ఫాల్గుణమాసపు మామిడి పిందె

ఎం. కేశవరావు, సర్వమంగళ ఇద్దరూ కూడా ఫేస్ బుక్ లో నా మిత్రులు. ఏడెనిమిదేళ్ల కిందట నేను బరంపురం వెళ్ళినప్పుడు వాళ్ళని కలుసుకున్నాను. అదే మొదటిసారి. వాళ్ళు కలకత్తాలో ఉంటారనీ , తెలుగు సాహిత్యమంటే చాలా మక్కువకలిగినవాళ్ళనీ వాళ్ళ గురించి విజయచంద్ర పరిచయం చేశారు. ఆ తర్వాత వారిద్దరూ ఫేస్ బుక్ మాధ్యమంలో నాకు మిత్రులుగా మారిన తర్వాత వాళ్ళ పోస్టులు చూస్తూఉంటే నాకు అర్థమయిందేమంటే వాళ్ళు కేవలం సాహిత్యాభిమానులు మాత్రమే కారనీ, అన్నిటికన్నా ముందు ఆదర్శవ్యక్తులుగా జీవితం జీవించడానికి తపిస్తున్నవాళ్ళనీ అర్థమయింది. ఆ భార్యాభర్తలు, వారి అమ్మాయి- వారు ఒకరి నమ్మకాలని, కృషిని మరొకరు గౌరవించే పద్ధతిని , ఒకరి కృషికి మరొకరు తోడ్పాటు నందించే పద్ధతిని చూస్తూ ఉంటే నాకు వాళ్ళ పట్ల గొప్ప గౌరవం బలపడుతూ వచ్చింది.

కేశవరావు కలకత్తా మునిసిపల్ కార్పొరేషన్ పరిథిలో ఉండే టిటాగర్ లో ఒక ఆంధ్ర స్కూలులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు . ఆయన కొన్ని పుస్తకాలు కూడా రాశారు. జాగృతి సమీక్ష అనే పత్రికకి సంపాదకులు గా పనిచేస్తున్నాడు. సర్వమంగళ ఆ పత్రికకి ప్రచురణ కర్తగా ఉన్నారు. ఆమె కూడా నేమిసేస్ అనే ఒక కవితాసంపుటి వెలువరించారు.

తెలుగుకోసం, తెలుగు సాహిత్యం కోసం, తమ చుట్టుపక్కల తెలుగువాళ్ళల్లో చైతన్యాన్ని ప్రోదిచెయ్యడం కోసం వాళ్ళు చేపట్టే చిన్న చిన్న ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో ఒకరిపట్ల ఒకరు చూపించే పరస్పర గౌరవం, యిష్టం చూస్తూ ఉంటే నాకు ఎప్పటిదో సోవియేట్ సమాజానికి చెందిన ఇద్దరు సహచరుల కథ చదువుతూ ఉన్నట్టుగా ఉంటుంది. సామాజిక శ్రేయస్సునీ, అభ్యుదయాన్నీ, ప్రగతినీ కోరుతూ, అందుకోసం కలిసి పనిచేసే ఇటువంటి సహచరులు ఇక్కడ మన మధ్య కూడా ఉండి ఉండవచ్చుగానీ, ఇలా తమ ప్రయత్నాల్ని, చిన్నవో, పెద్దవో, ఇలా నిష్కపటంగా, నిజాయితీగా, సెలబ్రేట్ చేసుకునేవారిని మాత్రం  నేనెవరినీ చూడలేదు.

వారిద్దరు ఫేస్ బుక్ లో షేర్ చేసే పోస్టుల్లో నన్ను బాగా ఆకట్టుకునేది ఎటువంటి పటాటోపం లేకపోవడం. Hate speech ఎక్కడా కనిపించకపోవడం. తమ రోజులో ప్రతి ఒక్క క్షణాన్నీ తోటిమనుషులకోసం వినియోగించాలన్న ఔదార్యం మాత్రమే ఆ రాతలలో కనిపిస్తుండటం.

నేను వాళ్ళ పోస్టులమీద ఎప్పుడూ వివరంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. వారితో ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలూ కూడా నడపలేదు. కానీ ఇప్పుడిలా ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చెయ్యవలసిన ఒక సందర్భం ఏర్పడింది కాబట్టి ఈ నాలుగు వాక్యాలూ రాయడానికి కూచున్నాను.

ఆ మధ్య తామొక తెలుగు కాలెండర్ తెస్తున్నామనీ ఆ కాలెండరులో ప్రతి నెలా ఒక తెలుగు కవిత కూడా పొందుపరుస్తున్నామనీ, అలా ఒక నెలకి నా కవిత కూడా ఒకటి ప్రచురించుకోడానికి అనుమతినివ్వమంటూ వారినుంచి కొన్ని రోజుల కిందట ఒక మెసేజి వచ్చింది. ముందు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏటా వార్షిక సంకలనాలు తెచ్చేవాళ్ళు కొందరున్నారు. వారికి నేను తెలుసు. బాగానే తెలుసు. నేను కవిత్వం రాస్తుంటానని కూడా వారికి తెలుసు. కాని వారు గత పదేళ్ళల్లో తమ వార్షిక సంకలనాల్లో ఇప్పటిదాకా నా కవిత ఒక్కటికూడా ఎంపికచేసింది లేదు. అలాంటిది ఎక్కడో బెంగాల్లో ఉన్న తెలుగు మిత్రులు నా కవిత కావాలనీ అది కూడా తాము ప్రచురించబోయే తెలుగుకాలెండరులో వేసుకోడానికనీ అడిగినప్పుడు ఆశ్చర్యపోకుండా ఎలా ఉంటాను? ‘నా కవితలన్నిటిమీదా మీకు పూర్తి హక్కులున్నాయని’ జవాబిచ్చానుగాని, ఏ కవిత ఎంచుకున్నారు అని అడగలేదు.

వాళ్ళు సామాజిక పరివర్తనకోసం కృషి చేసేవాళ్ళు కాబట్టీ, సామాజిక అన్యాయానికీ, అసమానతలకీ వ్యతిరేకంగా గొంతు విప్పేవారుకాబట్టీ, నా కవిత్వంలో వారి అవసరాలకి తగ్గట్టుగా ఏ కవితని ఎంచుకుంటారా అన్న కుతూహలమైతే లేకపోలేదు. అసలు వారి కాలెండరుని స్ఫూర్తిమంతం చేయడానికి, వారి ఆశయాలకు తగ్గట్టుగా ఉండే  మంచి కవిత్వం రాసిన కవులు మరెందరో ఉన్నారు కదా, వారెవరినయినా అడిగి ఉండవలసింది అని కూడా అనుకున్నాను. కానీ తొందరలోనే ఆ విషయం మర్చిపోయాను.

తీరా మొన్న కొరియర్లో ఆ కాలండరు మా ఇంటికొస్తే తెరిచి చూద్దును కదా, జనవరి నెల పక్కనే నా ఈ కవిత కనిపించింది:

అచ్చంగా నా కవితలానే

ఫాల్గుణమాసపు తొలిమామిడి పిందె
కొమ్మను వేలాడుతున్న కాలం
దానిలో భూగర్భ రహస్యాలతో పాటు
ద్యులోక సంగీతం కూడా మిళితమైంది.

ఆశ్చర్యం, మామిడిచెట్టుకి మళ్ళీ
మామిడిపిందె, అచ్చం నా కవితలానే
అదే రంగు, అదే ఒంపు, అదే వగరు
ఆ తొడిమ చుట్టూ మళ్ళీ అదే జీడి చార.

నా ఆశ్చర్యానికి అవధి లేదు. ఎప్పటి కవిత ఇది! నీటిరంగుల చిత్రం (2014) లో కవిత. అప్పుడే అనుకున్నాను, ఈ కవిత ఎవరిని చేరగలదని? ఎందుకంటే, ఒక ఎమోషన్ ని subtle గా కవితగా కూర్చినప్పుడు దాన్ని చేరగల పాఠకులు అరుదైపోతారు. కానీ ఈ కవిత నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మహనీయులైన యూరపియన్ కవుల శుశ్రూషలో కాలం గడుపుతున్నప్పుడు రాసిన కవిత ఇది. మా కాలనీలో ఒక ఫాల్గుణమాసంలో పిందె పట్టిన మామిడిచెట్టుని చూసినప్పుడు అది నాలో కలిగించిన సంవేదనని ఎలా కవితగా మార్చాలో తెలియక కొట్టుమిట్టాడేను. చివరికి ఒక రేనర్ మేరియా రిల్క మా కాలనీలో ఆ మామిడిచెట్టుని చూసి ఉంటే ఏమని కవిత చెప్పేవాడా అని ఆలోచిస్తూ ఉండగా స్ఫురించిన వాక్యాలివి.

ఈ కవిత ఇప్పుడు కలకత్తాకి చేరిందంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మనుషుల్ని ప్రేమించడం ఒక స్వభావంగా మారినవాళ్ళు తప్ప మరొకరెవరూ ఈ సున్నితస్పందనని గమనించలేరు, గమనించినా ఇలా ఒక పతాకలాగా పైకి ఎగరెయ్యలేరు.

ఈ పదేళ్ళల్లో నా చుట్టూ ప్రపంచం మరింత మారింది. ఇప్పుడు జీవితాన్ని ప్రేమిస్తే చాలదు, మన ప్రేమని ప్రకటించుకోడానికి మరొకరి ప్రేమనో, కృషినో, విశ్వాసాల్నో చిన్నబుచ్చకపోతే తప్ప మన భావాలకు గుర్తింపుదొరకదనే ఒక ఆతృత సకలమాధ్యమాల్నీ చుట్టబెడుతున్న కాలంలో ఉన్నాం. మరొకరికన్నా నువ్వు గొప్పవాడివని చెప్పుకోడానికి వాణ్ణి చిన్నబుచ్చడమే సులభమార్గంగా ఎంచుకుంటున్న కాలంలో ఉన్నాం.

ఇటువంటి రోజుల్లో ఎప్పుడో నేను రాసిన (కాదు, నాకోసం నేను రాసుకున్న) ఒక కవితను తాము ఎంపికచేసుకుని తమ కాలెండరులో, అది కూడా మొదటినెలలోనే చోటిచ్చిన ఆ సంపాదకులకు ఏమని ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదు. నిజానికి ఒక కవికి ఇంతకు మించిన పురస్కారం ఉంటుందని కూడా అనుకోను.

కేశవరావుగారు, సర్వమంగళ గారూ, మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను. ఎప్పుడేనా కలకత్తా వస్తే ఒక సాయంకాలం మీతో కలిసి గంగా నది ఒడ్డున కూచోవాలని ఉంది.  మీరెప్పుడేనా హైదరాబాదు వస్తే మా ఇంటికి అతిథులుగా రమ్మని కోరుకుంటున్నాను.

19-2-2025

21 Replies to “ఫాల్గుణమాసపు మామిడి పిందె”

  1. చదువుతుంటే ఎంత సంబరమనిపించిందో

  2. మీ కవిత పుట్టిన విధము
    వారు అందిపుచ్చుకుని “పతాక గా ఎగురవేసిన” వైనము
    ఆ మామిడి పిందె నింపుకున్న “ద్యులోక సంగీతము”
    మీరు చెప్పిన ఈ వివరము
    అన్నీ beautiful Sir 🙏🏽

  3. కాలెండరు లో కవితలు.. చాలా ఆసక్తికరంగా వుంది. చక్కని అభిరుచి.
    మీకు, వారికి అభినందనలు. 💐💐

  4. అబ్బా ఎంత హృద్యంగా చెప్పారండీ. గొప్ప ఆదర్శ దంపతులను పరిచయం చేస్తూ, మరో అందమైన కవిత నేపథ్యం గురించి వివరిస్తూ.. అలాగే ఎన్నో సార్లు జరిగినట్టు మీ పోస్టు ద్వారా మరో గొప్ప రచయిత/కవి పేరు మొదటిసారి తెలుసుకున్నాను. రైనర్ మరియా రిల్కే పేరు మీరు ఈ పోస్టు ద్వారా తెలపడం చాలా ఆనందం కలిగించింది.

  5. ఉహలు- ఊసులు - సంధ్య – ... జీవితం ఏమిటి అన్న ప్రశ్న కు.... సమాధానం వెతుకుతూ... సాగుతున్న జీవితం...
    Sandhya yellapragada says:

    ఆ జనవరి ఎంతటి అదృష్టానికి నోచుకుందో. వందనములు

  6. తెలుగు వారు మరచిపోలేని మా మంచి కవి, రచయిత మీరు. సాహిత్యంతో మానవతా పరిమళాలను వెదజల్లుతున్న పున్నాగ చెట్టు మీరు. ఆ సువాసనలు అలా వ్యాపిస్తుంటాయి…💐💐💐💐

  7. చాలా సార్లు అనుకుంటాను మీరు వేరే లోకానికి….మరింత సున్నితమైన సూక్ష్మమైన లోకానికి చెందినవారేమో అని. కలుషితమైన గాలిని శుభ్రపరచే పరికరం మీరు సృజించే సాహిత్యం. కృతజ్ఞత కన్నా ఉన్నతమైన భావన మరొకటుండదేమో అనిపిస్తుంది మీ కవితలు చదువుతుంటే.

    1. శిరస్సు వంచి మౌనంగా హృదయంలోనే ఒక నమస్కారం పెట్టుకోగలగడమే ఈ వాక్యాల పట్ల నేను చేయగలిగింది.

      1. ఉగాది ముందే వచ్చింది!
        ప్రతిభని గుర్తించటం అందరివల్లా కాదు!
        ఆ దంపతులకి నా హృదయపూర్వక నమస్కృతులు!

  8. ఫాల్గుణ మాసం
    పేరు వింటూనే అదో సంబురం ..
    మీ కవితాక్షరాలు లేత మామిడి సువాసనలు వెదజల్లుతూ….
    అద్భుతమైన పదచిత్రం.🙏

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%