
ఎం. ప్రగతి గారు హిందూపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రినిసిపాలుగా పనిచేస్తున్నారు. ఆమె రాసిన ఈ తిరుపాలమ్మ కథ పత్రికలో వచ్చినప్పుడే (30-4-2023) చదివాను. కాని ఇవాళ ఈ కథని ఇక్కడ పరిచయం చెయ్యడానికి రెండు కారణాలు.
మొదటిది, ప్రభుత్వం మళ్ళా డిటెన్షన్ సిస్టమ్ మొదలుపెడుతోందనీ, అందుకు తగ్గట్టుగా విద్యాహక్కు చట్టంలో మార్పులు తేబోతోందనీ ఎక్కడో ఒక వార్త చదివాను. ఇది సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల పిల్లలకి ఎంత పెద్ద ఆఘాతంగా పరిణమించబోతోందో చెప్పలేను. పిల్లల విద్యాప్రమాణాలు ఎందుకు కుంటుబడ్డాయంటే సాధారణంగా ఉపాధ్యాయులూ, ఉపాధ్యాయ సంఘాల నాయకులూ చెప్పేది నాన్-డిటెన్షన్ సిస్టమ్ వల్లనేనని. వాళ్ళు అలా చెప్పినప్పుడల్లా ముప్ఫై ఏళ్ళకిందట ప్రొ.శశిధర రావుగారు చెప్పిన మాటలు నాకు గుర్తొస్తాయి. అప్పుడు నేను ఉట్నూరులో గిరిజనసంక్షేమాధికారిగానూ, ఆయన విద్యాశాఖాధికారిగానూ పనిచేసేవాళ్ళం. ఎవరేనా ఉపాధ్యాయుడు తప్పంతా నాన్-డిటెన్షన్ సిస్టమ్ మీదకు నెట్టేయబోతే ఆయన కళ్ళల్లో నిప్పులు కురిసేవి. ‘ఏమి! ఏడాదికి కనీసం నూట ఎనభై రోజులు ఆ పిల్లవాడు నీ దగ్గరే కదా ఉన్నాడు. అంటే ఆరునెలలపాటు మీరిద్దరూ కలిసి స్కూల్లో గడిపినా వాడికి అక్షరం ముక్క రాలేదంటే ఎవరిది తప్పు?’ అనడిగేవాడు ఆయన. హాజరు విషయంలోనే ఇంత unconcerned గా ఉన్న వ్యవస్థ రేపు పిల్లల పరీక్షల దగ్గరికి వచ్చినప్పుడు ఇంతే unconcerned గా ఉండదని గ్యారంటీ ఏమిటి? కాని ఇదుగో ఈ కథలో లాగా అరుదుగా ఎవరో ఒకరో ఇద్దరో ఉపాధ్యాయులుంటారు, తమ నైతికబాధ్యతని మర్చిపోనివాళ్ళు.
ఇక రెండో కారణం- ఈ కథ 2023 లోనే వచ్చినా ఏ వార్షిక సంకలనాల్లోగాని, ఏ ప్రత్యేక కథా సంకలనాల్లోగాని మీరు చూసేరా? ఇంతకన్నా ముఖ్యమైన సామాజిక సమస్య మరేముంటుంది గనుక ఒక కథకుడు కథగా మలచడానికి? ప్రతి ఏటా క్రమం తప్పకుండా వార్షిక సంకలనాలు తెచ్చే ఒక సంపాదకుణ్ణి ‘ఈ కథ మీ 2023 సంకలనంలో ఉందా?’ అనడిగాను. ‘అది 2024 లో కదా వచ్చింది’ అన్నాడాయన! అందుకనే వార్షిక సంకలనాల్లోనూ, ప్రత్యేక సంకలనాల్లోనూ ఆ పదిమందీ తప్ప మరో కొత్త కథకుడు కనబడడు మీకు. కథల గురించిన మన డిస్కోర్సు వార్షిక సంకలనాలకీ, ప్రత్యేక సంకలనాలకీ మాత్రమే పరిమితమవుతున్నంతకాలం ఇటువంటి మణిపూసల్ని మనం చేజార్చుకుంటూనే ఉంటాం!
తిరుపాలమ్మ
ఎం.ప్రగతి
నా పేరు తిరుపాలమ్మ…!
దిగ్గున లేచి కూర్చున్నా. వొళ్లంతా చెమటలు. టైం చూద్దామని మొబైల్ ఆన్ చేశాను, ఒకటిన్నర. మొబైల్ మూసేసి పడుకోవడానికి ప్రయత్నించాను. నిద్ర రాలేదు, రాదనీ తెలుసు. యిలా అర్ధరాత్రి దాటాక తిరుపాలమ్మ కలలోకొచ్చి, వులిక్కిపడేలా లేపటం యిది మొదటిసారి కాదు, బహుశా చివరిసారి కూడా కాదు. నాలుగేళ్ల నుంచి రెండు మూడు నెలలకోసారి ఇలా జరుగుతూనే వుంది. తి…రు…పా…ల…మ్మ…! నన్ను వెంటాడుతున్న అయిదక్షరాల పేరు మాత్రమేనా?
*
చచ్చేంత చిరాగ్గా వుంది నాకు. గెజిటెడ్ హోదా… అదీ డిగ్రీ విద్యార్థులను తీర్చిదిద్దే అత్యంత గౌరవనీయమైన అధ్యాపక వృత్తిలో వుండి, మండుటెండల్లో చెమటలు కార్చుకుంటూ, పాంఫ్లెట్స్ పట్టుకొని వూరూరూ తిరుగుతూ, “బాబ్బాబు… మా కాలేజీలో చేరండి. అమ్మా, అయ్యా మీ పిల్లల్ని మా కాలేజీలో చేర్చండి.” అంటూ అడుక్కోవడమేంటి అసహ్యంగా. యేంచేస్తాం, తప్పదు మరి! యేడేళ్ల క్రితం నేను యిదే కాలేజీలో పన్జేసినప్పుడు పద్నాలుగొందలమంది పిల్లలుండేవారు. యిప్పుడా సంఖ్య ఆరొందలకు పడిపోయింది. కాలేజీలు నిలబడాలన్నా, పోస్టులు పోకుండా కాపాడుకోవాలన్నా తప్పదు, వూళ్లన్నీ తిరిగి పిల్లలను రాబట్టుకోవాలి ప్రైవేట్ కాలేజీలకు మల్లే.
“సీమ పల్లెలు ఎప్పుడూ చూసెరగం కదా, పోనీలే యిప్పుడన్నా చూడొచ్చు.” అంటూ పక్కకు చూశాను. యేదీ యీ ప్రసన్న?
నాతోపాటు క్యాంపెయిన్ కి వచ్చిన ఎకనామిక్స్ లెక్చరర్ ప్రసన్న, యెటు పోయింది? చుట్టూ చూస్తే ఓ చిన్న గుడిలో నుంచి వస్తోంది ప్రసన్న చేతిలో పాంఫ్లెట్స్ విసనకర్రలా వూపుకుంటూ.
చిరాకు మరింత పెరిగి “యెక్కడికెళ్లినా యీ గుళ్ళూగోపురాలూ వొదిలిపెట్టవా?” అన్నాను. ప్రసన్న నాకంటే యేడెనిమిదేళ్లు చిన్నది, ఆ చనువుతోనే పేరుపెట్టి పిలుస్తాను.
“గుళ్లోకి దేవుణ్ని పలకరించడానికి పోలేదు మేడమ్. జనాలు దండిగా వుంటారు కదా, వొకేసారి చాలామందిని కలవొచ్చు. చూడండి యెన్ని పాంఫ్లెట్స్ అయిపోయాయో?” చేతిలో పాంఫ్లెట్స్ వూపుతూ అన్నది.
“సరెసర్లే పోదాం పదా!” ముందుకు నడిచాన్నేను.
ఒక్కో సందు తిరుగుతూ, యింటర్మీడియట్ చదువుతున్న పిల్లలున్నారేమోనని వాకబు చేస్తూ ముందుకు సాగుతున్నాం.
“యే ప్రైవేటు కాలేజీలోనూ లేని వసతులు మా గవర్నమెంట్ కాలేజీలో వున్నాయి. మంచి లైబ్రరీ, ఆధునిక పరికరాలున్న లేబరేటరీలు, డిజిటల్ క్లాసు రూములు, కంప్యూటర్లు, క్వాలిఫైడ్ లెక్చరర్లు…” నలుగురు పోగయినచోట గొప్పగా చెబుతున్నాం గానీ మా భాష వాళ్లకర్థమవుతోందో లేదో తెలియడం లేదు. కన్నడ కలిసిన వింతైన యాసలో వాళ్లు మాట్లాడే మాటలు మాకర్థం కావట్లేదు. అయినా మా ప్రయత్నం మేము చేస్తున్నాం.
“నమస్తే మేడమ్!” అనుకోని పిలుపుతో తలతిప్పి చూశాను. యిరవయ్యేడూ ముప్పయ్యేళ్లుండొచ్చు ఆ అమ్మాయికి. రెండు చేతులూ జోడించి, నవ్వుతూ నిలబడివుంది.
“నమస్తే. మీరు…?” ప్రశ్నార్ధకంగా చూశాను.
“నేను మీ స్టూడెంట్ను మేడమ్.” యే సంవత్సరమో చెప్పింది.
ముందుదఫా నేనిక్కడ పన్జేసినప్పటి స్టూడెంట్. ముఖం చూస్తే గుర్తు రాలేదు యేడేళ్లయిపోయింది కదా, రూపురేఖలు మారిపోయుంటాయి. పేరడుగుదామంటే యేమనుకుంటుందో అని మొహమాటం అడ్డొచ్చింది.
“యేం చేస్తున్నావమ్మా యిప్పుడు?” పాత విద్యార్థులెవరు కనబడినా అడిగే వొకేవొక్క చద్దిప్రశ్న అడిగాను.
“యేం చేస్తాది, మీ పున్నెమా అని బోకులు తోముకుంట కొంపకాడ పడుండాది.” లోపల నుంచి ఓ పెద్దావిడ అరుచుకుంటూ బయటికొచ్చి వొక్కసారిగా షాకిచ్చింది.
“మా నువ్ గమ్మునుండు.” ఆ అమ్మాయి వారిస్తోంది.
“నేను గమ్మనుండేదేంది మే. నన్నీపొద్దు ఆపాకు తిరుపాలమ్మా, యీల్లను జాడించి పారెయ్యాల.!”
‘తిరుపాలమ్మ…!’ ఆ పేరు వినగానే నా మనసు పొరల్లో ఒక్కసారిగా అలజడి. మరిచిపోయే పేరా అది!? ఆ పేరంత బాగా గుర్తుండిపోవటానికి రెండు కారణాలు. శ్వేత, మేఘన, మౌనిక వంటి ఆధునిక పేర్ల హవాలో పాత వాసనలు కొడుతున్న పేరు అదొక్కటే కావటం వొక కారణమైతే, ఆపేరుకు యెదురుగా అటెండెన్స్ రిజిస్టర్ లో ప్రజెంట్ మార్కు వేసే అవకాశం యెప్పుడూ రాకపోవడం రెండో కారణం. నిజానికి అందువల్లే తన ముఖం నాకు గుర్తులేదు. ఫోన్ చేస్తే ఒకటి రెండు సార్లు ‘యిదుగో వస్తా అదుగో వస్తా’ అన్నది కానీ రాలేదు. ఆపైన ఫోన్ చేసినా యెత్తలేదు, లేదంటే స్విచ్చాఫ్. నాకూ విసుగు పుట్టి వదిలేశాను.
నేను తిరుపాలమ్మను చూసింది వొకే వొక్కసారి. పరీక్షల ముందు ఫీజు కట్టడానికి వచ్చింది కాలేజీకి. హాజరు లేదు కనుక ఫీజు కట్టడానికి వీల్లేదని అడ్డుపడ్డాన్నేను. నాకు తెలియకుండా ఆఫీసులో కట్టించుకుంటారేమోనని వాళ్లకు కూడా గట్టిగా చెప్పాను. కాలేజీకి రానివాళ్ళు పరీక్షలు రాసినా పాసయ్యేదుండదు. పాస్ పర్సంటేజ్ తగ్గితే మళ్ళీ మాదే బాధ్యత. కనుక ఫీజు కట్టించుకోవడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పేశాను. తిరుపాలమ్మ యేడ్చింది, వెంటపడింది, గొడవ పెట్టింది, అయినా నేను కనికరించలేదు. కావాలంటే పరీక్షకు ముందు రోజు యూనివర్సిటీకి వెళ్లి అయిదువేల ఫైనుతో కట్టుకుంటారులే అని కఠినంగా వుండిపోయాను. మొత్తమ్మీద తిరుపాలమ్మను కాలేజీలో ఫీజు కట్టనివ్వకుండా చేసి నా యీగోను గెలిపించుకున్నాను. తిరుపాలమ్మ పరీక్షలు రాయలేదు. ఆ తర్వాత రెన్నెల్లకే నేను బదిలీపై అనంతపురం వెళ్ళిపోయాను.
మళ్లీ యింతకాలానికి తిరుపాలమ్మతో యిలాంటి పరిస్థితి యెదురవుతుందని అస్సలూహించలేదు. వాళ్ళ అమ్మ ఆవేశపడటంలో అర్థముంది, కానీ అందులో నా తప్పేముంది? హాజరు లేకపోతే పరీక్షలకు అనుమతించరాదని యూనివర్సిటీ నిబంధనలే చెబుతున్నాయి. అయినా అప్పుడు కాకపోతే మళ్లీ అయినా ఫీజు కట్టి పరీక్షలు రాసివుండొచ్చు కదా!
“యే మొగం పెట్టుకొని పిల్లల్ని చేర్పీమని అడుగుతాండరు? ఒక్కో కొంపలో జరుగుబాటు యెట్లుంటాదో మీకేమన్నా యెరికనా?” తిరుపాలమ్మ అడ్డుకుంటున్నా ఆమె తల్లి నిలువునా చీరేస్తోంది.
“పోను చేసి బడికి రాలేదని వగస్తిరి గానీ, యింటి కాడికొచ్చి జూసింటే బిడ్డ యేమి అగసాట్లు పడతాందో తెలిసిండేది. వాల్ల నాయన కాయిలాతో నడమంతరంగ సచ్చిపోతే బిడ్డ బుజాల మీద మోసింది యీ యింటిని. ఆడకూతురైనా వొంటిగా తండ్లాడి సేద్యం చేసింది. అదింత సదువుగిన అయిపోతే యేదో వొక నౌకరీ తెచ్చుకుంటాది, బిడ్డకి యిక్కట్లు తీరిపోతాయనుకుంటిమి. మీ దూందగిలిపోను, పరీచ్చలే రాయనీకపోతిరి కచ్చగట్టి.” నిన్నామొన్నా జరిగినట్టు ఆక్రోశిస్తోందామె.
తిరుపాలమ్మ పరీక్షలు రాయకపోవడానికి నేనే కారణమని తెలిసినట్టు మాట్లాడుతోందీమె. నన్నెప్పుడూ చూడనేలేదు. అందర్నీ కలిపి తిడుతోందా, లేక నన్నే తిడుతోందా? ఆవిడ యెలా అన్నా నాకే తగులుతున్నాయి, అసలు ముద్దాయిని నేనే కదా! కింద నేల చీలిపోయి వొక్కసారిగా నేనందులో కూరుకుపోతే బాగుండుననిపించింది. యేమి మాట్లాడాలో తెలియడం లేదు, ముఖంలో నెత్తుటి చుక్క లేదు నాకు.
ప్రసన్న చిన్నగా సైగ చేసి చెయ్యి పట్టుకుని లాక్కెళ్లిపోయింది నన్ను. తిరుపాలమ్మ తల్లి వెనకనుంచి శాపనార్థాలు పెడుతూనేవుంది. రోడ్డు మీదకొచ్చి బస్సు కోసం వారగా నిలబడ్డాం. ముఖమంతా కందగడ్డలా అయిపోయింది అవమానభారంతో. తిరుపాలమ్మ గసపెట్టుకుంటూ వచ్చి నా చేతులు పట్టుకుంది.
“సారీ మేడమ్, మాయమ్మ మాటలను పట్టించుకోవాకండి. ఆమె మాటలకు నేను మన్నింపడుగుతాండ” అన్నది కళ్ళనిండా నీళ్లతో.
మళ్ళీ మరో వూహించని పరిణామంతో యిప్పుడూ యేమనాలో అర్థంకాని స్థితి నాకు.
మెల్లగా గొంతు పెగుల్చుకొని అన్నాను.
“అదిసరే గానీ, అప్పుడంటే ఫీజు కట్టనివ్వలేదు. ఆపై యేడాది నువ్వు ఫీజు కట్టుండచ్చు కదా, మళ్ళీ పరీక్షలు ఎందుకు రాయలేదు?” ఇప్పుడు కూడా బాధ్యత తిరుపాలమ్మదే అన్నట్టు అన్నాన్నేను.
“డిగ్రీ సెకండియర్ వరకు నాకు అన్నీ మంచి మార్కులే వచ్చినాయి మేడమ్. సెకండియర్ యెండాకాలం సెలవుల్లో మా నాయన సచ్చిపోయినాడు. చెల్లెలు, తమ్ముడు చిన్న పిల్లలు. అమ్మకు సుస్తీ చేసింది. మా మామోల్లను పట్టుకొని నేనే చేన్లోకి దిగితి. ఆ పన్లతో కాలేజీకి రాలేకపొయినా. అయినా పుస్తకాలు నోట్సులు యిప్పిచ్చుకొని యింటికాడే సదువుకుంటాంటి. మూడో సమత్సరమొకటి అయిపోతే టీచర్ ట్రైనింగుకు పోదామనుకుంటి. ఆ సమత్సరం ఫీజు కట్టనీక వృథా అయిపాయె. యూనివర్సిటీకి పోయి ఫీజు ఫైనుతో కట్టేకి దుడ్లు ల్యాకపోయె. మళ్ళీ యేడాది రాస్తాంలే అనుకుంటే మా మామ పెళ్లి సమ్మందం తెచ్చె. మంచి సంబంధమని మాయమ్మ కూడా బరువు దించుకోవాలని పెండ్లి జేసె. పరీక్షలకు కూచ్చుంటానని యెంత మొత్తుకున్నా వాళ్ళు కట్టుకోనీకపాయిరి.” బాధతో ఆగింది తిరుపాలమ్మ.
“మరి నీ భర్త…?” ఆత్రంగా అడిగాను.
“అదేదో మంచి సమ్మందమని పెండ్లి జేసిరిగానీ, వాల్లూ సేద్యం జేసి సెడిపోయినోల్లే మేడమ్. పెండ్లయిన రెండేండ్లకే అప్పులెక్కువైనాయని మా ఆయన వురేసుకొని సచ్చిపోయినాడు. తిరిగితిరిగి మల్ల పుట్నింటికే జేరితి. మాయమ్మకు అదే సింత. ఆ దిగులుతోనే అట్లా మాట్లాడినాది. మీరేం మనసులో పెట్టుకోవాకండి మేడమ్.” తిరుపాలమ్మ యాంత్రికంగా మాట్లాడుతోంది.
నేను నోరు తెరవబోయేంతలో మళ్ళీ అందుకుంది.
“అయినా మేడమ్, రూల్సు మంచల కోసమే గానీ, రూల్సు కోసం మనుసులు కాదు గదా, మన కాలేజీ బాగుంటాదని, మా తమ్ముణ్ని చేర్పించాలని నేనంటే మాయమ్మ యినుకోల్యా. అయిన కాడిగ్గానీలే, అప్పుడప్పుడు పన్లకన్నా సాయపడతాడు గదాని, హాజరు లేకపోయినా యేమనరని ప్రవేటు కాలేజీలోకేసింది. ప్రభుత్వమిచ్చే స్కాలర్షిప్ కంటే పన్జేస్తే వచ్చే డబ్బులే యెక్కువ. అందుకని పన్లకు పోయేవాడు. యిప్పుడు యెవరికి నస్టమొచ్చె? మన కాలేజీలో పిల్లోల్లు తగ్గిపాయిరి, పిల్లోల్లకు మంచి సదువూ అబ్బకపాయె. రెండందాల నస్టమే గదా.” తిరుపాలమ్మ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు.
“మేడమ్ బస్సొస్తోంది పదండి.” ప్రసన్న హెచ్చరికతో యీ లోకంలోకి వచ్చాను.
“సారీ తిరుపాలమ్మా, నావల్ల నీకు తీరని అన్యాయం జరిగిపోయింది.” అనాలనుకున్నాగానీ, నాటకీయంగా వుంటుందని బహుశా గుండె గుర్తించి గొంతులోనే ఆపేసింది. లోగొంతుక నుండి యేవో మాటలు బయటికొచ్చాయి గానీ బస్సు హారన్ శబ్దంలో నాకే వినిపించలేదు. కళ్ళలో చెమ్మ కనబడకుండా బస్సెక్కేశాను. ప్రసన్నతో కలిసి వెనకాలున్న సీట్లలో కూర్చున్నాక బయటకు చూశాను, బస్సు కదిలుతుండగా చెయ్యూపుతూ మసకగా తిరుపాలమ్మ రూపం.
అప్పటిదాకా అర్థమయ్యీకానట్టుగా చూస్తున్న ప్రసన్నతో తిరుపాలమ్మ గురించి మొత్తం చెప్పి, కాస్త బరువు దించుకున్నాను.
“ఆవిడ జనరల్ గా అందరినీ కలిపి అంటోందనుకున్నా. అంటే మీరు డైరెక్ట్ గా యిన్వాల్వ్ అయి వున్నారన్నమాట.” అంతా విన్న ప్రసన్న స్పందన.
“నేను చేసింది తప్పా, నువ్వు చెప్పు ప్రసన్నా? ఆ అమ్మాయిని కాలేజీకి రప్పించాలని ప్రయత్నించాను. రాకపోయేసరికి ఒకసారి పరీక్షకి కూర్చోబెట్టకపోతే మిగతా వాళ్ళన్నా తెలివి తెచ్చుకుంటారని అలా చేశాను. తిరుపాలమ్మ వొకటే కాదు యింకా కొద్ది మందిని కూడా అలాగే ఆపేశాము. యీ యిర్రెగ్యులర్ స్టూడెంట్స్ పరీక్షలు రాసినా పాసయ్యేది లేదు, రిజల్ట్ తగ్గిపోతే మళ్ళీ మనకే కదా పనిష్మెంట్.” సమర్ధించుకుంటూ అన్నాను.
“మీరు చేసిందాంట్లో తప్పేమీ లేదు మేడమ్, వీళ్ళంతే… వో వైపు ప్రభుత్వమిచ్చే స్కాలర్షిప్పులు కావాలి, కాలేజీకి మటుకు రారు, రాకపోయినా యేమీ అనగూడదు.”
“కానీ తిరుపాలమ్మను చూశాక మనం కొంత ఫ్లెక్సిబుల్ గా వుండాలేమో అనిపిస్తోంది. మన దగ్గరకు వచ్చే పిల్లలే పేద పిల్లలు, అణగారిన కుటుంబాల పిల్లలు. వాళ్ల పరిస్థితిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నమేమో. యూనివర్సిటీ రూల్సెట్లున్నా, ప్రభుత్వాలేం చెప్పినా ప్రత్యక్షంగా కనపడేది మనమే కాబట్టి మనల్నేగా అంటారు. మనకు పనిష్మెంట్ మహా అయితే ట్రాన్స్ఫరే కదా, వుద్యోగాలేం పోవుగదా! వాళ్లు జీవితాలే కోల్పోతున్నారు.” నా గొంతులో నాకు తెలియకుండానే పశ్చాత్తాపం.
“అంటే కాలేజీకి రాకపోయినా, చదవకపోయినా మనమేమీ అనగూడదా?” ప్రసన్న గొంతులో అసహనం.
“అలా అని నేననలేదే. వాళ్ళ పరిస్థితులు సహానుభూతితో అర్థం చేసుకోవాలంటున్నాను. కాస్త ఆలోచించి చూస్తే, వాళ్లకు మాత్రం కాలేజీకి రావాలని వుండదా? కాలేజీ అంటే చదువొక్కటేనా? కాలేజీకి రాకపోవడం ద్వారా వాళ్ళు యెన్ని సరదాలు మిస్సవుతున్నారో కదా. చిన్న వయసులో వొక్కొక్కళ్ళు యెన్నెన్ని బరువులు మోస్తున్నారో! క్యాటరింగ్ పనుల్లో, సినిమా హాళ్లల్లో టికెట్ కౌంటర్లలో, పెయింట్ పనుల్లో యెంతమందిని చూశానో. యిక బెంగళూరుకి, బళ్లారికి పనుల కోసం వెళ్ళేవాళ్ళు. పరిస్థితులు బాగుంటే వాళ్ళందరూ పనులు వదిలిపెట్టి కాలేజీలో హ్యాపీగా చదువుకుంటూ, యెంజాయ్ చేసేవాళ్లు కదా. యిదంతా ఎందుకు, మనం చెప్పుకుంటన్న ఎమినిటీస్ అన్నీవున్నా మన స్ట్రెంగ్త్ యెందుకు తగ్గిపోయింది? అవేవీ లేని ప్రైవేటు కాలేజీల వాళ్ళు అటెండెన్స్ గురించి వొత్తిడి వుండదని హామీయిచ్చి కాదూ పిల్లల్ని రాబట్టుకుంటున్నారు. మనమలాంటి హామీలివ్వలేము. వాళ్ళ సంపాదన కుటుంబాలకు అవసరం కనుక చదువును పక్కన పెట్టేస్తున్నారు. యిందులో పిల్లలు జీవితాలను కోల్పోతుంటే, మనం మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తిప్పలు పడుతున్నాం. అన్నీ బాగుంటే యిలా మనం వూళ్లు తిరిగి క్యాంపెయిన్ చేసే అగత్యం వుండేది కాదు కదా.”
నేనాపకుండానే ప్రసన్న అందుకుంది, “అయితే మరేం చేద్దాం, మనం కూడా ప్రైవేట్ కాలేజీలకు మల్లే మీరు కాలేజీకి రాకపోయినా ఫర్వాలేదని చెప్పేద్దామా?” వ్యంగ్యంగా అన్నది.
“అదుగో మళ్ళీ… కాస్త వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని పట్టూవిడుపూ వుండాలంటున్నా. వాళ్ళ సమస్యల నుంచి ఎలా బయటపడాలో నచ్చజెప్పాల్సింది మనమే కదా. కాస్త పనుల కాలంలో రాలేకపోయినా మిగతా రోజుల్లో రమ్మని, చదువుకుంటే మంచి భవిష్యత్తు వుంటుందని భరోసా యివ్వాలి, వాళ్ళకో దారి చూపించాలి కదా. మనం ఆవైపు నుంచి ఆలోచించద్దా?”
“మీరేమన్న చెప్పండి మేడమ్ ప్రభుత్వాలు అన్నీ సమకూర్చిపెట్టినా వీళ్ళకు బాగుపడటం రాదు. సర్లెండి నా స్టాప్ వచ్చేసింది, వుంటాను.” అంటూ లేచింది ప్రసన్న.
ఆ తర్వాత నా స్టాప్ కూడా వచ్చేసింది. కానీ తిరుపాలమ్మను గురించిన ఆలోచనలు మాత్రం స్టాప్ కాలేదు. రాత్రంతా కలత నిద్ర. ఈగో, పశ్చాత్తాపం అన్నీ కలగాపులగంగా బుర్రను తొలిచేస్తున్నాయి. తిరుపాలమ్మ నన్ను నిలబెట్టి మరీ నిలదీస్తున్నట్టు కలలు.
ఆరోజే కాదు, అప్పట్నుంచి తిరుపాలమ్మ అప్పుడప్పుడు కలవరపెడుతూనేవుంది. వూళ్ళు మారినా, యేళ్ళు గడిచినా, చదువుకొని బాగుపడ్డ వాళ్ళని వుదాహరణలుగా చూపించినా, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని బ్రెయిన్ వాష్ చేసినా, కెరీర్ గైడెన్స్ క్లాసులు పెట్టినా, తిరుపాలమ్మలు మాత్రం కనబడుతూనే వున్నారు, వేర్వేరు రూపాల్లో… అలివేలమ్మ, ముత్యాలమ్మ, మద్దిలేటి, దస్తగిరి, భూక్యా నాయక్, అల్లా బకష్… పేర్లు వేర్వేరు. అందరూ తల్లి వొడి నుంచి జారిపోయిన పసిపిల్లల్లా కాలేజీ నుంచి తప్పిపోయిన వాళ్లే. అర్థం కానిదేమంటే కాలేజీకి దూరమై వాళ్లు జీవితాలను కోల్పోతున్నారా? లేక పిల్లల్ని పోగొట్టుకుని తరగతి గదులు ఖాళీవుతున్నాయా?
*
ఇంటర్నల్ పరీక్షలు మొదలయ్యాయి. రాత్రి సరిగ్గా నిద్రలేకపోవడం చేత కళ్ళు మూతలు పడుతున్నాయి. బలవంతంగా నిద్రనాపుకునే ప్రయత్నం చేస్తున్నాను. పాఠాలు చెప్పే స్థాయి నుంచి అడ్మినిస్ట్రేటివ్ పోస్టుకు మారడం వల్ల చురుకుదనం తగ్గిపోయింది.
“కాలేజీకి రాకుండా పరీక్షలు రాస్తానంటే కుదరదు. కావాలంటే పొయ్యి, ప్రిన్సిపాల్ మేడమ్ తో మాట్లాడుకోపో.”
బయట అలికిడితో మగత వదిలించుకొని లేచి బయటికెళ్ళి చూశాను. తెలుగు లెక్చరర్ రమ యెవరో అమ్మాయి మీద అరుస్తోంది.
“మేడమ్… మేడమ్… ప్లీజ్ మేడమ్! యిప్పట్నుంచీ వస్తా మేడమ్” ఆ అమ్మాయి బతిమాలుతోంది.
“యేంటి విషయం?” అర్థమవుతున్నా అడిగాను.
“చూడండి మేడమ్, సెమిస్టర్ మొత్తం వొక్కరోజు కూడా కాలేజీకి రాలేదు. యిప్పుడొచ్చి మిడ్ పరీక్ష రాస్తానంటోంది.” రమ ఆరోపణ.
“నీ పేరేంటి?” అడిగానా అమ్మాయిని.
“జమునాబాయి మేడమ్.” అంది వినయంగా చేతులుకట్టుకొని.
“కాలేజీకేందుకు రాలేదు?”
“మాయమ్మకు ఆరోగ్గెం బాలేదు మేడమ్. యింటికాడ యెవురూ లేరు, నేనే చూసుకోవల్ల.” మెల్లగా అన్నది. నా ముందు మరో తిరుపాలమ్మ.
“కాలేజీకి రాకుండా పరీక్షలెట్ల రాస్తావు?” సమాధానం లేదు.
“నిన్నే అడిగేది, చెప్పు.”
“నేర్చుకున్నా మేడమ్.” తలదించుకొని గొణిగినట్లుగా అంది.
“యేం నేర్చుకున్నావు, మా దుంప తెంచేకే వస్తారు మీరంతా.” రమ మాటల్లో అసహనం.
యేం మాట్లాడకుండా లోపలికెళ్ళి నా సీట్లో కూర్చుని, రమను లోపలికి పిలిచి యేం చేద్దామని అడిగాను.
“చేసేదేముంది మేడమ్. మిడ్ పరీక్షలంటే యేవో రెండు ప్రశ్నలకు జవాబులు బట్టీకొట్టుకొచ్చి రాసేస్తారు. సెమిస్టరు పరీక్షల్లో వీళ్ళు పాసయ్యేది లేదు, పెట్టేది లేదు.” రమ తగ్గలేదు.
“సెమిస్టర్ పరీక్షలు వాళ్ళ ఖర్మ, యిప్పుడు ఇంటర్నల్ పరీక్షలు రాయనిస్తే పోలా. పాస్ మార్కులేసి దాటించేయండి.”
“అట్లా అందరినీ పాస్ చేస్తే లెక్చరర్లంటే భయమెట్లుంటాది మేడమ్?” రమకు నా మాటలు నచ్చలేదు.
“మినిమమ్ మార్కులేసి పాస్ చేయండి చాలు. మళ్ళా యేడాది వీళ్ళు ఇంటర్నల్ మార్కుల కోసం కాలేజీ చుట్టూ తిరగడం, మనం యేవో మార్కులు చచ్చినట్టు వేసి పంపించడం అవసరమా? అదేదో యిప్పుడే వేసేస్తే వో పనయిపోతుంది కదా. ఫైనల్ పరీక్షల్లో చదువుకుంటే పాసవుతారు లేదంటే లేదు.” రెండో వైపు నుంచి నరుక్కొచ్చాను నేను.
“మీరు చెప్తే సరే మేడమ్.” అసంతృప్తిగానే అన్నది.
మరో తిరుపాలమ్మ తయారుకాకుండా నా ప్రయత్నం నేను చేయగలిగాను.
Featured image: pc: https://scoonews.com/
27-12-2024
ఒక మంచి కథని,రచయిత్రినీ పరిచయం చేశారు సర్!
ధన్యవాదాలు!
ధన్యవాదాలు సార్!
ధన్యవాదాలు సర్.
పరిస్థితుల కారణంగా చదువు చట్టుబండలౌతున్న పేద విద్యార్థుల వెత ఇది. కథ కాదు. జీవిత చిత్రణ. చిత్రించిన ప్రగతి గారికి, పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు.
ధన్యవాదాలు సార్!
థ్యాంక్యూ సర్
ఇది కథ కాదు, sir. వాస్తవం. ఇలా వాస్తవాన్ని గుర్తించి చక్కటి కథ గా మలిచిన ప్రగతి గారికి అభినందనలు. పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. మన విద్యా వ్యవస్థను పరిశీలిస్తే ఇలాటి చేదు వాస్తవాలు కోకొల్లలు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ చదువుల వరకు..ఎక్కడ చూసినా పుట్టలు, పుట్టలు సమస్యలు. ప్రభుత్వ బడులలో హాజరు సమస్య అయితే ప్రైవేటు బడులలో ఫీజు ల సమస్య. ఉపాధ్యాయుల కష్టాలు ఒక లా ఉంటే, తల్లిదండ్రుల యాతనలు మరో లా..ఎన్ని ..అర కొర వసతుల పాఠ శాలలు, చాలీ చాలని జీతాల తో పని చేసే ఉపాధ్యాయులు ప్రైవేటు లో..అన్నీ ఉన్నా విద్యార్థులే లేని బడులు మరో పక్క.. వీటన్నిటి నీ పరిశీలిస్తే ఎన్ని కథలు వస్తాయి! కానీ, సమాజానికి వెన్నెముక లాంటి బడి గురించిన కథలు రాయటానికి మనకి ఇష్టం, తీరుబాటు రెండూ లేవు. కులాలు, మతాలు, లవ్ లు, బ్రేక్ అప్ లు, అత్తాకోడళ్ళు, అక్రమ సంబంధాలు..ఇవే మన కథా వస్తువులు. ఏదేమైనా పొద్దున్నే మంచి కథ నీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు sir.
అవును మేడమ్! సరిగా నిదానించారు. మీకు నా ధన్యవాదాలు.
ధన్యవాదాలు మేడమ్.
నమస్తే మేడమ్.మంచి కథ . ఇది మీ అనుభవం అనుకుంటాను.ఇలాంటి కథలు మనిషి ఆలోచనా విధానాన్ని మార్చి, అవతలి వ్యక్తి కోణం లో ఆలోచించటానికి సహకరిస్తాయి.అంచేత మీరు మీరు ఇలాంటి కథలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నా! More power to your pen.
ఇది మేం నిత్యం ఎదుర్కొనే కథే. గొప్పగా మలచారు. థాంక్స్ ఫర్ షేరింగ్ సర్.
మేడం గారికి అభినందనలు.
ధన్యవాదాలు సార్! మీ వంటి వారికి తప్పకుండా నచ్చే కథ!
ధన్యవాదాలు సర్
నేను రాయలేని కథ రాసిన ఎం. ప్రగతి గారికి ముందుగా అభినందనలు. ఒక విషయం ఇక్కడ చెప్పాలనిపిస్తుంది. నేను రాస్పల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టరుగా వెళ్లిన కొద్ది రోజులకే సర్పంచ్ వచ్చి ఆ స్కూల్ హైస్కూల్ చెయ్యాలన్నారు.అది నలభై ఏళ్లనుండి ప్రైమరీ , అప్పర్ ప్రైమరీ దశలోనే ఉన్నాడు. చుట్టుపక్కల పది పదిహేను కిలోమీటర్ల పరిధిలో హైస్కూల్ లేదు. నేను వెంటనే రంగంలోకి దిగి ఆ సంవత్సరమే 8 వ తరగతికి పర్మిషన్ తీసుకున్నాను.మరుసటేడు చుట్టుపక్కల నాలుగైదు ఊళ్లనుండి పిల్లలు చేరారు . నేనున్న మూడేళ్లలో పదవతరగతి వరకు చేసి హైస్కూల్ బోర్డు పెట్టించాను. అయితే కథలో తిరుపాలమ్మ లాగా ఆరుకిలోమీటర్ల దూరం నుండి వనజ అనే అమ్మాయి వారానికొకసారి మాత్రమే వచ్చేది. కాన రెగ్యులర్ విద్యార్థులకంటే బాగా చదివేది. ఆమె ఇర్రెగ్యులర్ అని క్లాస్టీచర్ కారాలు మిరియాలు నూరితే నేనన్నాను . ఆ అమ్మాయిని ఏమన వద్దని హెచ్చరించాను. చదువు ముఖ్యం కానీ అటెండెన్స్ కాదు అని చెప్పాను. అలాగే ఇంకో ఇద్దరు పేద విద్యార్థులు వ్యవసాయపు పనుల్లో తల్లిదండ్రులకు
తప్పనిసరి పని చేయవలసి ఉండేది . వారిని కూడా అలాగే కన్సిడర్ చేసాను. ఎందుకంటే నేను వాళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్ల పరిస్థితులు స్వయంగా చూసాను కనుక. ఒక్కటే చెప్పాను. తల్లిదండ్రులు వచ్చి పిల్లలను నాలుగు రోజులు వదలి వేయండని అడిగితే చాలని టీచర్లకు చెప్పాను. ఇంకా కూడా కొన్ని అనుభవాలు గుర్తుకు వస్తున్నాయి. కానీ ోిది చాలు. మంచి కథను ప్రమోట్ చేసిన మీకు ధన్యవాదాలు.
అవును సార్! మీ వంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తప్పకుండా హర్షించే కథ ఇది!
ధన్యవాదాలు సర్
ఇలాటి సమస్యలు మరొక రెండున్నాయి, అర్థం పర్థం లేనివి. విద్యార్థుల భవిష్యత్తు, ఆడపిల్లల గౌరవానికి సంబంధించినవి. ఏడాదంతా కష్టపడి చదివి, పరీక్షకు ఉన్న వూళ్ళో మరొక స్కూల్ కో, పక్క ఊళ్ళో ఇంకొక స్కూల్ కో, ఎంత ముందుగా బయలుదేరినా, బస్సులు దొరక్కో, ట్రాఫిక్ లో చిక్కుకుపోయో రెండు మూడు నిమిషాలు ఆలస్యంగా సెంటర్ కి వెళ్తే రానియ్యకపోవటం. సంవత్సరం వృధా అయిందని ఆ పిల్లలు రోదించటం. రెండో, ఐదో నిమిషాలు ఆలస్యంగా వెళ్తే ఏం కొంపలు మునిగిపోతాయని అడ్డుకోవటం? అసలు స్టూడెంట్స్ పరీక్ష సెంటర్లు ఎందుకు మార్చటం? స్టూడెంట్స్ ని, స్కూల్ ని మార్చే బదులు ఇక్కడి టీచర్లను వేరే సెంటర్లకు ఇన్విజిలేటర్లుగా పంపవచ్చుకదా.
రెండవది, పరీక్ష సెంటర్ల వద్ద తనిఖీలు. ఆడపిల్లలని కూడా చూడకుండా దుస్తులు విప్పించిన సంఘటనలు జరిగేయి. ఇది వారి అభిమానానికి, గౌరవానికి సంబంధించిన విషయం కాదా? వాళ్లేమైనా టెర్రరిస్టులా? వాళ్ళు పరీక్ష హాల్లో కాపీలు కొడితే ఇన్విజిలేటర్లు పట్టుకోవచ్చుకదా. లేకపోతే అసలు ఇన్విజిలేటర్లు ఎందుకు?
ప్రభుత్వాల, పోలీసుల అతి వేషాలు కదూ ఇవి?
అవును సార్ ! ఇటువంటి ఆలోచనలన్నీ రేకెత్తిస్తుంది ఈ కథ.
ధన్యవాదాలు సర్
మాకూ రోజూ ఇదే సందిగ్ధం, ఎవరినన్నా ఆంక్ష పెడదామంటే మనస్కరించదు, internals, main exams, hostel facilities, attendance, bus passes అన్ని సౌకర్యాలూ కల్పించినా, పిల్లలు groups exams prepare అవుతామని college ఎగ్గొడుతున్నారు. ఈ పరిస్థితులను అరికడదామంటే కొందరు నిజంగా jobs అవసరం ఉన్న వాళ్ళ మీద వేటు పడుతుంది. కత్తిమీద సాము లెక్చరర్ ఉద్యోగం. ఎక్కడో తగులుతారు నిజానికి నిజాయితీపరులు. అందరూ ఇస్తున్న సౌకర్యాలను దుర్వినియోగం చేసేవారే. తిరుపాలమ్మలు చాలా కొద్ది మందే.
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ధన్యవాదాలండి!
మీకు చాలా ధన్యవాదాలు సర్.
ఎం. ప్రగతి గారి ఈ కథ పత్రికలో నేనూ చదివాను.చదివినపుడు అనుకున్నాను బీద పిల్లలకు స్కూలు కు రాలేక పోయినపుడు ఫ్లెక్సీబిలిటీ ని పాటించి అవకాశమివ్వాలని .
ఇలాంటి వాస్తవ కథలు కథా సంకలనాల్లో ఉండవు మీరన్నట్టు ఎపుడు ఆ 10 /20 కథకుల పేర్లే టు కథలు … ?! ఏమీ సంకలనాలో.మీరన్నది నిజమే సర్ భద్రుసు గారు .
మేడం! మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు!