
జలిగం ప్రవీణ్ కుమార్ అత్తాపూరులోనే పుట్టిపెరిగాడు. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో బి.ఏ.రెడ్డిగారి సంస్కృతి రూరల్ ఆర్ట్ స్కూలు గురించి విన్నాడు. ఆ స్కూలుకి వెళ్ళి ప్రింట్ మేకింగ్ నేర్చుకోడం మొదలుపెట్టాడు. అది అతడి జీవితాన్ని మార్చేసింది. బేచలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వైపు నడిపించడమే కాదు, కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో ప్రింట్ మేకింగ్ లో మాస్టర్స్ చేసే దాకా ప్రోత్సహించింది. జితేందర్ అతడికి గ్రాడ్యుయేషన్ లో క్లాస్ మేట్. తను కూడా ప్రింట్ మేకింగ్ లో మాస్టర్స్ చేసాడు. ఇప్పుడు ఈ యువకులిద్దరూ కలిసి అత్తాపూరులో ‘కళాక్షేత్రం’ అని ఒక శిక్షణాలయం ప్రారంభించారు.
కిందటి వేసవిలో మొదటి సారి ఒక కోర్సు నడిపారు. ప్రభుత్వపాఠశాలల విద్యార్థులకి ఆరు వారాల పాటు ప్రింట్ మేకింగ్ లో ఒక సమ్మర్ కోర్సు నడిపారు. అదే పద్ధతిలో నిన్న మరొక మరొక వర్క్ షాపు మొదలుపెట్టారు. ఇది పాటరీలో, క్లే మోడలింగులో.
అలా తామొక వర్క్ షాపు మొదలుపెట్టబోతున్నామని ఆ మధ్య ప్రవీణ్ చెప్పినప్పుడు నేను కూడా ఒక విద్యార్థిగా ఆ కోర్సులో చేరదామనుకుంటున్నానని చెప్పాను. కాని నిన్న అతను ఆ వర్క్ షాపు ప్రారంభోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించేడు. తమ గురువు, తమ జీవితాన్ని రేఖలవైపూ, రంగులవైపూ మళ్ళించిన బి.ఏ.రెడ్డిగారు ముఖ్య అతిథి.
నిన్న సాయంకాలం ఆ వర్క్ షాపు ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ముందు గౌతం ని పరిచయం చేసారు. గౌతంది అప్పాపూర్ దగ్గర ఉప్పరపల్లి. ఆయనకి కుమ్మరం వంశపారంపర్యంగా అబ్బిన ఒక కౌశల్యం. సెరమిక్స్ లోనే గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత శాంతినికేతన్ లో మాస్టర్స్ చేసాడు. ఆయన ఈ వర్క్ షాపులో మాస్టర్ ట్రయినర్. వర్క్ షాపు ఇంకా మొదలుకాకముందే నాతో ఆయన పాటరీ మొదలుపెట్టించాడు. మట్టి ఎలా తీసుకొస్తారు, దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో చెప్పి తాను తెచ్చిన బంకమన్ను పాకెట్ విప్పి ఇంత మట్టితీసి నా చేతుల్లో పెట్టాడు. వర్క్ షాపు కోసం తెచ్చిన ఎలక్ట్రిక్ పాటర్స్ వీల్ మీద ఆ మట్టిముద్ద పెట్టి దాన్ని ఒక పాత్రగా ఎలా మలచాలో స్వయంగా నా చేతుల్తో చేయించాడు. కుడిచేతి వేళ్ళతో, ఎడమ అరచేతితో ఆ మట్టిముద్దను నొక్కుతూ, దాన్ని తిరిగి మళ్ళా సరిదిద్దుతూ, నా చేతుల్తోటే ఒక చిన్న దీపం ప్రమిద రూపొందించేలా చేసాడు.
నాకు ఆ క్షణాన నా చిన్నప్పుడు మా ఊళ్ళో కుమ్మరులుండే వీథి గుర్తొచ్చింది. రెండుమూడు కుటుంబాలే ఉండేవారుగాని, ఆ ఇళ్ళన్నీ ఒకదానికొకటి గొలుసుకట్టుగా ఉండేవి. ఆ ఇళ్ళకు ఒక పక్కగా ఆవం. అందులోంచి ఎప్పుడూ ఆరని పొగ. కొత్తగా చేసిన కుండలు, కాల్చిన కుండలు, పగిలిన కుండలు, గాలికి రేగే ఊక నుసి- ఆ ప్రాంతమంతా ఒక కార్ఖానా లాగా ఉండేది. నా జీవితంలో నేను చూసిన మొదటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అది.
చేతిలో ఒక కర్ర పట్టుకుని చక్రం తిప్పే కుమ్మరి నా కళ్ళకు ఒక అద్భుతంగా తోచేవాడు. అతడి చేతుల్లో వెన్నలాగా మట్టి సాగుతూ, అది నా కళ్ళముందే ఒక కుండగా మారుతూ, దానికొక ఆకారం వచ్చాక అతడొక దారం తీసుకుని దానితో ఆ కుండని కోసి ఆ పచ్చికుండ తీసి పక్కన పెట్టి మళ్ళా మరొక కుండ చెయ్యడానికి ఉద్యుక్తుడయ్యే దృశ్యం నా మనసులో ఇప్పటికీ చెరక్కుండా అలానే ఉంది. కానీ అది చూడ్డానికి మాత్రమే సున్నితమనీ, ఒక కుండ చెయ్యడానికి అపారమైన శక్తి కావలసి ఉంటుందనీ నిన్న నాకు మొదటిసారిగా తెలిసొచ్చింది. ఇంతకీ నా చేతుల్తో చేయించింది ఒక చిన్న మట్టిప్రమిద. కానీ దానికే ఎంత whole body dedication అవసరమో తెలిసాక, నా చిన్నప్పటి కుమ్మరులకే కాదు, ఈ దేశంలోని ప్రతి ఒక్క కుమ్మరికీ మనసులో నమస్సులు అర్పించుకోకుండా ఉండలేకపోయాను.
మానవజాతి గమనాన్ని మార్చిన మూడు మహత్తర ఆవిష్కరణలు చరిత్రపూర్వయుగంలోనే జరిగాయని చరిత్రకారులు చెప్తారు. నిప్పు చెయ్యడం, ధనుర్బాణాలు, కుమ్మరి చక్రం- ఈ మూడూ మానవుణ్ణి చరిత్రపూర్వయుగంలోంచి చరిత్రయుగంలోకి ఒక్క గెంతులో ముందుకు దూకించిన ఆవిష్కరణలు. గతించిపోయిన మహానాగరికతల్ని గుర్తుపట్టడానికి ఇవాళ మనం వెతుక్కునే మొదటి ఆనవాళ్ళు మృణ్మయపాత్రలే. మానవ పరిణామాన్ని ముందుకు నడిపించినవాళ్ళల్లో కుమ్మరులు ముందున్నారనడానికి అదే గుర్తు.
నిన్న జ్యోతి వెలిగించి వర్క్ షాపు ప్రారంభించాక అదే చెప్పాను. మన విద్యాప్రణాళికలో కుమ్మరం, కమ్మరం, వడ్రంగం, తోటలపెంపకం, తేనెటీగల పెంపకం లాంటివాటికి చోటులేకుండా పోయాకనే మన పాఠశాలలు నిస్సారంగా తయారయ్యాయి. ఒకప్పుడు పాఠశాలల్లో డ్రాయింగు మాస్టర్లు ఉండేవారు. రెడ్డిగారు అలా ఒక డ్రాయింగు టీచరుగా పనిచేసినవారే. ఆయన వల్లనే ఈ రోజు అత్తాపూరులాంటి చోట ఒక కళాక్షేత్రం తలెత్తడమే కాదు, ఎందరో యువతీ యువకులు ప్రింట్ మేకింగ్ వృత్తిగా, ప్రవృత్తిగా సాధనచేస్తున్నారు. నా వరకూ తాడికొండలో మా ఆర్టు మాష్టారు వారణాసి రామ్మూర్తిగారే లేకపోయుంటే నేను నా సున్నితహృదయాన్ని కాపాడుకోగలిగి ఉండేవాణ్ణే కాను.
కానీ కేవలం డ్రాయింగు, చిత్రకళ మాత్రమే కాదు. గ్రామీణ ఆర్థికవ్యవస్థకి ఆలంబనగా ఉండే వృత్తుల్లో కనీసం మూడు నాలుగైనా ప్రతి ఒక్క విద్యార్థీ నేర్చుకోగలిగేట్టుగా ఉండాలి. నిన్న నాకు అర్థమయిందేమంటే, ఆ చేతిపనుల వల్ల కేవలం కౌశల్యం మాత్రమే కాదు, fine motor skills పెంపొందడమే కాదు, అన్నిటికన్నా ముందు మానవశ్రమ పట్ల, కాయకష్టం పట్ల గొప్ప గౌరవం పెంపొందుతుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కళలకీ, నైపుణ్యాలకీ చోటులేదు. ఉన్నసమయమంతా సిలబసు కవరు చేయడానికే సరిపోవడం లేదంటారు. చాలా గురుకుల పాఠశాలలల్లో చాలా ఖాళీస్థలం ఉంటుంది. పదెకరాలనుంచి యాభై ఎకరాల దాకా ఖాళీస్థలం ఉండే పాఠశాలలు కూడా చూసాన్నేను. వాటిలో పండ్లతోటలు పెంచవచ్చుకదా అనే కల నన్నూరిస్తూనే ఉండేది. ‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం’ కరికులంలో భాగమైనప్పుడే భారతీయ విద్య సార్థకమవుతుంది. కేవలం గణితం, అరకొర ఇంగ్లిషు, పనిచెయ్యని లాబరేటరీల్లోంచి భావిభారతపౌరులు రూపొందుతారనుకోవడం ఒక భ్రమ.
ఈ మెలకువ పొందినవాడు కాబట్టే గాంధీగారు జీవితకాలం పాటు విద్యతో చేసిన ప్రయోగాలు ఆయాన్నొక నయీ తలీం వైపు తీసుకువెళ్ళిన సంగతి మనకు తెలుసు. ఒక్క పాఠశాలలోనేనా, ఒక్క ఉపాధ్యాయుడేనా, ఒక్క వృత్తి కౌశల్యాన్ని పిల్లలకు నేర్పడానికి ప్రయత్నించినా ఆ కృషి కాలాంతరంలో తీసుకురాగల సత్ఫలితాలెలా ఉంటాయో బి.ఏ.రెడ్డిగారు ఒక ఉదాహరణ, ఆయన స్ఫూర్తితో వికసిస్తున్న ఇలాంటి కళాక్షేత్రాలు మరొక ఉదాహరణ.
24-2-2025
“అన్నిటికన్నా ముందు మానవశ్రమ పట్ల, కాయకష్టం పట్ల గొప్ప గౌరవం పెంపొందుతుంది.”
True , Sir.
“
నిప్పు చెయ్యడం, ధనుర్బాణాలు, కుమ్మరి చక్రం- ఈ మూడూ మానవుణ్ణి చరిత్రపూర్వయుగంలోంచి చరిత్రయుగంలోకి ఒక్క గెంతులో ముందుకు దూకించిన ఆవిష్కరణలు. గతించిపోయిన మహానాగరికతల్ని గుర్తుపట్టడానికి ఇవాళ మనం వెతుక్కునే మొదటి ఆనవాళ్ళు మృణ్మయపాత్రలే. “
Appreciate this fact and how related it to the current topic.
🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
మళ్లీ మమ్మల్ని మా బాల్యంలోకి తీసుకు వెళ్మాలి ఊరి కుమ్మరివాడను చూపించారు. మా బళ్లో మాకు వడ్రంగం, బుక్ బైండింగ్ నేర్పించి , పశువులకొమ్ములతో మా చేత దువ్వెనలు చేయించిన జూపాకలింగయ్య క్రాఫ్ట్ మాస్టర్ను స్మతింపజేసారు. నమస్సులు.
ధన్యవాదాలు సార్
మధురం. రెడ్డి గారి గ్రామీణ పిల్లల డ్రాయింగ్ స్కూల్ ను నేను 80 లలోనే చూసాను. చాలాసార్లు అక్కడ గడిపాను. వారితో, పిల్లలతో మాట్లాడి ముచ్చట తీర్చుకున్నాను. నేను “ఎన్నెల” అనే NGO ను చాలాకాలం నడిపాను. అప్పుడు తరచూ రాజేంద్రనగర్ లోని NIRD కి వెళ్లి వస్తుండే వాడిని. ఎంత బిజీ గా ఉన్నా అక్కడ కాసేపు ఆగడం గొప్ప రిలీఫ్. వారి అల్లుడు రాజేశ్వర రావు ప్రఖ్యాత చిత్రకారుడు అంత్యాకుల పైడిరాజు మాష్టారి అబ్బాయి. పైడిరాజు గారితో విశాఖ లో నాకు మధురమైన స్నేహం ఉండేది. మీ అనుభవం చదివితే అవన్నీ గుర్తొచ్చాయి.
నా చరిత్ర నవలల్లో హీరో లేదా ధనవంతుడి అబ్బాయిగా కుమ్మరి వృత్తి వారిని చూపుతాను. ప్రాచీనకాలంలో గొప్ప వ్యాపార కుటుంబాలుగా కుమ్మర్లను చూపాలని నా భావన. నమస్సులు మీరు. ప్రమిదను తయారు చేసినందుకు.
ధన్యవాదాలు సార్!
ఒక కార్యక్రమానికి అతిథిగా హాజరైన మీరు అక్కడి కార్యక్రమానన్ని అసాంతం కళ్ళాకు కట్టినట్టు మాముందుకు తెచ్చారు. బి.ఏ. రెడ్డి గారు నిత్య కళా సేవకులు.
ధన్యవాదాలు సార్