకోవచ్చు.
ఒక ఇతివృత్తాన్ని నాటకంగా రాస్తున్నప్పుడు ఆ రచయిత, ఆ నాటకాన్ని కూడా ఒక నాటకంగా భావించి, ఇటువంటి self-reflection కి లోనుకావటం ఒకరంగా meta-theatre అవుతుంది. ఆ నాటకకర్త నాటకశిల్పం గురించి ఎంతో తీవ్రంగా ఆలోచిస్తే తప్ప, నాటకంలో ఇటువంటి చర్చ సంభవించదు. షేక్స్పియర్ నాటకాల్లో హామ్లెట్ లో ఇటువంటి meta-theatre కనిపిస్తుంది. సరిగ్గా ఇటువంటి కారణాల వల్లనే నేనీ నాటకాన్ని ఒక ultra-modern play అని అంటున్నాను. ఈ నాటకంలోని ఈ self-reflexivity గురించి ఇంతదాకా ఎవరూ రాసినట్టు నాకు కనిపించలేదు.
3
నాటకకర్త తన నాటక శిల్పం గురించి ఇంత తీవ్రమైన ఆందోళనకి గురవడానికి కారణాలేవై ఉండవచ్చు? మొదటిదేమిటంటే, నాటకం రాజులకి సంబంధించిన సుఖదుఃఖాలతో కూడుకున్నదై ఉండాలి. ఇందులో చంద్రగుప్తుడూ, అతడిమీద యుద్ధానికి సిద్ధమవుతున్న మలయకేతువూ ఉన్నారుగాని, నాటకం నడిచేది చాణక్యుడి చుట్టూ, రాక్షసుడి చుట్టూ. వ్యాఖ్యాతలు ఈ నాటకాన్ని వీరరస ప్రధానంగా పేర్కొన్నారు. కాని ఎటువంటి వీరం అది? యుద్ధవీరమైతే కానే కాదు. చంద్రగుప్తుడు ఒకే ఒక్క అంకంలో ఒకే ఒక్క సన్నివేశంలో కనిపిస్తాడుగానీ, అది అతడి వీరత్వాన్ని చూపించే సన్నివేశం కాదు. పైకి తన అమాత్యుణ్ణి ధిక్కరించేవాడిగానూ, లోలోపల అతడి పట్ల వినయం కలిగి ఉన్నవాడిగానూ కనిపించే సన్నివేశం అది. కాబట్టి ఎవరి రాజ్యాధికారభద్రత కోసం నాటకం నడిచిందో అతడి వీరత్వాన్ని మనం చూసే అవకాశమే కలగదు. కానీ ఇందులో యుద్ధవీరం లేకపోయినా మరెన్నో వీరాలున్నాయి. నిజానికి ప్రతి ఒక్కరిదీ ఒక్కొక్క వీరం. చాణక్యుడిది బుద్ధివీరం. రాక్షసుడిది ప్రభుభక్తివీరం. మలయకేతుది పితృభక్తివీరం. చందనదాసుది స్నేహవీరం. సిద్ధార్థకాదులది భృత్యవీరం. అంటే ప్రతి ఒక్క పాత్రా తాను నమ్మినదానికో లేదా తనకు అప్పగించినదానికో కట్టుబడి ఉండటమనే వీరత్వాన్ని ప్రదర్శిస్తుంది. కాని ఒక నాటకంలో ప్రధానంగా ఉండవలసిన రసం ఇన్ని అవాంతరభేదాల్లో కనిపించడం ప్రేక్షకుణ్ణి కొంత కంగారు పెడుతుంది. అతడికి తానేమి చూస్తున్నాడో, నాటకర్త తననెటు తీసుకుపోతున్నాడో ఒక పట్టాన అర్థం కాదు.
అలానే ఈ నాటకంలో నాయకుడెవరు? చంద్రగుప్తుడు కాడు. చాణక్యుడని అనిపించవచ్చు, చివరిదాకా, కాని చివరికి, అసలైన నాయకుడు రాక్షసుడా అని అనుమానం కలుగుతుంది. కాని ఇలా ఎవరో ఒక పాత్ర కాక, మైత్రికోసం చందనదాసు తన ప్రాణాల్ని కూడా అర్పించడానికి సిద్ధపడటమే అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర కావొచ్చనిపిస్తుంది. రాక్షసుడికోసం చందనదాసు మరణించడానికి సిద్ధపడతాడు. చందనదాసుకోసం రాక్షసుడు లొంగిపోడానికి సిద్ధపడతాడు. తాను ఏ చంద్రగుప్తుణ్ణి రాజుగా చేసాడో ఆ చంద్రగుప్తుడు స్థిరంగా రాజ్యం చెయ్యాలంటే తాను పక్కకు తప్పుకుని రాక్షసుణ్ణి అతడికి మంత్రిని చెయ్యడమే సమంజసమని భావించిన చాణక్యుడి స్వార్థత్యాగం, తన మంత్రి తనను ఏమి చెయ్యమని ఆదేశించినా, అది పైకి ఎలా కనిపించినా, అంతిమంగా అది తన మేలుకోసమేనని నమ్మే చంద్రగుప్తుడి వినయం పాత్రల్ని దాటి ప్రకాశిస్తాయి. చివరికి విశ్వాసం, mutual trust మాత్రమే స్నేహాల్నీ, కుటుంబాల్నీ, రాజ్యాల్నీ కూడా నిలబెట్టే నిజమైన వీరత్వమనే మెలకువలో నాటకం ముగుస్తుంది. కాబట్టి ఇది ధర్మవీర రసప్రధానం అని చెప్పవచ్చు.
కానీ ప్రేక్షకుడికి ఈ మెలకువ కలిగించడంలో తాను సరైన దారిలోనే వెళ్తున్నాడా అన్న అనుమానం నాటకకర్తకి రాకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే అతడు ఎంచుకున్నది సూటిదారికాదు. వంకర దారి. ఆ విషయం మనకి నాందిలోనే తెలిసిపోతుంది. ఈ నాందీ వాక్యాలు చూడండి:
నీ తలమీదకెక్కి కూచున్న ఆ ధన్య ఎవరు? అని పార్వతి శివుడిని అడిగింది.
శశికళ అన్నాడు శివుడు.
ఇదే ఆమె పేరా?
అదే ఆమె పేరు అన్నాడు.
నీకు బాగా తెలుసున్న పేరే కదా అది అని కూడా అన్నాడు. పైగా ఎందుకనో మర్చిపోయినట్టున్నావు అని అన్నాడు.
నేనడుగుతున్నది నీ తలమీద ఉన్న స్త్రీ గురించి, చంద్రవంక గురించి కాదు అంది.
నీకు నమ్మకం లేకపోతే నీ చెలికత్తె విజయని అడుగు, నిజం చెప్తుంది. అంటూ పార్వతీదేవినుంచి దేవనది అయిన గంగను దాచే ప్రయత్నం చేస్తున్న ఈశ్వరుడి కపటం మిమ్మల్ని కాపాడాలి.
ఈ వాక్యాలు వినగానే కపటం అనే మాట మన మనసులో నాటుకుంటుంది. దాంతోపాటు, శివుడి సమాధానం సూటిగా కాక, వంకరగా ఉందని కూడా అనిపిస్తుంది. ఎత్తులకు పై ఎత్తులు వేసే కాపట్యంతో పాటు, కౌటిల్యుడి కుటిలనీతి నాటకంలో ప్రధాన వస్తువని ఈ నాందీశ్లోకం సూచిస్తూ ఉందని వ్యాఖ్యాతలందరూ అన్నారు.
కాని అంతమాత్రమే కాదేమో! అసలు మొత్తం నాటకమే తల్లకిందులుగా నడిచే కథలాగా కనిపిస్తుంది. ఈ నాటకం వీరరసప్రధానమని కదా అన్నారు. వీరానికి ఉత్సాహం స్థాయీభావం. కాని ఇందులో మలయకేతువు తప్ప మరెవరిలోనూ ఉత్సాహం కనిపించదు. రెండవ అంకంలో రాక్షసుడు మనకి మొదటిసారి కనిపించిన కొన్ని క్షణాలకే కన్నీరు పెట్టుకుంటాడు. రాక్షసుడి వంటి మహామంత్రి కనీరుపెట్టుకునే దృశ్యం మనం ఊహించలేం. నాటకంలో మరొకచోట కూడా అతడి కన్నీరు కనిపిస్తుంది. కన్నీరు మనలో జాలి రేకెత్తిస్తుంది. ఇక ఎవరి చుట్టూతా నాటకం పరిభ్రమిస్తుందో, ఆ చాణక్యుడు తోటిపాత్రల్లోనూ, మనలోనూ కూడా భయం పుట్టిస్తాడు. ఇలా ఒక నాటకం మనలో ఏకకాలంలో pity నీ, fear నీ రేకెత్తించడం ట్రాజెడి లక్షణంగా అరిస్టాటిల్ పేర్కొన్నాడు. మనమొక విషాదాంతం వైపు నడుస్తున్నామా అనే అనుమానం మనల్ని నిలవనివ్వదు.
ఉదాహరణకి రామదాసయ్యంగారు పేర్కొన్నట్టుగా, ఇందులో పాత్రల్ని మనం జంటలుగా చూసినట్లయితే, చంద్రగుప్తమలయకేతులు, చాణక్యరాక్షసులు, ఇందుశర్మచందనదాసులు, భాగురాయణశకటదాసులు, చాణక్యుని కంచుకి వైహీనరి, రాక్షసుని కంచుకి జాజలి మన అంచనాల్ని తల్లకిందులు చేస్తూ ఉంటారు. నాటకం మొదలైనప్పటినుంచీ మనం మానసికంగా రాక్షసుడికీ, అతడి పరివారానికీ మానసికంగా సన్నిహితమవుతూ ఉంటాం. వారంతా మనలో కరుణ పుట్టిస్తుంటారు. చాణక్యుడు భయం కలిగిస్తుంటాడు. మనం చూడబోయేది విషాదనాటకమా లేక మోదాంతమా మనకి చివరి దాకా తెలీదు. చివరికి ఏదో ఒక అద్భుతం జరిగి చందనదాసు రక్షించబడితే బాగుణ్ణనుకుంటాం. రాక్షసుడు భార్యాబిడ్డల్తో బయటపడితే చాలనుకుంటాం. ఇలా నాటకం నడపడమేమో చాణక్యుడి చుట్టూ నడుపుతూ, మొత్తం రంగస్థలమంతా all the prime minister’s men తో నింపేసి, మన సానుభూతి మాత్రం రాక్షసుడివైపు ప్రవహింపచెయ్యడం సామాన్యమైన కౌశల్యం కాదు. అందుకనే చివరికి రాక్షసుడు చంద్రగుప్తుడి మంత్రికావడంతో నాటకం, ముందు మన మనసులో, మోదాంతంగా పరిణమిస్తుంది. అంటే మనం ఎవరిని ప్రతినాయకుడని భావించి నాటకశాలలోకి అడుగుపెడతామో అతణ్ణే మన ఆంతరంగికుడిగా స్వీకరించక తప్పని పరిస్థితికి చేరుకోవడంకాదు, అలా చేరుకోడంతో ఊపిరి పీల్చుకుంటాం చూడండి, అదీ నాటకవిజయం!
4
కేవలం వినడం ద్వారా నాటకం మనలో రసానుభూతి కలిగించాలంటే ఆ భాషకొక సునాదమాధుర్యం ఉండాలి. విశాఖదత్తుడి దృష్టి దానిమీద లేదు. దృశ్యకావ్యంగా దాన్ని మనం ఆనందించాలంటే రసోద్వేగం కలిగించే సన్నివేశాలు అడుగడుగునా ఉండాలి. చిట్టచివరలో చందనదాసుని అతడి భార్యాబిడ్డలు కలుసుకున్న సందర్భంలో తప్ప మరెక్కడా మనల్ని రసోద్విగ్నుల్ని చెయ్యగల సన్నివేశం కూడా ఏదీ లేదు. కానీ, నాటకం ముగిసేటప్పటికి అత్యంత ఉత్కంఠభరితమైన కథ ఒకటి విన్న అనుభూతి మాత్రమే కాదు, మనలో రహస్యంగా మొలకెత్తిన ఒక ఆకాంక్ష నెరవేరిన సంతోషం కూడా మనం అనుభవిస్తాం. కలలో మాత్రమే సాధ్యం కాగల ఈ wish-fulfilment ని ఏది సాధ్యం చెయ్యగలదో దాన్నే కళ అంటాం.
ఈ అనుభూతిని మనలో జాగృతం చెయ్యడానికి విశాఖదత్తుడు మొత్తం నాట్యశాస్త్రాన్ని మథించాడని ఈ నాటకశిల్పాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక నాటకంగాని లేదా ఒక కథగానీ లేదా ఒక ఫిల్మ్ గానీ, అంతిమంగా, ఏ narrative అయినా ఫలప్రదం కావడానికి అవసరమైన ఒక నిర్మాణాన్ని నాట్యశాస్త్రంతో పాటు తర్వాతి రోజుల్లో ధనంజయుడి దశరూపకం నిర్దేశించిపెట్టాయి. చాలామంది నాటకకర్తలు ఆ నిర్మాణరహస్యాల్లో తమకి అవసరమైన మేరకి మాత్రమే తీసుకుని తక్కింది వదిలిపెట్టేసారు. కాని విశాఖదత్తుడు ఆ నిర్మాణ శిల్పానికి ఒక లక్ష్య గ్రంథంగా ఈ నాటకం రాసాడా అనిపిస్తుంది.
నాట్యశాస్త్రమూ, దశరూపకమూ చెప్పినదాని ప్రకారం నాటకంలో ఒక ప్రధాన వస్తువు ఉంటుంది. దాన్ని ఆధికారికం అంటారు. ఇందులో చంద్రగుప్తుడి రాజ్యస్థిరత్వం కోసం రాక్షసుణ్ణి మంత్రిగా నియమించడం ప్రధాన వస్తువు. దానికి అనుబంధంగా ఒక ప్రాసంగిక వస్తువు ఉంటుంది. మలయకేతు పాటలీపుత్రాన్ని జయించి తన తండ్రికి తర్పణాలు విడవాలనుకోవడం ప్రాసంగిక వస్తువు. ఎంచుకున్న వస్తువుప్రకారం కథ నడపడానికి అయిదు అవస్థలుంటాయి. వాటిని అర్థప్రకృతులంటారు (దశరూపకం, 1:27) వాటిని బీజం, బిందువు, పతాక, ప్రకరి, కార్యం అంటారు. ఈ అయిదు దశల్నీ ఒకదానితో ఒకటి కలిపేదాన్ని సంధి అంటారు. అలా నాటకకథాబీజాన్ని బిందువుతో కలిపేది ముఖసంధి. బిందువుని పతాకతో కలిపేది ప్రతిముఖసంధి. పతాక నుంచి ప్రకరికి తీసుకుపోయేది గర్భసంధి. ప్రకరి నుంచి కార్యం వైపు నడిపించేది విమర్శసంధి. చివరలో కార్యం ఫలించడానికి దారితీసేది నిర్వహణసంధి. ఈ అర్థప్రకృతులూ, ఈ అయిదు సంధులూ కలిపి నాటకగమనాన్ని అయిదు దశల్లో పూర్తిచేస్తాయి. అవి ఆరంభం, ప్రయత్నం, ప్రాప్త్యాశ, నియతాప్తి, ఫలయోగం (దశ, 1:28) ఈ నాటకంలో ఈ అర్థప్రకృతుల్నీ, ఈ అయిదు సంధుల్నీ నాటకకర్త ఎంత నైపుణ్యంతో నిర్వహించాడో దాదాపుగా వ్యాఖ్యాతలంతా కూడా వివరంగా రాసారు. వాటిని పోల్చుకుంటూ నాటకం చదవడం నాటకాలు రాయాలనుకునేవాళ్ళకీ, స్క్రీన్ ప్లేలు రూపొందించేవాళ్ళకీ గొప్ప అభ్యాసం.
నాటకకర్త ఈ శిల్పనిర్మాణానికి అనుగుణంగా కథని నిర్మించడం మీద దృష్టిపెట్టాడే తప్ప పాత్ర పోషణ, పాత్రల మధ్య సన్నివేశకల్పన ద్వార రసోద్దీప్తి కలిగించడం వంటివాటిమీద దృష్టి పెట్టలేదు. ఒక విధంగా చెప్పాలంటే, ఇది ఇరవయ్యవ శతాబ్దంలో బ్రెహ్ట్ చేపట్టిన episodic drama వంటి ప్రయోగం. కాని బ్రెహ్ట్ అరిస్టాటిల్ నాటకశిల్పం మీద తిరుగుబాటుగా తన ప్రయోగాలు చేపట్టాడు. కాని విశాఖదత్తుడు నాట్యశాస్త్ర నిర్దేశాల ప్రకారమే నాటకం రాస్తూ దాన్ని వీలైనంత సంఘటనామాలికగా చిత్రించుకుంటూపోయేడు. దీనివల్ల ప్రేక్షకుడు ఏ పాత్ర దగ్గరా ఆగడు. ఏ రసం దగ్గరా నిలబడిపోడు. అతడు వీలైనంత త్వరగా ఈ చిక్కుముడి విప్పేయాలనుకుంటాడు. ఏ విధంగా చూసినా ఇదొక విచిత్రమైన, విశిష్టమైన ప్రయోగం. సాంప్రదాయిక నాటకరంగంలోనే కాదు, ఆధునిక నాటకాల్లో కూడా ఇటువంటి శిల్పం నేనింతదాకా చూడలేదనే అనుకుంటున్నాను.
ఒక రచనలో గొప్ప నిర్మాణ కౌశల్యం ఉందని గుర్తుపట్టడానికి మనకి కొన్ని కొండగుర్తులుంటాయి. కథ ఎక్కడ మొదలయ్యిందో అక్కడే ముగింపుకి రావడం అటువంటి కొండగుర్తుల్లో ఒకటి. ఈ నాటకం మొదలవుతూనే ‘జుత్తుముడి తడుముకుంటూ కోపంతో ఉన్న చాణక్యుడి ప్రవేశంతో’ మొదలవుతుంది. ఏడవ అంకంలో చాణక్యుడు ‘గుర్రాల కట్లనూ, ఏనుగుల కట్లనూ తప్ప విడిచి అన్నిటి బంధనాలను విప్పెయ్యండి, నేను మాత్రం నా ప్రతిజ్ఞ పూర్తయ్యింది కనుక నా పిలకను బంధిస్తాను’ అని అనడంతో ముగుస్తుంది. అయితే ఈ నాటకకర్త ఆద్యంతాల్లోనేకాక, మధ్యలో కూడా ఈ పిలకని గుర్తుచేస్తాడు. మూడో అంకంలో చాణక్యుడు చంద్రగుప్తుడిమీద కోపం నటిస్తూ ‘ముడివేసుకున్న నా జుత్తుముడిని మళ్ళీ విప్పటానికి నా చెయ్యి పరుగెడుతోంది’ అంటాడు.
సాధారణంగా నాయకుడూ, ప్రతినాయకుడూ ముఖాముఖి యుద్ధానికో, వాగ్వాదానికో తలపడితే వాళ్లల్లో ఎవరు బలవంతులో, ఎవరు కాదో తేల్చుకోగలుగుతాం. కాని ఈ నాటకంలో చంద్రగుప్తుడూ, మలయకేతూ ఒకరికొకరు ఎదురుపడనే పడరు. మరి వారిలో ఎవరు ధీరులో ఎలా చెప్పగలం? అది తేల్చడానికా అన్నట్టు నాటకకర్త రెండు సన్నివేశాలు చూపిస్తాడు. మొదటిది, చాణక్యుడి మీద కోపం తెచ్చుకున్న దృశ్యంలో చంద్రగుప్తుణ్ణి ఒక మెట్టు ఎక్కువగా చూపిస్తాడు. రెండవది, అయిదో అంకంలో మలయకేతువు భాగురాయుణ్ణి వెనక నుంచి వెళ్ళి కళ్ళుమూస్తాడు. అలాంటి పిల్లచేష్ట చేయించడం ద్వారా అతణ్ణి ఒక మెట్టు తక్కువగా చూపిస్తాడు. యుద్ధం చేసి చంద్రగుప్తుణ్ణి ఓడించడానికి సిద్ధపడుతున్న ఒక రాజు తన ఉద్యోగిపట్ల ఇటువంటి పిల్లచేష్ట చేయగలడని మనం ఊహించలేం. ఈ ఒక్క సన్నివేశంతో మలయకేతు మన దృష్టిలో చాలా పలచనైపోతాడు.
ఇప్పటి మన తెలుగు రచయితలకి రాజ్యం గురించి మాట్లాడటమంటే చెప్పలేనంత కుతూహలం. రాజ్యమనగానే వాళ్ళకి పోలీసులూ, తుపాకులూ, జైళ్ళూ కనిపిస్తాయి. కాని నిజమైన రాజకీయ రచయితకి రాజ్యమంటే వేరే ఎక్కడో ఉండదు, అది నీలో, అనుక్షణం నిను వెన్నంటి ఉండేవాడిలో, వాడి రహస్య ఆకాంక్షల్లో, అతిచంచలాలైన వాడి విధేయతల్లో కనిపిస్తాయి. అందుకనే నాటకంలో మూడవ అంకంలోని ఈ దృశ్యం చదవగానే నేను నిశ్చేష్టుణ్ణయిపోయాను. రాజుకీ, కంచుకికీ మధ్య జరిగిన ఈ సంభాషణ చూడండి:
రాజు: వైహీనరా! ఇక ఇప్పటినుండి చాణక్యుణ్ణి పట్టించుకోకుండా పక్కన పెట్టి రాజ్యవ్యవహారమంతా చంద్రగుప్తుడే చూసుకుంటాడని ప్రజలకు తెలిసేలా చెయ్యండి.
కంచుకి (మనసులో)
ఆ! ఏమిటిది? గౌరవవాచకం లేకుండానే చాణక్యులవారిని గూర్చి మాట్లాడుతున్నారే! అయ్యో! అధికారాన్ని లాగేసుకున్నారే! అయిన ఈ విషయంలో రాజుగారి తప్పేమీ లేదు. ఎందుకంటే రాజు తప్పు చేసాడంటే ఆ దోషం మంత్రిదే అవుతుంది. ఏనుగు పొగరుమోతు అనే నిందను మావటివాని యొక్క పొరపాటు చేత పొందుతుంది.
రాజు: ఏమిటి ఆలోచిస్తున్నావు?
కంచుకి: ప్రభూ! ఏమీ లేదు. మా అదృష్టం వల్ల ప్రభువులు ఇప్పుడు నిజంగా ప్రభువులయ్యారు.
ఈ వాక్యాలు చదవగానే ఎన్నేళ్ళుగానో నేను చూసిన ఎందరో ఉన్నతాధికారులు మొదలుకుని దిగువస్థాయి సిబ్బందిదాకా ఎంతోమంది గుర్తొచ్చారు. అధికారం చేతులు మారగానే మనుషుల మాటలు సత్వరమే ఎలా మారతాయో నేను కళ్ళారా చూసిన, విన్న దృశ్యాలెన్నో గుర్తొచ్చాయి.
5
నన్నొక సారి పి.వి.నరసింహారావుగారు ‘నువ్వు చదివిన మంచి political works ఏవైనా ఉన్నాయా, చెప్పు’ అని అడిగారు. నాకేమీ గుర్తు రాలేదు. అప్పటికి ఈ అనువాదం వచ్చి ఉంటే, తప్పకుండా ఈ పుస్తకం పేరే చెప్పి ఉండేవాణ్ణి.
ఇంత అద్భుతమైన రచనని ఇంత ఆధునికరీతిలో మనకు అందించినందుకు డా.అన్నపూర్ణగారికి, ఈ పుస్తకాన్ని ప్రచురించినందుకు తురగా ప్రచురణాలయం వారికీ నా వంటి సాహిత్యాభిమానులు సర్వదా ఋణపడి ఉంటారు.
ముద్రారాక్షసమ్, విశాఖదత్తుడు, తెలుగు అనువాదం, డా.ధూళిపాళ అన్నపూర్ణ, తురగా ప్రచురణాలయం, వెల రు.200/- పుస్తకం కావలసినవారు 9908572598 ని సంప్రదించవచ్చు.
24-3-2025
నాటక లక్షణాలు, నాటక శిల్పం, ముద్రారాక్షసం లో ఎట్లా ఉన్నాయో చెబుతూ, ఆ నాటకం ఇప్పటి ఆధునికోత్తర నాటకానికీ ఏమాత్రం తీసిపోదని ఎంత అద్భుతంగా ఎంత పరిశీలనత్మాకంగా వివరించారో చదువుతూ ఉంటే ఒక గొప్ప అధ్యాపకుడి పాఠం విన్నట్టుగా ఉంది సర్. ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్
ఈ ముద్రారాక్షసమ్ నాటకం ఏమో గాని మీ విశ్లేషణ ఓ అద్భుతం. ఇదొక MRI SCAN TEST లా ఉంది నాకు. వంగోబెట్టి ఎత్తి పెట్టి తిరగేసి మరగేసి.. అన్ని వైపులా తీక్షణంగా scan చేశారు. ఇది ఈనాటి నాటక ప్రముఖులుగా చెలామణి అవుతున్న వాళ్ళు బహుమతి గ్రహీతలు చదివితే.. కనీసం చూస్తే ఎంత బావుండునో..
Great sir.. అబ్బురం.. నాకయితే అపురూపం.
ధన్యవాదాలు సార్!
Interesting sir
ధన్యవాదాలు సార్
ఎంతో చక్కని పరిచయం,విశ్లేషణా గావించిన మీకు కృతజ్ఞతలు.
ధన్యవాదాలు సార్