
Horst Jannsen – Hölderlin Ages 16 and 72. Courtesy: holderlinpoems.com
ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క కవి నన్ను మంత్రముగ్ధుణ్ణి చేస్తుంటాడు. ఇప్పుడు హోల్డర్లిన్ నా మీద చల్లిన సమ్మోహసుగంధంలో ఉన్నాను. అలాగని ఆయన్ని గతంలో చదవలేదని కాదు. ముఖ్యంగా చాలా ఏళ్ళకిందట Introducing Romanticism (2010) అనే గ్రాఫిక్ గైడ్ చదువుతుండగా హోల్డర్లిన్ గురించి మొదటిసారి తెలిసింది. ఆయన గురించి అందులో రాసిన నాలుగైదు వాక్యాలకే ఆయన పట్ల చెప్పలేని కుతూహలం కలిగింది. ఆయన్ని వెంటనే చదవాలన్న ఉత్సాహంతో Michael Hamburger అనువాదం చేసిన Selected Poems and Fragments (1998), Jeremy Adler, Charlie Louth అనే వారలు అనువాదం చేసిన Essays and Letters, రెండూ పెంగ్విన్ ప్రచురణలే, కొనుక్కున్నాను. అది కూడా పదిహేనేళ్ళకిందటి మాట.
కాని ఈ మధ్య స్టాన్లీ కునిజ్ ఇంటర్వ్యూలు చదువుతుండగా, ఆయన ఒకచోట హోల్డర్లిన్ వాక్యమొకటి ప్రస్తావించేడు. ఆ వాక్యం హోల్డర్లిన్ 12-11-1798 న న్యూఫర్ అనే మిత్రుడికి రాసిన ఉత్తరంలోది. ఆయనిలా రాస్తున్నాడు:
Purity can only be represented in impurity..Nothing fine, then, can be represented without coarseness, and for this reason I shall always tell myself, when I encounter coarseness in the world, you need it just as much a potter does the clay, therefore embrace it and don’t reject or shrink from it. That’s my conclusion.
ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయనకి ఇరవై ఎనిమిదేళ్ళు. కాని అతడికి తెలీదు, భారతీయ భక్తి కవులు దేశభాషల్లో కవిత్వం చెప్తున్నప్పుడు, ఒక కబీరు, ఒక బుల్లేషా, ఒక తుకారాం చేసిందిదే అని. తనకి తెలీకుండానే హోల్డర్లిన్ భారతీయ భక్తికవులకి చాలా సన్నిహితంగా రాగలిగేడు.
ఫ్రెడరిక్ హోల్డర్లిన్ (1770-1843) జర్మన్ కవుల్లో తొలితరం రొమాంటిక్-మిస్టిక్. తన నవయవ్వనదినాల్లో ఫ్రెంచి విప్లవ ఆదర్శాలతోనూ, కాంట్ ఐడియలిజంతోనూ ప్రభావితుడయ్యాడు. హెగెల్, షెల్లింగ్ అతడికి సహాధ్యాయులు. మొదట్లో మతాచార్యుడు కావడానికి అవసరమైన చదువు చదువుకున్నాడుగానీ ఆ రంగంలో చేరడానికి అతడికి సుముఖతలేకపోయింది. తండ్రి అకాలంగా మరణించడంతో ఆర్థికమైన ఇబ్బందులవల్ల ట్యూటరుగా పనిచేయవలసి వచ్చింది. అటువంటి రోజుల్లో ఫ్రాంక్ ఫర్టులో ఒక సంపన్నుడి ఇంట్లో ట్యూటరుగా పనిచేస్తున్నప్పుడు అతడి భార్యని ప్రేమించాడు.
ప్లేటో ‘సింపోజియం’ లో సోక్రటీసుకి ప్రేమవిద్య గురించి బోధించిన డయొటిమా హోల్డర్లిన్ కి ఒక ఆదర్శం. అందుకని తాను ప్రేమించిన అమ్మాయిలో డయొటిమాను చూసాడు. (డయొటిమా గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటే, నా అనువాదం ప్రేమగోష్ఠి చూడండి.) ఆ ప్రేమోద్వేగం నేపథ్యంగా Hyperion అనే కావ్యం రాసాడు. ఆ ప్రేమ వ్యవహారం తెలియగానే ఆ గృహస్థు అతణ్ణి ఉద్యోగంలోంచి తీసేసాడు. ఆ తర్వాత హోల్డర్లిన్ మరికొన్నాళ్ళపాటు జర్మనీలోనూ, స్విజ్జర్లాండులోనూ, ఫ్రాన్సులోనూ ట్యూటరుగా పనిచేసాక, 1802 లో తాను ప్రేమించిన అమ్మాయి అనారోగ్యంతో మరణించిన వార్త విన్నాడు. అది అతణ్ణి మానసికంగా తల్లకిందులు చేసింది. తీవ్ర అనారోగ్యంలో ఆస్పత్రి పాలయ్యాడు. వైద్యులు అతడు మరొక మూడేళ్ళ కన్నా ఎక్కువ బతికే అవకాశం లేదన్నారు.
అతడి Hyperion కావ్యానికి అభిమాని అయిన ఒక వడ్రంగి అతణ్ణి తన దగ్గర పెట్టుకుని చూసుకోడానికి ముందుకొచ్చాడు. దాదాపుగా మతిస్థిమితం తప్పిన స్థితిలోనే హోల్డర్లిన్ ఆ వడ్రంగి మిత్రుడి సంరక్షణలో, నెకార్ నది ఒడ్డున, టుబింగన్ పట్టణంలో, ఒక మేడమీద గదిలో మరొక ముప్ఫై ఆరేళ్ళ పాటు జీవించి 1843 లో తన డెబ్భై మూడవ ఏట కన్నుమూసాడు. తన జీవితంలో ఆ సగభాగం అతడు తానెవరో గుర్తులేని జీవితం జీవించాడు. ఆ రోజుల్లో కూడా కొన్ని కవితలు, కొన్ని కవితా శకలాలు రాయకపోలేదుగాని, వాటి కింద హోల్డర్లిన్ అని కాక, Scardanelli, or something of the sort అని సంతకం చేసేవాడు.
అతడి జీవితకాలంలో సరే, పందొమ్మిదో శతాబ్దమంతా కూడా జర్మన్ సాహిత్యం అతణ్ణి పట్టించుకోలేదు. కాని ఇరవయ్యవ శతాబ్దం మొదలయ్యాక, అత్యంత శక్తిమంతులైన జర్మన్ కవులు, రిల్క, ట్రాకల్, పాల్ సెలాన్, మరొకవైపు ప్రతిభావంతులైన జర్మన్ తత్త్వవేత్తలు నీషే, హిడెగ్గర్ వంటివారు హోల్డర్లిన్ ని పునఃపఠించడం మొదలుపెట్టారు. హిడెగ్గర్ అయితే హోల్డర్లిన్ కవితలమీద ఏకంగా పుస్తకాలే రాసాడు! ఈ పునరధ్యయనం వల్ల నేడు ఆధునిక జర్మన్ సాహిత్యంలో గొథే తర్వాత స్థానానికి హోల్డర్లిన్ చేరుకున్నాడు.
ఏమిటి హోల్డర్లిన్ ప్రత్యేకత? ఎందుకని అంత అగ్రశ్రేణి కవులు, తాత్త్వికులు హోల్డర్లిన్ ని అంతగా ఆరాధించడం మొదలుపెట్టారు? సాధారణంగా అందరూ చెప్పేదేమంటే, హోల్డర్లిన్, ప్రాచీన గ్రీకు కావ్యాల్నీ, కవుల్నీ, నాటకకర్తల్నీ, దేవతల్నీ గాఢంగా ఆరాధించాడనీ, తన చుట్టూ ఉన్న కొండల్లో, అడవుల్లో, నదుల్లో ప్రాచీన గ్రీసునే దర్శిస్తూ వచ్చాడనీ. అక్కడితో ఆగక, క్రీస్తుని, గ్రీకుల అపోలోతో సమన్వయం చేసుకోడానికి ప్రయత్నించాడనీ, హెలెనిజం, క్రైస్తవం రెండూ కలుసుకోగలిగే ఒక మానసిక దిగ్వలయాన్ని తన కవిత్వంలో ప్రతిపాదించాడనీ. మరికొందరు చెప్పేదేమంటే, ఆయన జర్మన్ భాషనీ, కవిత్వాన్నీ ఆధునికం చేయగలిగాడనీ, ముఖ్యంగా ప్రాచీన గ్రీకు మహాకవి పిండార్ ప్రభావంతో గీతాలు రాయడం మొదలుపెట్టినప్పటికీ, చివరికి వచ్చేటప్పటికి, ఆ నిర్మాణంలో, ఆ భాషలో ఒక సారళ్యాన్నీ, ఆధునికతనీ తీసుకురాగలిగాడనీ, ఆ విధంగా కాలంకన్నా ముందున్నాడనీ.
కానీ నాకేమనిపిస్తుందంటే, ఆయన, తన గురించి ఒక చోట చెప్పుకున్నట్టుగా, కొన్నాళ్ళేనా, దేవతలమధ్య గడిపిన మనిషి. ఆ శాంతసౌందర్యాన్ని మాటల్లో పెట్టడంకోసం అతడు చేసిన తపస్సు మామూలు తపస్సు కాదు. ఒక విధంగా చెప్పాలంటే, తాను చూసిన సౌందర్యాన్ని నిభాయించుకోగల శక్తి ఆ మనసుకి చాలనందువల్లనే అతడు మతిస్థిమితం కోల్పోయాడు. కాని అదేమంత పెద్ద విషయం కాదు. ఈలోగానే అతడు తాను చూసిన సౌందర్యం తాలూకు ఆనవాళ్ళు తన కవితలద్వారా మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. ఈ రోజు ఆ కవితలు చదువుతుంటే, భారతీయ భక్తికవులు నాకు పదేపదే గుర్తు రావడానికి అదే కారణం.
అందుకని ఈసారి ఆయన్ని లోతుగా చదవాలనిపించి నా దగ్గరున్న పుస్తకాలు బయటికి తీసాను. మరిన్ని పుస్తకాల కోసం, మరింత సమాచారం కోసం నెట్లో శోధించడం మొదలుపెట్టాను.
హటాత్తుగా http://www.holderlinpoems.com కనబడింది. James Mitchell అనే ఒక బ్రిటిష్ కవి, అనువాదకుడు నడుపుతున్న బ్లాగు అది. మిచెల్ కూడా గతంలో హోల్డర్లిన్ కవితల అనువాదం ఒక సంపుటి The Fire of Gods Drives Us to Set Forth by Day and Night (1978) తీసుకొచ్చాడు. ఆ సంపుటిలోంచే 26 కవితలు తీసుకుని ఈ బ్లాగులో పొందుపరిచాడు. ప్రతి కవితనీ మరింత బాగా అర్థం చేసుకోడానికి కొన్ని వివరణలు కూడా రాసాడు. మరీ ముఖ్యంగా తన అనువాదాల్ని క్రియేటివ్ కామన్సు లో పెట్టి వాటిని ఎవరేనా అనువదించుకోవచ్చని అనుమతి కూడా ఇచ్చేసాడు.
కాబట్టి, రానున్న రోజుల్లో ఆ కవితలు కొన్నేనా తెలుగులో మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
హృదయాన్ని ఆశ్రయించుకున్న పద్యం
భాగ్యవిధాతలారా, నాకొక్క వేసవి
గడువివ్వండి, ఆ పైన నా పాటలు
పరిపక్వం కావడానికి ఒక్క హేమంతం.
అప్పుడు మధురసంగీతమయమై
నా హృదయం సంతోషంగా ముకుళితమవగలదు.
జీవించే అదృష్టానికిక్కడ నోచుకోకపోయాక
నరకంలోనూ ప్రశాంతి లభిస్తుందనుకోను.
అయితే నా హృదయాన్ని ఆశ్రయించుకున్న
నా ప్రియపద్యాన్ని సరిగ్గా కూర్చుకోగలితే –
ఇంకప్పుడు ఓ శీతల ఛాయాప్రపంచమా, స్వాగతం
నా వీణని నేనిక్కడే వదిలిపెట్టేసినా
తృప్తిగా అడుగుపెట్టగలను నరకంలో.
ఒకసారి దేవతాతుల్యంగా జీవించేక
మరిదేంతోనూ పనిలేదు నాకు.
To the Fates
Grant me just one summer, powerful ones,
And just one more autumn for ripe songs,
That my heart, filled with that sweet
Music, may more willingly die within me.
The soul, denied its divine right in life,
Won’t find rest down in Hades either.
But if what is holy to me, the poem
That rests in my heart, succeeds—
Then welcome, silent world of shadows!
I’ll be content, even if it’s not my own lyre
That leads me downwards. Once I’ll have
Lived like the gods, and more isn’t necessary.
సాధారణంగా హోల్డర్లిన్ కవిత్వం గురించి మాట్లాడేవాళ్ళంతా తప్పనిసరిగా ఉదహరించే కవిత ఇది. ఇందులో ఆయన తన పద్యాన్ని తాను అనుకున్నట్టు రాయగలిగిన తర్వాత తాను నరకానికైనా పోడానికి కూడా సిద్ధమే అని చెప్తున్నాడు. ఇంకా సున్నితంగా చెప్తున్నదేమంటే, ఒక కవి తాను అనుకున్నట్టు తన పద్యం రాయగలిగితే అది కొద్దిసేపేనా దేవతలతో సమానంగా జీవించడంలాంటిదని. అలా దేవతాతుల్యంగా కొన్ని క్షణాలు జీవించాక ఇంక తనను మరేదీ బాధించదంటున్నాడు.
వీణ అని ఇక్కడ అనువాదం చేసిన పదం నిజానికి lyre. అది ఒక గ్రీకు తంత్రీ వాద్యం. గ్రీకు పురాణకథల్లో ఆఫియస్ తన ప్రియురాలు యూరీడైస్ అకాలంగా మరణించినప్పుడు ఆమెని తిరిగి తెచ్చుకోవడం కోసం తన సంగీతంతో నరకలోకంలోకి అడుగుపెడతాడు. తాను కోరుకున్నట్టుగా పద్యం రాసేసాక, ఇక తనని తన వీణ ఇక్కడే వదిలిపెట్టేయమన్నా తనకి ఇబ్బందిలేదంటున్నాడు హోల్డర్లిన్.
తన హృదయాన్ని ఆశ్రయించుకున్న పద్యం పరిపూర్ణంగా రూపొందడమే తనకి అమరత్వమని హోల్డర్లిన్ చెప్పుకుంటున్న ఈ మాటలు ఏ కవికి ఆదర్శం కావుగనుక!
12-03-2025
Sir,
“ దేవతలమధ్య గడిపిన మనిషి” ని పరిచయం చేసినందుకు 🙏🏽🙏🏽🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
Waiting for more translations of Holderlin sir.
ధన్యవాదాలు నాయుడు మీరు చదివినందుకు. మరిన్ని అనువాదాలు కోరుకుంటున్నందుకు.
ఈ రాత్రి సమయం మరింత చల్లదనాన్ని ఆవరించుకుంటుందేమో… కవి గురించి చెప్పినప్పుడు అతని అనువాదాన్ని మీరు అందించింది చదివినప్పుడు దేవతలు కరుణించి కొన్ని వాక్యాలు పంపించినట్టు అనిపిస్తుంది…
మీరు మరిన్ని కవితల్ని ఇలా అందించగలరని ఆశపడుతున్నాను…
Thank you
ధన్యవాదాలు రమాదేవీ!