
డా. కొండపల్లి శేషగిరిరావుగారి శతజయంతి సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రకళా ప్రదర్శన ఈ రోజుతో ముగుస్తోందని వేణుగోపాల రావుగారు మెసేజి పెడితే సాయంకాలం వెళ్ళాను.
స్టేట్ గాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ లో నాలుగు గాలరీలనిండా ఒక్క చిత్రకారుడి చిత్రాల ప్రదర్శన చాలా అరుదుగా జరుగుతుంది. అసలు నాలుగు గాలరీలు నిండేటన్ని చిత్రలేఖనాల్ని ప్రదర్శించే సందర్భాలు కూడా చాలా అరుదు. అలా ప్రదర్శించినప్పుడు కూడా మొత్తం ప్రదర్శనలో నాలుగైదు చిత్రలేఖనాలు మించి ఆకట్టుకునేవి కనిపించకపోడం కూడా మామూలే. కాని మొదటిసారిగా, నాలుగు గాలరీల్లోనూ కూడా ప్రతి ఒక్క చిత్రలేఖనమూ చూపరుల్ని నిలిపి, తన దగ్గర పట్టి ఉంచేలాంటి వర్ణచిత్రాలు కావడం ఇవాళే చూసాను. కొండపల్లి శేషగిరిరావుగారి జీవితకాల తపస్య తాలూకు విశేషం అది.
దాదాపు పదిపదిహేనేళ్ళ కిందట నా మిత్రుడు కవితాప్రసాద్ సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా ఉన్నప్పుడు కళాభవన్ లో ఏర్పాటు చేసినప్పుడు చూసాను, మొదటిసారి శేషగిరిరావుగారి చిత్రాల్ని. మొన్న ఆయన మీద వ్యాసం రాస్తున్నప్పుడు, ఆయన మీద ఇటీవల వెలువరించిన సంచికలో బొమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు ఆనాడు నేను మొదటిసారి చూసిన ప్రదర్శననే పదేపదే జ్ఞాపకం వస్తూ ఉండింది.
సాధారణంగా ఏ చిత్రలేఖనమైనా, ఎంత బాగా ఫొటో తీసి, ఎంత బాగా ముద్రించినా, ఏ సైజులో ముద్రించినా, ఆ ఒరిజినల్ చిత్రాన్ని చూడటంలో ఉండే అనుభూతిని తిరిగి అందివ్వలేదని చెప్తారు. అందుకనే ఇంత టెక్నాలజీ వృద్ధి చెందిన తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా మూజియాలకి, గాలరీలకీ సందర్శకులు విరగబడూతూనే ఉన్నారు. ఇందుకు శేషగిరిరావుగారి చిత్రలేఖనాలు కూడా మినహాయింపు కాదని ఇవాళ మరోసారి అనుభవానికొచ్చింది.
ఆ రోజు కవితాప్రసాద్ తో కలిసి చూసినప్పుడు రామాయణ చిత్రలేఖనాలు, శాకుతలం చిత్రలేఖనాలు మమ్మల్ని నివ్వెరపరిచిన అనుభూతి నాకింకా స్పష్టంగా గుర్తుంది. ముఖ్యంగా శకుంతల నదిలో నిలబడి నదీమతల్లికి నమస్కరిస్తున్నప్పుడు ఆమె అంగుళినున్న ఉంగరం కిందకు జారి చేప నోటిలో పడుతున్న చిత్రం దగ్గర ఆ రోజు మేము చాలా సేపే నిలబడిపోయాం. ఈ రోజు మళ్ళా ఆ చిత్రం చూసినప్పుడు మళ్ళా అంతే కొత్తగా, అంతే రసస్ఫోరకంగా కనిపిస్తూ ఉంది.
కాని ఈ రోజు నాకు లభించిన ఆనందం ఆ పౌరాణిక చిత్రలేఖనాల దగ్గర కాదు. గాలరీ మొదటి అంతస్తులో మొదటి రెండు హాళ్ళల్లోనూ ఆ నిలువెత్తు తైలవర్ణచిత్రాలుండగా, మూడవ, నాలుగవ హాళ్ళల్లో నేనింతదాకా చూడని, నీటిరంగులు, రేఖాచిత్రాలు, ఎచింగ్స్ ఉన్నాయి.
ఈ విభాగాన్ని చూడటం చాలా హృద్యంగా అనిపించింది. మొదటి రెండు హాళ్ళల్లో ఉన్నది ఒక కావ్యప్రపంచం, ఒక మనోజ్ఞసీమ, ఒక mytho-poetic space.
కాగా, ఈ రెండుహాళ్ళల్లోనూ ఉన్నది దక్కన్ సీమ, తెలంగాణా గ్రామసీమలు, చెట్లు, రాళ్ళు, పూలు, పక్షులూను.
ఆ మొదటి ప్రపంచానికీ ఈ రెండో ప్రపంచానికీ పోలికనే లేదు. మొదటి రెండు హాళ్ళల్లోనూ నడుస్తున్నంతసేపూ గంభీరమైన పద్యాలు వింటున్నట్టుంది. కాని ఈ హాల్లో తిరుగుతున్నప్పుడు తెలంగాణా పల్లెపాట వింటున్నట్టుంది.
మొదటి విభాగంలో తిరుగుతున్నప్పుడు విశ్వనాథ కల్పవృక్ష పద్యాలు వింటున్నట్టూ, రెండో భాగంలో కిన్నెరసాని పాట వింటున్నట్టూ ఉందని చెప్తే మరింత సరిగ్గా చెప్పినట్టు అవుతుంది.
ఆ చిత్రకారుడు ఎంత విస్తారమైన ప్రపంచాన్ని మనకు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు! ఈ చిత్రాల్ని ఇలా కాపాడుకుంటూ వస్తున్నందుకు వేణుగోపాల రావుగారికి, నీహారిణిగారికి తెలుగుజాతి ఎంతైనా ఋణపడి ఉంటుంది. నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ చిత్రలేఖనాల్ని ప్రభుత్వం కొని కొత్తగా కట్టిన సెక్రటేరియట్ లో పెట్టవచ్చునా? కాని అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే కొన్నేళ్ళ తరువాత సెక్రటేరియట్ మరమ్మత్తు చేయవలసి వస్తే ఆర్&బి ఇంజనీరులు ఈ కాన్వాసుల్ని స్టోరు రూములో పారేస్తారు. లేదా ఏదన్నా కార్పొరేట్ హవుజ్ కొనుగోలు చేయవచ్చునా? అప్పుడవి ప్రజలకి దూరంగా వెళ్ళిపోతాయి. అభిరుచి కలిగిన వ్యక్తులు కొనుగోలు చేస్తే కొన్నాళ్ళ పాటు వాటికి రక్షణ ఉంటుందిగాని నెమ్మదిగా అవి ప్రజాస్మృతిలోంచి కనుమరుగైపోతాయి. మరి వీటినెలా భద్రపరచడం? బహుశా ప్రభుత్వమే స్టేట్ మూజియంలోనో, శిల్పారామంలోనో రెండు హాళ్ళు ఈ చిత్రాలకు కేటాయించి, ఒక శాశ్వత గాలరీ ఏర్పాటు చెయ్యవచ్చును. ఎందుకంటే తెలంగాణాకి సంబంధించి ఇంత సమగ్రమైన చిత్రకళాసృష్టి మరొకచోట మనం కనలేమని చెప్పగలను.
కానీ ఈ ఊహలు నాకు తృప్తినివ్వలేదు. బొమ్మలు గియ్యడంతోటే శేషగిరిరావుగారి అన్వేషణ పూర్తయిపోయిందని చెప్పవచ్చు. కాని ఆ చిత్రకళా సరస్వతి ఆయన చేసిన అర్చనను మాత్రం వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఈ వారసత్వాన్ని కేవలం తెలంగాణాకే పరిమితం చెయ్యలేం. ఈ చిత్రాలు యావత్ప్రపంచపు ఆస్తి. ఈ బొమ్మల్ని ఎలా భద్రపరచాలి అని నేను ఆలోచిస్తున్నానుగాని, ఆ బొమ్మలే తమని తాము కాపాడుకోగలవని అనుకున్నాక గానీ నాకు మనశ్శాంతి చిక్కలేదు.
6-2-2005
ఆహా కళ్ళకు కట్టినట్టుగా వర్ణించారు శేషగిరి రావు గారి చిత్రాల ఎగ్జిబిషన్.. మాచేత మీరు ఆ ప్రదర్శనశాలలో వున్న పెయింటింగ్స్ మొత్తం వివరాలు, విశేషాలు చెబుతూ అద్భుతమైన టూర్ చేయించారు సార్. అనేక ధన్యవాదాలు.
– విజయసారథి జీడిగుంట
ధన్యవాదాలు సార్!
ఆ బొమ్మలే తమని తాము కాపాడుకోగలవని అన్న మాట బొమ్మలకే కాదు అన్ని పరిణత కళారూపాలకు అని సార్వకాలిక సత్యం గా గ్రహించవచ్చుననిపిస్తుంది. తరానికొకరిని మీ వంటి రసజ్ఞులను ఆ కాలమే సృష్టించుకుంటుంద నిపిస్తుంది. లేకపోతే 2000 ఏండ్ల కిందటి సెనెకా ఉత్తరాల గురించి మాకు తెలిసేవా? ఇది ఒక ఉదాహరణ మాత్రమే అలాంటి అద్భుత ప్రపంచ వ్యాప్తమైన కళావిష్కరణలు మీ వల్ల ఎన్ని జరగలేదు. కొండపల్లి వారి చిత్రాలు ప్రపంచపు ఆస్తి ఐతే మీరు తెలుగుపాఠకులకు దొరికిన మేలుబంతి. మీకు నమస్సులు.
హృదయపూర్వక నమస్కారాలు సార్!